– తురగా నాగభూషణం, సీనియర్ జర్నలిస్ట్
ఆంధప్రదేశ్‌లో తమ పిల్లల భవిష్యత్ గురించి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయకపోవడం, ప్రైవేటురంగంలో ఉద్యోగ అవకాశాలు లేకపోవడం, మద్యం, గంజాయి వంటి దురలవాట్లకు బానిస కావడం, కులం, మతం, వర్గాలుగా విడిపోయి అతివాదులుగా మారడం, అధికార పార్టీ రౌడీయిజం.. ఇవన్నీ రాష్ట్ర యువతరం భవిష్యత్‌పై ప్రభావం చూపిస్తున్నాయి. విద్యలో నవీకరణ లోపించింది. పారిశ్రామిక ప్రగతి సాధించక పోవడంతో స్థానికంగా ఉపాధి లభించడం లేదు. ఆయా రంగాల్లో ఎలా స్థిరపడాలనే మార్గదర్శనం చూపించేవారే కరవయ్యారు. ఉద్యోగ అవకాశాలు రాక, కుర్రాళ్లలో చాలా మందికి పెళ్లిళ్లు కూడా కావడం లేదు. ఏదైనా చిన్నా చితకా ఉద్యోగాలు చేస్తున్నా ఆస్తి లేదని సంబంధాలు కుదరడం లేదు. యువతుల పరిస్థితీ ఇలాగే ఉంది. కట్నం ఇవ్వలేక, నచ్చిన వరుడు దొరక్క వివాహం కాకుండా ఉండిపోతున్న వారి సంఖ్య ఇటీవల బాగా పెరిగింది. యువతకు సరైన దిశానిర్దేశం చేసే నాయకత్వం లేకపోవడమే ఈ పరిస్థితికి కారణం.
సమాజానికి యువతే సంపద. అలాంటి సంపదను చేజేతులారా ప్రభుత్వమే నాశనం చేసుకుంటున్నట్లు నిపుణులు, తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో యువ మోర్చా (బీజేవైఎం) రాష్ట్రంలో నిర్వహించిన యువ సంఘర్షణ యాత్ర ముగింపు సభలో పాల్గొన్న కేంద్ర యువజన, క్రీడల శాఖమంత్రి అనురాగ్‌సింగ్ ఠాకూర్ రాష్ట్రంలోని యువత భవిష్యత్‌పై ఆందోళన వ్యక్తంచేశారు. విచ్చలవిడిగా విస్తరించిన మద్యం, గంజాయి వంటి డ్రగ్ మాఫియాలతో యువత నిర్వీర్యమైపోతోందని వాపోయారు. ఈ పరిస్థితి నుంచి యువతను, రాష్ట్రాన్ని కాపాడాలని ముఖ్య మంత్రికి చేతులెత్తి నమస్కారం చేశారు. కాని ఇదే పరిస్థితి కొనసాగితే భాజపా ఉపేక్షించదని, వైకాపాను ఇంటికే సాగనంపుతుందని కూడా హెచ్చరించారు.
హామీలన్నీ గాలికొదిలారు!
తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2.40 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని పాదయాత్రలో వైఎస్ జగన్ మోహనరెడ్డి హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి అయ్యాక జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటించడంతో యువత ఆశపడ్డారు. టీచర్లు, పోలీసు అధికారులుగా ఉద్యోగాలు సాధించాలనే అభిలాష ఉన్నవారంతా సంతోషపడ్డారు. భారీగా ఖర్చుచేసి కోచింగ్‌లు కూడా తీసుకున్నారు. పలు సందర్భాల్లో, సమీక్షల్లో ముఖ్యమంత్రి చెప్పిన ప్రకారమైతే.. గతేడాది జూలై నుంచి ఈ ఏడాది మార్చి వరకు వరుస నోటిఫికేషన్లు వెలువడి ఉండాలి. కాని అతికొద్ది పోస్టుల ప్రకటనలు వచ్చినట్లు నిరుద్యోగులు విమర్శి స్తున్నారు. 50 వేల టీచర్ పోస్టులు ఖాళీ ఉండగా వాటి భర్తీ ఊసేలేదు. రాష్ట్ర పోలీసు శాఖలో 14,618 ఖాళీలు ఉండగా, కానిస్టేబుల్ ఉద్యోగాలే 12,182 వరకు ఉన్నాయి. కాని వాటి భర్తీ కూడా జరగలేదు. ఏపీపీఎస్సీ ద్వారా గ్రూప్ 1, 2 పోస్టుల భర్తీ జరగడం లేదు. 2021 జూన్‌లో మొత్తం 10,143 పోస్టుల భర్తీకి ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు వెలువడినా ఇందులో వివిధ శాఖల్లోని బ్యాక్‌లాగ్ ఖాళీలు 1,288, వైద్య ఆరోగ్య శాఖకు చెందిన 6,143 పోస్టుల భర్తీ మాత్రమే జరుగుతోంది. కాంట్రాక్టు ఉద్యోగులను పర్మనెంట్ చేస్తామన్నారు. ఆ ఊసే మరిచారు. గతంలో పనిచేసిన ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను తొలగించారు. ఉన్నత విద్యాశాఖ తరఫున ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఖాళీగా ఉన్న 240 లెక్చరర్ పోస్టుల భర్తీ జరగలేదు. విశ్వ విద్యాలయాల్లో 2,000 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. నోటిఫికేషన్ల జారీ జాప్యమయ్యే కొద్దీ వయోపరిమితి దాటి ఎందరో నిరుద్యోగులు అనర్హులుగా మిగిలిపోతున్నారు. ఆయుర్వేద, యునాని, హోమియో వైద్యులు, సర్వే శాఖ అసిస్టెంట్ డైరెక్టర్, అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్, ఇతర పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు ఇచ్చినా భర్తీ పూర్తికాలేదు. కొత్తగా గ్రామ/వార్డు సచివాలయాలు ఏర్పాటుచేసిన ప్రభుత్వం.. వాటిల్లో 1.20 లక్షల మందిని 12 కేటగిరీల్లో నియమించింది. అయితే నిధులు లేకపోవడంతో వీరు ఆయా పంచాయతీల పరిధిలో పనిచేసేందుకు అవకాశం లేకుండా పోయింది. వీరిలో ఒకటి రెండు విభాగాల వారు తప్ప మిగతా వారంతా కార్యాలయాల్లో ఏ పనీ లేక ఖాళీగా ఉంటున్నారని స్థానిక ప్రజలే ఆరోపిస్తున్నారు.
పారిశ్రామిక అభివృద్ధి ఏది?
రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందక పోవడం కూడా యువత ఉద్యోగావకాశాలపై ప్రభావం చూపిస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఒక్క విశాఖలో తప్పించి మిగతా జిల్లాల్లో పారిశ్రామిక అభివృద్ధి జరగలేదు. రాష్ట్రం విభజించాక పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలనే తలంపుతో కేంద్రం రాష్ట్రానికి పలు పారిశ్రామిక సమూహాలను కేటాయించింది. విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్, కాకినాడ పెట్రోకెమికల్ సమూహం, ప్రకాశం జిల్లాలో పారిశ్రామిక క్లస్టర్, శ్రీకాళహస్తి ఎలక్ట్రానిక్స్ పారిశ్రామిక క్లస్టర్, బెంగుళూరు-చెన్నై పారిశ్రామిక క్లస్టర్, శ్రీసిటి పారిశ్రామిక సమూహం ఇలా పలు రకాల సమూహాలు కేటాయిస్తే వీటికి భూసేకరణ చేయకపోవడంతో పరిశ్రమలు ఏర్పడక, యువతకు ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయి. వీటిలో సగం ఏర్పాటైనా 10 లక్షల మందికి పైగా ఉద్యోగాలొచ్చేవి.
కరోనా నేపథ్యంలో ప్రపంచం మొత్తం ఆర్థిక సమస్యల్లో చిక్కుకోగా, రాష్ట్రంలోని పరిస్థితులు పరిశ్రమల నిర్వహణకు ఏ మాత్రం అనుకూలంగా లేవు. రాష్ట్రంలో కొనసాగుతున్న రాచరిక పాలన, రౌడీయిజం, పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టుకుని చేస్తున్న అరాచకంతో హింస పెరుగుతోంది. శాంతి కొరవడింది. స్థిరపడిన పరిశ్రమలను దౌర్జన్యంతో అయినా చేజిక్కించుకోవాలనే ఆలోచనతో అధికార పార్టీ నాయకులు చేసిన ప్రయత్నాలు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను భయకంపితులను చేశాయి. కొత్తగా పరిశ్రమలను ఏర్పాటు చేయాలనుకునే ఇతర దేశాలు, రాష్ట్రాలకు చెందిన సీనియర్ పారిశ్రామిక వేత్తలు కూడా ఈ పరిస్థితులను గమనించి వెనుకంజ వేశారు. పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని గతంలో చేసుకున్న ఒప్పందాలను రద్దుచేసుకుని తీసుకున్న అనుమతులు కూడా వదిలేస్తున్నారు. ఇసుకకు వ్యూహం ప్రకారం కొరత సృష్టించడం, అమరావతిని కాదని, మూడు రాజధానులను నిర్మిస్తామనడం, అప్పులపాలైన పరిస్థితుల్లో నిధులు లేకపోవడంతో నిర్మాణరంగం కుదేలైపోయింది. రియల్ ఎస్టేట్ వ్యాపారం నిలిచిపోయింది.
అన్ని రంగాలు కుదేలు!
ఈ పరిస్థితులన్నీ పలు రంగాలపై ప్రతికూల ప్రభావం చూపాయి. ముఖ్యంగా నిర్మాణరంగం కుదేలైపోవడంతో ఇంజనీరింగ్ రంగం కకావికలమై పోయింది. ఇంజనీరింగ్ కళాశాలల్లో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ విభాగాల్లో ఉపాధి అవకాశాలు లేక బ్రాంచిలే మూసేస్తున్నారు. మూడేళ్లుగా సుమారు 30 వేల సీట్లు తీసేశారు. ఆదరణ పొందిన ఇంజనీరింగ్ కళాశాల్లో కూడా సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ విభాగాల్లో ఎవరూ చేరడం లేదు. ఇలా తీసివేయడంతో అక్కడ పనిచేసే సిబ్బంది నిరుద్యోగు లైపోతున్నారు. పాలిటెక్నిక్, ఐటీఐ కోర్సుల్లో చేరేవారే కరవయ్యారు. మూసివేసిన సంస్థల్లో పనిచేసిన ఇన్‌స్ట్రక్టర్లు, అధ్యాపకులు ఉద్యోగాలు లభించక కూరగాయలు అమ్ముకుంటున్నారు. కంప్యూటర్ కోర్సుల్లో ఆదరణ ఉన్నా కెరీర్ గైడెన్స్ లేక సగం మందికి ఉద్యోగాలు రావడం లేదు. వచ్చినా అందరూ హైదరాబాద్, బెంగళూరు, లేదా చెన్నై వెళ్లాల్సి వస్తోంది. కంప్యూటర్ కోర్సులు కాక ఇతర బ్రాంచీల్లో చదివిన వారు ఉద్యోగాలు లేక ఖాళీగా ఉంటున్నారు. ఉపాధి అవకాశాల లేమి నిరుద్యోగు లను మరింత నిరాశకు గురిచేస్తోంది. ఇక రాష్ట్రంలో మద్యం, గంజాయి, డ్రగ్స్ మాఫియా వేళ్లూనుకొని యువతను మత్తుకు బానిసను చేస్తోంది. కళాశాలలు, స్కూళ్లను సైతం కేంద్రంగా చేసుకుని గంజాయి, డ్రగ్స్ అమ్ముతున్నారు. దీనికి అలవాటు పడిన యువత నిర్వీర్యమైపోతున్నారు. కళ్ల ముందు ఇంత జరుగుతుంటే రాష్ట్రంలోని యువత తల్లిదండ్రులు ఏ రకంగా ప్రశాంతంగా ఉండగలరు. వారికి నిత్యం ఆందోళనగానే ఉంది.