– డాక్టర్ అరవింద్ సి రనడే, సైంటిస్ట్ ‘ఖీ’, విజ్ఞాన్ ప్రసార్, నొయిడా –
ఆంగ్లేయులు క్రీస్తుశకం 1608 సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో వ్యాపారులుగా భారత్‌కు వచ్చిన సంగతి జగద్వితం. వ్యాపార సంబంధాలు ముసుగులో వేళ్ల మీద లెక్కించగలిగేంత మంది ఆంగ్లేయులు తమను తాము సుస్థిరపరుచు కున్నారు. నీతిబాహ్యమైన పద్ధతులు, విధానాలతో భారత్‌లో పలు ప్రాంతాలను ఆక్రమించుకోవడం ప్రారంభించారు. 1757లో బెంగాల్ నవాబ్‌ను ఓడించిన తర్వాత ఈ కంపెనీ భరత భూమికి పాలకు రాలిగా తనంతటతానుగా ప్రతిష్టించుకోవడం మొదలుపెట్టింది. తన ఇష్టానుసారంగా వ్యవహ రించింది. ఫలితంగా అనిశ్చితి చోటు చేసుకుంది. అది 1857లో సిపాయిల కలహానికి దారి తీసింది. ఈ అనిశ్చితిని పరిష్కరించేందుకు కడకు బ్రిటిష్ ప్రభుత్వం జోక్యం చేసుకుంది. అప్పటి నుంచి భారత్‌లో రాణి రాజ్యం ఆరంభమైంది. అలా వచ్చిన బ్రిటిషర్లు వారి స్వప్రయోజనాలకు పెద్దపీట వేశారు. భారతీయుల్లో నిర్దేశిత వర్గాలకు చెందినవారిని మంచి చేసుకోవడం ప్రారంభించారు. తమ స్వప్రయోజ నాలను మరింత సాకారం చేసుకునేందుకు వేర్వేరు నిబంధనలు, చట్టాల ద్వారా ప్రభుత్వ కార్యాలయాలు, పాలనాపరమైన వ్యవహారాలు, పోలీసు విభాగాలు, తదితరాల్లో దిగువ స్థాయిల్లో అలా మంచి చేసుకున్న వారికి ఉద్యోగాలు ఇవ్వసాగారు.
అయితే ఈ ధోరణి ఎంతో కాలం సాగలేదు. పని చేసే పద్ధతులు, విధానాల్లో వారి చర్యలు వారి నిజ స్వరూపాన్ని బైటపెట్టాయి. వాణిజ్యం, విద్య, వ్యాపారం, సైన్సు రంగాల్లో వారి ఆధిపత్య, వివక్షాపూరితమైన వైఖరి, ఇతరుల పట్ల అవమానకర మైన తీరు అత్యధికంగా ఉండేది. బ్రిటిష్ అణచివేత ఉన్నప్పటికీ దేశంలో సైన్సును విస్తరింప చేయడంలో భారతీయ శాస్త్రవేత్తలు సాగించిన యత్నాలకు సంబంధించి అంతగా వెలుగులోకి రాని వృత్తాంతాల గురించి ఈ కథనం చర్చిస్తున్నది.
భారతీయులు చవగ్గా లభించే పనివారు
ఆంగ్లేయులు తీసుకువచ్చిన మ్యాపింగ్ పరికరాలు, దిక్సూచి, ఫైర్-గ్లాస్, బైనాక్యులర్లు, మారణయుధాలు లాంటి సైన్సు ప్రాతిపదికగా రూపుదిద్దుకున్న పరికరాలు భారతీయులను తొలుత ఆకట్టుకున్నాయి. కానీ అదే పరికరాలతో భారతదేశపు సహజ వనరులను వెలికితీసి వాటిని దోచుకు పోవాలనే వారి దుర్బుద్ధి గురించి కొందరు వ్యక్తులకు క్రమక్రమంగా అవగతమైంది. సర్వే ప్రాతిపదికగా వనరుల శాస్త్రీయ వెలికితీతకు బ్రిటిషర్లు పూనుకున్నారు. మన వనరులను వెలికి తీయడానికి అధునాతన ఉపకరణాలను వినియోగించారు. అయితే దారుణమైన ఆ లక్ష్యాలను చేరుకోవడానికి వారికి చవగ్గా దొరికే పనివారి అవసరం ఎంతైనా ఉంది. ఆ క్రమంలో నిశితమైన దృష్టి, సంబంధిత ప్రాంతం తాలూకు భౌగోళిక స్వరూప స్వభావాలపైన, సంబంధిత సైన్సు రంగం పట్ల సంపూర్ణ పరిజ్ఞానం సంతరించుకున్న స్థానికులను బ్రిటిష్ వారు నియమించుకున్నారు. అయితే, అలా నియమితులైన స్థానికులకు ఆంగ్లేయులు ద్వితీయ శ్రేణి పౌరుల హోదాను ఇచ్చారు.
