ఆగస్ట్ 13 కనుపర్తి సంస్మృతి
గృహలక్ష్మి, మా ఇంటి మహాలక్ష్మి అనేవి మనం ఎప్పుడూ వింటుండే మాటలు. సాహిత్యపరంగా ‘గృహలక్ష్మి’ ఒక పత్రిక. వనితలకు విద్య ఉండి తీరాలని ఆనాడే ఉద్యమించిన సంస్థ. బాగా చదువుకున్న అతివలు చక్కగా ఆలోచించి, సమాజంలోని ఇతరులందరి మెప్పు పొందగలరని విస్తృత ప్రచారం చేసిన వ్యవస్థ. తమ మనసులో ఉన్న భావాల్ని అక్షరబద్ధం చేస్తే అందరికీ మేలు కలుగుతుందని పరిపూర్ణంగా విశ్వసించి, ఆ భావవాహినినే స్త్రీ లోకాన ప్రవహింపజేసిన పత్రిక అది. ఇప్పుడు కాదు, ఎప్పుడో తొమ్మిది దశాబ్దాల క్రితమే స్వర్ణ కంకణ పురస్కారం ప్రకటించారు. సారస్వతంతో పాటు సామాజిక, సేవారంగాల్లో నిరంతర కృషి సాగించిన దానిని ఇస్తూ వస్తున్నారు. స్వర్ణ కంకణమనేది స్త్రీ మూర్తులకు అందించే సమున్నత బహూకరణ. ఆ విలక్షణ సత్కారాన్ని తెలుగునాట మొట్టమొదట సాధించిన సాటిలేని మేటి కవయిత్రి కనుపర్తి వరలక్ష్మమ్మ. ఉదయించింది 6 అక్టోబర్ 1896, అస్తమయం 13 ఆగస్ట్ 1978. అంటే ఎనిమిది పదులకు పైగా జీవితకాలం.
చదువంటే పుస్తకం కాదు, మస్తకం. తమలోని ఆలోచనల వికాసం ముందుకు నడిపిస్తుంది. ప్రత్యేకించి మహిళా విద్య బహుళ ప్రయోజనాలు కలిగించి వ్యక్తిగతంగా, కుటుంబపరంగా సామాజికంగా అత్యున్నత ప్రమాణాలకు దోహదపడుతుంది. చుట్టూ ఉన్న స్థితిగతులపైన పరిజ్ఞానమున్న వారు తమతో పాటు తోటివారి సమస్యల పరిష్కారానికీ దారులు అన్వేషిస్తారు. తాము అవగాహన పెంచుకొని, చుట్టుప్రక్కల వారికీ కలిగేలా చేసి మార్గదర్శులై నిలుస్తారు. అందుకే రచయిత్రిగా కనుపర్తి వరలక్ష్మమ్మ లిఖితపూర్వక సేవా పక్రియ చేపట్టారు. లేఖల విధానాన్ని ఆచరణకు తెచ్చి, వనితాలోకానికి చెప్పాలనుకున్నవన్నీ చెప్పగలిగారు. అవన్నీ పలు భాగాలు, సంపుటాలుగా వెలువడ్డాయి. వాటిలో ఆమె ప్రస్తావించని అంశమంటూ లేదు. వరకట్నం సమస్యను విశ్లేషించారు. విద్యావిధాన తీరు తెన్నులను సహేతుకంగా విమర్శించారు. వైద్యరంగంలోని లోటుపాట్లను తూర్పారబట్టారు. సామాజిక దురాచారాలనెన్నింటినో పేరుపేరునా ఎండగట్టారు. మూఢనమ్మకాలను తీవ్ర పదజాలంతో నిరసించారు. ఆ కలం కేవలం సమస్యల పరిష్కారాలకే పరిమితం కాలేదు. అలనాటి జాతీయ నాయకుల మూర్తిమత్వాన్ని, స్త్రీ శక్తిని విస్తృతపరిచారు. వాటిల్లో ‘శారద తన మిత్రురాలు కల్పలత’కు రాసినట్లు ఉంటుంది. రచయిత్రి ఈ లేఖల పక్రియనే ఎందుకు ఎంచుకున్నారంటారా? దీని వెనుక ఓ కథ ఉంది మరి! ఆ కాలంలోనే ఒక పత్రికలో వసంత లేఖలు వస్తుండేవి. కనుపర్తి వారి ఇంటిపక్కనే నివసించే ఒక వృద్ధురాలు తరచూ వచ్చి ఉత్తరాలు రాయించుకుని వెళ్తుండేది. ఇదంతా ప్రభావం చూపడంతో, ‘శారద లేఖలు’ ద్వారా సారస్వత జైత్రయాత్ర సాగించారు వరలక్ష్మమ్మ.
సరళ భాషలో లేఖలు
పదుల సంవత్సరాల క్రిందట ఒక అంత సరళ భాషలో లేఖలు రాయడం విశేషమే! మచ్చుకు ఒక రచన చూద్దాం.
‘సౌభాగ్యవతియగు కల్పలతకు,
నెచ్చెలీ! పల్లెటూరి వారికేమీ, పట్టణవాసపు స్త్రీలకు మాత్రమూ పత్రికా పఠనమవసరము గాదా? శీతల మారుతము వలె వార్తాపత్రికల యందలి జ్ఞానామృతము రసదులెల్లరకు సేవ్యము.
మరొక లేఖలో-
కల్పలతా!
నీవంటి చదువుకున్న వారిలోనే ఇంతటి అజ్ఞానులు, ఆశాపూరితలు, ఆకాశహర్మ్యములు నిర్మించువారు ఉన్నప్పుడు ఇక ఇతరుల గురించి అనుకొననేల?
ఇంకొక ఉత్తరంలో-
నెచ్చెలీ! మహాత్ముడు గుంటూరు వచ్చినప్పుడు, నేను అటకు వెళ్లుదుననియు, ఆయనను దర్శింతుననియు కలలోనైన అనుకొనలేదు!
తెలుగునాట ఉన్న వనితలను ఉద్దేశించి, వరలక్ష్మమ్మ ఎంచుకున్న పేరే కల్పలత. చారిత్రకంగా, సాంఘికంగా, వ్యావహారికంగా, వనితాభ్యుదయపరంగా తన లేఖలు ప్రజల్లోకి వెళ్లాలన్నదే ఆమె యోచన. అంతకుముందు ఏం జరిగిందో లేఖల్లో వెల్లడించారు. అప్పట్లో జరుగుతున్నవాటినీ విశదీకరించారు. ఇకముందు జరగాల్సిన వాటి వివరాలనీ తేటతెల్లం చేశారు. ఆనాటి సత్యాగ్రహ పోరాటం, విదేశీ వస్తు బహిష్కరణం, స్త్రీ జన చైతన్యం అంతా ఆమె లేఖల్లో ప్రతిఫలిస్తుంది. ఎంత తెలివి ఉన్నా ఉపయోగానికి రాని వైనాన్ని బయటపెడుతూ ఒక చోట ఇలా అంటారామె- ‘ఏమి చదువుకుంటే నేమి! ఎంత తెలివి ఉంటే నేమి? అటువంటి మొగుడు, అటువంటి పుట్టిల్లు! ఆమె తెలివితేటలేమి జేయను? అడవిగాచిన వెన్నెల’ అంటూ కొందరి పోకడల మీద చురకలంటించారు. ఆ కలానికి ఉన్న పదును ఇంతా అంతా కాదు. సందర్భానుగుణంగా మాటలు వాడి మంచి రచయిత్రిగా నిరూపించుకున్నారు.
విశిష్ట రచనలు
ఆమె చేపట్టిన లేఖన పక్రియలో సంస్కృతి, నాగరికత, భాషాపాటవం, దేశభక్తి, అభ్యుదయ దృక్పథం, తార్కిక రీతి, క్రియాశీలతలన్నీ జతచేరాయి. ఆమె రాసిన పుస్తకాల పేర్లే ఆ ఆధునిక స్వభావాన్ని వివరిస్తాయి. ‘నమో ఆంధ్రమాత’ అనేది గేయ సంపుటి కాగా, ‘మహిళా మహోదయం’ మొదలైనవి నాటికలు. ‘నాదు మాట’ పేరిట పద్యాలు రాశారు. మహాత్మాగాంధీపై దండకం వెలువరించారు. ఒక ద్విపద కావ్యాన్ని రాశారు. కథలు, నవలలు, జీవితచరిత్రలు, పిల్లల పాటలు ఎన్నెన్నో పాఠకలోకానికి అందించారు. ఆమె కలం నుంచి జాలువారిన వ్యాసరాజం ‘స్త్రీ అబల కాదు’ రచనా శైలి బంగారు పతకాన్ని అందుకుంది. స్త్రీల కళా నిపుణతను వర్ణిస్తూ పలు రచనలు చేశారు. కవిపండిత ప్రపంచంలో శత జయంతి గౌరవం సాధించిన ఒకేఒక తెలుగు మహిళామణిగా ఆమెకెంతో పేరు. కాలమ్ నిర్వహణ కర్తగా పత్రికా రంగాన తనదైన ముద్రవేశారు. కవితా ప్రవీణురాలిగా పౌరసత్కారం పొందారు. ‘కథ ఎట్లా ఉండాలి’ అని