– తురగా నాగభూషణం, సీనియర్‌ ‌జర్నలిస్ట్

‌భారతీయ జనతా పార్టీ విన్నూత్మమైన ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. వైకాపా ప్రభుత్వం మూడేళ్లుగా చేస్తున్న అరాచక, అవినీతి, అసమర్థ పాలన, ప్రభుత్వ వైఫల్యాలు, హామీలను అమలు చేయకపోవడంపై సమరశంఖం పూరించింది. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజాక్షేత్రంలో బట్టబయలు చేసి ప్రజల్లో మార్పు తీసుకురావాలని సంకల్పించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో 5 వేల వరకు వీధి సమావేశాలు నిర్వహించనుంది. ఈ సమావేశాల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నించేలా చేసి ఈ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు బీజేపీ ప్రయత్నం చేయనుంది. ఈనెల (సెప్టెంబరు) 18 నుంచి అక్టోబరు 2 వరకు ఈ సభలు జరుగుతాయి. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ 25 నుంచి 30కి పైగా సభలు నిర్వహిస్తారు.

ప్రజా వ్యతిరేకవిధానాలను ఎత్తి చూపడంతో పాటు నరేంద్రమోదీ ప్రభుత్వం రాష్ట్రానికి చేస్తున్న సాయం కనీసం 50 లక్షల మందికి చేరేలా బీజేపీ ప్రణాళిక రచించింది. మొత్తం రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గంలో 14 రోజుల పాటు రోజుకు 2 నుంచి 3 చొప్పున మొత్తం 5 వేల వరకు వీధి సమావేశాలు జరుగుతాయి. పాటలు, కరపత్రాలతో ప్రచారం, రాష్ట్ర జాతీయ నాయకుల ప్రసంగాలు ఉంటాయి. జనసంచారం ఎక్కువగా ఉండే మార్కెట్లు, చౌరాస్తాలు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఈ సమావేశాలు నిర్వహిస్తారు. ప్రతి సమావేశంలో కనీసం 1000 మంది ప్రజలు పాల్గొనేలా, వినేలా, చూసేలా సమావేశాలు నిర్వహించాలనేది లక్ష్యం. ఈ 5 వేల సమావేశాల్లో 50 లక్షల మందిని చైతన్యవంతుల్ని చేస్తారు.

వీధి సమావేశాలు చిన్నగా కనిపించినా ఫలితాల సాధనలో మాత్రం మెరుగ్గా ఉంటాయి. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోని మండలాలను ఈ సమావేశాలు కవర్‌ ‌చేస్తాయి. మండలాలకు నిత్యం వచ్చే గ్రామీణులకు ఈ సమావేశాలు దగ్గరౌతాయి. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పార్టీ నేతలు వివరించడం వల్ల గ్రామీణుల్లో పార్టీ పట్ల సానుకూల దృక్పథం పెరిగి పార్టీని బలపరుస్తారు. ఈ విధానాన్ని నమ్మిన బీజేపీ ప్రజల వద్దకు వెళ్లి వారిని చైతన్య పరచడానికి నిర్ణయించడం కొత్తవరవడి.

దేనిపై ప్రచారం…

ఈ వీధి సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేకవిధానాలు, ఆస్తి, చెత్త పన్నుల విధింపు, కరెంటు, బస్సు ఛార్జీల పెంపు, పెట్రోలు, డీజిల్‌ ‌ధరలు తగ్గించక పోవడం, నిత్యావసర వస్తువుల ధరల పెరగుదల వంటి వాటితో ప్రజలు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వానికి తెలియచేస్తారు. అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలను పట్టించుకోకపోవడాన్ని ప్రశ్నిస్తారు. గనులు, వనరుల దోపిడీ, వైకాపా నాయకులు, ప్రజాప్రతినిధుల అవినీతిని ఎండగడతారు. వీటిని ప్రశ్నించిన బీజేపీ కార్యకర్తలు, ప్రజలపై వైకాపా నాయకుల దాడులు, పోలీసులతో అక్రమ కేసులు పెట్టడాన్ని కూడా ఎత్తిచూపుతారు. హిందూ వ్యతిరేక కార్యక్రమాలు, హిందూమతంపై ఈ ప్రభుత్వం చూపుతున్న వివక్ష, మత మార్పిడులు, హిందూ ఆలయాలపై దాడులు, వీటిని ప్రశ్నిస్తే పోలీసుల ద్వారా అక్రమ కేసులు పెట్టించడం వంటివాటిని కూడా ప్రజలకు గుర్తుచేస్తారు. అలాగే రాష్ట్రంలో అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ నుంచి అందే నిధుల నిధులను ప్రభుత్వం దారి మళ్లింపు, పథకాలను సద్వినియోగం చేసుకోకపోవడం తదితర వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ ‌కృష్ణారావు నేతృత్వంలో కమిటీ•ని రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో పార్టీ నాయకులు పాక వెంకట సత్యనారాయణ, సుధీష్‌ ‌రాంభొట్ల, లంకా దినకర్‌, ‌సాయి లోకేష్‌, ‌వెంగమాంబ శ్రీనివాస్‌, ‌డా. వినీషా రెడ్డి, వంశీకృష్ణ, శశాంక్‌ ‌మోహన్‌ ‌సభ్యులుగా ఉంటారు. వీధి సమావేశాలు జరిపే కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌.‌విష్ణువర్ధన్‌రెడ్డి నేతృత్వం వహిస్తారు. ఈ కమిటీలో పరశురాం రాజు, కోలా ఆనంద్‌, ‌తపన్‌చౌదరి, నతల సురేష్‌ ‌ప్రాంతీయ ఇన్‌చార్జిలుగా ఉంటారు. వీరు ఆయా ప్రాంతాల్లో సభల నిర్వహణ, ఏర్పాట్లు పర్యవేక్షిస్తారు.

విస్తృతంగా ప్రజల్లోకి

వైకాపా ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై బీజేపీ ఇప్పటికే ప్రజా పోరాటాలు చేస్తోంది. ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేసి వాటి పరిష్కారానికి దారి చూపింది. ప్రభుత్వ అవినీతిని ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ, ప్రతిఘటిస్తోంది. తమపై వచ్చిన ఆరోపణలపై సమాధానం చెప్పలేని వైకాపా ప్రభుత్వం, ఆ పార్టీ నాయకులు బీజేపీ నాయకులు, కార్యకర్తలపై దాడులకు దిగారు. పోలీసు అక్రమ కేసులు పెట్టారు. వీటన్నిటికీ గట్టిగా సమాధానం చెప్పి, కార్యకర్తలను రక్షించుకుంటూ, వారిలో  ధైర్యాన్ని నింపి మరింత పట్టుదల పెంచింది. పార్టీని బలోపేతం చేసుకుంది. కుటుంబ రాజకీయాలు చేసే తెదేపా ఇటీవల జరిగిన తిరుపతి, బద్వేలు, ఆత్మకూరు ఉపఎన్నికల్లో అభ్యర్థిని నిలపకున్నా, వారసత్వ రాజకీయాలు నమ్మని బీజేపీ తన అభ్యర్థులను నిలిపి అసలైన ప్రతిపక్షంగా ఎదిగి గణనీయమైన ఓట్లు సాధించింది. రెండేళ్లుగా పార్టీ చేస్తున్న కార్యక్రమాలతో పలు పార్టీలకు చెందిన నాయకులు బీజేపీలో భారీగా చేరుతున్నారు.

ఉద్యమాల ద్వారా పరిష్కారం

 వైకాపా మూడేళ్ల పాలనలోని వైఫల్యాలు, ప్రజా, హిందూ వ్యతిరేక విధానాలపై బీజేపీ ఉద్యమాలు, పోరాటం చేసి వీలైనంత వరకు సమస్యలు పరిష్కరించగలిగింది. సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేయాలనే డిమాండ్‌తో నిపుణులతో చర్చ కార్యక్రమాలు, ఉత్తరాంధ్ర జలపోరు యాత్ర, రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల కోసం రణభేరి సభలు నిర్వహించింది. రాష్ట్రంలోని దేవాలయాల్లో జరుగుతున్న అక్రమాలు, రాష్ట్ర ప్రభుత్వ హిందూ ధర్మ వ్యతిరేక చర్యలను నిరసిస్తూ కృష్ణా, గుంటూరు, ప్రకాశం, కర్నూలు, కడప జిల్లాల వరకు వున్న ప్రముఖ ఆలయాలను సందర్శిస్తూ, దేవాలయాల పరిరక్షణ యాత్రను చేపట్టింది. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఆందోళన చేసి టిప్పుసుల్తాన్‌ ‌విగ్రహాన్ని ఏర్పాటును అడ్డుకుంది. రామతీర్థంలో శ్రీ రాములవారి విగ్రహాన్ని ధ్వంసం చేయడంతో చేపట్టిన ఉద్యమం వల్ల రాష్ట్ర ప్రభుత్వం అక్కడ తిరిగి నూతన విగ్రహాన్ని ప్రతిష్ఠించింది. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో స్వామివారి రథాన్ని దహనం సంఘటనపై బీజేపీ చేసిన పోరాటంతో రాష్ట్ర ప్రభుత్వం నూతన రథాన్ని ఏర్పాటు చేసింది. బీజేపీ రాష్ట్రంలో చేపట్టిన హిందూధర్మ పరిరక్షణ ఉద్యమం ఫలితంగానే రాష్ట్రంలో హిందూ ఆలయాలపై జరుగుతున్న దాడులను నియంత్రించ గలిగింది. రైతాంగ సమస్యలపై కడప, గుంటూరు, అమలాపురంలో కిసాన్‌ ‌మోర్చా ద్వారా ఆందోళనలు చేయించి రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి రైతాంగ సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేసింది. రాష్టప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ విజయవాడలో ప్రజా ఆగ్రహ సభలు నిర్వహించింది. ఇష్టానుసారం దేవాలయ ఆస్తుల వేలం విధానాన్ని వ్యతిరేకించి వాటి వేలాన్ని నిలపగలిగింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో పరిమితికి మించి బోర్డు సభ్యుల నియామకం, నేరచరిత్ర కలిగిన వారిని నియమించ డాన్ని వ్యతిరేకించి, ఉద్యమం చేసి విజయం సాధించింది. భక్తుల కానుకల ద్వారా వచ్చిన రూ.5 వేల కోట్లను రాష్ట్ర ప్రభుత్వం తన అవసరాల కోసం మళ్లించే ప్రయత్నాన్ని బీజేపీ అడ్డుకుంది. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని కోరుతూ యువమోర్చా ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చింది. దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని, వారికి రక్షణ కల్పించాలని, కేంద్ర ప్రభుత్వం ఎస్సీల కోసం విడుదల చేసిన నిధులను లబ్ధిదారులకు కేటాయించక, దారి మళ్లించడాన్ని నిరసిస్తూ ఎస్సీ మోర్చా ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చింది. మహిళలపై దాడులు, అత్యాచారాలు, అన్యాయాలను నిరసిస్తూ, మహిళా సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్‌తో రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చింది. కరోనా కష్టకాలంలో ‘ప్రధానమంత్రి గరీబ్‌ ‌కళ్యాణ్‌ అన్న యోజన’ కింద కేంద్ర ప్రభుత్వం పేదలకు కేటాయించిన ఉచిత బియ్యాన్ని గత నాలుగు మాసాలుగా పంపిణీ చేయక పోవడాన్ని నిరసిస్తూ చేసిన పోరాటాల ఫలితంగా బియ్యాన్ని తిరిగి ఆగస్టు నుంచి ఇస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు విడుదల చేసిన నిధులను వైసీపీ ప్రభుత్వం దారిమళ్లించి తన ఇతర కార్యక్రమాల కోసం వాడుకుంటున్న విధానాన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ పోరాటం చేసింది. రాజధాని అమరావతి రైతులకు న్యాయం చేయాలని, అమరావతిపై కోర్టు నిర్ణయాన్ని అమలుచేయాలని డిమాండ్‌ ‌చేస్తూ, ‘మనం మన అమరావతి’ పేరుతో రాజధాని ప్రాంతంలో చేసిన కార్యక్రమం విజయవంతమైంది. అలాగే ప్రజా వ్యతిరేకవిధానాలు విడనాడాలని, ప్రభుత్వ హామీలు అమలు చేయాలని, నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని కోరుతూ యువ మోర్చా రాష్ట్రంలో ‘యువ సంఘర్షణ’ యాత్రను చేపట్టింది. ఇలా బీజేపీ పలు ఉద్యమాల ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషిచేస్తోంది.

About Author

By editor

Twitter
YOUTUBE