– ఆయుష్ నడింపల్లి
ఈ సెప్టెంబర్ 17న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తనయుడు, ఐటీ మంత్రి కేటీఆర్ ఒక ట్వీట్ చేశారు. అందులో సెప్టెంబర్ 11, 1948న ఆర్‌ఎస్‌ఎస్ నాటి సర్ సంఘచాలక్ ఎంఎస్ గోళ్వాల్కర్‌జీకి సర్దార్ పటేల్ రాసిన లేఖను ఉటంకించారు.
‘‘ఆర్‌ఎస్‌ఎస్ ప్రసంగాలన్నీ మతపరమైన విషంతో నిండి ఉన్నాయి.
ఆ విషం ఫలితంగా గాంధీజీ హత్యతో దేశం అతిపెద్ద మూల్యం చెల్లించుకోవలసి వచ్చింది.’’ అని పేర్కొన్నారు.
అయితే, అదే లేఖలోని సారాంశం ఇది- ‘హిందూ సమాజానికి ఆర్‌ఎస్‌ఎస్ ఎంతో సేవ చేసిందనడంలో ఎటువంటి సందేహం లేదు. సహాయం, నిర్మాణాత్మక సహకారం అవసరమైన అన్ని చోట్లా యువకులు, మహిళలను, పిల్లలను స్వయంసేవకులు సంరక్షించారు. వారికి ఎంతో సహాయంగా నిలిచారు. ఈ విషయాన్ని అర్థంచేసుకునే సామర్థ్యం ఉన్న ఏ వ్యక్తికీ దానిపట్ల ఎటువంటి అభ్యంతరం ఉండదు. వేరేగా లేక వ్యతిరేకంగా కాక, ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరి వారి దేశభక్తి కార్యక్రమాలు కొనసాగించాలని నేను పూర్తిగా నమ్ముతున్నాను.’ అని పటేల్ అన్నారు. కానీ కేటీఆర్ దాని మూలం చెప్పకుండా, పై విధంగా ట్వీట్ చేసారు.
అప్పటి హోంమంత్రి సర్దార్ పటేల్, ఆర్‌ఎస్‌ఎస్ సర్ సంఘచాలక్ ఎంఎస్ గోళ్వాల్కర్‌జీకి మధ్య జరిగిన సంభాషణ ‘జస్టిస్ ఆన్ ట్రయల్’ అనే పుస్తకంలో ఉంది.
ఎంతో గౌరవ ప్రదమైన పదవిలో ఉండి, సమాచార మంత్రి కూడా అయిన కేటీఆర్.. పటేల్ చెప్పిన విషయాలను వక్రీకరించారు. ఇది ఆయన హోదాకు ఎంత మేరకు సబబు? ఇది సర్దార్ పటేల్ పట్ల అన్యాయం కాదా?
అదే లేఖలో, సర్దార్ పటేల్ ఇంకా ఈ విధంగా రాసారు.
నెహ్రూకి రాసిన లేఖలోనూ..
సర్దార్ పటేల్ ఫిబ్రవరి 27, 1948న ‘బాపూజీ హత్యకి కారణం, ఆర్‌ఎస్‌ఎస్ కుట్ర ఫలితం కాదు’ అని నెహ్రూకి రాశారు.
నాడు స్వయంగా సర్దార్ పటేల్ తన ప్రసంగంలో, ముస్లింలతో ఏమన్నారో కూడా ఇక్కడ గుర్తు చేసుకోవాలి.
జనవరి 3, 1948న, కలకత్తాలో 5 లక్షల మంది ప్రజల ముందు దేశ పునర్నిర్మాణం గురించి పటేల్ మాట్లాడారు. పాకిస్తాన్ ఏర్పాటుకి మద్దతిచ్చిన ముస్లింలు, భారతదేశం పట్ల తమ పూర్తి విశ్వాసం చూపించాలని ఆయన ఉద్బోధించారు.
‘ఒక విషయంలో ఎలాంటి సందేహం లేదు. చాలామంది భారతీయ ముస్లింలు, పాకిస్తాన్ ఏర్పాటుకి సహాయపడ్డారు. వారంతా రాత్రికి రాత్రే మారిపోయారని ఎలా నమ్మగలం? తాము విధేయత కలిగిన పౌరులమని, కాబట్టి వారిని ఎందుకు అనుమానించాలి అని ముస్లింలు అంటున్నారు. వాళ్లతో నేను ఇలా అంటాను ‘ఆ మాట మమ్మల్ని అడగడం ఎందుకు?
మీ అంతరాత్మలలో తరచి చూడండి!’’ అని అన్నారు.
భారతదేశంలో ఉండిపోయిన ముస్లింలు, దేశం పట్ల పూర్తి విశ్వాసం, విధేయత చూపించాలని ఆయన తన భావాన్ని సూటిగా వ్యక్తపరిచారు. నవంబర్ 13, 1947లో రాజ్‌కోట్ ప్రజలను ఉద్దేశించి ఆయన చేసిన ప్రసంగం కూడా ఎంతో స్పష్టంగా, సూటిగా సాగింది.
అదొక్కటే కాదు, దేశ విభజన జరిగిన ఆ భయంకర సమయంలో తూర్పు, పశ్చిమ పాకిస్తాన్‌లో హిందువులు పెద్దఎత్తున హృదయ విదారకమైన అత్యాచారాలకు, హింసకు, హత్యలకు గురైనపుడు, వాళ్లను పట్టించుకున్నది, కాపాడినది ఆర్‌ఎస్‌ఎస్. అంతేకాదు, ఆ కాలంలో ఆర్‌ఎస్‌ఎస్ అందించిన సహకారం, చేసిన త్యాగాల గురించి ఎంతోమంది సహృదయులు మాట్లాడారు కూడా..
భారతరత్న డాక్టర్ భగవాన్‌దాస్, అక్టోబర్ 1, 1948న కింది విధంగా పేర్కొన్నారు.
‘‘సాయుధ దళాలతో దాడులు చేసి, భారత ప్రభుత్వ మంత్రులు, అధికారులను హత్య చేసి, ఎర్రకోటమీద పాకిస్తాన్ జెండా ఎగురవేసి భారత్‌లో లీగ్ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలనే ముస్లిం లీగ్ కుట్ర గురించి ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు చాలా ముందుగానే నెహ్రూకి, సర్దార్ పటేల్‌కి తెలియపరిచారని నాకు కచ్చితంగా తెలుసు. నిజాయితీ గల దేశభక్తులైన ఆర్‌ఎస్‌ఎస్ యువకులు, నెహ్రు, పటేల్‌లకు ముందుగానే ఆ సంగతి తెలియజేయకపోతే, ఈ రోజు దేశమంతా పాకిస్తాన్ అయి ఉండేది, లక్షలాది హిందువులు హత్యకు గురయ్యేవారు. లేదా బలవంతంగా మతమార్పిళ్లకు గురయ్యేవారు. భారతదేశం మరొకసారి బానిసత్వంలోనికి వెళ్లేది. ఇది దేనిని సూచిస్తుంది? ఆర్‌ఎస్‌ఎస్ స్వయంసేవకులను అణచివేసే బదులు, లక్షలాదిమంది ఆర్‌ఎస్‌ఎస్ దేశభక్తుల శక్తి సామర్థ్యాలను ప్రభుత్వాలు సద్వినియోగ పరుచుకుంటే దేశం బాగుపడుతుంది’’. అని అన్నారు.
ఈ విషయాలపై స్పందించే ధైర్యం, నిజాయితీ కేటీఆర్‌లో ఉందా? తెరాస, బీజేపీల మధ్య రాజకీయ దుమారాలు చెలరేగుతున్న నేపథ్యంలో కేటీఆర్ కావాలనే ఆర్‌ఎస్‌ఎస్‌ను ఈ వివాదాల్లోకి లాగి విమర్శిస్తున్నారు. మజ్లిస్ పార్టీని సంతోషపెట్టడానికే ఆయన ఆర్‌ఎస్‌ఎస్‌ని దుమ్మెత్తి పోస్తున్నారన్న సంగతి కూడా అందరికీ తెలిసిందే. ఈ చర్య వల్ల మజ్లిస్ (నాడు హిందువులను అనేక రకాల చిత్ర హింసలకు గురిచేసిన రజాకార్ల నాయకుడు కాసీం రజ్వీ స్థాపించిన పార్టీనే ఎంఐఎం) పార్టీతోనే కాక, కాంగ్రెస్‌తో, చివరికి పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ నియాజీతో కూడా తెరాసకి సారూప్యత ఏర్పడింది.
తెలంగాణ, హైదరాబాద్-కర్ణాటక, కర్ణాటక-హైదరాబాద్ ప్రాంతాల ప్రజలు అప్పటి హైదరాబాద్ రాష్ట్రానికి విముక్తి కలిగించి, భారతదేశంలో కలిసేందుకు అపార త్యాగాలు చేశారు. ఆ ప్రాంతం భారత యూనియన్‌లో కలిసిన 1948, 17 సెప్టెంబర్.. చారిత్రక దినాన్ని అధికారికంగా జరుపుకోవాలని ప్రజల ఆకాంక్ష.
గత ఎనిమిది సంవత్సరాలుగా హైదరాబాద్ విమోచన ఉత్సవం జరపనందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నారు కూడా. అధికారంలోకి రాకముందు, వచ్చిన తరువాత ఆయన ఎలా మాట మార్చేసారో అందరికీ తెలిసిందే. హైదరాబాద్ విమోచన దినోత్సవం ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని కేసీఆర్ నాడు కోరారు. కానీ అధికారంలోకి వచ్చాక ‘బీజేపీ వారికి అంతగా కావాలంటే, వారి కార్యాలయాల్లో జరుపుకోవాలి’ అని అన్నారు. ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం అంగరంగ వైభవంగా తెలంగాణ విమోచన దినోత్సవాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లోనే టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆఖరి నిమిషంలో ‘వజ్రోత్సవ సమైక్యత ఉత్సవాలు’ నిర్వహించిన సంగతి తెలిసిందే.
వ్యాసకర్త: దక్షిణమధ్య క్షేత్ర ప్రచార ప్రముఖ్, ఆర్‌ఎస్‌ఎస్