– గోపరాజు విశ్వేశ్వరప్రసాద్
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆధ్వర్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఆవిర్భవించి పట్టుమని పదేళ్లు కూడా కానప్పటికి రాజకీయ క్షుద్ర విద్యల్లో మాత్రం బాగానే రాటుదేలిపోయింది. ఈ విషయంలో వందేళ్లకు పైగా చరిత్ర గల హస్తం, దశాబ్దాల చరిత్ర గల వామపక్షాలు, ఇతర ప్రాంతీయ పార్టీల కన్నా నాలుగాకులు ఎక్కువే చదివింది. అతి తక్కువ కాలంలోనే రాజకీయాన్ని బాగా వంటబట్టించుకుంది. బట్ట కాల్చి ప్రత్యర్థుల మీద పడేయటం వంటి విద్యల్లో అందె వేసిన చేయిగా పేరు తెచ్చుకుంది. గత కొంతకాలంగా ఆప్ రాజకీయ కార్యకలాపాలను పరిశీలించినప్పుడు ఈ అభిప్రాయం కలగక మానదు. తాజాగా తమ పార్టీ శాసనసభ్యులకు విపక్ష భారతీయ జనతా పార్టీ డబ్బు ఆశ చూపి గాలం వేస్తుందన్న ఆ పార్టీ ఆరోపణలను చూసినప్పుడు ఆప్ ఎంతగా ఎదిగిపోయిందో అర్థమవుతుంది. ఇతర విపక్షాలు సైతం ఆప్ రాజకీయం చూసి ముక్కున వేలేసుకుంటున్నాయి. తాము ఎంతగా వెనకబడిపోయామో, తమ కళ్ల ముందు పుట్టి పెరుగుతున్న పార్టీ ఎంత ముందుకు వెళుతుందో చూసి ఆశ్చర్యపోతున్నాయి!
ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఆర్భాటంగా చెబుతున్నట్లు ఆ పార్టీ ఏమీ సుద్దపూసేమీ కాదు. ఆ పార్టీ నాయకులు అంతకన్నా కాదు. కేజ్రీవాల్ చుట్టూ ఉన్న వాళ్లు సత్యహరిశ్చంద్రు లేమీ కాదు. వారిలో కొందరు అనేక అభియోగాలు ఎదుర్కొంటున్నారు. అవినీతి ఆరోపణలు వారిని చుట్టుముడుతున్నాయి. మద్యం విధాన రూపకల్పనలో అవకతవకలు జరిగాయంటూ ఆ పార్టీ సీనియర్ నేత, స్వయంగా కేజ్రీవాల్‌కు కుడిభుజం వంటి ఉప ముఖ్యమంత్రి మనీస్ సిసోదియా సీబీఐ (కేంద్ర దర్యాప్తు సంస్థ) కేసును ఎదుర్కొంటున్నారు. తాజాగా ఆయనపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసు నమోదు చేసింది. ప్రాథమిక దర్యాప్తు నివేదిక (ఎఫ్‌ఐఆర్)లో సీబీఐ పేర్కొన్న మేరకు, నగదు అక్రమ చలామణి నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ)లోని వివిధ సెక్షన్ల కింద సిసోదియాను విచారించేందుకు ఈడీ రంగంలోకి దిగింది. ఈ విషయంలో స్వయంగా రంగంలోకి దిగిన లెఫ్టినెంట్ గవర్నర్ విజయ్‌కుమార్ సక్సేనా సీబీఐ దర్యాప్తునకు ఆదేశించారు. ప్రాథమిక ఆధారాలు లేకుండా ఏ గవర్నరూ దర్యాప్తునకు ఆదేశించరన్న విషయాన్ని గుర్తించాలి.
దీంతో ఆప్ నాయకత్వానికి దిక్కుదరి తోచడం లేదు. ముచ్చెమటలు పడుతున్నాయి. తమ అవినీతి బాగోతం ఎక్కడ బయటపడుతుందోనన్న ఆందోళన ఆ పార్టీని వెంటాడుతోంది. సాధారణంగా ఎవరిపైన అయిన ఆరోపణలు వచ్చినప్పుడు సంబంధిత నాయ కుడు వాటిని ఖండిస్తారు. ఎలాంటి విచారణకైనా సిద్ధమని సవాల్ విసురుతారు. కానీ ఆప్ నాయకులు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ఆరోపణలకు సరైన సమాధానం ఇవ్వలేక విపక్ష భారతీయ జనతా పార్టీపై ఎదురు దాడి చేస్తున్నారు. ఆ పార్టీపై లేనిపోని అభాండాలు వేస్తున్నారు. అవి నవ్వు తెప్పించే విధంగా ఉన్నాయి. బీజేపీలో చేరడానికి సిసోదియా నిరాకరించినందువల్లే కేంద్రం ఆయనపై సీబీఐ, ఈడీలను రంగంలోకి దించిందని ఆప్ అధికార ప్రతినిధి, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ ఆరోపణలు చూసినప్పుడు ఆశ్చర్యం కలగక మానదు. జైలుకు వెళ్లడానికైనా సిసోదియా సిద్ధపడతారు తప్ప బీజేపీకి ఆయన తలవంచరని ఆయన స్పష్టం చేశారు. పార్టీ అధినేత అరవింద కేజ్రీవాల్ మరింత ముందడుగు వేసి మాట్లాడిన తీరు వెగటు పుట్టించే విధంగా ఉంది. ఈ ఏడాది డిసెం బర్‌లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయని, ఆ రాష్ట్రంలో తమ పార్టీకి రోజురోజుకు పెరుగుతున్న ఆదరణ చూసి కమలం పార్టీలో ఆందోళన మొదలైందని, అందుకే తమ పార్టీ నాయకులను లక్ష్యంగా దాడులకు పాల్పడుతోందని కేజ్రీవాల్ ఆరోపించారు. అంతేకాక గుజరాత్ ముఖ్యమంత్రిని సైతం మార్చే ఆలోచన బీజేపీ చేస్తుందని ఆయన ఆరోపించడం హాస్యాస్పదంగా ఉంది. గుజరాత్ ఎన్నికలకు, సిసోదియాకు సంబంధమేంటో ఎంత ఆలోచించినా ఎవరికీ అర్థం కాదు. దాదాపు మూడు దశాబ్దాలుగా గుజరాత్‌లో అధికారంలో ఉన్న కమలం పార్టీ నిన్నగాక మొన్న వచ్చిన ఆప్‌ను చూసి భయపడుతుందని చెప్పడం అతిశయోక్తి అవుతుంది. కాంగ్రెస్ అవినీతి, అసమర్థ పాలనతో, ప్రధాన ప్రతిపక్షమైన అకాలీదళ్ కుటుంబ పాలనతో విసిగివేసారిన పంజాబ్ ప్రజలు వేరే ప్రత్యామ్నాయం లేక మొన్నటి ఎన్నికల్లో ఆప్‌కు పట్టం కట్టారు. అంతమాత్రాన గుజరాత్‌లోనూ అలా జరుగుతుందని భావించడం భ్రమే అవుతుంది. ఏటా ప్రభుత్వాలను మార్చే పద్ధతిని పాటించే పంజాబ్‌కు, మంచి పాలన అందించే పార్టీని ఆదరించి అక్కున చేర్చుకునే గుజరాత్ ప్రజలకు పోలిక లేదన్న విషయాన్ని కేజ్రీవాల్ ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది. అదే సమయంలో కేజ్రీవాల్ గ్రహించాల్సిన మరో ముఖ్య విషయం ఒకటుంది. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం జరిగిన సంగ్రూర్ పార్లమెంటు స్థానానికి జరిగిన ఉపఎన్నికలో ఆప్ అడ్రసు కోల్పోయింది. అక్కడ ఖలిస్తానీవాది అయిన సిమ్రన్ జిత్‌సింగ్ మాన్ గెలిచారు. ఇది ఆప్ సిట్టింగ్ స్థానం. అదీ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ సీఎంగా బాధ్యతలు చేపట్టేవరకు ప్రాతినిథ్యం వహించిన పార్లమెంటు స్థానం. అంచనాల మేరకు పనిచేయక పోతే ప్రజలు ఎంతటివారినైనా ఉపేక్షించరనడానికి ఇంతకుమించిన మరో నిదర్శనం అక్కర్లేదు. అక్కడి దాకా ఎందుకు 2014 నుంచి ఢిల్లీని ఏలుతున్న ఆప్‌కు 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఎటు వంటి చేదు ఫలితాలు ఎదురయ్యాయో అవలోకనం చేసుకుంటే వాస్తవాలు బోధపడతాయి. 2014, 2019ల్లో ఢిల్లీలోని మొత్తం ఏడు పార్లమెంటు సీట్లను బీజేపీ గెలుచుకున్న సంగతి తెలిసిందే. రెండు ఎన్నికల్లోనూ ఆప్ కనీసం ఒక్క సీటూ గెలుచుకోలేక పోయిన సంగతీ తెలిసిందే. ఈ విషయాలు తెలిసీ తెలియనట్లు నటిస్తోంది ఆప్.
ఇంతటితోనే ఆప్ నటన ఆగిపోలేదు. తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కమలం పార్టీ ప్రయత్ని స్తోందని ఆ పార్టీ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ ఆరోపించడం మరింత హాస్యాస్పదంగా ఉంది. ఒక్కో శాసనసభ్యుడికి బీజేపీ రూ. 20 కోట్లు ఎర చూపిందని ఆయన ఆరో పించారు. మోదీకి కంట్లో నలుసుగా మారిన కేజ్రీవాల్‌ను రాజకీయంగా దెబ్బతీసేందుకు కమలం పార్టీ సర్వశక్తులూ ఒడ్డుతోందని ఆయన ఆరో పించారు. మా ఎమ్మెల్యేలు అజయ్ దత్, సంజీవ్ ఝూ, సోమ్‌నాథ్ భారతి, కులదీప్ కుమార్‌లతో సన్నిహిత సంబంధాలున్న కొందరు నేతలతో బీజేపీ నాయకులు సంప్రదింపులు జరిపారని, పార్టీ మారితే ఒక్కొక్కరికి రూ. 20 కోట్ల ఎర చూపారని సంజయ్ సింగ్ ఆరోపించారు. ఇతర శాసనసభ్యులను తీసుకు వస్తే రూ.25 కోట్ల వంతున ఇస్తామని, లేనట్లయితే మనీశ్ సిసోదియా మాదిరిగా సీబీఐ, ఈడీ కేసులను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారన్నారు. విలేకరుల సమావేశంలో బీజేపీ సంప్రదించిందని చెబుతున్న ఆప్ శాసనసభ్యులు సైతం పాల్గొనడం విశేషం. ఆప్ శాసనసభ్యులు అవసరమైతే ప్రాణ త్యాగానికైనా సిద్ధపడతారు తప్ప అమ్ముడుపోరని చెప్పడం నాటకీయం తప్ప మరొకటి కాదు. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో బీజేపీ నేతలు చెప్పాలని డిమాండ్ చేయడం మరో విశేషం. ఆరోపణలు చేసేది వారే, వివరణలు అడిగేదీ వారే కావడం ఇక్కడ ప్రత్యేకత. ఆప్ శాసనసభ్యులను బీజేపీ నాయకులు ప్రలోభ పెట్టారని ఆరోపిస్తున్నారు. ఆ శాసనసభ్యులు ఎవరో చెబుతున్నారు. అదే సమయంలో వారిని ఎవరు సంప్రదించారో వారినే అడిగితే తెలిసిపోతుంది. అంతేతప్ప మరెవరిపైనో బట్ట కాల్చివేయడం, బురద జల్లడం సరైన విధానం కాదు. ఈ విషయాన్నే బీజేపీ సూటిగా ప్రశ్నించింది. డబ్బులు ఎవరు ఇస్తామని చెప్పారో, వారి పేరు ఎందుకు వెల్లడించరు? ఎందుకు వెనకాడుతున్నారని ఆ పార్టీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర ప్రశ్నించారు. ఇందుకు ఆప్ నుంచి సమాధానం కరవైంది. బహుశా మద్యం మాఫియా నుంచి ఆప్ శాసనసభ్యులకు ఆఫర్ వచ్చి ఉంటుందని సంబిత్ ఆరోపించారు. ఢిల్లీ అసెంబ్లీలో మొత్తం 70కిగాను ఆప్‌కు 62మంది, బీజేపీకి 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 8 మంది ఎమ్మెల్యేలున్న పార్టీ ప్రభుత్వాన్ని ఎలా కూల్చగలదో ఎవరికీ అర్థం కాదు. ఆప్‌లో సమాంతరంగా చీలిక వస్తే తప్ప అది సాధ్యం కాదు. నిజంగా అలా జరిగితే అది పార్టీలో అంతర్గత తిరుగుబాటు అవుతుంది తప్ప శాసనసభ్యులకు ఎర వేయడం కాదు. ఈ విషయాలన్నీ తెలిసీ ఆప్ అద్భుతంగా నటిస్తోంది.
ఇప్పటికే తమ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్టుతో ఆప్ సతమతమవుతోంది. ఆయనపై వచ్చిన ఆరోపణలను తిప్పికొట్టలేక ఇబ్బంది పడుతోంది. తాజాగా సిసోదియా వ్యవహారం వెలుగులోకి రావ డంతో గత్యంతరం లేక ఎదురుదాడికి దిగుతోంది. మనీ లాండరింగ్ కేసులో సత్యేంద్ర జైన్ అరెస్టయిన సంగతి తెలిసిందే. కోల్‌కతాకు చెందిన ఓ కంపెనీకి సంబంధించిన హవాలా లావాదేవీల వ్యవహారంలో ఆయన్ను అరెస్టు చేశారు. ఆయనకు చెందిన రూ.4.81 కోట్ల ఆస్తులను ఎటాచ్ చేశారు. కేజ్రీవాల్ మంత్రివర్గంలో ఆయన వైద్య ఆరోగ్య, విద్యుత్, గృహ నిర్మాణ, పీడబ్ల్యూడీ, పరిశ్రమలు, పట్టణాభివృద్ధి, నీటి పారుదల వంటి కీలక శాఖలకు సారథ్యం వహిం చారు. ప్రస్తుతం ఆయన జైల్లో ఉన్నారు. ఇలాంటి గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటూ, దిక్కతోచక అనవసరంగా బీజేపీపై అభాండాలు వేస్తోంది ఆప్. దేశంలోని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలను పడగొట్టేందుకు బీజేపీ రూ.6300 కోట్లను వెచ్చించిందని కేజ్రీవాల్ ఆరోపించారు. ఇప్పటివరకు 277 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిందన్నారు.
ఆరోపణలతో చెలరేగిపోతున్న కేజ్రీవాల్ అసలైన మద్యం విధానానికి సంబంధించి లేవనెత్తిన ప్రశ్నలకు మాత్రం సమాధానం ఇవ్వడం లేదు. ఆయన మౌనం మద్యం విధానంలోని ‘లొసుగులను’ సూచిస్తోందని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు ఆదేశ్ గుప్తా విమర్శించారు. కేజ్రీవాల్ ఆరోపణలను దీటుగానే ఆ పార్టీ తిప్పి కొట్టింది. కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ఆడలేక మద్దెల ఓడన్నట్లు కేజ్రీవాల్ తన శాసనసభ్యులను కాపాడు కోలేక బీజేపీపై ఎదురుదాడి చేస్తున్నారని విమర్శిం చారు. సిసోదియాపై ఆరోపణలకు ఆధారాలు లేనట్లయితే కోర్టే ఆ విషయాన్ని నిర్ధారిస్తుంది. నిర్దోషిగా బయటపడతారు. అప్పటిదాకా వేచి చూసే ఓపిక లేక ఎదురుదాడి చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. జైన్, సిసోదియా వ్యవహారం ఆప్ మెడకు చుట్టుకునే ప్రమాదం లేకపోలేదు.
వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్