సంపాదకీయం

శాలివాహన 1944 శ్రీ శుభకృత్‌  ‌భాద్రపద శుద్ధ విదియ – 29 ఆగస్ట్ 2022, ‌సోమవారం

అసతో మా సద్గమయ  తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ  – బృహదారణ్యకోపనిషత్‌


రైతు నిరసన పేరుతో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు మరొక భారీ ప్రయత్నమే మొదలయింది. 2020-2021 సంవత్సరంలో జరిపిన అలజడికి మించి ఈ పర్యాయం దేశ రాజధానిలో కల్లోలం సృష్టించే ప్రయత్నం ఈ ఆగస్ట్ 20 ‌నుంచి సాగుతోంది. ఆగస్ట్ 22‌న ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ ‌దగ్గర ‘నిరుద్యోగ సమస్య’ నిర్మూలనే దాదాపు మొదటి డిమాండ్‌గా రైతులు ఆరంభించిన నిరసన దీనినే రుజువు చేస్తుంది.

 రైతులు నిరుద్యోగ సమస్యకు వ్యతిరేకంగా ఉద్యమించడం అంటేనే వింత. తాజా రైతు ఉద్యమం ప్రారంభించిన తీరు దీనికి తగ్గట్టే ఉంది. సంయుక్త రోజ్‌గార్‌ ఆం‌దోళన్‌ ‌సమితి తలపెట్టిన ఉద్యమాన్ని సమర్థిస్తూ వీళ్లు ఇక్కడికి చేరుకున్నారని అనుకోవాలి. మహా పంచాయత్‌ ఈ ‌నిరసనకు పిలుపు నిచ్చింది. రోజ్‌గార్‌ ఆం‌దోళన్‌ ‌సమితి వీళ్ల సాయం కోరిందా? అందుకు సంబంధించిన దాఖలాలు ఏమీ లేవు. ఢిల్లీ సరిహద్దు ఘాజీపూర్‌ ఇప్పటికే కకావికలైంది. గంటల తరబడి రవాణా స్తంభించిపోతున్నది. ఇంకొక సరిహద్దు సింఘూలో మరొకసారి తిష్ట వేయాలని ‘రైతులు’ ప్రయత్నం మొదలు పెట్టారు. వేలాదిగా సింఘూ సరిహద్దుకు రైతులు వెల్లువెత్తడం, నాయకుల బెదిరింపులు చూస్తుంటే ఈ అంచనా తొందరపాటు కాదనే అనిపిస్తుంది. ఇంకొన్ని ‘సమస్యలు’ మీద కూడా జంతర్‌మంతర్‌ ‌వద్ద నిరసన నిర్వహించ డానికి వీరంతా వచ్చారు. అందుతున్న వార్తలను బట్టి రైతుల రాక ఆగలేదు. ఈ నిరసనలకి ఎలాంటి అనుమతి లేదని చెబుతూ, పోలీసు యంత్రాంగం 144వ సెక్షన్‌ ‌విధించింది.

నలభయ్‌ ‌రైతు సంఘాల కూటమి మహా పంచాయత్‌ ‌పిలుపు మేరకు ఆగస్ట్ 22‌న జరిగిన ఈ తాజా నిరసన మచ్చుకేనని ఆ సంస్థ నాయకుడు అభిమన్యు సింగ్‌ ‌కొహర్‌ ‌చెబుతున్నారు. ఈ నిరసనలో రైతుల అపరిష్కృత సమస్యలు- కనీస మద్దతు ధరకు చట్టబద్ధ హామీ, విద్యుత్‌ ‌సవరణ బిల్లు 2022 రద్దు వంటి అంశాల గురించి కూడా చర్చిస్తారట. గతంలో ఇక్కడే చేసిన నిరసన వేళ కేంద్రం ఇచ్చిన ఏ హామీ నెరవేర్చ లేదు కాబట్టి ఈ తాజా నిరసన అవసరమైందని ఆయన చెబుతున్నారు. అందుచేత ఇప్పుడు రైతు ఉద్యమ భవిష్యత్‌ ‌కార్యాచరణ గురించి చర్చ జరుగుతుందని చెప్పారు. సెప్టెంబర్‌ ఆరో తేదీన ఇక్కడే రైతు నేత రాకేశ్‌ ‌తికాయత్‌ ‌మిగిలిన సంస్థలతో భవిష్యత్‌ ‌కార్యాచరణ గురించి చర్చిస్తారట. అంటే ఈ నిరసన ఇప్పటితో తెమిలేది కాదు. పైగా రైతులు కూడా కొద్దికాలం పాటు నిరసనలో ఉండడానికి తగిన ఏర్పాట్లతోనే దిగుతున్నారని వార్తలు వస్తున్నాయి. నిజానికి ఈ నిరసన ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌లో గడచిన వారం జరిగిన నిరసనకి కొనసాగింపు. లఖింపూర్‌ ‌ఖేరీలో గత ఏడాది కేంద్ర మంత్రి అజయ్‌ ‌మిశ్రా కుమారుడు ఆశిష్‌ ‌కారు నడిపి ఎనిమిది మంది మృతికి కారకుడైన సంగతి తెలిసిందే. అందులో నలుగురు రైతులు కూడా ఉన్నారు. తాజా ఉద్దేశాలలో అదొకటి- ఖేరీ మృతులకు సత్వర న్యాయం అందాలని కోరడం కూడా.

ఇక జరగబోయేది- విపక్షాల నుంచి ‘రైతుల’కు మద్దతు వెల్లువెత్తడం. కాంగ్రెస్‌, ‌కమ్యూనిస్టులు, ఆప్‌, ‌శివసేన, ఆర్‌జేడీ, జేడీయూ, జేడీఎస్‌ ఇవన్నీ నిరసనలకు బారులు తీరి మరీ మద్దతు ప్రకటిస్తాయి. గతంలో వలెనే వంటా వార్పూ చేసి ఢిల్లీ చుట్టుపక్కల మసీదులు రైతుల ఆకలి తీరుస్తాయి. ధనసాయం చేయడానికి జార్జ్ ‌సొరోస్‌ ‌వంటి వాళ్లూ ఎలాగూ ఉంటారు. కేంద్ర ధాన్యం సేకరణ విధానానికి నిరసనగా మొన్న ఏప్రిల్‌లో తెలంగాణ నాయకులు కొందరు చేపట్టిన నిరసనలో రాకేశ్‌ ‌తికాయత్‌ ‌కూడా పాల్గొన్నారు. మరొక రైతు నిరసన అవసరమని ఆ సమయంలో తికాయత్‌ ‌చెప్పడం గమనార్హం. రైతుల సమస్యలకు మద్దతు ఇచ్చే ఏ ముఖ్యమంత్రికైనా తాము మద్దతు ఇస్తామని తికాయత్‌ ‌ప్రకటించారు. ఈ నిరసనలో తెలంగాణ రైతులు సహా, పంజాబ్‌, ‌రాజస్తాన్‌, ఉత్తరప్రదేశ్‌, ‌హరియాణా, తమిళనాడు రైతులు పాల్గొంటున్నారని వార్తలు వెలువడుతున్నాయి.

ఇంతకీ నిరుద్యోగ సమస్యకీ, దానికి రైతులు ఉద్యమించడానికీ ఏమిటి సంబంధం? ఈ ఘటనకు సంబంధించి ఇదొక బీరకాయ పీచు వ్యవహారమే. విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, కార్మిక సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, మేధావుల వేదికలు అన్నీ కలిపి రెండు వందల సంస్థలు సంయుక్త రోజ్‌గార్‌ ఆం‌దోళన్‌ ‌సమితి పతాకం కింద ఈ ఆగస్ట్ 16 ‌నుంచి జంతర్‌మంతర్‌ ‌దగ్గర వారం పాటు నిరసన నిర్వహించనున్నట్టు ఎప్పుడో ప్రకటించాయి. అనుకున్నట్టే ఆ రోజు ఈశాన్య ఢిల్లీలోని నందనాగ్రి నుంచి జంతర్‌మంతర్‌ ‌వరకు తిరంగా యాత్ర పేరుతో ఒక ప్రదర్శన మొదలుపెట్టింది. అయితే పోలీసులు మధ్యలోనే ఆపేశారు. దీనికి నాయకత్వం వహించిన వారు గోపాల్‌ ‌రాయ్‌. ఈయన ఆప్‌ ‌మంత్రిమండలి సభ్యుడు కావడం విశేషం. జాతీయ ఉద్యోగ కల్పన విధానం అమలు చేయాలన్నదే వీళ్ల డిమాండ్‌. ‌తీరా ఈ సంగతి గాలికి కొట్టుకుపోయి ఇప్పుడు రైతుల ఆందోళన ముందుకు రావడం వింతే. ఇంతకీ ఆగస్ట్ 22‌న ఇక్కడ ఢిల్లీలో రైతులు నిరుద్యోగ సమస్య మీద నిరసన ప్రకటిస్తున్న సమయంలోనే మాకు ఉద్యోగాలు కావాలంటూ పట్నాలో పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించిన ఉపాధ్యాయ పట్టభద్రులను పోలీసులు చావగొట్టిన సంగతి మహా పంచాయత్‌కు తెలియలేదా? త్రివర్ణ పతాకం చేతపట్టి ప్రదర్శనలో పాల్గొన్న ఒక యువకుడిని సాక్షాత్తు అదనపు జిల్లా మేజిస్ట్రేట్‌ ‌నడివీధిలోనే చితక్కొట్టిన దృశ్యాలు రైతులు సామాజిక మాద్యమాలలో చూశారా? వీటిని ఎందుకు ఖండించలేదు? తికాయత్‌ ‌ముఠాకి సమస్య ముఖ్యం కాదు. బీజేపీ, మోదీలను దింపడమే ప్రధానం. ఆ మేరకు కళ్లూ చెవులూ, నోరు మూసుకునే ఉంటారు.

About Author

By editor

Twitter
YOUTUBE