‌సెప్టెంబర్‌ 03 ‌జమలాపురం కేశవరావు జయంతి

– జమలాపురం విఠల్‌రావు

1947, ఆగస్ట్ 15‌న దేశం మొత్తం స్వాతంత్య్ర దినోత్సవ సంబరాల్లో మునిగి తేలుతుంటే ఇద్దరు నాయకులు మాత్రం వాటిల్లో పాలుపంచుకోలేదు. జాతీయస్థాయిలో మహాత్మాగాంధీ మొదటివారు కాగా, నిజాంపాలన నుంచి విముక్తి ఉద్యమంలో అలుపెరుగని పోరాటం చేసిన జమలాపురం కేశవ రావు రెండోవారు. మహాత్ముడు హిందూ-ముస్లింల మధ్య ఉద్రిక్తలను చల్లార్చేందుకు కలకత్తాలో సత్యా గ్రహంలో ఉంటే, హిందూ-ముస్లింలతో కూడిన సమైక్య హైదరాబాద్‌ ‌స్టేట్‌ ‌విముక్తి కోసం సత్యా గ్రహంలో పాల్గొని జైల్లో ఉన్నారు దక్కన్‌ ‌సర్దార్‌ ‌జమలాపురం కేశవరావు. త్యాగశీలురు తాము నమ్మిన సిద్ధాంతాల కోసం జరిపే అలుపెరుగని పోరా టంలో సుఖాలను, ఆనందాలను పట్టించుకోకుండా లక్ష్యం వైపు మాత్రమే వారి ప్రయాణం సాగుతుందన డానికి కేశవరావు జీవితమే నిదర్శనం.

సర్దార్‌ ‌జమలాపురం కేశవరావు. ఆరడుగుల ఆజానుబాహుడు! నిండైన విగ్రహం.. నిజాం కళాశా లలో ఉన్నత విద్యను అభ్యసించినవాడు. నిజాం ప్రభు త్వంలో ఉద్యోగం చేసినా, నాటి భారత స్వాతంత్య్రో ద్యమం, మహాత్ముని నాయకత్వంతో స్ఫూర్తిని పొంది, తెలంగాణకు నిజాం పాలన నుంచి విముక్తి కల్పించా లన్న ఒకే ఒక లక్ష్యంతో, ఆస్తులు, కుటుంబాన్ని వది లేసి నిరంతర పోరాటం సలిపారు కనుకనే ఆయన గొప్ప త్యాగశీలిగా చరిత్రపుటల్లో చిరస్థాయిగా నిలిచారు. 1908, సెప్టెంబర్‌ 3‌న సర్దార్‌ ‌జమలా పురం కేశవరావు నేటి ఖమ్మంజిల్లా ఎర్రుపాలెం గ్రామంలో జన్మించారు. నాటి నిజాం సంస్థానంలో తూర్పు కొసన (ఆంధ్రకు సరిహద్దు ప్రాంతం) ఉంటుందీ గ్రామం. తండ్రి వెంకట రామారావు, తల్లి వెంకట నరసమ్మ. ఈ దంపతులకు ఈయన తొలి సంతానం. సంపన్న జమిందారీ కుటుంబం. ప్రాథమిక విద్యను అభ్యసించింది ఎర్రు పాలెంలోనే. అయితే ఉన్నత విద్యను మాత్రం నిజాం కళాశాలలో పూర్తిచేశారు. కళాశాల విద్యను అభ్యసించే కాలంలోనే నిజాం ప్రభుత్వం వందేమాతరం గీతాలాపనను నిషేధించింది. ప్రభుత్వ నిర్ణయంపై నిరసన వ్యక్తం చేస్తున్న తోటి విద్యార్థులను కూడగట్టి పోరాటం సలిపారు. అప్పటినుంచే జమలాపురం కేశవరావులో నిబిడీకృతమైన నాయకత్వ లక్షణాలు వెలికిరావడం మొదలైంది.

