పశ్చిమ గోదావరి జిల్లా స్వాతంత్య్రోద్యమ చరిత్రలో నిష్కళంక దేశభక్తికి, అనితరసాధ్యమైన సేవాదృక్పథానికి ప్రతీకగా నిలిచిన వారు ఎందరో! వారిలో పసల కృష్ణమూర్తి దంపతులు ఉంటారు. గాంధేయ సిద్ధాంతాలను జీవితాంతం సకుటుంబంగా త్రికరణశుద్ధిగా ఆచరించిన ధన్యజీవులు వారు. తాడేపల్లిగూడెం సమీపంలోని పడమర విప్పర్రులో సంపన్న వ్యవసాయ కుటుంబం వారిది. గ్రామ మునసబు ఆదియ్య, సీతమ్మ దంపతులకు తృతీయ కుమారునిగా జనవరి 26, 1900న కృష్ణమూర్తి  జన్మించారు. ప్రాథమిక విద్య విప్పర్రు, ఉన్నత విద్య రాజమండ్రి వీరేశలింగం ఉన్నత పాఠశాలో జరిగింది. తన 16వ ఏట అత్తిలి సమీపంలోని దాసుళ్ల కుముదవల్లికి చెందిన దానం వెంకటరామయ్య, వెంకమ్మల కుమార్తె అంజలక్ష్మితో వివాహం జరిగింది. అంజలక్ష్మి 1904లో జన్మించారు.

ఏప్రిల్‌ 3, 1921‌న ఏలూరు సభలో మహాత్ముని దర్శించిన కృష్ణమూర్తి గాంధీజీ భావాలతో ప్రభావితుడై స్వాతంత్య్రోద్యమంలో ప్రవేశించారు. సహాయ నిరాకరణోద్యమంలో భాగంగా తాడేపల్లిగూడెం తాలూకాలో మద్యపాన నిషేధం, ఖద్దరు తయారీ, వినియోగం ప్రచార ఉద్యమాన్ని విస్తృతంగా చేపట్టారు. 1925లో తాలూకా కాంగ్రెస్‌ ‌కార్యవర్గ సభ్యునిగా ఎన్నికయ్యారు. ఏప్రిల్‌ 25, 1929‌న గాంధీజీ తాడేపల్లిగూడెం వచ్చినప్పుడు తన బంధువు పసల సోమయ్యతో కలసి సభాస్థలి ఏర్పాట్లు సమర్ధవంతంగా నిర్వహించి కార్యదక్షతను ప్రదర్శించారు. స్వగ్రామానికి చెందిన సుమారు 250 మందితో సమావేశానికి హాజరై ఖద్దరు నిధికి రూ. 250 విరాళాన్ని గాంధీజీకి స్వయంగా అందించారు. ఏప్రిల్‌ 27‌న భార్య అంజలక్ష్మి, ఆరేళ్ల కుమార్తె సత్యవతి, నాలుగేళ్ల కుమారుడు కృష్ణకుమార్‌తో చాగల్లులోని ఆనందనికేతన్‌లో గాంధీజీ దంపతులను కలిసి భార్య గాజులు, కంటె, కుమార్తె సర్వాభరణాలను ఖద్దరు నిధి కింద గాంధీజీ దోసిలిలో ఉంచి, ధన్యమైనట్లు అమితానందం పొందిన ఆయన, తాను స్వయంగా తయారుచేసిన నూలు చిలపలు గాంధీజీకి సమర్పించి ఆశీస్సులు పొందారు. గాంధీజీ కోర్కెపై ‘మేము, మా పిల్లలు ఇకపై బంగారం ధరించకుండా ఉండడానికి చూస్తామని’ సతీసమేతంగా వాగ్దానం చేసి, జీవితాంతం కోరా రంగు ముతక ఖద్దరు దుస్తులు, మోకాళ్ళు దిగని అంగవస్త్రం, భుజంపై తుండుతో జిల్లా అంతా అపర గాంధీలా పయనిస్తూ ఉద్యమించిన దేశభక్తుడు.

 జనవరి 10, 1930న ఏలూరులో జిల్లా కాంగ్రెస్‌ ‌సభలో ఉపన్యసిస్తూ కాంగ్రెస్‌ ‌నిర్ణయానుసారం 26వ తేదీన జిల్లాలోని పట్టణాలలోను, గ్రామీణ ప్రాంతాలలోను స్వాతంత్య్ర దినోత్సవాన్ని ద్విగుణీకృతోత్సాహంతో జరుపుకుని ‘పూర్ణ స్వరాజ్‌’ ‌సాధనకై ఉద్యమించాలని పిలుపునిచ్చారు. జనవరి 26న తాడేపల్లిగూడెంలో జాతీయ జెండాను ఎగురవేసి, ఊరేగింపు నిర్వహించారు. ఫలితంగా పోలీసుల లాఠీ దెబ్బలు తిన్నారు.

ఉప్పు సత్యాగ్రహోద్యమం ప్రారంభించనున్న తరుణంలో ఏలూరులో మార్చి2, 1930న కాంగ్రెస్‌ ‌కార్యవర్గం సమావేశమై, ఉద్యమాన్ని జిల్లా అంతటా సమర్థంగా నిర్వహించటానికి సారథులుగా నియమించిన ఐదుగురిలో కృష్ణమూర్తి ఒకరు. జిల్లాలో ప్రతి తాలూకాలోని ముఖ్య పట్టణాలలో శాంతి సైనిక శిబిరాలు ఏర్పరచటానికీ, నిరంతరం నూలు వడికేందుకు ఏర్పాట్లు చూడటానికీ జిల్లా కాంగ్రెస్‌ ‌సంఘం ‘చరఖా దీక్షాసంఘా’న్ని ఏర్పరిచింది. అందులో కృష్ణమూర్తి సభ్యులు. జిల్లా ప్రజలందరు దీక్షాబద్ధులై, దేశభక్తి పూరితులై, స్త్రీపురుషులు, వృద్ధులు, యువకులు వేలాదిగా శాంతి సమరంలో పాల్గొనాలని, ఉప్పు శాసనాలను ఉల్లంఘించాలని అదే నెల 8న పత్రికా ప్రకటనలో పిలుపునిచ్చారు.

మార్చి 31,1930వ తేదీన ఉప్పు శాసనోల్లంఘనకు ఏలూరు నుండి మట్లపాలెం వెళుతున్న శాంతి సత్యాగ్రహ దళాన్ని ఏప్రిల్‌ 2‌న విప్పర్రు గ్రామస్థులతో అరమైలు దూరం ఎదురేగి గ్రామానికి ఆహ్వానించారు. సత్యాగ్రహులతో కృష్ణమూర్తి, గ్రామస్థులు కలసి నగర సంకీర్తన చేసి జాతీయ గీతాలు ఆలపించారు. గ్రామస్థులు సత్యాగ్రహనిధికి రూ.328 ఇవ్వగా, కృష్ణమూర్తి రూ. 100 సమర్పించారు. అక్కడి నుంచి దండు నారాయణరాజు నేతృత్వంలో సత్యాగ్రహదళం ఏప్రిల్‌ 7, 1930 ఉదయం 9 గంటలకు అత్తిలి చేరుకుంది. శ్రీరామనవమి కల్యాణోత్సవ పందిరిలో ఏర్పరచిన బహిరంగ సభలో కృష్ణమూర్తి ఉప్పు సత్యాగ్రహ ఆవశ్య కత వివరించగా ప్రజలు హర్షధ్వనాలు చేశారు. ఒక అభిమాని నెలకు రూ.25 చొప్పున ఉద్యమ కాలమంతా పంపగలనని ప్రమాణం చేశాడు.

అదే నెల మట్లపాలెంలో వశిష్ఠ గోదావరి నుండి తెచ్చిన ఉప్పు నీటిని మరగకాచి ఉప్పు తయారుచేసి శాసనోల్లంఘన చేసిన ప్రథమ దళ సభ్యులలో కృష్ణమూర్తి ఒకరు. ప్రభుత్వం గాంధీజీని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఆయన మే 7న పెంటపాడు గ్రామంలో హర్తాళ్‌ ‌నిర్వహించి, ప్రభుత్వ నిరంకుశ విధానాన్ని నిశితంగా విమర్శించారు. సభానంతరం రూ.56 విలువగల స్వరాజ్య లవణాన్ని విక్రయిం చారు. ఆ మరునాడు సహబృందంతో బయలుదేరి తాడేపల్లిగూడెం తాలూకాలోని ప్రత్తిపాడు, జగన్నాథ పురం, మాధవరం గ్రామాల్లో ఖద్దరు ప్రచారం ముమ్మ రంగా చేపట్టారు. కృష్ణమూర్తి ప్రబోధం వలన దండగర్ర సహకార సంఘం రూ. 2000 విలువగల ప్రత్తిని కొనుగోలు చేయటానికి తీర్మానించింది. తాడేపల్లిగూడెం తాలూకాలో ఖద్దరు అమ్మకాలు విరివిగా పెరిగాయి. 1930 మే నెలలో శాంతి సైనికులు కృష్ణమూర్తి ఆధ్వర్యంలో అనంతపల్లి, గణపవరం పరిసర ప్రాంతాలలో సభలు ఏర్పరచి ‘ఉప్పు కొనడం శాసనధిక్కారం అవుతుంది, కొన్న వారు వీరులు కాగలరు’ అని బోర్డు పెట్టి స్వరాజ్య లవణం విక్రయించారు.

 జూన్‌ 8‌న తాడేపల్లిగూడెం సంతలో కృష్ణ మూర్తి, విఠాల వీరభద్రరావు మున్నగు సహచరులతో కలసి విదేశీ వస్త్ర దుకాణం వద్ద పికెటింగు చేస్తుండగా, పోలీసులు అరెస్టు చేసి భీమవరం సబ్‌ ‌డివిజనల్‌ ‌మేజిస్ట్రేట్‌ ఎదుట హాజరు పరచగా ఆయన కృష్ణ మూర్తికి జూన్‌ 10,1930‌నుండి ఏడాది కఠిన కారాగార శిక్ష విధించి రాజమండ్రి, వెల్లూరు జైళ్లకు తరలించారు. కాని గాంధీ – ఇర్విన్‌ ఒప్పందం వలన తొమ్మిది నెలలకే (మార్చి14,1931న) విడుద లయ్యారు.

శాసనోల్లంఘన ఉద్యమంలో ఆంగ్ల ప్రభుత్వ నిషేధాజ్ఞల్ని లెక్కచేయకుండా పసల కృష్ణమూర్తి అధ్యక్షతన 1932 జూన్‌ 27‌న పశ్చిమ గోదావరి జిల్లా కాంగ్రెస్‌ ‌మహాసభను రహస్యంగా భీమవరంలో నిర్వహించారు. సమావేశానంతరం తీర్మానం కాపీలను పంచిపెడుతూ సభ్యులందరూ భీమవరం సబ్‌ ‌కలెక్టరు కార్యాలయం వద్దకు వచ్చారు. పోలీసుల నుండి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొంటూ కృష్ణమూర్తి సబ్‌ ‌కలెక్టరు కార్యాలయం పైకి ఎక్కి, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించటం, కాంగ్రెస్‌ ‌కార్యకర్తలలో ఉత్సాహం, పోలీసు వర్గాలలో తీవ్ర క్రోధం కలిగిం చింది. పోలీసులు కృష్ణమూర్తిని లాఠీలతో తీవ్రంగా కొట్టి దేశద్రోహ నేరం కింద కేసు నమోదు చేసి భీమవరం కోర్టులో హాజరుపరచగా జూన్‌ 27 ‌నుండి ఏడాది కఠిన కారాగారశిక్ష, రూ.400 జరిమానా విధించి, రాజమండ్రి, తిరుచునాపల్లి జైళ్లకు తరలించారు.

స్వాతంత్య్రోద్యమంలో పాల్గొనటం వలన ప్రభుత్వ ఆగ్రహానికి గురికాగా, హరిజనోద్ధరణ కార్యక్రమాలు, సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేయడం, స్త్రీవిద్య ప్రోత్సాహం, వితంతు పునర్వివాహాల నిర్వహణ, ఖద్దరు వినియోగించని వారి ఇళ్లకు, వివాహాలలో భోగం మేళాలు ఏర్పరచినవాళ్ల ఇళ్లకు వెళ్లరాదని కృష్ణమూర్తి దంప తులు ప్రతిన చేయటంతో తోటి సామాజికులకు, బంధుమిత్రులకు దూరమయ్యారు. అయినా కృష్ణ మూర్తి దేశభక్తి మార్గాన్ని వీడక మరింత ముందుకు నడిచారు.

 సీతానగరం గౌతమీ సత్యాగ్రహ ఆశ్రమంలో బ్రహ్మాజోస్యుల సుబ్రహ్మణ్యం వద్ద కొన్ని నెలలు వైద్యవిద్యలో తర్ఫీదు పొంది స్వగ్రామం చేరి స్వగృహంలో ఆసుపత్రి ఏర్పరచి, డాక్టరును నియమించి, తాను కాంపౌం డరుగా, భార్య నర్సుగా సేవలు అందించడం వారి సేవానిరతికి దర్పణంగా నిలుస్తుంది. 60 ఎకరాల పొలాన్ని సమాజహితానికి ఖర్చుచేసి, పేద ప్రజానీకం కోసం తాడేపల్లిగూడెంలో సంక్షేమ హాస్టలు ఏర్పరచి, కాశీ అన్నపూర్ణ కావిడితో భిక్షాటనం చేసి వారిని పోషించిన దయార్ద్ర హృదయుడు కృష్ణమూర్తి. ఆయన వ్యక్తిత్వాన్ని, సామాజిక సేవను, దేశభక్తిని స్మరించుకుంటూ తాడేపల్లిగూడెం పురపాలక సంఘం ‘పసల కృష్ణమూర్తి మెమోరియల్‌’ ‌ప్రాథమికోన్నత పాఠశా లను స్థాపించింది. ఈ అసాధారణ త్యాగమయుడు 79వ ఏట సెప్టెంబరు 20, 1978లో కీర్తికాయులయ్యారు.

ఆదర్శ సతి అంజలక్ష్మి

 ఆగర్భ శ్రీమంతుల ఇంట పుట్టి, అపర కుబేరుని ఇంట మెట్టి… భర్తతోపాటు గాంధేయ సిద్ధాంతాలతో జీవితాన్ని మలచుకుని, సమాజసేవకై ఆస్తినంతా ఆనందంగా సమర్పించిన త్యాగమయి పసల అంజలక్ష్మి. రెండవ తరగతి వరకు మాత్రమే చదివినా స్వరాజ్య ఉద్యమంలో విశేష పాత్ర పోషించారు. గాంధీజీ స్ఫూర్తితో సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొనడంతోపాటు జీవితాంతం స్వయంగా నేసిన ఖద్దరు వస్త్రాలనే ధరించారు. సహాయనిరాకరణ ఉద్యమంలో మద్యం షాపులవద్ద, విదేశీ వస్త్ర దుకాణాలవద్ద పికెటింగ్‌ ‌చేశారు. ఖద్దరు వస్త్రాల మూటలను నెత్తిన పెట్టుకుని గ్రామాలలో వీధుల వెంట తిరుగుతూ విక్రయించేవారు. ఇంటింటా రాట్నం తిరగాలని, ఖద్దరు ఉత్పత్తి చేయటం వలననే దేశ దారిద్య్రం పోతుందని ముమ్మర ప్రచారం చేపట్టారు.

1930 ఉప్పు సత్యాగ్రహంలో భీమవరంలో విదేశీ వస్త్ర దుకాణాల వద్ద పికెటింగు చేస్తున్న అంజలక్ష్మిని పోలీసులు అరెస్టు చేశారు. జనవరి 20, 1931 నుండి ఆరు నెలలు కఠిన కారాగార శిక్ష విధించి మదరాసు, వెల్లూరు జైళ్లకు తరలించారు. గాంధీ ఇర్విన్‌ ఒప్పందం వలన శిక్షాకాలం ముగియ కుండానే మార్చి 7, 1931న విడుదలయ్యారు.

1932 జనవరిలో శాసనోల్లంఘనోద్యమం తిరిగి ప్రారంభమైంది. భారత జాతీయ కాంగ్రెస్‌ను అన్ని స్థాయుల్లో నిషేధిస్తూ సభలు, సమావేశాలు జరుపరాదని, కరపత్రాలు పంచరాదని బ్రిటిషు ప్రభుత్వం ప్రకటించింది. జూన్‌ 27‌న ప్రభుత్వ శాసనాలను ధిక్కరిస్తూ భీమవరంలో జిల్లా కాంగ్రెస్‌ ‌సమావేశాన్ని భీమవరంలో పసల కృష్ణమూర్తి అధ్యక్షతన జరపాలని తీర్మానించారు. అయితే వారి ప్రయత్నాలను అడ్డుకునే క్రమంలో భీమవరం చేరే మార్గాల్లో మూడు రోజుల ముందు నుంచే పోలీసులను మోహరించింది. అంజలక్ష్మి, కృష్ణమూర్తి, కాళీపట్నం కొండయ్య, గారపాటి సత్యనారాయణ, ఉద్దరాజు మాణిక్యాంబ తదితరులు చేల గట్ల వెంట పయనించి సమావేశానికి హాజరైనారు. సమావేశం అనంతరం భర్త కృష్ణమూర్తితో కలిసి తాలూకా ఆఫీసు భవనం పైకెక్కి కాంగ్రెస్‌ ‌త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి ‘వందేమాతరం’, ‘గాంధీజీకి జై’ అంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినదించారు. ఆరునెలలు గర్భిణిగా ఉన్న అంజలక్ష్మి ఈ సాహసోపేత కార్యక్రమంలో పాల్గొనటం జిల్లా కాంగ్రెస్‌ ‌కార్యకర్తల్ని సంభ్రమాశ్చర్యంలో ముంచివేసింది. ఆంగ్ల పతాకాన్ని తొలగించి త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేసిన ఘనత ఆంధ్రదేశంలో పప్రథమంగా అంజలక్ష్మి దంపతులకే దక్కింది. ఇంతలో పోలీసులు లాఠీచార్జి జరిపి, అందరినీ అరెస్టు చేసి భీమవరం స్పెషల్‌ ‌మేజిస్ట్రేట్‌ ‌కోర్టులో హాజరుపరిచారు. జూన్‌ 27, 1932 ‌నుండి అంజలక్ష్మికి పది నెలలు కారాగార శిక్ష విధించారు. ఐదేళ్ల కుమారుడు ఆదినారాయణతో పాటు, ఆరు నెలలు గర్భిణిగా ఉన్న అంజలక్ష్మి వెల్లూరు, కన్ననూరు కారాగారాల్లో శిక్ష అనుభవించారు. అక్టోబరు 29, 1932న వెల్లూరు జైలులో అంజలక్ష్మి ఆడశిశువును ప్రసవించారు.

కృష్ణునిలా కారాగారంలో జన్మించటం వలన ‘కృష్ణ’ అని, భరతమాత దాస్య విముక్తి పోరాటంలో జన్మించటంవలన ‘భారతి’ అని కలిసేలా ‘కృష్ణభారతి’ పేరుపెట్టిన చేసిన దేశభక్తురాలు అంజలక్ష్మి. అంజలక్ష్మి త్యాగనిరతికి, ధైర్యసాహసా లకు గాంధీజీ, పట్టాభి, ప్రకాశం, దండు నారాయణరాజు, ఆత్మకూరి గోవిందా చార్యులు వంటి నాయకులు ప్రశంసల జల్లు కురిపించారు. ఆంధ్రదేశంలోని స్త్రీలోకం అంజలక్ష్మికి నీరాజనాలు పట్టింది.

స్వరాజ్యం లభించినపుడు గాంధీజీ కలలు నెరవేరుతాయని పేదల స్థితిగతులు మారుతాయని ఆశించిన అంజలక్ష్మిని స్వతంత్ర భారత రాజకీయ రంగంలో చోటుచేసుకున్న ఆశ్రిత పక్షపాతం, అవినీతి, స్వార్ధచింతన కలత పెట్టాయి. దాంతో రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు. స్వాతంత్య్రోద్యమ కాలంలో వెనుక వరుసలో ఉన్న శక్తులు ముందుకు తోసుకువచ్చి ఇదంతా తమ త్యాగఫలమే అని ప్రగల్భాలకు పోతుండటంతో విస్మయంతో ఉండిపోయారు.

 అంజలక్ష్మి సేవలను ప్రస్తుతిస్తూ భారత ప్రభుత్వం స్వాతంత్య్ర రజతోత్సవాలను పురస్కరించుకుని (ఆగష్టు 15, 1972) తామ్రపత్రంతో సత్కరించింది. అక్టోబరు 2, 1995న మహాత్ముని 125వ జయంతి సందర్భంగా హైదరాబాదులోని ఆంధ్రమహిళా సభ ప్రత్యేకంగా ఆహ్వానించి ఘనంగా సత్కరించింది. 1998లో న్యూఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ -మహిళా దినోత్సవంలో ఆమెను ‘త్యాగమయి’గా కీర్తించారు. జీవితాంతం ఖద్దరునే ధరిస్తూ, గాంధీజీనే స్మరిస్తూ సమాజసేవకై పరితపిస్తూ మనుగడ సాగించిన అంజిలక్ష్మి డిసెంబరు 3, 1998న తన 94వ ఏట దైవసాన్నిధ్యం చేరారు.

(పసల దంపతుల కుమార్తె కృష్ణభారతిని జూలై 4న ప్రధాని నరేంద్రమోదీ భీమవరంలో సత్కరించిన సంగతి పాఠకులకు తెలిసిందే. వ్యాసకర్త పసల కృష్ణమూర్తి మనవరాలు)

About Author

By editor

Twitter
YOUTUBE