– కట్టా రాంప్రసాద్ బాబు
వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది
రైల్వేస్టేషన్‌కెళ్లడానికి ఆటో కోసం నిలబడ్డాను. అయిదు నిమిషాల తర్వాత నాముందొక ఆటో వచ్చి ఆగింది. ఆటో డ్రైవర్ ఫోన్‌లో మాట్లాడుతూనే డ్రైవ్ చేసుకుంటూ వచ్చాడు. ఫోన్ చెవి దగ్గర నుంచి తప్పించి ‘ఎక్కడికి సార్’ అడిగాడు. ‘రైల్వేస్టేషన్‌కి’ అని చెప్పాను.
‘ఎక్కండీ, వంద రూపాయలు’ అన్నాడు. ట్రయిన్ పావుగంటలో వుంది. బేరమాడే అవకాశం లేక ఎక్కికూర్చున్నాను. ఆటో పోతోంది. అతను మాట్లాడుతూనే నడుపుతున్నాడు. ట్రాఫిక్ చూస్తే ఎక్కువగావుంది. వీడెక్కడ దేన్ని గుద్దుతాడో అని భయంగావుంది. అప్పటికీ అన్నాను ‘ఫోన్ మాట్లాడకుండా పోవొచ్చుగా’ అని. అతను నవ్వి ‘భయపడకండి సార్! నా ఆటోకి అలవాటే నా ప్రమేయం లేకుండానే వెళ్లిపోతుంది’ అని మళ్లీ మాట్లాడటం మొదలెట్టాడు.
ఇతననే ఏముంది ఇప్పుడందరికీ ఈ పిచ్చి బాగానే వుంది. దీనివల్ల అంతా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు బతికేస్తున్నారు. ఎవరి చేతుల్లో చూసినా సెల్‌ఫోనే. గతంలో అయితే ప్రతివారి చేతిలో పుస్తకమో, సంచో, గొడుగో వుండేవి. ఇప్పుడు వాటిస్థానాన్ని ఈ ఫోను ఆక్రమించేసింది.
మొత్తం మీద నన్ను ఆ ఆటోవాడు క్షేమంగానే స్టేషన్లో దించాడు. టికెట్ ముందే రిజర్వ్ చేయించుకున్నానేమో క్యూలో నిలబడి టికెట్ కొనే బాధ తప్పింది. స్టేషన్‌లోపలి కెళ్లి చూస్తే ఫ్లాట్‌ఫాం నిండా జనాలే. అయితే అంతా నిశబ్దంగా వుంది. గతంలో ఏ ఫ్లాట్‌ఫాం చూసినా గోలగోలగా వుండేది. ఈ సెల్‌ఫోన్ల పుణ్యమా అంటూ ఎవరి ఫోన్ వాళ్లు చూసుకుంటూ పక్కవాడితో పని లేకుండా కాలం గడిపేస్తున్నారు.
ఓసారి మా ఫ్రెండొకడు చాలా అర్జంటు పనిమీద హైదరాబాదు వెళ్లవలసి వచ్చి తత్కాల్లో సెకండ్ ఏ.సి.లో టికెట్ సంపాదించుకుని స్టేషన్ కొస్తే ట్రైన్ అరగంట లేటన్నారని ఓ ప్రక్కన కూర్చుని వాట్సాప్ ఓపెన్ చేసి దాన్లో పడిపోయి గంటపోయాక స్పృహలోకొచ్చి చూస్తే అప్పటికే రైలు రావడం, పోవడం జరిగి పోయింది. ‘లబోదిబో’ అంటే ఏం ప్రయోజనం! మళ్లీ ఓ మామూలు టికెట్ కొనుక్కుని తర్వాతి ట్రైన్‌లో జనరల్ కంపార్ట్‌మెంటు ఎక్కి నానా అగచాట్లు పడి వెళ్లాడట. కనీసం పక్కవాడికి చెప్పినా వాడు చెప్పేవాడు. కానీ ఇప్పుడెవరు పక్కవాళ్లని పలకరించరు. అదో అగౌరవమనుకుంటారు. అందుకే మానవ సంబంధాలన్నీ కనుమరుగవుతున్నాయి. ఇలాంటి సంఘటనలు చాలా మంది జీవితంలో జరుగుతూనే ఉంటాయి.
ఇంతలో మా ట్రైన్ వస్తున్నట్లు అనౌన్స్‌మెంటు వినిపించింది. నే•నెక్కాల్సింది జన్మభూమి ఎక్స్‌ప్రెస్. రాజమండ్రికి ఆ ట్రైన్ తొమ్మిదీ, తొమ్మిదిన్నర మధ్యలో వస్తుంది. ఏ.సి. చైర్ కార్•లో రిజర్వ్ చేసుకోవడంతో తోసుకుంటూ ఎక్కాల్సిన పనిలేదు. కాబట్టి నేనెక్కాల్సిన కంపార్ట్‌మెంటు ఎక్కడ ఆగుతుందో తెలుసుకునేందుకు డిస్‌ప్లే బోర్డు దగ్గరకు నెమ్మదిగా వెళ్లి నిలబడ్డాను. ఈస్టేషన్లో రైలు రెండుమూడు నిమిషాలాగుతుంది. ఒక్కోసారి అయిదు నిమిషాలాగుతుంది. గోదావరి బ్రిడ్జ్‌మీద నుంచి క్లియరెన్స్ వచ్చే వరకు ట్రైన్ బయలుదేరదు. అందుకే రాజమండ్రి స్టేషన్లో కొంచెం ఎక్కువ సేపే ఆగుతాయి. ఈరోజు కూడా అయిదు నిమిషాల తర్వాతే బయలుదేరింది. నెమ్మదిగా కదులుతున్న రైల్లోకి సుమారు ముప్పయేళ్ల స్త్రీ కంగారుగా ఎక్కింది. సాదా బట్టల్లో వుంది. చేతిలో చిన్న సంచి. చూస్తుంటే ఆమె ఏడెనిమిది నెలల గర్భిణీలా వుంది. లోపలికొచ్చి నేను కూర్చున్న సీటు దగ్గర నిలబడింది. కంగా రుగా ఎక్కడం వల్ల బాగా ఆయాస పడుతోంది. మరో పక్క భయం, భయంగా కూడా వుంది.
మా కంపార్ట్‌మెంట్లో సీట్లన్నీ నిండిపోయాయి. మరో మనిషికి ఇందులో చోటులేదు. మరి ఇందులోకి ఎందుకెక్కింది? పక్క బోగీలో సీటు వుండివుంటుంది. తను ఫ్లాట్‌ఫాం మీదకు వచ్చేసరికి రైలు కదిలివుంటుంది. అందుకే దీనిలో ఎక్కివుంటుందనుకున్నాను. రైలు బ్రిడ్జి దాటినా ఆమె ఇక్కడ నుంచి వేరే బోగీలోకి పోకుండా అలాగే నిలబడివుంది. టీటీఈ ఇంకా రాలేదు. మిగిలిన రెండు ఏ.సీ బోగీలను చెక్ చేసుకుని రావాలి కదా!
ఆమె చాలా సేపటినుంచీ నిలబడి వుండటంతో చాలా కష్టంగా ఫీలవుతున్నట్టనిపించింది. కడుపుతో వున్న మనిషికదా. అంతసేపు నిలబడటం కష్టమే. రైల్లో వున్న వాళ్లెవరూ ఈ లోకంలో లేరు. అంతా సెల్ ఫోన్లతో కుస్తీలు పడుతున్నారు. ఈ ప్రపంచంతో సంబంధం లేనట్లుగా ఉన్నారు.
పూర్వం రైలు ప్రయాణమంటే అదో పండుగ. అంతా కిటికీ పక్కనే కూర్చోవాలని పోటీలు పడేవారు. రైలు పోతున్నప్పుడు కనపడే ప్రకృతి అందాలను చూసి ఎంతో పరవశించి పోయేవారు. అంతా చక్కగా కబుర్లు చెప్పుకుంటే కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. రైల్లో కలిసి భోజనం చేయడం అదో థ్రిల్. రైలు ప్రయాణంలో ఎవరో తెలియని వ్యక్తులతో పరిచయాలు పెరిగి రైలు దిగే సరికి స్నేహితులై పోయేవారు. తర్వాత వారి మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు కూడా జరిగేవి. రైలు ప్రయాణాల్లో పెళ్లి సంబంధాలు కుదిరిన సంఘటనలు కూడా నాకు తెలుసు.
ఇప్పుడేమైపోయాయా రోజులు. ఎవరికి ఎవరో అన్నట్టుగా బతికేస్తున్నారంతా. మా కంపార్ట్‌మెంట్లో సగం మంది ఆడవాళ్లే వున్నారు. కానీ సాటి స్త్రీని ఆస్థితిలో చూసి ఎవరూ పట్టించుకున్నట్టు ల•దు. ‘ఎవరెలా పోతే ఏంలే’! అన్నట్టుగా వాళ్లపనిలో వాళ్లున్నారు. అప్పుడు నాలో ఓ ప్రశ్న ఉదయించింది. ‘ఆడాళ్లు కష్టాల్లో వుంటే ఆడాళ్లే పట్టించుకోవాలా? మగవాళ్లు పట్టించుకోకూడదా? మరి నేనే ఆ పనెందుకు చేయకూడదు?’
‘చూడండి! మీరు నిలబడి ప్రయాణం చేయలేరు. నా సీట్లోకూర్చోండి. నేను నిలబడతాను’ అంటూ సీట్లో నుంచి లేచాను.
‘అబ్బే వద్దండి. నేను నిలబడి ప్రయాణం చేయగలను’ అందామె.
‘మీరు నిలబడటం మంచిది కాదు. ఇలాంటి పరిస్థితిలో అంతసేపు నిలబడి ప్రయాణం చేయడం అసలు మంచిది కాదు. పర్వాలేదు కూర్చోండి’ అన్నాను. అయినా ఆమె కూర్చోలేదు కూర్చోమని బలవంతపెట్టాను.
‘వద్దుసారూ! నేను టిక్కెట్టు కొనకుండా ఎక్కాను. వచ్చే స్టేషన్లో దిగిపోతాను’.
‘ఇది వచ్చే స్టేషన్లో ఆగదమ్మా! ఇంకో గంట ప్రయాణం చేస్తేనేగాని ఆగదు. అంతవరకు నిలబడి వుండటం శ్రేయస్కరం కాదు. అయినా టికెట్ కొనకుడా రైలెక్కడమేమిటి?’
‘నా దగ్గర డబ్బుల్లేవండి’ అలా చెప్పేటప్పుడు ఆమె కళ్లలో నీళ్లు తిరిగాయి.
నాకు చాలా ఆశ్చర్యమేసింది..డబ్బుల్లేకుండా రైలెక్కడమేమిటి? ఇప్పుడవన్నీ ఎందుకనుకుని ‘చూడమ్మా ముందు కూర్చో’ అంటూ బలవంతంగా సీట్లో కూర్చోపెట్టాను.
‘ఎంత వరకు వెళ్లాలి?’
‘విజయవాడ వెళ్లాలండి. అనుకోకుండా బయలుదేరవలసి వచ్చింది. డబ్బుల్లేవు.
ఏ పాసెంజరు రైలన్నా ఎక్కొచ్చనుకున్నాను. తీరా స్టేషన్ కొచ్చేసరికి ఇది బయలుదేరుతోంది. ఎక్కేసాను. టీ.సీ పట్టుకుని ఏదైనా స్టేషన్లో దించేస్తే దిగిపోయి ఇంకో రైలెక్కొచ్చనుకున్నాను. ఎక్కాక తెలిసింది ఇది ఏసీ బోగీ అని. దిగే టైం లేదు. ఎక్కిన వెంటనే కదిలిపోయింది.’ అంది సంజాయిషీ ఇస్తున్నట్లుగా.
‘ఎందుకంత అర్జంటుగా బయలుదేరారు?’
మళ్లీ ఆమె కళ్లనిండుగా నీళ్లు తిరిగాయి. పైకి శబ్దం రాకుండా దు:ఖపడుతోంది.
ఇంతలో టి.టి.ఇ. మాదగ్గర కొచ్చాడు. ‘ఈ సీటు జెంట్స్‌ది కదా లేడీ కూర్చుందేమిటి?’
‘అవునండి అదినాసీటే. కానీ ఆవిడ నాకు బాగా తెలిసిన ఆవిడ నిండు గర్భిణీ. విజయవాడకు మెడికల్ చెకప్‌కి అర్జంటుగా వెళ్లవలసి వచ్చింది. టికెట్ పెనాల్టీ నేను కడతాను’ అన్నాను.
అతను నాతో ఏదో అనబోయాడు. ‘ప్లీజ్ సార్… ఏమీ మాట్టాడకండి నేను పే చేస్తానంటున్నానుగా’
‘అది కాదండి ఏసీ బోగీలన్నీ నిండిపోయాయి. మీకు సీటు చూపించాలి కదా!’
‘పర్వాలేదండి నేను నిలబడగలను.’
‘అయితే సరే. ఏలూరులో మీ పక్కసీటు ఖాళీ అవుతుంది. ఇంకా గంట నిలబడాలి మరి’ అంటూ పెనాల్టీతో టికెట్ రాసిచ్చాడు అతనికి డబ్బులిచ్చి పంపాక ‘మీరింక నిశ్చింతగా వుండండి’ అంటూ టికెట్ రిసిప్ట్ ఆమె చేతికిచ్చాను. దానిమీద వున్న అమౌంట్ చూసి ఆమె బిత్తరపోయింది. ‘ఇంతా!!’ అంటూ నా వంక చూసింది. ‘ఏం పర్వాలేద’న్నట్లు ఆమె వంక నవ్వుతూ చూశాను. ఆమె కళ్లలో నిండుగా నీళ్లు.
ట్రైన్ కదిలింది.‘ఇప్పుడు చెప్పమ్మా! ఏం పనిమీద అంత సడెన్‌గా విజయవాడ వెళుతున్నావు?’ అనడిగాను. అది చెప్పడానికి ముందు నన్ను ‘మీది రాజమండ్రేనా సార్’ అనడిగింది.
‘అవును’ అన్నాను. అక్కడ నేనో కాలేజీలో ప్రిన్సిపాల్‌గా పని చేస్తున్నానని కూడా చెప్పాను. అప్పుడు తన గురించి చెప్పింది ‘మాది కడియం పక్కనే వున్న పల్లెటూరు సార్. నా భర్త నర్సరీలో పని చేస్తాడు. మేమిద్దరం పదో తరగతి వరకు చదువుకున్నాం. ఆ చదువుకి ఉద్యోగాలెక్క డొస్తాయి సార్. నేనూ ఆ నర్సరీలో కలుపు తీయడానికి పోతుంటాను. పేద కుటుంబం. రోజంతా కష్టపడితేనేగానీ కడుపు నిండని సంసారం. అప్పుడప్పుడు అప్పులు చేయడం తప్పడం లేదు. ఇక్కడే వుంటే బతుకంతా ఇలాగే వుంటుందని తెలిసిన వాళ్లు పని ఇప్పిస్తాం రమ్మంటే మా ఆయన విజయవాడ వెళ్లాడు. అక్కడ ఓ కాంట్రాక్టరు దగ్గర పని దొరికింది. నెలకోసారి వచ్చేవాడు. తన కొచ్చినదాన్లో తన ఖర్చులకు వుంచుకుని మిగిలింది నాకిచ్చేవాడు. కొద్ది కొద్దిగా అప్పులు తీరుతున్నాయి. ఏదో కుదుట పడింది అనుకుంటున్న సమయంలో నా భర్త మీద దొంగతనం మోపి పోలీస్ స్టేషన్లో పెట్టారని ఈరోజు ఉదయమే నాకు తెలిసినవాళ్లు ఫోన్ చేసి చెప్పారు. నా భర్త అలాంటి వాడు కాదు సార్. ఎవరేది చెప్పినా నమ్మేస్తాడు. అమాయకత్వం ఎక్కువ. విషయం తెలిసిన వెంటనే గుండాగినంత పనయ్యింది. ఇంకేం ఆలోచించకుండా బయలుదేరాను. ఆ కంగా రులో డబ్బులు పెట్టుకున్న పర్స్ మర్చిపోయాను. మా ఊరి నుంచి స్టేషన్ వరకు ఆటోలో వచ్చాను. ఆటో అతను మా ఊరి వాడే కావడంతో తర్వాతి స్తానని చెప్పాను. స్టేషన్‌లోకి వచ్చిన వెంటనే ఈ రైలు కదులుతోంది ఎక్కేశాను’.
‘వెళ్లి ఏం చేద్దామనుకుంటున్నావు?’ అనడిగాను. బేలగా చూసింది నావంక ‘విషయం తెలిసి ఇంట్లో వుండలేక పోయాను సార్.’
‘ఇప్పుడు ఎవరూ ఎవరినీ పట్టించుకోలేని పరిస్థితుల్లో మనం బతుకుతున్నాం. అటువంటిది నువ్వు ఒక్కదానవు బయలు దేరావు. నీ భర్తను విడిపించుకోగలవా?‘ కళ్లనిండా నీళ్లు నింపుకోవడం తప్ప ఏం మాట్లాడలేదామె. కాసేపు మా ఇద్దరి మధ్య మౌనం చోటు చేసుకుంది.
‘నువ్వో అరగంటలో విజయవాడ చేరుకుంటావు. అక్కడ నీ భర్తను విడిపించే వాళ్లెవరైనా ఉన్నారా. అందులోను నీ దగ్గర పైసా లేదు కదా!’ అన్నాను.
మళ్లీ ఆమెకు తన పరిస్థితి గుర్తుకొచ్చింది. వెక్కిళ్లు పట్టింది. ఆమెను చూస్తే చాలా జాలి కలిగింది. ఆమెకు ఏమైనా సాయపడగలనా అని ఆలోచించాను. అప్పుడు నాకు మురళీక్రిష్ణ గుర్తుకొచ్చాడు. అతను నా దగ్గర డిగ్రీ చదివినవాడు. ఎస్సైగా సెలక్టయి, తర్వాత సి.ఐ.గా పనిచేసి ఇప్పుడు డీఎస్పీగా విజయవాడలో పని చేస్తున్నాడు. అప్పుడప్పుడు నాకు ఫోన్లు కూడా చేస్తుంటాడు. అతనితో మాట్లాడితే ఏమైనా పని అవుతుందేమో అనిపించింది. ముందుగా ఈమె నుంచి అన్ని వివరాలు తెలుసుకోవాలి. ఆమె భర్త పేరు, ఏ స్టేషన్లో పెట్టింది మొదలైనవన్నీ అడిగాను. ఆమె చెప్పిన వెంటనే మురళీకృష్ణకు ఫోన్ చేశాను. వెంటనే రెస్పాండ్ అయ్యాడు. విషయమంతా చెప్పి ఈమెకు సాయం చేయమని చెప్పాను. తప్పకుండా చేస్తానని మాటిచ్చాడు. డైరెక్టుగా తనున్న స్టేషన్‌కి రమ్మని అడ్రస్ ఇచ్చాడు. అలాగేనని చెప్పి ఆమెకా విషయాన్ని చెప్పాను.
‘మీ మేలు జన్మలో మరిచిపోలేను సార్’ అంది ఆనందంగా.
‘నేనిప్పుడు ఇదే ట్రైన్‌లో హైదరాబాదు వెళుతున్నాను లేకపోతే నేనే నిన్ను స్టేషన్‌కి తీసుకెళ్లేవాడిని. నీ దగ్గర డబ్బులేమీలేవు. నువ్వు స్టేషన్‌కి ఎలా వెళతావు? అలాగే నీభర్త, నువ్వు తిరిగి మీ ఊరెలా వెళతారు. ఈ వెయ్యి రూపాయలు వుంచుకో. మీ ఆయన్ని ఇక్కడ వుంచకుండా నీతో తీసుకెళ్లిపో. మీ వూళ్లోనే ఏదో పని చేసుకుంటూ వుండండి. మీకూ మంచిరోజులొస్తాయి. అంతకీ మీరావూళ్లో వుండలేకపోతే నన్ను కలవండి. మీఇద్దరికీ ఏదో పని చూడగలను. కష్టపడి పనిచేసేవాళ్లకి పనులు దొరక్కపోవు సరేనా’’ అంటూ ఆమెకు నా విజిటింగ్ కార్డు, వెయ్యి రూపాయలు ఇచ్చాను.
ఆమె కళ్లనిండా సంతోషంతో కూడిన నీళ్లు.
‘నీభర్త విడుదలయిన వెంటనే నాకు ఫోన్ చెయ్యి’ అలాగే అంటూ తలూపింది.
అంతలో విజయవాడ స్టేషన్లో ట్రైన్ ఆగింది. ఆమెను దిగమని చెప్పి పంపించేశాను.
ఎందుకో మనసంతా హ్యాపీగా అన్పించింది.
ఎవరూ ఎవరినీ పట్టించుకోవడం లేదని అనుకోవడం ఎందుకు? కొందరైనా వుంటారుగా పట్టించుకునే వాళ్లు! అటువంటప్పుడు ఇలాంటి నిస్సాహాయకులకు న్యాయం జరుగుతుందనిపించింది. అక్కడ నుంచి రైలు నెమ్మదిగా కదిలింది.