1923లో కేశవరావు రాజమండ్రిలో జరిగిన మహాసభకు హాజరై, మహాత్ముని ఉపన్యాసాన్ని తొలిసారి విన్నారు. అటు తర్వాత 1930లో మహాత్మా గాంధీ విజయవాడలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించడానికి వచ్చినప్పుడు, కేశవరావు ఆయన్ను కలుసుకున్నారు. ఆ పరిచయమే కేశవ రావును నిజాం విముక్తి పోరాటంలో సత్యాగ్రహాన్ని ఆయుధంగా మలచుకోవడానికి ఉపయోగపడింది. నాటి తరానికి మహాత్ముడు అందించిన స్ఫూర్తి అటు వంటిది. ఆ తర్వాత కేశవరావు వరంగల్‌, ‌కరీంనగర్‌ ‌జిల్లాల్లో విస్తృతంగా కాలినడకన ప్రయాణించారు. వెట్టిచాకిరి, దుర్భర పేదరికంతో బాధపడుతున్న ప్రజలను చూసి చలించిపోయారు. వారిలో చైతన్యం నింపడానికి కృషి చేశారు. ఇందుకోసం విద్యే ప్రధాన సాధనమని భావించి, వయోజన విద్య నేర్పడంలో కీలకపాత్ర పోషించారు. ఇదే సమయంలో ఆంధ్ర పితామహుడిగా పేరుగాంచి, మాడపాటి హనుమంత రావు ప్రారంభించిన గ్రంథాలయోద్యమం కేశవ రావును ఆకర్షించింది. ఊరూరా గ్రంథాలయాలను నెలకొల్పితే వాటిద్వారా ప్రజల్లో పఠనాసక్తి పెరిగి మరింత చైతన్యాన్ని సంతరించుకుంటారన్న ఉద్దేశంతో, తెలంగాణలో గ్రంథాలయోద్యమ వ్యాప్తికి తీవ్రంగా పాటుపడ్డారు.

తెలంగాణ స్టేట్‌ ‌కాంగ్రెస్‌ ‌తొలి అధ్యక్షుడు

నాటి ఉమ్మడి మద్రాస్‌ ‌రాష్ట్రానికి చెందిన ఆంధ్ర ప్రాంతంలో చోటుచేసుకున్న స్వాతంత్య్రోద్యమం ప్రభా వంతో తెలంగాణ స్టేట్‌ ‌కాంగ్రెస్‌ ఏర్పాటు ఆవశ్యత కను ఆయన గుర్తించారు. ఈ నేపథ్యంలోనే 1938లో హైదరాబాద్‌ ‌స్టేట్‌ ‌కాంగ్రెస్‌ ఏర్పాటైంది. దీనికి తొలి అధ్యక్షుడు జమలాపురం కేశవరావు. ఇదిలా ఉండగా 1938, సెప్టెంబర్‌ 24‌న నిజాం పాలనలకు వ్యతి రేకంగా మధిరలో సత్యాగ్రహ దీక్షను చేపట్టాలని జమలాపురం కేశవరావు, గోవిందరావు నాయక్‌, ‌రావి నారాయణరెడ్డి నిశ్చయించుకున్నారు. ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలను ఉక్కుపాదంతో అణచివేసే నిజాం అందుకు అనుమతి ఇవ్వలేదు. సత్యాగ్రహ యత్నాన్ని విరమించుకోవాలని మధిర పోలీసులు వీరిని హెచ్చరించారు. దేశం యావత్తూ బ్రిటిష్‌ ‌పాల నకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటే, హైదరాబాద్‌ ‌స్టేట్‌లో మాత్రం, నిజాంకు వ్యతిరేకంగా ఉద్యమం చేయాల్సిన దుస్థితి. నిజాంను గద్దె దింపితే తప్ప విముక్తి సాధ్యం కాదని జమలాపురం కేశవరావు నేతృత్వంలోని స్టేట్‌ ‌కాంగ్రెస్‌ అం‌దుకు అనుగుణమైన కార్యాచరణను రూపొందించి అమలు చేసింది. ఇందులో భాగమే మధిరలో సత్యాగ్రహం.

