త్రివర్ణ పతాకాన్ని గుర్తుకు తెచ్చే చీర కట్టుతో, ఎంతో హుందాగా, గంభీరంగా ద్రౌపది ముర్ము 15వ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంట్‌ ‌సెంట్రల్‌హాల్‌లో జరిగిన ముర్ము ప్రమాణ స్వీకారోత్సవం అక్షరాలా స్ఫూర్తిదాయకంగా సాగింది. ఉద్విగ్న భరిత వాతావరణంలో, ఉత్తేజకరంగా, చరిత్రాత్మక ఘట్టంగా ముగిసింది. రెండో మహిళా రాష్ట్రపతిగా ఆమె పట్టాభిషిక్తురాలయ్యారు.  పురాతన నాగరికత కలిగిన ఈ దేశం తన సంస్కృతిలో భాగంగా ఉన్న అట్టడుగు వర్గం నుంచి వచ్చిన మహిళకు దేశ అత్యున్నత రాజ్యాంగ పదవిని అప్పగిస్తున్న మహోన్నత క్షణంగానే అక్కడివారంతా భావించినట్టు కనిపించింది.

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ‌నూతలపాటి వెంకటరమణ ఆమె చేత ‘భగవంతుని సాక్షి’గా ప్రమాణం చేయించారు. 14వ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ ‌కోవింద్‌ ‌తన వారసురాలికి సవినయంగా బాధ్యతలు అప్పగించారు. భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, లోక్‌సభ స్పీకర్‌ ఓం ‌బిర్లా, ప్రధాని నరేంద్ర మోదీ, ఆయన మంత్రివర్గ సహచరులు, భారత మొదటి మహిళా రాష్ట్రపతి ప్రతిభాదేవీ పాటిల్‌ ‌షెకావత్‌, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ ‌పట్నాయక్‌, ఉత్తరప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, ‌కాంగ్రెస్‌ ‌నాయకురాలు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, వైసీపీ నాయకుడు విజయసాయిరెడ్డి వంటి ఎందరో ఈ ఉత్సవానికి హాజరయ్యారు. కుళ్లు రాజకీయాల మాయలో పడి ఇలాంటి చరిత్రాత్మక ఘట్టంలో భాగస్వాములు కాలేకపోయినవారు కూడా ఉన్నారు.

ప్రమాణ స్వీకారం తరువాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 18 నిమిషాల పాటు చేసిన ప్రసంగం హాలులోని వారినే కాదు, కార్యక్రమాన్ని వీక్షిస్తున్న భారతీయులను కూడా కదిలించింది. సంప్రదాయక గిరిజన సంబోధన ‘జోహార్‌’ అం‌టూ ముర్ము తన ప్రసంగం ఆరంభించారు. ఆ ప్రసంగంలోని కొన్ని అంశాలు:

‘‘భారతదేశంలో పేదలు కేవలం కలలు కనడమే కాదు, వాటిని నిశ్చయంగా సాకారం చేసుకోగలరు. ఇందుకు నేను రాష్ట్రపతిగా ఎన్నిక కావడమే నిదర్శనం. నాకు ఓటు వేసి గెలిపించిన ఎంపీలు, ఎమ్మెల్యేలందరికీ నా ధన్యవాదాలు. మీరంతా నాకు ఓటు వేయడమంటే ఆ విధంగా ఈ దేశానికి చెందిన కోట్లాది ప్రజలు నా మీద ఉంచిన నమ్మకాన్ని వ్యక్తం చేశారు. దేశం ఆజాదీ కా అమృత్‌ ‌మహోత్సవాలు జరుపుకుంటున్న తరుణంలో నన్ను ఈ పదవికి ఎన్నుకున్నారు. నా రాజకీయ జీవితం స్వాతంత్య్ర దిన యాభయ్‌ ‌సంవత్సరాల వేడుకల సందర్భంగా మొదలయింది. వచ్చే పాతిక సంవత్సరాలలో పెద్ద లక్ష్యాన్ని ముందు ఉంచుకున్న తరుణంలో ఇప్పుడు ఈ ఎన్నిక జరిగింది. స్వాతంత్య్రం వచ్చిన తరువాత జన్మించిన తరంలో మొదటి రాష్ట్రపతిని నేనే. మనం రేపు, జూలై 26న కార్గిల్‌ ‌దివస్‌ ‌జరుపుకుంటున్నాం. ఆ సందర్భంగా శౌర్యానికి ప్రతీకలైన మన సాయుధ దళాల వారికి, దేశ ప్రజలకి ముందుగానే నా అభినందనలు తెలియచేస్తున్నాను. రాష్ట్రపతి పదవి దక్కడం కేవలం నా వ్యక్తిగత విజయం కాదు. ఇది దేశంలోని ప్రతి నిరుపేద సాధించిన ఘనత. అణగారిన వర్గాలు, పేదలు, దళితులు, గిరిజనులు, వారి ప్రతిబింబాన్ని నాలో చూసుకోగలగడం నాకెంతో తృప్తిని ఇస్తున్నది. దేశ స్వాతంత్య్ర సమరయోధుల ఆకాంక్షలను నెరవేర్చడం మన బాధ్యత. ఇందుకే సబ్‌కా ప్రయాస్‌ (అం‌దరి ప్రయత్నం), సబ్‌కా కర్తవ్య (అందరి విధి) అనే రెండు పట్టాల మీద దేశం వేగంగా ముందుకెళ్లాలి. దేశమంతా ఆజాదీ కా అమృత్‌ ‌మహోత్సవాలు జరుపుకుంటున్న వేళ నేను ఈ పదవిని స్వీకరించడం నా అదృష్టంగా భావిస్తున్నాను.

నిరుపేద గిరిజన కుటుంబం నుంచి వచ్చిన ఒక మహిళ రాజ్యాంగ పదవిని చేపట్టడం దేశ ప్రజాస్వామ్య శక్తికి నిదర్శనం. ఒడిశా రాష్ట్రంలో మారుమూల ప్రాంతంలో, చిన్న గిరిజన గ్రామంలో పుట్టి పెరిగాను. ప్రాథమిక విద్యను అభ్యసించడం కూడా అక్కడ ఒక కలే. మా గ్రామం నుంచి కళాశాలకు వెళ్లిన తొలి విద్యార్థిని నేనే. అలాంటి నేను ఏకంగా రాష్ట్రపతి పదవికి చేరుకోవడం మన ప్రజాస్వామ్య గొప్పదనంగా భావిస్తా. నా మీద మీరు పెట్టిన నమ్మకమే నా శక్తి.’’

ఇంకా ఇలా అన్నారు కొత్త రాష్ట్రపతి – ‘‘ఈ దేశ ఔన్నత్యాన్నీ, ప్రజాస్వామిక శక్తిని ఇనుమడింప చేసిన దేశాధ్యక్షులకు నేను వారసురాలిని. మొదటి రాష్ట్రపతి డాక్టర్‌ ‌రాజేందప్రసాద్‌ ‌నుంచి రామ్‌నాథ్‌ ‌కోవింద్‌ ‌వరకు మహోన్నతులు ఆ పదవిని చేపట్టారు. రాజ్యాంగం నిర్దేశించిన మేరకు నేను కూడా రాష్ట్రపతి పదవిని బాధ్యతతో నిర్వర్తిస్తాను. ఒక దేశంగా భారత్‌ ‌ప్రస్థానానికి మన స్వాతంత్య్ర పోరాటమే ప్రణాళికను సిద్ధం చేసింది. మన స్వాతంత్య్ర సమరమే అనేక పోరాట దశలతో నిండి ఉంది. అనేక పంథాలు ఉన్నాయి. పూజ్య బాపూజీ స్వరాజ్య, స్వదేశీ, స్వచ్ఛత, సత్యాగ్రహాల గురించి ప్రబోధించారు. నేతాజీ సుభాస్‌ ‌చంద్రబోస్‌, ‌నెహ్రూ, సర్దార్‌ ‌పటేల్‌, ‌బాబాసాహెబ్‌ అం‌బేడ్కర్‌, ‌భగత్‌సింగ్‌, ‌సుఖదేవ్‌, ‌రాజ్‌గురు, చంద్రశేఖర్‌ ఆజాద్‌ ‌జాతి ఔన్నత్యాన్ని నిలిపారు. రాణీ లక్ష్మీబాయి, వేలు నాచియార్‌, ‌రాణి గైడిన్లు, రాణి చెన్నమ్మ వంటి వారు జాతి నిర్మాణంలో, రక్షణలో మహిళ శక్తి ఎలాంటిదో చూపారు. సంథాల్‌ ‌విప్లవం, పెయికా, ఖోల్‌, ‌భిల్‌ ‌విప్లవాలు స్వాతంత్య్ర సమరంలో గిరిజనుల పాత్రను పటిష్టంగా చూపిస్తాయి. దేశభక్తి, సామాజిక ఉన్నతుల విషయంలో మనం ‘ధర్తీ ఆబా’ బిర్సా ముండా నుంచి ప్రేరణ పొందాలి.’’

కొవిడ్‌ 19 ‌నివారణ కోసం భారత్‌ ‌చేసిన యుద్ధం గొప్పదని రాష్ట్రపతి తన ప్రసంగంలో ప్రశంసించారు. ప్రపంచం ఇప్పుడు భారత్‌ ‌వైపు అబ్బురంతో చూస్తున్నదని కూడా చెప్పారు. ఓకల్‌ ‌ఫర్‌ ‌లోకల్‌, ‌డిజిటల్‌ ఇం‌డియా పథకాలు మంచి ఫలితాలు ఇవ్వడం సంతోషదాయకమని కూడా అన్నారు.

 ద్రౌపది ముర్ము అసలు పేరు సంథాల్‌ ‌తెగలో వినిపించే పుటి. ద్రౌపది అని ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు ఒకరు మార్చారు. తరువాత ఈ పేరును రకరకాలుగా ఉచ్చరించినా వివాహం అయిన తరువాత ద్రౌపదిగా స్థిరపడింది.

About Author

By editor

Twitter
YOUTUBE