ప్రపంచంలోనే పెద్ద వయసున్న ఆచార్యులు (ప్రొఫెసర్‌). ‌దేశంలోనే ‘డాక్టరేట్‌ ఆఫ్‌ ‌సైన్స్’ (‌నేటి పీహెచ్‌డీతో సమానం) పట్టా అందుకున్న మొదటి మహిళామణి. భౌతిక, రసాయన శాస్త్రాలలో అత్యుత్తమ ప్రతిభ కనబరచినందుకు రాజా విక్రవ్‌దేవ్‌ ‌వర్మ స్మారక స్వర్ణ పతక విజేత. జీవిత సాఫల్యం సహా లెక్కకు మిక్కిలిగా పురస్కారాలు గ్రహీత. సుమారు తొమ్మిదిన్నర పదులు వయసులోనూ అలుపెరుగక విద్యాబోధన. విజయం సాధించిన పురుషుడి వెనుక మహిళ పాత్ర ఉంటుందన్నట్లే, మహిళ విజయం వెనుకా పురుషుడి ప్రమేయం ఉంటుందని విశ్వసించే ఆచార్య చిలుకూరి శాంతమ్మ… తమ జీవితభాగస్వామి, తెలుగు శాఖ పూర్వ ఆచార్యులు దివంగత సుబ్రహ్మణ్యశాస్త్రి ప్రస్తావన లేకుండా మాట ముందుకు సాగనివ్వలేరు. సంతానంలేని ఆ దంపతులకు విద్యార్థులే పిల్లలు. ‘శిష్యాదిచ్ఛేత్‌ ‌పరాజయం’ అనే సూక్తిని అక్షరాల పాటించే శాంతమ్మ. తన దగ్గర విద్యాబుద్ధులు నేర్చిన వ్యక్తి (ఆచార్య జీఎస్‌ఎన్‌ ‌రాజు) ఉపకులపతిగా వ్యవహరిస్తున్న విశ్వవిద్యాలయంలోనే విద్యాబోధన చేస్తున్న నిగర్వి. వయసు శరీరానికే కానీ మనసుకు కాదంటారామె. నిత్యం రానూపోనూ సుమారు 150 కిలోమీటర్లు ప్రయాణిస్తూ పాఠాలు చెబుతున్నారు. వేకువజామున నాలుగు గంటలకు నిద్రలేచి పనులు చక్కపెట్టుకొని, విశాఖ నుంచి విజయనగరంలోని విశ్వవిద్యాలయంలో పాఠాలు చెప్పడానికి వెళతారు.‘శ్వాస ఉన్నంత వరకు చదువు చెప్పాలి. చదువు చెప్పగలిగేంత వరకూ జీవించాలి’ అనే దృఢ సంకల్పంతో, ఊతకర్రల సాయంతో తిరుగుతూ పాఠాలు చెబుతూ అధ్యాపకవర్గానికే స్ఫూర్తి ప్రదాతతో ‘జాగృతి’ మాటామంతీ…

బోధనంటే ప్రాణం

జ్ఞానం పంచే కొద్దీ పెరుగుతుంది. ఒకరి నుంచి మరొకరికి విశ్వవ్యాప్తమవుతుంది. కొత్తకొత్త ఆవిష్కరణలకు అవకాశం కలుగు తుంది. అందుకు ఉద్యోగ విరమణ ఆటంకం కాబోదు, కారాదు. ఆఖరి శ్వాస వరకు చదువు చెప్పాలన్నదే నా సంకల్పం. ఇరవై ఏళ్ల క్రితం రెండు మోకాళ్ల చిప్పలకు శస్త్రచికిత్స జరిగింది. వయసుతో వస్తున్న సమస్యలు నా మనోధైర్యాన్ని, స్థయిర్యాన్ని ఏమీ చేయలేకపోయాయి. అన్నీ అందరికి తెలియాలని లేదు. కానీ తెలుసు కోవాలనే ఆసక్తి ఉండాలి. నేర్చేవారైనా, నేర్పేవారైనా నిత్య విద్యార్థులే. ఉద్యోగం కోసమే చదువు కాదు. ఉద్యోగం అనేది కొంతవరకు బతుకుతెరువు కోసమే అయినా, ఆయా రంగాలకు సేవ చేసే చక్కటి అవకాశమని నా భావన. వృత్తిని గౌరవించాలి. శక్తి మేరకు చిత్త శుద్ధితో నిర్వర్తించేందుకు ప్రయత్నించాలి. పుట్టిన తేదీ ప్రాతిపదికగా, సాంకేతికంగా వృత్తి, ఉద్యోగ విరమణ చేయవలసి వచ్చినా అటు తరువాత, మన ఇష్టమైన వ్యాపకాలను కొనసాగించగలగాలి. ఉద్యోగ విరమణతోనే జీవితం పూర్తయినట్లు కాదు. ఆపైనా సేవలు అందించగలగాలి. కొందరికి ఆ ఉద్దేశం ఉన్నా కారణాంతరాల వల్ల సాధ్యం కాకపోవచ్చు. కానీ అవకాశం ఉన్నవారు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మన అనుభవాలు, జ్ఞానం భావితరానికి ఉపకరించగలగాలి. అందులోనే శాంతి, ఎనలేని సంతృప్తి దాగి ఉంటాయి. పనిలోనే విశ్రాంతి అనే భావన అలవరచుకుంటే ఆరోగ్య సమస్యలు దరిచేరవు. నిరంతరం ఏదో ఒక పనిలో నిమగ్నమయ్యే వారికి నిరాశ అనేది కలగదు. క్ష్యసిద్ధి కోసం ఎక్కడా ఆగకుండా ముందుకు సాగిపోవడమే అసలైన విజయ రహస్యం. ‘అత్యున్నతమైన లక్ష్యాన్ని చేపట్టండి. దాన్ని సాధించేంతవరకు మీ జీవితాన్ని ధారపోయండి’ అన్నారు వివేకానందుడు.

శక్తిసామర్థ్యాల వినియోగంపైనే ఫలితాలు. . .

‘జ్ఞానచక్షువు’ లేదా ‘సహజ జ్ఞానం’ (Intuition), శక్తి సామర్ధ్యాలను భగవంతుడు అందరికీ ఇచ్చాడు. దానిని వినియోగించు కోవడంపై ఫలితాలు ఆధారపడి ఉంటాయి. అందరు వాటిని గ్రహించలేకపోవచ్చు. జ్ఞానచక్షువు అనేది స్వయం విజ్ఞానాత్మక/జ్ఞానదాయకం(సెల్ఫ్ ఎడ్యుకేటివ్‌). ‌దీనినే ‘అంతర్విజ్ఞానం’ అనీ వ్యవహరిస్తారు. దీనికి విద్యతో సంబంధం లేదు. ప్రజ్ఞ, వివేచనాలపైన ఇది ఆధారపడి ఉంది. అంతర్‌ ‌బుద్ధితో నైతిక సూత్రాలను గ్రహించి, ఆచరణలో పెట్టే పక్రియ. డాక్టర్‌ ‌సర్వేపల్లి రాధాకృష్ణ పండితుడు ఈ అంశాన్ని బాగా నమ్మారు. ఈ విధానం ద్వారా పలు అంశాలు అనేకసార్లు అనుభవంలోకి వచ్చినట్లు చెప్పేవారు. చిన్నప్పటి నుంచే నాకూ అలాంటి అనుభవాలు కలిగాయి. దీనిపై అనేక సార్లు ప్రసంగించాను. ఈ అంశంపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాను. చాలా మంది పలానాది కనిపెట్టామంటారు. కానీ అది అప్పటికి ప్రకృతి (నేచర్‌)‌లో ఉంది. అదే ‘విశ్వవేద్‌’. ‌విశ్వంలో ఉన్నదానినే జ్ఞానచ•క్షువుతో కనిపెట్టారు లేదా గమనించారు. ఉదాహరణకు, ‘రెండు మూళ్లు ఆరు’ అనే దానిని ఎవరు కనిపెట్టారు? విశ్వంలో ఉన్నదానినే తెలుసుకున్నాం అంతే.

ఇలా ఎదుగుదల…

కృష్ణాజిల్లా మచిలీపట్నం మా ఊరు. న్యాయవ్యవస్థలో పని చేస్తున్న మా నాన్నగారు వంగల సీతారామయ్య నేను ఐదు నెలల పసికందుగా ఉన్నప్పుడే కాలం చేశారు. మా చిన్నాయన వంగల నరసింహదీక్షితులు (జిల్లా న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసి, ఉమ్మడి ఆంధప్రదేశ్‌ ‌రాస్త్రంలో లేబర్‌ అప్పిలేట్‌ ‌ట్రైబ్యునల్‌లో పనిచేశారు) గారు చేరదీశారు. అమిత ప్రేమానురాగాలతో, పూర్తి స్వేచ్ఛతో పెంచారు. రాజమండ్రి, మదనపల్లి, విశాఖలో చదువు సాగింది. ఉమ్మడి మద్రాసు ప్రభుత్వ హయాంలో విశాఖ ఏవీఎన్‌ ‌కళాశాలలో ఇంటర్మీడియట్‌ ‌చదివాను. ఆంధ్ర విశ్వకళాపరిషత్‌లో స్నాతకోత్తర విద్య, ‘మైక్రోవేవ్‌ ‌స్పెక్ట్రోస్కోపి’కి సంబంధించి పీహెచ్‌డీతో సమానమైన డీఎస్సీ పరిశోధన పూర్తి చేసి, అక్కడే 1956లో భౌతిక శాస్త్ర విభాగంలో ఉపన్యాసకురాలిగా చేరాను. భౌతిక, రసాయన శాస్త్రాలలో ప్రతిభకు రాజా విక్రవ్‌దేవ్‌ ‌వర్మ స్మారక స్వర్ణ పతకాన్ని అందుకున్నాను. రీడర్‌, ‌ప్రొఫెసర్‌, ఇన్వెస్టిగేటర్‌ ‌లాంటి బాధ్యతలు నిర్వహించాను. నా పర్యవేక్షణలో 17 మంది పీహెచ్‌డీ, నలుగురు ఎం. ఫిల్‌. ‌పట్టాలు అందుకున్నారు. అనేక విశ్వ విద్యాలయాల డి. ఎస్సీ. , పీహెచ్‌డీ సిద్ధాంత వ్యాసాలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించాను.

శాస్త్రీయ పారిశ్రామిక పరిశోధన మండలి,(కౌన్సిల్‌ ఆఫ్‌ ‌సైంటిఫిక్‌ అం‌డ్‌ ఇం‌డస్ట్రియల్‌ ‌రీసెర్చ్-‌సీఎస్‌ఐఆర్‌), ‌విశ్వవిద్యాలయాల నిధుల సంఘం (యూజీసీ), శాస్త్ర సాంకేతిక విభాగం (డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ‌సైన్స్ అం‌డ్‌ ‌టెక్నాలజీ) వంటి వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాలలో పరిశోధనలకు ఇన్‌చార్జిగా వ్యవహరించాను. ‘అటామిక్‌ ‌స్పెక్ట్రోస్కోపి మాలిక్యులర్‌ ‌స్పెక్ట్రోస్కోపి’కి సంబంధించిన అంశాలపై చేసిన విశ్లేషణలకు ప్రఖ్యాత శాస్త్రవేత్తల (వెటరన్‌ ‌సైంటిస్టస్) ‌విభాగంలో బంగారు పతకంతో పాటు అనేక పురస్కారాలు లభించాయి. వృత్తిలో భాగంగా అమెరికా, కెనడా, బ్రిటన్‌, ‌స్పెయిన్‌, ‌కొరియా, శ్రీలంక తదితర దేశాలలో అనేక సైన్స్ ‌సదస్సులకు హాజరయ్యాను. బోర్డు ఆఫ్‌ ‌స్టడీస్‌, ఏపీ తెలుగు అకాడమీ పాలకమండలి చైర్‌ ‌పర్సన్‌గా వ్యవహరించే అవకాశం లభించింది.

1989లో పదవీ విరమణ తరువాత కూడా ఆరేళ్లపాటు ఆంధ్ర విశ్వ కళా పరిషత్‌లోనే గౌరవ అధ్యాపకురాలిగా సేవలు అందించాను. ప్రస్తుతం, నా శిష్యుడు ఆచార్య జీఎస్‌ఎన్‌ ‌రాజు ఉఫకులపతిగా ఉన్న విజయ నగరంలోని సెంచూరియన్‌ ‌విశ్వవిద్యాలయంలో పాఠాలు చెబుతున్నాను. బోధన విషయంలో ఆయన నాకు పునర్జన్మనిచ్చారు. రోజుకు కనీసం ఆరు తరగతులు తీసుకుంటున్నాను. విద్యార్థులే నా పిల్లలు, వారి భవిష్యత్‌ ‌నాకు ముఖ్యం. అందుకే అవసరమైతే సెలవు రోజుల్లోను తరగతులు తీసుకుంటుంటాను.

దాంపత్య ప్రస్థానం

మాది ఆదర్శ దాంపత్యం అనను కానీ అపూర్వ దాంపత్యం. ఆయన ఎంతో గౌరవించే వారు. మావి భిన్నత్వంలో ఏకత్వం లాంటి మనస్తత్వాలు. గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉంటే ఎలాంటి సమస్యలు ఉండ వనేందుకు మేమే నిదర్శనం. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అలాంటి అవగాహన ఉండాలి. అప్పుడే కుటుంబాలు, తద్వారా సమాజం చక్కగా సాగుతాయి. నాకు బోధనంటే చాలా ఇష్టం. ఆయనకూ (సుబ్రహ్మణ్యశాస్త్రి) తెలుగు సాహిత్యం అంటే అమితమైన ప్రేమ. అదే సమయంలో రాష్ట్రీయ స్వయంసేవక్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌)‌కు అంకితమయ్యారు. ఎక్కువ కాలం పర్యటనలలోనే గడిపేవారు. అయినా వృత్తి, ప్రవృత్తులను సమాంతరంగా, సమానంగా నిర్వహించారు. ఒకదానిపై మరొక దాని ప్రభావం పడేది కాదు.

వయస్సు రీత్యా మా మధ్య ఆరు నెలలే వ్యత్యాసం. మా పెళ్లే విచిత్రంగా జరిగింది. వాళ్లమ్మ, మా అమ్మగార్లు మంచి స్నేహితులు. బాగా మాట్లాడుకునేవారు. వారిద్దరే కూడ బలుక్కుని మా పెళ్లి నిర్ణయిం చేశారు. పెద్దల అనుమతితో మేమిద్దరమే తిరుమలకు వెళ్లి పెళ్లి చేసుకున్నాం. కొండ దిగి వస్తుండగా ‘బాగా చదువుకున్నావ్‌. ‌చాలా విషయాలు బాగా తెలిసిన దానివి. స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకో. ఏం చేసినా నాకు చెప్పనవసరంలేదు. నాదాకా రానక్కర్లేదు. నా అనుమతి కోసం వేచి ఉండ నక్కర్లేదు. అయితే తీసుకున్న నిర్ణయాలు ఎలాంటివైనా పునరాలోచించుకుంటూ బాధపడ కూడదు. అంటే ఏం జరిగినా స్వీకరించగలగాలి’ అని చెప్పారు. చదువు సంధ్యలంటూ సుమారు మూడు పదుల వయసు గడిపేసిన నాకు ‘పెళ్లంటే ఇంత సులువా, గొప్పదా? అలా అయితే ఎప్పుడో చేసుకుందును’ అనిపించింది (నవ్వుతూ). వివాహబంధం గొప్పదే… అలాంటి వ్యక్తులు జీవిత భాగస్వాములుగా లభించడం మహా గొప్పని నేటికీ అనిపిస్తూంటూంది.

