చరిత్రనీ, సామాజిక పరిణామాలనీ సృజనాత్మక పక్రియతో విశ్లేషించడం క్లిష్టమైన అభిరుచి. చారిత్రకతకు లోటు లేకుండా, విశ్వసనీయతకు భంగం రాకుండా కాలగమనాన్నీ, ఆయా ఘటనలనీ సఫలీకరించడం సామాన్యమైన సంగతి కాదు. ‘ది ఇన్‌ ‌సైడర్‌’‌లో పి.వి. నరసింహారావు దీనిని సునాయాసంగా సాధించారు. స్వాతంత్య్రోద్యమ తుది అంకాన్ని ఆవిష్కరించుకుంటున్న సమర భారతదేశ చరిత్రనూ, హైదరాబాద్‌ ‌సంస్థానంలో (దీనికే రచయిత పెట్టిన పేరు అఫ్రోజాబాద్‌) అదే కాలంలో చోటు చేసుకున్న విశిష్టమైన అంశాలను, పరిణామాలను పి.వి. ఈ ‘ఆత్మకథాత్మక నవల’లో ఆవిష్కరించారు. కథానాయకుడు ఆనంద్‌ ‌పాత్ర ద్వారా ఇవన్నీ కళ్లకు కడతారు రచయిత.

నిజాం సంస్థానం సామాజిక దృశ్యం, హిందూ-ముస్లిం సంబంధాలు, నిజాం సంస్థానంలో అధిక సంఖ్యాకులైన హిందువుల ద్వితీయ శ్రేణి పౌరసత్వం, పర్షియా ఆధిక్యం, ప్రజల భాష తెలుగుకు ఎదురైన నిరాదరణ, ఆచారాలు, అణచివేత, వెట్టిచాకిరి వంటి అంశాలను నవల తొలి అధ్యాయాలలో రచయిత స్పృశించారు. ఏ అంశాన్నయినా చరిత్రలో దాని ప్రాధాన్యం, సామాజిక సాంస్కృతిక పరిణామంలో అది నిర్వహించిన భూమికను పరిచయం చేస్తూనే, కళ్లకు కట్టినట్టు చిత్రించారు. అవి మతం ప్రాతిపదికగా నిజాం రాజ్యంలో సాగుతున్న అరాచకాలే.

ఈ నవలా నాయకుడు ఆనంద్‌ను ప్రభావితం చేసిన నాటి సామాజికాంశాలు సమీక్షించుకోదగినవి. అవన్నీ ఆనంద్‌ను మాత్రమే ఆలోచింపచేసినవి కాదు. కథా కాలానికి కొన్ని దశాబ్దాల ముందు వరకు భారతీయ సమాజాన్ని ప్రభావితం చేసిన అంశాలు కూడా అవే. కథాకాలం తరువాతి యుగాన్ని ప్రభావితం చేసినవీ ఆ అంశాలే. వాటి ప్రతిధ్వనే నిజాం మీద తిరుగుబాటు.

ఇక ఇతివృత్తం దగ్గరకు వస్తే- భారతదేశ పెద్ద సంస్థానాలలో ఒకటైన అఫ్రోజాబాద్‌లో ఒక గ్రామం అనంతగిరి. ఆనంద్‌ ‌సొంతూరు అదే. దేశాన్ని స్వాతంత్య్రేచ్ఛ ఒక ప్రభంజనంలా ఊపేస్తుంటే, వెన్నులో వణుకు పుట్టిన నవాబు మరింత పెట్రేగి పోయిన కాలాన్ని రచయిత పరిచయం చేశారు. నిజాం స్వాతంత్య్రోద్యమం వేడితో ఉన్న మిగిలిన భారతావనితో సంస్థానానికి ఉన్న సంబంధాలు కత్తిరించేశాడు. ఆ రాజ్యంలో రైళ్లు ఆగవు. రేడియోలు మోగవు. అన్నీ ఆంక్షలు. కానీ నవాబు గుర్తించ లేకపోయిన వాస్తవం ఒకటి ఉంది. రాజకీయ కార్యాచరణ నిషిద్ధమైనపుడు సాంస్కృతిక అభివ్యక్తి అనివార్యమవుతుంది. అనంతగిరిలోనూ అదే జరిగింది. మిగిలిన దేశంతో ఉన్న సాంస్కృతిక అనుబంధాన్ని మాత్రం నవాబు విచ్ఛిన్నం చేయలేకపోయాడు. ముఖ్యంగా మెజారిటీ ప్రజల భాష విషయంలో.

అఫ్రోజాబాద్‌లో దేశభాషలకు విలువలేదు. కాని ప్రజలకు వినోదాన్నిచ్చే కళారూపాలు దేశభాషలోనే ఉంటాయి. కమ్మగా పాడుకునే పద్యాలూ ఆ భాషలోనే వినిపించేవి. అయినా, ప్రజలు ఇంతగా ఆరాధించే ఆ భాష పాలకుల దృష్టిలో అనాగరికమైనది. ఇక్కడి ప్రజలతో, సాహిత్యంతో, సంస్కృతితో ఎలాంటి సంబంధం లేని పర్షియన్‌కు రాచమర్యాద. విద్య లేనివాడు కాదు, పర్షియన్‌ ‌రాని వాడు వింత పశువు. ఇది ప్రజలకు ఆగ్రహం, మనస్తాపం కలిగించేది. కొన్ని కొన్ని రచనలూ, భావాలూ సంస్థానంలో ప్రవేశించడం- ఇంకా చెప్పాలంటే వాటిని గురించి ప్రస్తావించడం కూడా దాదాపు ‘రాజద్రోహం’. ప్రధానంగా జవాహర్‌లాల్‌ ‌నెహ్రూ రచనలకు అసలు ప్రవేశం లేదు. ఆయన రచనలకు అటు ఒక్క అడుగు దూరంలో విద్రోహవాదం, ఇటు మరో అడుగు దూరంలో ఉగ్రవాదం ఉంటాయని నవాబుగారి వీర విధేయులు దృఢాభిప్రాయం. ఇలాంటి నిర్బంధం, వెనుకబాటుతనాలకు తోడు పేదరికం సంస్థానంలో సాధారణ దృశ్యం. శరీరం మొత్తం గుడ్డ కప్పుకో గలిగిన స్తోమత చాలా తక్కువమందికే ఉన్నది.

పాకిస్తాన్‌ ఏర్పడడం తథ్యమన్న భావన తలెత్తిన తరువాత  హిందూ ముస్లిం సంబంధాలలో వస్తున్న మార్పులను పీవీ అక్షరబద్ధం చేసిన తీరు చరిత్రాత్మకంగా ఉంటుంది. సామాజిక, సాంస్కృతిక అనుబంధంతో పాటు, అక్కడక్కడా ఈ రెండు మతస్థుల మధ్య తొలుత బంధుత్వాన్ని కూడా చూసిన ఆనంద్‌, ‌కాలక్రమేణా వారు కత్తులు దూసుకోవడాన్ని చూడవలసి వస్తుంది. అటు భారత్‌  ‌రిపబ్లిక్‌గా అవతరిస్తున్న కాలంలో, ఇటు నవాబు పీడ విరగడవుతున్న కాలంలో చిత్రంగా ఈ రెండు మతాల మధ్య అగాధం పెరిగిపోవడం కూడా ఆనంద్‌ ‌గమనిస్తాడు. ‘ముందు ముందు దేశంలో సామరస్య జీవనాన్ని దారుణంగా దెబ్బతీయబోతున్న వేర్పాటువాదం తొలి సంకేతాలు ఆ మార్పులలో కనిపించాయి’. ఆనంద్‌ ‌గమనించిన ఆ మార్పులు  ఇలా ఉన్నాయి.

భారత్‌ ‌రిపబ్లిక్‌ అయినప్పటికీ రాజు ముస్లిం కాబట్టి, రాజ్యంలోని ప్రతి ముస్లిమూ రాచరికంలో భాగం అన్న ఆధిక్య భావన కనిపించింది. ఒకనాడు దసరా, కృష్ణాష్టమి, రెండు మతాల వాళ్లు కలసి చేసుకునేవారు. పీర్ల పండుగను హిందువులూ తమ పండుగ వలెనే గౌరవించేవారు. కొత్త పరిణామంలో ‘విగ్రహారాధనపై ఆధారపడి జరిపే హిందువుల పండుగల్లో ముస్లింలు పాలు పంచుకోవడం ఇస్లాం ఒప్పుకోద’ని కొందరు మత గ్రంథాన్ని ఉటంకిస్తూ ఉద్ఘాటించడం ప్రారంభించారు. ‘అంతేకాదు, ఉమ్మడి సంప్రదాయాలని కాపాడుకునే సాహసం క్రమంగా వాళ్లలో సన్నగిల్లుతోంది.’  ఇది కూడా ఆనంద్‌ ‌గ్రహించాడు. హిందువుల పండుగలు హిందువులే జరుపుకోవాలని ఓ ముస్లిం పెద్ద ఆదేశించడమూ ఆనంద్‌ ‌వింటాడు. ఇస్లాంలోని కొన్ని ఆచారాలను చూసి అతడు ‘దిగ్భ్రమ’ చెందుతాడు కూడా. మతాంతరీకరణలు ఎక్కువయ్యాయి. మల్లికార్జున్‌ ‌రాత్రికి రాత్రి మహ్మద్‌గా మారిపోతున్నాడు. అంతవరకు లేని దూకుడు ఇలా మతం మారిన వారిలో ఇంకో పరిణామం.

చాపకింద నీరులా ప్రవేశించిన ఈ మార్పులన్నీ, పట్నంలో ఉద్యోగం చేస్తూ సెలవు మీద ఇళ్లకు వస్తున్నవారు తెచ్చినవే. నిజానికి ఇలాంటి మత విభజనకు పల్లెలు దూరంగా ఉన్నాయి. పట్టణాలలో మాత్రం స్ఫుటంగా ఉంది. శిథిలమైన మసీదులు మరమ్మతులకు నోచుకున్నాయి.

చర్యకు ప్రతిచర్య ఉంటుంది. అదే సమయంలో కొన్ని హిందూ సంస్థలు పుట్టుకొచ్చాయి. దూషణ ప్రతిదూషణలు మొదలైనాయి. ప్రతి హిందువుకు ప్రతి ముస్లిం సహజ శత్రువన్న గాఢమైన అభిప్రాయం నెలకొనడం మొదలయింది. ఈ నేపథ్యంలోనే నిజాం రాజ్యంలోని అధికారుల జులుం విజృంభించింది. ఆఖరికి రహదారి మీద ఎద్దుల బండిని తప్పించడం దగ్గర వచ్చిన చిరు కలహంలో కూడా అధికారులు రాజద్రోహాన్ని చూడడం ప్రారంభించారు. ‘‘హిందువులంతా కాంగ్రెస్‌లో చేరిపోయి రాజును కూలద్రోయాలనుకుంటున్నారు’’ అంటాడు కోశాధికారి. కేవలం రాజోద్యోగి బండి ముందు పోవడానికి వీలుగా తన ఎద్దుల బండిని తప్పించనందుకే ఆనంద్‌ ‌రాజద్రోహం ఆరోపణను ఎదుర్కొంటాడు. నవాబు మతానికి చెందిన అధికారుల పొగరు ఇలా ఉంటే, ఆ నవాబు ప్రాపకం పొందిన కొందరు అగ్రకుల హిందువుల ప్రవర్తన కూడా ఆనంద్‌కు జుగుప్స కలిగిస్తుంది. తిరునామాలతో ఆపాదమస్తకం భక్తి తొణికిస లాడుతూ కనిపించే ఓ మేనేజర్‌ను ఆకలితో ఏడుస్తున్న తన పసిబిడ్డకు పాలు పట్టి రావడానికి ఓ తల్లి అనుమతి కోరడం కూడా సహించరాని క్రమశిక్షణా రాహిత్యంగా కనిపిస్తుంది. ఆ స్త్రీ రెండు చెంపలు అదే పనిగా మేనేజర్‌ ‌వాయించడం ఆనంద్‌ ‌కంట పడుతుంది. గుక్కపట్టి ఏడుస్తున్న చిరుప్రాణానికి కాస్త సాంత్వన కలిగించి వస్తానని ఆమె కోరడమే పాపమైపోయింది. అధికార మదాన్నీ, మగ దురహంకారాన్నీ జమిలిగా ప్రదర్శిస్తూ, ఆమె పాలిండ్ల మీద వ్యాఖ్యలు చేస్తాడు.

బండికి దారి ఇవ్వడం, చిన్నారికి పాలు ఇవ్వడాన్ని కూడా నిషేధించడం- ఈ రెండు ఘటనలు ఆనంద్‌ను కదిలిస్తాయి. అందుకే అసలు ఈ వ్యవస్థను నేలమట్టం చేయాలని భావించే శక్తులలో ఒకడిని కావాలని నిర్ణయించుకుంటాడు. అఫ్రోజాబాద్‌ ‌రాజుకు వ్యతిరేకంగా జరుగుతున్న సాయుధ సమరంలో సైనికుడవుతాడు.

వెనుకబాటుతనం, కదలిక తేలేని విద్య, బాల్య వివాహాలు వంటి దురాచారాలున్న వ్యవస్థల మధ్య పెరిగిన అణచివేత మీద తిరుగుబాటు చేయవలసిన అవసరాన్ని గొప్పగా గుర్తించిన తరానికి ఆనంద్‌ ‌ప్రతీకగా నిలుస్తాడు.

ఇందులో కథా వస్తువు కల్పితం కాదు. సమకాలీన ఘటనల సమాహారం. నిజానికి ఇందులో ఆనంద్‌ ‌పాత్ర రచయితదే కూడా.

– జాగృతి డెస్క్

About Author

By editor

Twitter
YOUTUBE