ఆగస్ట్ 11 హయగ్రీవ జయంతి
సృష్టిస్థితి కారకుడు శ్రీమన్నారాయణుడి విశిష్టావతారాలలో ఒకరు హయగ్రీవుడు. మత్స్యకూర్మాది దశావతారాల కంటే ముందే, అంటే సృష్టికి పూర్వమే ఆవిర్భవించాడు. ఆయన ఎత్తిన ఇరవై ఒక్క అవతారా లలో మొదటిది. ఇది ‘జ్ఞానా వతారం’. అన్నిటికి జ్ఞానమే మూలాధారం. నారాయణ మూర్తికి గల అనేక కల్యాణ గుణాలలో జ్ఞానం మొదటిది. విశుద్ధ విజ్ఞాన ఘనస్వరూపుడు. జ్ఞానానందమయుడు. వేదం ద్వారా సర్వలోకాలకు జ్ఞానాన్ని అనుగ్రహించాడు. మొదటగా బ్రహ్మకు వేదం చెప్పాడు. బ్రహ్మ వద్ద నుంచి వేదాలను అపహరించుకుపోయిన హయగ్రీవుడనే దానవుడిని, మధుకైటభులు అనే రాక్షసుల సంహారం కోసం విష్ణువు శ్రావణ పూర్ణిమ నాడు యజ్ఞగుండం నుంచి హయగ్రీవుడిగా ఆవిర్భవించారు. ‘హయ’ అంటే విజ్ఞానం. ‘గ్రీవం’ అంటే కంఠం. సమస్త విద్యలు కంఠగతములై ఉన్న సర్వవిద్యా స్వరూపమే హయగ్రీవమూర్తి. గుర్రం సకిలించే ధ్వనిని ‘హేష’ అంటారు. ఆ ధ్వనిని బీజాక్షరాలకు ప్రతీకగా చెబుతారు.
పరాశక్తి గురించి తపస్సు చేసిన హయ గ్రీవాసురుడు మరణం లేకుండా వరం కోరాడు. ‘పుట్టుట గిట్టుట కొరకే…’ అన్నట్లు మృత్యువు అనివార్యమైనప్పుడు అమరత్వం ఎలా సాధ్యమని ప్రశ్నించిన జగన్మాతతో ‘అయితే తనలాంటి రూపం కలవారి చేతిలోనే మరణం అనుగ్రహించాల’ని కోరాడని పురాణ గాథ. నాటి నుంచి అశ్వముఖ దానవుడి ఆగడాలకు అంతులేకుండా పోతుండడంతో బ్రహ్మాది దేవతలు, మునుల విన్నపాలలో శ్రీమహా విష్ణువు శ్రావణ పూర్ణిమ నాడు హయవదనుడిగా ఉద్భవించి దానవ సంహారం చేసి, బ్రహ్మకు వేదాలను అందించాడు. విధాత తిరిగి సృష్టి కార్మోన్ముఖు డయ్యాడు. సృష్టి యజ్ఞంలో విరాడ్రూపు నుంచి అశ్వం మొదట ఉద్భవించింది. ‘తస్మాదశ్వా అజాయంత’ అని వేదం (పురుష సూక్తం) పేర్కొంటోంది. ‘హయం’ అంటే శీఘ్రంగా వెళ్లేది అని అర్థం.
గుర్రపు తల గలిగిన ఈ స్వామి నాలుగు భుజాలలో శంఖం, చక్రం, పుస్తకం, చిన్ముద్రలను ధరించి ఉంటాడు. ఆయన సేవకోసం బ్రహ్మ తొలుత సరస్వతిని నియమించగా, ఆమె హయగ్రీవునికి విగ్రహ రూపం కల్పించుకొని అర్చించారని పురాణ గాథ. శ్రీవాణి కాశ్మీరంలో భగవద్రామానుజులకు సాక్షాత్కరించి శ్రీలక్ష్మీ హయగ్రీవమూర్తిని ప్రసాదిం చగా, వారి నుంచి వారి శిష్యులు పిళ్లైయాచార్యులు, వారి నుంచి వేదాంతదేశికుల వారికి గురుశిష్య క్రమంలో సంక్రమించింది. మైసూరులోని శ్రీ బ్రహ్మ తంత్ర స్వతంత్ర పరకాల మఠంలో ఆ మూర్తి అర్చనలు అందుకుంటోంది. దేవభూలోకాలలో జ్ఞానమూర్తిగా, జ్ఞానప్రదాతగా గురుస్థానీయుడు, ఆరాధ్యనీయుడయ్యాడు.
ఆయనను ఉపాసించేవారికి భౌతిక విద్యలతో పాటు పురుషుడు పురుషోత్తముడు కావడానికి అవసరమైన ఆధ్యాత్మిక జ్ఞానం అబ్బు తుందని చెబుతారు.
‘జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం
ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవ ముపాస్మహే’
(జ్ఞాన నందమయుడు. నిర్మలమైన స్ఫటికం వంటి ఆకృతి కలవాడు. సర్వ విద్యలకు ఆధార భూతుడు) అని వేదాంత దేశికులు ఈ స్వామిని త్రిమూర్త్యాత్మకునిగా, అందుకు మూలమైన పరమాత్మగా నుతించారు.
అగస్త్యపత్ని లోపాముద్ర పరాశక్తి లలితాదేవిని అర్చించారు. కలియుగంలో మానవ ఉద్ధరణకు ఉపాయం చెప్పాలని అగస్త్యుడు విన్నవించగా, హయ గ్రీవుడు రుషి రూపంలో కాంచీపురంలో ఆయనకు శ్రీలలితా రహస్యనామాలను, శ్రీవిద్యను ఉపదేశించారు.
భాగ్యనగరిలో హయగ్రీవుడు
హైదరాబాద్ శివారు మేడిపల్లి వద్ద హయగ్రీవుడు లక్ష్మీ వేంకటేశ్వర సమేతంగా కొలువై ఉన్నాడు. మైసూరులోని పరకాల మఠం తరహాలోనే ఇక్కడి ఆలయంలోనూ హయగ్రీవ జయంతితో పాటు ప్రతి నెల స్వామివారి తిరునక్షత్రం (శ్రీనివాసుడి నక్షత్రమూ అదే) శ్రవణం నాడు అభిషేకం, హోమాదులు నిర్వహిస్తారు. ఇతర పండుగలను ఘనంగా జరుపుతారు.