మా పెళ్లినాటికే నేను అధ్యాపకురాలిని. ఆయన బీఏ ఆనర్స్ ‌విద్యార్థి. (ఆ అంతరం మాకు అడ్డుకాలేదు.) ఆయన పదేళ్లు ఆర్‌ఎస్‌ఎస్‌లో తిరిగిన తరువాత చదువుకునేందుకు వచ్చారు. ఆంధ్ర విశ్వకళాపరిషత్తులో బి.ఎ. ఆనర్స్‌లో ఇతర విభాగాలన్నిటిలో ప్రథములుగా నిలిచారు. ‘సామెతలు-నుడికారాలు’ అనే అంశంపై పరిశోధన చేశారు. ఫెలోషిప్‌పై కేంద్ర ప్రభుత్వంలో మూడేళ్లు పనిచేశారు. స్థిరమైన ఉద్యోగం ఆలస్యంగా వచ్చింది. అందులోనూ ఒడుదొడుకులు. కుటుంబ పోషణంతా నాదే. మా మధ్య అతిశయాలు, ఆత్మన్యూనత భావాలు లాంటివి లేవు. వ్యక్తిత్వాలు ప్రధానం తప్ప హోదాలు, ఆర్థికాంశాలు కావన్నది మా నమ్మకం. పరస్పర అభిప్రాయాలను గౌరవించుకున్నాం. ఆలుమగల బంధం పటిష్టతకు అదే మూలం అనుకుంటా. ఉదాహరణకు, నా చదువు, ఉద్యోగం ‘వంగల’ ఇంటిపేరుతోనే సాగినా, ఆయనతో జీవితం పంచుకున్న తర్వాత అధికారిక పత్రాలలో ఇంటి పేరు (చిలుకూరిగా) మార్చుకున్నాను. పుట్టింటి పేరుతో కొనసాగితే సాంకేతికంగా ఇబ్బందేమీ ఉండదు కానీ మెట్టినింటి గౌరవం కాపాడుకోవడం ధర్మం. నా అభిప్రాయాలను ఆయన మన్నించినప్పుడు, వారి గౌరవమర్యాదలను కాపాడుకోవాలనిపించింది. నా ఉన్నతిలో శాస్త్రి గారి పాత్రే ఎక్కువ. ప్రతి మగవాడి విజయం వెనుక స్త్రీ పాత్ర ఉంటుందన్నది లోకంలోని మాట. నా విషయంలో అది తిరగబడింది. ఆయన ప్రోత్సాహం వల్లనే ప్రొఫెసర్‌గా అంతర్జాతీయ స్థాయికి ఎదగ గలిగాను. మా అమ్మ పెంచింది వేరు, మా పినతండ్రి పెంపకం వేరు, మావారు సాకిన తీరు వేరు. మా అమ్మ వనజాక్షమ్మ 104 ఏళ్లు జీవించి ఆరేళ్ల క్రితం వెళ్లిపోయారు. అప్పటి వరకు నన్ను కంటికి రెప్పలా చూసుకున్నారు. అత్తింటి వారంటే ఎంతో అభిమానం. ఇప్పటికీ మా పెద్ద బావగారికి నెలనెలా గౌరవపూర్వకంగా, నా ఆత్మసంతృప్తి కోసం కొంత మొత్తం పంపుతున్నాను.

‘నీవే తల్లివి తండ్రివి…’ అని భాగవతంలో పోతనామాత్యుడు రుక్మిణితో చెప్పించిన మాటలు మా ‘ప్రొఫెసర్‌’ (‌నవ్వుతూ సంబోధన) విషయంలో నాకూ వర్తిస్తాయి. ఆయనకు తెలుగు, ఆంగ్లం, హిందీ భాషల్లో సమాన ప్రావీణ్యం ఉండేది. సంస్కృత, తెలుగు భాషలను బాగా అధ్యయనం చేయడం వల్ల ఉపనిషత్తులు, వేదాలు, పురాణాల గురించి వివరించి చెప్పేవారు. అలా వాటి పట్ల కలిగిన మక్కువ, ఆయన స్ఫూర్తితోనే భగవద్గీత శ్లోకాలను వ్యాఖ్యాన సహితంగా ‘భగవద్గీత ది డివైన్‌ ‌డైరెక్టివ్‌’ (‌Bhagvadgeetha-The Divine Directive) శీర్షికతో ఆంగ్లంలోకి అనువదించగలిగాను. పూరీలో జగద్గురు శంకరాచార్య భారతీ కృష్ణ తీర్థ స్వామీజీ ప్రవచించిన సూత్రాలలో ఇరవై తొమ్మిదింటికి ‘వేదిక్‌ ‌మాథమాటిక్స్’‌ను అన్వయిస్తూ వ్యాఖ్యానించాను. అనేక రచనల విషయంలో ఆంగ్ల భాషా విషయంలో ఆయన ద్వారా సందేహనివృత్తి చేసుకునే దానిని. మేమిద్దరం సమయపాలనకు విలువిస్తాం. తరగతులకు ఆలస్యంగా వెళ్లడం మా నిఘంటువులో లేదు. ఆయన దాటిపోయినా, ఇప్పటికీ అదే పాటిస్తున్నా.

