అంతటి గంభీర, హృదయాలను కదిలించే భావోద్వేగ వాతావరణానికి ప్రధాన కారణం.. ద్రౌపది ముర్ము జీవిత చరిత్ర! పేదరికం, సామాజిక అణచి వేత, వైద్యసదుపాయాల లేమి, అంటరానితనం, నిస్సహాయత నిండిన దుర్భర జీవిత కథ అది! ‘నిజంగా ఇదెంతో గొప్ప కార్యం. సంథాలీ భాషలో రాసిన ఈ పుస్తకాన్ని బెంగాలీ లిపిలో కాకుండా ‘అల్ చికి’ లిపిలో రచించినట్లయితే బెంగాల్, ఒడిశా, జార్ఖండ్, బిహార్, అస్సాం రాష్ట్రాల్లోని 70 లక్షల మంది, బాబాసాహెబ్ అంబేడ్కర్ జీవిత చరిత్ర గురించి మాతృభాషలో తెలుసుకొని ఉండేవారు’… అక్కడ ఉన్నవారిని తప్పించుకొని బయటకు వస్తూ ద్రౌపది ముర్ము అన్న మాటలివి. ఈ మాటలు అక్కడ ఉన్న యువజనుల హృదయాల్లో గాఢంగా నాటుకు పోయాయి. డా।। బాబాసాహెబ్ అంబేడ్కర్ జీవిత చరిత్రను అల్ చికి లిపిలో రాయగల సరైన వ్యక్తికోసం కోల్‌కతాలో వేట మొదలైంది. నా స్నేహితుడు సురయ్‌మండి ఈ విషయంలో ఎంతో సహాయం చేశాడు. ఏదో విధంగా ఈ పని పూర్తి చేయాలన్న దృఢసంకల్పంతో ముందుకు సాగడంతో ఎట్టకేలకు రాజేంద్ర ముర్ముకు చెందిన ప్రింటింగ్ ప్రెస్‌లో ఈ పుస్తకం ప్రచురణ పూర్తయింది.
ఐదు నెలల తర్వాత పార్థాబిశ్వాస్, సుఖ్‌దేవ్ టుడు, శుభ్‌దీప్‌పాల్‌లు ఈ కొత్త పుస్తకాన్ని తీసుకొని రాంచికి వెళ్లారు. రాంచిలోని రాజ్‌భవన్‌కు వెళ్లిన తర్వాత కాని వీళ్లకు తెలియలేదు… గవర్నర్ ఆ రోజు కార్యక్రమాలన్నీ ముందుగానే నిర్ణయమైపోయాయని! ఇప్పుడేం చేయాలి? మిగిలింది ఒక్కటే.. రాజ్‌భవన్ వాస్తు వైభవాన్ని చూస్తూ గడపడం తప్ప మరో మార్గం వీరికి కనిపించలేదు. ఇక్కడ ఆడ్రే హౌజ్ ప్రముఖ చారిత్రక భవనం. 1850లో నిర్మించిన ఈ భవ నంలో అప్పట్లో ఛోటానాగ్‌పూర్ కమిషనర్ నివ సించారు. దీన్ని ప్రస్తుతం మ్యూజియంగా మార్చారు. ఛోటానాగ్‌పూర్ ప్రాంతంలోని అడవులతో కూడిన గయ జిల్లాకు డోబ్రు పన్నా బిర్వార్డి రాజుగా ఉండే వారు. 20వ శతాబ్దంలో అరణ్యక పేరుతో కథను వినిపించిన ప్రముఖ బెంగాలీ నవలా రచయిత బిభూతి భూషణ్ ఇక్కడివాడే. రాజు డోబ్రు పన్నా పూర్వికులు మొఘల్ పాలకులకు వ్యతిరేకంగా పోరా టాలు చేశారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా మొదటగా తిరుగుబాటు చేసింది కూడా వీళ్లే! అందువల్ల ఈ ప్రదేశానికి ఎంతో చారిత్రక ప్రాధాన్యం ఉంది.