రచయితలు, రచయిత్రులకు ప్రత్యేక పుస్తకం ద్వారా సూచించారు. ఏ పక్రియను స్వీకరించినా, తానేమిటో చాటిచెప్పారు. ఆ కారణంగానే ఆమె రచనలనేకం అనేక దేశీయ భాషల్లోకి అనువాదమయ్యాయి. ‘నా లక్ష్యం స్త్రీ శ్రేయం, నా జీవన ధ్యేయం ధర్మపరిరక్షణం’ అని ప్రకటించుకున్నారు. మరో విలక్షణత-ఆకాశవాణి కార్యక్రమాల ద్వారా వనితా చైతన్య కృషి. విజయవాడతో పాటు మద్రాసు రేడియో స్టేషన్ల నుంచి ప్రసంగాలిచ్చారు. సాహిత్య అకాడమీ పురస్కృతులను స్వీకరించారు. తన ఆశయాల పరిపూర్తికి అనువుగా ‘స్త్రీహితైషి మండలి’ని స్వస్థలం బాపట్లలో స్థాపించారు. ప్రపంచస్థాయి తెలుగు మహాసభల వేదికనుంచి సందేశాలిచ్చి, అతివలను ఏకోన్ముఖం చేయగలిగారు. తొలికథ ‘సౌదామిని’ రాసినప్పుడు, ఆమెకు 22 ఏళ్లు. జీవితానుభవాలు నేర్పిన పాఠాలతో నాయక రచయిత్రిగా రాణింపు అందుకున్నారు. సాహిత్యానికి సేవను జతపరచడంతో, ఆమె పేరు అప్పట్లో అంతటా మారుమోగింది. రాసిన ప్రతిపుస్తకం, చేసిన ప్రతీ ప్రసంగం ప్రజల సమాదరణకు పాత్రమయ్యాయి.
దేశభక్తి దివ్యశక్తి
‘వసుమతి’ అనే పేరు విన్నారు కదూ! అదే వరలక్ష్మమ్మ మొదటి నవల. రాయడమైతే రాశారు కానీ, ప్రచురణకు దాదాపు పదిహేనేళ్లు పట్టింది. పరిస్థితులు కలిసి రాకపోవడమే మూలకారణం. అదే రచనలో ఆమె కథాకథన రీతి, సామాజికాంశాల చిత్రీకరణ, చేసిన వ్యాఖ్యానాల పరంపర మరెవ్వరికీ అంతగా సాధ్యమయ్యేవి కావు. ప్రతి ఒక్కరు ఆ రచనా వైభవాన్ని ఆస్వాదించవలసిందే. ఎందుకూ అంటే… మానవ స్వభావాల అభివర్ణన తెలుసుకునేందుకు. స్వారాజ్యలక్ష్మి పేరిట అనసూయ పత్రికలో కవిత్వ రచన చేశారామె. అదే పత్రికలో స్వర్ణధార శీర్షికన వరస రచనలు కొనసాగించారు.‘అయిదు మాసములు ఇరువది దినములు’ అనే కథలో, ఖద్దరు ఉద్యమ విధానం జనులను ప్రత్యేకించి మహిళలను ఎంతగా ప్రభావితం చేసిందో
ఆ కథలో చెప్పారు.
దేశ స్వాతంత్య్ర దినోత్సవ శుభతరుణంలో కనుపర్తి వరలక్ష్మమ్మ దేశభక్తి రచనలను స్మరించుకుందాం. ఉదాహరణకు:
‘కరుణగల తల్లి, మా పాలి కల్పవల్లి
అమ్మా భారతీ! వందనమమ్మ నీకు’ – అంటూ ప్రస్తుతించారు.
‘ప్రతి ఫలాకాంక్ష లేని సేవా పరాయణులను లోకమే గుర్తించి గౌరవించును’ అన్నారు. నిజమే! ఆమెకు ఉన్నదల్లా సమాజ సేవాకాంక్ష. రూపంలో నిండుదనం. ఎప్పుడూ ప్రసన్నంగా ఉండే వదనం. భారతీయ సంస్కృతికి ప్రతీకలా వస్త్రధారణ. కలంలో ఎంత సున్నితత్త్వమో గళంలో అంత గాంభీర్యం. స్నేహ స్వభావి. నాడు కొంతమంది రేపిన అలజడికి ఎంతమాత్రం జంకలేదు. తను ఎంచుకున్న సారస్వత సేవా మార్గంలోనే సాగి, అందరి మన్ననలకూ పాత్రులయ్యారు.
– జంధ్యాల శరత్‌బాబు, సీనియర్ జర్నలిస్ట్