1938, సెప్టెంబర్‌ 24 ‌మధ్యాహ్నానానికి మధిర పట్టణం యావత్తు ఒకవైపు ప్రజలు మరోవైపు నిజాం పోలీసులతో కిటకిటలాడిపోయింది. అడుగడుగునా మోహరించిన పోలీసులు సత్యాగ్రహాన్ని అడ్డుకోవా లన్న పట్టుదలతో ఉన్నారు. సర్వత్రా తీవ్ర ఉత్కంఠ నెలకొన్న తరుణంలో జనం మధ్యలో నుంచి రైతు వేషంలో ఉన్న కేశవరావు ఒక్కసారిగా బయటకు వచ్చి సత్యాగ్రహ వేదికపై త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేసి, మహాత్మాగాంధీకి, హైదరాబాద్‌ ‌స్టేట్‌ ‌కాంగ్రెస్‌కు అనుకూలంగా పెద్దఎత్తున నినాదాలు చేయడంతో, ఒక్కసారిగా సంభ్రమాశ్చర్యాలతో మునిగిన ప్రజలు ముక్తకంఠంతో కేశవరావును అనుసరించారు. అప్రమత్తమైన పోలీసులు ఆయన్ను అరెస్ట్ ‌చేసి జైలుకు తరలించారు. ఈ కేసులో కేశవరావుకు 18 నెలల జైలుశిక్ష పడింది. నిజానికి ఆరోజు కేశవరావు మధి రకు రావడం మామూలుగా అయితే సాధ్యంకాదు. దీన్ని గుర్తించిన ఆయన మధిరకు ఆనుకొని ప్రవ హించే వాగు పక్కనే ఉన్న రాయపట్నం గ్రామానికి వచ్చి, అక్కడే తన వేషధారణను పూర్తిగా మార్చు కున్నారు. తలకు పాగా, భుజంపై గొంగళి, చేతిలో కర్ర, బుట్టగోచీ పంచె కట్టుకొని రహస్యంగా మధిర లోకి ప్రవేశించారు. తనను ఎవరూ గుర్తించలేదన్న సంగతి నిర్ధారించుకున్న తర్వాత తాను అనుకున్న పనిని ముగించారు. ఆ తర్వాత కొన్నాళ్లు వరంగల్‌, ‌మరికొన్నాళ్లు నిజామాబాద్‌ ‌జైల్లో గడిపారు.

పాల్వంచలో ఆదివాసీ మహాసభ

జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా కేశవరావు తన పంథాను మార్చుకోలేదు. వయోజన విద్యకోసం కృషిచేస్తూనే, మహాత్మాగాంధీ బాటలో అంటరానితనం నిర్మూలనకు ఉద్యమించారు. గిరిజ నుల్లో చైతన్యం నింపేందుకు ఆయా గ్రామాల్లో విస్తృ తంగా పర్యటించారు. ఇందులో భాగంగానే పాను గంటి పిచ్చయ్య, వనం నరసింహారావు, నారాయణ రావులతో కలిసి పాల్వంచలో ఆదివాసీ మహాసభను నిర్వహించారు. 1942లో మహాత్మాగాంధీ క్విట్‌ ఇం‌డియా ఉద్యమం కోసం పిలుపునిచ్చినప్పుడు, కేశవరావు నిజాం సంస్థానంలోని గ్రామగ్రామాన ఈ ఉద్యమాన్ని ప్రచారం చేశారు. 1946లో మెదక్‌ ‌జిల్లా కందిలో కేశవరావు అధ్యక్షతన 13వ ఆంధ్రమహాసభ జరిగింది. ఈ సందర్భంగా అశేష జనవాహినితో నిర్వహించిన పెద్ద ఊరేగింపు అందరినీ ఆకట్టు కుంది. 1947 ఆగస్టు 7న నేటి ఖమ్మం జిల్లా మధిర (నాటి వరంగల్‌ ‌జిల్లా)లో హైదరాబాద్‌ ‌స్టేట్‌ ‌కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో, కేశవరావు నేతృత్వంలో పెద్ద ఎత్తున సత్యాగ్రహాన్ని నిర్వహించారు. తెలంగాణ విముక్తి పోరాటంలో నిజాం ప్రభుత్వాన్ని కుదిపేసినవిగా చెప్పుకునే ఘటనల్లో ఇది కూడా ఒకటి. ఇంతటి ప్రధాన సంఘటనకు బాధ్యుడైన కేశవరావును నిజాం ప్రభుత్వం అరెస్ట్ ‌చేసి రెండేళ్లు జైలుశిక్ష విధించింది. నిజానికి ఈ సత్యాగ్రహానికి ముందు జమలాపురం కేశవరావు తన సహచరుడైన బొమ్మకంటి సత్య నారాయణరావుతో మాట్లాడుతూ, ‘ఈ సందర్భంలో నేను జైలుకెళ్లక తప్పకపోవచ్చు. అటువంటి పరిస్థి తుల్లో మీరే ఈ ఉద్యమానికి నాయకత్వం వహిం చాల’ని కోరారు. అంతేకాకుండా హయగ్రీవాచారి, వట్టికోట రామకోటయ్యలను సహాయకులుగా ఉంచు కోవాలని సూచించారు. ముందుగా బొమ్మకంటి అందుకు ఒప్పుకోకపోయినప్పటికీ, సర్దార్‌ ‌మాటను కాదనలేక అంగీకరించారు. మధిర సంఘటనలో కేశవరావుతో పాటు అనేకమంది నాయకులు కూడా జైలుశిక్షను అనుభవించారు. యావత్‌ ‌భారతదేశం స్వేచ్ఛావాయువులు పీల్చుకునేందుకు ఉవ్విళ్లూరు తున్న తరుణంలో కేశవరావు వంటి నాయకులు నిర్బంధంలో ఉండటం విషాదం.

తొలి సత్యాగ్రహులు కేశవరావు, రామానంద

హైదరాబాద్‌ ‌విమోచనోద్యమంలో భాగంగా మొట్టమొదట సత్యాగ్రహం చేసింది జమలాపురం కేశవరావు, స్వామి రామానంద తీర్థ. 1938లో నిజాం ప్రభుత్వం కాంగ్రెస్‌ను నిషేధించినప్పుడు స్వామి రామానందతీర్థ కాచిగూడలోని ఒక చిన్న ఇంట్లో ఉండి ఉద్యమాన్ని కొనసాగించారు. అప్పట్లో ఆయనతో పాటు బూర్గుల రామకృష్ణారావు, దిగంబ రావు బిందు, జి.ఎస్‌. ‌మెల్కొటే, కొండా వెంకటరంగా రెడ్డి, గోవింద దాస్‌ ‌ష్రాఫ్‌,  ‌జమలాపురం కేశవరావు, మాడపాటి హనుమంతరావు, మర్రి చెన్నారెడ్డి, బొమ్మకంటి సత్యనారాయణ, హయగ్రీవాచారి, పాగా పుల్లారెడ్డి, కోదాటి నారాయణరావు, కొమరగిరి నారాయణరావు, కాళోజీ నారాయణరావు, ఉమ్మెత్తల నరసింగరావు, పి.వి. నరసింహారావు వంటివారు ఈ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. ఈ సందర్భంగానే తెలంగాణ ‘ఇండియన్‌ ‌యూనియన్‌లో విలీనం’ కావాలన్న ఉద్యమం కూడా ప్రారంభమైంది. ఇందుకోసం షోలాపూర్‌లో జరిగిన కాంగ్రెస్‌ ‌వర్కింగ్‌ ‌కమిటీ సమావేశానికి స్వామి రామానంద తీర్థ అధ్యక్షత వహించగా, సర్దార్‌ ‌జమలాపురం కేశవ రావు, బొమ్మకంటి సత్యనారాయణ, మాడపాటి హనుమంతరావులు కీలక పాత్ర పోషించారు. కాగా కేశవరావు, బొమ్మకంటి సత్యనారాయణ వంటి ప్రముఖులు సరిహద్దు ఆంధ్ర ప్రాంత నగరమైన విజయవాడలోని అయ్యదేవర కాళేశ్వరరావు ఇంటిని కేంద్రంగా చేసుకొని తమ ఉద్యమాన్ని కొనసాగిం చారు. ఈ సందర్భంగానే హైదరాబాద్‌ ‌విముక్తికోసం జమలాపురం కేశవరావు నేతృత్వంలో విజయవాడలో సత్యాగ్రహం జరిగింది. ఒకవేళ ఈయన జైలుకు పోవాల్సి వస్తే హయగ్రీవాచారి ఆ స్థానాన్ని భర్తీ చేయాలని కూడా నిర్ణయించారు. వీబీ రాజు, బొమ్మకంటి సత్యనారాయణ నైజాం స్టేట్‌ ‌సరిహద్దు ప్రాంతాల్లో ఉద్యమాన్ని కొనసాగేలా చేశారు. విచిత్ర మేమంటే జమలాపురం కేశవరావు, కొలిపాక కిషన్‌ ‌రావు, కొలిపాక రామచంద్రరావు, కాళోజీ నారాయణ రావు, దాశరథి, హీరాలాల్‌ ‌మోరియా, ఐతరాజు రామారావు వంటివారిని ఒకే జైల్లో ఉంచడం సంభవించేది. అప్పుడు బొమ్మకంటి సత్యనారాయణ, జలగం వెంగళరావు, మర్రి చెన్నారెడ్డిలు బయట ఉండి ఉద్యమాన్ని నడిపేవారు.

సొంత పార్టీవారి ద్రోహం

1948, సెప్టెంబర్‌ 13 ‌నుంచి ప్రారంభమైన సైనిక చర్య 17న ముగియడంతో నిజాం సంస్థానం ఇండియన్‌ ‌యూనియన్‌లో విలీనమైన తర్వాత, జరిగిన ఎన్నికల్లో కేశవరావు నర్సంపేట నుంచి ఎమ్మె ల్యేగా పోటీచేసి ఓడిపోయారు. నర్సంపేట కమ్యూ నిస్టులకు బలమైన ప్రాంతం. కాంగ్రెస్‌లోని కొంత మంది నాయకులు కుయుక్తులతో ఆయనకు ఈ నియోజకవర్గం కేటాయించేలా పావులు కదిపారు. ఓటమికి కృంగిపోకపోయినా, సహచరుల కపట నాటకాలు ఆయన్ను బాగా దెబ్బతీశాయి. అయితే 1952లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. నిరంతర ఉద్యమాలతో, సమయానికి ఆహారం లేక పోవడం వంటి కారణాల వల్ల కేశవరావు ఆరోగ్యం క్రమంగా క్షీణించి 1953 మార్చి 29న తన 46వ ఏట కన్నుమూశారు.

అజాతశత్రువు

నిజాం స్టేట్‌ ‌రాజకీయాల్లో జమలాపురం కేశవ రావు అజాతశత్రువుగా పేరు సంపాదించుకున్నారు. కాంగ్రెస్‌ను తీవ్రంగా వ్యతిరేకించే కమ్యూనిస్టులు కూడా ఆయన్ను అభిమానించేవారు. ముఖ్యంగా ఆయనలోని నిజాయతీ, నిష్కపటత్వం వారిని ఆకట్టు కున్నాయి. రావినారాయణరెడ్డి వంటి ప్రముఖ కమ్యూ నిస్టు నేతలు ఆయన పట్ల ఎంతో అభిమానాన్ని ప్రదర్శించేవారు. స్వర్గీయ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, హయగ్రీవాచారి, జలగం వెంగళరావు, శీలం సిద్దారెడ్డి, చొక్కారావు వంటి ప్రముఖులు కూడా కేశవరావు వెంట పనిచేసినవారే. తెలంగాణ స్టేట్‌ ‌కాంగ్రెస్‌ అధ్యక్షపదవిలో ఉన్నప్పటికీ ఆయన ఏనాడూ భేషజాలను ప్రదర్శించలేదు. సభలు సమావేశాలు జరిగినప్పుడు ఒక సాధారణ కార్యకర్తలా సభా ఏర్పాట్లలో తాను కూడా పాల్గొనేవారు. పందిళ్లు, వేదికల నిర్మాణంలో పని చేసేవారు. ఆయనలోని ఈ ప్రవృత్తి నాటి కాలంలో నిజాం వ్యతిరేక ఉద్యమాల్లో పాల్గొన్న నాయకులను కట్టిపడేసేది. అందుకే ఆయన అజాతశత్రువుగా నిలిచారు.

– జమలాపురం విఠల్‌రావు,  సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE