– క్రాంతి
హైందవ చైతన్యాన్ని అడ్డుకోవడంతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో చిచ్చు పెట్టడమే ఎజెండాగా కొన్ని పార్టీలు, సంస్థలు పనిచేస్తున్నాయి. ఇటీవల కర్ణాటకలోని శివమొగ్గలో వీర సావర్కర్ ఫ్లెక్సీ తొలగింపు, కత్తిపోట్ల ఘటనలే ఇందుకు ఉదాహరణ. నిన్న హిజాబ్. ఇవాళ సావర్కర్. కాంగ్రెస్, ఎస్‌డీపీఐ పార్టీలు టిప్పుసుల్తాన్‌ను సావర్కర్‌కు పోటీగా తెర మీదకు తేవడాన్ని కర్ణాటక ప్రజలు ఛీత్కరించుకుంటున్నారు.
దక్షిణాదిన బీజేపీ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కర్ణాటక. వచ్చే పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లోను ఈ రాష్ట్రాల్లో బీజేపీ మెరుగైన ఫలితాలను సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా బలపడుతున్న బీజేపీ ప్రాభవాన్ని అడ్డుకోవడం ఎలాగో తెలియక కుట్రలు, కుతంత్రాలకు ఆజ్యం పోస్తున్నాయి విపక్షాలు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఏ చిన్న గొడవ జరిగినా భూతద్దంలో చూపిస్తారు. వివాదాలను సృష్టించడం, వాటిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లి బీజేపీని ఇబ్బంది పెట్టడం సర్వసాధారణమైపోయింది. అదే సమయంలో కాంగ్రెస్, ఇతర విపక్ష పాలిత రాష్ట్రాల్లో జరిగేవి పెద్దగా వార్తల్లో కనిపించవు.
ఏ రాష్ట్రంలోనూ లేని హిజాబ్ సమస్య కర్ణాటక లోనే తలెత్తడానికి కారణం ఏమిటి? ఒక్కటే సమాధానం. రాష్ట్రాలతో పోలిస్తే కాంగ్రెస్ అంతో ఇంతో తన అస్తిత్వాన్ని చాటుకుంటున్న రాష్ట్రం కర్ణాటకే. మైనారిటీలను దువ్వడంతో పాటు, బీజేపీని వివాదాల్లోకి లాగి లబ్ధి పొందడమే ఇప్పుడు ఆ పార్టీ ముందున్న ఏకైక ఎజెండా. ఇందులో భాగమే టిప్పు సుల్తాన్‌కు ప్రాముఖ్యం కల్పించడం. తీవ్రవాద సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకు చెందిన సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా కర్ణాటకలో బలపడేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవల మంగళూరులో హిజాబ్ అంశం వెనుక కూడా ఈ శక్తుల ప్రమేయం ఉంది. హిజాబ్ విషయంలో న్యాయస్థానాలు స్పష్టమైన తీర్పు ఇచ్చిన తర్వాత మరో కొత్త సమస్య కోసం పొంచి ఉన్న ఈ శక్తులకు సావర్కర్ ఫ్లెక్సీ అంశం దొరికింది.
రానున్న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలలో తమ ఉనికిని చాటుకోవడానికే తాజా వివాదం రాజేసినట్లు అర్థమవుతోంది. హిందుత్వ సిద్ధాంతాన్ని బలంగా చాటిన సావర్కర్‌ను వ్యతిరేకించడం ద్వారా ముస్లిం వర్గాల ఓట్లును రాబట్టుకోవడం, సావర్కర్‌కు టిప్పును పోటీగా తీసుకురావడం ఇందులో భాగమే.
శివమొగ్గలో ఏం జరిగింది?
కర్ణాటకలోని పశ్చిమ కనుమల్లోని పట్టణం శివమొగ్గ. శివముఖ (శివుని ముఖం) అనే పదం నుండి శివమొగ్గ పదం వచ్చింది. 76వ స్వాతంత్య్ర దిన వేడుకలు, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా హిందువులు గాంధీ బజార్ ప్రాంతంలోని అమీర్ అహ్మెద్ సర్కిల్‌లో వినాయక దామోదర్ సావర్కర్ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఈ విషయంలో అభ్యంతరం వ్యక్తం చేసిన సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా కార్యకర్తలు అక్కడ టిప్పు సుల్తాన్ పోస్టర్‌ను పెట్టేందుకు సిద్ధమయ్యారు.. ఈ క్రమంలో వారు సావర్కర్ చిత్రాన్ని చించేశారు. ఇది శాంతి భద్రతల సమస్యకు దారి తీసింది. తొలగించిన సావర్కర్ ఫ్లెక్సీని తిరిగి ఏర్పాటు చేయాలని, ఇందుకు కారణమైనవారిపై చర్యలు తీసుకోవాలని బీజేపీతో పాటు హిందూ సంస్థల కార్యకర్తలు నిరసన తెలిపారు. ముస్లింలు, వారికి మద్దతుగా నిలిచిన కాంగ్రెస్ కార్యకర్తలు టిప్పు సుల్తాన్ చిత్రాన్ని ఏర్పాటు చేస్తామని పట్టుదల ప్రదర్శించారు. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ఇరు వర్గాలను అదుపు చేసేందుకు లాఠీఛార్జ్ చేశారు. ఆ తర్వాత అక్కడ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ తర్వాత కొన్ని హింసాత్మక ఘటనలు జరిగాయి.
కత్తిపోట్లతో ఉద్రిక్తత
రాజస్తాన్‌కు చెందిన ప్రేమ్‌సింగ్ శివమొగ్గలోని కస్తూరిబా రోడ్డులో ఉన్న ఓ దుస్తుల దుకాణంలో పని చేస్తాడు. రాత్రి దుకాణం మూసేసిన తర్వాత ఇంటికి వెళుతుంటే కొందరు దుండగులు చుట్టుముట్టారు. వీరంతా అమీర్ అహ్మెద్ సర్కిల్‌లో గొడవలు రేపి పోలీసుల లాఠీఛార్జ్ ప్రారంభమైన తర్వాత అక్కడి నుంచి పారిపోతూ వచ్చినవారు. వీరిలో మహ్మద్ జబీ అలియాస్ చర్బి ప్రేమ్‌సింగ్‌ను కత్తితో పొడిచి పరారయ్యాడు. సింగ్ ఆస్పత్రిలో చికిత్స తర్వాత కోలుకున్నాడు. పోలీసులు నిందితుడు మహ్మద్ జబీని అరెస్టు చేసేందుకు అతడు తలదాచుకున్న తీర్థహళ్లి రహదారి ఫలక్ సముదాయ భవనాన్ని చుట్టుముట్టారు. ఎస్సై మంజునాథ్‌పై దాడి చేసి మహ్మద్ జబీ పారిపోయాడు. లొంగిపోవాలని పోలీసులు హెచ్చరించినా పట్టించుకోకుండా వెళుతున్న అతని కాలుపైకి మంజునాథ్ కాల్పులు జరిపారు. కిందపడిపోయిన నిందితుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. ప్రేమ్‌సింగపై ఈ కత్తిపోట్ల ఘటనకు సంబంధించి నదీమ్, అబ్దుల్ రెహమాన్‌తో పాటు మరొక వ్యక్తిని అరెస్టు చేశారు. మరునాడే తుంకూరు పట్టణంలో ఇలాంటి ఘటన పునరావృతమైంది. స్వాతంత్య్ర దినోత్సవం కోసం బీజేపీ ఎమ్మెల్యే జ్యోతి గణేష్ ఏర్పాటు చేసిన సావర్కర్ పోస్టర్‌ను కొంత మంది చింపేశారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు
భద్రావతిలో
శివమొగ్గ జిల్లాలోని భద్రావతిలో మరో ఘటన జరిగింది. నెహ్రూనగర్‌కు చెందిన సునీల్ అనే యువకుడు ఉద్యోగానికి వెళుతుండగా ముబారక్ అలియాస్ డిచ్చి దాడి చేసి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన బాధితుడ్ని తాలూకా ఆసుపత్రిలో చేర్పించారు.
మంగళూరులోనూ
మంగళూరులో కూడా ఇలాంటి సంఘటనే ఎదురైంది. స్థానిక సూరత్‌కల్ జంక్షన్ దగ్గర హిందువుల సావర్కర్ బ్యానర్ ఏర్పాటు చేశారు. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్‌డీపీఐ) కార్యకర్తలు ఆ బ్యానర్‌ను తొలగించారు. ఈ సర్కిల్‌కు వీర సావర్కర్ పేరు పెట్టాలని మంగళూరు ఉత్తర నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే భరత్ శెట్టీ చేసిన అభ్యర్థనకు నగర కార్పొరేషన్ ఆమోదం తెలిపింది. అధికారికంగా పేరు మార్చేందుకు ప్రభుత్వం నుంచి అనుమతుల కోసం చూస్తోంది. కాగా సావర్కర్ పేరు పెట్టడాన్ని ఎస్‌డీపీఐ వ్యతిరేకిస్తోంది.
అల్లర్లు చెలరేగిన శివమొగ్గ, భద్రావతి పరిధిలో పోలీసులు 144వ సెక్షన్‌ను అమలులోకి తీసుకువచ్చారు. జిల్లాలోని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. జిల్లాలో అన్ని మద్యం దుకాణాలను మంగళవారం మూయించారు. పరిస్థితులను అదుపు చేసేందుకు కర్ణాటక ప్రభుత్వం సాయుధ దళాలను రంగంలోకి దింపింది. సావర్కర్ ఫ్లెక్సీని తొలగించిన కేసులో దొడ్డపేట ఠాణా పోలీసులు సుమోటోగా కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారని ఏడీజీపీ అలోక్ కుమార్ తెలిపారు. ఆ తర్వాత రెండు రోజులకు సాధారణ పరిస్థితులు ఏర్పడ్డాయి.
సిద్ధ రామయ్య రాజకీయం
ముస్లింలు ఉండే ప్రాంతంలో సావర్కర్ బ్యానర్లు కట్టొద్దని కర్ణాటక మాజీ సీఎం, విపక్ష నేత సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు సర్వత్ర ఆగ్రహం తెప్పించాయి. ఆయన వ్యాఖ్యల స్ఫూర్తితో కాంగ్రెస్ కార్యకర్తలు హుబ్లీలో సావర్కర్ చిత్ర పటాలను దహనం చేశారు. ఈ ఘటనలు బీజేపీ కార్యకర్తలకు ఆగ్రహం తెప్పించాయి. గొడవలన్నీ సర్దుకున్న తర్వాత సిద్ధరామయ్య కొడగు జిల్లాలో వరద బాధితుల పరామర్శ పేరిట చేపట్టిన పర్యటన ఉద్రిక్తతలకు దారితీసింది.
ఆయనను మడికేరిలో భాజపా యువ మోర్చా కార్యకర్తలు ఘెరావ్ చేశారు. ఆయన కాన్వాయ్ మీద కోడిగుడ్లు విసిరారు. కొడగు జిల్లా శివార్లలోని తితిమతిలో సిద్ధుకు నల్లజెండాలు చూపిస్తూ ‘గోబ్యాక్ సిద్ధు’ అంటూ నినాదాలు చేశారు. కొడగులో వర్షాలు నిలిచి పోయాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిర్వాసితుల కేంద్రాల్లోనూ ఎవరూలేరు. ఇప్పుడు సిద్ధరాయయ్య కొడగు జిల్లా పర్యటనకు ఎందుకు వెళ్లారంటూ సహకార శాఖ మంత్రి ఎస్.టి.సోమ శేఖర్ ప్రశ్నించారు. పరిస్థితులన్నీ చక్కబడిన పక్షం రోజులకు పర్యటనకు వెళ్లి రాజకీయాలు చేద్దామని ఆయన ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. నోటికి ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేయడం, తనపై విమర్శలు వస్తున్నప్పుడు మొహం చాటేయడం సిద్ధరామయ్యకు అలవాటేనని విమర్శించారు.
సిద్ధరామయ్య గతంలో టిప్పు జయంతిని నిర్వహించి, విద్వేషాలను రెచ్చగొట్టారని మోర్చా జిల్లాధ్యక్షుడు దర్శన్ జోయప్ప ధ్వజమెత్తారు. కొడగు ప్రజలు గోమాంసాన్ని తింటారని తన ఉపన్యాసాల్లో గతంలో సిద్ధు చేసిన విమర్శలను ఆయన గుర్తు చేశారు. సావర్కర్ విషయంలో సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలను భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి సి.టి.రవి ఖండించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు సమర్థించుకుంటూ వెళితే నేడు సావర్కర్‌ను, రేపు అంబేడ్కర్, గాంధీజీని కూడా విమర్శిస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. సావర్కర్ స్వాతంత్య్ర సమరయోధుడా? కాదా? అని ప్రమాణపత్రాలు ఇవ్వవలసిన అవసరం ఏమీ లేదన్నారు.
మరోవైపు సావర్కర్‌పై సిద్ధరామయ్య వ్యాఖ్యలను నిరసిస్తూ కర్ణాటకలోని విజయపుర కాంగ్రెస్ కార్యాలయం వద్ద సావర్కర్ పోస్టర్లు ప్రత్యక్షం కావడం సంచలనం సృష్టించింది. ఆ ప్రాంతంలో భద్రతను పోలీసులు కట్టుదిట్టం చేశారు. శివమొగ్గలో సావర్కర్ పోస్టర్ల వివాదంపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు స్వాతంత్ర దినోత్సవం రోజున ఘర్షణలకు దారితీసిన నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బెంగళూరులో కాంగ్రెస్ పార్టీ టిప్పు సుల్తాన్ పోస్టర్ ఏర్పాటు చేసింది. దానిని గుర్తు తెలియని వ్యక్తులు దాన్ని చించిపడేశారు.
వినాయక మంటపాల్లో సావర్కర్ చిత్రం
సావర్కర్ చిత్ర పటాలపై కాంగ్రెస్, ఇతర విపక్షాలు చేస్తున్న రాజకీయానికి నిరసనగా కర్ణాటకలోని హిందూ సమాజం వినూత్న నిర్ణయం తీసుకుంది. రాబోయే వినాయక చవితి ఉత్సవాల్లో మంటపాలలో సావర్కర్ చిత్ర పటాలను ఏర్పాటు చేయనున్నారు. సిద్ధరామయ్య లాంటి నాయకుల విభజన రాజకీయాలకు ఇదే విరుగుడు అంటున్నారు. కరోనా సంక్షోభం తర్వాత ఈసారి ఎంతో ఘనంగా నిర్వహించబోతున్న వినాయక చవితి ఉత్సవాలను ప్రాధాన్యం ఏర్పడింది.
బెలాగావి జిల్లా అంతటా గణేశ ఉత్సవ మండపాల్లో సావర్కర్ చిత్రాలను పెడాతామని బీజేపీ నాయకులు ప్రకటించారు.
1857 ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామాన్ని వెలుగులోకి తెచ్చిన సావర్కర్ చిత్రాలను ప్రదర్శించకుండా ఎవరూ ఆపలేరని బెళగావి నగర బీజేపీ శాసనసభ్యులు అభయ్ పాటిల్, అనిల్ బెనెకే తెలిపారు. సావర్కర్‌కు బెలగావితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేశారు. స్థానిక హిందల్గా జైలులో సావర్కర్‌ను నిర్భందించారిన తెలిపారు. దేశంలోని గొప్ప స్వాతంత్య్ర సమరయోధులలో సావర్కర్ ఒకరని అన్నారు.
ఈసారి గణేష్ ఉత్సవాన్ని ‘వీర్ సావర్కర్ ఉత్సవ్’గా జరుపుకోవాలని శ్రీరామ్ సేన వ్యవస్థాప కుడు ప్రమోద్ ముతాలిక్ పిలుపునిచ్చారు. వీర్ సావర్కర్ ఫోటోను గణేష్ విగ్రహం పక్కన పెడతామని తెలిపారు. స్వాతంత్య్ర పోరాటంలో సావర్కర్ అండమాన్ జైలులో సుదీర్ఘకాలం శిక్ష అనుభ వించారని గుర్తు చేస్తూ, ఆయన చరిత్ర తెలుసుకో కుండా కొందరు వ్యక్తులు నిందిస్తున్నారని ఆరో పించారు.
మరోవైపు వినాయక చవితి వేడుకలను పాఠశాలల్లో కూడా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇదే తరహాలో ఈద్ మిలాద్ వేడుకలను అనుమతించాలని, నమాజ్ చేయడానికి తరగతి గదిని కేటాయించాలని వక్ఫ్ బోర్డు డిమాండ్ చేసింది. వీరి ప్రతిపాదనను విద్యాశాఖ మంత్రి బిసి నగేష్ నిరాకరించారు. సావర్కర్ ఒక విప్లవ సూరీడు. ఆయన చరిత్ర జోలికి ఎవరూ వెళ్లలేరు.
– క్రాంతి, సీనియర్ జర్నలిస్ట్