– జమలాపురపు విఠల్‌రావు

చైనా గర్జిస్తుంది! రంకెలేస్తుంది.. గట్టి హెచ్చరికలు జారీచేస్తుంది. నానా హడావిడి చేస్తుంది. చివరకు తుస్సుమని వెనక్కి జారుకుంటుంది. ప్రస్తుతం తైవాన్‌ ‌విషయంలో జరిగింది ఇదే. ఈసారి చైనా గర్జనకు కారణం నాన్సీ పెలోసీ. ఈమె యూఎస్‌ ‌స్పీకర్‌. ‌తాను తైవాన్‌లో పర్యటిస్తానని ప్రకటించిన వెంటనే చైనా ‘గర్జన’ సమాచార యుద్ధంతో మొదలైంది. ప్రపంచమంతా దద్దరిల్లేలా సమాచార పోరాటం చేసిన చైనా చివరకు తనకు తానే ఒక ‘క్యారికేచర్‌’‌గా మిగిలింది. గ్లోబల్‌ ‌టైమ్స్‌లో ఎడిటర్‌ ‌హుజిన్‌ ఒక దశలో యూఎస్‌, ఆ‌స్ట్రేలియా, జపాన్‌లను వరుసగా కాగితం పులి, కాగితం కుక్క, కాగితం పిల్లి అంటూ పేర్కొన్నాడు. ఇప్పుడు తమ దేశం పైవాటిలో ఏ కేటగిరీకి చెందుతుందో ఆయనే చెప్పాలి మరి!


ఎట్టకేలకు గత వారం రోజులుగా తైవాన్‌కు సమీపంలో జరుపుతున్న సైనిక విన్యాసాలను నిలిపేస్తున్నట్టు చైనా ఆగస్ట్ 11‌న ప్రకటించడం, పై వ్యాఖ్యలకు సరిగ్గా సరిపోతుంది. ఈ విన్యాసాల సందర్భంగా తాము నిర్దేశించుకున్న చాలా మిషన్లను పూర్తిచేసినట్టు పీపుల్స్ ‌లిబరేషన్‌ ఆర్మీ (పీఎల్‌ఏ) ఈస్టర్న్ ‌థియేటర్‌ ‌కమాండ్‌ ‌చెప్పడం, దళాల ఉమ్మడి పోరాట పటిమను విజయవంతంగా పరీక్షించినట్టు గ్లోబల్‌ ‌టైమ్స్ ‌రాయడం, తైవాన్‌ ‌జలసంధిలో పెట్రో లింగ్‌ ‌కార్యకలాపాలు కొనసాగుతాయని పేర్కొనడం వంటి విషయాలు పైకి గంభీరంగా చెప్పుకోవడానికి మాత్రమే! అయితే సైనిక విన్యాసాలు ఆగినప్పటికీ చైనా యుద్ధ విమానాలు, తైవాన్‌ ‌గగనతల ఉల్లంఘనకు పాల్పడటం ఇంకా కొనసాగుతోంది.

ఎవరి ప్రయోజనాలు వారివి

నిజానికి నాన్సీ పెలోసీ పర్యటన వివరాలు వెల్లడయినప్పటి నుంచి ‘ఇది నిప్పుతో చెలగాట’ మంటూ చైనా చేసిన ప్రకటనలు, ఇతరత్రా చేసిన హడావిడి ద్వారా యుద్ధం తప్పదన్న పరిస్థితి తెచ్చింది చైనానే. పెలోసీ పర్యటన వెనుక ఆమె కారణాలు ఆమెకుండవచ్చు! రాబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్‌కు నామినేషన్‌ అవకాశం లభించకపోతే, తైవాన్‌లో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ధైర్యంగా వెళ్లింది తానేనని చెప్పుకోవడానికి, తద్వారా అధ్యక్ష పదవికి పోటీలో నిలబడటానికి అవకాశాలు పెంచుకోవడం ఆమె లక్ష్యం కావచ్చు. అదీ కాకుండా ఆమె ఎప్పుడూ వివాదాల్లో ఉండే నాయకురాలిగా పేరు. చైనా పాలకులకు ఇది తెలియదనుకోవడం అమాయకత్వమే అవుతుంది. ఎందుకంటే వచ్చే అక్టోబర్‌లో కమ్యూనిస్టు పార్టీ అతిపెద్ద సదస్సు జరగనుంది. షి జిన్‌పింగ్‌ ‌మూడోసారి దేశాధ్యక్షుడిగా కొనసాగాలనుకుంటు న్నారు. ఇప్పటికే కుప్పకూలుతున్న ఆర్థిక వ్యవస్థ, జీరో కొవిడ్‌ ‌విధానంతో దేశంలో జిన్‌పింగ్‌ ‌ప్రతిష్ట మసకబారుతోంది. దీనివల్ల మరోసారి దేశాధ్యక్షుడిగా కొనసాగాలన్న ఆయన ఆకాంక్షకు ఇవి అడ్డంకిగా నిలిచే ప్రమాదం ఉండటంతో నాన్సీ పెలోసీ పుణ్యమాని తైవాన్‌పై కత్తులు దూసి, దేశ ప్రజల దృష్టిని మరల్చేందుకు ఆయన ఈ హడావిడి చేసి ఉండవచ్చు. ఎందుకంటే గతంలో కూడా నాలుగు సార్లు అమెరికా నేతలు తైవాన్‌లో పర్యటించినప్పుడు కూడా చైనా ఇదే వ్యవహారశైలిని ప్రదర్శించింది తప్ప యుద్ధం చేయలేదు. కాకపోతే ఇప్పుడు మరింత హడావిడి చేసిందంతే. ఇక అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ‌తైవాన్‌ ‌విషయంలో కచ్చితంగా ఉండటం వెనుక ప్రజల్లో పడిపోతున్న తన గ్రాఫ్‌ను పెంచు కోవడంలో భాగం కావచ్చు. బలహీన అధ్యక్షుడన్న అపప్రథ మూటకట్టుకుంటున్న ఆయనకు అల్‌ఖైదా అధినేత జవహరీని మట్టుపెట్టడం, ఇప్పుడు తైవాన్‌ ‌వ్యవహారంలో చైనా వెనక్కి తగ్గడం.. ఈ రెండూ దేశీయంగా ఉన్న వ్యతిరేకతను సానుకూలంగా మార్చవచ్చు.

ఆంక్షల విధింపులో స్వార్థం

యూఎస్‌ ‌స్పీకర్‌ ‌నాన్సీ పెలోసీ తైవాన్‌లో పర్యటించిన వెంటనే చైనా ఆ దేశంపై ఆర్థిక ఆంక్షలు విధించింది. కొన్ని పండ్లు, చేపలు, ఇసుక ఎగుమతిని నిషేధించింది. కానీ సెమి-కండక్టర్‌ ‌పరిశ్రమ జోలికి పోకుండా జాగ్రత్త పడింది. కంప్యూటర్లు, కార్లు, మెడికల్‌ ‌పరికరాలు, విమానాలకు ఈ చిప్స్ ఎం‌తో అవసరం. తైవాన్‌ ‌మొత్తం ఆదాయంలో 64% వరకు ఈ సెమికండక్టర్ల ఎగుమతుల ద్వారానే లభిస్తుంది. ఇదే సమయంలో తైవాన్‌లో అత్యాధునిక సెమికండక్టర్ల ఉత్పత్తి 92% వరకు ఉంటుందని బోస్టన్‌ ‌కన్సల్టింగ్‌ ‌సంస్థ పేర్కొంది. తైవాన్‌ ‌మొత్తం ఆదాయంలో 70% ఎగుమతుల ద్వారానే పొందు తోంది. తైవాన్‌ ‌సెమికండక్టర్‌ ‌మ్యాన్యుఫ్యాక్చరింగ్‌ ‌కంపెనీ (టీఎస్‌ఎం‌సీ) ప్రపంచంలోని మొత్తం చిప్స్ ‌మార్కెట్‌లో సగం వరకు ఉత్పత్తి చేస్తోంది. ప్రపంచ దేశాలకు కంప్యూటర్‌ ‌చిప్స్ ‌ప్రధానంగా తైవాన్‌ ‌నుంచే అందుతాయి. ఈ నేపథ్యంలో వీటిపై ఆంక్షలు విధిస్తే ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వస్తుందన్న భయంతోనే చైనా వీటిజోలికి పోలేదన్నది నగ్నసత్యం. రష్యా-ఉక్రెయిన్‌ ‌యుద్ధం నేపథ్యంలో, రష్యాపై ఆంక్షలు విధించిన యూరప్‌, ‌పశ్చిమ దేశాలకు ఏ గతి పట్టిందో ప్రపంచమంతా గమనిస్తోంది. తైవాన్‌పై ఆంక్షల ద్వారా తనకూ అదే దుస్థితి దాపురించకుండా చైనా జాగ్రత్త పడిందనే చెప్పాలి. అందువల్ల పండ్లు, చేపల దిగుమతులపై విధించిన ఆంక్షలు తైవాన్‌పై పెద్దగా ప్రభావం చూపవు.

ఒకరకంగా సెమి కండక్టర్‌ ‌పరిశ్రమ తైవాన్‌కు రక్షణ కల్పిస్తోందనే చెప్పాలి. ఎందుకంటే ఈ పరిశ్రమ ఉత్పత్తులు యూఎస్‌, ఇతర పశ్చిమ యూరప్‌ ‌దేశాలకు చాలా అవసరం. 2020లో విడుదల చేసిన కాంగ్రెస్‌ ‌రీసెర్చ్ ‌సర్వీస్‌ ‌రిపోర్ట్ ‌ప్రకారం, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సెమి కండక్టర్ల డిమాండ్‌లో చైనా వాటా 60%. వీటి ఉత్పత్తికోసం చైనా బిలియన్ల డాలర్లు ఖర్చుచేస్తున్నప్పటికీ, షాంఘైలోని ఎస్‌ఎంఐసీ పదిశాతం మార్కెట్‌ అవసరాలను మాత్రమే తీర్చగలుగుతోంది. ఈ నేపథ్యంలో చైనాలోని కంపెనీలకు తైవాన్‌ ‌నుంచి దిగుమతి అయ్యే సెమికండక్టర్లే ఆధారం. అందువల్ల తైవాన్‌ను ఏదోవిధంగా తనలో కలుపుకోవడం అన్ని సమస్యలకు పరిష్కారమన్నది చైనా ఉద్దేశమైనప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో ఇది సాధ్యమయ్యేపని కాదు. అట్లాగని నాన్సీ పెలోసీ తైవాన్‌ ‌ప్రయాణాన్ని ఆమోదించనూ లేదు. అందువల్లనే ఆమె రాకపై ఇంత వ్యతిరేకత.

పవర్‌ ‌హౌజ్‌ ఆఫ్‌ ‌సెమికండక్టర్స్

‌తైవాన్‌ ‌ప్రస్తుత అధ్యక్షురాలు త్సాయ్‌ ఇం‌గ్‌ ‌వెన్‌ ‌నేతృత్వంలో చాలా వేగంగా పురోగమిస్తోంది. ప్రపంచంలో 21వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా, విదేశీ మారకద్రవ్య నిల్వల్లో ఆరో స్థానంలో ఉన్న తైవాన్‌ ‌పీపుల్స్ ‌లిబరేషన్‌ ఆర్మీ నుంచి పొంచివున్న ముప్పు నేపథ్యంలో, పశ్చిమ దేశాలతో సాన్నిహిత్యాన్ని నెరపుతోంది. ఇప్పుడు తైవాన్‌ ‌ప్రపంచానికే ‘పవర్‌ ‌హౌజ్‌ ఆఫ్‌ ‌సెమి కండక్టర్స్’. ఈ ‌పరిశ్రమకు ఏ ప్రమాదం వాటిల్లినా ప్రపంచం అల్లకల్లోలం కాకమానదు. ఒకరకంగా ఈ పరిశ్రమే తైవాన్‌కు శ్రీరామ రక్ష. అంతేకాదు తైవాన్‌ ఇప్పుడు ‘పోర్కుపైన్‌ ‌డిఫెన్స్’ (‌ముళ్లపంది రక్షణ విధానం)ను అనుసరిస్తూ దేశాన్ని శత్రు దుర్భేద్యంగా మార్చింది. ఇప్పుడు తైవాన్‌ను ఆక్రమించడం చైనాకు అంత తేలికకాదు. అందుకు చెల్లించే మూల్యం, తైవాన్‌ను జయించిన దానికంటే ఎన్నోరెట్లు ఎక్కువ! ఇదిలా వుండగా తైవాన్‌లో క్షిపణి వ్యవస్థ అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న తైవాన్‌ ‌డిఫెన్స్ ‌రీసెర్చ్ అం‌డ్‌ ‌డెవలప్‌మెంట్‌ ‌సంస్థలో ద్వితీయ స్థానంలో ఉన్న ఓయూ యంగ్‌ ‌లీ హింగ్‌ ఇటీవల హోటల్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం ఈ మొత్తం వ్యవహారంలో ఒక మిస్టరీగా మారింది.

పరువు పోగొట్టుకున్న చైనా

పోనం పెహ్‌లో జరిగిన విదేశాంగ మంత్రుల సమావేశంలో యూఎస్‌ ‌విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ ఎదురుగానే చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ ఈ, ‌నాన్సీ పెలోసీ పర్యటపై నిప్పులు చెరిగాడు. అయితే బ్లింకెన్‌, ‌మన విదేశాంగ మంత్రి జయ్‌ ‌శంకర్‌లు ఈ సమావేశాన్ని కేవలం సాధారణ వాణిజ్య సంబంధాలకు సంబంధించిన సమావేశం గానే పరిగణించడం, ఆసియన్‌ ‌దేశాలు దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో చైనా వ్యవహారశైలిని తప్పు పట్టడమే కాకుండా, యునైటెడ్‌ ‌నేషన్స్ ‌కన్వెన్షన్‌ ‌ఫర్‌ ‌లా ఆఫ్‌ ‌ది సీస్‌ (‌యుఎన్‌సీఎల్‌ఓఎస్‌)‌ను గౌరవించా లని కోరడంతో చైనా పరువుపోయింది. అంతేకాదు తైవాన్‌ ‌విషయంలో చైనా తప్పుడు అంచనాలు అంతర్జాతీయ సంఘర్షణలకు దారి తీస్తాయన్న అభిప్రాయాలు కూడా సర్వత్రా వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో తైవాన్‌ ‌విషయంలో చైనా తన దుందు డుకు చర్యలను విరమించుకోవాలని ఆస్ట్రేలియా, జపాన్‌లు హితవు చెప్పాయి. తైవాన్‌పై దురాక్రమణకు పాల్పడితే రక్షణకు తాము రంగంలోకి దిగుతామని ఈ రెండు దేశాలు గతంలోనే చైనాను హెచ్చరించడం గమనార్హం. ఇన్ని జరుగుతున్నా చైనా.. తైవాన్‌ ‌ప్రాదేశిక జలాల్లో ప్రవేశించడం, తైవాన్‌ ‌గగనతలాన్ని పదేపదే ఉల్లఘించడంతో పాటు నేరుగా క్షిపణులు ప్రయోగించడం వంటి చర్యలకు పాల్పడింది. ఈ క్షిపణుల్లో ఐదు నేరుగా జపాన్‌ ‌ప్రాదేశిక జలాల్లో పడ్డాయి. తక్షణమే జపాన్‌ ‌దీనికి నిరసన వ్యక్తం చేయడంతో, ‘జపాన్‌తో సముద్ర జలాల సరిహద్దు నిర్ధారణ కాలేదు కాబట్టి, ఆ దేశ ఆరోపణను మేం ఖాతరు చేయబో’మని చైనా విదేశాంగశాఖ దురుసు సమాధానం ఇచ్చింది.

ఫలితాన్నిచ్చిన ‘మౌన’ దౌత్యం

తన ఒకే చైనా విధానాన్ని దెబ్బతీసిన నాన్సీ పెలోసీ పర్యటన నేపథ్యంలో, భారత్‌ ‌నుంచి తన విధానానికి మద్దతు లభిస్తుందని చైనా ఆశించింది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ ‌ఢాకా పర్యటన సందర్భంగా బంగ్లాదేశ్‌ ‌తమకు మద్దతు పలకడం, ఇదే సమయంలో రష్యా, పాకిస్తాన్‌, ఇరాన్‌, శ్రీ‌లంక దేశాలు కూడా వన్‌ ‌చైనా విధానానికే జైకొట్టినప్పటికీ, వ్యూహాత్మక మౌనం వహిస్తున్న మన దేశం నుంచి ‘ఉపశమన’ ప్రకటన వెలువడకపోవడం కొరుకుడు పడనిదే. వ్యూహాత్మక మౌనం కూడా దౌత్యనీతిలో భాగం! తమ తప్పులను కప్పిపుచ్చుకునే గురివింద నాటకాలు చైనా, యూఎస్‌ ‌వంటి దేశాలకు వప్పుతాయేమో కానీ, భారత్‌ ‌ముందు ఈ ఆటలు సాగవు. ఎందుకంటే దక్షిణ చైనా సముద్రంలో చైనా ఆధిపత్యాన్ని ధైర్యంగా ప్రశ్నిస్తున్న దేశం భారత్‌. ‌టిబెట్‌, ‌జింజియాంగ్‌ ‌ప్రాంతాలను కబ్జాచేసి, భారత భూభాగమైన ఆక్సాయ్‌చిన్‌ ‌ప్రాంతాన్ని ఆక్రమించుకొని, అదేమంటే హిమాలయ ప్రాంతాల్లో పెద్దఎత్తున సైన్యాన్ని మోహరించి, భారత్‌కు చెందిన అరుణాచల్‌ ‌ప్రదేశ్‌ ‌తనదేనంటూ బుకాయిస్తూ, కశ్మీర్‌లో 30% భూభాగాన్ని ఆక్రమించిన పాకిస్తాన్‌ను సమర్థిస్తూ, దక్షిణ చైనా సముద్రంలో 80% తన పరిధిలోనిదేనంటూ మొండివాదనలు చేసే తెంపర్లమారి చైనా ఇప్పుడు ‘ప్రాదేశిక సమగ్రత’, ‘ఇతరదేశాల అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చకూడ’ దంటూ సుద్దులు చెప్పడం ఏ నీతి? దక్షిణ చైనా సముద్రంలోని ద్వీపాలను ఆక్రమించి వాటిని సైనికీకరించి, ఇప్పుడు ప్రజాస్వామిక తైవాన్‌కు యూఎస్‌ ‌మద్దతు తెలిపితే ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం అతినటన కాక మరేంటి? బహుశా జోబైడెన్‌, ‌జిన్‌పింగ్‌, ‌నాన్సీ పెలోసీల రాజకీయ చదరంగంలో తైవాన్‌ ఒక పావుగా మారిందన్న సంగతిని అంచనా వేయడం, చైనా ఎట్టి పరిస్థితుల్లో యుద్ధానికి దిగదన్న విశ్వాసం బహుశా భారత్‌ ‌వ్యూహాత్మక మౌనానికి కారణం కావచ్చు. చివరికి భారత్‌ అనుసరించిన ‘మౌనదౌత్యం’ అనుకున్న ఫలితాన్నిచ్చింది!

బెడిసికొడుతున్న ఒకే చైనా విధానం

ఒకే చైనా విధానానికి ఆస్ట్రేలియా, యూఎస్‌, ‌జపాన్‌, ఇం‌డియా వంటి దేశాలు గతంలో మద్దతు తెలిపినా చైనా విస్తరణవాదం, దుందుడుకుతనం నేపథ్యంలో గత దశాబ్దకాలంగా తమ వ్యవహారశైలిని మార్చుకున్నాయి. కొలిక్కిరాని సరిహద్దు వివాదం, 2020లో గల్వాన్‌• ‌ఘర్షణ, అడుగడుగునా సైంధవ పాత్ర పోషిస్తున్న చైనా విషయంలో భారత్‌ ఒక స్పష్టమైన విధానాన్ని అనుసరిస్తూ వస్తోంది. ముఖ్యంగా తైవాన్‌తో ఆర్థిక, వాణిజ్య సంబంధాలు నెరపడం, ఇందుకు అవసరమైన ఒప్పందాలపై సంతకాలు చేయడం వంటి చర్యల ద్వారా చైనా నాయకత్వాన్ని ఇరుకున పెడుతోంది. 2021లో భారత్‌, ‌తైవాన్‌ల మధ్య కుదిరిన ఒప్పందాల నేపథ్యంలో ఇరు దేశాల సంబంధాలు వేగంగా ముందుకు సాగుతున్నాయి. ఇక ఆస్ట్రేలియా, జపాన్‌, ‌యూఎస్‌లు బహిరంగంగానే తైవాన్‌కు మద్దతు తెలుపుతున్నాయి. అన్నింటికీ మించి ఈ నాలుగు దేశాలు క్వాడ్‌ ‌సభ్యులు. ఇప్పుడు ఇవి ‘ఒకే చైనా’ అనే ‘దుడ్డుకర్ర’ విధానాన్ని ఆ దేశంపైనే ప్రయోగిస్తుండటం తాజా పరిణామం.

వ్యాసకర్త: సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE