వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది

– డాక్టర్‌ ‌రమణ యశస్వి

తారురోడ్డులా నల్లగా వంపులు తిరిగిన ఆమె జడ ఆమె కన్నా వేగంగా కదులుతోంది. ఆమె వెనకే నడిచే ఆడవాళ్లు ఆ జడహొయలు చూస్తూ ఆయాస పడుతూ నడుస్తున్నారు.

 మీనా నడుస్తూనే ఉంది. జడ ముందు పడినప్పుడల్లా ముందు పోతున్న తారురోడ్డుతో పోటీ పడుతోంది. అది మామూలు నడక కాదు. రాజకీయ పాదయాత్ర అంతకన్నా కాదు. లాక్‌డౌన్‌ ‌తెచ్చిన తంటా నడక. వత్తిడి నడక.

‘ఇంటికి చేరాలి’ అనే ఆశ తప్పించి ఆశయం లేని నడక. ఒక నాయకుడో, ఒక నేతో నడవమంటే నడుస్తున్నది కాదు. నిజానికి నేతలు, అధికారులను ఆగమంటుంది ఇంకా ఆక్రోశంగా సాగుతున్న నడక. నిజానికి ఆ వెనుక నడుస్తున్న దాదాపు ఇరవై మందికి ఆమే గురి. అంటే నాయకి. వాళ్లల్లో ఆడవాళ్లు పదమూడు మంది.

వాళ్లల్లో తన తల్లి కూడా వుంది. మీనాకే కాదు అందరికీ స్వేద నదులు చల్లగా తగిలి సేద తీరుస్తు న్నాయి. మధ్య మధ్యలో చింతచెట్లు అలసట చింత తీరుస్తున్నాయి.

పొద్దున్న ఐదింటికి బైల్దేరారు. మధ్యాహ్నం పన్నెండు గంటల కల్లా పట్టణానికి వచ్చారు. రోడ్డు మీద ఒక్క వాహనమూ లేదు. చాలా చోట్ల అడ్డాలు పెట్టి ఉన్నాయి. కొన్ని చోట్ల రెడ్‌ ‌జోన్‌ అని రాసి పెట్టి లోపలికి పోనీకుండా ఆపుతున్నారు. అక్కడ పెద్ద చెట్టు కింద దూరం దూరంగా మూతులకు మాస్కులు పెట్టుకొని కూర్చున్నారు. కొంతమంది కాళ్లు వత్తుకుంటూ కూర్చున్నారు. మరికొంత మంది పాదాలను పరిశీలించుకుంటున్నారు. ఇంకొందరు అలసి సొలసి అడ్డంగా పడుకుండి• పోయారు.

మీనా కూడా బాగా అలసిపోయింది. నడిచి నంతసేపు అలసట తెలీలా. కూర్చున్న తర్వాత అలసట కమ్మేసింది. ఒక పావుగంట పాటు ధ్యానం చేసుకుంది. మళ్లీ ఊతం తెచ్చుకుంది. కర్తవ్యం గుర్తు చేసుకుంది. మధ్య మధ్యలో స్వచ్ఛంద సంస్థల వాళ్లు, ప్రభుత్వం వాళ్లు ఇఛ్చిన నీళ్లు, మజ్జిగ, తినే పదార్థాలు, పండ్లు పాడవకుండా జాగ్రత్త చేసి సర్దిపెట్టింది. నడుస్తున్నప్పుడు ఎవరికీ అవి బరువు కాకుండా వారి వయసు, వంట్లో శక్తిని బట్టి వాటిని ఒక్కొక్కళ్లకి ఇచ్చింది. అందరికీ అన్నీ సమతుల్య ఆహారం లాగా వడ్డించింది. అందరూ మధ్యాహ్నం కునుకు తీసి చల్లటివేళ మళ్లీ బయల్దేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

మీనా ఒక తువ్వాలు కింద వేసుకుని పడుకుంది. సేదతీరిన ఆమె శరీరం దూదిపింజలా తేలిపోతోంది. మనసు మాత్రం ఆలోచనలతో బరువెక్కింది.

మీనా చెన్నైలోని ఒక మురికివాడలో పుట్టింది. ప్రాథమిక విద్యను ముగించింది తిరుపతి మురికి వాడల్లో. తల్లిదండ్రులు చెన్నైలో పనులకెళ్లి అక్కడే చిల్లర కొట్టు పెట్టుకొని స్థిరపడ్డారు. ఉన్న ఒక్క తమ్ముడూ డెంగ్యూ జ్వరంతో పదిహేనేళ్ల వయసులో చనిపోయాడు. తొమ్మిదో తరగతి చదువుతున్న పిల్లోడు చనిపోవడంతో ఆ కుటుంబం బాగా కలత చెందింది. భలే చురుకైన, తెలివైన తమ్ముణ్ణి కోల్పో వడం తీరని లోటు అనిపించింది మీనాకి…

తమ్ముడు లాగా డెంగ్యూ వల్ల ఆ మురికివాడలో ఎవరూ చనిపోకూడదని అప్పుడే తను ఒక నిర్ణయా నికి వచ్చింది. స్వామి వివేకానంద, మహాత్మాగాంధీల ప్రభావం తనమీద చాలా ఉంది. తాను వక్తృత్వ పోటీల్లో గెలిచినప్పుడల్లా వారి పుస్తకాలను బహుమతు లుగా ఇచ్చేవారు. వాటిని చదివిన ఆమె, ఏ సమస్య నైనా ఉక్కు నరాలతో, ఉక్కు సంకల్పంతో జయించ వచ్చనే అవగాహన కొచ్చింది. తన తమ్ముడు దోమలు కుట్టడం వలన ఎలా చనిపోయాడో వివరిస్తూ అక్కడ యువతలో చైతన్యం కలిగించింది. ఆ ప్రాంతంలో దోమలు లేకుండా చేయడానికి ఉపక్రమించింది. స్థానికులు అందరూ కలసి అక్కడ మురుగు కాలవల్లో నీరు నిలవకుండా చూశారు. బహిరంగ మలమూత్ర విసర్జనను బహిష్కరించారు. అందరూ మరుగుదొడ్లు కట్టుకొని వాడేలా ప్రోత్సహించారు. మొదట మున్సిపాలిటీ వాళ్లు సహకరించకపోతే సత్యాగ్రహం చేసి వారిని తమ దారికి తెచ్చుకున్నారు.

మీనా అంటే ‘మీ’ ఇంటి పిల్ల , ‘నా’ ఇంటి పిల్ల, అందరి పిల్లా అనుకునేలా అందరికీ తలలో నాలుక అయింది. యవ్వనం తొణికిసలాడుతూ పుత్తడిబొమ్మలా వుంది మీనా ఇప్పుడు. తన అందాన్ని పక్కన పెట్టే వాక్చాతుర్యంతో ఆకట్టుకొంటోంది. డిగ్రీ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణురాలైంది. యూనివర్సిటీలో ఎం.ఎం. హిస్టరీలో చేరింది. జాతిపిత గాంధీజీ గురించి సమూలంగా చదవడానికి ఉపక్రమించింది. ఈ క్రమంలో గాంధీయిజం నరనరాన ఇంకి పోయింది.

అదే సమయంలో ఒక కంప్యూటర్‌ ‌సంస్థలో మోహన్‌ ‌పరిచయమయ్యాడు. ఒక స్టార్టప్‌ ‌కోసం ఆ కంప్యూటర్‌ ‌సంస్థలో పని చేస్తున్నాడు. ఆ పరిచయం ప్రేమగా, పెళ్లిగా మారి అక్కడే దగ్గర్లో ఇల్లు తీసుకుని వున్నారు.

అప్పటికి తన పీజీ కూడా అయిపోయింది. డిసెంబర్‌లో వాళ్ల స్టార్టప్‌ అహ్మదాబాద్‌లో మొదలు పెట్టడానికి అక్కడికి వెళ్లాడు మోహన్‌.

‌మోహన్‌ ‌లేకపోవడం వలన పుట్టింట్లోనే వుంది మీనా. ఈ లోపు తను గర్భిణీ అని తెలిసింది. ఫిబ్రవరిలో తిరుపతిలోని పెద్దమ్మ వాళ్ల ఇంట్లో శుభకార్యానికి అమ్మని తీసుకొని వెళ్లింది. అక్కడ తనకు వేవిళ్లు బాగా అవ్వడంతో అక్కడే ఉండాల్సి వచ్చింది లేత నెలలు ఇప్పుడే ప్రయాణం వద్దు అని. మార్చి మొదటి వారంలో కొండకు తీసుకెళ్లి వెంకన్న దర్శనం కూడా చేయించారు.

అక్కడ స్కాన్‌ ‌చేయించుకుంటే అక్టోబర్‌ ‌రెండు కాన్పు తేదీ అని ఇచ్చారు. తన ఆదర్శం తనకు బిడ్డ రూపంలో రాబోతోందని ఎంతో సంతోషంగా ఉంది మీనాకు. పెద్దమ్మ వాళ్లు తనని ఎంతో బాగా చూసుకోవడం మీనా మనసుకి హత్తుకుపోయింది. వాళ్లకు కూడా మీనా నడవడిక, మాటతీరు, హాస్యో క్తులు ఇట్టే కలిసిపోయే లక్షణం బాగా దగ్గర చేశాయి. మోహన్‌ ‌కాల్‌ ‌చేశాడు తాను ఏప్రిల్‌ ‌మొదటివారంలో వస్తానని. అయితే మీరు కూడా అప్పుడే వెల్దురు అని మీనా వాళ్లను పెద్దమ్మ వాళ్లు బతిమాలారు.

వాళ్లింట్లో పిల్లలకు కథలు, గాంధీయిజం గురించి చెప్తోంది. అదిగో అప్పుడు మొదలైంది కరోనా గోల. జనతా కర్ఫ్యూ తర్వాత లాక్‌డౌన్‌ ‌కరోనా గురించి బాగా తెలిసేలోపే మొదలైపోయింది. ఎక్కడి వాళ్లు అక్కడే ఇరుక్కుపోయారు. మీనా వాళ్ల నాన్న ఒక్కడే అక్కడ చెన్నైలో వుండిపోయాడు. మోహన్‌ ‌గుజరాత్‌లో ఇరుక్కున్నాడు. అదే దిగులుగా వుంది మీనాకి.

పెద్దమ్మ వాళ్లకు నచ్చచెప్పింది. ఈ లాక్‌డౌన్‌ ఎన్ని రోజులు పొడిగించుకుంటూ పోతారో తెలీదు. నాన్న ఒక్కడే చెన్నైలో ఉన్నారు. నడిచైనా వెళ్లాలి అని ఆలోచిస్తోంది. కరోనా ఉధృతిని ప్రసార మాధ్యమాల్లో చూస్తూ పరిస్థితిని అంచనా వేసింది.

మొదటి లాక్‌ ‌డౌన్‌ అయ్యే వరకు ఓపిక పట్టింది. టీవీల్లో, పేపర్లలో, నెట్లో కరోనా వైరస్‌ ‌గురించి బాగా తెలుసుకొంది. అందరికీ తీసుకోవాల్సిన జాగ్ర త్తలు నేర్పింది. వలస కార్మికుల వెతలు చూస్తుంటే చాలా బాధేసింది.

రోడ్ల మీద, రైలు ట్రాక్‌ల వెంట రక్తం కారే పాదాలతో వారు నడిచి వెళ్లడం చూసి తల్లడిల్లి పోయింది. ఇప్పుడు కనుక గాందీజీ• ఉండి ఉంటే వారి ఒక్క పిలుపుతో వలస కార్మికులందరినీ రక్షించడానికి పూనుకునేవారేమో. గాంధీజీ వాళ్లతో పాటు ఎన్ని కిలోమీటర్లు అయినా నడిచి ఉండే వారేమో! వారి స్థానంలో ఎవరైనా గాంధీ కావచ్చు.. ఎవరి పరిధిలో వారు.

నిజానికి మీనా కుటుంబం కూడా వలస కార్మికులే. తన చుట్టాలందరూ తిరుపతిలో ఉన్నారు. వారిలో చాలామంది వలస వెళ్లారు. ఆ చుట్టుపక్కల చాలామంది చెన్నై వెళ్లవలసిన వారని తెలుసుకొని అందరూ ఒక సమూహంగా బయల్దేరడానికి పథ•క రచన చేసింది. తిరుపతి నుండి చెన్నై సుమారు 140 నుండి 150 కిలోమీటర్లు. రోజుకు 15 కిలోమీటర్లు నడిచినా పది రోజుల్లో క్షేమంగా వెళ్లొచ్చు. మొత్తం ఇరవైమంది తేలారు. అందరికీ తలా ఐదు మాస్కులు, సబ్బులు, చెప్పులు, తువ్వాళ్లు, దుప్పట్లు, సంచులు పెద్దవాళ్లకు చేతికర్రలు, టార్చ్‌లైట్లు, సెల్‌ ‌ఛార్జర్లు, పవర్‌ ‌బ్యాంకులు, కొన్ని తిండిగింజలు, పండ్లు, ఇలా అవసరమైనవి అన్నీ సమకూర్చుకొని, చక్కగా సర్దుకొని ఏప్రిల్‌ ఆరు పొద్దున్న ఐదు గంటలకు బయల్దేరారు.

తను కూడా తన అమ్మకి తనకు కావాల్సినవన్నీ పెట్టుకుంది. వలస కూలీల కష్టాలను అక్షరీకరించ డానికి పుస్తకం, కలం కూడా తెచ్చుకుంది. తాను జర్నలిజం కోర్సు కూడా పూర్తి చేసింది కాబట్టి ఎప్పుడూ కలం కాగితం వెన్నంటే ఉంటాయి.

తోవలో ఒక నిండు చూలాలు కాంచీపురం వెళ్లే గుంపులో కనిపించింది. ఆవిడకి కాన్పు చేసింది. మూడో కాన్పు కాబట్టి సులువుగానే కాన్పు అయి తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నారు. ఆ బాలింతకు చెప్పులు లేకపోతే ఒక జత చెప్పులు ఇచ్చి పంపింది.

భౌతిక దూరం పాటిస్తూ వలస కార్మికులు తరలి పోవడం గాంధీ గారి ఉప్పు సత్యాగ్రహ యాత్రని తలపిస్తోంది. ఆంధ్ర, తమిళనాడు సరిహద్దుల్లో పెద్ద గొడవే అయింది వీళ్ల సమూహానికి పోలీసులకు. రెండు రోజులు శాంతియుత సత్యాగ్రహం చేశారు. ఎట్టకేలకు వీళ్ల ఫోన్‌ ‌నంబర్లు, చిరునామాలు తీసుకుని కచ్చితంగా అక్కడికి వెళ్లాక ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉండాలని చెప్పి పంపిం చేశారు.

తమిళనాడులో ప్రవేశించే సరికి ఎనిమిది రోజులు పట్టింది. ఇక్కడి నుంచి ఇంకో ఐదు రోజులు పట్టేలా ఉంది అడ్డంకులు అన్నీ తప్పించుకొని వెళ్లేసరికి. ప్రతి రహదారిలో వందల మంది మూట లతో, చంకన పిల్లతో, కర్రలు పోటేసుకుంటూ, చెప్పు ల్లేకుండా, రక్తం కారుతున్న పాదాలతో, చెమటలు కక్కుతూ సొంతూళ్లకు త్వరగా చేరుకోవాలనే తపనతో నడుస్తున్నారు.

కొన్నిచోట్ల కంటైన్మెంట్‌ ‌ప్రాంతాల నుంచి పోవడానికి లేదు అంటే, పక్కన పొలాల్లో నుంచి కూడా నడుచుకుంటూ వెళ్లాల్సి వచ్చింది. కొంత మంది నడిచీ నడిచీ నిస్సత్తువగా నేలమీద పడ్తున్న దృశ్యాలు మీనా కంటపడ్డాయి.

ఎంత కష్టం ఎంత కష్టం! అని మనసులోనే విలపిస్తూ నడుస్తోంది మీనా. ఇంటికి చేరాలనే తపన ఇంటికి దగ్గరయ్యే కొద్దీ ఎక్కువవుతోంది. తమ గుంపులో అందరూ క్షేమంగానే ఉన్నారు కాళ్లు, నడుము నొప్పుల లాంటివి తప్పించి. ఎన్నో జాగ్రత్తలు తీసుకోవడం, ఎక్కువసేపు విశ్రాంతి, ఉన్నంతలో మంచి ఆహారం, మంచినీళ్లు ఎక్కువ తీసుకోవడంతో చాలా వరకు అనారోగ్య సమస్యలు లేకుండా నడవ గలిగారు. స్వచ్ఛంద సంస్థలు ఇచ్చిన పండ్లు కూడా శుభ్రం చేసుకొని తిన్నారు. కరోనా జనంపై దాడి చేయకుండా అన్ని జాగ్రత్తలు పాటించేలా ప్రతి క్షణం కాచుకుంది మీనా.

 చెన్నై పట్టణంలోకి రాగానే చాలా తనిఖీలు జరిగాయి. కోవిడ్‌ ‌లక్షణాలు ఉన్నాయో లేదో అడిగి తెలుసుకున్నారు. జ్వరం చూశారు. అందరికీ ఆహారం, నీళ్లు పండ్లు ఇచ్చారు. ఇక అక్కడినుంచి ఎవరి ఇళ్లకు వారు వెళ్తూ మీనాకి కృతజ్ఞతలు చెప్పారు. అందరికీ చేతులు జోడించి నమస్కారం పెట్టి భారమైన మనసుతో తమ గమ్యం వైపు మళ్లారు మీనా వాళ్లు.

ఇంత కన్నా పెద్ద కష్టం. ఇంటిదగ్గర వాళ్ల నాన్న రూపంలో వేచి ఉందని మీనాకు తెలీదు పాపం. ఇంటికి చేరి ఎప్పుడెప్పుడు నాన్నని చూస్తానా! అని మీనా, భర్తని చూస్తానా! అని మీనా తల్లి అడు గులు వాళ్ల కాలనీవైపు వడివడిగా పడుతున్నాయి. పద్దెని మిది రోజుల అలసట నాన్నని చూస్తే పోతుంది అను కుంటూ, నిన్న పొద్దున ఆయనతో మాట్లాడినప్పుడు ‘తొందరగా రండమ్మా పేణం పెద్దగా బాగుండట్లా’ అన్న మాటలే కొంచెం ఆందోళన కలుగజేస్తున్నాయి.

ఆనందంగా నాన్న ఎదురొస్తాడు అనుకుంటే ఇంటి దగ్గర చడీచప్పుడు లేదు. దగ్గరగా వేసున్న తలుపుని నెట్టి లోపల చూస్తే నాన్న కొన ఊపిరితో ఉన్నట్లున్నాడు. చుట్టూతా ‘మందు’ సీసాలు ఉన్నాయి. మందెక్కువ తిండి తక్కువ అయిందని అర్థం చేసుకుని పక్కనే ఉన్న కాంపౌండర్‌ని తీసుకొచ్చి సెలైన్‌ ‌పెట్టించింది.

‘అమ్మా క్షమించమ్మా! నువ్వు లేకపోవడం వల్ల పట్టు తప్పాను’అని వేడు కున్నాడు కొంచెం ఊతం వచ్చాక. ఆ రాత్రంతా జాగారం తప్పలేదు. సరైన సమయానికి రావడం వల్ల పెద్ద గండం తప్పిందను కున్నారు. వారం రోజులు పట్టింది మామూలు మనుషులయ్యేసరికి.

అదృష్టం కొద్దీ అబార్షన్‌ ‌కాలేదు. వైరస్‌ ‌కన్నా ఈ భయమే మీనాని వెంటాడింది. నడక, సత్యా గ్రహం, ఒక కారణం కోసం ఓర్పుగా శ్రమించడం అదీ కడుపులో బిడ్డతో. ప్రహ్లాదుడిలా గర్భంలోనే గాంధీయిజం వంట బట్టించుకొని మహాత్ముడు మళ్లీ పుడతాడు నా కడుపున.

గాంధీ పుట్టిన రాష్ట్రం గుజరాత్‌లో ఉన్నాడు మోహన్‌.  అక్టోబర్‌లో పుడతాడు కాబట్టి మోహన్‌ ‌గాంధీ అని పేరు పెడదాం. ఏది మహమ్మారి? సారానా? కరోనానా? అని పుట్టబోయే గాంధీనే తేలుస్తాడు.

ఇదంతా మెయిల్‌లో మోహన్‌కి ఉత్తరం రాసింది. అలాగే ఈ నడక అనుభవాలన్నీ ‘వలస విలాపం ‘అనే పుస్తకం రాసి అచ్చు వేయించింది మీనా.

About Author

By editor

Twitter
YOUTUBE