‌గత సంచిక తరువాయి

ఆజాదీ కా అమృత్‌ ‌మహోత్సవ్‌

మాలపల్లి నవలకి నూరేళ్లు

ఉన్నవ ఉపాధ్యాయునిగా, డిస్ట్రిక్ట్ ‌మన్సబ్‌ ‌కోర్టులో న్యాయవాదిగా కొద్దికాలం పనిచేశారు. 1913లో వెళ్లి ఐర్లాండ్‌ ‌రాజధాని అయిన డబ్లిన్‌లో బార్‌-ఎట్‌-‌లా చేరారు. అది ఐరిష్‌ ‌ప్రజలు స్వరాజ్యం మొదలైన ‘హోమ్‌ ‌రూల్‌’ ‌పోరాటం షిన్‌ ‌ఫిన్‌ ఉద్యమంగా రూపాంతరం చెందుతున్న కాలం. అప్పుడే దాని నాయకుడు డావలెరాతో ఉన్నవ పరిచయం పెంచుకున్నారు. నాటి ప్రపంచంలో జరుగుతున్న ఇతర రాజకీయ ఉద్యమాలతో కూడా ఉన్నవ ప్రభావితులయ్యారు. ఆయన బారిస్టర్‌ ‌పరీక్షలో కృతార్థుడై 1916లో భారత్‌ ‌చేరుకున్నారు. కానీ న్యాయవాద వృత్తిలో ఎక్కువ కాలం లేరు. అప్పుడే రావుల సీతారామయ్య ఉన్నవతో చేసిన సంభాషణ- ‘మీ ప్లీడర్‌ ‌వృత్తిని మానదలచినట్లు మీ గుమాస్తా వలన తెలిసినది… ఎందుకు తొందర పడెదరు?’ అని ప్రశ్నించారు. ‘నిజమే నేను ధనవంతుడను కాను.. నాయక్కర్లు తీరునంతవరకూ ఈ నాన్‌ ‌కో ఆపరేషన్‌ ‌మూవ్‌మెంట్‌ ఉం‌డునా? ఈ సమయములో ఉద్యమమునకు తగిన సహాయము చేయకపోయినచో ముందు దేశమునకు మహా అనర్థ్ధకము రాగలదు గాన వెంటనే నా వృత్తి నేను వదిలి ఉద్యమ ప్రచారము చేయుటకు నిశ్చయించు కొంటిని’ అన్నదే ఉన్నవ వారి సమాధానం (ఆంధ్రపత్రిక ఆగస్టు 10, 1921). 1921 నాటికి ‘భారతదేశం తగలబడిపోతున్న యిల్లు’ మాదిరిగా వున్నదని రవీంద్రనాథ్‌ ‌టాగూర్‌తో వివాదం వచ్చిన సందర్భంలో గాంధీజీ ‘యంగ్‌ ఇం‌డియా’ (అక్టోబర్‌ 13, 1921) ‌పత్రికలో రాశారు. రోమ్‌ ‌తగలబడి పోతూ ఉంటే నీరో ఫిడేల్‌ ‌వాయించుకుంటూ ఉన్నాడట, కానీ ఉన్నవ ఆత్మానంద కవిత్వ రచనలకు నగిషీలు చెక్కుకుంటూ ఉండిపోలేదు. భారతదేశమనే ఇల్లు తగలబడిపోతుండగా ఆయన ఒక నవల రాసాడంటే, అది ఒక ఫైర్‌ ఇం‌జిన్‌లా పని చేయాలన్న స్పృహతోనే.

ఇవాళ మనం స్వేచ్ఛగా చదువుకుంటున్న ‘మాలపల్లి’ నవల చిరకాలం నిషేధాల చీకటిలోనే ఉండిపోయింది. అసలు ఆ నవల కారాగారంలో పుట్టింది. ఒక ఉద్యమకారునిగా ఉన్నవ జైలుకు వెళ్లడం, శిక్షా సమయాన్ని ఇలా సాహిత్య వ్యాసంగా నికి ఉపయోగించడం అద్భుతమే. జైలులో ఉన్న సమయాన్ని వృథాగా పోనీయరాదని ఆయన తీసుకున్న నిర్ణయంతో ఒక గొప్ప నవల తెలుగు సాహిత్యానికి అందింది. ఆ క్రమాన్ని కూడా పరిశీలించాలి.

పల్నాడు పుల్లరి సత్యాగ్రహం ఇక్కడ ప్రధానాంశం. పల్నాడు అటవీ ప్రాంతం, కొండ భూమి. ఫారెస్ట్ అధికారుల అనుమతి పత్రం లేనిదే గొడ్లను మేతకూ, కట్టెలు ఏరుకోవడానికీ అనుమతిం చరు. గొడ్లను మేపుకోవడానికి ‘పుల్లరి’ చెల్లించాలి. చెల్లించేది లేదని ప్రజలు తిరుగుబాటు ప్రారంభించారు. రంగా చెంచయ్య ఆధ్వర్యంలో ఫారెస్ట్ ఉద్యోగులను ఇతర అధికారులను సాంఘిక బహిష్కరణ చేశారు (కొండా వెంకటప్పయ్య స్వీయ చరిత్ర పేజీ 230-231). ఈ పరిస్థితులలో 1921 జులైలో రాష్ట్ర కాంగ్రెసు నెల్లూరు జిల్లాలోని వెంకట గిరిలో కటికనేని వారింట్లో సమావేశమై, పల్నాడు పుల్లరి సత్యాగ్రహ విషయమై విచారణ జరిపి ఒక నివేదికను సమర్పించాలని ‘ఉన్నవను, మాడభూషి వేదాంత నరసింహాచార్యులను’ నియమించింది (‘నా జీవిత కథ’ అయ్యదేవర కాళేశ్వరరావు పేజీ 335-336).

‘వారిరువురూ జూలై 16, 1921న గుంటూరు నుంచి బయలుదేరి నరసరావుపేట చేరి గుత్తికొండ నుండి రెండెడ్ల బండి చేసుకొని జూలకల్లు బోయి, ఆ రాత్రి అచ్చటి వారితో యుద్యమమును గురించి ముచ్చటించి సాధక బాధకాలు తెలుసుకొన ప్రయత్నించిరి’ (గుంటూరు జిల్లా స్వరాజ్య ఉద్యమం, మాదల వీరభద్రరావు, పేజీ 58). ఇలా వీరిరువురూ పల్నాడు ప్రాంతం చేరి ఆ ఉద్యమంతో మమేకం పొందారు.

గురజాల, మాచర్ల ప్రాంతంలో బ్రిటిష్‌ ‌ప్రభుత్వ అధికారులకు కోమటి బియ్యం విక్రయించడు, చాకలి బట్టలు ఉతకడు, మంగలి క్షవరం చేయడు. కడకు బావిలో నీళ్లయినా తోడుకోనియ్యరు. ఇదీ అక్కడి ప్రజలు సాగించిన ఉద్యమం తీరు. గుంటూరు జిల్లా కలెక్టర్‌ ‌షీల్డ్ ‌గురజాల, మాచర్ల గ్రామాల్లో మకాం చేసి ఈ బహిష్కారాన్ని స్వయంగా చూసాడు. పంచదార దొరకలేదు, కాఫీ లేదు, కడకు గ్లాసు పాలు కూడా తెప్పించుకోలేకపోయాడు. ఊరిలో రహస్యంగా వీటిని కొనడానికి డిప్యూటీ తహసీల్దార్‌ ‌ప్రయత్నించగా ‘స్వరాజ్య సంఘం’ వారు ఆ అవకాశమివ్వలేదు (‘మాలపల్లి – నిషేధాలు’, బంగోరె, పేజీ 25). దానితో ఈ ఉద్యమాన్ని ఎలాగైనా ఆపాలి కాబట్టి ముగ్గురిపై కేసు పెట్టి మూడు నెలలు శిక్ష పడేటట్లు చేశారు కలెక్టర్‌ ‌షీల్డ్. ‌దీనితో పాటు ఉన్నవ, నరసింహాచార్యులకు నోటీసులిచ్చి సి.పి.సి 107 సెక్షన్‌ ‌క్రింద అరెస్టు చేసి ఏడాది జైలు శిక్ష విధించారు.

అరెస్టయిన ఇద్దరినీ జూలై 24 ఉదయానికి గుంటూరు తీసుకొచ్చారు. ఉన్నవ లక్ష్మీబాయమ్మ గుంటూరు స్టేషన్‌కి వచ్చి భర్త మెడలో పూలమాల వేసి పదివేల మంది కార్యకర్తలతో వెళ్లి రైలింజన్‌పై స్వరాజ్య జెండా ఎగురవేశారు. వేశ్యావృత్తిని విడనాడి స్వకులోద్ధరణకు కంకణం కట్టుకున్న యామినీ పూర్ణతిలకం లక్ష్మీబాయమ్మకు అండగా నిలిచి గుంటూరు బంద్‌కు, వారం రోజుల హర్తాళ్‌కు పిలుపునిచ్చారు. ఉన్నవ, మాడభూషిలను రాయవెల్లూరు జైలుకు తరలించారు. సోమరిగా ఉండడమనేది ఉన్నవకు కానీ పని. ఒక నవల రాసుకుంటానని జైలు సూపరింటెండెంట్‌ ‌మేజర్‌ ఆం‌డర్‌ ‌సన్‌ను అనుమతి అడిగాడు. అయన అట్లానే అన్నాడు కానీ ఓ షరతు పెట్టాడు. రాసింది ముందుగా చూపించాలి, అభ్యంతరకర విషయాలు ఏమీ లేకపోతే సరి, ఉంటే మాత్రం సెన్సార్‌ ‌చేయనిదే వ్రాతప్రతిని తిరిగి ఇవ్వం అన్నాడు. ఒప్పుకున్నారు ఉన్నవ.

8 ఎక్సరసైజ్‌ ‌పుస్తకాలయ్యాయి. 609 పేజీలు సాగింది. ఏప్రిల్‌ 9, 1922‌న మాలపల్లి వ్రాతప్రతి సిద్ధమయింది. జైలు అధికారులు ఉన్నవను జూలై 21, 1922న విడుదల చేసి, వ్రాతప్రతిని తీసుకున్నారు. ఎందరో అధికారుల దగ్గరకు తిరిగి, చివరికి మద్రాసు ప్రభుత్వానికి తెలుగు అనువాదకునిగా పనిచేసిన బి. సోమసుందర్రావు దగ్గరకు వచ్చింది. 609 పేజీలు జాగ్రత్తగా చదివి రచయితపై ‘రాజద్రోహ’ నేరారోపణకు వీలు కల్గిస్తూ ఒక నివేదిక రాశాడాయన. ప్రభుత్వంలోని వివిధ శాఖలను అదేపనిగా అడుగడుగునా దుయ్యబట్టాడనీ, సహాయ నిరాకరణ తత్త్వాన్ని అతిశయంగా ప్రబోధించాడనీ, ప్రభుత్వం పట్ల విద్వేషాన్ని పురికొల్పే విధంగా రాసాడనీ ఆరోపిస్తూ జనవరి 8, 1923న రిపోర్టును పంపాడు. రిపోర్ట్ ‌చదివిన చీఫ్‌ ‌సెక్రెటరీ ఉగ్రుడయ్యాడు. ఇంకెందుకు ఆలోచన? అగ్గిపుల్ల వేసి తగులబెట్టి పారేస్తే సరిపోతుందిగా – అని రాసి గవర్నర్‌ ఎగ్జిక్యూటివ్‌ ‌కౌన్సిల్‌కు పంపాడు. ఆయన కూడా ని× స్త్రతీవవ• అని రాసాడు. కానీ మూడవ సభ్యుడు ‘వ్రాతప్రతిని నాశనం చేయడానికి మనకేం అధికారముంటుంది? అది అతని (రచయిత) ఆస్తి. ఆయన నవలను అచ్చు వేసుకున్నప్పుడు చూసుకొనవచ్చును. నవలకు అగ్గిపుల్ల గీసి పెట్టాలంటే మాత్రం ముందుగా అన్నీ క్షుణ్ణంగా పరిశీలించడం మంచిది’ అని రాసాడు. కాబట్టి ఈ నవలను నిషేధించడానికే పూనుకున్నారు. ఈలోగా 12-04-1923న స్పెషల్‌ ‌బ్రాంచికి రిపోర్ట్ ‌పంపారు. ‘ఉన్నవ జైల్లో నవల రాస్తూ ఉంటే ఆయన మిత్రుడు నరసింహాచార్యులు మరో శుభ్రమయిన ప్రతిని తయారుచేసి రహస్యంగా బయటకు పంపాడనీ, ‘ఆంధ్రపరిషత్‌’ ఆ ‌నవలను ప్రచురించింద•నీ’ ఆ నివేదిక సారాంశం. దానితో 1923 మేలో మాలపల్లి నవలను నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

‘నిన్నటి గజెటు నందు మాలపల్లి అను గ్రంథమును గురించిన ప్రభుత్వము వారి నిషేధపుటుత్తర్వును చూడగానే నా హృదయము నీరైపోయినది’ అని ఆంధ్రపత్రికకు (మే, 26, 1923) పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి లేఖ రాసారు. పాలకవర్గంతో సన్నిహితుడుగా ఉంటూనే ‘మాలపల్లి’పై నిషేధాన్ని ఎత్తివేయాలని కట్టమంచి రామలింగారెడ్డి, సి. పి. రామస్వామి అయ్యర్‌కు లేఖ రాసారు. నిషేధాన్ని తొలగించాలని అభ్యర్థిస్తూ ‘పంచాంగాలు పోతే నక్షత్రాలు పోతాయా?’ అని ప్రశ్నించారు. పుస్తకాలు నిషేధించినంత మాత్రాన నేడు సమాజంలో నెలకొన్న వాస్తవాలను ఎవరు కాదనగలరు? అయినా ఈ నవల రాజకీయంగా బాంబుషెల్‌ ‌కాదనీ, పుస్తకాలవల్ల విప్లవాలేవీ రావనీ, ఇండియాలో వీటి మూలంగా విప్లవం వచ్చే అవకాశం మరీ తక్కువనీ రాసాడు.

 మార్చి 30,1926న శాసనమండలిలో అయ్యదేవర కాళేశ్వరరావు ‘మాలపల్లి’ విషయమై వేసిన ప్రశ్నకు రామస్వామి అయ్యర్‌ ‌సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది. రాజద్రోహం నేరం కిందకు వచ్చే భాగాలున్నాయని నవలను నిషేధించ మన్నప్పుడు, ‘ఆ నేరం క్రింద ప్రభుత్వం రచయితను ఎందుకు ప్రాసిక్యూట్‌ ‌చేయలేదు. దమ్ముంటే రచయితను ప్రాసిక్యూట్‌ ‌చేయాల’ని సత్యమూర్తి అడిగారు. ఆఖర్లో అయ్యదేవర రాజీ మార్గాన్ని సూచించాడు. ప్రభుత్వ అడ్వొకేటు జనరల్‌ను రచయిత కలుసుకొని అభ్యంతర భాగాలను గూర్చిన వ్యవహారాన్ని సెటిల్‌ ‌చేసుకోవడానికి ప్రభుత్వం అంగీకరిస్తుందా? అని అడిగారు. ప్రభుత్వం కోరుకున్నది కూడా ఇదేనని సి. పి. రామస్వామి అయ్యర్‌ ‌సమాధానం చెప్పాడు.

అక్టోబర్‌ 6,1927‌న రచయిత చీఫ్‌ ‌సెక్రటరీని కలుసుకోగా 18-01-28న ప్రభుత్వం నవలలోని ఆరు భాగాలను అభ్యంతరకరమైనవిగా ఉన్నవకు లిఖిత పూర్వకంగా తెలియజేసింది.

  1. ‘మహమ్మదీయ ప్రభువులు దుండగులై కొన్ని శిల్పాలను పాడుచేశారని దూషిస్తాం గానీ ఆంగ్ల ప్రభువులు కమల కాసారంలో పడ్డ కాసారముల వలె ప్రతీ గ్రామమందు.’
  2. శవం కనపడగానే పోలీసు గ్రద్దలు వాల్తాయి.
  3. ముందు నాలుగు వందలూ (లంచం) ఇట్లా తీసుకో. ఇది డిప్యూటీ సూపరింటెండెంట్‌ అయ్యవారిది, ఇది ఇన్స్పెక్టర్‌దీ, ఇది సిబ్బందిదీ, ఇది గ్రామస్థులదీ తీసుకొండయ్య.
  4. జగ్గడి బుర్రకథా గేయం పూర్తిగా తొలగించాలి.
  5. ప్రభుత్వ పద్ధతి ఏది చూచినా మేడిపండు వ్యవహా రంగా వుంది. దీనిని సవరించి పోయడమే తప్పు. కరిగి పొయ్యవలసిందే తప్ప మాట్లు వేసి ప్రయోజనము లేదు.
  6. ‘రాజ్యాలు, మండలాలు, పట్టణాలు వాండ్ల పరమయినవి. పెద్ద దొంగా చిన్న దొంగా అనే భేదంతో అందరూ దొంగలే. సంఘం యొక్క ఆస్తి అంత అపహరించి శాశ్వతంగా వంశపారం పర్యంగా నిలుపుకోవడాని కనుకూలమయిన చట్టాలు గల్పించుకున్నారు’. వీటికి ‘ఉన్నవ’ సమాధానం చెప్పుకున్నారు. చివరికి జులై 14, 1937న రాజాజీ మంత్రివర్గం ఏర్పడింది. ఆ తరువాత 14 రోజుల్లోనే మాలపల్లి పై నిషేధాన్ని తొలగించిపారవేస్తూ రాజాజీ ఆర్డరు వేశారు. అలా మాలపల్లి నవల చట్టబద్ధంగా వెలుగు చూసింది.

– కాశింశెట్టి సత్యనారాయణ, విశ్రాంత ఆచార్యుడు

About Author

By editor

Twitter
YOUTUBE