– డా. మోహన్ భాగవత్, సర్ సంఘచాలక్, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్
ఈ నెల (ఆగస్ట్) 15నాటికి భారత్ స్వతంత్రమై 75 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా అమృత మహోత్సవాలు చాలా ముందే ప్రారంభమయ్యాయి. ఇంకా సంవత్సర కాలం కొనసాగుతాయి కూడా. అంతమాత్రాన మన దేశంలో సమస్యలన్నీ తీరిపోయాయని కాదు. పాత సమస్యల్లో కొన్నే తీరాయి. ఇంకా మిగిలిన వాటికి మరికొన్ని కొత్త సమస్యలు చేరాయి. ఈ చక్రం ఇలా సాగుతూనే ఉంటుంది. సమస్యలెన్ని ఉన్నా అమృత మహోత్సవంలో ఆనందాన్ని పొందడం అత్యంత సహజమైనది. అనేక ఏళ్ల తరువాత మన భూభాగంలో మనకు కావలసిన ప్రభుత్వాన్ని, ఇతర వ్యవస్థలను ఏర్పాటు చేసుకునే అధికారాన్ని 1947 ఆగస్ట్ 15న పొందాము. మనకు ఇష్టమైన పద్ధతిలో, మన ప్రజల ద్వారానే నడుపుకునే స్థితిని సాధించాం. బానిసత్వం ఎక్కువ కాలం కొనసాగడంతో స్వాతంత్య్రం కోసం సంఘర్షణ కూడా చాలాకాలం సాగించాల్సి వచ్చింది.
విదేశీ పాలనపై సాగించిన పోరాటం దేశ మంతటా వ్యాపించింది. స్వాతంత్య్రం సాధించడంలో అడ్డంకులుగా నిలిచిన వివిధ దోషాల పట్ల చైతన్యం వచ్చింది. సాయుధ, నిరాయుధ పోరాటంతో పాటు సమాజ జాగృతి కార్యం కూడా స్వాతంత్య్ర సాధన ఉద్యమంలో భాగంగా ఒకేసారి సాగాయి. సమాజం లోని అన్ని వర్గాల వారు తమతమ శక్తి మేరకు ఈ ఉద్యమంలో పాల్గొన్నారు.
స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో సర్వత్ర ఉత్సాహభరితమైన వాతావరణం కనిపించడం అత్యంత సహజం. తమ కఠోర పరిశ్రమ, త్యాగాల ద్వారా మనకు స్వాతం త్య్రాన్ని తెచ్చిపెట్టిన వీరులను గుర్తుచేసుకోవాలి. నవ్వుతూ ప్రాణాలను అర్పించిన వారి త్యాగనిరతిని, ధైర్యాన్ని సమాజం మొత్తానికి తెలియజేయడం చాలా అవసరం. మాతృభూమి, దేశ ప్రజానీకం పట్ల వారికి ఉన్న ఆత్మీయత, సర్వస్వం సమర్పణ చేసిన వారి ప్రేరణ, వారి తేజోమయమైన వ్యక్తిత్వం, వారి చరిత్రలను మనం ఎప్పుడు స్మరించుకుంటూ ఉండాలి, అనుసరించాలి.
ఈ సందర్భంగా మన కర్తవ్యం, సంకల్పాలను గుర్తు చేసుకుని వాటిని పూర్తిచేసేందుకు మరోసారి కంకణబద్ధులం కావలసిన అవసరం ఉంది. మనకు స్వరాజ్యం ఎందుకు? విదేశీయుల చేతిలో ఉన్నప్పటికీ దేశంలో సుపరిపాలన ఉంటే సరిపోతుంది కదా? అటువంటి పాలన వల్ల దేశ ప్రజానీకపు ఆశలు, ఆకాంక్షలు నెరవేరవా? అని ప్రశ్నించుకుంటే ‘లేదు’ అనే సమాధానం చెప్పుకోవాలి. విదేశీ పాలన ఎంత బాగున్నప్పటికీ అది సాధ్యపడదు. ‘స్వ’ అభివ్యక్తీకరణ స్వాతంత్య్ర సాధనకు ప్రేరణ అవుతుంది. వ్యక్తి స్వతంత్ర జీవనంలోనే సుర్యాం అనుభూతిని పొందగలుగుతాడు. ‘వైశ్విక జీవనానికి ఏదో ఒకటి అందించడానికే ప్రతి దేశం ఆవిర్భవిస్తుంది’ అని స్వామి వివేకానంద అన్నారు. అలా ప్రపంచానికి ఏదైనా అందించాలంటే ఆ దేశం స్వతంత్రంగా ఉండాలి. దేశం ‘స్వ’ను ప్రకటించడం ద్వారా వైశ్విక జీవనానికి తన యోగదానాన్ని అందించగలుగు తుంది. కాబట్టి ఆ కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి ఆ దేశం స్వతంత్రంగా, శక్తిమంతంగా ఉండడం మొదటి అర్హతగా భావించాలి. ‘స్వ’ ఆధారంగా ముందుకు సాగాలంటే ముందు ఆ ‘స్వ’ అంటే ఏమిటో స్పష్టమైన అవగాహన, జ్ఞానం, విశుద్ధమైన దేశభక్తి, వ్యక్తిగత, సామాజిక అనుశాసనం, ఏకాత్మ భావం కలిగి ఉండాలి. అప్పుడే భౌతికమైన విషయ పరిజ్ఞానం, శక్తి సామర్ధ్యాలు, పాలనా యంత్రాంగం వంటివి ఉపయోగపడతాయి.
స్వాతంత్య్ర సాధన కోసం ప్రజలను జాగృత పరచిన వారు ఆ స్వాతంత్య్ర ఫలాన్ని కాపాడుకునే మార్గాలను వివిధ రకాలుగా వివరించారు. రవీంద్రనాథ్ టాగోర్ ‘చిత్త్ జేథా భయశూన్య ఉన్నత్ జతో శిర్’ అనే తన కవితలో స్వతంత్ర భారతాన్ని సాధించడానికి కావలసిన పరిస్థితులను వర్ణించారు. భారత్ ఉదాత్త, ఉత్తమ, ఉన్నత దేశంగా అవతరిస్తుందని స్వాతంత్య్రం సిద్ధించినప్పుడు వీర సావర్కర్ ‘స్వతంత్రతా దేవి ఆరతి’ అనే కవితలో ఆకాంక్షిం చారు. గాంధీజీ తమ ‘హింద్ స్వరాజ్’లో స్వతంత్ర భారతదేశపు కల్పనను వర్ణించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, పార్లమెంట్లో రాజ్యాంగాన్ని ప్రవేశపెడుతూ చేసిన రెండు ఉపన్యాసాల్లో స్వాతంత్య్ర ప్రయోజనం, దానిని కాపాడుకునేందుకు మనం నిర్వర్తించవలసిన కర్తవ్యాలను ప్రస్తావించారు.
స్వాతంత్య్ర అమృత మహోత్సవ శుభ, ఆనందమయ సందర్భంలో వివిధ కార్యక్రమాలను నిర్వహించుకోవడంతోపాటు ఈ స్వాతంత్య్ర ప్రయోజనం ‘స్వ’ ఏమిటన్నది ఆలోచించుకోవాలి. ప్రపంచ జీవనంలో భారత్ నిర్వహించవలసిన పాత్ర కోసం ఎటువంటి శక్తిసామర్ధ్యాలను సంపాదించుకోవాలి? ఈ కార్యాన్ని పూర్తిచేయడానికి చేపట్టవలసిన చర్యలు ఏమిటి? కర్తవ్యాలను నిర్వర్తించడానికి సమాజాన్ని ఎలా సంసిద్ధం చేయాలి? అనే వాటిని సమీక్షించుకోవాలి.
భారతీయ సనాతన దృష్టి, చింతన, సంస్కృతి, ఆచరణ ద్వారా ప్రపంచం ముందు సందేశాలను ఉంచింది. ప్రత్యక్ష అనుభూతి, వైజ్ఞానిక సత్యాలపై ఆధారపడిన సమగ్ర, ఏకాత్మ భావనలే వాటి ప్రత్యేకత. వేర్పాటువాదం కాకుండా ‘ఏకాత్మదర్శన్’ను అవి పేర్కొన్నాయి. ఒకటిగా నిలవడానికి ఒకేవిధంగా ఉండాల్సిన అవసరం లేదు. తమ ప్రత్యేకతలను కాపాడుకుంటూ, ఇతరుల ప్రత్యేకతలను గుర్తిస్తూ అందరూ కలిసి సాగినప్పుడే సంఘటిత సమాజం ఏర్పడుతుంది.
