‘అమర్‌నాథుడు భారత్‌లో ఉన్నప్పుడు, శారదామాతను సరిహద్దులకు ఆవల ఎలా ఉంచగలం? పాకిస్తాన్‌ ఆ‌క్రమిత కశ్మీర్‌ (‌పీవోకే) ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమే. పీవోకే మనదేశంలో అంతర్భాగమని పార్లమెంట్‌లో చేసిన తీర్మానానికి కట్టుబడి ఉన్నాం. భారత్‌ను సూపర్‌ ‌పవర్‌గా తీర్చిదిద్దుకోవడమే అమర జవాన్లకు మనమిచ్చే అసలైన నివాళి. ఆర్టికల్‌ 370, 35ఏ ‌రద్దు ద్వారా కశ్మీర్‌ ‌ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేరింది’ జూలై 26న జమ్ములో కార్గిల్‌ అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ‌చేసిన వ్యాఖ్యలు ఇవి..

‘జ్ఞానప్రదా సతీమాతా కాశ్మీరేతు సరస్వతీ/మహావిద్యా మహామాయా భక్తిముక్తిప్రదాయినీ/వారాణస్యాం విశాలాక్షీ, కాశ్మీరేషు సరస్వతీ/అష్టాదశ సుపీఠాని యోగినామపి దుర్లభమ్‌’ ‌శారదాపీఠంలో సరస్వతీమాతను ప్రార్థిస్తూ చేసే స్తోత్రం ఇది. హిందు వులు పవిత్రంగా కొలిచే అష్టాదశ శక్తిపీఠాల్లో నీలం (జీలం) నది ఒడ్డున ఉన్న శారదాపీఠం కూడా ఒకటి. నీలం నదిని కిషన్‌ ‌గంగా అని కూడా పిలుస్తారు. శ్రీనగర్‌ ‌నుండి 130 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంటుంది. శారదాపీఠం కారణంగానే కశ్మీర్‌ను శారదాదేశం అని పిలిచేవారు. దక్షిణ యజ్ఞ గాథ ప్రకారం సతీదేవి కుడిచేయి ఇక్కడ పడింది. ఒకప్పుడు ఇది గొప్ప విద్యా కేంద్రంగానూ విరాజిల్లి నది. సంస్కృత పండితులకు, హిందూ, బౌద్ధ ధర్మాలకూ నిలయంగా ఉండేది. ఇక్కడే ఆది శంకరాచార్యులు సర్వజ్ఞానపీఠాన్ని అధిష్టించారు. రామానుజాచార్య బ్రహ్మ సూత్రాలపై వ్యాఖ్య ఇక్కడే రాశారు. కశ్మీరాన్ని పాలించిన రాజు లలితాదిత్యుడు ఇక్కడ సుందర ఆలయాన్ని నిర్మించారు.

కానీ.. దురదృష్టవశాత్తు శారదాపీఠం ఇప్పుడు మన పాలనా ప్రాంతంలో లేదు. పాకిస్తాన్‌ ఆ‌క్ర మించుకున్న భూభాగంలో ఉంది. దీంతో కశ్మీర్‌ ‌హిందూ పండితులు అక్కడికి చేరుకోలేకపోతున్నారు. శారదాపీఠం సందర్శనకు మనకు అనుమతి ఇచ్చేం దుకు పాకిస్తాన్‌ ‌ప్రభుత్వం నిరాకరిస్తూ వచ్చింది. భారతీయులు అమర్‌నాథ్‌, ‌మార్తాండ సూర్య ఆలయాన్ని సందర్శిస్తున్నారు, కానీ శారదాపీఠానికి వెళ్లలేని దుస్థితి ఏర్పడింది. ముజఫరాబాద్‌ ‌ద్వారా ఆలయాన్ని సందర్శించడానికి భక్తులను అనుమతిం చాలని భారత ప్రభుత్వం, శారదా బచావో కమిటీ పాకిస్తాన్‌ ‌ప్రభుత్వానికి లేఖలు రాసినా ఫలితం కనిపించలేదు. ఈ ఆలయాన్ని పాక్‌ ‌ప్రభుత్వం సంరక్షిస్తుందనుకోవడం అత్యాశే అవుతుంది. విదేశీ ముస్లిం పాలకుల దండయాత్రల్లో దెబ్బతిన్న శారదా పీఠంలో ఇప్పుడు శిథిలాలు మాత్రమే మిగిలాయి. భారత రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఇటీవల జమ్ములో పర్యటించినప్పుడు శారదాపీఠం గురించి ప్రస్తావించారు.

అమర జవాన్లకు నివాళులు

కార్గిల్‌ ‌విజయ్‌ ‌దివస్‌ (‌జూలై 26) సందర్భంగా జమ్ముకశ్మీర్‌ ‌పీపుల్స్ ‌ఫోరం (జేపీఎఫ్‌) ‌జమ్ములోని గుల్షన్‌ ‌మైదానంలో భారీ సభను ఏర్పాటుచేసింది. ఈ కార్యక్రమంలో కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ ‌సింగ్‌, ‌రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌ ‌సర్‌ ‌కార్యవాహ దత్తాత్రేయ హొసబలే పాల్గొన్నారు.

1947 నుంచి ఇప్పటి వరకూ దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమర జవాన్లకు ఈ సభ ఘనంగా నివాళులర్పించింది. అమరవీరుల కుటుం బాలను సన్మానించింది.

రాజ్‌నాథ్‌సింగ్‌ ‌మాట్లాడుతూ, దేశ ఐక్యత, సమగ్రత, సార్వభౌమాధికార పరిరక్షణ కోసం భారత సైన్యం, భద్రతా దళాలు చేసిన త్యాగాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనని అన్నారు. స్వాతంత్య్రా నంతరం భారతదేశం ఐదు యుద్ధాలు చేయాల్సి వచ్చిందని, ఇందులో 1962లో చైనాతో యుద్ధం ఒకటైతే, మిగతా నాలుగు 1947, 1965, 1971, 1999 పాకిస్తాన్‌తో జరిగాయని రాజ్‌నాథ్‌ ‌గుర్తుచేశారు. ఈ ఐదు యుద్ధాల్లోనూ జమ్ముకశ్మీర్‌, ‌లద్దాఖ్‌ ‌యుద్ధ క్షేత్రంగా ఉన్నాయని తెలిపారు. ఈ ప్రాంతం రాబందుల్లాంటి శత్రువుల కంటి నీడలో ఉండేదని, భారత సైన్యం నిరంతరం అద్భుతమైన పరాక్రమాన్ని, త్యాగాన్ని ప్రదర్శిస్తూ శత్రువుల ప్రణాళికలను భగ్నంచేస్తూ వచ్చిందని ఆయన ప్రశంసించారు.

ఎందరో సైనికుల త్యాగఫలం

1948 యుద్ధంలో జమ్ములోని రాజౌరీని శత్రు వులు ఆక్రమించినప్పుడు, దాన్ని విముక్తం చేసేందుకు పోరాడి ప్రాణాలు అర్పించిన బ్రిగేడియర్‌ ‌హుసేన్‌ ఉస్మాన్‌, ‌మేజర్‌ ‌సోమనాథ్‌శర్మ త్యాగాలు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినవని రాజ్‌నాథ్‌ ‌పేర్కొ న్నారు. నేడు మనం చూస్తున్న జమ్ముకశ్మీర్‌ ‌స్వరూపం వెనుక వారి త్యాగం ఉందని కూడా ఆయన గుర్తు చేశారు. రిజాంగ్‌-‌లా యుద్ధం భారత్‌లోనే కాకుండా ప్రపంచ సైనిక చరిత్రలోనే అత్యంత కఠినమైనదని, భారత సైన్యం కన్నా 10 రెట్లు ఎక్కువగా ఉన్న చైనా సైనికులతో జరిగిన నాటి పోరాటాన్ని మరచి పోలేమని రాజ్‌నాథ్‌ ‌గుర్తుచేశారు. మేజర్‌ ‌షైతాన్‌సింగ్‌ ‌నాయకత్వంలో పోరాడిన 120 మంది వీరసైనికుల త్యాగాలు ఎప్పటికీ మరచిపోలేనివన్నారు. కార్గిల్‌ ‌యుద్ధంలో విజయం మన త్రివిధ దళాల ఐక్యతకు గొప్ప ఉదాహరణగా నిలిచిందని పేర్కొన్నారు.

రక్షణరంగంలో మున్ముందుకు..

భారత్‌ను రక్షణరంగంలో ప్రపంచ సూపర్‌ ‌పవర్‌గా మార్చడమే అమర జవాన్లకు మనమిచ్చే నిజమైన నివాళి అన్నారు రాజ్‌నాథ్‌. ‘ఈ ‌రోజున మనం స్వావలంబ భారత్‌, ‌మేక్‌ ఇన్‌ ఇం‌డియా, మేక్‌ ‌ఫర్‌ ‌ది వరల్డ్’ అనే నినాదాలతో ముందు కెళ్తున్నాం. పరిస్థితి మారింది, ఇంతకుముందు భారతదేశం రక్షణ దిగుమతిదారుగా మాత్రమే ఉండేది. నేడు ప్రపంచంలోని అతిపెద్ద రక్షణ ఎగుమతిదారుల్లో మనమూ చోటు సంపాదించాం. ఎలాంటి అంతర్జాతీయ శక్తి మనపై దండెత్తినా తగిన సమాధానం ఇచ్చి విజయం సాధిస్తామని నేను హామీ ఇస్తున్నాను’ అని చెప్పారు. అంతేకాదు, ఆర్టికల్‌ 370 ‌రద్దుతో జమ్ముకశ్మీర్‌ ‌ప్రజల ఆకాంక్ష నెరవేరిందని, ఇప్పుడు జమ్ముకశ్మీర్‌ ‌త్వరితగతిన అభివృద్ధి చెందే అవకాశం ఏర్పడిందని ఆయన తెలిపారు. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే అధికరణం రద్దు ద్వారా డాక్టర్‌ ‌శ్యామాప్రసాద్‌ ‌ముఖర్జీ కల నెరవేరిందన్నారు.

ఈరోజు మరువలేనిది: దత్తాత్రేయ

ఆర్‌ఎస్‌ఎస్‌ ‌సర్‌ ‌కార్యవాహ దత్తాత్రేయ హొసబలే మాట్లాడుతూ ‘దేశం కోసం ప్రాణాలర్పించిన వారి కుటుంబాలతో కలిసిన ఈరోజు ఎప్పటికీ మరిచి పోలేనిదని చెప్పారు. ‘ఎన్నో తరాల పోరాటంతో మనకు స్వాతంత్య్రం వచ్చింది. ఎంతోమంది ప్రాణాలు త్యాగంచేశారు. ఈ త్యాగాలను స్మరించు కోవాలి, భారతదేశాన్ని గొప్పగా తీర్చిదిద్దుతామని ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలి’ అని కోరారు. భారత్‌-‌పాకిస్తాన్‌ ‌వివాదంలో తొలి బాధితులు పాకిస్తాన్‌ ఆ‌క్రమిత జమ్ముకశ్మీర్‌ ‌ప్రజలేనని హొసబలే చెప్పారు. ఈ ప్రాంత ప్రజలు పాకిస్తాన్‌ ‌నుంచి విముక్తి కోసం భారతదేశం వైపు చూస్తున్నారని కూడా పేర్కొన్నారు. 1947లో పాకిస్తాన్‌ ‌జమ్ముకశ్మీర్‌పై దాడిచేసి అనేక ప్రాంతాలను ఆక్రమించుకున్నదని, ఆయా ప్రాంతాల నుండి హిందువులను నిర్ధాక్షిణ్యంగా వెళ్లగొట్టారని, వారు శరణార్థులుగా జీవిస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. పాకిస్తాన్‌ ‌దురాగతాల నుంచి జమ్ముకశ్మీర్‌ ‌వాసులను మన సైన్యం ఎన్నోసార్లు రక్షించిందని తెలిపారు. మనకు స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి జమ్ముకశ్మీర్‌పై పాకిస్తాన్‌ ‌దుష్ప్రచారం చేస్తూనే ఉందని, మనదేశాన్ని అస్థిరపరిచే క్రమంలో తీవ్ర వాదం, వేర్పాటువాదాన్ని వ్యాపింప జేస్తోందని దత్తాత్రేయ విచారం వ్యక్తంచేశారు. ఈ ప్రయత్నాలను భగ్నం చేసేందుకు భద్రతా బలగాలు, స్థానిక ప్రజలు ఎంతో కృషిచేశారని ప్రశంసించారు.

మహారాజా హరిసింగ్‌ ‌దూరదృష్టి

జమ్ముకశ్మీర్‌ ‌విలీన సమయంలో అనేక సవాళ్లను మహారాజా హరిసింగ్‌ ‌ధైర్యంగా ఎదుర్కొన్నారని గుర్తుచేశారు హొసబలే. ఒకవైపు పాకిస్తాన్‌, ‌మరోవైపు బ్రిటిష్‌ ‌వారి కుట్రలను హరిసింగ్‌ ఓడించారని, ఈ ప్రాంతంపై ఈ రెండు పక్షాలు కన్నేసినా ఆయన దూరదృష్టితో ఆలోచించి జమ్ముకశ్మీర్‌ను భారత దేశంలో విలీనం చేశారని తెలిపారు. జమ్ముకశ్మీర్‌ ‌వాసులంతా తాము భారతీయులమేనని గర్వంగా చెబుతున్నారన్నారు. భారత్‌లో జమ్ముకశ్మీర్‌ ‌సంపూ ర్ణంగా విలీనమైనా ఆనాటి కేంద్ర, రాష్ట్ర పాలకుల కుట్రల కారణంగా రాజ్యాంగంలోని అనేక నిబంధ నలు ఈ ప్రాంతానికి వర్తించకుండా పోయాయని హొసబలే విచారం వ్యక్తంచేశారు. ఈ కారణంగానే డాక్టర్‌ ‌శ్యామాప్రసాద్‌ ‌ముఖర్జీ స్వతంత్ర దేశంలో మొట్టమొదటి ప్రజా ఉద్యమాన్ని ప్రారంభించా రన్నారు. ఒకే దేశంలో రెండు రాజ్యాంగాలు, రెండు పతాకాలు ఎందుకని ప్రశ్నించి తన ప్రాణాలను సైతం త్యాగంచేసిన ముఖర్జీని ప్రతి ఒక్కరూ స్మరించు కోవాలని పిలుపునిచ్చారు. జమ్ముకశ్మీర్‌లోని మహిళలు, ఎస్సీలు, షెడ్యూల్డ్ ‌తెగలు, పశ్చిమ పాక్‌ ‌శరణార్థులు, గుర్ఖాల అభివృద్ధికి ప్రతిబంధకంగా ఉన్న ఆర్టికల్‌ 370, 35 ఎ ‌తొలగింపు భారత అతిపెద్ద విజయమన్నారు. సుదీర్ఘ యుద్ధంలో విజయం సాధిం చిన ఈ ప్రాంత ప్రజలకు దేశంలోని ఇతర ప్రాంతా లతో సమానంగా రాజకీయ రిజర్వేషన్లు, హక్కులు పొందే అవకాశం ఇప్పటికి లభించిందని అన్నారు.

– క్రాంతి,  సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE