– సుజాత గోపగోని, 6302164068

దేశమంతటా స్వాతంత్య్ర వజ్రోత్సవాలు నిర్వహిస్తున్న వేళ.. ఇంటింటా, వాడవాడలా త్రివర్ణ పతాకం ఎగిరిన వేళ.. ప్రతి గుండెలో భారతీయత ధ్వనించింది. ప్రతి హృదయంలో దేశభక్తి ఉరకలు వేసింది. ప్రతి ముఖంలో జాతీయత ఉట్టిపడింది. కానీ, ఆ సందర్భాన్ని కూడా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌పక్కదారి పట్టించారు. ఆ వేదికను కూడా రాజకీయాలకు వాడుకున్నారు. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలకే స్వాతంత్య్ర వజ్రోత్సవ సభా వేదికను ఉపయోగించుకున్నారు. ఈ పరిణామం కూడా రాజకీయాల్లో కేసీఆర్‌ ‌వైఖరిపై చర్చను లేవనెత్తింది. మొన్నటికి మొన్న నీతి ఆయోగ్‌ ‌సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు బహిరంగంగా ప్రకటించారు. అయితే, మరుసటిరోజే కేసీఆర్‌ ‌ప్రశ్నలకు, విమర్శలకు నీతి ఆయోగ్‌ ‌కౌంటర్‌ ఇచ్చింది. అయినా, ఆయన వెనక్కి తగ్గలేదు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోటపై జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం.. మరోసారి కేంద్రపైనా, ప్రధానమంత్రి నరేంద్రమోదీ పైనా ఆరోపణల వర్షం కురిపించారు, అసహనం ప్రదర్శించారు.


ఆజాదీ కా అమృతోత్సవ్‌ ‌స్ఫూర్తిని ప్రజలకు చేరవేయాలని కేంద్ర ప్రభుత్వం పిలుపునిస్తే, ఆ సందర్భాన్నీ కేంద్రంపై విమర్శలకే ఉపయోగించు కున్నారు కేసీఆర్‌. ‌కేంద్ర ప్రభుత్వం సమాఖ్య విలువలకు తూట్లు పొడుస్తోందని, కూర్చున్న కొమ్మను నరుక్కున్న చందంగా రాష్ట్రాలను ఆర్థికంగా బలహీన పరిచే కుట్రలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. కేంద్రంలోని పెద్దలు తమ వైఫల్యాలను కప్పిపుచ్చు కొనేందుకు విద్వేష రాజకీయాలతో ప్రజలను విభజిస్తూ నీచమైన ఎత్తుగడలకు పాల్పడుతున్నారని విమర్శించారు. పసిపిల్లలు తాగే పాలు మొదలుకొని, శ్మశానవాటికల నిర్మాణం దాకా ప్రజల అవసరా లన్నిటి మీద కేంద్రం ఎడాపెడా పన్నులు విధిస్తూ పేద, మధ్యతరగతి ప్రజలపై విపరీతమైన భారం మోపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ప్రజా సంక్షేమం ప్రభుత్వాల ప్రధాన బాధ్యత.. కేంద్రం ఆ బాధ్యతను సరిగా నిర్వర్తించకపోగా పేదలకు అందించే సంక్షేమ పథకాలకు ఉచితాలు అనే పేరును తగిలించి అవమానించడం గర్హనీయ’మన్నారు. 32 పేజీల ప్రసంగ పాఠంలో దాదాపు ఆరు పేజీల్లో కేంద్ర విధానాలను దుయ్యబట్టడానికే కేటాయించారు.

సహకార సమాఖ్య స్ఫూర్తి అంటూ.. ఆదర్శాలు వల్లిస్తూనే కేంద్ర ప్రభుత్వం ఆచరణలో మాత్రం అధికారాల కేంద్రీకరణకు పాల్పడుతోందన్నారు. భారత్‌ ‌రాష్ట్రాల సమాఖ్య అని పేర్కొన్న రాజ్యాంగం తొలి అధికరణాన్నే అపహాస్యం చేస్తోందని విమర్శిం చారు. ఉమ్మడి జాబితాలోని అంశాల్లో రాష్ట్రాలను సంప్రదించకుండానే నిర్ణయాలు తీసుకుంటోంద న్నారు. కేంద్రం పన్నుల రూపంలో వసూలు చేసే ఆదాయం మొత్తంలోంచి న్యాయబద్ధంగా 41 శాతం వాటా రాష్ట్రాలకు చెల్లించాల్సి ఉండగా.. ఈ వాటాను కూడా కుదించాలనే దురుద్దేశంతో పన్నుల రూపంలో కాకుండా సెస్సుల పేరుతో దొడ్డిదారిన ఆదాయం సమకూర్చుకుంటోందని కేసీఆర్‌ ఆరోపించారు.

ఈ నెల మొదటి వారంలోనూ కేసీఆర్‌.. ‌ప్రత్యేకంగా ప్రెస్‌మీట్‌ ‌పెట్టి మరీ కేంద్రంపై విమర్శల వర్షం కురిపించారు. ఆగస్ట్ 7‌న ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్‌ ‌సమావేశానికి వెళ్లడం లేదంటూ ఒకరోజు ముందుగానే మీడియాకు వెల్లడించారు. ప్రజాస్వామ్య దేశంలో కేంద్రం వైఖరిపై నిరసన తెలియజేయడానికి దీనిని ఉత్తమమైన మార్గంగా భావిస్తున్నట్టుగా కేసీఆర్‌ ‌చెప్పుకున్నారు. బహిరంగ లేఖ ద్వారా ప్రధాని మోదీకి తన నిరసనను నేరుగా తెలియజేయనున్నట్టుగా తెలిపారు. స్వాతంత్య్ర అనంతరం నాటి మేధావులు ఒక విజన్‌ ‌కోసం పంచవర్ష ప్రణాళికలు అమలు చేశారని, భారత ప్రణాళిక సంఘం అంటే ఎంతో పేరు, ప్రఖ్యాతులు ఉండేవని, దేశానికి అవసరమైన కీలక నిర్ణయాలను ప్రణాళిక సంఘం తీసుకునేదని చెప్పుకొచ్చారు కేసీఆర్‌. అయితే, ఇప్పుడు మోదీ ప్రభుత్వం ప్రణాళిక సంఘాన్ని రద్దుచేసి నీతి ఆయోగ్‌ను తీసుకొ చ్చిందన్నారు. నీతి ఆయోగ్‌తో దేశానికి మంచి రోజులు వస్తాయని ఆశించామని, కానీ ఇప్పుడు నీతి ఆయోగ్‌ ‌నిరర్ధక సంస్థగా మారిందని విమర్శించారు.

కేసీఆర్‌ ‌ప్రెస్‌మీట్‌ ‌మరుసటి రోజు మంత్రి హరీష్‌రావు మీడియా ముందుకొచ్చారు. నీతి ఆయోగ్‌ ‌బీజేపీకి వంత పాడుతోందని కేసీఆర్‌కు కొనసాగిం పుగా చెప్పుకొచ్చారు. నీతి ఆయోగ్‌ ‌వాస్తవాలను తప్పుదోవ పట్టిస్తోందని మండిపడ్డారు. మరోవైపు.. కేసీఆర్‌ ‌కుమారుడు, మరో మంత్రి కేటీఆర్‌ ‌కూడా కేంద్రంపై ట్విట్టర్‌ను వేదికగా విమర్శలు చేశారు. ఉపయోగించుకున్నారు. వాస్తవానికి నీతి ఆయోగ్‌ ‌సమావేశానికి వెళ్లకుండా, అక్కడ కేంద్రాన్ని అధికారికంగా ప్రశ్నించకుండా ఇక్కడ రాష్ట్రంలోనే ఉండి విమర్శలు చేయడంపై మిగతా రాజకీయ పక్షాలు కూడా తప్పుబట్టాయి. ఈ క్రమంలోనే నీతి ఆయోగ్‌ ‌సమావేశానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌హాజరై.. ప్రధానిని ప్రశ్నించి ఉండాల్సిందని మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్‌ ‌చేసిన ట్వీట్‌కు కేటీఆర్‌ ‌రిప్లై ఇచ్చారు. సంధి కుదరదని తెలిసీ శ్రీకృష్ణుడు రాయబారానికి వెళ్లిన మహా భారతాన్ని కేసీఆర్‌ ఆదర్శంగా తీసుకొని ఉంటే బాగుండేదని, ప్రధాన మంత్రి, సీఎంల సమక్షంలో జరిగిన సమావేశంలోనే నీతి ఆయోగ్‌ని సీఎం ప్రశ్నించి ఉండాల్సింది అని ప్రొఫెసర్‌ ‌నాగేశ్వర్‌ ‌తన ట్వీట్‌లో పేర్కొన్నారు. అయితే, దీనికి కేటీఆర్‌ ‌కౌంటర్‌ ఇచ్చారు. ‘అయిననూ పోయి రావలె హస్తినకు’ అనేది పాత మాట అని ట్వీట్‌ ‌చేశారు. ‘ఈ కేంద్ర ప్రభుత్వం పక్షపాత, వివక్షాపూరితమైన మనస్తత్వంతో గతంలో నీతి ఆయోగ్‌ ‌సిఫార్సులను బుట్టదాఖలు చేసింది’ అని పేర్కొన్నారు. ‘నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో.. నీతి ఆయోగ్‌లో నీతి కూడా అంతే’ అని వ్యాఖ్యానించారు. అందుకే సీఎం కేసీఆర్‌ ‌నీతి ఆయోగ్‌ ‌భేటీని బహిష్కరించారని ముగింపు ఇచ్చారు.

వెంటనే స్పందించిన నీతి ఆయోగ్‌

‌కేసీఆర్‌ ‌చేసిన ఆరోపణలపై నీతి ఆయోగ్‌ ‌దిమ్మదిరిగే కౌంటర్‌ ఇచ్చింది. నీతి ఆయోగ్‌ ఇప్పుడొక నిరర్థక సంస్థలా మారిందని, ఆ సమావేశాలు.. మోదీ భజన మండలిగా మారాయని కేసీఆర్‌ ‌చేసిన సంచలన ఆరోపణలపై నీతి ఆయోగ్‌ ‌సైతం అంతే ఘాటుగా స్పందించింది. కేసీఆర్‌ ‌మాట్లాడిన ప్రతి మాటకూ ఆ సంస్థ వివరణాత్మక కౌంటర్‌ ఇచ్చింది. ఈ కీలక సమావేశాన్ని కేసీఆర్‌ ‌బహిష్కరించడం దురదృష్టకరం అంటూనే, ఆ విమర్శలన్నీ పచ్చి అబద్ధాలంటూ నీతి ఆయోగ్‌ ‌వివరణ ఇచ్చింది. తెలంగాణ సర్కారుతో సంప్రదించకుండానే నీతి ఆయోగ్‌ ‌పాలక మండలి సమావేశం అజెండాను రూపొందించారన్న కేసీఆర్‌ ఆరోపణలు అవాస్తవమని పేర్కొంది. అందరితో సంప్రదించిన తర్వాతే సమావేశ ఎజెండాను ఖరారు చేసినట్లు వెల్లడించింది. 2021 జనవరి 21న నీతి ఆయోగ్‌ ఉపాధ్యక్షుడి నేతృత్వంలో ఒక ప్రతినిధి బృందం హైదరాబాద్‌లో తెలంగాణ సీఎంను కూడా కలిసిందని గుర్తుచేసిన సంస్థ.. తాజా సమావేశంపై చర్చించేందుకు ఎన్నిసార్లు అభ్యర్థనలు పంపినా కేసీఆర్‌ ‌స్పందించ లేదని తెలిపింది. కేసీఆర్‌ ‌తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేసిన గంటలోపే నీతి ఆయోగ్‌ ‌స్పందిం చింది. జాతీయ ప్రాధాన్యం గల అన్ని అంశాలపై ప్రధానమంత్రి కార్యాలయంతో పాటు కేంద్ర ప్రభుత్వానికి చెందిన వివిధ మంత్రిత్వ శాఖలు, అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నట్లు నీతి ఆయోగ్‌ ‌వివరించింది. నీతి ఆయోగ్‌ ‌పాలక మండలి సమావేశ ఎజెండా రూపకల్పన కోసం తెలంగాణతో పాటు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతో కేంద్రంతో విస్తృతంగా చర్చలు జరి పామని, దాదాపు ఆరు నెలల పాటు జరిగిన చర్చల్లో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా పాల్గొన్నారని, ఈ చర్చల ఫలితంగానే 2022 జూన్‌లో ధర్మశాలలో జాతీయ స్థాయి ప్రధాన కార్యదర్శుల సమావేశం జరిగిందని నీతి ఆయోగ్‌ ‌పేర్కొంది. వాస్తవాలు ఇలా ఉంటే.. నీతి ఆయోగ్‌ ‌సమావేశంలో పాల్గొనబోమని కేసీఆర్‌ ‌ప్రకటించడం దురదృష్టకరమని సంస్థ తన ప్రకటనలో వ్యాఖ్యా నించింది. అభివృద్ధికి