మరింత నైపుణ్యంతో కూడిన సుశిక్షితులైన పనివారలను సిద్ధం చేయడం కోసం కలకత్తా (ఇప్పటి కోల్‌కతా), మద్రాసు (చెన్నయ్), బాంబే (ముంబై)లో కొత్తగా విద్యా సంస్థలు ఆరంభమయ్యాయి. ఈ విద్యా సంస్థల నుంచి వెలుపలకు వచ్చిన యువ శాస్త్రవేత్తలు తమ వాణిని ఒక్కనాటికి వినిపించలేమని, తమను ఎదగనివ్వకుండా బ్రిటిషర్లు నిత్యం తమను అడ్డు కుంటారని అనతికాలంలోనే అవగతం చేసుకున్నారు. దీనికి తోడు, భారతీయులు శాస్త్రీయంగా ఆలోచించ లేరు, వారికి తర్కబద్ధమైన ఆలోచన ఉండదు, వర్తమానంలో నెలకొన్న రంగాల్లో వాస్తవికమైన పరిశోధన చేయలేరు అనే మిడిమిడి జ్ఞానపు సంకెళ్లను ఛేదించాలని సైతం యువ శాస్త్రవేత్తలు ఆకాంక్షించారు. వలసపాలకుల ఆలోచనా ధోరణిపై వారు తిరగబడ్డారు. దాతల మద్దతుతో, పరిమితమైన వనరులతో అత్యంత ప్రతిష్టాకరమైన ప్రయోగాలకి నాంది పలికారు.
భారతీయ శాస్త్ర పరిశోధక సంస్థల ఆవిర్భావం
కోల్‌కతాలో ఒకప్పుడు పేరొందిన నీలినేత్రాల అల్లోపతి వైద్యుడు డాక్టర్ మహేంద్రలాల్ సర్కార్ బ్రిటిషర్లకు విరోధిగా ఎలా అవతరించారనేది పేర్కొనదగిన ఘటనల్లో ఒకటిగా నిలిచిపోయింది. ఈ వృత్తాంతం 1863 నాటిది. అదే సమయంలో ఆయన కలకత్తా మెడికల్ కాలేజీ నుంచి MD ప్రొఫెషనల్ డిగ్రీని అందుకున్నారు. అనతికాలంలోనే అత్యంత విజయవంతమైన మెడికల్ ప్రాక్టిషనర్‌గా పేరు తెచ్చుకున్నారు. బ్రిటిష్ మెడికల్ అసోసియేషన్ బెంగాల్ శాఖకు కార్యదర్శిగా ఎంపికయ్యారు. అల్లోపతి ద్వారా కొన్ని నిర్దేశిత వైద్య చికిత్సలు విజయం కావని 1867 నాటికి ఆయన అవగతం చేసుకున్నారు. అంతే కాకుండా, పాశ్చాత్య ఔషధాలతో అల్లోపతి వైద్య చికిత్సలు సగటు భారతీయుడికి అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారింది. ఆ క్రమంలో, ప్రత్యామ్నాయాల కోసం అన్వేషిస్తుండగా, కోల్‌కతాలో పేరొందిన హోమియో పతి ప్రాక్టిషనర్ డాక్టర్ రాజేంద్రలాల్ దత్ డాక్టర్ మహేంద్రలాల్ సర్కార్‌కు తారసపడ్డారు. ఆయన తన వృత్తిలో అత్యంత కచ్చితత్వాన్ని పాటించేవారు. వైద్య చికిత్స విధి విధానాల అధ్యయనంలో భాగంగా అన్ని రకాల శాస్త్రీయ సూత్రాలను ఆయన వినియోగించేవారు. నిర్దేశిత వ్యాధిగ్రస్తులకు చికిత్సను అందించడంలో హోమియోపతిని వినియోగించడం ఆరంభించారు. ఇది బ్రిటిష్‌వారికి మింగుడుపడలేదు. వారికి సంబంధించినంత వరకు హోమియోపతికి మద్దతు ఇవ్వడమంటే అది ఆవిర్భవించిన జర్మనీకి మద్దతు ఇవ్వడంతో సమానం. అలా చేయడం వారి విశ్వాసాలకు ఆమోదయోగ్యం కాదు. ఆ క్రమంలో, డాక్టర్ మహేంద్రలాల్ సర్కార్ ఆంగ్లేయులకు శత్రువుగా మారిపోయారు. ఆయనపై వారు ప్రతీకారం తీర్చుకోవడం ప్రారంభించారు. బ్రిటిష్ మెడికల్ అసోసియేషన్ కార్యదర్శి పదవి నుంచి వెంటనే తొలగించారు. ఆయన పరిశోధనా పత్రాలను అనేక జర్నల్స్‌లో ప్రచురణకు తిరస్కరించ సాగారు. అనేక మార్గాల్లో ఆయన ప్రాక్టీస్‌ను నిలువరించారు.
అటువంటి కఠోరమైన, చట్ట విరుద్ధమైన, వివక్షాపూరిత చర్యలు భారతీయులపై పెను ప్రభావాన్ని చూపాయి. భారతీయ పరిశోధకులు ఆ క్రమంలో ఉత్సాహవంతులైనవారిలో సైన్సు తాలూకు నిజమైన స్ఫూర్తిని పాదుగొల్పడంతో, సైన్సును సమర్థించే మనదైన ఒక వ్యవస్థ ఉండాలనే ఆలోచన పురుడు పోసుకుంది. భారతీయ దాతలు, జాతీయవాదులు, ఇతర మద్దతుదారుల సహాయంతో జనవరి 15, 1876న కోల్‌కతాలో ఇండియన్ అసోసియేషన్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ సైన్స్ (IACS)ను 61 వేల రూపాయల ప్రాథమిక నిధుల సేకరణతో డాక్టర్ సర్కార్ నెలకొల్పారు. సైన్సులో జాతీయ అంశాలు, వలస ప్రభుత్వం నుంచి స్వయంప్రతి పత్తితో కూడిన దృక్పథం ఈ పరిశోధక సంస్థకు ప్రత్యేకతగా నిలిచింది.
1875లో అసోసియేషన్‌ను ప్రజల్లోకి తీసుకువెళుతున్న సందర్భంగా డాక్టర్ సర్కార్ మాట్లాడుతూ ‘వాస్తవిక పరిశోధన తాలూకు ఆధునికత దృష్ట్యా సైన్సును దాని తాలూకు అన్ని విభాగాల్లోకి చేరవేసేలా భారతీయులను తీర్చిదిద్దడమే అసోసియేషన్ ముఖ్యోద్దేశం, అంతేకాకుండా సైన్సు తాలూకు వేర్వేరు ప్రయోజనాలను కళలకు, జీవన సౌభాగ్యాలకు వర్తింపజేసే దృక్పథాన్ని అసోసియేషన్ కలిగి ఉంది’ అని అన్నారు.
ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఆస్ట్రానమీ, సిస్టమేటిక్ బోటనీ, సిస్టమేటిక్ జువాలజీ, ఫిజియాలజీ, జియాలజీ అనే ఏడు అగశ్రేణి పాఠ్యాంశాలతో తన కార్యకలాపాలకు IACS అంకురార్పణ చేసింది. డాక్టర్ మహేంద్రలాల్ సర్కార్, ప్రొఫెసర్ లఫోంత్, తారా ప్రసన్న రాయ్, నీల్‌రతన్ సర్కార్, చునిలాల్ బోస్, జేసీ బోస్, అశుతోష్ ముఖర్జీ, పరమ్‌నాథ్ బోస్ వంటి భారతీయ శాస్త్రవేత్తలు, మేధావులు IACS వేదికగా ప్రసంగాలు చేశారు.
సైన్సును విస్తృతం చేయడంలో జాతీయ భావనను నిర్మాణం చేయడమనేది IACSAకు అత్యంత కీలకమైన తోడ్పాటుగా నిలిచిపోయింది. సర్ సి.వి. రామన్ తన ప్రయోగాలను IACSలో చేపట్టారు. ఆ క్రమంలో సైన్సు రంగంలో ఆసియా ఖండంలో మొట్టమొదటి నోబెల్ పురస్కారాన్ని రామన్ ఎఫెక్ట్‌కుగాను సర్ సి.వి. రామన్ 1930లో అందుకు న్నారు. అంతటి ఘనత IACSకు దక్కింది.
IACS ప్రభావం
IACS పాత్ర బెంగాల్‌కు మాత్రమే పరిమితమై నప్పటికీ వేర్వేరు సంస్థానాలలోను పరిశోధక సంస్థల ఆవిర్భావానికి అది దోహదం చేసింది. IACS సభ్యుల్లో ఒకరు, నిబద్ధత కలిగిన భూగర్భ శాస్త్రవేత్త పరమ్‌నాథ్ బోస్ ఇండియన్ ఇండస్ట్రియల్ అసోసియేషన్‌ను 1891లో నెలకొల్పారు. దేశీయ ముడి పదార్థాలతో అసోసియేషన్ సభ్యులు ప్రయోగాలు చేశారు. అనంతర కాలంలో, ఇదే పరమ్‌నాథ్ బోస్ ఛోటా నాగపూర్ పీఠభూమిలో ఇనుప ఖనిజం నిల్వల గురించి సర్ జమ్‌షెడ్‌జీ నుస్సెర్‌వన్‌జీ టాటాకు అవగాహన కలిగించారు. తద్వారా జమ్‌షెడ్‌పూర్‌లో టాటా స్టీల్ కర్మాగారం ఏర్పాటైంది.
1904లో అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్‌మెంట్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ ఎడ్యుకేషన్‌ను (IACS) జోగేంద్రనాథ్ ఘోష్ నెలకొల్పారు. స్వదేశీ ఉద్యమ సమయంలో భారతీయ విద్యార్థులను విదేశాలకు పంపించడంలో ఈ అసోసియేషన్ ముఖ్య పాత్ర పోషించింది.
బెంగాల్ టెక్నికల్ ఇనిస్టిట్యూట్, బెంగాల్ నేషనల్ కాలేజీ ద్వారా 1906లో ఏర్పాటైన నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫలితంగా ప్రస్తుత జాదవ్‌పూర్ యూనివర్శిటీ, రాజాబజార్ సైన్స్ కాలేజీ ఆవిర్భ వించడం గమనార్హం. ఈ పరిశోధక విద్యా సంస్థలన్నీ కూడా బ్రిటిష్ ప్రభుత్వ ఆర్థిక మద్దతు తీసుకున్నవి కావు. తారక్‌నాథ్ పాలిత్ లాంటి భారతీయ దాతలు, రాజకీయ నేత, సామాజిక కార్యకర్త సర్ రాస్‌బిహారీ ఘోష్ నుంచి అందుకున్న విరాళాలతో అవి మనుగడ సాగించాయి. వలస పాలకులు వివక్షాపూరితంగా వ్యవహరిస్తున్నప్పటికీ కోల్‌కతాలో అత్యంత అధునాతమైన శాస్త్ర పరిశోధనలను ఈ సంస్థలు చేపట్టాయి.
అలాంటి ప్రయత్నాల్లో భాగంగానే మ్యాథ మేటిక్స్‌లో భారతీయ విద్యార్థులకు అవకాశాల కల్పన, తోడ్పాటు దిశగా వ సంవత్సరం సెప్టెంబర్ 6, 1908న కలకత్తా మ్యాథమేటికల్ సొసైటీ ఆవిర్భవించింది. అప్పటి కలకత్తా యూనివర్శిటీ వైస్ ఛాన్సెలర్, సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు సర్ అశుతోష్ ముఖర్జీ నేతృత్వంలో సర్ గురుదాస్ బెనర్జీ, ప్రొఫెసర్ సి.యు. కల్లిస్, ప్రొఫెసర్ గౌరీశంకర్ డే ఉపాధ్యక్షులుగా, ప్రొఫెసర్ ఫణీంద్ర లాల్ గంగూలీ వ్యవస్థాపక కార్యదర్శిగా సొసైటీ భారతీయ శాస్త్ర రంగం మీద తనదైన ముద్రను వేసింది.
ఈ ఉత్తేజకర చారిత్రక ఘటనల మధ్య సర్ జగదీశ్ చంద్రబోస్ వృత్తాంతం కీలకమైనది. బోస్ ఒక అసాధారణమైన భౌతిక శాస్త్రవేత్త, వృక్ష శాస్త్రవేత్త, జీవ శాస్త్రవేత్తగా మాత్రమే కాకుండా తంత్రీ రహితంగా విద్యుదయస్కాంత కిరణ ప్రసారాన్ని ప్రదర్శించడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ శాస్త్రవేత్తల సమూహాన్ని ఆకట్టుకున్నారు. అయి నప్పటికీ ఆయన సైతం బ్రిటిష్ వారి నుంచి దారుణ మైన జాతి వివక్షను చవిచూశారు. ఆయన తాత్కాలిక విద్యా సర్వీసులో నియమితులైనారు. ఐరోపా సంతతికి చెందిన ప్రొఫెసర్లు పొందే వేతనంలో మూడవ వంతును ఆయన అందుకునేవారు. వాస్తవానికి, క్రేంబ్రిడ్జ్ యూనివర్శిటీలో ఆయనకు వేతనంతో కూడిన సెలవును మంజూరు చేయడానికి సంబంధిత అధికారులు నిరాకరించారు. దాంతో విధిలేని పరిస్థితుల్లో అక్కడ విద్యాసముపార్జన పూర్తి చేసుకోవడం కోసం ఆయన స్వంత ఏర్పాట్లు చేసుకోవాల్సి వచ్చింది.
భారతీయ తాత్త్విక భావాలను ప్రతిబింబించే వసుధైవ కుటుంబకమ్ స్ఫూర్తిగా బోస్ తన జీవనయానం సాగించారు. అందులో భాగంగా మానవతా దృక్పథంతో తన పరిశోధనను పేటెంట్ చేసుకోలేదు. అత్యంత ప్రతిభాపాటవాలను సంత రించుకున్న శాస్త్రవేత్తగా తనదైన వినూత్నమైన సాంకేతికతలు, పరికరాలతో ఆయన చేసిన ప్రయోగాలు మొక్కలలో జీవం, సున్నితత్వం ఉన్నాయన్న మహోన్నత సత్యాన్ని ఆవిష్కరించాయి. ప్రెసిడెన్సీ కాలేజీలో పదవీ విరమణ చేసిన అనంతరం తాను పొదుపు చేసిన మొత్తంతో 1917లో బోస్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్‌ను నెల కొల్పారు. సైన్సు, జాతి ప్రతిష్ట కోసం ప్రయోగాల సంప్రదాయం కొనసాగడం పట్ల ఆయన సంపూర్ణ మైన నిబద్ధతను ప్రదర్శించారు. ఇనిస్టిట్యూట్ ఆరంభ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ ‘‘నేను ఈ ఇనిస్టిట్యూట్‌ను కేవలం ఒక ప్రయోగశాలగా కాకుండా ఒక ప్రార్థనా మందిరంగా భావిస్తూ అంకితం చేస్తున్నాను’’ అని అన్నారు. అనంతర కాలంలో అదే ఇనిస్టిట్యూట్ బోస్ విజ్ఞాన్ మందిర్‌గా నామాంతరం చెందింది.
పుణేలో అనేక విద్యాసంస్థలను స్థాపించడంలో ప్రొఫెసర్ శంకర్ పురుషోత్తం అగార్కర్ పేరెన్నికగన్న వారు. ఆయన ఒక భారతీయ స్వరూప శాస్త్రవేత్త (morphologist). పశ్చిమ కనుమల్లో జీవ వైవిధ్య పరిశోధనలో నిపుణులు. అక్కడే సర్వసాధారణంగా ఆఫ్రికాలో కనిపించే ఫ్రెష్ వాటర్ జెల్లీ ఫిష్‌ను ప్రొఫెసర్ అగార్కర్ కనుగొన్నారు. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్‌కు కార్యదర్శిగా కూడా ఆయన వ్యవహరించారు. సర్కార్ స్థాపించిన IACS స్ఫూర్తితో పుణేకు చెందిన అనేకమంది భావసారూప్యత కలిగిన విద్యావేత్తలు, శాస్త్రవేత్తలను ఒకచోటుకు తీసుకు వచ్చారు. 1946లో పుణేలో మహారాష్ట్ర అసోసి యేషన్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ సైన్స్‌ను నెలకొల్పారు. ఆరంభంలో ఇనిస్టిట్యూట్‌ను నడపడానికి నిధులు ఉండేవి కావు. ఆ కారణంగా అనేక మంది శాస్త్రవేత్తలు ఎలాంటి వేతనం తీసుకోకుండా స్వచ్ఛందంగా పనిచేశారు. ఇనిస్టిట్యూట్‌ను ఏర్పాటు చేయడం కోసం అగర్కర్ ఆఖరికి తన సహధర్మచారిణి స్వర్ణాభరణాలను సైతం విక్రయించారు. ఆ రోజుల్లో వ్యక్తుల అంకిత భావం, అభిరుచి అంత ఉన్నతంగా ఉండేవి. అనంతరం 1992లో ఆయన జ్ఞాపక చిహ్నంగా ఆ ఇనిస్టిట్యూట్‌కు అగార్కర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ అని నామకరణం చేశారు.
బ్రిటిష్ పాలన నుంచి దేశాన్ని విముక్తం చేయడానికి గొప్ప ఉద్యమం జరిగింది. కానీ అందులో సాంకేతిక, శాస్త్ర పరిజ్ఞానాల అవసరం కోణం నుంచి జాతిని జాగృతపరచడమనే ప్రయత్నం వెనుకపడిందనేది సుస్పష్టం. అన్ని స్థాయుల్లోనూ వలస పాలకుల నుంచి భారత్‌కు స్వేచ్ఛను కల్పించడంలో ఏకమైన మన దాతలు, వ్యాపార వేత్తలు, రాజకీయ నేతలు అందించిన మద్దతుతో భారతీయ శాస్త్రవేత్తల సమూహం మాత్రం శక్తియుక్తు లను ప్రదర్శించింది. వలస ప్రభుత్వం మద్దతు లేకుండా, సదరు ప్రభుత్వంతో శత్రుత్వం తెచ్చుకో కుండా చిరకాలం నిలిచిపోయే దేశీయమైన శాస్త్రీయ విద్యా పరిశోధక సంస్థలను సృష్టించడం ఒక సాహసోపేతమైన కృషి.
ఇందుకు ఈ కింద ఉదహరించిన ఘట్టమే నిదర్శనంగా నిలిచిపోతుంది. 1893లో జపాన్ నుంచి షికాగోకు సముద్రయానం చేస్తుండగా, భారత్‌లో ఒక దేశీయమైన పరిజ్ఞానంతొ నడిచే సైన్స్ ఇనిస్టిట్యూట్‌ను నెలకొల్పాల్సిందిగా సర్ జంషెడ్‌జీ నుస్సర్వాన్‌జీ టాటాకు స్వామి వివేకానంద సలహా ఇచ్చారు.సైన్సు తాలూకు సహజసిద్ధమైన వృద్ధి విషయానికి వచ్చేసరికి ఆలోచనలు, సాంకేతికతలను ఇతరులతో పంచుకోవడానికి సుతరామూ మనస్క రించని బ్రిటిషర్లకు మాత్రమే పరిమితమైన స్వాభావిక లక్షణాలను ఇది తెలియపరుస్తున్నది. స్వామి వివేకానంద చేసిన సూచన 1908లో సాకారమైంది. జంషెడ్‌జీ టాటా తీసుకున్న చొరవతో, మైసూరు మహారాజా తన హృదయపూర్వక మద్దతుతో బెంగళూరులో దానం చేసిన 350 ఎకరాల భూమిలో అదే సంవత్సరం ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఏర్పాటైంది.
చివరగా, కేవలం భారత్‌ను లూటీ చేయడానికి, తద్వారా వారి ఆదాయాన్ని పెంచుకోవడానికి చవగ్గా పనివారలను సృష్టించడమే ఏకైక లక్ష్యంగా బ్రిటిష్ వారు భారత్‌లో సంస్థలను ఆరంభించారని మనం భావించాలి. కనుక, స్వదేశంలో భారతీయులు నెలకొల్పిన సంస్థల్లో అనేకం దేశ ప్రజల్లో స్వదేశీ స్పూర్తిని ఇనుమడించడంలో జాతీయతా భావనకు చేరువగా తీసుకురావడంలో నిరుపమానమైన సేవను అందించాయి.
అను: మహేష్ ధూళిపాళ్ల