ఇండియా, ఇజ్రాయిల్‌, ‌యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్ (‌యూఏఈ), యునైటెడ్‌ ‌స్టేట్స్ ఆఫ్‌ అమెరికా (యూఎస్‌) ‌దేశాధినేతల తొలి ‘ఐ2యూ2’ సమావేశం ఈ జూలై 14న వర్చువల్‌గా జరిగింది. నిజానికి 2021లో ఈ నాలుగు దేశాల విదేశాంగ మంత్రుల సమావేశంలో ‘అంతర్జాతీయ ఆర్థిక సహకార సంఘం’ పేరుతో ఈ గ్రూపు ఏర్పాటైంది. ఆమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఇటీవల ఇజ్రాయిల్‌, ‌సౌదీ అరేబియా, యూఏఈల్లో పర్యటించిన తర్వాత ఐ2యూ2 వర్చువల్‌ ‌సదస్సు జరగడానికి మార్గం సుగమమైంది. అంతేకాదు, ఆగస్టు 13, 2020న విడుదల చేసిన ఇజ్రాయిల్‌, ‌యూఏఈ, అమెరికాల ఉమ్మడి ప్రకటన (ఇజ్రాయిల్‌-‌యూఏఈ, ఇజ్రాయిల్‌-‌బహ్రైన్‌ల మధ్య కుదిరిన స్నేహ ఒప్పందాలు. వీటినే అబ్రహం ఒప్పందాలు (తీ•ష్ట్ర•ఎ మీమీశీతీ•) అంటారు. ఇవి అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ‌ట్రంప్‌ ‌సమక్షంలో జరిగాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి ప్రకటన వెలువడింది) రాజకీయ ప్రాధాన్యాన్ని ఈ ఐ2యూ2 సదస్సు మరింతగా నొక్కి చెప్పింది. కాగా ఈ నాలుగు దేశాధినేతలు నీరు, ఇంధనం, రవాణా, అంతరిక్షం, ఆరోగ్యం, ఆహార భద్రత అనే అంశాలపై ప్రధానంగా దృష్టిసారించారు. ఐ2యూ2 ఉమ్మడి ప్రకటన కూడా వీటికే ప్రాధాన్యమివ్వడం గమనార్హం. ఈ మొట్టమొదటి ఐ2యూ2 సదస్సు వల్ల ఆర్థికంగా లాభపడింది కూడా భారతే!

ఇది కేవలం ఆర్థిక పరమైనదని; పెట్టుబడులకు అనువైన భౌగోళిక, ఆర్థిక స్థితిగతులైన మౌలిక సదుపాయాలు కల్పించడం, వాతావరణ మార్పులను అడ్డుకోవడం, ప్రజారోగ్య వ్యవస్థ వంటి వాటిపై చర్చించడానికి ఉద్దేశించిందని ఐ2యూ2 సదస్సు మొట్టమొదట స్పష్టతనిచ్చింది. ఇజ్రాయిల్‌, ‌యూఏఈ, యూఎస్‌ల నుంచి పెద్దఎత్తున పెట్టు బడులను ఆకర్షించడానికి, ముఖ్యంగా పునరుత్పాదక ఇంధన వనరులకు కేంద్రంగా, సరఫరా శృంఖలాల యంత్రాంగానికి ప్రత్యామ్నాయంగా రూపొందడానికి, లుక్‌ ‌వెస్ట్ ‌పాలసీలో భాగంగా పశ్చిమాసియాతో ప్రయోజనాత్మక ఆర్థిక సంబంధాలు నెలకొల్పుకోవ డానికి ఈ సదస్సు భారత్‌కు ఎంతో ఉపకరించింది. ఈ విధంగా ఇజ్రాయిల్‌, ‌యూఏఈ, అమెరికాలతో సంబంధాలను మరింత పెంచుకోవడం భారత్‌ ‌పరంగా ఒక గేమ్‌ఛేంచర్‌ ‌వంటిదే. గుజరాత్‌, ‌మధ్యప్రదేశ్‌ ‌రాష్ట్రాల్లో ఫుడ్‌ ‌పార్క్‌ల కోసం రెండు బిలియన్‌ ‌యూఎస్‌ ‌డాలర్ల పెట్టుబడి పెట్టడానికి ఈ సందర్భంగా యూఏఈ ముందుకొచ్చింది. యూఏఈ -ఇజ్రాయిల్‌, ‌ప్రైవేటు రంగం సహకారంతో దేశంలో ఆహార ఉత్పత్తిని మరింతగా పెంచేందుకు ఈ పెట్టుబడులు ఉపకరిస్తాయి. ఈ ఫుడ్‌పార్క్‌లు దేశంలో ఆహార వృథాను కూడా సమర్థవంతంగా అరికట్టడమే కాకుండా, గల్ఫ్ ‌ప్రాంతంలో ఆహార భద్రతకు దోహదం చేస్తాయి. ఇదే సమయంలో భారత్‌ ‌తన ఇంధన అవసరాలపై గల్ఫ్ ‌దేశాలతో చర్చించే వెసులుబాటు కలుగుతుంది.

