స్వాతంత్య్ర ఉద్యమంలో ఆర్‌ఎస్‌ఎస్ – 2
గాంధీజీ ఉప్పు సత్యాగ్రహ నినాదం జనాదరణ పొందడానికి కారణం దాంట్లో ఉన్న నిరాడంబరత్వమే. ప్రతి ఒక్కరు వినియోగించే ఒక ఆహార పదార్థం మీద విధించిన పన్నును చూపి అందరిని మేల్కొలిపారు. ఉప్పు పన్ను భారం పడేది సామాన్యల మీదే. సముద్రతీరం లేకపోవడం వల్ల మధ్య పరగణాలు, బెరార్‌లలో ఉప్పు చట్ట అతిక్రమణ వీలుపడలేదు. దీనితో ఇతర శాసనోల్లంఘన కార్యక్రమాలు చేపట్టారు. బెరార్‌లోని పూసద్ (యావత్‌మాల్ జిల్లా)లో జులై 10, 1930న అటవీ సత్యాగ్రహం ప్రారంభమైంది. 1928లో వార్దా దగ్గరి హింగన్‌ఘాట్ రైల్వే స్టేషన్‌లో ప్రభుత్వ ధనాన్ని లూటీ చేసే ప్రయత్నం జరిగింది. అప్పుడు ఉపయోగించిన పిస్టల్‌లు ఆర్‌ఎస్‌ఎస్. వ్యవస్థాపకులు డాక్టర్ హెడ్గేవార్ ఉద్యమ సహచరుడిది. దీనితో హెడ్గేవార్ మీద అప్పటి నుండి బ్రిటిష్ నిఘా ఉంచారు. అయినా హెడ్గేవార్, ఆయన కుడిభుజం అప్పాజీ జోషి అటవీ సత్యాగ్రహంలో పాల్గొనాలనే నిర్ణయించుకున్నారు. స్వయంసేవకులు తన ఆదేశాల కోసం వేచి చూడకుండా జాతీయోద్యమంలో పాల్గొంటారనే నమ్మకం హెడ్గేవార్‌కు ఉంది. స్వయంసేవకులు సంఘ్ అనే సంస్థ ప్రత్యేక గుర్తింపును చూపించ కుండా, సాధారణ హిందువులుగా తమ బాధ్యత నిర్వహించాలని డాక్టర్‌జీ ఆశించేవారు. ముందు చెప్పినట్టు హిందూ సమాజం వేరు, సంఘ్ వేరు అనే భావన సరికాదన్నదే ఆయన అభిప్రాయం.
జూన్ 20, 1930న స్వయంసేవకులను ఉద్దేశించి హెడ్గేవారు ఇలా అన్నారు: ‘నేటి ఉద్యమ నేపథ్యంలో సంఘ సిద్ధాంతాల గురించి తరుచుగా అడుగుతున్నారు. ప్రస్తుతానికి సంఘ్ ఒక సంస్థగా ఈ ఉద్యమంలో పాల్గొనాలనే విషయం గురించి ఇంకా నిర్ణయించలేదు. ఎవరికైనా వ్యక్తిగతంగా పాల్గొనాలని ఉంటే వారు తమ సంఘచాలక్ అనుమతితో పాల్గొనవచ్చు. కానీ అతను సంఘ ఆదర్శాలకు అనుగుణంగానే ఆ ఉద్యమంలోనూ పనిచేయాలి, పాల్గొనాలి (Sangh Archies, Hedgewar Papers, Dr. Hedgewar lectures cleaned /1930, /july 1930).