పార్థ ఆయన స్నేహితులు రోజంతా రాజ్‌భవన్ ఉద్యానవనాలు, అటవీ ప్రాంతంలో కాలక్షేపం చేశారు. ఎట్టకేలకు సాయంత్రం వీరి నిరీక్షణ ఫలించి గవర్నర్ నుంచి పిలుపు వచ్చింది. ఒక్కసారిగా ఉత్సాహం ఉప్పొంగే హృదయాలతో గవర్నర్‌ను కలుసుకోవడానికి వెళ్లారు. కపటంలేని చిరునవ్వుతో కూడిన ఒక గంభీరమూర్తి వీరికి స్వాగతం పలికారు. ఆమెనే గవర్నర్ ద్రౌపది ముర్ము. అంతలోనే వీరి చేతిలో అల్ చికి లిపిలో సంథాలీ భాషలో రాసిన డా।। బాబాసాహెబ్ అంబేడ్కర్ చరిత్ర పుస్తకంపై దృష్టి సారించిన ఆమె కళ్లు ఒక్కసారిగా మెరిసాయి. ఆమె వీరిని రాజ్‌భవన్‌లో రాత్రి భోజనానికి ఆహ్వా నించారు. ఎంతో కాలం తర్వాత ఇంటికి వచ్చిన ఆప్తులను సాదరంగా ఆహ్వానించే గృహిణి ప్రవర్తనే ఆమెలో కనిపించింది. వారికి నిజంగా అదొక మరుపురాని అనుభవం.
డా।। బాబాసాహెబ్ అంబేడ్కర్ జీవిత చరిత్రను సంథాలీ భాషలో ప్రచురించాలన్న ఉద్దేశాన్ని మొట్టమొదట వెల్లడించిన బాలిక పేరు లీలామాల. ఆమె దుర్లభ్‌తుడు కుమార్తె. హయ్యర్ సెకండరీ పరీక్ష పాసైంది. ధనంజయ్ కిర్ రాసిన అంబేడ్కర్ చరిత్ర పుస్తకాన్ని ఆమెకిచ్చాను.
ఆ పుస్తకాన్ని చూసిన లీలామాల ఎంతో సంతోషపడి, ‘బాబాసాహెబ్ చరిత్రను సంథాలీ భాషలో రచించిన పుస్తకం ఏమైనా ఉన్నదా?’ అని అడిగింది.
ఈ మాట విన్నతర్వాత, సంథాలీ భాష తెలిసిన మేధావులు ఎవరైనా ఉన్నారా? అని నా సహచరులను వాకబు చేశాను. దురదృష్టవశాత్తు ఎవరూ దొరక లేదు. అప్పట్లో ప్రొఫెసర్ అచింత్య బిశ్వాస్ గౌర్‌బాంగ్ విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్స్‌లర్‌గా ఉండేవారు. ఆయన లీలామాల కథ విన్న తర్వాత.. ఎవరైనా పుస్తకాన్ని రచించారేమో తెలియదు కానీ ప్రస్తుతం లైబ్రరీలో అటువంటి పుస్తకం ఏదీ లేదు. అయితే ఒక చిరునవ్వు నవ్వి ఆమెరికాకు చెందిన ప్రముఖ రచయిత బెవర్లీ క్లియరీ పేరు చెప్పారు. ‘ఒకవేళ ఆ పుస్తకం దొరక్కపోతే, మీరే రాయండి, షెల్ఫ్‌లో భద్రంగా పెట్టవచ్చు’ అన్నారు.
అచింత్య సార్ వద్దనే, వివిధ వయస్సుల విద్యార్థు లతో మాట్లాడాము. విదేశాల్లో ఐటీ పూర్తిచేసిన సుభోదీప్ అప్పుడే ఈ టీమ్‌లో చేరిపోయాడు. చాలా చురుకైనవాడు. ‘ఈ మిషన్‌ను ముందుకు తీసుకెళదాం’ అన్నారు.
‘అంబేడ్కర్: ది గ్రేట్ మిషన్ ఇన్ మేకింగ్ ఇండియా’ పేరుతో పుస్తకాన్ని రమేష్ పతంగే రచిం చారు. సగెన్ మండి అనే విశ్వభారతి యూనివర్సిటీకి చెందిన పరిశోధకుడు ఇదే పుస్తకాన్ని ‘అంబేడ్కర్: భారత్ బెనావో రకబ్ రినిచ్ ఉద్‌గయా’ పేరుతో అనువాదం చేశాడు.
ఈ పుస్తకం ప్రచురణ కొద్దిగా ఆలస్యమైంది. ప్రొఫెసర్ ధానేశ్వర్ మాఝి విశ్వభారతి విశ్వవిద్యాల యంలో సంథాలీ భాషకు హెడ్‌గా ఉండేవారు. ఆయన ఈ రాతప్రతిని పరిశీలించి సంతృప్తిని వ్యక్తంచేశారు. సాగెన్ మండి రాసిన ఈ పుస్తకం ప్రచురితం కావాలని ప్రతి ఒక్కరూ కోరుకున్నారు.
సరిగ్గా ఇదేసమయంలో సిస్టర్ నివేదిత శతజయంతి ఉత్సవాలకు ద్రౌపది ముర్ము అనుకోకుండా కోల్‌కతా వచ్చారు. అప్పుడు సుఖదేవ్‌టుడు, పార్థా బిశ్వాస్‌లు ఆమెను ‘మీరు తప్పకుండా రావాలి మేడం’ అంటూ అభ్యర్థించారు. తర్వాత ఆమె అసిస్టెంట్, ఏడీసీతో చర్చించి పుస్తకావిష్కరణ తేదీని 2019, ఏప్రిల్ 17గా నిర్ణయించారు.
ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లా రాయ్‌రంగా పూర్‌కు 20 కిలోమీటర్ల దూరంలో ద్రౌపది ముర్ము స్వగ్రామం ఉపర్‌బెడా ఉంది. అక్కడికి వెళ్లాలంటే అడవిలో బురదరోడ్డుపై వెళ్లాల్సిందే. ఇప్పటికీ గ్రామంలో మట్టి, తాటాకు గుడిసెలే! విద్యుత్ సదుపాయం కల్పించినా రోజంతా ఉండదు. ఇవేవీ ద్రౌపది ముర్ము తన గ్రామంతో అనునిత్యం సంబం ధాన్ని కొనసాగించడానికి ఎటువంటి అడ్డంకి కాలేదు.
బ్రిటిష్ పాలన అంతరించింది. దేశానికి స్వేచ్ఛ లభించింది. కానీ పాలనా వ్యవస్థలో ఎంతమంది గిరిజనులకు స్థానం దక్కింది? కడుపు నిండా తిండికి లేకపోవడంలోని బాధను, అంటరానితనం వల్ల కలిగే వేదన, ఎటువంటి చికిత్స లేకుండానే ఆసుపత్రి నుంచి తిరిగి వస్తున్నప్పుడు కలిగే దుఃఖం వంటి క్లేశాలను ఈ పాలకులు ఎప్పుడు అర్థం చేసు కుంటారు? ఒకవేళ వారు అర్థం చేసుకుంటారని భావించినా, వాస్తవంగా ఒక బాధితుడు పడే వేదనను వారు అనుభవించి ఉండరు కదా! మరి ద్రౌపది ముర్ము అటువంటివి ఎన్నో చూశారు, అనుభ వించారు. ఆ దుర్భర అనుభవాల్లో కలిగే వేదన ఆమెకు చాలా స్పష్టంగా తెలుసు.
నేడు దేశ ప్రథమ పౌరురాలిగా పాలన గురించి ఆమె ఎన్నో విషయాలు తెలియజెప్పవచ్చు. గతంలో అబ్దుల్ కలాం కూడా రాజకీయనేతలు, ఎంపీలు, పాలనాధికారులకు క్లాసులు తీసుకునేవారు. అదేవిధంగా ఇప్పుడు కొత్త అధ్యాయం మొదలు కావచ్చునేమో? ఎస్సీలు, అణగారిన సమాజం నుంచి ఎగ్జిక్యూటివ్‌లు ఇప్పుడు పాఠాలు నేర్చుకోవచ్చు.
దోబ్రు పన్నా మనుమరాలైన యువరాణి భానుమతి, అరణ్యక్‌లో పేర్కొన్న పదాలు ఇప్పటికీ చెవుల్లో గింగిర్లెత్తుతూనే ఉంటాయి.
‘- మనం నివసించే దేశం పేరు మీకు తెలుసా?’
– మనం గయ జిల్లాలో నివసిస్తున్నాం.
– మీరు ఇండియా పేరు విన్నారా?
భానుమతి తల అడ్డంగా ఊపుతూ తనకేమీ తెలియదన్నది. చక్‌మకిటోలా తప్ప మరెక్కడికీ తాను వెళ్లలేదని చెప్పింది.
– మరి భారత్ ఎక్కడుంది?
డోబ్రు పన్నా బిర్వార్డీ ఇంటినుంచి రైసినా కొండపైకి ఏవిధంగా నడుచుకుంటూ వెళ్లాలో ద్రౌపది ముర్ము మార్గం చూపుతుంది మరి!
– జిష్ణు బసు, శాస్త్రవేత్త, కోల్‌కతా
అను: విఠల్‌రావు