– చొప్పరపు కృష్ణారావు, 8466864969, సీనియర్ జర్నలిస్ట్ –
విశ్వ క్రీడాభిమానులను ఎంతగానో అలరించిన కామన్వెల్త్ గేమ్స్-2022కు బర్మింగ్‌హామ్ అలెగ్జాండర్ స్టేడియంలో తెరపడింది. అలనాటి ఆంగ్లపాలిత 72 దేశాలకు చెందిన అథ్లెట్లు ఈ క్రీడాసమరంలో పాల్గొన్నారు. 4 వేల 500 మంది అథ్లెట్ల నడుమ సాగిన ఈ క్రీడలు అట్టహాసంగా ముగిశాయి. భారత్ 22 స్వర్ణాలతో సహా మొత్తం 61 పతకాలతో నాలుగో స్థానంలో సగర్వంగా నిలిచింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేళ భారత యువ అథ్లెట్లు వెయిట్ లిఫ్టింగ్, బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్, బాక్సింగ్, కుస్తీ, టీటీ లాంటి క్రీడల్లో మెరుపులు మెరిపించారు. తమ అసాధారణ ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పారు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, కెనడా, భారత్, న్యూజిలాండ్ పతకాల పట్టిక మొదటి ఐదు స్థానాలలో వరుసగా నిలిచాయి.
గత కామన్వెల్త్ గేమ్స్ పతకాల పట్టిక మూడో స్థానంలో నిలిచిన భారత్ ప్రస్తుత బర్మింగ్‌హామ్ క్రీడల్లో నాలుగో స్థానంలో నిలవడం ద్వారా పలు రకాల క్రీడల్లో తన ఆధిపత్యాన్ని, ప్రత్యేకతను చాటుకోగలిగింది. 108 మంది పురుషులు, 107 మంది మహిళలతో కూడిన 215 మంది సభ్యులతో 16 రకాల క్రీడాంశాలలో పోటీకి దిగిన భారత్ 22 స్వర్ణ, 16 రజత, 23 కాంస్యాలతో సహా మొత్తం 61 పతకాలు సాధించింది. నాలుగేళ్ల క్రితం గోల్డ్ కోస్ట్ వేదికగా ముగిసిన 2018 కామన్వెల్త్ గేమ్స్‌లో భాగంగా నిర్వహించిన షూటింగ్, విలువిద్య లాంటి ప్రధాన క్రీడల్ని బర్మింగ్‌హామ్ గేమ్స్ నుంచి తొలగించడం భారత్‌ను గణనీయంగా దెబ్బతీసింది. గత క్రీడల్లో భారత్ సాధించిన మొత్తం 66 పతకాలలో కేవలం షూటింగ్ ద్వారానే 16 పతకాలు రావడం విశేషం. షూటింగ్‌ను క్రీడల జాబితా నుంచి తప్పించడంతో భారత పతకాల సంఖ్యతో పాటు పతకాల పట్టిక మూడు నుంచి నాలుగో స్థానానికి పడిపోక తప్పలేదు.
మోదీ ముందుచూపుతో ఫలాలు
ప్రధాని నరేంద్ర మోదీ ముందుచూపుతో గత కొద్ది సంవత్సరాలుగా అమలు చేస్తున్న ఖేలో ఇండియా పథకం ద్వారా వెలుగులోకి వచ్చిన పలువురు యువక్రీడాకారులు బంగారు పతకాలతో దేశానికే గర్వకారణంగా నిలిచారు. కేవలం రెండుపదుల వయసులోనే పతక విజేతలుగా నిలిచారు. వెయిట్ లిఫ్టర్లు జెర్మీలాల్ రినుంగా, అచింత షియోలీ, సంకేత్ సర్గార్, బాక్సింగ్‌లో నిఖత్ జరీన్, బ్యాడ్మింటన్‌లో లక్ష్యసేన్, టేబుల్ టెన్నిస్‌లో ఆకుల శ్రీజ, అథ్లెటిక్స్‌లో తేజస్వినీ శ్రీశంకర్ (పురుషుల హైజంప్), మురళీ శ్రీశంకర్ (లాంగ్ జంప్), ఎల్దోసీ పాల్, అబ్దుల్ అబుబాకర్ (ట్రిపుల్ జంప్) పతకాలు నెగ్గడం ద్వారా చరిత్ర సృష్టించారు. వీరంతా ఖేలో ఇండియా, టాప్ పథకాల ద్వారా అంతర్జాతీయ అథ్లెట్లుగా తెరమీదకు వచ్చినవారే. 20 సంవత్సరాల వయసు మించకుండానే దేశానికి స్వర్ణ, రజత పతకాలు సాధించే స్థాయికి ఎదగడం వెనుక ప్రధాని మోదీ దార్శనికత ఎంతైనా ఉందని చెప్పక తప్పదు.
అరుదైన క్రీడల్లో ‘అద్భుతాలు’
కుస్తీ, బాక్సింగ్, వెయిట్ లిఫ్టింగ్, టీటీ, బ్యాడ్మింటన్ లాంటి సాంప్రదాయ క్రీడల్లో భారత్ పతకాలు సాధించడం సాధారణ విషయమే. అయితే, బర్మింగ్‌హామ్ గేమ్స్‌లో భాగంగా నిర్వహించిన లాన్ బౌల్స్ క్రీడ పురుషుల, మహిళల విభాగాలలో భారత్ అనూహ్యంగా రజత, స్వర్ణ పతకాలు సాధించి సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. తొలిసారిగా ప్రవేశపెట్టిన మహిళా టీ-20 క్రికెట్లో సైతం హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారతజట్టు రజత పతకంతో దేశానికే గర్వకారణంగా నిలిచింది. పురుషుల ట్రిపుల్ జంప్ స్వర్ణ, రజత పతకాలను భారత అథ్లెట్లే సొంతం చేసుకోవడం, బ్యాడ్మింటన్ మహిళల, పురుషుల సింగిల్స్, పురుషుల డబుల్స్‌లో బంగారు పతకాలు సాధించడం, టేబుల్ టెన్నిస్ పురుషుల సింగిల్స్, టీమ్ విభాగాలతో పాటు మిక్సిడ్ డబుల్స్‌లో స్వర్ణపతకాలు, స్క్వాష్ పురుషుల సింగిల్స్‌లో సౌరవ్ గోశాల్ కాంస్య పతకాలు సాధించడం అరుదైన ఘనతగా మిగిలిపోతుంది.
40 ఏళ్ల వయసులో శరత్.. కమాల్!
టేబుల్ టెన్నిస్‌లో తెలుగుతేజం శరత్ కమల్ గత రెండు దశాబ్దాలుగా జరిగిన ఐదు (2006, 2010, 2014, 2018, 2022) కామన్వెల్త్ గేమ్స్‌లో ఏదో ఒక పతకం సాధిస్తూ అరుదైన రికార్డును నెలకొల్పాడు. 24 సంవత్సరాల వయసులో పురుషుల సింగిల్స్‌లో తొలి బంగారు పతకం అందుకొన్న శరత్.. 40 సంవత్సరాల లేటు వయసులో సైతం స్వర్ణపతకం సాధించడం ద్వారా తనకు తానే సాటిగా నిలిచాడు. బర్మింగ్‌హామ్ గేమ్స్‌లో శరత్ పురుషుల టీమ్, మిక్సిడ్ డబుల్స్, పురుషుల సింగిల్స్ విభాగాలలో బంగారు పతకాలు సాధించడం ద్వారా తనకు తానే సాటిగా నిలిచాడు. గత 20 సంవత్సరాలలో శరత్ ఒక్కడే 13 కామన్వెల్త్ గేమ్స్ పతకాలు సాధించడం ద్వారా ఈ ఘనత దక్కించు కున్న భారత తొలి క్రీడాకారుడిగా నిలిచాడు.
బ్యాడ్మింటన్‌లో సింధు, కుస్తీలో వినేశ్ పోగట్
గత మూడు కామన్వెల్త్ (2014, 2018, 2022) గేమ్స్‌లో పాల్గొంటూ వస్తున్న బ్యాడ్మింటన్ క్వీన్ పీవీ సింధు మహిళల సింగిల్స్‌లో ఎట్టకేలకు బంగారు పతకం సాధించింది. 2014 గేమ్స్‌లో కాంస్య, 2018 గేమ్స్‌లో రజతాలు సాధించిన సింధు 2022 గేమ్స్‌లో తన స్థాయిని గోల్డ్ మెడల్‌కు పెంచుకోగలిగింది. మొత్తం మీద ఐదు పతకాలతో శరత్ కమల్ తర్వాతి స్థానంలో కొనసాగుతోంది. మహిళల కుస్తీ 53 కేజీల విభాగంలో వినేశ్ పోగట్ వరుసగా మూడో కామన్వెల్త్ గేమ్స్ బంగారు పతకం గెలుచుకోడం ద్వారా అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. 2014, 2018, 2022 కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకాలు సాధించిన భారత ఏకైక, తొలి వస్తాదు, మహిళ వినేశ్ పోగట్ మాత్రమే.
హాకీలో రజతం, కాంస్యాలతో సరి
భారత జట్లు పురుషుల హాకీలో రజత, మహిళల హాకీలో కాంస్య పతకాలు సాధించాయి. పురుషుల ఫైనల్లో, మహిళల సెమీఫైనల్లో భారత జట్లు ఆస్ట్రేలియా చేతిలోనే పరాజయాలు పొందాయి. షూటింగ్ క్రీడను రద్దు చేయటంతో ఏర్పడిన పతకాల లోటును అథ్లెటిక్స్, లాన్ బాల్స్, వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారులు పూడ్చడం ద్వారా భారత్‌ను పతకాల పట్టిక నాలుగో స్థానంలో నిలపగలిగారు. భారత బృందం అత్యంత విజయవంతమైన, సంతృప్తికరమైన ఫలితాలు సాధించిన కామన్వెల్త్ గేమ్స్‌ల్లో బర్మింగ్ హామ్ క్రీడలు సైతం మిగిలిపోతాయి.
సత్తా చాటిన తెలుగు రాష్ట్రాల అథ్లెట్లు
ఈ కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌ను పతకాల పట్టిక నాలుగో స్థానంలో నిలపడంలో తెలుగు రాష్ట్రాల అథ్లెట్లు సైతం కీలక పాత్ర పోషించారు. తెలంగాణ, ఏపీకి చెందిన పలువురు అథ్లెట్లు బంగారు పతకాలతో దేశానికి, తెలుగు రాష్ట్రాలకే గర్వకారణంగా నిలిచారు. బ్యాడ్మింటన్ పురుషుల, మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు, గాయత్రీ గోపీచంద్, కిడాంబి శ్రీకాంత్, రంకిరెడ్డి సాయిరుత్విక్, బాక్సింగ్‌లో నిఖత్ జరీన్, హుసాముద్దీన్, టేబుల్ టెన్నిస్‌లో ఆచంట శరత్ కమల్, ఆకుల శ్రీజ, మహిళా క్రికెట్లో మేఘన రెడ్డి, మహిళల హాకీలో ఎతిమరపు రజనీ ప్రాతినిథ్యం వహించారు. వీరిలో హుసాముద్దీన్ మినహా మిగిలిన క్రీడాకారులంతా ఏదో ఒక పతకంతో స్వదేశానికి తిరిగి వచ్చారు. బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్ కాంస్య, పురుషుల డబుల్స్‌లో సాయి సాత్విక్ బంగారు పతకాలు అందుకొన్నారు. మహిళల డబుల్స్‌లో గాయత్రీ గోపీచంద్ కాంస్య పతకం సాధించింది.
నిఖత్ పసిడి పంచ్
మహిళల బాక్సింగ్ 50 కిలోల విభాగంలో తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ బంగారు పతకం సాధించడం ద్వారా కామన్వెల్త్ బాక్సింగ్‌లో పతకం సాధించిన తెలుగు రాష్ట్రాల తొలి మహిళా బాక్సర్‌గా నిలిచింది. టేబుల్ టెన్నిస్ మహిళల మిక్స్‌డ్ డబుల్స్‌లో శరత్‌తో జంటగా హైదరాబాద్ ప్లేయర్ ఆకుల శ్రీజ బంగారు పతకం అందుకుంది. కామన్వెల్త్ గేమ్స్‌లో తొలిసారిగా ప్రవేశపెట్టిన మహిళా టీ-20 క్రికెట్లో హైదరాబాద్‌కు చెందిన మేఘనరెడ్డి సైతం భారత జట్టులో సభ్యురాలిగా రజత పతకం అందుకుంది. మహిళల హాకీలో కాంస్య పతకం సాధించిన భారతజట్టులో ఎతిమరుపు రజనీ గోల్ కీపర్‌గా వ్యవహరించింది. మొత్తం ఐదురకాల క్రీడాంశాలలో పాల్గొన్న తెలుగు రాష్ట్రాల క్రీడాకారులు బంగారు పతకాలతో దేశానికే గర్వకారణంగా నిలిచారు. పోటీల ప్రారంభ వేడుకల్లో భారత జట్టుకు పీవీ సింధు పతాకధారిగా వ్యవహరిస్తే ముగింపు వేడుకల్లో నిఖత్ జరీన్, శరత్ కమల్ పతాకధారు లుగా వ్యవహరించడం అరుదైన ఘనతగా మిగిలి పోతుంది. భారత్ జనాభాపరంగా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశం. అలనాటి బ్రిటిష్ పాలిత సమాఖ్యలో అతిపెద్దది. అయితే, గత ఏడు దశాబ్దాలుగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ పతకాల పట్టిక మొదటి రెండు స్థానాలలో భారత్ చోటు సంపాదించలేక పోతోంది. బర్మింగ్‌హామ్ వేదికగా ముగిసిన 2022 కామన్వెల్త్ గేమ్స్ పతకాల పట్టిక నాలుగో స్థానంలో నిలవడం ద్వారా భారత్ ఊపిరి పీల్చుకొంది. కామన్వెల్త్ గేమ్స్‌లో మొత్తం 72 దేశాల జట్లు పాల్గొంటే 44 దేశాలు మాత్రమే ఏదో ఒక పతకం నెగ్గి పతకాల పట్టికలో చోటు సంపాదించడం ద్వారా తమ ఉనికిని కాపాడుకోగలిగాయి.
మొత్తం 61 పతకాలు
మొత్తం 19 క్రీడాంశాలలో పోటీలు నిర్వహిస్తే, భారత అథ్లెట్ల బృందం 16 క్రీడాంశాల బరిలో నిలిచింది. కుస్తీ, బ్యాడ్మింటన్, బాక్సింగ్, టేబుల్ టెన్నిస్, ట్రాక్ అండ్ ఫీల్డ్ అంశాలలో సత్తా చాటు కోడం ద్వారా భారత్ మొత్తం 61 పతకాలు సాధించింది. ఇందులో 22 స్వర్ణ, 16 రజత, 23 కాంస్య పతకాలు ఉన్నాయి.
సింధు పేరుతో 200వ స్వర్ణం
1930 నుంచి కామన్వెల్త్ గేమ్స్ నిర్వహిస్తుంటే, భారత్ 1934 నుంచి మాత్రమే పాల్గొంటూ వస్తోంది. 1934లో భారత మల్లయోధుడు రషీద్ అన్వర్ దేశానికి తొలి పతకాన్ని (కాంస్యాన్ని ) అందించాడు. అదే భారత్ సాధించిన తొలి కామన్వెల్త్ గేమ్స్ పతకంగా రికార్డుల్లో నమోదయింది. అయితే, కాంస్య పతకం నుంచి బంగారు పతకం సాధించడానికి భారత్‌కు 24 సంవత్సరాల సమయం పట్టింది. 1958లో జరిగిన కార్డిఫ్ కామన్వెల్త్ గేమ్స్‌లో దిగ్గజ అథ్లెట్ మిల్కాసింగ్.. దేశానికి తొలి స్వర్ణ పతకాన్ని అందించాడు. అప్పట్నుంచి భారత్ ప్రతి కామన్వెల్త్ గేమ్స్‌లో తన బంగారు పతకాల సంఖ్యను పెంచు కుంటూ వస్తోంది. ప్రస్తుత కామన్వెల్త్ గేమ్స్ ఆఖరి రోజు పోటీల్లో బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్‌లో సింధు సాధించిన బంగారు పతకం, కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ గెలుచుకొన్న 200వ స్వర్ణంగా నమోదయింది.
విజయవంతైన జట్టుగా భారత్..
కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలో నాలుగో అత్యంత విజయవంతమైన జట్టుగా భారత్ నిలిచింది. 1934 నుంచి 2022 వరకూ జరిగిన క్రీడల్లో భారత్ మొత్తం 564 పతకాలు సాధించింది. ఇందులో 203 స్వర్ణ, 189 రజత, 172 కాంస్య పతకాలు ఉన్నాయి. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, కెనడా తర్వాత అత్యంత విజయవంతమైన జట్టుగా భారత్ నిలిచింది.