– డాక్టర్‌ ‌రుచిర్‌ ‌గుప్తా, అసోసియేట్‌ ‌ప్రొఫెసర్‌, ‌సీఎస్‌ఈ ‌విభాగం, ఐఐటీ-బెనారస్‌ ‌హిందూ యూనివర్సిటీ, వారణాసి –

వలసవాద ప్రభుత్వం నుంచి దారుణ వివక్ష, అణచివేత కొనసాగినప్పటికీ, జాతీయవాద భావాలు ఉన్న శాస్త్రవేత్తలు ఎంతో కష్టపడి తర్వాతి తరం శాస్త్రవేత్తలకు అవసరమైన స్ఫూర్తిని, శాస్త్ర సాంకేతిక రంగంలో మౌలిక సదుపాయాలు కల్పించారు.

గత ఐదు వందల ఏళ్ల కాలంలో మనదేశం మీద చివరిగా దండయాత్ర చేసిన విదేశీయులు బ్రిటిషర్లు. అంతకుముందు జరిగిన దాడులతో పోలిస్తే వీరు భిన్నం. తమతోపాటు శాస్త్రీయ పరిజ్ఞానాన్ని మనదేశంలోకి తీసుకొచ్చిన వీరు, మనల్ని దోచుకోవడానికి దాన్నే గొప్ప ఉపకరణంగా మలుచుకోవడం గమనార్హం.

1767లో దేశంలో మొట్టమొదటి సంస్థ సర్వే ఆఫ్‌ ఇం‌డియాను నెలకొల్పారు. బొటానికల్‌ ‌సర్వే ఆఫ్‌ ఇం‌డియా, జులాజికల్‌ ‌సర్వే ఆఫ్‌ ఇం‌డియా వంటి చాలా సంస్థలను దేశంలో తర్వాతి కాలంలో స్థాపించారు. విచిత్రమేమంటే ఇవేవీ పరిశోధనా సంస్థలు కావు. కేవలం సర్వే సంస్థలు! అంటే వీటి ద్వారా దేశంలో ఆయా విభాగాలకు సంబంధించిన సర్వేలను నిర్వహించి సేకరించిన సమాచారం ఆధారంతో యథేచ్ఛగా దోపిడీ కొనసాగించారు. ఇదే సమయంలో భారతీయులపై మానసిక ఆధిపత్యాన్ని సాధించే క్రమంలో, వీరు హేతుబద్ధంగా ఆలోచించ లేరని, శాస్త్రీయతను ఆమోదించరంటూ ప్రచారం చేశారు.

ఈ విషప్రచారాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు జాతీయవాద శాస్త్రవేత్తలు నడుం బిగిం చారు. తమ పాశ్చాత్య విద్యా పరిజ్ఞానాన్నే సాధనంగా చేసుకొని, దేశీయ శాస్త్రీయ స్వభావాన్ని అభివృద్ధి చేసేందుకు యత్నించారు. దీనిద్వారా దేశంలోని అన్నివర్గాల ప్రజల్లో, శాస్త్రీయ విజ్ఞానం, అవగాహన పెంపొందించాలన్నది వీరి ప్రధాన లక్ష్యం. స్వాతంత్య్ర పోరాటంలో వీరు శాస్త్రాన్ని ఒక సాధనంగా చేసుకున్నారు. ఆ విధంగా కృషిచేసిన కొందరు శాస్త్రవేత్తల గురించి తెలుసుకుందాం.

ప్రపంచంలోని అతిపురాతన నాగరికతల్లో భారతీయ నాగరికత ఒకటి. ఇన్నివేల సంవత్సరాలు అప్రతిహతంగా ఇది మనుగడ సాగించడానికి ప్రధాన కారణం-ఇందులో నిబిడీకృతమై ఉన్న హేతుబద్ధత, శాస్త్రీయతలే! కానీ బ్రిటిషర్లు భారతీయుల్లో అశాస్త్రీయ, నిర్హేతుకతలే గాఢంగా నాటుకుపోయి ఉన్నాయని ప్రచారం మొదలుపెట్టారు. ఈ వ్యతిరేక ప్రచారాన్ని ఎదుర్కోవడం రాజకీయాల వల్ల అయ్యే పనికాదు. దీన్ని నిరోధించి, బ్రిటిష్‌వారి ప్రచారం తప్పని నిరూపించినవారు జాతీయవాద శాస్త్రవేత్తలే. వీరు పశ్చిమదేశాల వ్యవస్థ లకు అనుగుణమైన విద్యను అభ్యసించి, స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత బ్రిటిష్‌వారితో మేధోపరమైన పోరాటాన్ని కొనసాగించారు. ఎవరి నుంచి ఏ విధ మైన సహాయం లేకుండా సొంతంగా ప్రయోగశాలలు నిర్మించి, అత్యున్నత అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణమైన పరిశోధనలు చేశారు. ఇదే సమ యంలో దేశీయ యువ శాస్త్రవేత్తలకు అవసరమైన మార్గదర్శనం చేశారు. అటువంటి యువ శాస్త్రవేత్తల్లో సి.వి. రామన్‌ ఒకరు. ఆసియా ఖండంలోనే నోబెల్‌ ‌బహుమతి గెలుచుకున్న చెందిన తొలి భారతీయ శాస్త్రవేత్త. శాస్త్రరంగంలో పెద్దగా నిష్ణాతులు కానివారు కూడా దేశంలో శాస్త్రీయ అభివృద్ధి కోసం కృషి చేశారు. మహేంద్రలాల్‌ ‌సిర్కార్‌, ‌సిస్టర్‌ ‌నివేదిత, పండిట్‌ ‌మదన్‌మోహన్‌ ‌మాలవ్యాలు దేశంలో యువ శాస్త్రవేత్తల ఉద్గమానికి మూలస్తంభాలుగా నిలిచా రనడంలో అతిశయోక్తిలేదు.

మహేంద్రలాల్‌ ‌సర్కార్‌

‌నవంబర్‌ 2, 1833‌న మహేంద్రలాల్‌ ‌సర్కార్‌, ‌హౌరా జిల్లాలోని పరిక్‌పుర గ్రామలో జన్మించారు. 1863లో ఆయన కలకత్తా మెడికల్‌ ‌కళాశాలలో వైద్య విద్యను పూర్తిచేసిన రెండో వ్యక్తి. బ్రిటిష్‌ ‌మెడికల్‌ అసోసియేషన్‌ ‌బెంగాల్‌ ‌శాఖకు ఆయన అధ్యక్షులుగా పనిచేశారు. మొదట్లో ఆయన హోమియోపతి వైద్యవిధానాన్ని తీవ్రంగా విమర్శించేవారు. అయితే ఒక కేసులో కనిపించిన హోమియోపతి వైద్యం సమర్థ పనితీరు ఆయనకు స్పష్టంగా అవగాహన అయింది. దీంతో ఆయన హోమియోపతి వైద్యం గురించి జాగ్రత్తగా అధ్యయనం చేశారు. దీనిద్వారా హోమియోపతి వైద్యంలోని శాస్త్రీయత, హేతుబద్ధత ఆయనకు అర్థమైంది. తాను అధ్యయనం చేసిన విషయాలను బ్రిటిష్‌ ‌మెడికల్‌ ‌కౌన్సిల్‌ ‌సమావేశం ముందుంచగా, ఆయనకు తీవ్ర వ్యతిరేకత ఎదురవ డమే కాదు, కౌన్సిల్‌లో తన పదవిని కోల్పోవాల్సి వచ్చింది.

ఈ పరిణామం తర్వాత భారతీయ శాస్త్ర విజ్ఞానాన్ని వెలుగులోకి తీసుకొని రావాల్సిన ఆవశ్యకతను గుర్తించిన డా।। సర్కార్‌, ఇం‌డియన్‌ అసోసియేషన్‌ ‌ఫర్‌ ‌కల్టివేషన్‌ ఆఫ్‌ ‌సైన్స్ (ఐఏసీఎస్‌)‌ను స్థాపించారు. దాదాపు దశాబ్దకాలం జరిపిన నిరంతర కృషి, ప్రయత్నాల నేపథ్యంలో 1876లో దీన్ని నెలకొల్పడం సాధ్యమైంది. ఐఏఈస్‌ను స్థాపించింది, ఇందులో సభ్యులుగా వుంటూ దీన్ని నడిపిందీ పూర్తిగా భారతీయులే. భారతీయ శాస్త్రవేత్తలు అంత ర్జాతీయ స్థాయిలో పోటీ పడేందుకు అవసరమైన సహాయసహకారాలను ఇందులోని యువశాస్త్రవేత్తలు అందించేవారు. ఉపన్యాసాలు, ప్రదర్శనల ద్వారా శాస్త్రీయ విజ్ఞానానికి బహుళ ప్రాచుర్యం కల్పించ డానికి ఐఏసీఎస్‌ ఎం‌తగానో కృషిచేసింది. ఈ సంస్థ సాగించిన నిరంతర కృషికి ఫలితం సి.వి. రామన్‌ ‌రూపంలో 1930లో భౌతికశాస్త్రంలో నోబెల్‌ ‌బహుమతి ద్వారా లభించింది.

ఆచార్య ప్రఫుల్‌ ‌చంద్రరాయ్‌

ఆగస్ట్ 2, 1861‌న ఆచార్య ప్రఫుల్‌ ‌చంద్రరాయ్‌, ‌జెస్సోరి జిల్లాకు చెందిన రరూలి-కటిపర గ్రామంలో (ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఉంది) జన్మించారు. పూర్తి జాతీయవాది అయిన ఈయన గొప్ప రసాయన శాస్త్రవేత్త. ఆయన ప్రఖ్యాత ఉల్లేఖన ‘శాస్త్రం నిరీక్షిస్తుంది, కానీ స్వాతంత్య్రం నిరీక్షించలేదు’.

స్వాతంత్య్రంలో ఆర్థిక వ్యవస్థ ప్రాధాన్యాన్ని ఆయన బాగా గుర్తించారు. ఆ రోజుల్లో సల్ఫ్యూరిక్‌ ఆమ్లాన్ని ఎంతో ముఖ్యమైన రసాయనంగా పరిగణిం చేవారు. అయితే స్థానిక తయారీదార్లు ఈ ఆమ్లాన్ని వ్యర్థాల నుంచి చాలా తక్కువ మొత్తాల్లోనే ఉత్పత్తి చేయగలుగుతున్నారన్న అంశాన్ని గుర్తించారు. ఈ నేపథ్యంలో సల్ఫ్యూరిక్‌ ఆమ్లాన్ని పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయడానికి బహదూరీ సోదరులకు సహకరించారు. ఐరన్‌ ‌సల్ఫేట్‌, ‌ఫాస్పేట్‌, ‌కాల్షియంను తయారు చేయడం మొదలుపెట్టారు.

1901లో బెంగాల్‌ ‌కెమికల్స్ ‌పేరుతో ఒక ఫార్మాస్యూటికల్‌ ‌కంపెనీని ప్రారంభించారు. ఇదే దేశంలో తొలి ఔషధాల తయారీ కంపెనీ! తర్వాత ఆయన మన పూర్వ రసాయన శాస్త్రవేత్తల ప్రాముఖ్య తను గుర్తించి, ‘‘హిందూ కెమిస్ట్రీ’’ పేరుతో ఒక పుస్తకాన్ని రచించారు. 1924లో ఇండియన్‌ ‌కెమికల్‌ ‌సొసైటీని స్థాపించి భారతీయుల్లో రసాయనశాస్త్ర ప్రాముఖ్యతను ప్రచారం చేశారు. ఈ సొసైటీ ‘‘జర్నల్‌ ఆఫ్‌ ఇం‌డియన్‌ ‌కెమికల్‌ ‌సొసైటీ’’ని ప్రారంభించింది. తన మేధస్సుతో వివిధ జర్నల్స్‌లో వ్యాసాలు రాసి ప్రజల్లో చైతన్యం నింపడానికి కృషిచేశారు.

జగదీష్‌ ‌చంద్రబోస్‌

‌మనదేశానికి చెందిన అద్భుతమైన శాస్త్రవేత్తల్లో జగదీష్‌ ‌చంద్రబోస్‌ ఒకరు. ఆయన భౌతికశాస్త్రం నుంచి వృక్షశాస్త్రం వరకు ఎన్నో ప్రయోగాలు చేశారు. నవంబర్‌ 30, 1858‌న మున్షిగంజ్‌లో (నేటి బంగ్లాదేశ్‌) ‌జన్మించారు. ఆయన కేంబ్రిడ్జి, లండన్‌ ‌విశ్వవిద్యాలయాల్లో విద్యాభ్యాసాన్ని కొనసాగించి, భారత్‌కు తిరిగి వచ్చిన తర్వాత ఇంపీరియల్‌ ఎడ్యు కేషన్‌ ‌సర్వీస్‌లో చేరాలని భావించినా, భారతీయులు హేతుబద్ధంగా ఆలోచించలేరన్న మిషతో బ్రిటిష్‌ ‌ప్రభుత్వం ఆయనకు అవకాశం ఇవ్వలేదు. దీన్ని నిరసిస్తూ ఆయన సత్యాగ్రహం చేయడమే కాదు మూడేళ్లపాటు ఎటువంటి జీతం తీసుకోకుండా తన బోధనలు కొనసాగించారు. ఎట్టకేలకు ఆయన ఇంపీరియల్‌ ఎడ్యుకేషన్‌ ‌సర్వీసులో అవకాశాన్ని పొందారు. సూక్ష్మతరంగాల ప్రసారాన్ని ప్రయోగాత్మ కంగా ప్రపంచంలో మొదటిసారి నిరూపించిన శాస్త్రవేత్త జగదీష్‌ ‌చంద్రబోస్‌. ఇం‌త గొప్ప ఆవిష్కరణ గుర్తింపునకు నోచుకోలేదు. తర్వాతికాలంలో సుదూరాలకు వైర్‌లెస్‌-‌టెలిగ్రాఫ్‌ ‌సంకేతాలు పంపే విధానాన్ని ప్రయోగాత్మకంగా నిరూపించిన గుగ్లి యల్మో మార్కొనికి నోబెల్‌ ‌పురస్కారాన్ని అందజేశారు. సెప్టెంబర్‌ 14, 1912‌న మిల్లీమీటర్‌- ‌బ్యాండ్‌ ‌రేడియోపై బోస్‌ ‌చేసిన ప్రయోగాన్ని ఐఈఈఈ గుర్తించింది. ఇది ఎలక్ట్రికల్‌, ‌కంప్యూటర్‌ ఇం‌జినీరింగ్‌ ‌రంగంలో మైలు రాయిగా నిలిచింది.

వృక్షశాస్త్రం, జీవభౌతికశాస్త్రాలలో కూడా కూడా జగదీష్‌ ‌చంద్రబోస్‌ ఎన్నో ప్రయోగాలు చేశారు. జ్ఞానస్వేచ్ఛను బోధించే భారతీయ సిద్ధాంతాన్ని ఆయన గట్టిగా విశ్వసించేవారు. తాను కనుగొన్న వాటికి పేటెంట్‌ ‌హక్కులను ఆయన ఎన్నడూ కోరలేదు. అసలు పేటెంట్‌ ‌హక్కులను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. సైన్స్‌కు మరింత ప్రచారం కల్పించేందుకు ఆయన ఎన్నో సైన్స్ ‌ఫిక్షన్‌ ‌కథలను రచించారు. 1917లో తన పుట్టినరోజున ఆయన బసు విజ్ఞాన మందిర్‌ ‌పేరుతో ఒక సంస్థను ప్రారంభించి, ఇందులో సైన్స్‌కు సంబంధించిన వివిధ విభాగాల్లో పరిశోధనలు నిర్వహించేందుకు వెసులుబాటు కల్పించారు. ఈ సంస్థను ప్రారంభిస్తూ, ‘ఇది కేవలం ప్రయోగశాల కాదు, ఒక దేవాలయం. మన ఇంద్రియాలకు అవగాహన అయ్యే రీతిలో ఇక్కడ భౌతిక పరిశోధనల ద్వారా వాస్తవాల ఆవిష్కరణ లేదా కృత్రిమంగా తయారుచేసిన వస్తువుల ద్వారా, ఇంద్రియ గ్రాహ్యకమైన వాస్తవాలను నిరూపించడం జరుగుతుంది. ముప్పయి రెండేళ్ల క్రితం నేను సైన్స్ ‌బోధనను వృత్తిగా స్వీకరించా. భారతీయుల మనసు ప్రాకృతిక అధ్యయనాన్ని పక్కనబెట్టి ఆదిభౌతిక విజ్ఞానంవైపే పరుగు తీస్తుందనేది ఒక అభిప్రాయం. మరి ఈ దిశగా కచ్చితంగా అంచనా వేయడానికి, విచారణ జరపడానికి భారతీయులకు సామర్థ్యమున్నప్పటికీ, ఈ రంగంలో ఉపాధి అవకాశాలు లేవు. అందుకోసం ప్రయోగశాలలు, నిపుణులైన యంత్రకారులు అందు బాటులో లేరు. ఇది కఠిన వాస్తవం. ఇది పరిస్థితులపై ఫిర్యాదుచేసే తరుణం కాదు. కానీ ఆమోదించడానికి, సంఘర్షించడానికి లేదా ఆధిపత్యం సాధించడానికి తగిన ధైర్యం కావాలి. మనందరం అత్యంత కఠిన సమస్యలను కూడా సరళమైన రీతిలో పరిష్కరించిన జాతికి చెందినవార’’మంటూ ముగించారు.

మేఘనాథ్‌ ‌షా

మేఘనాథ్‌ ‌షా గొప్ప భౌతిక శాస్త్రవేత్త. ఆయన ఢాకాకు సమీపంలోని షౌరటోలి గ్రామంలో 1893లో జన్మించారు. కలకత్తా యూనివర్సిటీలో భౌతిశాస్త్ర ఆచార్యునిగా పనిచేశారు. 1927లో రాయల్‌ ‌సొసైటీకి ఫెలోగా, 1934లో ఇండియన్‌ ‌సైన్స్ ‌కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆస్ట్రో ఫిజిక్స్‌లో, నక్షత్రాల వర్ణపటాన్ని వివరించడానికి ఉపయోగపడే ప్రఖ్యాత ‘షా సూత్రాన్ని’ రూపొందిం చారు. సాపేక్ష సిద్ధాంతం మీద ఐన్‌స్టీన్‌, ‌హెర్‌మాన్‌ ‌మిన్‌కోవిస్కీల పరిశోధనాపత్రాలను సత్యేంద్రనాథ్‌ ‌బోస్‌తో కలిసి మేఘనాథ్‌ ‌షా అనువదించారు. అలా అవి భారతీయుల అందుబాటులోకి వచ్చాయి. ఈయన జాతీయవాది మాత్రమేకాదు, రాజకీయ కార్యకలాపాల్లో కూడా పాల్గొన్నారు.

సి.వి. రామన్‌

‌సర్‌ ‌చంద్రశేఖర్‌ ‌వెంకటరామన్‌ ‌గొప్ప భౌతిక శాస్త్రవేత్త మాత్రమే కాదు, నోబెల్‌ ‌బహుమతి పొందిన ఆసియాఖండానికి చెందిన తొలి శాస్త్రవేత్త. డాక్టర్‌ ‌మహేంద్రలాల్‌ ‌సర్కార్‌ ‌ప్రారంభించిన జాతీయవాద సైన్స్ ఉద్యమానికి మొట్టమొదటి ఫలితంగా సి.వి.రామన్‌ను పరిగణిస్తారు. శాస్త్రవిజ్ఞానాన్ని ప్రోత్సహించేందుకు డాక్టర్‌ ‌మహేంద్రాల్‌ ‌సర్కార్‌ ఇం‌డియన్‌ అసోసియేషన్‌ ‌ఫర్‌ ‌కల్టివేషన్‌ ఆఫ్‌ ‌సైన్స్‌ను (ఐఏసీఎస్‌) ‌స్థాపించారు.

నవంబర్‌ 7, 1888‌న సి.వి.రామన్‌, ‌తిరుచిరాపల్లిలో జన్మిం చారు. అప్పట్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా పరిగణించే ఇండియన్‌ ‌ఫైనాన్స్ ‌సర్వీస్‌లో ఫస్ట్ ‌ర్యాంక్‌ ‌సాధించడం ద్వారా అర్హత పొందారు. తర్వాత కలకత్తాలో అసిస్టెంట్‌ అకౌంటెంట్‌ ‌జనరల్‌గా చేరారు. అక్కడ ఆయనకు ఐఏసీఎస్‌తో పరిచయం ఏర్పడటంతో ఖాళీ సమయాల్లో అక్కడ పరిశోధనలు నిర్వహించే వారు. బులిటెన్‌ ఆఫ్‌ ఇం‌డియన్‌ అసోసియేషన్‌ ‌ఫర్‌ ‌ది కల్టివేషన్‌ ఆఫ్‌ ‌సైన్స్ ‌పేరుతో ఒక జర్నల్‌ను ఐఏసీఎస్‌ 1909‌లో ప్రారంభించింది. ఈ జర్నల్‌ ‌ప్రారంభం, నిర్వహణలో సీవీ రామన్‌ ‌కీలకపాత్ర పోషించారు. ఐఏసీఎస్‌లో పనిచేసిన కాలం తన జీవితంలో సువర్ణాధ్యాయమని సి.వి.రామన్‌ ‌చెబుతుండేవారు. 1934లో ఆయన బెంగళూరులో, ఇండియన్‌ అకాడమీ ఆఫ్‌ ‌సైన్స్‌ను స్థాపించి, ‘‘ప్రొసీడింగ్స్ ఆఫ్‌ ‌ది ఇండియన్‌ అకాడమీ ఆఫ్‌ ‌సైన్సెస్‌’’ ‌పేరుతో జర్నల్‌ను నడిపారు. 1943లో ఆయన ట్రావన్‌కోర్‌ ‌కెమికల్‌ అం‌డ్‌ ‌మ్యాన్యుఫాక్చరింగ్‌ ‌కంపెనీ లిమిటెడ్‌ను కూడా నెలకొల్పారు. 1948లో ఆయన బెంగళూరులో రామన్‌ ‌రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ను నెలకొల్పారు. ఇది ప్రాథమిక పరిశోధనలకు ఉద్దేశించినది.

మొత్తమీద చెప్పాలంటే భారతీయ శాస్త్రవేత్తలు జాతీయవాద స్ఫూర్తిని కొనసాగింపజేయడంలో ఎంతో కృషిచేశారని మనకు అర్థమవుతుంది. మనదేశానికి ఒక గుర్తింపు తేవడానికి శాస్త్రవేత్తలు చేసిన అలుపెరుగని కృషి భారత స్వాతంత్య్రోద్యమ చరిత్రలో తగిన స్థానం పొందలేకపోవడం నిజంగా దురదృష్టమనే చెప్పాలి.

అను: జమలాపురపు విఠల్‌రావు

About Author

By editor

Twitter
YOUTUBE