ఐ2యూ2 గ్రూపింగ్‌ ‌వల్ల వ్యర్థాల నిర్వహణ సమస్యకు పరిష్కారంగా ప్రైవేటు సాంకేతిక నైపుణ్యాల వినియోగం, ప్రైవేటు పెట్టుబడులకు ప్రోత్సాహం కూడా లభిస్తుంది. ఇదే సమయంలో స్టార్టప్‌ ‌లింకేజీలు పెరగడం వల్ల, దేశంలో స్టార్టప్‌లపై పెట్టు బడులు పెరిగి ఈ పరిశ్రమ ఊపందుకుంటుంది. క్లీన్‌ ఎనర్జీ పరంగా కూడా దేశానికి ప్రయోజనం చేకూరుతుంది. ముఖ్యంగా పవన, సౌర విద్యుత్‌లను ఏకీకృతం చేయడం ద్వారా హైబ్రిడ్‌ ‌పునరుత్పాదక ఇంధన సదుపాయాల కల్పనకు వీలుకలిగి పారిస్‌ ఒప్పందం మేరకు భారత్‌ ‌కర్బన ఇంధన వనరులపై అధికంగా ఆధారపడటం గణనీయంగా తగ్గి పోతుంది. ఈ విధంగా క్లీన్‌ ఎనర్జీ రంగంలో యూఏఈ, ఇజ్రాయిల్‌ ‌దేశాలతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడం ద్వారా భారత్‌ ‌పశ్చిమాసియాలో తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకోగలదు.

1990 నుంచే పశ్చిమాసియాతో సంబంధాలు

నిజానికి 1990 ప్రాంతం నుంచే భారత్‌కు పశ్చిమాసియాతో ఇంధన పరంగా మంచి సంబం ధాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం భారత్‌ ‌తన లుక్‌ ‌వెస్ట్ ‌పాలసీలో భాగంగా, గల్ఫ్‌దేశాల అంతర్గత రాజకీయ వ్యవహారాతో సంబంధం లేకుండా తన జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా అడుగులు ముందుకేస్తోంది. భారత్‌-‌యూఏఈల మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సీఈపీఏ) వల్ల ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం మరింత బలోపేతం కానుంది. తన రక్షణావసరాల రీత్యా ఇజ్రాయిల్‌తో భారత్‌కు బలీయమైన చారిత్రక సంబంధాలున్నాయి. ఇక పశ్చిమాసియాలో మరో ప్రధాన దేశం సౌదీ అరేబియా రిలయన్స్‌కు సంబంధించిన జియో ప్లాట్‌ఫామ్‌పై పెద్దమొత్తంలో పెట్టుబడులు పెడుతోంది. ఇటీవలి కాలంలో యూఏఈ, సౌదీ అరేబియాలతో భారత్‌ ‌సంబంధాల గణనీయ వృద్ధి మన విదేశాంగ విధాన సాఫల్యతకు గొప్ప ఉదాహరణ. లుక్‌ ‌వెస్ట్ ‌పాలసీలో భాగంగా అరబ్‌ ‌దేశాలు-ఇజ్రాయిల్‌, ‌సౌదీ అరేబియా-ఇరాన్‌ల మధ్య నెలకొన్న స్పర్థల్లో తల దూర్చకపోవడం వల్ల చమురు ఎగుమతి దేశాల (ఓఐసీ)తో భారత్‌ ‌సంబంధాలు మరింత మెరుగైన స్థితిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఐ2యూ2 వేదిక, అరబ్‌ ‌ప్రపంచంతో భాగస్వామ్యాన్ని ముఖ్యంగా బహుముఖ పెట్టుబడుల రంగంలో మనదేశాన్ని మరింత బలోపేతం చేసు కోవడానికి దోహదం చేయగలదు. ఒక్కమాటలో చెప్పాలంటే పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్న పరస్పర వైషమ్యాలతో పనిలేకుండా, తన పని తాను చేసుకుపోతూ భారత్‌ ఈ ‌ప్రాంతంలో తన సుస్థిరతకు ఢోకా లేకుండా ముందుకు సాగుతోంది.

వైరుధ్య పరిస్థితులతో ఇబ్బందులు

అమెరికా ఆంక్షలు విధించినా ఇరాన్‌తో సంబం ధాలను కొనసాగించడం భారత్‌కే చెల్లింది. అమెరికా ఆంక్షలు ఇరు దేశాల సంబంధాలను ఇబ్బందుల్లోకి నెట్టేసినప్పటికీ, చైనా కబంధ హస్తాల్లోకి పోతుందను కున్న చబ్బహార్‌ ‌పోర్టును తిరిగి తన ఆధీనంలోకి తెచ్చుకోవడం భారత్‌ ‌దౌత్య నిపుణతకు మచ్చుతునక. ఇటీవలి కాలంలో భారత్‌-ఇరాన్‌ ‌దేశాల మధ్య ఉన్నతస్థాయి నేతలు పరస్పరం పర్యటించడం, ఇరాన్‌ అణ్వాయుధాల ఉత్పత్తికి వ్యతిరేకంగా ఐఏఈఏలో పశ్చిమదేశాలు ప్రవేశపెట్టిన తీర్మానంపై ఓటింగ్‌లో పాల్గొనకపోవడం వంటివి తన చిరకాల మిత్రుడు ఇరాన్‌ ‌పట్ల భారత సానుకూల వైఖరిలో ఏవిధమైన మార్పు లేదనడాన్ని స్పష్టంచేస్తున్నాయి. ఇదే సమ యంలో గల్ఫ్‌లో క్రమంగా విస్తరిస్తున్న భారత రక్షణ పరిచ్ఛేదాన్ని నిశితంగా పరిశీలిస్తున్న ఇరాన్‌.. ‌మన దేశానికి యూఎస్‌తో ఉన్న సన్నిహిత రక్షణ సంబం ధాలు తనకు ప్రమాదం కావన్న సత్యాన్ని గుర్తించడం మరో సానుకూల పరిణామం. ఇజ్రా యిల్‌, ఇరాన్‌ల మధ్య బద్ధవైరం, యెమెన్‌ ‌విష యంలో ఇరాన్‌, ‌సౌదీ అరేబియాల విరుద్ధ వైఖరులు, మధ్యప్రాచ్యంలో ఇరాన్‌ ‌నడుపుతున్న రాజకీయాలు, దాని అణు కార్య క్రమం.. ఇటువంటి వైరుధ్య పరిస్థితుల మధ్య భారత్‌ ‌తన దౌత్యచాణక్యాన్ని ప్రదర్శిస్తూ అన్ని దేశాలతో సత్సంబంధాలు కొనసాగించడం విశేషం. అయితే ఇరాన్‌-ఇ‌జ్రాయిల్‌ ‌మధ్య కొనసాగు తున్న ‘యుద్ధం- దౌత్యం’ భారత్‌కు ఇబ్బంది కలిగించే అవకాశం లేకపోలేదు. ఈ రెండు దేశాల మధ్య ఏమాత్రం ఘర్షణలు తలెత్తినా అది భారత్‌కు ఇబ్బందికరం. చబ్బహార్‌ ‌పోర్ట్, ఇరాన్‌లోని వివిధ గ్యాస్‌, ‌చమురు పరిశ్రమలపై మనదేశం పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టింది. ఈ రెండు దేశాల మధ్య వైరం ఇరాన్‌తో మన సంబంధాలను ఒడుదొడుకుల్లోకి నెట్టేస్తే, చబ్బహార్‌ ‌పోర్టును కైవసం చేసుకోవడానికి గుంటనక్క చైనా ఎల్లప్పుడూ సిద్ధం! ఇండియా-ఇరాన్‌ ‌సంబం ధాలు ప్రస్తుతం