ఆగస్టు 2 పింగళి వెంకయ్య జయంతి, హర్ ఘర్ తిరంగా
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ప్రభుత్వం ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమానికి ఆమోదం తెలిపింది. భారతీయులు తమ ఇళ్ల వద్ద జెండాను ఎగురవేయడానికి ఇది స్ఫూర్తినిస్తోంది. స్వాతంత్య్రం సిద్ధించిన 75వ సంవత్సరంలో దేశం సమిష్టిగా జెండాను ఇంటికి తీసుకురావడం దేశ నిర్మాణం పట్ల మన నిబద్ధతకు ప్రతిరూపంగా నిలుస్తుంది. ప్రజలకు దేశభ్త, జాతీయ పతాకం గురించిన అవగాహనను మరింత పెంచినట్లవుతుంది. అందుకే మనమందరం ధైర్యంగా…
‘విజయీ విశ్వ తిరంగా ప్యారా / ఝండా ఊంచా రహే హమారా
సదా శక్తి బర్సానే వాలా / ప్రేమ సుధా సర్సా నే వాలా
హీరోం కో హర్స నే వాలా / మాతృభూమి కో తన్ మన్ సారా’ అని పాడుకుందాం.
భారతదేశానికి ఓ జెండా అవసరం. ముస్లింలు, క్రైస్తవులు, యూదులు, పార్సీలు.. మరే ఇతర జాతివారైనా భారత్‌ను జన్మస్థలంగా అంగీకరించే వారికీ సాధారణంగా ఓ జెండా ఉండాలి. దాని కోసం జీవించాలి దాని కోసం మరణించాలి.
– మహాత్మా గాంధీ
ప్రపంచంలో ఏ స్వతంత్ర దేశానికైనా తన జాతికి ప్రతీకగా నిలిచే ఓ జెండా ఉంటుంది. అమెరికా, రష్యా, ఇంగ్లండ్, ఫ్రాన్స్, చైనా… ఏ దేశమైనా తమతమ జెండాలతోనే ప్రపంచంలో జరిగే వివిధ కార్యక్రమాలకు హాజరవుతాయి. అందుకే ఒలంపిక్స్‌లో గాని, ఇతర ప్రపంచ ఆటల పోటీల్లో గెల్చినవారు తమ జాతీయ జెండాను శరీరాలకు చుట్టుకోవడం గాని, ఊరేగించడం గాని చేస్తారు. ‘గెలుపు మాది కాదు, మా దేశానిది’ అని తెలియ జేయడమే దాని ఉద్దేశం.
ప్రాచీన భారతీయులు జెండా లేదా ధ్వజాన్ని పూజించారు. మహాభారతం వివిధ ధ్వజాలను గూర్చి చెబుతుంది. భారత యుద్ధంలో అర్జునుడు కపిధ్వజాన్ని కలిగిఉన్నాడు. హనుమంతుడిని పూర్తి యుద్ధానికి సాక్షిగా చెబుతారు. హిందువులు భగవాధ్వ జాన్ని గౌరవిస్తారు. ఆర్‌ఎప్‌ఎస్ వారు భగవాధ్వజాన్ని ‘గురువు’గా గౌరవిస్తారు. గురు పౌర్ణమి రోజు ఆ ధ్వజానికి పూజ చేసి గురుదక్షిణ సమర్పిస్తారు. ఆర్.ఎస్.ఎస్. శాఖలో ధ్వజాన్ని పెట్టి ‘నమస్తే సదావత్సలే మాతృభూమే’ అని ప్రార్ధన చేస్తారు. స్వాతంత్య్రోద్యమ కాలంలో స్వేచ్ఛ కోసం త్రివర్ణ పతాకంతోనే పోరాడారు. ఈ జెండా నేటి మువ్వన్నెల జెండాగా మారడం వెనుక అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి.
భారత స్వాతంత్య్రోద్యమం బాగా ఊపు అందుకుంటున్నప్పుడు జాతీ యోద్యమ స్ఫూర్తిని, లక్ష్యాలను ప్రతి బింబించే జాతీయ పతాకం అవసరమైంది. వివేకానందుని శిష్యురాలైన ఐరిష్ వనిత సోదరి నివేదిత 1904లో భారత దేశపు మొదటి పతాకాన్ని రూపొందించారు. పసుపు ఎరుపు రంగుల ఈ పతాకం మధ్య భాగంలో వజ్రాయుధం, తెల్ల తామర గుర్తులు ఉన్నాయి. ‘భారతమాతకు వందనం’ అనే అర్థం వచ్చే బెంగాలీ మాటలు ఆ జెండాపై ఉన్నాయి.
బెంగాల్ విభజనను వ్యతిరేకిస్తూ 1906 ఆగస్టు 7న కలకత్తాలోని పార్సీ బగాం స్క్వేర్‌లో సచీన్ద్ర ప్రసాద్ బోస్ ఓ పతాకాన్ని ఎగురవేశారు. అది కలకత్తా జెండాగా ప్రసిద్ధి చెందింది. 1907 ఆగస్టు 22న మేడం బికాజీ కామా జర్మనీలోని స్టట్ గార్ట్‌లో జెండాను ఎగుర వేశారు. మేడం బికాజీ కామా, వీర సావర్కర్, శ్యాంజీ కృష్ణవర్మ కలిసి దానిని తయారుచేశారు. ‘ఈ జెండా భారత స్వాతంత్య్రానికి సంబంధించినది. ఇది పుట్టింది అమరులైన భారతీయ యువకుల రక్తం నుండి. పెద్ద మనుషు ల్లారా ఈ భారత స్వాతంత్య్ర పతాకానికి వందనం చేయండి. మానవ జాతిలో ఐదవ వంతును విముక్తి చేయడంలో ఈ జెండాకు సహకరించాలని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న స్వాతంత్య్ర ప్రేమికులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను’ అని స్టట్ గార్ట్‌లో జరిగిన అంతర్జాతీయ ఫోరమ్‌లో మేడం బికాజీ అన్నారు. (పూణేలోని మరాఠా, కేసరి లైబ్రరీలో ఈ జెండా భద్రపరిచారు). ఆమె పిలుపునకు భారతీయ ఉద్యమకారులు స్పందించారు. బెర్లిన్‌లోని భారతీయ విప్లవకారులూ ఈ జెండాను స్వీకరించడం వలన దీనిని బెర్లిన్ కమిటీ జెండాగా పిలిచేవారు. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో మెసపటోమియాలో దీనిని వాడారు. గదర్ పార్టీ వారు అమెరికాలో భారతీయ చిహ్నంగా వాడారు. 1917లో తిలక్, అనిబిసెంట్‌లు ఐదు ఎరుపు, నాలుగు ఆకుపచ్చ పట్టీలు గల జెండాను వాడారు. దానికి దిగువన హిందువులకు పవిత్రమైన సప్తఋషి మండలానికి గుర్తుగా ఏడు నక్షత్రాలను చిత్రించారు. అంతకు ఒక సంవత్సరం క్రితమే మచిలీపట్టణానికి చెందిన పింగళి వెంకయ్య త్రివర్ణ జాతీయ పతాకాన్ని రూపొందించారు. దానిని గాంధీజీకి చూపగా, భారతదేశం ఎదుర్కొంటున్న సమస్యల నుండి విముక్తి పొందడానికి చిహ్నంగా నిలిచినా చరఖా(రాట్నం)ను పతాకం మధ్యలో చేర్చ వలసిందిగా సలహా ఇచ్చారు. కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగుల్లో పట్టీలు, మధ్యలో చరఖాతో పింగళి వెంకయ్య రూపొందించిన పతాకాన్ని 1931 కరాచీ కాంగ్రెసు సమావేశంలో ఆమోదిస్తూ తీర్మానిం చారు. గాంధీజీ తమ ‘యంగ్ ఇండియా’ పత్రికలో పింగళి వెంకయ్యను ప్రత్యేకంగా ప్రస్తుతించారు.
పింగళి వెంకయ్య కృష్ణా జిల్లా మచిలీపట్టణానికి దగ్గర్లో గల ‘భట్ల పెనుమర్రు’ గ్రామంలో హనుమంత రాయుడు, వెంకటరత్నమ్మ దంపతులకు ఆగస్టు 2, 1876న జన్మించారు. ప్రాథమిక విద్య చల్లపల్లిలో, మాధ్యమిక విద్య మచిలీపట్టణం హిందూ హైస్కూల్లో పూర్తి చేసి, కొలంబోలో సీనియర్ కేంబ్రిడ్జిని పూర్తి చేసారు. జపాన్ దేశ క్రమశిక్షణ నచ్చి ఆ భాష నేర్చుకున్నారు. తరువాత తుర్లపాటి వెంకటాచలం, మంగమ్మ గార్ల కుమార్తె రుక్మనమ్మను వివాహం చేసుకున్నాడు.
పింగళి వెంకయ్య తన 19వ ఏట సైన్యంలో చేరగా దక్షిణ ఆఫ్రికాలో జరిగిన ఆంగ్లో బోయర్స్ యుద్ధానికి ఆయన్ని పంపారు. అప్పటికే దక్షిణ ఆఫ్రికాలో గాంధీజీ భారతీయ హక్కుల కోసం పోరాడుతున్నారు. ‘నాతాల్ ఇండియన్ అంబులెన్సు కార్పస్’ అధినేతగా గాంధీజీ ఎంపికయ్యారు. ఆ సందర్భంలో పింగళి వెంకయ్యకు గాంధీజీతో మంచి స్నేహం ఏర్పడింది. ఆ స్నేహం భారత్‌కు వచ్చాక కూడా కొనసాగింది.
స్వాతంత్య్ర ప్రకటనకు కొద్ది రోజుల ముందు, అంటే జూలై 22, 1947 న త్రివర్ణ పతాకాన్ని జాతీయ జెండాగా గుర్తిస్తూ, దానిపై గల కాషాయ వర్ణం త్యాగానికి, ధైర్యానికి, తెలుపు రంగు చిత్తశుద్ధి, శాంతికి, ఆకుపచ్చ రంగు అభివృద్ధికి, ప్రతీకలుగా నిర్వహించారు. తెలుపు రంగుపై• ధర్మానికి ప్రతీక అయిన అశోక చక్రం, దానికి 24 గీతలు ఉండేలా ఏర్పాటు చేయాలనీ (సారనాథ్ అశోకుని శిలా స్తంభ శాసనంపై గల ధర్మచక్రం) నిర్ణయించారు.
పింగళి వెంకయ్య మచిలీపట్టణం జాతీయ కళాశాలలో అధ్యాపకునిగా పనిచేశారు. మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో భూగర్భ శాస్త్ర పరిశోధన చేసి డిప్లొమా సంపాదించాక ప్రత్తి పంట, మైకాపై పరిశోధనలు జరిపారు. ‘తల్లి రాయి’ అనే పుస్తకం రాశారు. దానిలో బొగ్గు వజ్రంగా మారే పరిణామా లను వివరించారు. తరువాత ‘భారతదేశానికీ ఒక జాతీయ పతాకం’ అనే పుస్తకం రాసి, 30 జాతీయ పతాకాల గురించి, వాటి ఆవశ్యకత, పరిణామాలను అందులో వివరించారు. ఆయన వివిధ రంగాలలో చేసిన కృషికి గుర్తింపుగా ఆయనను డైమండ్ వెంకయ్య, జెండా వెంకయ్య, ప్రత్తి వెంకయ్య, జపాన్ వెంకయ్య అని గ్రామస్థులు పిలిచేవారు.
స్వాతంత్య్రం వచ్చాక పింగళిని ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. కటిక దారిద్య్రంతోనే 1963 జులై 4వ తేదీన చిన్నపాకలో మరణించారు. అయన జ్ఞాపకకార్థం 2009లో ఓ తపాలా బిళ్లను విడుదల చేశారు. ఇంత గొప్ప కృషి చేసిన పింగళి వెంకయ్యను ‘భారతరత్న’తో గౌరవించాలని ప్రజలు ప్రభుత్వానికి అనేక ప్రతిపాదనలు పంపారు.
జెండా పండుగ ఎందుకంటే…!
జెండా పండుగను జాతీయ పండుగగా ఎందుకు చేసుకోవాలంటే… ఆ రంగుల్లో ఓ అందం, ఆకర్షణ ఉన్నాయి. అంతకు మించి ఓ జాతి అస్తిత్వం, ఐకమత్యం, ధర్మం దాగి ఉన్నాయి. ‘కాషాయం దేశం పట్ల ప్రజల త్యాగాన్ని ఆత్మస్థైర్యాన్ని ప్రతిబింబిస్తే, తెలుపు స్వచ్ఛత, శాంతి, నిజాయతీలను చాటుతుంది. ఆకుపచ్చ విశ్వసనీయతని, ప్రకృతిని, పాడిపంటలను, సంపదను సూచిస్తుంది. మానవ ధర్మాన్ని బోధించే అశోక చక్రం నీలి రంగులో నిజాయితీకి ప్రతీకగా నిలుస్తుంది’ అని స్వతంత్ర భారత తొలి ఉప రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ అన్నారు.
సంప్రదించిన గ్రంథాలు:
- గాంధీ మహాత్ముని రచనా సంపుటి
- Flag code of India
- పోస్టల్ స్టాంపుల్లో జాతీయ పతాకం
- Who is Pingali Venkayya? Remembering the architect of India`s National Flag – India Today dated August 2, 2018
– కె.ఎస్.