– అల్లూరి గౌరీలక్ష్మి
వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది
ఉదయం లేస్తూనే ‘‘శుభోదయం’’ అంటూ భర్త రఘురామ్ పంపిన రెండు రామచిలుకల కార్డు చూడగానే చిర్రెత్తుకొచ్చింది సౌమ్యకి. కొంచెం కూడా కోపం పెట్టుకోకుండా తననొక చిన్నపిల్లలా జమకట్టిన భర్త వ్యవహారం చూసి ఆమెకు ఒళ్లు మండింది. ‘‘నువ్వు భార్యని గౌరవించట్లేదు. పురుషాధిక్యత చూపిస్తున్నావు. నన్ను అణగదొక్కాలని ప్రయత్నిస్తున్నావు’’ అంటే ఏ మాత్రమూ పౌరుష పడకుండా ఇలా వారం రోజుల నుంచీ గుడ్ మార్నింగ్ చెబుతూనే ఉన్నాడు రఘు. ‘ఇదంతా నాటకం. నా తిరుగుబాటు గమనించి కూడా చూసీ చూడనట్టుంటే తన ఆధిపత్యం చెలాయించొచ్చని ప్లాన్ కాబోలు. నేనేం లొంగేది లేదు. జవాబు చెప్పేదే లేదు’ అనుకుంటూ మొబైల్ సోఫాలో పడేసి టీవీ పెట్టుకుని కూర్చుంది సౌమ్య.
టీవీ శబ్దానికి ‘‘లేచావా? బంగారం!’’ అంటూ దేవుడి గదిలోంచి వచ్చిన అమ్మమ్మ రాధమ్మ ‘‘మీ ఇద్దరూ దెబ్బలాడుకున్నారా ఏంటి?’’ అంటూ వందోసారి అడిగింది. సౌమ్య కోపం మొహం చూసి, గలగలా నవ్వేసి ‘‘చిటికెలో కాఫీ తెస్తా’’ అంటూ వంటగదిలోకి వెళ్లిపోయింది. ఆమె ఇచ్చి వెళ్లిపోయిన కాఫీ తాగుతూ సౌమ్య విసుగ్గా ఆలోచిస్తోంది.
జరిగిందంతా చెబితే నీదే తప్పంటుందీవిడ. లేస్తూనే, సూత్రాలు కళ్ల కద్దుకుంటూ, భర్త కాళ్లకు నమస్కారం చేస్తూ అతనే దైవం అనుకుంటూ కాపురం చేసినావిడ. సమానత్వం, స్త్రీల హక్కులు అంటే అర్థం అవుతుందా ఈవిడకి? వెంటనే అమ్మకి ఫోన్ చేసేస్తుంది, నేను అలిగి వచ్చానని. అమ్మానాన్నా వచ్చేసి నన్ను లాక్కెళ్లి రఘు ఇంట్లో వదిలేసి ‘చిన్న పిల్ల బాబూ, గారాబం వల్ల ఇలా తయారయ్యింది’ అని చెప్పి నవ్వుతూ వెళ్లిపోతారు. అందుకే చెప్పకూడదు అనుకుంది.
సౌమ్య భావుకురాలు. ప్రకృతి ప్రేమికురాలు. పువ్వులన్నా, పిట్టలన్నా, పాటలన్నా ప్రాణం. ఎప్పుడూ ఏదో పాడుకుంటూ, గెంతులేస్తూ హుషారుగా ఉండే పిల్ల. కాలేజీ మాగజైన్లలోనే రాయడం మొదలు పెట్టింది. పెళ్లయ్యి రెండేళ్లయింది. పెళ్లయ్యాక కూడా కవిత్వం రాయడం కొనసాగించింది. మొదట్లో చిన్న, చిన్న భక్తి పుస్తకాల వాళ్లు మాత్రమే ఆమె కవితలు వేసుకున్నారు.
రఘురామ్ అబిడ్స్, హైదరాబాద్‌లో ఒక ప్రముఖ బ్యాంకులో ప్రొబేషనరీ ఆఫీసర్. ఎప్పుడూ బిజీగా ఉంటాడు. ప్రతిరోజూ సాయంత్రం వచ్చేసరికి ఎనిమిదవుతుంది. ఎక్కడికి వెళ్లాలన్నా వారాంతంలోనే వెళ్లాలి. బీఎస్సీ కంప్యూటర్స్ చదివిన సౌమ్య ‘‘నాకింట్లో బోర్’’ అంటూ మొదట్లో ఒక ప్రైవేట్ స్కూల్ లో ‘‘కంప్యూటర్ టీచర్ గా పని చేస్తా’’ అంటూ తానే ఇష్టపడి చేరింది. రఘురామ్ ‘‘నీ ఇష్టం’’అన్నాడు. తల్లీ,తండ్రీ ‘‘నువ్వు ఉద్యోగం చెయ్యవలసిన అవసరం ఏముంది? మీ ఇద్దరూ సరదాగా గడపండి’’ అన్నా వినలేదు.
ఉద్యోగం చేస్తూనే, అప్పుడప్పుడూ ప్రకృతిపైనా, సమాజంలోని దీనులపైనా, బీదసాదలపైనా కవిత్వం రాస్తూ ఉండడం ఆమెకు కాస్త అలవాటయ్యింది. గత సంవత్సర కాలంలో చాలా కవితలు రాసింది. ఆపదలో ఉన్న స్త్రీలను హెల్ప్ లైన్ ద్వారా ఆదుకునే ‘‘ఆసరా’’ అనే సహాయ సంస్థ, సాహిత్యంపై మక్కువతో ఒక మ్యాగజైన్ కూడా నడుపుతోంది. రెండింటిలోనూ అందరూ స్త్రీలే ఉన్నారు. వారు ఉగాదికి, దీపావళికి రెండుసార్లు కవితల పోటీ పెట్టారు.
స్తీలకు సంబంధించి సౌమ్య రాసిన దోపిడీ, వివక్ష అనే రెండు కవితలు రెండుసార్లూ ప్రథ•మ బహుమతి పొందాయి.
ఆ తర్వాత మ్యాగజైన్ చేసుకున్న వార్షిక సంబరాల్లో సౌమ్యకు ‘నవ యువకవయిత్రి’ పురస్కారంతో సత్కరించారు.
– 2 –
రఘురామ్ కూడా ఆ సభకు సెలవు పెట్టి హాజరయ్యాడు. ఎంతో సంతోషంతో తన తల్లితండ్రులకూ, బంధువులకూ తానే స్వయంగా తీసిన ఫొటో షేర్ చేసాడు. ఆ స్త్రీల సంస్థలో పనిచేసే కొంతమంది సీనియర్ రచయితలు సౌమ్యకు ఏదో అప్పుడప్పుడూ రాయడం కాకుండా సీరియస్‌గా పూర్తి టైం రచనల మీదా, సేవమీదా వినియోగించమని తమ ప్రసంగాల్లో చెప్పారు. యువతరంలో సాహిత్యం రాసేవారు ఉండడంలేదని, ఈమెకు మంచి భవిష్యత్తు ఉందనీ పొగిడారు. ‘‘నువ్వు పెద్ద కవయిత్రివైపోతుంటే నాకు గర్వంగా ఉందోయ్’’ అంటూ భర్త ఆనందపడ్డాడు. ఆ రోజు సౌమ్య, రఘు ఒక స్టార్ హోటల్ లో డిన్నర్ కి వెళ్లారు. సౌమ్య అమ్మానాన్నా, వారి బంధువులు కూడా
ఈ సత్కారం సంగతి తెలిసి ముచ్చట పడ్డారు.
‘‘నేను ఉద్యోగం మానేస్తాను. సాహిత్యం బాగా చదువుకుని పదిమంది స్త్రీలకూ సాయం చేస్తాను’’ అన్నప్పుడు రఘురామ్ ‘‘నీ ఇష్టం సౌమ్యా. నాకు మంచి ఉద్యోగం ఉంది. ఆర్థికంగా మనపై ఎవరూ ఆధారపడిలేరు. నువ్వు హాయిగా నీకు నచ్చినట్టుగా ఉండు’ ’అని తన పూర్తి అంగీకారం తెలిపాడు.
ఉద్యోగం మానేసి క్రమంగా సాహిత్య కార్యక్రమాలలో పూర్తిగా నిమగ్నమయ్యింది సౌమ్య. వివిధ వాదాలకు సంబంధించిన మీటింగ్‌లకు వెళ్లడం ప్రారంభించింది. సాహిత్య రంగంలో యువత కనబడడం అరుదుగా జరుగుతోంది కనుక యువ రచయితలకు మంచి ప్రోత్సాహం లభిస్తోంది. ప్రతి మీటింగ్‌లోనూ యువతను ఇన్వాల్వ్ చేస్తున్నారు. అందుచేత ప్రత్యేకంగా స్త్రీ వాదం వైపు వెళితే మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయన్న ఉద్దేశంతో కాస్త సీరియస్‌గా రాయడం మొదలు పెట్టింది సౌమ్య. ఆ వాదానికి సంబంధించిన ప్రాథమిక సూత్రాలకు సంబంధించిన పుస్తకాలు పఠనం చెయ్యడం మొదలుపెట్టింది. దాంతో తన చుట్టూ ఉన్న సమాజంపై కొత్త దృష్టి కోణం ఏర్పడిందామెకు. మగవాళ్లందరూ ఆడవాళ్లను బానిసల్లా చూస్తారు. నాన్న, అమ్మ చేత అనేక వంటలు చేయించుకుని తింటాడు. ఇంటి పనులన్నీ అమ్మ ఒక్కర్తే చేస్తుంది. నాన్న హాయిగా, సుఖంగా కూర్చుంటున్నాడు అని తోచింది. తన దృష్టిని భర్తవైపు మళ్లించింది.
ఒకరోజు సూర్యాపేటలో వందమంది కవులతో తలపెట్టిన ఒక మీటింగ్‌కి పిలుపు వచ్చిందామెకు. కార్డులో సౌమ్యదే మొదటిపేరు. ‘‘వచ్చే వారం ఆ రోజు లీవ్ పెట్టండి. వెళదాం’’అందామె.
‘‘బ్యాంకులో ఎంత వర్క్ ఉందో తెలుసా? రోజూ చేస్తుంటేనే అవడం లేదు. పైగా సెలవు పెట్టడమా?’’ అన్నాడు రఘు.
‘‘నేను వెళుతున్న మీటింగ్‌లకి మీరుకూడా రావాలని నా కోరిక’’
‘‘ఎలా కుదురుతుంది? బ్యాంకులో నేను లేట్‌అవర్స్ కూర్చోవలసిందే. రెండుసార్లు కష్టం మీద రాగలిగాను. నా వల్ల కాదు’’
‘‘నేనిప్పుడు పాత పెళ్లాం అయిపోయాను. నామీద మీకు గౌరవం పోయింది’’ ఉక్రోషపడిందామె.
‘‘అర్థం చేసుకో‘‘ అంటూ రఘురామ్ వివరంగా చెప్పినా సౌమ్యకి కోపం తగ్గలేదు.
‘‘మీ మగాళ్లంతా ఇంతే! ఆడవాళ్లు హక్కులు అడిగితే మీకు నచ్చదు. నాకు పేరుప్రఖ్యాతులు రావడం మీకు ఈర్శ్యగా ఉంది. అందుకే నన్ను డిస్కరేజ్ చెయ్యాలని ఇలా చేస్తున్నారు’’
రఘురామ్ అవాక్కయ్యాడు. ‘‘నువ్వు కవయిత్రివయితే నాకెందుకు అసూయ ?’’ అయోమయంగా అడిగాడు.
‘‘మీ మగవాళ్లకందరికీ భార్యకి పేరు రావడం ఇష్టం ఉండదు. ఓర్వలేరు. నాకు తెలుసు’’
– 3 –
‘‘పిచ్చిమాటలు మాట్లాడకు. నేను రాను. ఏం చేసుకుంటావో చేసుకో. రోజూ ఇదేం తలనొప్పి? రాస్తే రాసుకో. ఎక్కడికైనా వెళ్లాలంటే నువ్వే ప్లాన్ చేసుకుని వెళ్లు. లేదంటే మానెయ్యి.’’ అనేసి హడావిడిగా వెళ్లిపోయాడు ఒక ఫోన్ మాట్లాడుతూ. దాంతో సౌమ్యకి మనసుకు తీవ్ర గాయమయ్యింది. అందుకే అలిగి వెంటనే సూట్ కేసు సర్దుకుని గాంధీనగర్ నుంచి వనస్థలిపురంలో ఉండే అమ్మమ్మ ఇంటికి వచ్చేసింది.
రాధమ్మ సౌమ్య రాగానే రఘుకి ఫోన్ చేసి తన దగ్గరికి వచ్చినట్టు చెప్పేసింది. రఘు సౌమ్య తల్లితండ్రులకి చెప్పాడీ సంగతి. వాళ్లిద్దరూ నవ్వేసి ‘‘నువ్వేం కంగారు పడకు బాబూ, ఒక్క పిల్లని ముద్దు చేసాం. చిన్నప్పటినుండీ బాగా గారం ఎక్కువయ్యి ఇలాగే చేసేది. పెళ్లయ్యాక పెద్దరికం వస్తుంది అనుకున్నాం. ఇంకా చిన్నతనం పోలేదు. నువ్వే వెళ్లావంటే నీదే తప్పు అందుకే వచ్చావనుకుంటుంది.’’ దాంతో రఘు రాకుండా ఊరుకున్నాడు.
అమ్మమ్మ మళ్లీ పూజ గదిలోకి వెళ్లి కూర్చోవడంతో భర్త గుర్తొచ్చి టీ.వీ. ఆపేసి ఆలోచిస్తూ కూర్చుంది సౌమ్య. ఒక రోజు ఆడపడుచు, భర్తా, పిల్లలు బెంగుళూరు నుంచి వచ్చారు. మర్నాడు ఉదయం ఫ్లైట్‌కి వైజాగ్ వెళుతున్నారు. ఆ రోజొక మీటింగ్ ఉంది తనకి. తాను మాట్లాడేదేమీ లేకపోయినా వాళ్లు గౌరవంతో పిలిచారు. తన అభిమాన కవయిత్రి పుష్ప అధ్యక్షత వహిస్తున్న మీటింగ్ అది. భర్తేమో అందరూ కలిసి ఒక గుడికి వెళ్లి , ట్యాంక్ బండ్ మీద కాసేపు తిరిగి డిన్నర్ బైట చెయ్యాలని ప్లాన్ చేసాడు.
తనకి ఆడపడుచు మీద కంటే పుష్ప మీదే ఎక్కువ ప్రేమా,భక్తీ ఉన్నాయి. ‘‘నేను రాను’’ అనగానే రఘురామ్ మొహం వాడిపోయింది. ‘‘స్టేజి మీద నీ పని లేదు కదా ఈ ఒక్కసారికీ మానెయ్యి’’ అన్నాడు అభ్యర్థ్ధనగా. ‘‘మనం హనీమూన్ ముగించుకుని బెంగుళూరు వెళ్లినప్పుడు అక్కా,బావా రెండు రోజులు లీవ్ పెట్టి సిటీ అంతా చూపించారు. మనమూ అలాగే కొంత త్యాగం చెయ్యాలి కదా?’’ బుజ్జగింపుగా అన్న భర్త మాటలకి తాను మానేసింది. ఆడపడుచు తమ్ముడూ, మరదలితో సంతోషంగా గడిపి వెళ్లిపోయింది. మర్నాడు పుష్ప ఫోన్ చేసి ‘‘సభ ఎంత బాగా జరిగిందో సౌమ్యా! నువ్వు రాకపోవడం ఏమిటీ ? ఇలా అయితే ఎలా? నువ్వెంత పెద్ద యువ కవయిత్రివి? ఇంకా బాగా ఎదగాలి. ఇలా కార్యక్రమాలు మిస్ చేసుకోకూడదు ఇంకోసారి సరేనా!’’ అన్నారు ప్రేమగా. ఇలాగే కదా ఆడవాళ్లని సంసారంలో పడేసి ఎదగనివ్వకుండా చేస్తారు. అనవసరంగా తాను పెళ్లి చేసుకున్నానేమో. ఇంకెప్పుడూ ఇలాంటి కుటుంబ బంధనాల్లో చిక్కుకుని తన కెరీర్ పాడుచేసుకోకూడదు ఆ రోజు మనసులో గట్టిగా నిర్ణయించుకుంది తాను.
– 4 –
సంక్రాంతి పండక్కి కోడలిచేత ఏవో దానాలు చేయించాలి రమ్మన్నారు అత్తామామలు. భర్తతో కలిసి అయిష్టంగానైనా వెళ్లాల్సి వచ్చింది. అక్కడికి వెళ్లాక సంతోషంగానే గడిచిపోయాయి రోజులు. అయినా బాగా అలిసిపోయాను.
ఒక వారం తన సుఖం చెడింది. ఇలాగే ఆచారాలనీ, ఇంకోటనీ కోడళ్లని వేపుకు తింటారు అత్తింటివాళ్లు.
ఇంతలో తల్లినుంచి వచ్చిన ఫోన్ ఎత్తకుండా ఆలోచిస్తోందామె. ‘నా కష్టాలు అమ్మకి చెబితే ఆమెకి అర్థ్ధమే కాదు. సంసారం తర్వాతే ఆ రాతలూ కోతలూనూ. సరదాగా రాయాలి కానీ నిన్ను నువ్వు కష్టపెట్టుకోకు అంటుంది. ఆవిడకేం తెలుసు? ఏ రంగంలోనైనా ఒక స్థానం సంపాదించుకోవాలంటే శ్రమపడాలి. అసలు తనకొచ్చిన గుర్తింపే అమ్మకి అర్థం కాదు. నాన్న కూడా అంతే. ‘రాత్రి ఏడు కాగానే ఇంటికొచ్చెయ్యాలి’ అని రూల్ పెడతారు. అమ్మ అవునవునంటుంది తప్ప నన్ను సపోర్ట్ చెయ్యదు. నాకెంత విసుగొచ్చేదో. స్వేచ్ఛ హరించే అమ్మా నాన్నలపై ఎంత కోపం ఉన్నా వాళ్ల ప్రేమ ముందు కరిగి పోయేది. అలా నన్ను కట్టిపడేసారు. ఇప్పుడేమో భర్త అర్థం చేసుకోవడం లేదు. ఇప్పటికి వారం రోజులయ్యింది. ఇక్కడికి వచ్చిన ఆరోజుని గుర్తుచేసుకుంది సౌమ్య.
అమ్మమ్మ పూజ ముగించి వచ్చి ‘‘టిఫిన్ చేసేయ్యనా?’’ అంటూ వంటగదిలోకి వెళ్లగానే ఆలోచనలాపింది సౌమ్య.
సౌమ్యతో బాటుగా కవిత్వం బాగా రాస్తున్న శంకర్ ఫోన్ చేసి ‘‘నా భార్యా, నేనూ కార్లో సూర్యాపేటలో రేపు జరగబోయే సాహితీ మీటింగ్‌కి వెళుతున్నాం. వస్తారా?’’ అని అడగడంతో ఆనందంతో ఉక్కిరిబిక్కిరయ్యిందామె. మర్నాడు ఉదయమే ఆరుగంటలకల్లా ముగ్గురూ కలిసి బయలు దేరారు. పాటలు వింటూ కబుర్లు చెప్పుకుంటూ మధ్యలో కారాపి కాఫీ తాగుతూ, సరదాగా ప్రయాణం చేసారు. మీటింగ్ కూడా బాగా జరిగింది. అక్కడే లంచ్ చేసి తిరిగి బయలు దేరారు. ‘‘చాలా థాంక్స్’’ అంటూ శంకర్ దంపతులకి కృతజ్ఞతలు చెప్పింది సౌమ్య.
రెండురోజుల తర్వాత శంకర్ ఫోన్ చేసి ‘‘నా భార్యకి కొంచెం నగలు కొనడంలో సాయం చేస్తారా?’’ అనడిగాడు. ‘‘సరే’’ అంది సౌమ్య అయిష్టంగా. రోజంతా ఆమెతో ఏడెనిమిది బంగారం షాపులు తిరగాల్సి వచ్చింది. అలిసిపోయి ఇంటికొస్తూనే దివాన్‌పై వాలిపోతూ ‘‘మొన్న సాయం చేసి ఇవాళ సాయం అడిగి చావగొట్టాడు శంకర్’’ అంది అమ్మమ్మతో సౌమ్య.
‘‘తప్పదు. ఒకరికొకరు సాయం చేసుకోవాలి. జీవితం అంటేనే మనుషుల మధ్య ఇచ్చి పుచ్చుకోవడం’’అందామె నవ్వుతూ.
– 5 –
మర్నాడు ‘‘ఆసరా’’ వాళ్ల సభకి నేనూ వస్తానంటూ మనవరాలి వెంట వెళ్లింది రాధమ్మ. అక్కడ వాళ్లు చెప్పిన మనువాదం, పురుషాధిక్యం, లింగ వివక్ష, అత్యాచారాలూ, హెల్ప్ లైన్ ద్వారా సహాయం, వరకట్నం, గృహహింసలపై స్త్రీలు పోరాటం చెయ్యవలసిన విధానం గురించిన వివరాలన్నీ జాగ్రత్తగా విన్నదామె. ఇంటికొచ్చాక సోఫాలో కూర్చుని ‘‘నీకర్థం అయ్యిందా అమ్మమ్మా, ఒక్క ముక్కైనా?’’ వెక్కిరిస్తూ అడిగింది సౌమ్య. రాధమ్మ తలపంకించి ‘‘సిద్ధాంతాలు తెలీకపోయినా మాకూ ఆత్మగౌరవం తెలుసులే. పాపం వాళ్లెంతో కష్టపడుతున్నారు ఆడవాళ్లలో అవగాహన పెంచాలని.
నువ్వు ఈ నెలరోజులూ లేచి మొహం కడుక్కుని అమ్మమ్మా! కాఫీ అంటున్నావు కదా! అది శ్రమ దోపిడీ కాదా? నీ వయసు పాతిక, నాది డెబ్బయ్. ఎవరు ఎవరికి చెయ్యాలి? నువ్వు నా అమ్మమ్మే అని గారం పోతున్నావ్. నేను నా మనవరాలు అని మురిపెంగా అన్నీ చేసిపెడుతున్నా. అలాగే ఇంట్లో వాళ్లందరికీ ఒకరి అవసరం మరొకరికి ఉంటుంది. భార్యాభర్తలు ఒకరి కోసం ఒకరు కొన్ని త్యాగాలు, సాయాలు చేసుకుంటారు. అలాగే అత్తా కోడలూ, అమ్మా కూతురూ, అన్నా చెల్లీ. అలా కలిసిపోతేనే అది కుటుంబం’’ రాధమ్మ మనవరాలి పక్కనే కూర్చుని చిన్న ఉపన్యాసం మొదలు పెట్టింది.
‘‘నిజం చెప్పు? తాతయ్య నిన్ను బాగా చూసుకున్నారా? నీమీద దాష్టీకం చెయ్యలేదూ?’’ ఆసక్తిగా అడిగింది సౌమ్య.
‘‘ఏమీ చెయ్యలేదు. మాకున్న ముప్పై ఎకరాల పొలం, రైస్ మిల్ చూసుకుంటూ ఆయనెంతో కష్టపడ్డారు. ఇంట్లో నాకు పనివాళ్లుండేవారు. నేను సుఖంగానే బతికాను’’ కాళ్లు కడుక్కుని వస్తూ అంది రాధమ్మ.
‘‘మా అమ్మ చూడు రోజంతా ఏదో చేస్తూనే ఉంటుంది. ఒక్కరోజు నాన్న వంట చేశారా ?’’ అంది సౌమ్య.
‘‘మీ నాన్న ఆ ఛత్తీస్‌గడ్‌లో వేడిలో, చలిలో సరైన తిండి లేకుండా కాంట్రాక్టులు చేసుకుంటూ చాలా ఇబ్బంది పడుతుంటే మీ అమ్మ గురించే మాట్లాడుతున్నావు. నాన్న గురించి కూడా ఆలోచించవెందుకు?’’
‘‘కాస్త చీకటి పడితే చాలు నామీద కోప్పడేవారు నాన్న. నాకు భలే వళ్లు మండేది. ఇలాగే ఆడపిల్లల్ని స్వేచ్ఛగా బతకనివ్వరు ’’ కోపంగా అంది సౌమ్య.
‘‘దిశ అనే అమ్మాయి ఏమయ్యిందో చూసావుగా! నీకే ఒక చెల్లెలుంటే నువ్వూ ఆ మాటే అనవా? చెప్పు?’’
‘‘అవుననుకో ‘‘ నసిగింది సౌమ్య.
‘‘తండ్రి కాబట్టి, రోజులు బాలేవు కాబట్టి జాగ్రత్త చెప్పడం తప్పుకాదు. మగవాళ్లపై ద్వేషం పెంచుకుంటున్నావు. మరెందుకు సూర్యాపేట వెళ్లడానికి మళ్లీ ఒక మిత్రుడైన మగవాడి సాయం తీసుకున్నావు?’’
రాధమ్మ ప్రశ్నకు సౌమ్య సమాధానం చెప్పలేకపోయింది. పక్కనున్న పేపర్ తీసి చదవడం మొదలుపెట్టింది.
– 6 –
ఒకరోజు రాధమ్మ గుడికి వెళ్లినప్పుడు, కాలింగ్‌బెల్ విని సౌమ్య తలుపుతీసింది. ‘‘మామ్మ గారు గుడికి వెళ్లిపోయారా? పూలు తేవడం ఆలస్యం అయ్యిందండీ. నా పేరు దుర్గ’’ అంటూ ఒకమ్మాయి పూలపొట్లం ఇచ్చి వెళ్లింది. ముప్పయ్యేళ్లుంటాయేమో. జడ గట్టిగా వేసుకుంది. బక్కపలచగా ఉంది. ఆమె కళ్లు నిర్లిప్తంగా ఉన్నాయి. రాధమ్మ గుడినుంచి వచ్చాక దుర్గ వచ్చిందని చెప్పింది సౌమ్య.
‘‘ఈ అమ్మాయినే భర్తా, అత్తమావలూ కట్నం కోసం బాగా వేధించారు, కొట్టారు. చంపబోయారు కూడా. చివరికి ధైర్యం తెచ్చుకుని రెండేళ్లు కోర్టుల చుట్టూ తిరిగి విడాకులు తీసుకుంది. పెద్దగా చదువుకోలేదు. ఒక బట్టల షాప్ లో బట్టలు చూపిస్తుంది. మన వెనక ఉండే సింగిల్ రూమ్‌లో ఉంటుంది.
నాకు బాగా సాయంగా ఉంటుంది. బంగారు తల్లి’’ అంటూ చెప్పుకొచ్చింది రాధమ్మ. ‘‘తల్లీ తండ్రీ ఎవరూ లేరా ?’’ జాలి పడుతూ అడిగింది సౌమ్య.
‘‘ఉన్నారు. అన్నా,వదినా కూడా ఉన్నారు. కానీ వాళ్లకి భారం కాకూడదని, తన కాళ్ల మీద తాను నిలబడాలని ఇక్కడ ఉంటోంది. వాళ్లు అప్పుడప్పుడూ వచ్చి పోతూ ఉంటారు.
ఆ రోజు మీ ‘‘ఆసరా’’ సంస్థ వాళ్లు మీటింగులో చెప్పింది ఈ పిల్ల లాంటి కష్టాల్లో ఉన్నవాళ్ల కోసం. నీలాగా తీరి సుఖంగా కూర్చుని కోడిగుడ్డుకు జుట్టుందేమో అని వెతికి వాళ్లకోసం కాదు. మనిషికి మనిషి సాయం ఉండాలి తోడుండాలి. బంగారు పళ్లేనికైనా గోడ చేర్పు కావాలి. అంటే అందరికీ అందరి అవసరం ఉంటుంది. ఆ మాత్రానికే దోపిడీ అని, దోసకాయనీ పేర్లు పెట్టుకుని ఆవేశపడడం కాదు. ఆ దుర్గ కష్టం మీద కవిత రాయి. వీలయితే దుర్గ లాంటి వాళ్ల జీవితాలకి ఆధారం చూపించేట్టు మీ వాళ్లందరితో కలిసి పని చెయ్యి’’ అంది రాధమ్మ కాస్త ఆవేశంగా.
ఎప్పుడూ అమ్మమ్మ సోది విసుగ్గా తోచే సౌమ్యకి మొదటి సారిగా అమ్మమ్మ తన అజ్ఞానాన్ని తొలగిస్తున్న గురువులా తోచింది. దగ్గరగా వెళ్లి గట్టిగా వాటేసుకుని ఆమె తలపై ముద్దు పెట్టుకుని ‘‘ఇకనుంచీ జాగ్రత్తగా అన్నీ పరిశీలించి, లోతుగా ఆలోచించి రాస్తాను, నువ్వు చెప్పినట్టు ఆ సంస్థతో కలిసి పని కూడా చేస్తానమ్మమ్మా!’’ అంది హాయిగా నవ్వేస్తూ. రాధమ్మ మనవరాలివైపు తృప్తిగా చూసి రెండు బుగ్గలూ పిండింది.