శ్రావణాన్ని పండుగల మాసం అంటారు. ఈ నెలలోని పౌర్ణమికి మరింత విశిష్టత ఉంది. సముద్రం పాలైన ధరణిని ఉద్ధరించేందుకు శ్వేత వరాహ మూర్తి, జ్ఞానప్రదాత, ‘వాగీశ్వరుడు’ హయగ్రీవుడు, విఖాసన మహర్షి ఆవిర్భవించిన రోజు. మహాలక్ష్మికి పరమేశ్వరడు ధనాధిపత్యాన్ని అనుగ్రహించిన రోజని శివపురాణం, శ్రీవాణికి సమస్త విద్యాశక్తులు చేకూరిన రోజని శ్రీవిద్యాసూక్తం, దేవభాష సంస్కృతం ఈశ్వర సంకల్పంతో ఆవిర్భవించిన తిథి అని రుద్రసంహిత పేర్కొంటోంది. ఇది వేదాధ్యయనం ప్రారంభ తిథి. సోదరసోదరీ ప్రేమకు ప్రతీకగా ధరించే రక్షాబంధన్‌ ఈ ‌రోజే. మరాఠీయలు, కన్నడిగులు ఈ రోజున సాగరపూజ చేసి కొబ్బరికాయలు సమర్పిస్తారు. దీనిని నారికేళ పౌర్ణమి, నార్లీ పూర్ణిమ అంటారు. ఉత్తరప్రదేశ్‌, ‌చత్తీస్‌గఢ్‌ ‌వాసులు పంటలు బాగా పండాలని కోరుతూ కజరీ (గోధుమ) పౌర్ణమిగా జరుపుకుంటారు. ఇలా మన సంస్కృతీ సంప్రదాయాల బలిమి, ఘనమైన వారసత్వ కలిమి శ్రావణ పౌర్ణమి.

———————

ఆదివరాహా! నమో నమః!

ఆగస్ట్ 10 ‌వరహ జయంతి

సముద్రంలోకి జారిపడిన ధరణిని ఉద్ధరించేం దుకు బ్రహ్మనాసా రంధ్రం నుంచి శ్రీహరి శ్వేత వరాహమూర్తిగా ఆవిర్భవించాడు. బొటనవ్రేలు పరిమాణంలో అవతరించిన యజ్ఞ వరాహమూర్తి చూస్తుండగానే పర్వత ప్రమాణంలో పెరిగాడు. ఆయన చేసిన గర్జనకు సత్యలోకంలోని మునులు రుగ్వేద, యజుర్వేద, సామవేద మంత్రాలతో నుతించారట. యజ్ఞ వరాహమూర్తి తన గిట్టలతో సముద్రం లోని నీటిని ఎగమీటి అట్టడుగున ఉన్న భూమిని కోరల సహాయంతో పైకెత్తాడు. ఎదిరింప వచ్చిన హిరణ్యాక్షుడిని గదతో మోది సంహరించాడు. ధరాతలాన్ని కోరలతో పైకెత్తి. అష్టదిగ్గజాలను ఆసరాగా ఏర్పరచి, వాటి తొండాలపై దానిని ప్రతిష్ఠించాడని, అప్పటినుంచి వరాహ కల్పం ప్రారంభమైందని పురాణ వచనం.

ఈ అవతార పురాణ గాథను అటుంచితే, దీనిని సూక్ష్మంగా విశ్లేషిస్తే, ఖగోళ రహస్యాలు వెల్లడవు తాయని చెబుతారు. గ్రహాల చలనలు, అవి తమకక్ష్య నుంచి జారినప్పుడు తలెత్తే ఉపద్రవాలను గుర్తించి, వాటిని యథాస్థానంలో ప్రవేశపెట్టి జీవజాలానికి మేలు చేయడం లాంటి విశేషాలు ఈ అవతారానికి నేపథ్యమని విద్వాంసులు, ప్రవచనకర్తలు విశ్లేషిస్తారు. స్థితికారకుడు శ్రీమన్నారాయణుడు వరాహరూపుడిగా తన ధర్మాన్ని నిర్వర్తించారని భావించాలి. భూమిని ధర్మమార్గంలో పరిపాలించవలసిందిగా బ్రహ్మ తనను చూడవచ్చిన కుమారుడు స్వాయంభు మనువును ఆదేశించారట. దానికి ‘నీటి అడుగు భాగాన పాతా ళంలో కూరుకుపోయిన ధరను ఉద్ధరించే ఆలోచన చేయాలి’ అని అర్థించడంతో, విధాత శ్రీపతిని ధ్యానిం చాడు. మరుక్షణం ఆయన బ్రహ్మ ముక్కు నుంచి బొటనవేలంత పరిమాణంలో యజ్ఞవరాహ మూర్తిగా ఆవిర్భవించి, ఆకాశానికి ఎగిశాడు. భాగవతంలోని వరాహస్వామి గురించిన ప్రస్తావన ప్రకారం, వైకుంఠ ద్వార పాలకులు జయవిజయులు మునుల శాపంతో హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు అనే దానవ సోదరులుగా జన్మించారు. హిరణ్యాక్షుడు దిక్పాలకులపై దాడిలో భాగంగా వరుణుడి మీదికి వెళ్లగా ‘నీకు సరైన జోడి శ్రీమహావిష్ణువే’ అని చెప్పడంతో దానవుడు అటుగా మళ్లాడు.

సముద్రం అట్టడుగున పడి ఉన్న భూమిని ఉద్ధరించే కార్యంలో ఉన్న శ్రీహరిపై కాలుదువ్వాడు. వరాహమూర్తి తన కోరల సాయంతో భూమిని యథాస్థానానికి చేర్చి అసుర సంహారం పూర్తిచేశాడు.

రామకృష్ణావతారాల మాదిరిగా ఇది సంపూర్ణ అవతారం కాక పోయినా, కొంతకాలం భూ మండలంపై నివసించాలను కొని, క్రీడాద్రిని గరుడినితో భువిపైకి తెప్పించుకున్నాడట. అదే నేటి వెంకటాద్రి అని వరాహ పురాణం పేర్కొంటోంది. తిరుమల క్షేత్రంలో వెలసిన మొదటి దైవం కనుక అది ‘ఆది వరాహ క్షేత్రం’ అని ప్రసిద్ధి పొందింది.

తిరుమల తరువాత సింహా చలంలోనే నృసింహావతారంతో కలసి ‘వరాహ లక్ష్మీనృసింహుడి’గా పూజ లందుకుంటున్నాడు.

కలియుగ ప్రత్యక్ష దైవంగా ప్రణ తులు అందుకుంటున్న శ్రీనివాసుడు ఆయన వద్ద నుంచి కొంత భూమిని పొంది ప్రతిగా తన భక్తులు వరాహ స్వామిని మొదట దర్శించుకొని, పూజాదికాలు నిర్వహించేలా చేశాడు. బ్రహ్మోత్సవం చివరిరోజు శ్రవణ నక్షత్రంనాడు చక్రస్నానం సందర్భంగా శ్రీనివాసుడు దేవేరులతో వరాహస్వామి ఆలయ ముఖ మండపంలోనికి వేంచేస్తారు.

సాగరం నుంచి భూమిని ఉద్ధరించి మనకు నివాసం యోగ్యం చేశాడు కనుక స్నానసమయంలో వరాహమూర్తిని స్మరించుకుంటూ మొదట మృత్తిగా స్నానం చేయాలని శాస్త్రం.

– డా।। ఆరవల్లి జగన్నాథస్వామి,  సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE