ఆగస్ట్ 19 శ్రీ‌కృష్ణాష్టమి

– డా।। ఆరవల్లి జగన్నాథస్వామి, సీనియర్‌ ‌జర్నలిస్ట్ –

‘‌వస్తూని కోటి శస్సంతు పావనాని మహీతలే!/నతాని తత్తులాం యాంతి కృష్ణ నామానుకీర్తనే!! (ధరాతలంపైగల పవిత్ర వస్తువులన్నింటిని కలిపినా శ్రీకృష్ణనామ సంకీర్తనకు సాటిరావు’ అని శ్రీకూర్మ పురాణం పేర్కొంటోంది. గరుత్మంతుడిని చూసిన పాములు పారిపోయినట్లు శ్రీకృష్ణ కీర్తన ఆలాపనతో సమస్త పాపాలు పరిహారమవుతాయని (తత్కీర్తన ధ్వనింశ్రుత్వా సర్వాణి పాతకానిచ/దూరాదేవ పలాయంతే వైనతేయ మివోరగాః) ‘నారద పాంచారాత్రం’ తెలుపుతోంది. ‘కృష్ణ’ అంటే కష్టాలను (క్లేశాలను) పోగొట్టేవాడు అని తాత్త్వికులు అర్థం చెబుతారు. కలియుగంలో సంకీర్తనమే ప్రధాన మన్నట్లుగా, కృష్ణ నామస్మరణతో కష్టాలు దూరమవు తాయట. (అందుకేనేమో ఆపదలు వాటిల్లినప్పుడు జనులు ‘కృష్ణ, కృష్ణా..’ అని తలుస్తుంటారు). ఆ దివ్య నామకరణం చేసినవాడు గర్గ మహర్షి. ‘ఓం గర్గారోపిత నామాంకితాయ నమః’ అనీ పూజలు అందుకుంటున్నాడు.

‘కృష్ణ కృష్ణేతి కృష్ణేతి యో మాం స్మరతి నిత్యశః

జలం హిత్వా యథా పద్మం నరకా దుద్ధరామ్యహమ్‌’ (‌నిత్యం కృష్ణ కృష్ణా! అని జపిస్తే నీటిలో ఉన్నా తడి, బురద అంటని పద్మంలా నరకలోక బాధలు లేకుండా పోతాయట. (నారసింహ పురాణం )

 ‘ఎంతమాత్రమున ఎవరు తలచిన అంతమాత్రమే నీవు’ అని అన్నమాచార్య తిరుమ లేశుని నుతించినట్లు, ఎవరికి కావలసిన రూపంలో వారికి కనిపించడం, వారివారి భావనలకు అనుగు ణంగా వ్యవహరిస్తూ అనందపరచడం శ్రీకృష్ణుడి తత్త్వం. శ్రీరాముడు సహా పలు రామాయణ పాత్రలు ‘లక్ష్మణుడి నవ్వు’ను (లక్ష్మణ దేవరనవ్వు) ఎవరికి వారు ఆత్మన్యూనతా భావంతో అన్వయించుకున్నారని జానపదులు పాడుకున్నట్లు, కన్నయ్యను మహాభారత ప్రముఖ పాత్రలు పలు రకాలుగా భావించాయి. దుర్యోధనుడి దృష్టిలో, శ్రీకృష్ణుడు మాటలతో మభ్యపెట్టే మాయగాడు. ‘శ్రీకృష్ణుడిని మించిన బలం, బలగం మరొకటి లేద’ని అర్జునుడి విశ్వాసం. నమ్మిన వారికి కొంగు బంగారమని ద్రౌపది భక్తి, ‘నిజమైన స్నేహశీలి’ అని సుధాముడి మన్నన. ‘కృష్ణ దర్శనం కోసం కష్టాలైనా కోరుకోవచ్చ’ని కుంతి అభిమానం. సమర్థ శిష్యుడని సాందీపుడి వాత్సల్యం, పూర్వజన్మ సుకృతం కొద్దీ ఆయనకు అగ్రజుడిని కాగలిగానని ఆదిశేషువు అంశజుడు బలరాముని భావన… ఇలా ఎవరి దృష్టి కోణం వారిది. మానవుడిగా ఉంటూ దైవ లీలలు ప్రదర్శించిన ఆయనను పురాణాలు ‘లీలామానుష విగ్రహుడు’ అని కీర్తించాయి.

అవతరించినది మొదలు మహానిర్యాణం వరకు మానావమానాలను ఎదుర్కొన్నాడు. ‘వెన్నా మన్ను సమముగ తిన్న’ ఆయన వా•న్నిటిని తేలిగ్గా తీసుకున్నాడు. అయిన వారిని, ఆపన్నులను అనేక విధాలుగా కనికరించాడు, కటాక్షించాడు. బహువిధ లీలలు ప్రదర్శించాడు. పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించాడు. ‘అడుగడుగున గండాలెన్నో ఎదిరీది నిలిచాడు’.  ప్రేమను పంచుతూనే ధర్మ సంస్థాపన చేశాడు. రాజకీయ దురంధరుడు. శత్రువులను నిష్కంటకం చేసేందుకు అవసరమైతే చతుర్విధ ఉపాయాలను పాటించాలన్నాడు. పూతన జీవితాపహరణం నుంచి పాండవుల పట్టాభిషేకం వరకు ప్రణాళిక రూపొం దించిన రాజనీతిజ్ఞుడు. ఎక్కడా ఆయన లెక్క తప్పలేదు. ఒకవేళ ఆ పరిస్థితే ఎదురైతే ‘చక్రం’ అడ్డువేయకమానడు.

నెగ్గాలనే సంకల్పం ఉన్నా ఒక్కొక్కసారి కాలం కలసి రానప్పుడు తగ్గడంతో చిన్నతనం లేదని, కదనంలో ప్రత్యర్థు లను ఎదుర్కొనేందుకు ఆయుధం పట్టనవసరం లేదని, బుద్ధిబలంతో సమస్యను చక్కపెట్టవచ్చని నిరూపించాడు. కాలయవన, జరాసంధులతో పోరు అందుకు ఉదాహరణ. కాలయవనుడు మ్లేచ్ఛ వీరులతో కూడిన భారీ బలగంతో మధురను ముట్టడించేందుకు యత్నించగా, విశ్వకర్మ సహకారంతో యశోదానందనుడు సముద్రం మధ్యలో 12 యోజనాల పొడవు, వెడల్పు గల ద్వారకాపురిని నిర్మిం చాడు. మధురానగరివాసులను అక్కడిక చేర్చి, నిరాయు ధుడిగా వెళ్లి ఒకగుహలో ముచుకుంద ముని సాయంతో కాలయవనుడిని కడతేర్చాడు. జరాసంధుడితో అలుపెరుగక పదిహేడుసార్లు పోరాడాడు. జరాసంధుడు బలహీనపడిన ప్రతిసారి పారిపోయి బలం పుంజుకుని తిరిగి వచ్చేవాడు. అయినా వాసుదేవుడికి రణం చేయక తప్పలేదు. భీముడి చేతిలోనే జరాసంధ వధ రాసి ఉన్నందున ఆతడినే సాధనంగా అర్థరాత్రి మట్టు పెట్టించాడు.

పుట్టిన క్షణం నుంచి అవతార పరిసమాప్తి వరకు అనేకానేక సందర్భాలలో దేవుడనని నిరూపిస్తూనే ఉన్నాడు. అదే సమయంలో సామాన్యుల మాదిరిగా కష్టనష్టాలను ఎదుర్కొన్నాడు. అయితే, స్థితప్ర్ఞత, వ్యక్తిత్వమే గోపాలకు డిని గోవిందుని చేశాయి. రాజసూయ సభలో అగ్ర తాంబూలం అందుకున్నా, అవమానాలు ఎదుర్కొన్నా, కళ్లెదుటే ద్వారక సాగర గర్భంలో కలిసి పోతున్నా అదే స్థితప్ర్ఞత. ‘నేటికి ఏడవ రోజున సముద్రుడు ద్వారకను ముంచేస్తాడు. మునుల శాపం కారణంగా ముసలం పుడు తుంది. అది యదుక్షయానికి కారణమవుతుంది. పతివ్రతా శిరోమణ గాంధారి శాపం ఉండనే ఉంది. యుగసంధి ఆసన్నమైంది. కలియుగం ఆరంభమవుతుంది’ అని ఉద్దవునికి బోధిస్తాడు. అన్న బలరాముడిని మహాప్రస్థానానికి సిద్ధం చేశాడు. తాను అడవిలో విశ్రమించిన వేళ బోయ వాడి శరాఘాతంతో వైకుంఠపద ప్రాప్తుడయ్యాడు.

ద్విముఖవేత్త

 భారత, భాగవత కృష్ణతత్వాలలో సూక్ష్మ/సున్నిత భేదం గోచరిస్తుంది. భారతంలోని శ్రీకృష్ణుడు మేధావి, రాజనీతి దురంధరుడు, వ్యూహకర్త, దార్శనికుడు. భాగవతంలో ‘లీలా’ కృష్ణుడు. సున్నిత స్వభావి. సాధారణ పిల్లాడిలా మన్నుతిని అదలించబోయిన అమాయక అమ్మకు నోటిలో అనంత విశ్వాన్ని చూపాడు. ఆలమందలను కాస్తూ లేగదూడలతో ఆడుకున్నాడు. మంచి మిత్రుడు. జతగాళ్లతో చల్దులార•గించాడు. చెట్లు, కొండలు, గుట్టలు ఎక్కి ఆడుకున్నాడు. గోపీజన వల్లభుడు. చీరలు ఎత్తుకెళ్లిన చిలిపి వాడు,వస్త్రదానంతో శీలం కాపాడిన ఆత్మబంధువు..

ఆనంద స్వరూపుడు

అందరికి ఆనందం కలిగించేవాడు. సుందరవదనుడు. ‘బృందా వనం అందరిదీ గోవిందుడు అందరివాడు’ అనిపించుకున్న ఆనంద స్వరూపుడు. యశోదమ్మ ముద్దుమురిపాలలో వెన్నముద్దలా కరిగిపోయిన వాడే వివిధ సందర్భాలలో విరాట్‌ ‌స్వరూపాన్ని ప్రదర్శించాడు. పసిపాపడిగానే తల్లికి నోటిలో భువన భాండాలు చూపాడు.

ఇద్దరు తల్లుల ముద్దుల తనయుడు. ఒకరు (దేవకి) కన్నారు. ఒకరు (యశోద) పెంచారు. ‘ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు/తిద్దరాని మహిమల దేవకీ సుతుడు’ అని అన్నమాచార్య కీర్తించారు. శ్రీకృష్ణ, తిరుమ లేశుల మధ్య అభేదం చూపుతూ నిత్యం ‘ఓం దేవకీ గర్భసంజాతాయ నమః, ఓం యశోదేక్షణ లాలితాయ నమః’ అని అర్చనలు అందుకుంటున్నాడు. ‘అధరం మధురం వదనం మధురం, నయనం మధురం, హసితం మధురం, హృదయం మధురం గమనం మధురం, మధురాధిపతే అఖిలం మధురం’ అని వల్లభాచార్యులు ‘మధురాష్టకం’లో శ్లాఘించారు.

అవతారతత్త్వాన్ని విస్మరించి….

శ్రీకృష్ణుడితోపాటు అవతార పురుషులను,హిందూ దేవుళ్లను వ్యాఖ్యానించడం కొందరికి పరిపాటైపోయింది. పురాణాలు, దేవుళ్ల అస్తిత్త్వాన్ని ప్రశ్నిస్తూ, వివిధ సందర్భాలలో కించపరిచేలా వ్యాఖ్యానించడం విజ్ఞులను కలవరపరుస్తోంది. ‘భాగవతమందు శ్రీకృష్ణుడు వ్యభిచారిగా వర్ణింపబడియున్నాడు. దీనివలన శ్రీకృష్ణుని నిర్మల చరిత్ర కొక కళంకము కలిగినది. దీని మూలముననే వ్యభిచారము నకు శ్రీకృష్ణుడొక సామెతగా లోకులచే వ్యవహరింపబడు చున్నాడు. శ్రీకృష్ణుడు నిందలకుబాలయినట్లు ఏ యితర మహాపురుషుడును గాలేదనవచ్చును. ఇట్లు నిందించిన వారు వారి పరమభక్తులే. భక్తి కొఱకై యా పరమపురుషునిచే చిన్నతనమున దొంగతనం చేయించినారు. వయ సున వ్యభిచారము చేయించి నారు.ఇట్లు వర్ణించుట చేత జనసామాన్యంలో శ్రీకృష్ణుని గౌరవము తగ్గుచు వచ్చెను’ అని సంపాదక ప్రముఖుడు సురవరం ప్రతాపరెడ్డి (హిందువుల పండుగలు) దశాబ్దాల క్రితమే ఆవేదన చెందారు. ‘ఒకవేళ ఆయనే ‘రంగీలా’ రాజులా ఉంటే ‘ఎన్నటికిని భగవద్గీతను బోధింప జాలడు. కావున చీటికి మాటికి శ్రీకృష్ణుడిని స్త్రీల గుంపులో నిలిపి పటములు (చిత్రాలు) వ్రాయుట అపచారముగా నుండును’ అనీ అన్నారు. నిందితులు, నేరస్థులను ఉంచే చోటు (చెరసాల)ను ‘శ్రీకృష్ణ జన్మస్థానం’గా వ్యంగీకరించడం పట్ల ఆధ్యాత్మికవాదులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ‘భగవానుడు, ఏ నేరమో చేసి కారాగారానికి వెళ్లలేదు. మేనమామ కంసుడు,  సోదరిబావమరిది దేవకీవసు దేవులకు పుట్టబోయే శిశువు ద్వారా తనకు గల ప్రాణభయంతో ఆ దంపతులను ఖైదు చేసినప్పుడు కృష్ణుడు అక్కడ జన్మించడం ఆయన నేరం కాదు. అది అవతార పరమార్థమని పెద్దలు చెబుతారు. ‘ధర్మం నశించి,అధర్మం పెచ్చు పెరిగినప్పడు ధర్మ సంస్థాపన కోసం తనకు తానే సృష్టించుకుంటానని ప్రకటించిన మహనీయుడు అధర్మానికి ఎలా పాల్పడతారన్న వారి ధర్మసందేహం.

ప్రకృతి ప్రేమికుడు

శ్రీకృష్ణుడు ప్రకృతి ప్రేమికుడు. ప్రకృతిలో పెరిగాడు. ప్రకృతిని ఆస్వాదించాడు. ప్రకృతిలోనే దైవాన్ని చూశాడు.ఆయన ఆహార్యంలోనూ ప్రకృతి దర్శనమిస్తుంది. తలమీది పింఛం, మెడలోని చెంగల్వ పూదండ, చేతిలోని వేణువు, మొలతాడుకు కొమ్ముబూర. అన్నీ ప్రకృతి ప్రేమచిహ్నాలే. కృష్ణుడిని ప్రేమించడం అంటే ప్రకృతిని ప్రేమించడమే అంటారు ఆధ్యాత్మికవేత్తలు. ఇంద్రాది దేవతల ఆరాధన కంటే కొండలను, చెట్లను పూజించడం మేలన్నాడు. కొండలు ఓషధులను, బతకడానికి పండ్లు, పూలు, గోవులకు గడ్డి, పశుపక్ష్యాదులకు నీడనిస్తాయి. ఇంతకు మించిన దైవం ఏముంటుంది? అని వివరించి గోవర్ధనగిరిని అర్చింపచేశాడు.

చిన్ని కృష్ణా..!       

శ్రీకృష్ణ చరితంలో ఏ ఘట్టం చూసినా అద్భుతమే!  శ్రీకృష్ణనామం ఆనందకరం. అయితే కొందరికి చిన్నికృష్ణుడంటేనే  ఇష్టం. శ్రీకృష్ణుడు అనగానే చేతిలో వెన్నముద్దే గుర్తుకొస్తుంది. ‘చేత వెన్నముద్ద చెంగల్వ పూదండ/బంగారు మొలత్రాడు పట్టు దట్టి/ సందెతాయుతులును సరిమువ్వ గజ్జలు/చిన్ని కృష్ణ! నిన్ను చేరి కొలుతు’ అన్నట్లు యశోద ఇంటి ముంగిట కేరింతలు కొడుతూ చేతిలోని వెన్నముద్దను ఆరగించే కిట్టయ్యనే ఇష్టపడతారు. అందుకే తన పుట్టినరోజు (శ్రావణ బహుళ అష్టమి) వచ్చిందంటే చాలు.. కన్నయ్య చిన్నారులున్న ప్రతి ఇంటిలోనూ ప్రత్యక్ష మవుతాడు. అమ్మలంతా ‘యశోద’లు, చిన్నారులు చిన్నికృష్ణులు అవుతారు. పాఠశాలల్లో కృష్ణ వేషధారణ పోటీలూ నిర్వహిస్తారు. పురాణ పురుషులకు సంబం ధించి ఇలాంటి ఆహార్యం/వేషధారణ శ్రీకృష్ణాష్టమికే ప్రత్యేకం.

శ్రీకృష్ణ పరమాత్ముడు జన్మించిన అష్టమి తిథి జన్మాష్టమిగా ప్రసిద్ధి. ఆ రోజు వేకువజామును నుంచి అర్థరాత్రి వరకు ఆరాధనీయులు నిరాహారంగా ఉంటారు. రాత్రి 12 గంటలకు చంద్రదర్శనం తరువాత చిన్నికృష్ణయ్యను ఆహ్వానిస్తూ, పూజాదికాలు నిర్వహిస్తారు. నైవేద్యం సమర్పించి స్వీకరిస్తారు. ఈ పండుగను సామూహికంగా జరుపుకుంటారు. సాధారణంగా ఆలయాలకు వెళ్లి భజనలు, కోలా టాలు వంటి కార్యక్రమాలలో పాల్గొంటారు.

About Author

By editor

Twitter
YOUTUBE