సంఘ స్వయంసేవకులు శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొనవచ్చునని హెడ్గేవార్ లాంఛనంగా ప్రకటించడానికి ముందే స్వయం సేవకులకు స్వేచ్ఛ ఇచ్చారని అనిపిస్తుంది. దీనికి కారణం హెడ్గేవార్ ఈ ఉద్యమంలో పాల్గొనాలని నిర్ణయించుకోక ముందే, చాలామంది ప్రముఖ స్వయం సేవకులు అప్పటికే పాల్గొన్నారు. ఈ ఉద్యమం తాత్కాలికంగా ప్రాంతీయ, జిల్లా స్థాయిలలో కాంగ్రెస్ ఏర్పాటుచేసిన వార్ కౌన్సిల్ నేతృత్వంలో జరిగేది.
చందా (చంద్రపూర్)లో ఆగస్ట్ 20, 1923న సంఘ్‌ను స్థాపించినా కూడా హెడ్గేవార్ డిసెంబర్ 1928లో అక్కడికి వచ్చాకే అది పురోగతి సాధించింది. ఊపు వచ్చింది. చందాలో వార్ కౌన్సిల్ ఏర్పాటు గురించి జరిగిన సమావేశంలో ప్రముఖ్ స్వయంసేవకుడు అబాసాహెబ్ చంద్కే, నారాయణ పాండురంగ అలియాస్ నానాసాహెబ్ భాగ్‌వత్ (ప్రస్తుత సర్‌సంఘచాలక్ డాక్టర్ మోహన్ జీ భాగవత్ ఆయన మనుమడే), రఘునాథ్ సీతారామ్ అలియాస్ దాదాసాహెబ్ దేవైకర్ (చందా సంఘచాలక్), రామచంద్ర రాజేశ్వర్ అలియాస్ తాత్యాజీ దేశ్‌ముఖ్ (చందా సంఘ్ కార్యదర్శి) పాల్గొన్నారు. తరువాత కాలంలో చందా వార్ కౌన్సిల్ మొదటి అధ్యక్షుడు రాజేశ్వర్ గోవింద్ అలియాస్ బాలాజీ మొకడే హెడ్గేవార్ నాయకత్వంలోని సత్యాగ్రహుల జట్టులో సభ్యుడయ్యారు కూడా. (K.K.choudhary, source Matearal for a History of Freedom Movement, Civil Disobedience Movement, April, September 1930, vol.XI, G, Department, Government of Maharashtra, Bombay, 1990, p.901) జూన్ 30, 1930న చందాలో మాధ్‌వ శ్రీహరి అలియాస్ బాపూజీ ఆప్టే ఏర్పాటు చేసిన సమావేశాన్ని స్వయంసేవకులు దేశ్‌ముఖ్, అన్నాజి సిరాస్, చండ్కె ముందుండి నిర్వహించారు (Chaudhary, p.903).
మే 1, 1930న నాగపూర్ జరిగిన సమా వేశంలో డా.మూంజే నిషేధాన్ని ఉల్లంఘించి దహిహండా (అకోలా జిల్లా) నుండి తీసుకొచ్చిన ఉప్పు నీటి నుంచి ఉప్పు తయారుచేశారు. వి.డి.సావర్కర్ నిషిద్ధ గ్రంథం The Indian war of Independence, 1857 నుండి ఒక భాగం చదివారు. ఆ తరువాత సంఘ్ సర్‌కార్యవాహ్ గోపాల్ ముకుంద్ అలియాస్ బాలాజీ హుద్దార్ ఉప్పు తయారు చేసి, సావర్కర్ రచన ‘లైఫ్ ఆఫ్ మేజిని’ ముందుమాటలోని కొంత భాగాన్ని చదివారు. ఈ పుస్తకం పరాయి ప్రభుత్వాన్ని కూల్చడం గురించి చర్చిస్తుంది (Chaudhary, p.903). తరువాత మే, 21, 1930న జరిగిన సమావేశంలో, 700మంది పాల్గొనగా, అర్వి (వార్దా జిల్లా)కి చెందిన ప్రముఖ సంఘ స్వయంసేవకుడు డా।।మోరేశ్వర్ గణేశ్ ఆప్టే నిషేధిత సాహిత్యం చదివారు (Chaudhary, p.948). తరువాత కాల్‌లో ఆప్టే ఆర్వి సంఘచాలక్ అయ్యారు. నాగపూర్ జిల్లా సంఘచాలక్ అప్పాసాహెబ్ హల్దే మధ్య పరగణాల వార్ కౌన్సిల్‌కు పన్నెండవ అధ్యక్షుడయ్యాడు. ఆయన మార్చి 6,1931న కారాగారం నుండి విడుదలయ్యారు (Maharashtra, March 12, 1931). ఆయన కాంగ్రెస్‌లో ఒక నియంత, జిల్లా సంఘచాలక్. దీంతో కొంతమంది కాంగ్రెస్‌వారు గాంధీజీ చందాకు వచ్చినప్పుడు, హల్దే సమక్షంలోనే ఆయన మీద ఫిర్యాదు చేశారు. దానికి గాంధీజీ ఇలా అన్నారు ‘‘నాకు సంఘ్ గురించి తెలుసు, కాబట్టి డా।। హెడ్గేవార్, హల్దే గురించి ఇలా ఆలోచించకండి’’. ఈ జ్ఞాపకాన్ని హల్దే స్వయంగా హెడ్గేవార్ చరిత్రకారుడు పాల్కర్‌కు చెప్పారు (Sangh Archies, Hedgewar Papers, Nana Palkar / Hedgewar notes 2.2.133). సావనర్ పట్టణ సంఘచాలక్ నారాయణ అంబోకర్ రాయపూర్ కారాగారం నుంచి నుండి మార్చి, 11,1931న విడుదలయ్యారు. వషిం పట్టణానికి చెందిన అడ్వకేట్ శంకర్ అలియాస్ అన్నా సాహెబ్ డాబిక్‌ను మార్చి 10, 1931న జైలు నుండి విడుదలయ్యాక సన్మానించారు (Maharashtra, March 15, 1931). ఆగస్ట్ 1931లో ఆయన వషింకు సంఘచాలక్‌గా నియమితులయ్యారు.
సంస్థలో మార్పులు
తాను సత్యాగ్రహంలో పాల్గొనేందుకు హెడ్గేవార్ సంఘ్ వ్యవస్థలో కొన్ని మార్పులు చేశారు. జూన్ 20,1930న సంఘ్ స్వయంసేవకులకు ఉద్దేశించి రాసిన ఉత్తరంలో ఆయన ఇలా పేర్కొన్నారు. ప్రముఖ నాగపూర్ సంఘ స్వయంసేవకులు, వార్దా జిల్లా అధికారి అప్పాజి జోషి, పారమార్థ్ దేవ్, చందాలోని ప్రముఖ సంఘ్ సేవకులు వెకండే, కరోజే, పాలేవార్, అర్వి సంఘచాలక్ నానాజీ దేశ్‌పాండే, సలోద్ ఘకీర్ సంఘచాలక్ త్రైయంబక్‌రావ్ దేశ్‌పాండేతో కలసి నేను బేరాల్‌లోని పూసద్‌లో జరుగుతున్న సత్యాగ్రహంలో పాల్గొనబోతున్నాను. కాబట్టి ఆర్‌ఎస్‌ఎస్ కార్యనిర్వహణని నాగపూర్ ప్రముఖులు డా।। పరంజపేకు అప్పగించడం జరిగింది. ఇక నుండి ఆయన సంఘచాలక్‌గా ఉంటారు. నాగపూర్ సంఘ్‌తో జరిపే ఉత్తర ప్రత్యుత్తరాలు ఈ క్రింది చిరునామాతో జరగాలి. V.V.kelar, 8A, LLb, Advocate High court, It wad Darwaja, Nagpur city, వార్దాకు చెందిన అడ్వకేట్ మనోహర్ పంత్ దేశ్‌పాండేను అప్పాజీ జోషికి బదులుగా వార్దా జిల్లా అధికారిగా నియమించారు. ఉత్తర ప్రత్యుత్తరాలు చిరునామా Deshpande, teacher, New English School, Wardha.”
ఎంతో ముందు జాగ్రత్త ఉన్న డాక్టర్ హెడ్గేవార్ ఆ ఉత్తరాన్ని ఇంకా ఇలా కొనసాగించారు. ‘ఈ చిరునామాలను రాస్తున్నప్పుడు పేర్లు మాత్రమే రాయాలి. పదవుల పేర్లు, ఉదాహరణకు సంఘచాలక్, కార్యవాహ లాంటివి రాయకూడదు.’ తరువాత ఇలా రాశారు. ‘ఈ సంవత్సరపు వేసవి తరగతులు బాగా జరిగాయి. చాలామంది హాజరయ్యారు. శారీరక, కవాతు తరగతులుకి తోడు మేథోతరగతులు కూడా జరిగాయి.’ మనం గమనిం చాల్సిన విషయమేమిటంటే, హెడ్గేవార్ ఉత్తరంలో ఎక్కడా తను లేకుంటే సంఘ్ ఏమవుతుందో అనే కంగారు కనిపించదు. ఈ ఒక్క విషయం ద్వారా ఆయనకు తన సహచరుల పట్ల, తను రూపొందిం చిన సిద్ధాంతాల పట్ల ఉన్న విశ్వాసం కనబడుతుంది.
సర్‌సంఘచాలక్ పదవి వీడడం
అటవీ సత్యాగ్రహంలో భాగంగా అనధికారికంగా గడ్డి కోసినందుకు ఎం.ఎస్. ఆనీకు జులై 10న ఐపీసీ సెక్షన్ 379 కింద ఆరునెలల సాధారణ కారాగార శిక్ష వేశారు. ఆయన 11 మందితో కూడిన మొదటి సత్యాగ్రహ బృందం నాయకుడు. డా.మూంజే రెండవ జట్టుకు నాయకుడు. ఆయనకు కూడా న్యాయస్థానం అదే సెక్షన్ కింద సెషన్ పూర్తి అయ్యేవరకు శిక్ష, లేదా రూ.5 జరిమానా శిక్ష విధించారు. మరుసటి రోజు స్థానిక సత్యాగ్రహ సంఘం ఆహ్వానం మేరకు మూంజే సత్యాగ్రహం పాల్గొన్నారు. దీనికి రూ.10 జరిమానా, లేదా వారం రోజులు సాధారణ కారాగార శిక్ష విధించారు (Chaudhary, P.980). డాక్టర్ మూంజేను సంఘ్ గురు పూజోత్సవానికి అధ్యక్షత వహింపజేసి, సాదరంగా వీడ్కోలు పలకాలని డాక్టర్ హెడ్గేవార్ అనుకున్నారు. కానీ మూంజే అరెస్టుతో డా।। లక్ష్మణ్ వాసుదేవ్ అలియాస్ దాదాసాహెబ్ పరంజపేను ఆ కార్యక్రమానికి అధ్యక్షత వహించమని కోరారు. సంఘ్ గురుపూజ ఉత్సవం జులై 12, 1930న డా।। పరంజపే అధ్యక్షతన జరిగింది. ప్రార్థన తరువాత డా।।పరంజపే ఇలా అన్నారు. ‘‘డా.హెడ్గేవార్ కొంతమంది సహచరులతో కలిసి అటవీ సత్యాగ్రహంలో పాల్గొనబోతున్నారు. దాంట్లో ఎవరైనా పాల్గొనాలంటే పాల్గొనవచ్చు. మిగతావారు ఈ యువ సంస్థ కార్యక్రమాలలో సహకరించవచ్చు. నేటి ఈ ఉద్యమం దేశాన్ని ముందుకు తీసుకువెళుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ స్వాతంత్య్ర సముపార్జనలో ఇది తొలి అడుగు మాత్రమే. నిజమైన కార్యక్రమం ఏదంటే, ఎవరైతే తమ జీవితాన్ని దేశ స్వాతంత్య్రం కోసం త్యాగం చేయదలిచారో వారిని ఒకచోటికి చేర్చడం, సంఘటితం చేయడంలో ఉంది.’’ తరువాత హెడ్గేవార్ ఇలా అన్నారు, ‘‘ధన్యవాదాలు చెప్పి కూర్చున్న మరుక్షణం నుండి నేను సర్ సంఘచాలక్ బాధ్యతలో ఉండను. డా।। పరంజపే ఆ బాధ్యత తన భుజస్కందా లపై వేసుకోవడానికి అంగీకరించారు. అందుకు వారికి మనస్ఫూర్తిగా సంఘ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ ఉద్యమంలో హోపాల్గొంటున్న మనమందరం మన వ్యక్తిగత దాలోనే పాల్గొంటున్నాం. సంఘ్ కార్యక్రమాలూ, ఆశయాలూ, ఆలోచనలలో ఎలాంటి మార్పూ లేదు. వాటి పట్ల మా నమ్మకం యథాతథంగానే ఉంది. కొంచం కూడా తగ్గలేదు.
దేశ స్వాతంత్య్రం కోసం పని చేస్తున్న ప్రతి సంస్థకు దేశంలో జరుగుతున్న ఇతర ఉద్యమాల గురించి కూడా తెలుసుకోవలసిన బాధ్యత ఉంది. తెలుసుకున్న దానిని తమ కార్యక్రమానికి ఉపయోగించే బాధ్యత కూడా ఉంది. ఇప్పటిదాకా ఈ ఉద్యమంలో పాల్గొంటున్న సంఘ వ్యక్తులు, ఇకపై నుండి ఉద్యమంలో ప్రవేశిస్తున్న మేము అదే లక్ష్యంతో ఉన్నాం. జైలుకు వెళ్లడం ఈ కాలంలో దేశభక్తికి చిహ్నంలా మారింది. కానీ, రెండు సంవత్సరాలు జైలుకు వెళ్లేందుకు కూడా సిద్ధంగా ఉన్నవారు, తమ భార్యా, పిల్లలు, ఇల్లు, పని నుండి సెలవు తీసుకొని స్వాతంత్య్రం కోసం పనిచేసే ఒక సంస్థకు పనిచేయ మంటే ఎందుకు సిద్ధంగా లేరు. ఇలా ఎందుకు జరుగుతున్నది? ఎందుకంటే ప్రజలు ఒకటి అర్థం చేసుకోవడానికి సిద్ధంగా లేరు. దేశానికి స్వాతంత్య్ర సాధనకు ఆరునెలలో లేదా సంవత్సరమో పని చేయడంతోనే అయిపోదు, అది ఒక సంస్థ నిరంతరాయంగా సంవత్సరం తరువాత సంవత్సరం చేస్తే వస్తుంది. ఎప్పుడైతే ఈ సంచలనాత్మకత నిండిన దేశభక్తిని, దేశం కోసం ప్రాణత్యాగానికయినా సిద్ధం అనే ఈ ధోరణిని విడిచిపెట్టి, దేశంకోసం జీవిస్తూ, స్వాతంత్య్రం కోసం కృషిచేస్తున్న సంస్థలో పనిచేస్తే తప్ప దేశానికి మంచిరోజులు రావు. సంఘ్ లక్ష్యం యువకులలో ఈ వైఖరిని తేవడం, వారిని సంఘటితం చేయడం’’ (Sangh archives, Hedgewar Papers Nana Palkar/ Hedgewar notes, 33-131,132).
సంఘలో అవసరమైన మార్పులు చేసి, తన లక్ష్యాన్ని తెలియజేసి హెడ్గేవార్ సత్యాగ్రహంలో పాల్గొనేందుకు పూర్తిగా సంసిద్ధులయ్యారు.
– డాక్టర్ శ్రీరంగ్ గోడ్బొలే