కత్తిమీద సాము మాదిరిగా ఉన్నాయి. మన ప్రమేయం ఉన్నా లేకపోయినా జరిగే ఏ చిన్న పొరపాటైనా, ఇరాన్‌ను తీసుకెళ్లి చైనా ఒళ్లో కూర్చో బెట్టగలదు. ఇటీవలి కాలంలో సౌదీ అరేబియా- ఇరాన్‌ల వైఖరుల్లో తేడా కొట్టొచ్చినట్టు కనిపించడం గమనించదగ్గ పరి ణామం. ఇరాన్‌ అణుకార్యక్రమం సౌదీ అరేబియాకు సుతరామూ ఇష్టంలేదు. కానీ ఇరాన్‌, ‌రష్యాలతో వ్యూహాత్మకంగా వ్యవహరించ డానికి సౌదీ కొంత స్వేచ్ఛ కోరుకుంటోంది (ప్రస్తుతం అమెరికాకు సన్నిహత దేశంగా ఉంది). యూఏఈ, యెమన్‌ ‌దేశాలతో మన రక్షణ సంబంధాలు బలంగా ఉన్నాయి. హిందూ మహాసముద్ర పరిరక్ష ణకు హామీ ఇస్తున్న భారత్‌, ఇప్పుడు తన రక్షణ పరిధిని గల్ఫ్ ‌ప్రాంతాలకు కూడా విస్తరించడానికి ప్రధానకారణం, ఇంధన అవసరాలతోపాటు, మానవ శక్తి వనరుల ప్రయోజనాల పరిరక్షణ. ఇదే సమ యంలో ఇండో-పసిఫిక్‌ ‌ప్రాంతంలో చైనా దూకు డును అడ్డుకునే విధంగానే, పశ్చిమాసియాలో చైనా ప్రాబల్యానికి అడ్డుకట్ట వేయడం కూడా భారత్‌ ‌ప్రధాన లక్ష్యం. ముఖ్యంగా చైనా ఆర్థిక నడవాలో భాగంగా, గ్వదార్‌ ‌లేదా జివానిల్లో నౌకా స్థావరాలను ఏర్పాటు చేసు కోవడం పశ్చిమ హిందూ మహా సముద్రంపై పట్టు సాధించడానికి తప్ప మరోటి కాదు. పశ్చిమా సియా ప్రాంతంలో భారత్‌ ‌దౌత్య పరంగా చురుగ్గా వ్యవహరించడానికి కారణమైన ఈ పరిణామాలే ఐ2యూ2 (పశ్చిమ ప్రాంత క్వాడ్‌) ఏర్పాటుకు దోహదం చేశాయి. ప్రస్తుతం తూర్పు క్వాడ్‌ (ఇం‌డియా, ఆస్ట్రేలియా, జపాన్‌, ‌యూఎస్‌)‌లతో పోలిస్తే ఈ పశ్చిమ క్వాడ్‌ ‌క్రియాశీలంగా ఉండటం గమనార్హం. తూర్పు క్వాడ్‌ను చైనా (రష్యా కూడా) తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. కానీ పశ్చిమ క్వాడ్‌ను పెద్దగా పట్టించుకున్నట్టు లేదు. ఐ2యూ2 గ్రూపులో మన దేశ అంచనాలు వేరు. ముఖ్యంగా చైనా మనకు బద్ధ శత్రువు, కానీ దానికి సన్నిహితంగా ఉండే ఇరాన్‌ ‌మనకూ మిత్రుడే! విభిన్న రాజకీయాల నేపథ్యంలో భారత్‌ ఐ2‌యూ2లో ఆర్థిక అంశాలకే అగ్రతాంబూలం ఇస్తోంది.

ఎవరి వ్యూహాలు వారివి

ఐ2యూ2 సదస్సు ఏర్పాటులో అమెరికా ప్రధాన లక్ష్యం గతంలో ఈ ప్రాంతంలో రాజకీయంగా అత్యంత సన్నిహితంగా ఉన్న దేశాలతో సంబంధాలను మరింతగా విస్తరించుకోవడం. ముఖ్యంగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ‌ట్రంప్‌ ‌హయాంలో మధ్యప్రాచ్యంతో దెబ్బతిన్న సంబంధాలను మళ్లీ గాట్లో పడేయడం. దీనికి తోడు ఇజ్రాయిల్‌లోని టెలీకమ్యూనికేషన్లు, పోర్టుల పరిశ్రమలు చైనా నిర్వహణలో ఉండటాన్ని అమెరికాలోని హార్‌ ‌లైనర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా ఇజ్రాయిల్‌కు చెందిన హైఫా పోర్టుకు యూఎస్‌కు చెందిన 6వ, 7వ నౌకాదళాలు వస్తుంటాయి. దీని నిర్వహణను చైనాకు అప్పగించడంపై యూఎస్‌లో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ పోర్టు నిర్వహణను మన దేశానికి చెందిన ఆదానీ గ్రూప్‌ ‌చేపట్టింది. ఇక భారత్‌ ‌విషయానికి వస్తే, తన వ్యూహాత్మక స్వేచ్ఛ విషయంలో ఏమాత్రం రాజీపడకుండా, యూఎస్‌తో ఆసియా ఆవలి ప్రాంతాలతో తన సహకారాన్ని విస్తరించుకోవడంలో భాగంగా మధ్యప్రాచ్యంతో సంబంధాలను బలోపేతం చేసుకోవడం ప్రధాన లక్ష్యం. ఇప్పటికే భారత్‌ ‌ప్రపంచ రాజకీయాల్లో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నది. మన సన్నిహిత మిత్రుడుగా ఉన్న ఇజ్రాయిల్‌ ‘అ‌బ్రహం ఒప్పందాలు’ సక్రమంగా అమలు జరిగేలా చేయడంలో భారత్‌ ‌పలుకుబడిపై విశ్వాసం వ్యక్తం చేస్తోంది. కానీ ఇజ్రాయిల్‌, ‌యూఏఈలతో చైనా సంబంధాలు బలంగా ఉన్నాయి. ప్రత్యేకించి యూఎస్‌-‌చైనాల మధ్య శత్రుత్వం నెలకొన్న నేపథ్యంలో ఇజ్రాయిల్‌-‌చైనా సంబంధాల చిక్కుముడిని విప్పడం సాధ్యంకాదు. ఎందుకంటే ఆసియా, ఆఫ్రికా, యూరప్‌ ‌దేశాలను కలుపుతూ చైనా నిర్మిస్తున్న బెల్ట్ అం‌డ్‌ ‌రోడ్‌ ఇనిషియేటివ్‌ (‌బీఆర్‌ఐ)‌లో ఇజ్రాయిల్‌ ‌రహస్య భాగస్వామిగా ఉంది. ఇక యూఏఈ ఇప్పటికే బీఆర్‌ఐపై సంతకాలు చేసింది. పర్యాటకం, సాంకేతికత పరంగా బీఆర్‌ఐ ఇ‌జ్రాయిల్‌, ‌యూఏఈ దేశాలకు ఎంతో ప్రయోజనకరం. ఇదే సమయంలో చైనాకు సాంకేతికపరమైన దిగుమతులను నిషేధిస్తూ అమెరికా తీసుకున్న చర్య ఇజ్రాయిల్‌కు అనుకోని వరంగా మారింది. తమ ప్రయోజనాలను బేరీజు వేసుకున్న ఇజ్రాయిల్‌, ‌యూఏఈలు చైనాకు మిత్రులుగా కొనసాగడానికే ప్రాధాన్యమివ్వడం ఐ2యూ2 అసలు లక్ష్యానికే మింగుడు పడని సమస్య. పరిస్థితులను తనకు అనుకూలంగా మలచుకునే దిశగా చైనా పావులు కదుపుతూ, అబ్రహం ఒప్పందాలను (తీ•ష్ట్ర•ఎ మీమీశీతీ•) ఇప్పుడు స్వాగతించడం, యూఎస్‌ ‌దాని సహచర దేశాలకు గిట్టడంలేదు. ఐ2యూ2 సదస్సును చైనా పెద్దగా వ్యతిరేకించకపోవడానికి బహుశా ఇదే కారణమై ఉండవచ్చు. అంతేకాదు ఐ2యూ2 దేశాలు తనకు వ్యతిరేకంగా మూకుమ్మడి విమర్శల దాడికి దిగకుండా బలహీనపరచడం కూడా చైనా ‘అబ్రహం ఒప్పందాల’ను సమర్థించడం వెనుక దాగిన అసలు రహస్యం కావచ్చు! తాను వ్యక్తంచేస్తున్న అభ్యంతరాలకు, లేవనెత్తుతున్న ప్రశ్నలకు ఇజ్రాయిల్‌ ‌నుంచి స్పష్టమైన సమాధానాలు రాకపోవడం అమెరికాను ఆందోళనకు గురిచేస్తున్నది. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ ప్రాంతంలో చైనా సామాజిక-ఆర్థిక విస్తరణాభిలాషలో పావులుగా మారకుండా ఇజ్రాయిల్‌, ‌యూఏఈలను నివారించాల్సిన అవసరం యూఎస్‌, ఇం‌డియాలకు ఎంతైనా ఉంది. అయితే ఇది వాణిజ్య సంబంధాలకు మించి జరగాల్సిన ప్రయత్నం. మరి ఇందుకోసం భవిష్యత్తులో ఐ2యూ2 వేదికను భారత్‌, ‌యూఎస్‌లు ఎంతవరకు ఉపయోగించుకుంటాయో వేచిచూడాలి.

– మణి

About Author

By editor

Twitter
YOUTUBE