– క్రాంతి, సీనియర్‌ ‌జర్నలిస్ట్

‌నిజాం రాజ్యంలో అణగి ఉన్న తెలుగు సమాజంలో భాషాసంస్కృతులను కాపాడుకోవాలనే స్పృహను రగిలించిన మహోద్యమం అది. చిన్న పాయలా ప్రారంభమైన ఈ సాంస్కృతిక ఉద్యమం అసఫ్‌ ‌జాహీల పాలనకే ఎసరు పెట్టంది. హైదరాబాద్‌ ‌రాష్ట్ర విముక్తిలో ఆంధ్ర జనసంఘం, ఆంధ్ర మహాసభల పాత్ర మరువరానిది. ఎందరో సాహితీవేత్తలు, సామాజిక, సాంఘిక ఉద్యమకారులు, రాజకీయ నాయకులు ఈ వేదికల ద్వారా పని చేశారు. నిజాం రాజు తరతరాల బూజు అని గుర్తించడమే కాదు, దానిని వదిలించిన ఆ మహోద్యమం, దాని స్ఫూర్తి చిరస్మరణీయం.


భారతభూమి నడి బొడ్డున అతిపెద్ద సంస్థానం హైదరాబాద్‌. ఇది మూడు భాషా ప్రాంతాలలో ఉండేది. తెలుగువారున్న అతిపెద్ద భూభాగం తెలంగాణ. సంస్థానంలో అత్యధిక ప్రజలు మాట్లాడే తెలుగు, మరాఠీ, కన్నడ భాషలను కాదని ఉర్దూకు పెద్ద పీట వేశారు. అంతకు ముందు పార్శీ. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే పాఠశాలల్లో ఉర్దూ మాత్రమే బోధించేవారు. ఈ భాష తెలిసిన వారికే ప్రభుత్వ ఉద్యోగాలు లభించేవి. ఎంత అణచివేత ఉన్నా మెజారిటీ ప్రజల భాషలు అస్థిత్వాన్ని కాపాడుకుంటూ వచ్చాయి. ఇందుకు కారణం హైందవమతం. ఈ ఆధ్యాత్మిక, సాంస్కృతిక స్పృహే తెలుగు, మరాఠీ, కన్నడ భాషలను కాపాడుతూ వచ్చింది. కానీ తెలుగువారికి అంతర్లీనంగా తమ భాష రక్షణకు వేదిక ఏదీ ఏర్పడలేదు. ఈ దశలో హైదరాబాద్‌ ‌నగరంలో జరిగిన ఓ ఘటన పెద్ద మార్పును తీసుకు వచ్చింది. ఇది సంస్థానంలో ఆంధ్ర మహోద్యమానికి నాంది పలికింది. నిజాం అస్థిత్వాన్ని సవాలు చేసి సంస్థానం పతనానికి దారి తీసింది.

ఆంధ్ర జనసంఘం ఆవిర్భావం

 నవంబరు 12, 1921. హైదరాబాద్‌లోని కోఠిలో ఉన్న వివేకవర్థిని ఆడిటోరియంలో హిందూ సంస్కార సభ జరిగింది. దీనికి పుణె మహిళా విశ్వవిద్యాలయ స్థాపకులు దోండే కేశవకార్వే అధ్యక్షత వహించారు. సంస్థానంలోని అన్ని ప్రాంతాల ప్రముఖలు హాజరయ్యారు. వక్తలంతా ఇంగ్లీష్‌, ఉర్దూలతో పాటు మరాఠీ, కన్నడ భాషల్లో ఉపన్యాసాలు ఇస్తున్నారు. ఒక వక్త, హైకోర్టు ప్రముఖ న్యాయవాది ఆలంపల్లి వెంకటరామారావు తీర్మానాలను సమర్ధిస్తూ తెలుగులో ఉపన్యాసం ప్రారంభించారు. తమకు అర్థం కావడం లేదని, ప్రసంగం ఆపేయాలంటూ సభికులంతా గోల చేశారు. సభలో పాల్గొన్న తెలుగువారు దీన్ని అవమానంగా భావించి నిరసన తెలుపుతూ బయటకు వచ్చేశారు. అంతకు ముందు కూడా మరో తెలుగు ప్రముఖుడు మాడపాటి హనుమంతరావుకు ఇదే తరహా అవమానం జరిగింది.

అదే రోజు రాత్రి కొందరు తెలుగు ప్రముఖులు వివేకవర్ధిని వెనుకే ట్రూప్‌బజార్‌లో ఉన్న టేకుమాల రంగారావు ఇంట్లో సమావేశమయ్యారు. ఇందులో మాడపాటి హనుమంతరావు, బూర్గుల రామకృష్ణా రావు, టేకుమాల రంగారావు, మిట్ట లక్ష్మీనరసయ్య, ఆదిరాజు వీరభద్రరావు, నడింపల్లి జానకి రామయ్య, మందుముల నరసింగరావు, బోయినపల్లి వెంకట రామారావు, కొమ్మవరపు సుబ్బారావు, బూర్గుల నరసింహారావు, డాక్టర్‌ ‌పందింటి రామస్వామి నాయుడు ఉన్నారు. అంతా కలిసి ‘ఆంధ్ర జనసంఘం’ పేరుతో సరికొత్త వేదికను స్థాపించారు. రూపాయి చందాతో సభ్యులుగా మారారు.

ఆంధ్ర జనసంఘంలో వందమంది సభ్యులు చేరిన తర్వాత ఫిబ్రవరి 24, 1922 కొండా వెంకటరంగారెడ్డి అధ్యక్షతన సమావేశమైంది. ఆ తర్వాత మార్చి 17, ఏప్రిల్‌ 4 ‌తేదీల్లో మరో రెండు సమావేశాలు నిర్వహించి నియమావళిని రూపొందిం చారు. ఆంధ్ర జనసంఘం అధ్యక్షునిగా బారిస్టర్‌ ఆర్‌. ‌రాజగోపాల్‌ ‌రెడ్డి, కార్యదర్శిగా మాడపాటి హనుమంతరావు, సహాయ కార్యదర్శిగా మందుముల నర్సింగరావులను ఎన్నుకున్నారు. కొండా వెంకట రంగారెడ్డి, ఆదిరాజు వీరభద్రరావు, టేకుమాల రంగారావు, పాపిరెడ్డి, డాక్టర్‌ ‌రామస్వామి నాయుడు, రాజా రంగారావు పాలకవర్గ సభ్యులుగా ఉన్నారు. ఆ సమయంలో సంస్థానంలో రాజకీయ సభలు, సమావేశాలపై నిర్బంధం ఉండేది. అందుకే కొంత కాలం బహిరంగంగా రాజకీయ అంశాల జోలికి వెళ్లకుండా సంస్కరణలకే పరిమితమైంది.

ఆంధ్ర జనసంఘం సమావేశాలు

ఆంధ్ర జనసంఘం తొలి సమావేశం జులై 27, 1923న హైదరాబాద్‌లోని మాడపాటి హనుమంత రావు ఇంట్లో జరిగింది. రాజ బహదూర్‌ ‌వెంకట రామారెడ్డి అధ్యక్షునిగా, మాడపాటి హనుమంత రావును కార్యదర్శిగా ఎన్నుకున్నారు. రెండో సమావేశం మార్చి 1, 1924న నల్గొండలో జరిగింది. ‘నీలగిరి’ పత్రిక సంపాదకులు షబ్నవీసు వేంకటరామనరసింహారావు కార్యాలయ ఆవరణలో జరిగిన ఈ సభకు కూడా వెంకటరామారెడ్డే అధ్యక్షుడు. ఈ సమావేశాల్లోనూ తెలుగువారి విద్యా వికాసాలు, వారి భాషాభివృద్ధికి తోడ్పడే కార్యక్రమాలనే నిర్ణయించారు.

మూడో సమావేశం ఫిబ్రవరి 21, 1925న మధిరలో జరిగింది. మరునాడు గ్రంథాలయ మహాసభ నిర్వహించారు. బొంబాయి ఆంధ్రులు మద్దతు ప్రకటించారు. ఈ విషయం తన దృష్టికి రావడంతో నిజాం అప్రమత్తమయ్యాడు. సంస్థానం బయటివారు జోక్యం చేసుకుంటున్నారంటూ నాలుగో మహాసభకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. రాజకీయేతర సభలకు ఆంక్షలు వర్తించవని హైకోర్టు చెప్పినా పట్టించుకోలేదు. అలా వాయిదాపడిన ఈ సభలు సూర్యాపేటలో 1928, మే 28, 29, 30 తేదీల్లో అత్యంత విజయవంతంగా జరిగాయి. ఆంధ్ర జనసంఘం సభలకు సమాంతంరంగా గ్రంథాలయ మహాసభలు, వర్తక సంఘం సమావేశాలు కూడా జరిగాయి. డిసెంబరు 2,1922న ‘సూర్యాపేట వర్తక సంఘం’ ఆవిర్భవించింది.

జాగృతమైన తెలంగాణ సమాజం

నిజాం రాజ్య ఆంధ్రోదయంలో ‘ఆంధ్ర మహాసభ’ మొదటి దశ కాగా, రెండో దశ ‘ఆంధ్రజన కేంద్ర సంఘం’. ఆంధ్ర మహాసభను మరింత విస్తరించి అన్నిరకాల కార్యకలాపాలను సమన్వయ పరచడానికి ఆంధ్ర జన కేంద్ర సంఘం ఏర్పడింది. వరంగల్‌, ‌నల్లగొండ, మధిర, సూర్యాపేట, జోగిపేట, దేవరకొండ, ఖమ్మం, సిరిసిల్లలతో ఈ సమావేశాలు జరిగాయి. ఆంధ్ర జనసంఘం స్థాపించిన మరుసటి ఏడాది దానికి ఉపసంఘంగా ఆంధ్ర పరిశోధక సంఘం ఏర్పాటయ్యింది.

ఆంధ్ర మహాసభకు అంకురార్పణ

ఆంధ్ర జనసంఘం, ఆంధ్ర జనకేంద్ర సంఘం సభలు, సమావేశాలతో హైదరాబాద్‌ ‌సంస్థానంలోని తెలంగాణలో నిరంకుశ అధికారులు, దొరల బెడద కొంత తగ్గింది. పదేళ్ల పాటు జరిగిన ఈ కార్యాక్రమాలతో కొద్దికాలంలోనే తెలుగువారికి ఒక వేదిక ఉందన్న విశ్వాసం ఏర్పడింది. ఈ దశలో ఆంధ్ర జన సంఘంతో పాటు వివిధ సంఘాల ఐక్యతతో తెలంగాణ అంతటికీ ప్రాతినిధ్యం వహించే సంస్థ అవసరమైంది. భాషా సంస్కృతిక కార్యక్రమా లతో పాటు సామాజిక, సాంఘిక సంస్కరణతోపాటు క్రమంగా రాజకీయాలపై దృష్టి సారించడమే లక్ష్యంగా ‘ఆంధ్ర మహాసభ’ అవతరించింది. విద్యావంతులు, న్యాయవాదులు, వ్యాపారులు, ప్రముఖులకు పరిమితం కాకుండా అన్నివర్గాల ప్రజలను కలుపుకొని పోయేందుకు కృషి చేసింది. ఇందు కోసం సభ్యత్వ రుసుము ప్రతి ఏటా క్రమంగా తగ్గిస్తూ రూపాయి, పావలా, అణా వరకూ తీసుకొచ్చారు. యువతతో పాటు రైతులు, కూలీలు, నిరక్షరాస్యులను కూడా సభ్యులుగా చేర్చకున్నారు.

మొదటి ఆంధ్ర మహాసభ

1930 మార్చి 3, 4, 5 తేదీల్లో మెదక్‌ ‌జిల్లా జోగిపేటలో మొదటి ఆంధ్ర మహాసభ జరిగింది. సురవరం ప్రతాపరెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సభకు అనుమతి ఇచ్చేందుకు ప్రభుత్వం ఎన్నో షరతులు విధించింది. సభకు అధ్యక•త వహించేవారు గైర్‌ ‌ముల్కీ (బయటివారు) కాకూడదన్నది ప్రధాన షరతు. ఈ మహాసభ సమావేశాల్లో 32 తీర్మానాలను ఆమోదించారు. వీటిలో విద్య, సంఘ సంస్కరణలకు సంబంధించినవే ఉన్నాయి. స్త్రీలకు విద్య, బాల్య వివాహాల నిషేధం, వితంతు వివాహం లాంటి తీర్మానాలను కూడా చేశారు. అయితే సభలో ఉన్న సనాతనవాదులను ఈ తీర్మానాలు బాధించాయి. ప్రముఖ సంఘ సంస్కర్త భాగ్యరెడ్డి వర్మ అంటరాని తనం నిర్మూలన, మాల మాదిగలకు విద్యావ కాశాలపై తీర్మానాన్ని ప్రవేశపెడుతున్న సమయంలో సనాతనవాదులు నిరసన వ్యక్తం చేస్తూ సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. వామననాయక్‌ ‌వారిని తప్పుపడుతూ తీర్మానాన్ని సమర్ధించారు.

ఆంధ్రమహాసభలకు సమాంతరంగా ఆంధ్ర మహిళా సభలు కూడా జరిగాయి. నడింపల్లి సుందరమ్మ అధ్యక్షతన రాజకీయాల్లో మహిళలకు భాగస్వామ్యంతో పాటు పలు కీలక అంశాలను చర్చించారు.

రెండో ఆంధ్రమహాసభ

1931 మార్చి 3, 4, 5 తేదీల్లో దేవరకొండలో జరిగిన రెండో ఆంధ్రమహసభకు బూర్గుల రామకృష్ణారావు అధ్యక్షత వహించారు. ఈ సభకు రావి నారాయణరెడ్డి నాయకత్వంలో రెడ్డి హాస్టల్‌ ‌విద్యార్థులు కాలి నడకన బయలుదేరి, ప్రతి గ్రామంలో ప్రచారం చేస్తూ దేవరకొండ చేరుకున్నారు. ద్వితీయాంధ్ర మహాసభకు అనుమతి వచ్చే విషయంలో కూడా ప్రభుత్వం అనేక షరతులు విధించింది. ప్రభుత్వ విధానాలకు అనుకూలంగా తీర్మానాలు ఉండాలని వాటిలో ప్రధాన షరతు. రెండో ఆంధ్రమహాసభలో బహిరంగ సభలపై ప్రభుత్వం విధించే ఆంక్షలకు సంబంధించిన గస్తినిషాన్‌ ‌తిర్పన్‌ – ‌సర్క్యులర్‌ ‌నం. 53ను ఉపసంహరించాల్సిందిగా తీర్మానం చేశారు. వెట్టిచాకిరి, భూమిశిస్తు, రైతుల కష్టాలపై చర్చించారు.

వరలక్ష్మమ్మ అధ్యక్షతన జరిగిన ఆంధ్రమహిళా సభలో మరికొన్ని తీర్మానాలు చేశారు. మహిళల విద్య, వైద్య అవసరాలు, గోషాపై నిషేధం, కళా వంతుల వివాహాలకు సంబంధించిన సంస్కరణలు ఇందులో ఉన్నాయి.

మూడో ఆంధ్రమహాసభ

రెండో ఆంధ్రమహాసభలో రాజకీయ తీర్మానాలు చేయకున్నా, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా జరిగాయనే కారణంతో నిజాం ప్రభుత్వం తదుపరి సభకు మూడేళ్లపాటు అనుమతి ఇవ్వలేదు. అనేక అడ్డంకులను సృష్టించింది. వీటిని ఎదుర్కొంటూ 1934 డిసెంబరు 13, 14, 15 తేదీల్లో ఖమ్మంలో మూడో మహాసభలు జరిగాయి. ఈ సభలకు పులిజాల వెంకటరంగారావు అధ్యక్షత వహించారు. ‘తెలంగాణ సర్దారు’ జమలా పురం కేశవరావు ఈ సభలో క్రియాశీల పాత్ర పోషించారు. ఎల్లాప్రగడ సీతాకుమారి అధ్యక్షత వహించిన ఆంధ్ర మహిళా సభకు 3 వేల మంది హాజరుకావడం విశేషం.

నాలుగో ఆంధ్ర మహాసభ

1935 డిసెంబరు 26, 27, 28 తేదీల్లో మాడపాటి హనుమంతరావు అధ్యక్షతన సిరిసిల్లలో నాలుగో ఆంధ్ర మహాసభలు జరిగాయి. ఈ సమావేశాల్లో ఆంధ్ర మహాసభ వ్యవహారాలన్నీ తెలుగులోనే జరగాలని, ఉపన్యాసాలు తెలుగులోనే ఉండాలని నిర్ణయించారు. ఈ మహా సభలో ప్రవేశ పెట్టడానికి వీలులేదని ప్రభుత్వం నిషేధిం చిన తీర్మానాలను ఆంధ్ర మహిళా మహాసభలో ప్రవేశ పెట్టారు. దీనికి మాణిక్యమ్మ అధ్యక్షత వహించారు. మాతృభాషలో విద్య, నిర్భంధ విద్య, బాలికలకు ఉన్నత విద్య, బాల్య వివాహాల నిషేధం, జాగీర్‌ ‌ప్రజల హక్కులు, స్థానిక పాలన తదితర అంశాలపై తీర్మానాలు చేశారు. మరోవైపు ఈ సభలకు వచ్చిన యువకులు ఆంధ్రమహాసభల్లో రాజకీయాంశాలు లేకపోవడంపై ఆసంతృప్తిని వ్యక్తం చేశారు.

అయిదో ఆంధ్ర మహాసభ

1936 డిసెంబరు 15, 16, 17 తేదీల్లో కొండా వెంకటరంగారెడ్డి అధ్యక్షతన షాద్‌నగర్‌లో అయిదో ఆంధ్రమహాసభలు జరిగాయి. దీనికి దాదాపు 10వేల మంది హాజరయ్యారు. ఈ మహాసభలో చేసిన తీర్మానాల్లో చెప్పుకోదగ్గ విశేషాలేమీ లేవు. అన్ని సభలకు వచ్చినట్లే ఈ సభకు కూడా కన్నడ, మరాఠా నాయకులు వచ్చారు. అయితే నాల్గవ మహాసభలో భాషావాదులు ప్రవేశపెట్టిన క్లాజు మూలంగా వారు నోరు మెదపటానికి కూడా వీలులేకపోయింది. చివరకు వారు తమ సందేశాన్ని కూడా ఇవ్వకుండా తిరిగి వెళ్లవలసివచ్చింది. ఆంధ్రమహిళా సభకు బూర్గుల అనంతలక్ష్మమ్మ అధ్యక్షత వహించారు.

ఆరో ఆంధ్ర మహాసభ

1937 డిసెంబరు 6,7,8 తేదీల్లో నిజామా బాద్‌లో జరిగిన ఆంధ్రమహాసభకు మందుముల నరసింగరావు అధ్యక్షత వహించారు. అప్పటివరకు ఆంధ్ర మహాసభను రాజకీయేతర సంస్థగానే నడిపించారు. ఆరో మహాసభ రాజకీయ కార్యాచరణ దిశగా అడుగులు వేసింది. మరాఠా నాయకుడైన కాశీనాథరావు ముఖ్‌ ‌పాల్కర్‌, ‌మౌల్వి గులాం భాషానీ మారాఠీలో మాట్లాడేందుకు ప్రయత్నించగా వ్యతిరేకత వ్యక్తమైంది. రావినారాయణ రెడ్డి జోక్యం చేసుకొని వారిని మాట్లాడించారు. హైదరాబాద్‌ ‌స్టేట్‌లో బాధ్యతాయుతమైన ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా ఈ అంశంపై నిజాం నియమించిన అరావముదు అయ్యంగార్‌ ‌కమిటికి సూచిస్తూ తీర్మానం చేశారు. ఇప్పటి వరకూ ఆంధ్రమహసభలో అంతర్లీనంగా ఉన్న అతివాద, మితవాద భావాలను ఆరో మహాసభలో బహిర్గతమయ్యాయి..

ఏడో ఆంధ్ర మహాసభ

1940లో హైదరాబాద్‌లోని మల్కాపురంలో జరిగిన ఏడో ఆంధ్రమహాసభకు మందుముల రామచంద్రరావు అధ్యక్షత వహించారు. సంస్థానంలో 1938 నుంచి స్టేట్‌ ‌కాంగ్రెసు సత్యాగ్రహోద్యమం ప్రారంభం కావడంతో మహాసభల నిర్వహణలో కాస్త ఆలస్యం జరిగింది.సత్యాగ్రహంలో మందుముల రామచంద్రరావు, రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి పాల్గొన్నారు. సత్యాగ్రహం ద్వారా రాజకీయ చైతన్యాన్ని పొందిన యువకులు మహాసభల్లో మరింత చురుగ్గా పాల్గొన్నారు. ఏడో ఆంధ్రమహాసభ సమావేశాలు అంతకుముందు వాటి కంటే భిన్నంగా జరిగాయి. కమ్యూనిస్టులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సభ నుంచే మితవాదులు, అతివాదు లనే రెండు గ్రూపులు ఏర్పడ్డాయి. సంస్థానంలో రాజకీయ సంస్కరణల కోసం నియమించిన ఆయ్యంగార్‌ ‌కమిటీ సమర్పించిన నివేదికపై చర్చ జరిగింది. ఇందులో కొన్నింటిని తిరస్కరిస్తూ చేసిన తీర్మానం ఓటింగ్‌లో వీగిపోయింది.

ఎనిమిదో ఆంధ్ర మహాసభ

నల్లగొండ జిల్లా చిలుకూరులో 1941లో ఎనిమిదో ఆంధ్ర మహాసభ రావి నారాయణరెడ్డి అధ్యక్షతన జరిగింది. నాయకులు మితవాదులు, అతివాదులుగా చీలిపోవడంతో చిలుకూరు సభలకు ప్రాధాన్యం ఏర్పడింది. అధ్యక్ష ఉపన్యాసంలో ప్రపంచ యుద్ధాలు, అంతర్జాతీయ అంశాలు, పెట్టుబడిదారీ ఆర్థిక విధానాల వల్ల కలిగే నష్టాలు వంటి అంశాలు చోటుచేసుకున్నాయి. కౌలు సమస్య, వెట్టిచాకిరి, రైతుల సమస్యలు, స్త్రీల సమస్యలు లాంటి అంశాలు చర్చకు వచ్చాయి. ఆంధ్ర మహాసభ తరఫున విద్యా వారం (1941 అక్టోబరు 19-25), బేగారి వారం (1941 డిసెంబరు 25-1942 జనవరి 1), రాజకీయ బాధితుల దినం (1941 డిసెంబరు 25) నిర్వహించడం ద్వారా గ్రామాల్లోని రైతులు, కూలీల్లో చైతన్యం నింపారు.

తొమ్మిదో ఆంధ్ర మహాసభ

1942 మేలో వరంగల్‌ ‌జిల్లా ధర్మవరంలో జరిగిన తొమ్మిదో ఆంధ్రమహాసభకు మాదిరాజు రామకోటేశ్వరరావు అధ్యక్షత వహించారు. మిత వాదుల్లో మితవాది మాదిరాజు. ఈ సభలో పరిస్థితులు అతివాదులకు అనుకూలంగా ఉన్నప్పటికీ యువ నాయకుల సహాయ సహకారాలు ఈ సభకు లభించలేదు.

10వ ఆంధ్ర మహాసభ

1943 మే 23, 24, 25 తేదీల్లో హైదరాబాద్‌లో పదో ఆంధ్రమహాసభ జరిగింది. కొండా వెంకట రంగారెడ్డి దీనికి అధ్యక్షత వహించారు. మొదటి సారిగా అధ్యక్ష పదవికి ఈ మహాసభలో పోటీ పడ్డారు. అతివాద నాయకుడు బద్దం ఎల్లారెడ్డి, మితవాద నాయకుడు కొండా వెంకట రంగారెడ్డి మధ్య పోటీ జరిగింది. రంగారెడ్డి విజయం సాధించారు. ఈ మహాసభలతో మితవాదులు, అతివాదుల మధ్య అంతరం తారస్థాయికి చేరింది.

11వ ఆంధ్ర మహాసభ

1944 మార్చిలో భువనగిరిలో జరిగిన పదకొండవ ఆంధ్రమహాసభకు రావి నారాయణరెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సమావేశాల్లో మితవాదుల జోక్యం పెద్దగా లేదు. విజయవాడ ప్రాంతం నుంచి సుమారు వంద మంది కమ్యూనిస్టు నాయకులు, కార్యకర్తలు సభలో పాల్గొన్నారు. ఈ సభలకు 10వేల మంది హాజరయ్యారు. సభలో సభ్యత్వ రుసుమును నాలుగు అణాల నుంచి ఒక అణాకు తగ్గించి మహాసభను ప్రజలకు మరింత చేరువ చేశారు.

ఈ సమావేశాలతో పూర్తిగా కమ్యూనిస్టుల చేతిలోకి వెళ్లిపోయిన ఆంధ్రమహాసభలో చీలిక వచ్చింది. మితవాద నాయకులు మాడపాటి హనుమంత రావు, కొండా వెంకట రంగారెడ్డి, మందుముల నరసింగరావు, రామచంద్రరావు, మాదిరాజు కోటేశ్వరరావు, పులిజాల వెంకట రంగారావు తదితరు జాతీయ ఆంధ్రమహాసభ పేరిట నూతన వేదిక ప్రారంభించారు. వీరు1945లో వరంగల్‌లోని మడికొండలో ఆంధ్ర మహాసభలను నిర్వహించారు.

12వ ఆంధ్ర మహాసభ

ఖమ్మంలో 1945 ఏప్రిల్‌ 26, 27 ‌తేదీల్లో రావి నారాయణరెడ్డి అధ్యక్షతన కమ్యూనిస్టుల నాయకత్వంలోని ఆంధ్రమహాసభ 12వ సమావేశాలు జరిగాయి. ఈ సభలో రైతులకు సంబంధించి అనేక తీర్మానాలు చేశారు. వెట్టిచాకిరిని వెంటనే రద్దు చేయాలని సభ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. నిజాం రాజ్యాన్ని ఎదిరించి, ప్రజారాజ్యాన్ని స్థాపించాలని ఆంధ్ర మహాసభ పిలుపునిచ్చింది. ఈ మహాసభల తర్వాత రాజకీయ పోరాటాలు తెలంగాణ అంతటా వ్యాపించాయి. మరోవైపు సంప్రదింపులకు వీలుగా ఆంధ్ర మహాసభపై 1946 జులైలో ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ సభ తర్వాత కమ్యూనిస్టులు ఆంధ్రమహాసభ ముసుగు తొలగించుకొని క్రమంగా సాయుధ పోరాటంలోకి వెళ్లిపోయారు.

1946లో జాతీయవాదుల నాయకత్వంలోని ఆంధ్ర మహాసభ కందిలో జమలాపురం కేశవరావు అధ్యక్షతన జరిగింది. ఆ తర్వాత నిజాం ప్రభుత్వం స్టేట్‌ ‌కాంగ్రెస్‌పై నిషేధం ఎత్తివేయడంతో ఈ ఆంధ్ర మహాసభ కాంగ్రెస్‌ ‌పార్టీలో విలీనమైంది.

తెలంగాణలో నిజాం పాలనకు వ్యతిరేకంగా సాగిన పోరాట పంధాను ఆంధ్రోద్యమం మలుపు తిప్పింది. కాంగ్రెస్‌, ‌కమ్యూనిస్టు పార్టీలకు ఆంధ్ర మహాసభ రెండున్నర దశాబ్దాల పాటు వేదికగా ఉపయోగపడింది. ఎందరో నాయకులను అందించింది. తెలుగు భాషా సంస్కృతుల పరిరక్షణతో పాటు సామాజిక, సాంఘిక, రాజకీయ చైతన్యం రగిలించ డంలో ఆంధ్రమహాసభలు ఎంతో ఉపయోగపడ్డాయి. హైదరాబాద్‌ ‌స్టేట్‌లో పాటు తెలంగాణ ప్రజల్లో వచ్చిన చైతన్యాన్ని అణచి వేసేందుకు నిజాం ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

ఆగస్టు 15,1947న భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత హైదరాబాద్‌ ‌సంస్థాన పాలకుడు ఏడో నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ ‌స్వతంత్ర రాజ్యంగా ప్రకటించుకున్నాడు. సంస్థానాన్ని భారత్‌ ఈ ‌దశలో విలీనం చేయాలనే డిమాండ్‌లో పోరాడిన ఎంతోమంది నాయకులు, కవులు, కళాకారులు నిర్భంధానికి, చిత్ర హింసలకు గురయ్యారు. ఎందరో అమరులయ్యారు. వీరందరికీ ఆరంభంలో ఆంధ్ర జన సంఘం, తర్వాత కాలంలో ఆంధ్ర మహాసభ స్పూర్తిగా నిలిచాయి. సెప్టెంబర్‌ 17, 1948‌న భారతదేశంలో సంపూర్ణంగా విలీనం కావడంతో హైదరాబాద్‌ ‌సంస్థానంలోని తెలంగాణ, మరాఠ్వాడా, కర్ణాటక ప్రాంతాలు విముక్తమయ్యాయి. ఈ సందర్భంగా వీరందరినీ స్మరించుకుందాం.

About Author

By editor

Twitter
YOUTUBE