సెప్టెంబర్‌ 7 ‌వామన జయంతి

విశ్వజిత్‌ ‌యాగంతో త్రిలోకాధిపత్యం సాధించి చెలరేగి పోతున్న బలి చక్రవర్తిని కట్టడి చేయడానికి అదితి కశ్యప దంపతులకు శ్రీ మహావిష్ణువు పుత్రుడిగా ఉదయించాడు. ఎన్నో సుగుణాలను ఒక దుర్గుణం అతిక్రమిస్తుందనేం దుకు కూడా వామనాతార ఆవిర్భావ కారణాన్ని ఉదాహరణగా చెబుతారు. బలి పాలన సుభిక్షమైనదని, సకాలంలో వానలు కురిసి ధనధాన్యాలు సమృద్ధిగా ఉండేవని, అన్ని వర్గాల వారు సుఖ శాంతులతో జీవించే వారని శ్రీమద్భాగవతం చెబుతోంది. దాతృత్వం, ఇచ్చిన మాట కోసం గురువు శాపాన్ని భరించి జీవితాన్ని త్యాగం చేయడం లాంటి సత్‌ ‌ప్రవర్తకుడి వినాశనానికి శ్రీహరి అంశ వటువుగా రావడానికి బలీయకారణం ఉందని ఆధ్యాత్మికవాదులు చెబుతారు. దైత్యుల బలం సన్నగిల్లి తన పుత్రులు దేవతల బలం పెరగాలని అదితి చేసిన అభ్యర్థనతో బలి గర్వభంగానికి శ్రీమన్నారాయణుడు వామనుడిగా అవతరించాడు. బలి తన తాత ప్రహ్లాదుడి విష్ణుభక్తి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నప్పటికీ సాత్విక అహంకారాన్ని వీడలేకపోయాడు. దానిని రూపు మాపడమే ఈ అవతార పరమార్థం. దానిని అటుంచితే, వామనుడి సందేశంలో, బలి-వామనుల సంభాషణలో మానవళికి ఉపకరించే ఎన్నో అంశాలు కనిపిస్తాయి.

బలి చక్రవర్తి మంచి పాలకుడు, మహాదాత. అయినా అధికార వ్యామోహాన్ని జయించ లేక పోయాడు. ఇంద్రపదవి ఆర్జనతో అహం పెరిగింది. అమరావతిని వశపరచుకున్నాడు. దేవతలు భయకంపితులై అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దేవ, రుషిగణాల వినతిపై, పరిస్థితిని చక్కదిద్దేందుకు శ్రీమన్నారాయణుడికి మరో అవతారం అనివార్య మైంది. అదితి కశ్యప దంపతులకు భాద్రపద శుద్ధ ద్వాదశి నాడు వామనుడుగా జన్మించాడు. ఉప నయన వయస్కుడిగానే అవతరించాడు. కశ్యపుడు ముంజి (మొలతాడు), దేవగురువు బృహస్పతి యజ్ఞోపవీతం, భూదేవి జింకచర్మం, సరస్వతి జప మాల, కుబేరుడు భిక్షాపాత్ర ప్రసాదించగా, సాక్షాత్‌ ‌గాయత్రీ మాత తన మంత్రాన్ని ఉపదేశించింది.

బలికి బలం, బలహీనత ‘దాన’గుణమేనని చెబు తారు. శ్రీహరి తన కార్యసాధనకు చతుర్విధోపాయాల లోని రెండవది ‘దాన’ గుణాన్ని ఎంచుకున్నాడు. బలి అశ్వమేధ యాగం చేస్తున్న నర్మద నదీతీరంలోని ‘భృగుకచ్ఛం’అనే ప్రదేశానికి చేరాడు. చక్రవర్తి

ఆ వటువును సాదరంగా ఆహ్వానించాడు. వామనుడు ఆయనను సమీపిస్తూనే, ‘స్వస్తి జగత్రయీ భువన శాసన కర్తకు…’ అనే ఆశీర్వచనంలో ‘ముల్లోకాలను శాసించగల నీకు మంగళం’ అంటూనే, ‘ఆ శాస నానికి, నీకూ ఇక చెల్లు (స్వస్తి) చీటీ’ అనే అంతరార్థం స్ఫురిస్తుంది. అతిథి మర్యాదల అనంతరం బలి,‘ఏమి కావాలో’ కోరుకోమన్నాడు. మణులు, మాణిక్యాలు, రాజ్యం.. ఇలా అనేకానేకాలు ఇవ్వజూపాడు. దానికి ఆ వటువు ‘వరదాతలలో పుంగవుడివైన నీ నుంచి ‘ఈషణ్మాత్రం’ (కొంచెం) భూమిని, అదీ మూడడ గులు కోరుతున్నాను’ అని బదులివ్వడంతో బలి ఆశ్చర్యపోయాడు. ‘ఏదైనా, ఎంతైనా ఇవ్వగల నా దగ్గర ఇంత అల్పమైన కోరికా? గ్రహీత దాత స్థాయి నైనా పరిగణించాలి కదా?’ అనడంలో సాత్వికాహం కారం ధ్వనించింది. విప్రవటుడు మాత్రం తన మాట మీదే నిలిచాడు. తృప్తికి మించిన సంపదలేదు. ‘సంతుష్టుడీ మూడు జగముల బూజ్యుండు, సంతోషికెప్పుడు జరుగు సుఖము’. కానీ ఆ తృప్తే మనిషిలో కరవవుతోంది ‘ప్రాప్తంబగు లేశమైన బదివేలనుచున్‌ఁ ‌దృప్తిం జెందని మనుజుడు సప్తద్వీప ములనైనన్‌ఁజక్కంబడునే’… (ప్రాప్తం కొద్దీ దక్కిన దానితో తృప్తిపడని వాడు ఏడు ద్వీపాలలోని భూమిని ఇచ్చినా తృప్తి పడలేడు) అని అన్నాడు.. ఎన్ని సంపదలు పోగుపడినా తృప్తి కలగదు. భూమండ లాన్ని ఏలిన మహారాజులు, చక్రవర్తులలో అత్యధి కులు అసంతృప్తితోనే దాటిపోయారు. కోరికలు అనంతం. అయితే మనిషికి దక్కవలసినంతే దక్కు తుంది. అత్యాశ అనర్థ హేతువు. అసంతృప్తి సుఖాన్ని చెరిపేస్తుంది. దుఃఖానికి హేతువు అవుతుంది. సంపదలు అశాశ్వతం. ‘నీవు చక్రవర్తివి. అందునా మహాదాతవు కనుక ఏది కోరినా ఇవ్వగలవు. కానీ అర్థికి పరిమితులు ఉంటాయి. దాత స్థాయిని బట్టి కాకుండ గ్రహీత తనకు అవసరమైనదే అడిగి పుచ్చు కోవాలి. నాకు మూడడుగుల నేలనే ఇవ్వు. నేను కోరింది నీ దృష్టిలో పరమాణువు కావచ్చు. నాకు అనంత సంపద. లోకంలో ఎవరూ శాశ్వతంకారు, ఏవీ శాశ్వతం కావు. సిరిసంపదల రాకపోకలు దైవయోగాన్ని బట్టే ఉంటాయి. అవన్నీ సొంతం, శాశ్వతం అనుకుంటే పొరపాటే. ఎందరో రాజులు, చక్రవర్తులు పుట్టి గిట్టారు కానీ ఎవరూ ఏమీ వెంట తీసుకు వెళ్లలేదు, కీర్తి ప్రతిష్ఠలను తప్ప.

వడుటి అర్థింపులోని మర్మాన్ని గ్రహించిన రాక్షసగురువు శుక్రా చార్యుడు, అతనిని రాక్షసకులాంతకుడు శ్రీహరిగా గుర్తించి శిష్యుడిని అప్రమత్తం చేయబోయాడు. ఆడి తప్పని చక్రవర్తి గురోపదేశాన్ని పట్టించుకోలేదు.

పైగా ‘లక్ష్మీ’నాథుడి చేయి కింద, తన చేయి పైన అయితే అంతకుమించిన భాగ్యమేముంది? అనీ సమర్థించుకున్నాడు. ‘స్త్రీలను సుముఖులను చేసుకొనేందుకు, వివాహ విషయాలలో, ప్రాణధ(దా)న మానాలకు హాని కలిగే సందర్భాలలో, గోబ్రాహ్మణ రక్షణ సమయాలలో అసత్యమాడినా పాపం అంటదు’ అనే ‘వెసులుబాటు’ను ఉపయోగించు కోవచ్చన్న గురువు మాటనూ బలిచక్రవర్తి ఆలకించలేదు. అందునా, అమిత భక్తితో విష్ణువునే కట్టిపడేసిన ప్రహ్లాదుడి మనవడు. తాతను బ్రోచినవాడే మనువడి ముందు చేయి చాపడం భాగ్యంగా భావించాడు. ‘కారే రాజులు రాజ్యముల్‌ ‌కలుగవే గర్వోతిన్‌ ‌పొందరే’ అనీ నిర్వేదం వ్యక్తీకరించాడు. ‘బ్రతుకవచ్చుఁగాక బహుబంధనములైన/వచ్చుగాక లేమి వచ్చుఁగాక/జీవధనములైనఁ. జెడుగాక పడుగాక/మాటఁదిరుగలేరు మానధనులు’ (ఎన్ని కష్టాలు వచ్చిన, ఆఖరికి ప్రాణం పోయినా ఆత్మాభిమానం కలవారు ఇచ్చిన మాట తప్పరు) అన్న బలి ధర్మనిష్ఠ నారాయణుడిని కదిలించింది. అయినా వచ్చిన పని నెరవేర్చడం ద్వారా అతని అహంభావాన్ని అంతరింపచేయాలి.

దానం అడిగిన మూడడుగులను స్వాధీనం చేసుకునే ప్రయత్నంలో బాలవటుడు ‘త్రివిక్రముడు’ అయ్యాడు. సూర్యచంద్రులు ఉన్నంత మేర భూమి ఒక అడుగు, స్వర్గం రెండవ అడుగు అయింది. ‘మూడవ పాదం ఎక్కడ?’ అన్న ప్రశ్నకు, సత్యవ్రతనిష్ఠుడైన బలి ‘నీ తృతీయ పదము నిజము నా శిరమున/నెలవు సేసి పెట్టు నిర్మలాత్మ’ అని విస్షష్టంగా చెప్పాడు. ‘అహంకారంతో కన్నులు మూసుకుపోయి వ్రవర్తించిన మాలాంటి దానవుల కళ్లను సకాలంలో తెరిపించిన నీవు ఆదిగురువు లాంటివాడివి’ అను శ్లాఘించాడు.

భగవానుడు బలి శిరస్సున పాదం మోపే సమయంలోనే అక్కడి చేరిన ప్రహ్లాదుడు, మనవడి దుస్థితికి విచారం వ్యక్తం చేయకపోగా, ‘నీవు కట్టబెట్టిన ఇంద్రపదవి అజ్ఞానం, అహంకారాలకు మూలమైంది.

దానిని ఇప్పుడు తొలగించడం సమయోచితమే. అహంకారమనే అంధకారం తొలగేలా శిక్షించడం అంటే అతనిని రక్షించడమే…’ అని వినయంగా పలికాడు.

‘వాస్తవానికి ఎంతటి పదవైనా నీ పాదసేవ ముందు అల్పమే’ అనీ పలికాడు. అయినా పరమాత్ముడు బలి ఉన్నతిని శ్లాఘించాడు. ‘బద్ధుండై గురుశప్తుడై చలితుడై బంధువ్రజత్యక్తుడై/సిద్ధైశ్వరముఁగోలుపోయి విభక్షీణుండనై పేదయై…’ (బంధితుడై, దానమిస్తానన్నందుకు గురువు శాపానికి బద్ధుడై, బంధుజనానికి దూరమై, ఐశ్వర్యాన్ని కోల్పోయి, పేదగా మిగిలినప్పటికీ, సత్యం, ధర్మాలను వీడని బలిరాజు బహు పుణ్యశీలి అని ఆయన ఉన్నతిని లోకానికి చాటాడు. ‘ బలి సాత్వికాహంకారాన్ని తొలగించి ముక్తి ప్రదానమే నా ఉద్దేశం. తాను చేసిన పుణ్య కార్యాల వల్ల సిద్ధి పొందాడు.

అతనిని స్వర్గానికి మించిన సుతల లోకాధిపతిగా అభిషేకిస్తున్నాను. ఆ తరువాత ఇంద్రపదవి, పిదప దేవతలకు కూడా దుర్లభమైన నా సాయుజ్యం లభిస్తుంది’ అని అనుగ్రహించాడు.

‘దేవేశ్వరాయ దేవాయ దేవ సంభూతి కారిణే!

ప్రభవే సర్వవేదానాం వామనాయ నమో నమః!!

About Author

By editor

Twitter
YOUTUBE