ఈ భూమి బిడ్డలుగా భరతమాత పట్ల భక్తి మనలను కలిపి ఉంచుతోంది. సనాతన సంస్కృతి మనకు సుసంస్కృతి, సద్భావన, ఆత్మీయతపూర్వకమైన ఆచరణను నేర్పుతోంది. పరాక్రమయుత, శీలసంపన్నమైన పూర్వికుల ఆదర్శాలు మనకు మార్గనిర్దేశనం చేస్తున్నాయి. వీటిని అనుసరిస్తూ సంకుచితత్త్వాన్ని, స్వార్థాన్ని, భేదభావాలను పక్కన పెట్టి దేశహితమే లక్ష్యంగా పనిచేయాలి. సంపూర్ణ సమాజాన్ని ఇందుకు సిద్ధం చేయడం అత్యంత అవశ్యకమైన కార్యం. జాతి, మత, భాషా, ప్రాంతీయత లాంటి విభేదాలు, కీర్తికాంక్ష, ధనకాంక్ష వంటి దోషాల వల్ల వచ్చే స్వార్థ ఆలోచనలను త్రికరణశుద్ధిగా తొలగించాలి. ఇతరులకు మంచిని చెప్పడానికి ముందు స్వయంగా ఆచరించడం చాలా అవసరం. సమతతో కూడిన, శోషణ లేని సమాజం వల్లనే మనం ఈ స్వాతంత్య్రాన్ని కాపాడుకోగలం.
సమాజంలో అనేక అపోహలు కల్పిస్తూ, ఉద్రిక్తతలు రెచ్చగొడుతూ, కలహాలను పెంచుతూ తమ స్వార్థ ప్రయోజనాలను నెరవేర్చుకునేందుకు కుట్ర పూరిత శక్తులు దేశంలోనూ, బయట నుంచి పనిచేస్తున్నాయి. అలాంటి శక్తులను సుసంఘటితం, సామర్ధ్యంతో కూడిన సమాజం మాత్రమే కట్టడి చేయగలుగు తుంది. స్వతంత్ర, ప్రజాస్వామిక దేశంలో ప్రజలు తమ ప్రతినిధులను ఎన్నుకుంటారు. చట్టసభలకు పంపేందుకు అభ్యర్థులకు గల యోగ్యత, వివిధ రాజకీయ పక్షాల సైద్ధాంతికతను పరిశీలించగలగడం, పౌరుల విధుల గురించిన అవగాహన వంటివి ప్రజాస్వామ్య వ్యవస్థలో చాలా అవసరం. అయితే తమ వాదననే నెగ్గించుకోవడం కోసం అసహనపూర్వకమైన వైఖరిని అవలంబించే ధోరణి (ఇది సోషల్ మీడియాలో..) ఎక్కువగా కనిపిస్తోంది. అటువంటి వ్యహారశైలికి దూరంగా, నాగరికమైన, చట్టాన్ని గౌరవించే ధోరణిని అవలంబించవలసిన అవసరం ఉంది. సమాజం యోగ్యమైన ధోరణిని, వ్యవహార శైలిని అవలంబించకపోతే ఎలాంటి పరివర్తన సాధ్యపడదు.
కాబట్టి స్వాతంత్య్ర అమృత మహోత్సవ సందర్భంగా ఈ స్వాతంత్య్ర సాధనకు వెనుక ఉన్న పూర్వికుల కఠోరమైన పరిశ్రమ గుర్తుకు రావాలి. దాని ద్వారా అటువంటి త్యాగం, పరిశ్రమలతో ‘స్వ’ ఆధారితమైన, యుగానుకూల పాలన వ్యవస్థ నిర్మాణంతో భారత్‌ను అన్ని రంగాల్లో వైభవోపేతమైన స్థితికి చేర్చాలి. రండి, సంఘటిత, సుహృద్భావ భావనతో ఆ తపోమార్గంలో ఉత్సాహపూర్వకంగా, మరింత వేగంగా ముందుకు సాగుదాం.