పరపాలకులపై  కలం దూసిన కవి. ఎలాంటి ప్రలోభాలకు లొంగని దేశభక్తుడు చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులు. భావస్వేచ్ఛకు ప్రాధాన్యం ఇచ్చిన  పాత్రికేయుడు. పత్రిక నిర్వహణకు బ్రిటిష్‌ ‌ప్రభుత్వం ఇవ్వజూపిన రాయితీలు, ప్రోత్సాహకాలను నిరాకరించిన నిబద్ధతగల పత్రికా రచయిత. అవిటితనం (రేచీకటి) లక్ష్యసాధనకు అవరోధం కాబోదనే దానిని నిజం చేసిన సాహితీవేత్త. ఏకసంథాగ్రాహియై రాయసగాళ్ల సహాయంతో రచనా వ్యాసంగాన్ని కొనసాగించారు.

‘భరత ఖండంబు చక్కని పాడి యావు

హిందువులు లేగ దూడలై ఏడ్చుచుండ

తెల్ల వారను గడుసరి గొల్లవారు

పితుకుచున్నారు మూతులు బిగియగట్టె’.. అని ఆశువుగా చెప్పిన ఈ చిన్న పద్యంలో, ఆనాటి బ్రిటిష్‌ ‌వారి దోపిడీ వ్యవస్థను, భారతీయుల న్యాయమైన స్వాతంత్య్ర కాంక్షను బాహాటంగా వెల్లడించిన స్వాతంత్య్ర పిపాసి కళాప్రపూర్ణ, చిలకమర్తి లక్ష్మీ నరసింహం పంతులు. అంతేకాక నాటి సామాజిక వ్యవస్థను 1895 కాకినాడలో జరిగిన మొదట గోదావరి మండలసభలో ఈ విధంగా వ్యక్తీకరించారు.

నేల దున్నుదమన్న బేల తరము పన్ను

               నీరు గావలెనన్న నీటి పన్ను

వాణిజ్య మొనరింపవచ్చు బడికి పన్ను

               సరుకులమ్ముదమన్న సంతపన్ను

కర్రలమ్ముదమన్న గలపకింకొక పన్ను

               పట్టణంబుల మున్సిపాలు పన్ను

పారిపోవుదమన్న బండి హాసీల్‌ ‌పన్ను

               కొంపమ్ము కొన్నచో స్టాంపు పన్ను

ఉన్న మట్టుకు తినకుండ నుప్పు పన్ను

               ననెడు పన్నులె దిగదీసె జనుల నెల్ల

కటకటా! యెట్టులున్నదో కాపుల దశ

               సుగుణ ధనులార జనులారా చూడరయ్యా

అధికార భూతంబులడుగు లంచములిచ్చి

               పరిపరి విధములౌ పన్నులిచ్చి

మునసబు కరణాల ముడుపులన్నియునిచ్చి

               కోసినూర్చిన వారి కూలినిచ్చి

కచ్చేరి బంట్రోతు గముల కీనామిచ్చి

               పాలేళ్లకును కొంత పంటనిచ్చి

యజమానునకు బంట నర్ధ భాగంబిచ్చి

               పైకమిచ్చిన వాని వడ్డినిచ్చి

గడ్డి మాత్రమే మిగిలించు కాపు వారు

సేద్యమున దాను పశులు భక్షించు కొరకు

కటకటా ఎట్టులున్నదో గాపుల దశ

సుగుణ ధనులారా జనులారా చూడరయ్యా

ఈ రెండు పద్యాలు : ఒకటి పన్నుల భారం మీద, రెండవది కౌలుదార్ల దుస్థితి మీద . ఈ సమస్యలు ఎప్పటివి? దశాబ్దాలు గడిచినా ఈనాటి సమస్యలే కదా!

పండిత లోకం మొదలుకొని, పామరుల వరకు తన కవితా శక్తితో అలరించిన చిలకమర్తి  సెప్టెంబర్‌ 26, 1867 ‌తేదీన పశ్చిమ గోదావరి జిల్లా ఖండపల్లి గ్రామంలో మేన మామగారింట జన్మించారు. వీరి స్వగ్రామం అదే జిల్లాలోని వీరవాసరం.

1832 సంవత్సరంలో ఆంధ్రదేశంలో భయంకరమైన కరవు సంభవించింది. అదే నందన సంవత్సర కరవని ప్రతీతి. ఆ కరవు వల్లనే వీరి పితామహులు పశ్చిమ గోదావరి జిల్లాకు వలస వచ్చారు.

చిలకమర్తిది పేద కుటుంబం. అందువల్ల ఆయన చిన్నప్పుడు విద్యాభ్యాసానికి అష్టకష్టాలు పడవలసి వచ్చింది. ఆయన విద్యాభ్యాసం వీర వాసరం, నరసాపుర, రాజమండ్రిలోనూ సాగింది.

1881 సంవత్సరంలో వీరవాసరంలో చదువుకునేటప్పుడు ఒక పూటకూళ్లింట భోజనం చేసేవారు. రోజుకు మూడు పూటలా భోజనానికి నెలకు మూడు రూపాయల• చెల్లించవలసి వచ్చేది. రూపాయికి ఆరు కుంచాల (కుంచం నాలుగుకిలోలు) బియ్యం దొరి•కేవట. వీశ (14 వందల గ్రాములు) నెయ్యి ఖరీదు ముప్పావులా(నేటి 75 పైసలు). నేటి ధరలతో పోలిస్తే, అవి చాలా అల్పమైనవనిపించవచ్చు కానీ, అప్పటి జీవనప్రమాణం, ఆర్జన కోణంలో అప్పటికి ఎక్కువేనని చెబుతారు.

నరసాపురంలో చదువుకునే రోజుల్లో ఆయన నెలకు రూపాయన్నరతో ఒంటిపూట మాత్రమే భోజనం చేసి, రెండవ పూట ఒక కాణీతో (రూపాయికి 64 కాణీలు) రెండు మినప గారెలు తిని, మంచినీళ్లతో కడుపు నింపుకునేవారు. మెట్రిక్యులేషన్‌ ‌పరీక్ష రాసిన తర్వాత పంతులు గారు నిరుద్యోగిగా కటిక దారిద్య్రాన్ని అనుభవించారు. పద్యాలు రాసి నెలకు నాలుగైదు రూపాయలు సంపాదించి దానితోనే కాలక్షేపం చేసేవారు. ఆ పిమ్మట 1892 సంవత్సరంలో రాజమండ్రిలోని ఇన్నిస్‌పేట మిడిల్‌ ‌స్కూల్లో నెలకు పన్నెండు రూపాయల వేతనానికి ఉపాధ్యాయుడిగా చేరారు.

చిలకమర్తికి చిన్ననాట నుంచీ దృష్టి లోపం ఉంది. కానీ ఆయన పుట్టంధులు మాత్రం కాదు. పగలు మాత్రమే కనిపించేది (రేచీకటి). 1910 నుండి అంటే ఆయనకు 44 సంవత్సరాల వయసులో రేచీకటి ముదిరి పగలు సైతం కనిపించేది కాదు. అప్పటి నుంచీ రాత పనికి ఇతరులపై ఆధారపడవలసి వచ్చింది.

రాజమహేంద్రవరంలో గుండు గారి వీధి ప్రక్కన ఉండేది వారి ఇల్లు. ఆ వసారాలో ఒక పెద్ద కర్ర పడక కుర్చీలో పడుకుని రెండే రెండు తాళం చెవులున్న రింగుతో టకటకమని చప్పుడు చేస్తూ రచనా వ్యాసంగం కొనసాగించేవారు. ఆయన చెప్పింది రాయడానికి కుర్చీ పక్కనే చాపమీద తెల్ల కాగితాలు, కలం, సిరాబుడ్డితో ఒక వ్యక్తి కూర్చునేవాడు.

పంతులు గారి వాగ్ధోరణి గంగా ప్రవాహంలా ఒక గంటో, రెండు గంటలో సాగి ఠపీమని ఆగిపోయేది. ‘అబ్బాయీ! పేజీకి ఎన్ని పంక్తులు వచ్చాయిరా? ’ అని అడిగేవారు రాసే వ్యక్తినుద్దేశించి.

‘ఇరవై పంక్తులు’ అని చెప్ప్డగానే, ‘అయితే చూడు! 5వ పేజీలో 15వ పంక్తిలో ఫలానా మాట ఇలా మార్చు! 16వ పేజీలో 10వ పంక్తిలో ఆ వాక్యం ఇలా తిప్పి రాయి’ అని చెప్పేవారు. ఆ అంచనా ప్రకారం సరిగ్గా ఆయా పేరాల్లో ఆయా మార్పులు జరిగేవి. ఆయన మేధాశక్తి చూపరులను ఆశ్చర్యపరచేది. అందుకే శ్రీమతి సరోజినీదేవి వీరిని ‘ది బ్లైండ్‌ ‌బాల్ట్ ఆఫ్‌ ఆం‌ధ్రదేశ్‌’ అని అభివర్ణించారు.

చిలకమర్తి వారికి హరిజనుల పట్ల ప్రత్యేక వాత్సల్యముండెది. ఆయన తన స్వీయ చరిత్రలో ‘అగ్రజాతులమని’ విర్రవీగుతున్న బ్రహ్మ, క్షత్రియ, వైశ్య, శూద్రులు… పంచములు మొదలైన నిమ్న జాతుల చేత తమకు కావలసిన సేవలన్నియు చేయించుకుని వారిని ఇండ్లకు రానీయక, దరి చేరనీయక యంటరాని వారనియు, చెప్పరాని వారనియు, వారికి అసహ్యములైన పేర్లు పెట్టి హీనముగా చూస్తున్నారు. పశువులు మన ఇంట నుండవచ్చును. కాని పంచములు మట్టుకు మన గృహావరణములోనికి రాకూడదు. వారును భగవంతునితో సృష్టింపబడిన మనుష్యులే అనియు, అగ్రవర్ణముల వారికున్నట్లే వారికి కూడా క్షుత్పిపాసలు సుఖ దుఃఖములు గలవనియూ మనవారు తలంపరు’ అని పేర్కొన్నారు. హరిజన బాలుర చదువు కోసం రామమోహన పాఠశాలను ప్రారంభించారంటే (1909) వారి సంఘ సంస్కరణాభిలాష ఎంత ప్రగాఢమైనదో విశదమౌతుంది.

 చిలకమర్తి సనాతన ఛాందస కుటుంబంలో జన్మించినప్పటికీ గొప్ప సంఘ సంస్కర్త.

1904 సంవత్సరంలో టంగుటూరి ప్రకాశం పంతులు లండన్‌లో బారిస్టరీ చదివి తిరిగి వచ్చినప్పుడు చికలమర్తి, మరికొందరు మిత్రులు ఆయనకు విందు ఇచ్చారు. అయితే ప్రకాశం సహా ఆ విందులో పాల్గొన్న వారందరిని సంఘ బహిష్కరణ చెయ్యాలంటూ రాజమహేంద్రవరంలోని పెద్దలు కొందరు అభినవ విరూపాక్ష పీఠాధిపతికి ఫిర్యాదు చేసినా పంతులు గారు మాత్రం దానికి ఖాతరు చెయ్యలేదు.

బ్రిటిష్‌ ‌ప్రభుత్వం ఇచ్చే బిరుదులకు, ఆదర సత్కారాలకు లొంగని స్వాతంత్య్ర ప్రేమికుడు చిలకమర్తి. బ్రిటిష్‌ ‌సామ్రాజ్యవాదులు పత్రికలకు పెద్ద మొత్తంలో చందాలిచ్చి ఆయా పత్రికలను తమ చెప్పుచేతలలో పెట్టుకునేవారు. ఆ క్రమంలోనే ఆయన నిర్వహిస్తున్న ‘దేశమాత’ పత్రికకు కూడా సంవత్సరానికి తొమ్మిది వేల రూపాయలు సబ్సిడీ ఇస్తామని ఆ ప్రభుత్వం ప్రకటించింది.

దీనిని చిలకమర్తి దానిని తిరస్కరించి తమ స్వీయ చరిత్రలో… ‘నా పత్రిక ‘దేశమాత’ను దొరతనము వారి కిచ్చుట నాయాత్మనమ్ము కొనటయే. ధనమునకై బానిసగ నుండట నా కిష్టము లేదు. నా మిత్రులు కొందరు దరిద్రుడైన నీవు సంవత్సరమునకు కొన్ని వేల రూపాయలొచ్చెడి యవకాశము చెడగొట్టుకొనుకున్నావని నన్ను చీవాట్లు పెట్టిరి. అయినను వారి యుపదేశములు నా తల కెక్కలేదు. పత్రికా విషయమున నేను స్వతంత్రుడనై కఠినముగ విమర్శింప వలసినప్పుడు విమర్శించుటకు , శ్లాఘింపవలసి వచ్చినప్పుడు శ్లాఘించుట మొదలైన యధికారములు కలిగి యుండవలెను. కాని ఎల్లప్పుడు దొరతనము వారిని శ్లాఘించుట నీచమని తలంచి నా లాభమును నిరాకరించితిని’ అని రాశారు.

కవిగా, నవలా రచయితగా, నాటక కర్తగా, ప్రజా సేవకుడిగా, సంఘ సంస్కర్తగా, ఆంధ్రదేశానికి ఎనలేని సేవలందించిన చిలకమర్తి లక్ష్మీ నరసింహంను ఆంధ్ర విశ్వకళా పరిషత్‌ ‌కళాపరిపూర్ణతతో సత్కరించింది. 1946 జూన్‌ 17‌వ తేదీన తమ 79వ ఏట కన్నుమూశారు.

– అంగర కృష్ణారావు, 7780478710

About Author

By editor

Twitter
YOUTUBE