జయాపజయాలకు నిమిత్తమాత్రులం

ఏం సాధించినా మనగొప్పంటూ ఏమీ లేదు. మనచుట్టూ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించడం, మనకు అవగాహన ఉన్న, మన దరిచేరిన వాటిని అమోదించడమే చేయవలసింది. ఇదే కర్మ సిద్ధాంతం. కర్మ చేస్తూ ఉండడమే మన పని. జీవితంలో ఎన్నో సంగతులు వచ్చిపడుతుంటాయి. వాటిని స్వీకరించడం, కాదనుకోవడం, వాటి వెంట పడడం. . ఇదే కదా జీవితం? దానికే తబ్బిబ్బయి కింద మీద పడడం ఎందుకు? కర్మ సిద్ధాంతంలోనే నిజమైన ప్రశాంతత•. మేం ఎప్పుడు దుఃఖంగా ఉండేవారం కాము. తృప్తిగా, సంతోషంగానే ఉన్నాం. ఒకవేళ బాధాకరపరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎవరైనా ‘ఎలా ఉన్నారు?’ అని ప్రశ్నిస్తే శాస్త్రి గారు ‘ఎక్స్‌లెంట్‌’ అని తడుముకోకుండా బదులు ఇచ్చేవారు. ‘అంతబాధలోనూ అలా చెప్పారెందుకు?’ అని అడిగితే ‘వాళ్లకు మాత్రం కష్టాలు ఉండవా? మన కష్టాలు కూడా చెప్పి మళ్లీ వాళ్లను బాధపెట్టాలా?’అనేవారు.

‘జీవితంలో ఏదీ ఎప్పుడు రావాలో అప్పుడే తప్పక వస్తుంది. ఏది ఎంతకాలం నీతో ఉండాలో అంతకాలం ఉంటుంది. ఎప్పుడు వదిలిపోవాలో అప్పుడే పోతుంది. వీటిలో దేనినీ ఆపలేవు. నీచేతిలో ఉన్నది ఒక్కటే. ఉన్నంత వరకు ఉన్నవాటిని విలువ తెలుసుకొని జీవించడం’ అనేది కర్మ సిద్ధాంతం. దానినే నమ్మిన మా ఇద్దరికి ఆస్తిపాస్తులపై మమకారం లేదు. దశాబ్దాల క్రితం కష్టించి కట్టుకున్న ఇంటిని ఆయన అనారోగ్యంతో ‘పడక’ మీద ఉన్నప్పుడే ‘మానవసేవే మాధవసేవ’ అన్నట్లు వివేకానంద మెడికల్‌ ‌ట్రస్ట్‌కు విరాళంగా ఇచ్చేశాం.’

ఆ సమయంలో నాకు అండగా నిలిచి, మా  వారికి ప్రేమానురాగాలతో సేవలు అందించిన అబ్బాయిని చేరదీసి చదివించి పెళ్లి చేశాను. అతనికి ముగ్గురు పిల్లలు. చిన్నపాటి ఉద్యోగం చేస్తున్నాడు. నాతో పాటు మొత్తం ఆరుగురం కలిసే ఉంటున్నాం. అతని కొద్దిపాటి సంపాదనకు నా పింఛన్‌తోడై వారికి గడుస్తోంది. మావారు పెళ్లి తర్వాత తిరుమలగిరు దిగుతూ చెప్పిన ‘ఒకసారి తీసుకున్న నిర్ణయాలను పునరాలోచించుకుంటూ బాధపడకూడదు’ అన్న మాటలు వెంటాడుతున్నాయి. దాదాపు 95 ఏళ్ల వయసులో ఆస్తులపై మమకారం లేదు. కాకపోతే నా తరువాత నన్ను నమ్ముకున్న ఆ కుటుంబ ఆర్ధిక• పరిస్థితి ఏమిటన్నదే నా ఆలోచన, బెంగ. ఎవరికి ఎంతో అంతే ప్రాప్తం. . . !

– డా।। ఆరవల్లి జగన్నాథస్వామి, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE