– బంకించంద్ర చటర్జీ

తుపాకులు పేల్చమని ఆజ్ఞ ఇవ్వడానికి యజమాని లేడు. ఇంతలో బండి మీద నిలబడి ఉన్న ఒక వ్యక్తి ‘సిపాయిలను నరకండి, చంపండి’ అని అరవసాగాడు. ఈ అరుపుల మధ్య హరినామ సంకీర్తనం కూడా చేస్తూనే ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు భవానందుడు.

అనుకోని విధంగా తమ యజమాని హతుడ వడంతో, సిపాయిలకు మతిపోయినట్లు అయింది. తాము ఏం చేయాలో ఆజ్ఞలు ఇచ్చేవారు ఎవరూ లేరు. ఆత్మరక్షణోపాయం కూడా వారి మనసుకు అందడం లేదు. తేజోవంతులైన దొంగలు అనేక మంది సిపాయిలను చంపివేశారు. బండిలో వున్న ఖజానాకంతటికీ వారు అధిపతులయ్యారు. చావగా మిగిలిన సిపాయీలు ఇక లాభం లేదనుకుని పరుగు లంఘించుకున్నారు.

చివరకు పర్వతం మీద నిలబడి ఉన్న వ్యక్తి కిందికి దిగి వచ్చాడు. అతడు రావడంతోటే భవా నందుడిని కౌగలించుకున్నాడు. భవానందుడు ‘సోదరా! జీవానందుడా! నీ వ్రతం సార్థకం చేసు కున్నావు’ అన్నాడు. జీవానందుడు ‘భవానందా! నీ పేరు సార్థక•మైంది’ అన్నాడు.

ఇప్పుడిక స్వాధీనం చేసుకున్న ధనాన్ని యథా స్థానానికి పంపవలసిన బాధ్యత జీవానందుని పైన పడింది. అతడు తన అనుచరులతో ఆ ఖజానాను తరలించుకు వెళ్లాడు. భవానందుడు ఒంటరిగా నిలుచుండిపోయాడు.

9

బండిమీద నుండి దిగి ఒక సిపాయి చేతిలోనే శస్త్రాన్ని తీసుకుని తాను కూడా యుద్ధంలో దిగవలెనని అనుకున్నాడు మహేంద్రుడు. కాని ఇప్పుడు యుద్ధంలో నిమగ్నులై ఉన్న వారు దొంగల ముఠా వారు మాత్రమే కానీ ఇంకెవరూ కారు. ధనలోభం చేత యుద్ధం చేస్తున్న ఈ దొంగలకు సహాయంగా నిలబడితే అనవసరంగా వారి పాపంలో పాలు పంచుకోవలసి వస్తుంది. ఈ పని ఇష్టంలేక మహేంద్రుడు ప్రత్యక్షంగా జోక్యం కలిగించుకోకుండా మిన్నకుండిపోయాడు. ఇంతలో భవానందుడు వచ్చి అతడికి ఎదురుగా కూర్చున్నాడు.

మహేంద్రుడు ఇలా అడిగాడు : ‘మహాశయా! తమరెవరు?’

‘నేనెవరో తెలుసుకున్నందువల్ల నీకు ఏం ప్రయో జనం?’ అని ఎదురు ప్రశ్నించాడు, భవానందుడు.

మహేంద్రుడు, ‘మీ వల్ల ఇవాళ నాకు విశేషమైన ఉపకారం జరిగింది. ఇంతకంటే ఇంకా ఏం ప్రయోజనం కావాలి?’ అన్నాడు.

‘మీలో ఇంతటి కృతజ్ఞత ఉన్నదని నాకు అని పించడం లేదు. చేతిలో ఆయుధం పట్టుకుని ఏమీ కదలకుండా శిలావిగ్రహంలాగ నిలబడ్డారు. జమీం దారీబిడ్డలు! నెయ్యి-పాలు ఆరగించడంలో తప్ప ఇతర విషయాలలో అంత నైపుణ్యం ఉండదు కదా!’

భవానందుడి మాటలు పూర్తవుతున్న సమయం లోనే మహేంద్రుడు ‘ఈ దారి దోపిడీ ముమ్మాటికీ పాపపుపని! ఇంతకంటే ఇంకేం లేదు’ అన్నాడు అభియోగం మోపుతున్నట్టు, అసహనంతో.

‘అవును. ఇది దారి దోపిడీ పనే! అయితేనేం? మా ద్వారా మీకు కొంత ఉపకారం జరిగింది కదా! మాకూ మీరు కొద్దిపాటి ఉపకారం చేయాలి! దీనిని కాదనగలరా? ఇంకా మా ద్వారా మీకు చాలా మేలు జరగబోతున్నది. సహాయం అందబోతున్నది.’

‘మీరు నాకు ఉపకారం చేసినమాట యదార్థమే. కాని ఇంకా మీ వల్ల నాకు ఎటువంటి ఉపకారం ప్రాప్తిస్తుంది? అసలు దొంగల ఉపకారం పొందటమే తప్పు! ఒక వేళ మీ నుంచి ఏదైనా లబ్ధి కలుగుతుందనే అనుకుందాం. అయిన ప్పటికీ దొంగసొత్తును అంగీకరించ డమే పాపంగానే నేను భావిస్తాను.’

‘మా ఉపకారం పొందటమూ, పొందక పోవటమూ అనేది మీ ఇష్టం. సరే! ఇప్పుడు నావెంట రండి. మీకు నాతో రావడం సమ్మతమే అయితే నాతో రండి. మీ భార్యను, కుమార్తెను చూపి స్తాను. మీరు వారిని కలుసుకోవాలని నా కోరిక!’

‘ఏమన్నారు?’ మహేంద్రుడు నివ్వెరపోయి అన్నాడు. ‘ఏమంటున్నారు మీరు?’ ఉద్విగ్నంగా ప్రశ్నించాడు.

భవానందుడు ఈ ప్రశ్నకు ఏమీ సమాధానం చెప్పకుండా ముందుకు నడక సాగించాడు.

మహేంద్రుడు కూడా అతనిని అనుసరించాడు. అతని మనసులో ఒకటే ఆలోచన వేధిస్తోంది. వీరు ఎటువంటి దొంగలు అయివుంటారు? వీరెవరో వింత విడ్డూరపు చోరులే అనుకున్నాడు.

చంద్రుడు పైకి వచ్చాడు. వెన్నెల ధారలలో తడు స్తున్న ఆ అరణ్యంలో ఇద్దరూ తాపీగా నడుస్తున్నారు. మహేంద్రుడు ఏమీ మాట్లాడడం లేదు. పైకి ఎంత శాంతమూర్తిలాగ ఉన్నా, మనసులో మటుకు కుతూహలం వేధిస్తూనే ఉంది.

అకస్మాత్తుగా భవానందుడు వేరొకరూపాన్ని ధరించాడు. ఏ అహంకార భావనతో ఠీవిగా మహేం ద్రుడిని తూలనాడినాడో, ఇప్పుడు ఆ రూపంలో అతడు లేడు. అతడిని ఆక్షేపించిన పౌరుష ప్రతాప శాలి కూడా కాడు. ఆ నిండు వెన్నెలతో శాంతిశీలి అయిన భూమి అతడి వైఖరిని మార్చి వేసినట్లుంది. అతడిలో పరివర్తన కలిగించింది. భవానందుడు చంద్రుని వలె నవ్వుతూ తయారైనాడు. మహేంద్రుడితో మాట్లాడవలెనని ప్రయత్నం చేశాడు. కాని మహేంద్రుడు నిశ్శబ్దంగానే ఉండిపోయాడు. అందుచేత వేరే దారిలేక భవానందుడు తనలో తాను పాడుకోవడం మొదలుపెట్టాడు.

‘వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలామ్‌

‌సస్యశ్యామలాం మాతరమ్‌!’’

‌మహేంద్రుడు ఈ గానం విని ఆశ్చర్యచకితుడు అయినాడు. అతడికి ఏమీ అర్థం కాలేదు. సుజల, సుఫల, మలయజ శీతల, సస్యశ్యామల అయిన ఈ మాత ఎవరు? మహేంద్రుడు జవాబు దొరకక అడగనే అడిగాడు. ‘ఎవరు ఈ మాత?’

ఈ ప్రశ్నకు ఏమీ సమాధానం ఇవ్వకుండా భవానందుడు ఇలా పాట కొనసాగించాడు.

‘‘శుభ్రజ్యోత్స్నా పులకిత యామినీం

పుల్లకుసుమిత ధృమదళ శోభినీం

సుహాసినీం సుమధుర భాషిణీం

సుఖదాం వరదాం మాతరమ్‌!’’

‌మహేంద్రుడు ‘అయితే ఇది దేశం! తల్లికాదు’ అన్నాడు.

భవానందుడు ‘మాకు దేశం తప్ప ఇంకొక తల్లి తెలియదు. ‘జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ’ మా మాత జన్మభూమి. మాకు మరొక తల్లి తండ్రి లేరు. భార్యా పిల్లలు లేరు. ఇల్లు వాకిలి లేదు. మాకు సర్వమూ దేశమాతే! సుజల, సుఫల, మలయజ, శీతల, సస్యశ్యామల అయిన మాతే మాకు సర్వం.’

మహేంద్రుడికి కొంత అర్థం అయినట్లు అనిపించింది. ‘అయితే – కానీ మిగతా పాట కూడా పాడు’ అన్నాడు.

భవానందుడు పాడాడు :

‘వందే మాతరం

సుజలాం సుఫలాం మలయజ శీతలాం

సస్యశ్యామలాం మాతరం

శుభ్రజ్యోత్స్నా పులకిత యామినీం

ఫుల్లకుసుమిత ధృమదళ శోభినీం

సుహాసినీం సుమధుర భాషిణీం

సుఖదాం, వరదాం మాతరం

సప్తకోటి కంఠ కలకల నినాద కరాలే,

ద్విసప్తకోటి భుజైర్ధుత ఖరకరవాలే,

అబలా కేనో మా! ఏతో బలే!

బహుబల ధారిణీం నమామితారిణీం,

రిపుదళవారిణీం మాతరం!

తుమీ విద్యా, తుమీ ధర్మ

తుమీ హృది తుమీ మర్మ

త్వం హి ప్రాణః శరీరే!

బహుతే తుమీమాం శక్తి

హృదయే తుమీ మా భక్తి

  తోమారయీ ప్రతిమాగడి మందిరే మందిరే।।

త్వంహి దుర్గా దశప్రహర ధారిణీమ్‌

‌కమలా కమలదళ విహారిణీమ్‌

‌వాణీ విద్యాదాయిని నమామి త్వాం,

నమామి కమలాం అమలాం అతులాం

సుజలాం సుఫలాం మాతరం

వందేమాతరం

శ్యామలాం సరళాం సుస్మితాం భూషితాం

ధరణీం భరణీం మాతరమ్‌ ।।

అతడు పాటపాడుతూ రోదిస్తూ వుండడం గమ నించాడు మహేంద్రుడు. మహేంద్రుడు విస్మయుడై ‘ఎవరు మీరు?’ అని అడిగాడు.

భవానందుడు ‘మేము సంతానులము!’ అని బదులు పలికాడు.

‘సంతానులా? అంటే? ఎవరి సంతానులు?’

‘మాత సంతానులము!’

‘సరే! అయితే, సంతానులు దారిదోపిడీలు, దొంగతనాలు, హత్యలు చేసి మాతకు పూజలు చేస్తారా? ఇదెక్కడి మాతృభక్తి!’

‘మేం దొంగతనాలు, దోపిడీలు చేయడం లేదు.’

‘ఇప్పుడేకదా ఖజానా బండి దోచుకున్నారు?’

‘ఇదా దోపిడీ అంటే! ఎవరి రూపాయలు దోచుకున్నామంటావు?’

‘ఎవరిదేం? రాజుగారిదే!’

‘రాజుగారిదా? రాజుగారు వీటినేం సంపా దించారా? వీటిమీద ఆయన అధికారం ఏపాటిది?’

‘రాజుగారి భాగం ఇవి!’

‘ఏరాజైతే రాజ్యపాలన చేయడో, అతనికి పన్నులు విధించే అవకాశం లేదు. ఆంగ్లేయులు మనకు రాజులు ఎట్లా అయినారు?’

‘చూస్తూ ఉండండి. సిపాయీలు మిమ్ము ఎప్పుడో ఒకప్పుడు కాల్చి వేస్తారు!’

‘చూడడం అయిందిగా! మనిషన్న వాడికి ఒక్కసారే చావు! రెండుసార్లు రాదు.’

‘కాని కావాలని మృత్యువును కౌగలించుకోవడం ఎలాంటి వివేకం?’

‘మహేంద్రసింహా! నీవు అందరు మనుష్యుల వంటి వాడవు కాదు. పరిస్థితులు ఎంత అతలా కుతలంగా ఉన్నాయో నీవు గమనించడం లేదు. ఇప్పుడు మన దేశ పరిస్థితి ఎలా ఉంది? తిండికి నోచుకోక, మాన మర్యాదలు కాపాడుకోలేక ఎందరు ఎన్ని రకాలుగా బాధపడుతున్నారో గమనించావా? ధర్మం ఎక్కడుంది? మహమ్మదీయ పాలనలో ధర్మం జరుగుతుందా? మహమ్మదీయులను పారదోలితేనే ఎప్పటికైనా మన ధర్మం నిలబడుతుంది!’

‘ఎలా పారదోలడం?’

‘చంపివేద్దాం!’’

‘నీవు వొక్కడివే ఈ పని చేయగలవా?’

భవానందుడు తిరిగి పాడసాగాడు.

‘సప్తకోటి కంఠ కలకల నినాదకరాలే

ద్విసప్తకోటి భుజైర్ధుత ఖరకరవాలే

అబలా కేనో మా ఏతుబలే!’

మహేంద్రుడు ‘కాని నీవు ఒంటరిగానే కని పిస్తున్నావు గదా!’

‘ఇప్పుడే కదా రెండు వందలమందిని చూశావు!’

‘వారందరూ సంతానులేనా ఏమిటి?’

‘అందరూ సంతానులే!’

‘ఇంకా ఎందరున్నారు?’

‘ఈ విధంగా వేలకొద్దీ ఉన్నారు. ఇంకా పెరుగుతారు కూడాను!’ ‘అలాగే, పెరుగుతారు అనుకుందాం! పది పన్నెండు వేలమంది అవుతారు. అంతమాత్రంచేత మహమ్మదీయులు పారిపోతారా?’

‘ప్లాసీ యుద్ధ సమయంలో ఆంగ్లేయుల సైన్యం ఎంత?’ ‘ఆంగ్లేయులు, వంగ సోదరులు ఒకటేనా ఏమిటి?’

‘ఎలా ఒకటవుతారు? శరీరంలో బలముంటే పిస్తోలు గుళ్లు వడివడిగా వెలువడతాయి!’

‘గుండు శరీరంలో ఒకచోట తగిలితే చాలు, పదిచోట్ల తగలనవసరంలేదు. అటువంటప్పుడు ఒక గుండు విడిస్తే పదిమంది పరుగెత్తుతారు ఎందుకని? ముసల్మానులకు, ఆంగ్లేయులకు ఇదే తేడా! ఆంగ్ల సిపాయీ గుండుకు భయపడి పారిపోడు…. ఇంతకూ నీవు సంతానుడవు అవుతావా?’

‘ముందు భార్యాసుతులను కలుసుకోవాలి. వారిని చూడకుండా ఏమీ చెప్పలేను.’

‘పద. ముందు వారినే చూద్దువుగాని!’

ఇద్దరూ నిశ్శబ్దంగా నడుస్తున్నారు. భవానందుడు తిరిగి ‘వందేమాతరం’ అంటూ పాట అందు కున్నాడు. మహేంద్రుని కంఠం కూడా మంచిదే, అంతేగాక అతడు సంగీతాభ్యాసం కూడా చేశాడు. అతడు కూడా పాడసాగాడు. అలా పాడుతూ ఉండగా తన కళ్ల వెంట సైతం నీళ్లు కారుతూ వుండడం గమనించాడు. మహేంద్రుడు ‘భార్యా పిల్లలను త్యజించనక్కర్లేదంటే, నేనూ ఈ వ్రతం స్వీకరిస్తాను. నాకూ దీక్ష ఇవ్వండి’ అన్నాడు.

‘ఈ వ్రతదీక్ష తీసుకున్నవారు భార్యాపిల్లలను వదిలివేయాలి. నీవు ఈ వ్రతం స్వీకరిస్తే, ఇక కుటుంబాన్ని గురించి చింతించవలసిన అవసరం లేదు. దానికి అవసరమైన ఏర్పాట్లన్నీ ముందే జరిగిపోతాయి. వ్రత సఫలత అయ్యేంత వరకు వారి ముఖదర్శనం చేయగూడదు.’

‘అయితే నేను ఆ వ్రతం స్వీకరించను’ అన్నాడు మహేంద్రుడు.

తెల్లవారింది. జనహీనమైన అడవిలో అంత వరకు అంధకారమయము, శబ్దహీనము అయిన అరణ్యంలో ఇప్పుడు ఆలోకమయ ప్రాతఃకాలంలో ఆనందమయ కాననంలో ‘ఆనందమఠం’లో సత్యా నందస్వామి మృగచర్మం పైన కూర్చుని సంధ్యా వందనం చేస్తున్నారు. ఆయనకు దగ్గరలోనే జీవా నందుడు కూర్చుని వున్నాడు. సరిగ్గా, ఆ సమయంలో మహేంద్రుని వెంట తీసుకుని స్వామి భవానందుడు అక్కడకు వచ్చాడు. బ్రహ్మచారి ఏమీ మాట్లాడకుండా తన సంధ్యావందనంలో లీనమైవున్నాడు. ఎవరికీ ఈ సమయంలో నోరు విప్పి మాట్లాడే ఆలోచన లేదు. సంధ్యావందన కార్యక్రమం పూర్తి అయిన తరువాత అందరూ లేచి నిలబడి ఆయనకు పాదాభి వందనం చేశారు. పాదధూళి స్వీకరించి తమతమ స్థలాలలో కూర్చున్నారు. అప్పుడు సత్యానందుడు చేతి సైగతో భవానందుడిని బయటకు పిలిచాడు. వారిద్దరూ వెళ్లిపోయారు. బ్రహ్మచారి మంద్రస్వరంతో మహేంద్రునితో ఇలా అన్నాడు :

‘నాయనా! నీ దుఃఖం చూచి మాకు చాలా విచారంగా ఉంది. కేవలం దీనబంధుడైన ప్రభువు కృపవల్ల నిన్న రాత్రి నీ భార్యాకుమార్తెలను రక్షించ గలిగాము’… ఇలా ప్రారంభించి ఆయన కల్యాణిని రక్షించిన విధమంతటినీ వినిపించాడు. ఆపైన ‘పద. వాళ్ల దగ్గరకు తీసుకు వెడతాను’ అన్నాడు.

బ్రహ్మచారి ముందు, ఆయన వెనుక మహేం ద్రుడు ఆలయం లోపలకి వెళ్లారు. లోపల ప్రశాంత మైన, విశాలమైన గది ఒకటుంది. ఈ గదిలో ఏముందో మొదట మహేంద్రునకు అర్థం కాలేదు. కాని కొంతతడవు చూచిన మీదట లోపలి దృశ్యం అగుపించసాగింది. ఒక ప్రశాంత చతుర్భుజమూర్తి విగ్రహం ఉంది. శంఖ చక్ర గదా పద్మధారి, కౌస్తుభ శోభితం అయివుంది ఆ మూర్తి. ఎదురుగా సుదర్శన చక్రం స్థాపితమై ఉంది. ఎదురుగా మధుకైటభులు, రక్త ప్రవాహంలో మునిగివున్నట్లు ఒక చిత్రం కనిపిస్తు న్నది. ఎడమవైపు కమల మాలాలంకృత అయి, ముక్తకుంతల లక్ష్మి విచారంతో కూచునివున్న చిత్రం ఉంది. దక్షిణపు వైపు సరస్వతి, పుస్తకం వాద్యయంత్రం దగ్గర పెట్టుకుని రాగ రాగిణులు అయిన చెలికత్తెలు పరివేష్టించి ఉండగా కూర్చుని ఉంది. విష్ణువు అంక స్థలంలో ఒక మోహినీమూర్తి విగ్రహముంది. ఈ మూర్తి లక్ష్మీ సరస్వతుల కంటే సుందరంగా ఉంది, శోభతో ఉంది. గంభీరస్వరంతో బ్రహ్మచారి మహేంద్రునితో ‘‘అంతా చూస్తున్నావా?’’ అన్నాడు.

(సశేషం)

About Author

By editor

Twitter
YOUTUBE