ఏ దేశం/రాష్ట్రంలోనైనా విముక్తి ఉద్యమాల్లో రాజకీయ సంస్థలు కీలక పాత్ర పోషిస్తాయి. ఒక మత, సామాజిక సంస్థ విముక్తి ఉద్యమంలో పాల్గొనడం చాలా అరుదు. పూర్వపు హైదరాబాద్ స్టేట్ విముక్తి పోరాటంలో కీలక పాత్ర పోషించిన అటువంటి సంస్థే ఆర్యసమాజ్. ఇందుకు ఈ ప్రాంతంలో నెలకొన్న కొన్ని ప్రత్యేక పరిస్థితులు దోహదం చేశాయి. దీన్ని స్వామి దయానంద సరస్వతి 1875లో స్థాపించారు. హిందూ సమాజంలో నెలకొన్న అంధవిశ్వాసాలను, కులవ్యవస్థను తొలగించి, సంస్కరించడమే దీని స్థాపన ప్రధాన లక్ష్యం. తన ప్రఖ్యాత రచన ‘సత్య ప్రకాష్’లో ఆయన అభిప్రాయాలను స్పష్టంగా వివరించారు. ఆయన ప్రారంభించిన ‘శుద్ధి ఉద్యమం’ అప్పటి సమాజంలో ఎంతో ప్రాచుర్యం పొందింది. భారత్‌కు వేదసంప్రదాయాన్ని అనుసరించడమే ఉత్తమ మార్గమని ప్రచారం చేశారు. 1883లో ఆయన మరణించిన తర్వాత మహాత్మ హంసరాజ్, గురుదత్త విద్యార్థి, లాలా లజపతి రాయ్, మున్షిరామ్ తదితరులు మరింత ముందుకు తీసుకెళ్లారు.
ఇక నాటి హైదరాబాద్ సంస్థానం విషయానికి వస్తే ఇందులో మూడు భాషా ప్రాంతాలుండేవి. తమ ప్రాంతాల్లోని ప్రజల స్థితిగతులను మెరుగు పరచేందుకు ఈ మూడు ప్రాంతాల్లో ఆంధ్రపరిషత్ (1921), కన్నడ పరిషత్ (1934), మహారాష్ట్ర పరిషత్ (1937)లు కృషిచేశాయి. ముఖ్యంగా నాటి ప్రభుత్వపు ఒంటెత్తు పోకడలను నిలువరించి అందరికీ సమాన న్యాయం, అభివృద్ధిని కోరుతూ ఒత్తిడి తీసుకొచ్చాయి.
ఉద్యమానికి ఊపునిచ్చిన సరోజినీ నాయుడు ప్రసంగం
తొలినాళ్లలో ఆర్యసమాజ్ ప్రభావం నాటి హైదరాబాద్ స్టేట్‌లోని కర్ణాటక ప్రాంతంలో ఎక్కువగా ఉండేది. తర్వాతి స్థానాల్లో వరుసగా మహారాష్ట్ర, తెలంగాణ ఉండేవి. కానీ ఉద్యమం తీవ్రమయ్యే కొద్దీ మూడు ప్రాంతాల్లో ఆర్యసమాజ్ ప్రభావం బలీయ స్థితికి చేరుకొని హైదరాబాద్ విముక్తికి దోహదం చేసింది. నిజానికి 1938లో సరోజినీ నాయుడు ఉస్మానియా యూనివర్సిటీలో ఇచ్చిన ఉద్వేగపూరిత ప్రసంగంతో హైదరాబాద్ విముక్తి ఉద్యమానికి ఒక ఊపు వచ్చిందని చెప్పాలి. అప్పుడే ఆర్యసమాజ్ నేత స్వామి రామానంద తీర్థ నేతృత్వంలో హైదరాబాద్ స్టేట్ విముక్తి ఉద్యమం పతాకస్థాయికి చేరుకుంది. హైదరాబాద్ విముక్తి పోరాటంలో కీలక పాత్ర పోషించిన స్వామి రామానంద తీర్థ నాయకత్వంలో కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణలో ఉద్యమం ఏకతాటిపై నడిచింది. ఆయన నేతృత్వంలో చేపట్టిన నిజాం వ్యతిరేక ఉద్యమం చివరకు 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం ఇండియన్ యూనియన్‌లో విలీనం కావడానికి దోహదం చేసింది.
నిజాం సంస్థానంలో నిర్వహించిన విమోచన ఉద్యమాల చరిత్రలో ఆర్యసమాజ్ పాత్ర చిరస్మర ణీయం. కులవ్యవస్థ నిర్మూలనకు పోరాడిన ఆర్యసమాజ్ ప్రభావం నేటి హిందూ సమాజంపై ఎంతో ఉందనడం అతిశయోక్తి కాదు. ఏది ఏమైనా పూర్వపు నిజాం సంస్థానాన్ని జాతీయవాద ప్రధాన స్రవంతిలోకి మొదటగా తీసుకెళ్లింది ఆర్యసమాజ్ మాత్రమే. నిజాం నవాబు మతఛాందస విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు ఐకమత్యంతో ఎదురు నిలవడానికి ఆర్యసమాజ్ ఎంతో దోహదం చేసింది. నైజాం రాష్ట్రంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తొలి నిరసన కార్యక్రమం చేపట్టింది కూడా ఆర్యసమాజ్ మాత్రమే. ఆర్యసమాజ్‌కు చెందిన రాజకీయ కార్యకర్తల కృషివల్లనే నాటి హైదరాబాద్ స్టేట్‌లో 70% ప్రజల్లో రాజకీయ చైతన్యం కలగడంతో పాటు, మూడు ప్రాంతాల కాంగ్రెస్ నాయకులకు ఉద్యమస్ఫూర్తి కలిగిందంటే అతిశయోక్తి కాదు. 1942 నాటి ‘సాధించు లేదా మరణించు’ ఉద్యమం లోను, 1946-47 ‘యూనియన్‌లో విలీనం’ ఉద్యమంలో, 1947-48 ‘సరిహద్దు ఉద్యమం’ లోనూ ఆర్యసమాజ్ కార్యకర్తల త్యాగాలు వెలకట్ట లేనివి. ఈ ప్రాంతంలోని జాతీయవాదులకు ఆర్యసమాజ్ ఒక శిక్షణ కేంద్రంగా కొనసాగింది.
రాయచూర్‌లో కార్యకలాపాలు ప్రారంభం
పండిట్ బన్సీలాల్, బీదర్ జిల్లా హళ్లిఖేడ్‌కు చెందిన శ్యామ్‌లాల్‌లు ఆర్యసమాజ్‌లో నిబద్ధంగా పనిచేసిన ప్రముఖులు. ఆర్యసమాజ్ భావజాలంతో ఉత్తేజితులైన వీరిద్దరూ బీదర్, గుల్బర్గా, రాయ్‌చూర్, యాద్గిర్, యెల్‌బుర్గా, కొప్పల్, ఇటాగీ, కుక్కునూరు, అలవండి మొదలైన ప్రాంతాల్లో ఆ సంస్థ శాఖలను స్థాపించారు. 1925లో ఆర్యసమాజ్ కార్యకలాపాలు రాయ్‌చూర్‌లో ప్రారంభమయ్యాయి. ఈ శాఖకు అధ్యక్షుడిగా పండిట్ రామ్ స్వరూప్‌జీ వ్యవహ రించారు. స్వామి సచ్చిదానందజీ ఆయన సహచరుడు. మంగళ్‌దేవ్ శాస్త్రి, మహావీర్ కల్యాణ్ వంటి చాలామంది ప్రముఖులు రాయ్‌చూర్, కొప్పల్ జిల్లాల్లో ఆర్యసమాజ్ విస్తరణకు కృషిచేశారు. మొదట్లో ఆర్యసమాజ్ కార్యకలాపాలు జానకి ప్రసాద్ నివాస గృహంలో జరిగేవి. తర్వాత 1930- 35 మధ్యకాలంలో ఈ రెండు జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో శాఖలు విస్తరించాయి.
రాజకీయానికి ఎందుకు ప్రాధాన్యం?
నిజానికి ఆర్యసమాజ్ ఒక మత, సామాజిక ఉద్యమంగా దేశంలో కీలక పాత్ర పోషించినప్పటికీ, హైదరాబాద్ స్టేట్‌కు వచ్చేసరికి రాజకీయ కార్యకలాపాలకు ప్రాధాన్యమివ్వడానికి ప్రధాన కారణం మైనారిటీ ముస్లిం రాజులు, మెజారిటీ హిందువులను పాలించడం. మరో ప్రధాన కారణం- నాటి హిందూ సమాజం పేదరికం, నిరక్షరాస్యత వంటి సమస్యలతో కునారిల్లడం. నాటి నిజాం పాలనలో హిందువులు తీవ్ర అభద్రతా భావంతో జీవిస్తుండటాన్ని ఆర్యసమాజ్ గుర్తించింది. ఆ విధంగా 1892లో ఆర్యసమాజ్ హైదరాబాద్‌లోకి కాలుపెట్టింది. సుల్తాన్ బజార్ ఆర్యసమాజ్‌కు ప్రధాన కేంద్రంగా నిలిచింది. నిజానికి 1880లో భీర్ జిల్లా ధరూర్ తాలూకాలో స్వామి దయానంద సరస్వతి ఏర్పాటు చేసిన ఆర్యసమాజ్ శాఖను 1892లో హైదరాబాద్‌కు తరలించారు. దీని మొదటి అధ్యక్షులు కామత్ ప్రసాద్‌జీ రైష్రా. 1905లో పండిట్ కేశవరావ్ కోరాట్కర్ హైదరాబాద్ స్టేట్ ఆర్యసమాజ్ అధ్యక్షు డయ్యాక, ఉద్యమం కొత్తరూపు సంతరించుకుంది. ఈయన అప్పటి హైదరాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మాత్రమే కాదు, గొప్ప దేశభక్తుడు కూడా. అప్పటినుంచి ఆర్యసమాజ్ ప్రజల్లో రాజకీయ చైతన్యం కోసం తీవ్రంగా కృషిచేసింది. 1938 నాటికి హైదరాబాద్ స్టేట్‌లో 250 శాఖలు ఏర్పడ్డాయి. వీటిల్లో 20 జంట నగరాల్లోనే ఉండటం విశేషం.
మతాంతరీకరణకు వ్యతిరేకంగా..
నిజాం ప్రభుత్వం చేపడుతున్న మతాంతరీకరణ విధానాన్ని ఆర్యసమాజ్ తీవ్రంగా వ్యతిరేకించింది. ఇదే సమయంలో హైదరాబాద్ స్టేట్‌కు చెందిన స్వామి రామానంద తీర్థ, ఉద్గీర్‌కు చెందిన కాంబ్లేవాలే, జమలాపురం కేశవరావు, పీవీ నరసింహారావు, మర్రి చెన్నారెడ్డి, బీదర్‌కు చెందిన రామచంద్ర వీరప్ప, కేవీ నరసింగరావు, గుల్బర్గాకు చెందిన విద్యాధర్ గురూజీ, రాయచూర్‌కు చెందిన పండిట్ తారానాథ్, ఇంకా ఉస్మానాబాద్, వరంగల్, జహీరాబాద్, ఆదిలాబాద్, బసవకల్యాణ్, ఔరంగా బాద్, బీడ్‌లకు చెందిన ప్రముఖ నాయకులను ఆర్యసమాజ్ ఎంతో ప్రభావితం చేసింది. వీరు ముస్లిమేతరుల పౌర, మతహక్కులను నొక్కి చెప్పడమే కాకుండా ఇందుకోసం పోరాటం సలిపారు. నాటి నిజాం ప్రభుత్వం ఇస్లామిక్ స్టేట్‌ను ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో ముస్లిమేతరుల హక్కులను అణచివేసింది. రాజకీయాలను, మతాన్ని కలిపేసి ‘తబ్లీగ్’ను ప్రారంభించేందుకు ‘ఇత్తెహాద్’ను ప్రోత్సహించింది. ఇందులో భాగంగానే నిజాం ప్రభుత్వం ఒక ఫర్మానాను జారీచేసింది. దీని ప్రకారం ‘ముఫసా’, ‘గైర్ ముఫసా’ చట్టాలను అమల్లోకి తెచింది. ముస్లిం, మతాంతరీకరణకు గురైన హిందువుల ఆస్తుల రక్షణకు, వారి సాధికారతకు ఈ చట్టాలు హామీ ఇస్తాయి. ఈ చట్టాలకు వ్యతిరేకంగా ఆర్యసమాజ్ నేతృత్వంలో హిందువులు పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. మానవులంతా సమానమే, కులవ్యవస్థ ఖండన, విద్యకు సమానావ కాశాల కల్పన, వేదాలకు మళ్లండి (వేదాలే జీవన ప్రమాణం), భారత్ భారతీయులదే వంటి ఆర్య సమాజ్ సందేశాలను ఈ సందర్భంగా విస్తృతంగా ప్రచారం చేశారు. ప్రజలను ఈ దిశగా విద్యావంతు లను చేసే పక్రియను సంస్థ కార్యకర్తలు చేపట్టారు. శ్యామ్‌లాల్.. ఉద్గిర్‌లో అంటరాని వారి కోసం ఒక ఆసుపత్రిని ప్రారంభించాడు. బీదర్, ఉద్గిర్, చితగుప్ప, గుల్బర్గా, రాయచూర్‌లలో ఆర్యసమాజ్ పాఠశాలలు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్‌లోని ఆర్యసమాజ్ నాయకులు నిరుపేద హిందువుల అభ్యున్నతికి కృషిచేయాలని ప్రతిన పూనారు. ముస్లిం మతంలోకి మారిన వారిని తిరిగి హిందూమతంలోకి రావడం ద్వారా హిందూ సంస్కృతిని రక్షించాలని కోరేవారు. ‘దీన్‌దార్’, ‘తబ్లీక్’లకు ప్రతిగా ఆర్యసమాజ్ ‘శుద్ధి’ ఉద్యమాన్ని ప్రారంభించింది. ముస్లింలుగా మారిన వారిని తిరిగి హైందవంలోకి తీసుకొని రావడం దీని ప్రధాన లక్ష్యం. నిజాం ప్రభుత్వం శుద్ధి ఉద్యమానికి మద్దతు ఇచ్చినవారిని తీవ్రంగా హింసించింది.
భారత్ భారతీయులదే
‘భారత్ భారతీయులదే’ అంటూ ఆర్యసమాజ్ ఇచ్చిన పిలుపు నిజాంకు, రజాకార్ల అకృత్యాలకు వ్యతిరేకంగా ఉద్యమించేందుకు హిందువుల్లో చైతన్యం రగిలించింది. నిజాం ప్రభుత్వం జారీచేసిన 144వ సెక్షన్‌కు వ్యతిరేకంగా ఆర్యసమాజ్ ‘హవన కుండం’ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో భాగంగా ‘బసవ జయంతి’, ‘దసరా’ పర్వదినాల సందర్భంగా హైదరాబాద్‌లో ‘ఓం పతాకాలను’ ఎగురవేశారు. ఈ కార్యక్రమాలు 1935-45 మధ్య కాలంలో విస్తృతంగా ఆర్యసమాజ్ నిర్వహించింది. హిందువుల్లో కుల నిర్మూలనను ప్రోత్సహించేందుకు, హరిజనులు, లింగాయత్‌లు, బ్రాహ్మణుల మధ్య కులాంతర వివాహాలను జరిపింది. బీదర్, ఉద్గిర్, చితగుప్ప, ఉస్మానాబాద్, ఔరంగాబాద్, మరఠ్వాడా ప్రాంతాల్లో ఈ కులాంతర వివాహాలు పెద్దఎత్తున జరిగాయి. హిందువులకు స్వీయరక్షణ పద్ధతుల్లో శిక్షణ ఇచ్చింది. ముఖ్యంగా రజాకార్లను ఎదుర్కొనే లక్ష్యంతోనే ఈ శిక్షణా కార్యక్రమాలను నిర్వహిం చింది. ఇందులో భాగంగా ‘హనుమాన్ వ్యాయామ శాలలను’ రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటుచేసింది. వీటి ద్వారా హిందువుల్లో జాతీయ భావాలను పెంపొం దింపజేసేందుకు కృషి చేసింది. నిజాం ప్రభుత్వం ఆర్యసమాజ్ కార్యకలాపాలను ఉక్కుపాదంతో అణచివేసేందుకు యత్నించింది. ముఖ్యంగా ఆర్య సమాజ్ నిర్వహించే మత, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనకుండా ప్రజలను భయ భ్రాంతులను చేయడమే లక్ష్యంగా ఇత్తెహాద్ పనిచేసింది. ఇదిలా ఉండగా హైదరాబాద్ రాష్ట్రంలో కార్యకలాపాలను నిర్వహించేందుకు ఆర్యసమాజ్‌కు నైతిక, ఆర్థికపరమైన మద్దతునిచ్చింది ‘సర్వదేశిక్ ఆర్య ప్రతినిధి సభ’. ఈ సంస్థ మద్దతు 1948, సెప్టెంబర్ 13 వరకు కొనసాగింది.
దీన్‌దార్ వ్యతిరేక ఉద్యమం
1930 ప్రాంతంలో సిద్దిఖి దీన్‌దార్ అనే ముస్లిం వ్యక్తి తనను తాను చెన్నబసవేశ్వరుడి అవతారంగా ప్రకటించుకొని, రామ, కృష్ణ అవతారాలను తక్కువ చేసి మాట్లాడటం మొదలుపెట్టాడు. ఈవిధంగా చేయడం ద్వారా కర్ణాటక ప్రాంతంలోని లింగా యత్‌లు, బ్రాహ్మణుల మధ్య విభేదాలు సృష్టించాలన్నది అతని ఉద్దేశం. దీనికి వ్యతిరేకంగా మంగళదేవ, రామచంద్ర ధేల్వీలు నాటి హైదరాబాద్ కర్ణాటక, మరఠ్వాడా ప్రాంతాల్లో విస్తృతంగా సమావేశాలు ఏర్పాటుచేసి హిందువుల్లో ఐక్యత చెడకుండా కృషిచేశారు. వీరి ఉత్తేజవంతమైన సమావేశాలు ముస్లింలలోని ప్రగతిశీలవాదులను కూడా ఆలోచింపజేశాయి. ఫలితంగా నిజాం, రజాకార్ల అణచివేత చర్యలను వీరు ఖండించడం మొదలు పెట్టారు. క్రమంగా నిజాం ప్రభుత్వం ఆర్యసమాజ్‌పై కఠినచర్యలకు ఉపక్రమించింది.
వార్షిక సమావేశాల నిషేధం
ఆర్యసమాజ్ వార్షిక సమావేశాలను నిషేధిస్తూ నిజాం ప్రభుత్వం 1937లో ఘస్తీ నిషాన్ పేరిట 53వ నెంబరు సర్క్యులర్ జారీచేసింది. ఈ సర్క్యులర్‌ను వేద్‌ప్రకాష్ అనే ఆర్యసమాజ్ కార్యకర్త తీవ్రంగా వ్యతిరేకించగా, అతడిని ఇస్లాంలోకి మారమంటూ ఒత్తిడి తీసుకురావడంతో అందుకు అంగీకరించలేదు. ఫలితంగా గుంజోటీలో హత్యకు గురయ్యాడు. నిజాం ప్రభుత్వంలోని మొఘలాయి సైనికులకు ఎంతమాత్రం భయపడకుండా ఆర్యసమాజ్ తన వార్షిక సమావేశాలను కొనసాగిస్తూ వచ్చింది. ఇందులో భాగంగా 1942లో ఉద్గిర్‌లో జరిగిన వార్షిక సమావేశానికి పండిట్ వినాయక్ రావు విద్యాలంకార్ అధ్యక్షత వహించగా, 1943లో నిజామాబాద్‌లో జరిగిన వార్షిక సమావేశానికి గణపతి కృష్ణశాస్త్రి అధ్యక్షత వహించారు. అదేవిధంగా నారాయణపేట్‌లో జరిగిన మూడో వార్షిక సమావేశం ఆర్.ఎస్. చంద్రజీ నేతృత్వాన జరిగింది. అయితే దసరా ఉత్సవం సందర్భంగా ఇక్కడ మత ఘర్షణలు జరిగాయి. ఆర్యసమాజ్ నాలుగో వార్షిక సమావేశాలు 1945 ఏప్రిల్ 22 నుంచి 24 వరకు గుల్బర్గాలో నిర్వహించారు. ఇవి రాజ్ నారాయణ్ లాల్ పిట్టే ఆధ్వర్యంలో జరిగాయి. ఆర్యసమాజ్ ఐదో వార్షిక సమావేశం 1946లో వరంగల్‌లో జరిగింది. తర్వాత ప్రభుత్వం నుంచి ఏవిధమైన అనుమతులు లేకుండానే ఆర్యసమాజ్ ఉత్సవాలను నిర్వహించడం ప్రారంభించింది. ఫలితంగా గుల్బర్గా, ఉద్గిర్, నిజామాబాద్, బీదర్, ఉస్మానాబాద్‌ల్లో మత ఘర్షణలు చోటుచేసుకున్నాయి.
హైదరాబాద్ డే
సర్వదేశిక ఆర్య ప్రతినిధి సభ 1936-37లో ‘హైదరాబాద్ డే’ను జరుపుకోవాలని నిజాం సంస్థానంలోని ఆర్యసమాజ్ శాఖలను ఆదేశించింది. ప్రభుత్వ మతాంతరీకరణ విధానాలను నిరసిస్తూ, పౌరహక్కుల పరిరక్షణను కోరుతూ ఉద్యమించడం ‘హైదరాబాద్ డే’ నిర్వహణ ప్రధాన లక్ష్యం. తమ డిమాండ్లను నిజాం నవాబు పట్టించుకోకపోవడంతో 1938, అక్టోబర్ 24న సత్యాగ్రహం జరపాలని ఆర్యసమాజ్ నిర్ణయించింది. ఈ సత్యాగ్రహాలు 1939 వరకు కొనసాగాయి. ఈ సందర్భంగా రెండువేల మంది సత్యాగ్రహులను నిజాం ప్రభుత్వం అరెస్ట్ చేసింది. ఈ నిరసన క్రమంగా తీవ్రమై, నైజాం రాష్ట్రం యావత్తు మత ఘర్షణలకు దారితీసింది. గుల్బర్గాలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణలు జరిగాయి, హైదరాబాద్‌లోని ధూల్‌పేటలో గొడవలు జరగడంతో 21 మంది కార్మికులను ప్రభుత్వం అరెస్ట్ చేసింది. ఉద్గిర్‌లో దసరా ఉత్సవాలు జరుపుతున్న సందర్భంగా శ్యాంలాల్‌తో సహా 20 మందిని పోలీసులు అరెస్ట్ చేసి బీదర్ జైలుకు తరలించారు. అక్కడే శ్యామ్‌లాల్ మృతి చెందారు. పండిట్ నరేంద్రజీని ప్రభుత్వం అరెస్ట్ చేసి మన్ననూమ్‌కు పంపింది. మొట్టమొదటి డిక్టేటర్ మహాత్మా నారాయణ స్వామి 1939 ఫిబ్రవరి 4న, రెండో డిక్టేటర్ కున్వర్ చంద్రకరణ్‌జీ 1939, మార్చి 2న గుల్బర్గాలో నిరాహార దీక్షలు జరిపారు. వీరిద్దరినీ అరెస్ట్ చేసి గుల్బర్గాలోని జైలుకు నిజాం ప్రభుత్వం తరలించింది.
కార్యకర్తల ప్రాణత్యాగాలు
హైదరాబాదేతరులను సంస్థానంలోకి రాకుండా నిజాం ప్రభుత్వం నిషేధం విధించినప్పుడు ఇతర ప్రాంతాలకు చెందిన ఆర్యసమాజ్ కార్యకర్తలు ఇక్కడ జరిగే ఉద్యమానికి మద్దతునివ్వడం కోసం షోలాపూర్, విజయవాడ, బార్సి, అహమ్మద్ నగర్, మన్మాడ్, పూనా, చాంద్‌ల ద్వారా ప్రవేశించారు. వీరిలో చాలా మందిని నిజాం పోలీసులు అరెస్ట్ చేసి జైళ్లకు తరలించారు. అక్కడ ఆహారం అందించక పోవడంతో, ఎంతోమంది ఆకలితో చనిపోయారు. నిజాంకు వ్యతిరేకంగా జరిపిన పోరాటంలో బసవకల్యాణ్‌కు చెందిన ధర్మప్రకాశ్, గుల్బర్గాకు చెందిన విష్ణు భగవాన్‌జీ, హుమానాబాద్‌కు చెందిన శివచంద్రజీ, హలిక్కేడ్‌కు చెందిన శ్యామలాజీ, ఉద్గిర్‌కు చెందిన భీమ్‌రావ్‌జీలు 1938-39 మధ్యకాలంలో నిర్వహించిన సత్యాగ్రహాల్లో పోలీసుల దెబ్బలకు ప్రాణాలు కోల్పోయారు. జైళ్లలో నిజాం పోలీసుల దాష్టీకం వల్ల 24 మంది సత్యాగ్రహులు ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మంది సత్యాగ్రహులకు అన్నంలో విషం కలిపి ఇవ్వడంతో మరణించారు.
తెలంగాణ ప్రాంతంలో
నిజాం ప్రభుత్వం ఉర్దూ మీడియంలో మాత్రమే విద్యను అందిస్తున్న నేపథ్యంలో పండిట్ తారానాథ్ ఘట్‌కేసర్‌లో స్వాధ్యాయ మండల్, నల్గొండలో ఉపదేశిత్ విద్యాలయ పేరుతో శిక్షణా కేంద్రాన్ని నడిపేవారు. దీన్ని గుర్తించిన నిజాం ప్రభుత్వం తారానాథ్‌ను రాయచూర్‌లో హమ్‌దర్ద్ పాఠశాలను ప్రారంభించేందుకు బలవంతంగా పంపించింది. అయితే ఆర్యసమాజ్, గుల్బర్గా (1908), రాయ్‌చూర్ (1920), కుకునూర్ (1922)ల్లో పాఠశాలలను అప్పటికే నడుపుతోంది. తెలంగాణ ప్రాంతంలో ఆర్యసమాజ్ నగర సంకీర్తనలు, ఓం పతాకా విష్కరణలు, హవన కార్యక్రమాలు నిర్వహిస్తుండ టంతో వీటిపై నిజాం ప్రభుత్వం నిషేధం విధించింది. 1895లో చాదర్‌ఘాట్, శాలిబండ వద్ద మొదటిసారి గణేష్ ఉత్సవాలను నిర్వహించారు. 1947లో పెంబర్తి గ్రామంలో గోగిడి రాఘవ అనే ఆర్యసమాజ్ కార్యకర్తపై ఇక్బాల్ నేతృత్వంలో రజాకార్లు దాడి చేశారు. అయితే అతన్ని స్థానిక రైతులు రక్షించినా ఈ ఘర్షణలో ముగ్గురు గొఱ్టెల కాపర్లు ప్రాణాలు కోల్పోయారు. మరో సంఘటనలో నీరుమళ్ల గ్రామానికి చెందిన భూస్వామి జంగారెడ్డిని డిప్యూటీ కలెక్టర్ జీపు వెంట ఐదు మైళ్లు పరిగెత్తించారు. చివరకు ఈ వేధింపులు తట్టుకోలేక ఆయన గుడివాడ పారిపోయారు. బూర్గుల రామకృష్ణారావు, కొండా వెంకటరంగారెడ్డి, జమలాపురం కేశవరావు, మాడపాటి హనుమంతరావు, మర్రి చెన్నారెడ్డి, బొమ్మకంటి సత్యనారాయణ, హయగ్రీవాచారి, పాగా పుల్లారెడ్డి, కోదాటి నారాయణరావు, కొమరగిరి నారాయణరావు, కాళోజీ నారాయణరావు, ఉమ్మెత్తల నరసింగరావు, పీవీ నరసింహారావు, కొలిపాక కిషన్‌రావు, కొలిపాక రామచంద్రరావు, దాశరథి, హీరాలాల్ మోరియా, ఐతరాజు రామారావు, జలగం వెంగళరావు వంటి నాయకులకు నిజాం విముక్తి పోరాటంలో ముందుకు దూసుకుపోయేందుకు స్ఫూర్తి ప్రదాత ఆర్యసమాజ్ మాత్రమే. స్వామి రామానంద తీర్థ నేతృత్వంలో వీరంతా పనిచేశారు. ఒకరకంగా చెప్పాలంటే వీరికి ఆర్యసమాజ్ ఒక శిక్షణ కేంద్రంగా నిలిచిందని చెప్పవచ్చు. నైజాం స్టేట్‌లో సర్దార్ జమలాపురం కేశవరావు విద్యా వ్యాప్తికోసం చేసిన కృషి, గ్రంథాలయోద్యమం, చేపట్టిన సత్యాగ్రహాలు వంటి వాటి వెనుక ఆర్యసమాజ్ ప్రభావం బలీయంగా ఉంది. ఈ కారణంగానే ఆయన స్వామి రామానందతీర్థ మార్గదర్శకత్వంలో పనిచేశారు. నైజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలంగాణలో తొలి సత్యాగ్రహం చేసింది స్వామి రామానంద తీర్థ, జమలాపురం కేవవరావులు కావడం విశేషం.
కర్ణాటక ప్రాంతంలో
సమావేశాలపై నిజాం ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో ముందంగి పట్టణంలో యువకులు సమావేశమై రజాకార్లు, నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా మొట్టమొదటి ఫ్రీడమ్ ఫైట్ క్యాంపును ఏర్పాటుచేయగా దీనికి అర్మదానయ్య పౌరాణిక్ నేతృత్వం వహించారు. ఉస్మానియా విశ్వవిద్యా లయంలో బి.కాం. చదువుతున్న ఈయన మధ్యలోనే చదువు మానేసి ఈ క్యాంపులో చేరారు. ఈయనకు ముందంగి మఠం నుంచి అవసరమైన సహాయ సహకారాలు అందేవి. ఆర్యసమాజ్ కార్యకర్త వేద్‌ప్రకాశ్ పౌరాణిక్ దాదాపు వెయ్యిమంది యువకులను కూడగట్టి రజాకార్లు, పోలీసులపై యుద్ధం చేయడానికి గెరిల్లా పోరాటంలో శిక్షణ ఇచ్చాడు. ఈ విషయంలో ముందంగి ఫౌజ్‌దార్ హెబ్‌సూర్, పౌరాణిక్‌కు అన్నిరకాలుగా సహాయం అందించాడు. ఆవిధంగా శిక్షణ ఇచ్చిన పౌరాణిక్ దాదాపు 85 గ్రామాలకు నిజాం నుంచి విముక్తి కలిగించాడు. ఈయన పోరాట పటిమకు ముచ్చటపడ్డ సర్దార్ పటేల్.. కేంద్ర మంత్రి గాడ్గిల్‌ను ముందంగికి పంపి తన ప్రశంసలు తెలిపారు. ఇటువంటి సంఘటనలు నైజాం స్టేట్‌లో చాలా జరిగాయి. ఇదిలా ఉండగా 1942లో ఉద్యమాన్ని బలహీన పరచేందుకు హిందువులను ఆర్థికంగా దెబ్బకొట్టే ఉద్దేశంతో రజాకార్లు గుల్బర్గాలో హిందువులకు చెందిన దుకాణాలను లూటీచేశారు. అయినా నిజాం ప్రభుత్వం రజాకార్లపై ఏవిధమైన చర్యలు తీసుకోలేదు.
మహారాష్ట్ర ప్రాంతంలో
మహారాష్ట్రలో పండిట్ భగవత్ స్వరూప్, గోకుల్ ప్రసాద్‌లు చేసిన ప్రసంగాలు 1891 నుంచి మహా రాష్ట్రలోని భిర్ జిల్లాలో ఆర్యసమాజ్ కార్యక్రమాలు ఊపందుకోవడానికి దోహదం చేశాయి. పండిట్ రావు కోరాట్కర్ అధ్యక్షతన 1932లో నైజాం స్టేట్‌లోని మహారాష్ట్ర వ్యాప్తంగా ఆర్యసమాజ్ శాఖలు ఏర్పాటయ్యాయి. గ్రంథాలయాలు, పాఠశాలల ద్వారా విద్యావ్యాప్తి జరిగింది. దీన్‌దార్ ఉద్యమాన్ని నిరసిస్తూ వై.డి. జోషి నేతృత్వంలో హిందూ సివిల్ లిబర్టీస్ మూవ్‌మెంట్ తరఫున పౌర ఉద్యమం ప్రారంభ మైంది. 1938, అక్టోబర్ 24న దసరా ఉత్సవాల సందర్భంగా ఉదయగిరి శాఖ అధ్యక్షుడు మాణిక్‌రావును ముస్లింలు కాల్చి చంపారు. దసరా సందర్భంగా ఆంక్షలు అమల్లో ఉన్న నేపథ్యంలో మాధవరావు వడగోంక, పురుషోత్తమరావు చపల గోంకార్, రామారావు పాటిల్, శ్రీపతిరావులు అరెస్టయ్యారు. ఔరంగాబాద్‌లోని ఇంటర్మీడియట్ కళాశాలలో అధ్యాపకుడిగా ఉన్న జి.ఎం. ష్రాఫ్ వందేమాతరం ఉద్యమానికి మద్దతిచ్చాడు. ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేసి విద్యార్థులతో కలిసి ఉద్యమంలో పాల్గొన్నాడు.
1940లో జి.ఎం. ష్రాఫ్, ఎస్. కె. వ్షంప్యాన్, డి.ఎల్. పాఠక్, ఎ.కె. వాఘ్మేర్‌లను నిజాం ప్రభుత్వం అరెస్ట్ చేసి జైలుకు పంపింది. 1941లో మరఠ్వాడా మూడో సదస్సు ఉబ్రి (నాందేడ్)లో జరిగింది. కాశీనాథ్ వైద్య దీనికి నేతృత్వం వహించారు. వేలాదిమంది పాల్గొన్న ఈ సదస్సులో లక్ష్మణ్‌రావు వలుజ్కార్ తన ప్రసంగంతో ఉర్రూతలూగించారు. ఆయన వయోజన విద్యాకేంద్రాలు, లైబ్రరీలను స్థాపించారు. ఇదే సమయంలో మహారాష్ట్ర పరిషత్‌ను పునర్ వ్యస్థీకరించారు. కమ్యూనిస్టులు కూడా ఈ పరిషత్‌లో చేరారు. ఔరంగాబాద్‌లో సి.డి. చౌదరి ఆర్గనైజర్‌గా ఉండగా, ఆర్.డి. దేశ్‌పాండే భిర్ జిల్లాలో, వి.డి. దేశ్‌పాండే నాందేఢ్‌లో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారు. 1946లో నిజాం ప్రభుత్వ వ్యతిరేక పోరాటం ఉచ్ఛస్థితికి చేరుకుంది. ఈ సమయంలో లాతూర్‌లో నలుగురు రైతులు హత్యకు గురయ్యారు. ఆ సమయంలో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు మూడు కమిటీలు ఏర్పాటయ్యాయి. ఒకటి సామూహిక సత్యాగ్రహాలు, ఫారెస్ట్ సత్యాగ్రహం, రజాకార్లపై పోరాటానికి హింసాత్మక సత్యాగహ్రం. వాఘ్‌మేర్, వైశంపాయన్, ఛర్థాంకర్, ఛబ్రా, దగదాబాయి షెల్కే ఉద్యమకారులకు మందుగుండు సామగ్రిని అందించేవారు. వీరు ఈ ఉద్యమంలోనే ప్రాణాలు కోల్పోయారు.
అరాచకాలకు కారణం ఖాసిం రజ్వీ
1930-44 మధ్యకాలంలో బహదూర్ యార్ జంగ్ నేతృత్వంలోని మజ్లిస్ పార్టీ బలంగా రూపొంది, హైదరాబాద్ ముస్లింల ప్రతినిధిగా వ్యవహరించింది. 1946-48 మధ్యకాలంలో మతమౌఢ్యం నరనరానా నింపుకున్న ఖాసిం రజ్వీ ఈ పార్టీకి నేతృత్వం వహించి, రజాకార్ల పేరుతో వాలంటీర్లను నియమించి ముస్లిమేతరులపై దారుణాలకు పాల్పడ్డాడు.
అతను సాగించిన దారుణ మారణకాండ హైదరాబాద్ చరిత్రలో చీకటి అధ్యాయాన్ని మిగిల్చింది. ఇండియన్ యూనియన్‌లో కలిసేందుకు ఎంతమాత్రం ఇతడికి ఇష్టం ఉండేదికాదు. ఇతను అనుసరించిన మతఛాందస విధానమే చివరికి సైనిక చర్యకు దారితీసింది. ఎట్టకేలకు నిజాం ప్రభుత్వ పతనంతో హైదరాబాద్ సంస్థాన ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీల్చుకోగలిగారు.
– జమలాపురపు విఠల్‌రావు, సీనియర్ జర్నలిస్ట్