సంబంధించిన అనేక అంశా లపై చర్చించి, నిర్ణయాలు తీసుకునే ఈ సమా వేశంలో కేంద్ర, రాష్ట్రాలకు చెందిన ఉన్నత స్థాయి నాయకులు పాల్గొంటారని, దానికి కేసీఆర్‌ ‌రాకపోవడం విచారకరమని తెలిపింది. పటిష్టమైన రాష్ట్రాలతో బలమైన దేశాన్ని రూపొందించాలన్న లక్ష్యంతోనే నీతి ఆయోగ్‌ను ఏర్పాటు చేశారని, సమాఖ్య స్ఫూర్తితో కలిసికట్టుగా పనిచేసేందుకు అనేక చర్యలు చేపట్టారని వివరించింది. గడిచిన ఏడాది లోనే రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నీతి ఆయోగ్‌ ‌వైస్‌ ‌ఛైర్మన్‌, ‌సభ్యులు దాదాపు 30 సమావేశాలు నిర్వ హించారని.. రాష్ట్రాలకు, వివిధ మంత్రిత్వ శాఖలకు చెందిన అనేక సమస్యలను పరిష్కరించారని వెల్లడించింది. గత నాలుగేళ్లుగా భారత ప్రభుత్వం జలజీవన్‌ ‌మిషన్‌ ‌కింద రూ.3982 కోట్లు కేటా యించిందని, అయితే రాష్ట్రం కేవలం రూ.200 కోట్లే తీసుకుందని తెలిపింది. అంతేగాక, 2014-15 నుంచి 2021-22 వరకు తెలంగాణకు పీఎం కిసాన్‌ ‌యోజన, ఏఐబీపీ, కమాండ్‌ ఏరియా నీటి నిర్వహణ కింద రూ.1195 కోట్లు కేటాయించామని నీతి ఆయోగ్‌ ‌వివరించింది. కేంద్ర పథకాలు, జాతీయ ప్రాధాన్యం గల కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఆర్థికంగా నిరంతరం మద్దతునిస్తోందని తెలిపింది. 2015-16లో కేంద్ర ప్రాయోజిత పథకాలకు రూ.2,03,740 కోట్లు కేటాయించగా, అది 2022-23కు రూ.4,42,781 కోట్లకు పెరిగిందని సంస్థ వివరించింది.

అటు.. కేసీఆర్‌ ‌నిర్ణయం, కేటీఆర్‌ ‌ట్వీట్లు, హరీష్‌రావు కౌంటర్లపై బీజేపీ సహా అన్ని పార్టీలు పెదవి విరిచాయి. నీతి ఆయోగ్‌పై సీఎం కేసీఆర్‌ ‌చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్పందిం చారు. నీతి ఆయోగ్‌ ‌సమావేశాన్ని బహిష్క రించడం తెలంగాణకు మంచిది కాదని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో బీజేపీ బలపడుతుండటం చూసి.. సీఎం కేసీఆర్‌కు భయం పట్టుకుందని విమర్శించారు. అభద్రతా భావంతోనే కేంద్ర ప్రభుత్వ వ్యవస్థలపై దుమ్మెత్తిపోస్తున్నారని ఎద్దేవా చేశారు.

వ్యాసకర్త : సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE