చావనైనా చస్తా కానీ మళ్లీ లాలూతో కలవనన్నారు. కానీ నిర్లజ్జగా చేతులు కలిపేశారు. అవినీతిని వ్యతిరేకించే సుశాసన్‌ ‌బాబుగా తెచ్చుకున్న పేరు కాస్తా ఘొటాలా, భ్రష్టాచారీలతో కలసిపోయి చెడగొట్టేసుకున్నారు. అవకాశవాదంతో బీజేపీకి దూరమై, ఆర్జేడీకి దగ్గరై తన పునాదులను తానే పడగొట్టుకున్నారు. ఆయనే బిహార్‌ ‌ముఖ్యమంత్రి నితీశ్‌ ‌కుమార్‌. ‌తన రాజకీయ జీవిత చదరంగంలో ఆయన ఇప్పటి దాకా వేసిన ఎత్తులు ఒకెత్తైతే, ఇప్పుడు పల్టీ మాస్టార్‌గా తనకు తానే చెక్‌ ‌పెట్టుకున్నారు. బీజేపీ ఎదుగుదలను చూసి ఓర్వలేకపోతున్న జేడీయూ నేత నితీశ్‌ ‌తప్పుడు అంచనాలతో రాజకీయంగా సమాధైపోతున్నారనే చెప్పక తప్పదు.


అనూహ్య పరిణామమే కానీ ఊహించనిదేమీ కాదు. వారాల్లో అవుతుందనుకున్న పని రోజుల్లోనే పూర్తయింది. విపక్షం ఎంత ఆనందపడిందో, అధికార పక్షం అంతే ఉపశమనం పొందడం విశేషం. అత్యాశతో ఏదో ఊహించి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, అంతలోనే వాస్తవం బోధపడి ఆ నిర్ణయాలను మళ్లీ మార్చుకోవడం కొత్తేమీ కాదు. బిహార్‌ ‌ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశానని, ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చేశానని జనతా దళ్‌ (‌యునైటెడ్‌) ‌సీనియర్‌ ‌నేత నితీశ్‌ ‌కుమార్‌ ఆగస్ట్ 9‌న ప్రకటించేశారు. మరునాడే 8వ సారి బిహార్‌ ‌ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2017లో ఎవరి అవినీతిని వ్యతిరేకించి ‘మహా ఘట్‌బంధన్‌’‌తో బంధం తెంచుకున్నారో, అదే నాయకున్ని మరోసారి కలుపుకొని తిరిగి ఉపముఖ్యమంత్రిని చేశారు. కాంగ్రెస్‌, ‌వామపక్షాలు యధావిధిగా నితీశ్‌కు మద్దతు ప్రకటించేశాయి. తాను చెప్పినట్లు అవినీతిపరుడైన ఆర్జేడీ నేత, లాలూప్రసాద్‌ ‌యాదవ్‌ ‌తనయుడు తేజస్వీ యాదవ్‌ ఇప్పుడు నీతిమంతుడైపోయారు. జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్‌, ‌లెఫ్ట్ ‌తదితర పార్టీలతో ‘మహా ఘట్‌బంధన్‌ 2.0’ ‌మొదలైపోయింది. సోషలిస్టు సిద్ధాంత నేపథ్యం నుంచి వచ్చిన నితీశ్‌, ‌గతంలో బీజేపీ మతతత్వ పార్టీ అని విమర్శించారు. కానీ అవకాశం వచ్చినప్పుడల్లా ఆయన ఆ పార్టీవైపే చూడటం అవకాశవాద రాజకీయానికి నిదర్శనం.

జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలనే ఆరాటంతోనే నితీశ్‌ ‌కుమార్‌ ‌బీజేపీతో మిత్రధర్మానికి తూట్లు పొడిచారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో విపక్షాలకు జాతీయస్థాయిలో బలమైన నాయకుడు లేకపోవడంతో ఆయన ఈ భర్తీని తీర్చబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. బీజేపీయేతర జాతీయస్థాయి పార్టీలు, ప్రాంతీయ పార్టీలు నితీశ్‌ ఎన్డీఏ నుంచి బయటకు రావడాన్ని స్వాగతిస్తున్నాయి. ఈ పార్టీలన్నీ నితీశ్‌ను ఏదో ఒక సందర్భంలో దుయ్యబట్టినవే. పదే పదే అదే బిహారీబాబుతో చేయి కలిపి, చంకనెక్కించుకున్నవే. ఇన్నిసార్లు దోస్తీలు మార్చి, రాజకీయ ఊసరవెల్లిగా అధికార పీఠాన్ని అట్టిపెట్టుకోవడం నితీశ్‌ ‌చేసిన విచిత్ర విన్యాసం. మరోవైపు రాహుల్‌ ‌గాంధీ, మమతా బెనర్జీ, కేజ్రీవాల్‌, ‌కేసీఆర్‌ ‌కూడా జాతీయ నాయకత్వం మీద ఆశలు పెట్టుకోవడంతో ఆయన వ్యూహం ఏమిటన్న అంశం మీద చర్చ సాగుతోంది. నితీశ్‌ ఇప్పటికైతే బీజేపీని ఎదురుదెబ్బ తీసి, తమవైపు రావడం ప్రతిపక్షాలకు సంతోషం కలిగింవచ్చు. కానీ, దానివల్ల కలిసొచ్చేది ఎంత?

రాజకీయ పల్టీ మాస్టార్‌

‌రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులంటూ ఎవరూ ఉండరనే సూత్రాన్ని తన అవకాశాల కోసం చక్కగా వాడేసుకున్నారు నితీశ్‌ ‌కుమార్‌. ‌బిహార్‌ ‌రాజకీయాల్లో ‘పల్టీ మాస్టర్‌’‌గా పేరు పడ్డ ఆయన వేసిన రాజకీయ పిల్లిమొగ్గలను చూసి ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఈ నిలకడలేనితనం ఆయనకు మొదటి నుంచీ ఉంది. ఇలా అవకాశాలు తెచ్చు కోవడంలో చక్కని నైపుణ్యం సాధించారు కూడా.

లోక్‌నాయక్‌ ‌జయప్రకాశ్‌ ‌నారాయణ్‌ ‌స్ఫూర్తితో సత్యేంద్ర నారాయణ్‌ ‌సిన్హా నేతృత్వంలోని జనతా పార్టీలో చేరారు నితీశ్‌ ‌కుమార్‌. 1985‌లో తొలిసారి హర్నౌత్‌ ‌నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. తొలి నాళ్లలోనే లాలూ ప్రసాద్‌ ‌యాదవ్‌తో దోస్తీ ఉంది. వీపీ సింగ్‌ ‌నాయకత్వంలో 1988లో ఏర్పాటుచేసిన జనతాదళ్‌లో వీరిద్దరూ కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత లాలూతో విబేధాలు వచ్చి జార్జి ఫెర్నాండేజ్‌ ‌నేతృత్వంలో 1994లో సమతా పార్టీతో జట్టు కట్టారు నితీశ్‌. 1996‌లో బర్హ్ ‌లోక్‌సభ స్థానంలో విజయం సాధించారు. తర్వాత జరిగిన పరిణామాల్లో నితీశ్‌ ‌సమతా పార్టీకి దూరమై, కేంద్రంలో వాజపేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో రైల్వే మంత్రిత్వ బాధ్యతలు చేపట్టారు. ఈ వ్యవహారాలు జనతా దళ్‌ ‌మాజీ నాయకుల మధ్య చిచ్చుపెట్టాయి. ఈ దెబ్బకు 1997లో లాలూ ప్రసాద్‌ ‌సొంతంగా ఆర్జేడీని ఏర్పాటు చేశారు.

నితీశ్‌ ‌కుమార్‌ 2000 ‌సంవత్సరంలో ఎన్డీయే కూటమి తరఫున తొలిసారిగా బిహార్‌ ‌ముఖ్య మంత్రిగా ఎన్నికయ్యారు. కానీ తగిన మెజారిటీ లేకపోవడంతో ప్రమాణం చేసిన వెంటనే రాజీనామా చేయాల్సి వచ్చింది. 2003లో నితీశ్‌ ‌కుమార్‌ ‌సమక్షంలో ఫెర్నాండెజ్‌ ‌నాయకత్వంలోని సమతా పార్టీ.. శరద్‌ ‌యాదవ్‌ ‌నేతృత్వంలోని జనతా దళ్‌లో విలీనమై జనతాదళ్‌ (‌యునైటెడ్‌)‌గా కొత్త పార్టీ ఆవిర్భవించింది. బీజేపీతో వీరి పొత్తు కొనసాగడంతో బిహార్‌లో 2005లో ఎన్డీయే కూటమిలోని జేడీయూ పార్టీ అధికారంలోకి వచ్చింది. నితీశ్‌ ‌కుమార్‌ ‌ముఖ్యమంత్రి అయ్యారు. 2010లో మళ్లీ ఎన్డీయే కూటమి-బీజేపీ అండతోనే జేడీయూ అధికారం కైవసం చేసుకుంది.

మోదీతో గిట్టక ఎన్డీఏకు దూరం

జేడీయూ ఎన్డీఏలో ఉన్నా, గుజరాత్‌ ‌ముఖ్య మంత్రిగా ఉన్న నరేంద్రమోదీ అంటే నితీశ్‌కు గిట్టేది కాదు. బిహార్‌ ‌వరదల సమయంలో గుజరాత్‌ ‌ప్రభుత్వం అందించిన సహాయాన్ని కూడా తిరస్కరించారు. ఈ దశలో 2014 సార్వత్రిక ఎన్నికలకోసం మోదీ నేతృత్వంలో బీజేపీ క్యాంపెయిన్‌ ‌కమిటీని ఏర్పాటు చేసింది. దీన్ని జీర్ణించుకోలేని నితీశ్‌ ‌కుమార్‌.. ‌బీజేపీతో పదిహేడేళ్ల బంధాన్ని తెంచేసుకున్నారు. బీజేపీ మద్దతు ఉపసంహరించు కున్నా, అసెంబ్లీలో కాంగ్రెస్‌ ‌సహకారంతో విశ్వాస తీర్మానంలో నెగ్గారు. అయితే, లోక్‌సభ ఎన్నికల్లో జేడీయూకు ఘోరపరాభవం ఎదురైంది. బీజేపీ 22 సీట్లు కైవసం చేసుకుంటే జేడీయూ స్థానాలు 20 నుంచి 2కి పడిపోవడంతో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. జితిన్‌రామ్‌ ‌మాంఝని సీఎం పదవిలో కూర్చోబెడితే ఆయన కొరకరాని కొయ్యగా మారారు. తప్పని పరిస్థితిలో మళ్లీ ముఖ్యమంత్రి గద్దెపై కూర్చున్నారు నితీశ్‌ ‌కుమార్‌. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ, కాంగ్రెస్‌ ‌తదితర పార్టీలతో కలిసి జనతా పరివార్‌ ‌కూటమిని ఏర్పాటు చేసింది జేడీయూ. ఈ ఎన్నికల్లో జేడీయూకి 71 సీట్లు వస్తే, ఆర్జేడీకి 80 సీట్లు వచ్చాయి. అయినా సీఎం పదవిని నిలుపుకున్నారు నితీశ్‌. ‌విధిలేని పరిస్థితుల్లో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ ‌కుమారుడు తేజస్వీ యాదవ్‌ను ఉపముఖ్య మంత్రిగా చేయాల్సి వచ్చింది. కొద్ది రోజులకే తేజస్విపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేయాలని నితీశ్‌ ‌కోరితే పట్టించుకోలేదు. దీంతో సీఎం పదవికి నితీశ్‌ ‌రాజీనామా చేశారు. ఆర్జేడీతో తెగదెంపులు చేసుకుని మహా ఘట్‌బంధన్‌ ‌నుంచి బయటకు వచ్చేసి 2017లో తిరిగి ఎన్టీఏలోకి వచ్చారు నితీశ్‌.

2020 ‌బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. బీజేపీకి 74 సీట్లు వస్తే జేడీయూ 43 సీట్లకు పరిమితమైంది. అయితే విశాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి పదవిని నితీశ్‌ ‌కుమార్‌ ‌చేపట్టేందుకు అవకాశం ఇచ్చింది బీజేపీ. ఇప్పుడు మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో మళ్లీ ఎన్డీఏకు దూర మయ్యారు నితీశ్‌ ‌కుమార్‌. ‌తాను చావనైనా చస్తాను కానీ, మళ్లీ ఆర్జేడీతో కలిసేది లేదని అప్పట్లో స్పష్టంచేసిన నితీశ్‌ ఇప్పుడు అదే అవినీతి మరకల పార్టీతో రాజీపడాల్సిన దుస్థితి ఏర్పడింది.

బీజేపీ ఎదుగుదల భయంతోనే..

బిహార్‌లో బీజేపీ బలపడటమే నితీశ్‌ ‌కుమార్‌ ‌భయాందోళనలకు కారణమని స్పష్టంగా అర్థ మవుతోంది. ఇదే సమయంలో ప్రధాని మోదీ కేబినెట్‌లో ఉన్న ఏకైక జేడీయూ మంత్రి ఆర్పీ సింగ్‌ ‌రాజ్యసభ పదవీకాలం ఇటీవల ముగిసింది. దీంతో ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజ్యసభ సభ్యత్వాన్ని పొడిగించేందుకు నితీశ్‌ ఇష్ట పడలేదు. పైగా ఆయన ఆస్తులపై వివరణ కోరింది జేడీయూ నాయకత్వం. దీంతో ఆయన పార్టీకి రాజీనామా చేసి నితీశ్‌ ‌మీద విమర్శనాస్త్రాలు సంధించారు. ఒకప్పుడు నితీశ్‌కు ఎంతో సన్నిహితుడైన ఆర్పీ సింగ్‌ ‌గతంలో జేడీయూ జాతీయ అధ్యక్షునిగా కూడా పనిచేశారు. ఆయన బీజేపీ నాయకులతో సన్నిహితంగా ఉండటం నితీశ్‌లో భయాలను పెంచిందంటున్నారు.

2019లో నాలుగు కేంద్ర మంత్రి పదవులు ఇవ్వాలన్న తన డిమాండ్‌ను బీజేపీ తిరస్కరించిందని నితీశ్‌ ‌తాజాగా ఆరోపించారు. అప్పుడే తమ పార్టీ కేంద్ర ప్రభుత్వంలో చేరకూడదని నిర్ణయించుకున్నట్టు వెల్లడించారు. ఆర్పీ సింగ్‌ ‌కేంద్ర మంత్రివర్గంలో చేరడంలోనూ తన అంగీకారం లేదని నితీశ్‌ ‌తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ పుంజుకోవడం తన రాజకీయ మనుగడకు ప్రమాదకరమని ఆయన భావిస్తున్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి తానే నేతృత్వం వహిస్తున్నప్పటికీ పలు అంశాల్లో మాట చెల్లుబాటు కావడంలేదనే ఆవేదనలో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్పీ సింగ్‌ను అడ్డుపెట్టుకుని జేడీ(యు)ను చీల్చే అవకాశం ఉందనే అనుమానం వ్యక్తంచేస్తున్నారు నితీశ్‌.

‌కొంతకాలంగా నితీశ్‌ ‌కుమార్‌ ‌బీజేపీ నాయ కులతో, కేంద్ర ప్రభుత్వంతో అంటీ ముట్టనట్లుగా ఉంటున్నారు. ప్రధాని మోదీ అధ్యక్షతన ఢిల్లీలో ఇటీవల జరిగిన నీతి ఆయోగ్‌ ‌సమావేశానికి నితీశ్‌ ‌గైర్హాజరయ్యారు. ఆరోగ్యం సరిగా లేదని చెప్పినప్పటికీ అదే రోజు పట్నాలో ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అంతకుముందు దేశంలో కొవిడ్‌ ‌పరిస్థితిపై ప్రధాని మోదీ నిర్వహించిన ముఖ్య మంత్రుల సమావేశానికీ నితీశ్‌ ‌హాజరుకాలేదు. స్వాతంత్య్ర దినోత్సవ సన్నాహాలపై జూలై 17న కేంద్ర హోంమంత్రి అమిత్‌ ‌షా నిర్వహించిన ముఖ్య మంత్రుల భేటీకీ నితీశ్‌ ‌వెళ్లలేదు. పదవీకాలం ముగిసిన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ ‌కోవింద్‌కు వీడ్కోలు పలికేందుకు ప్రధాని మోదీ ఇచ్చిన విందుకు, కొత్త రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రమాణస్వీకార కార్య క్రమానికీ దూరంగా ఉన్నారు.

గతంలోనూ బీజేపీతో బంధాన్ని తెంచుకొని ఎన్డీఏ నుంచి బయటకొచ్చిన ఆయన తర్వాత మళ్లీ ఏ విలువల కోసం ఆ పార్టీని ఆశ్రయించారు? ఇప్పుడు మళ్లీ ఎందుకు దూరం అయ్యారు? ఈ స్పష్టత నితీశ్‌కైనా ఉందో లేదో!

లాలూ కుటుంబంలో కొత్త ఉత్సాహం..

మొన్నటి దాకా పరస్పరం ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్న నితీశ్‌, ‌తేజస్వీ యాదవ్‌ ఇప్పుడు గతం గతః అనుకుంటూ, గాఢాలింగనం చేసుకోవడం విచిత్రమే. నితీశ్‌ ‌తీసుకున్న ఈ మహత్తర నిర్ణయం దేశానికి నూతన ఉషోదయమని తేజస్వి అంటున్నారు. కానీ ఆయన కుటుంబానికే ఇది అందరికన్నా ఎక్కువ ప్రయోజనం కలిగించ నుంది. పశుగ్రాసం అవినీతి కేసులో జైలు పాలై రాజకీయంగా పలుకుబడి కోల్పోయిన లాలూ ప్రసాద్‌ ‌తనయుడికి ఇప్పుడు మళ్లీ డిప్యూటీ సీఎం పదవి దక్కింది. ఇక హోం మంత్రిగా బాధ్యత, సోదరుడికి మరో మంత్రి పదవి అశిస్తున్నారు. ఈ కోరికలన్నీ నితీశ్‌ ఎలా తీర్చగలరో చూడాలి.

బుజ్జగించేందుకు ప్రయత్నించని బీజేపీ

ఎన్డీఏ కూటమి నుంచి జేడీయూ నిష్క్రమణను బీజేపీ ముందే పసిగట్టినట్లు స్పష్టంగా తెలుస్తోంది. అయినప్పటికీ ఆయనను బుజ్జగించలేదు. నితీశ్‌ ‌కుమార్‌ ‌చేసింది ముమ్మాటికీ మోసమేనని, వెన్ను పోటుతో రాజకీయ విశ్వసనీయత సైతం కోల్పో యాడని బీజేపీ భావిస్తోంది. రాబోయే రోజుల్లో బిహార్‌ ‌ప్రజలే ఆయనకి బుద్ధి చెప్తారని అంటోంది. అందుకే తమ అధిష్టానం సైతం ఆయన్ని నిలువరించే ప్రయత్నాలేవీ చేయలేదని చెబుతోంది. బిహార్‌లో ఎప్పటికైనా సొంతంగా అధికారంలోకి రావాలన్నది బీజేపీ వ్యూహం. మారిన పరిస్థితుల్లో ఆ పార్టీ తన వ్యూహాలకు మరింత పదునుపెడుతోంది. రాబోయే రోజుల్లో ప్రాంతీయ పార్టీలు అన్నింటికీ నూకలు చెల్లిపోతాయని, జాతీయ స్థాయిలో బీజేపీ ఒక్కటే ఉంటుందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇటీవల వ్యాఖ్యానించారు. బిహార్‌లో 2024 పార్లమెంట్‌ ఎన్నికల ఫలితాలు బీజేపీకి కీలకం.. 2025లో ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగ నున్నాయి. కులాల పోరు ఎక్కువగా ఉండే బిహార్‌లో బీజేపీ గట్టి పోరాటమే చేయాల్సి ఉంటుంది. మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఆ రాష్ట్రంలో 4 శాతం ఉన్న దళిత పాశ్వాన్లు, వారి నేతగా రామ్‌ ‌విలాస్‌ ‌పాశ్వాన్‌ ‌కుమారుడైన చిరాగ్‌ ‌కీలకం కానున్నారు. వారిని బీజేపీ చేరదీస్తుందని ఓ అంచనా. మరి ఏ ఎన్నికలకా గొడుగు పట్టడంలో సిద్ధహస్తుడైన నితీశ్‌ ఎలాంటి వ్యూహం వేస్తారో చూడాలి.

నితీశ్‌ ‌కుమార్‌ ‌సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి నిర్వహించే అసెంబ్లీ సమావేశాలు ఆగస్ట్ 24 ‌నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో జేడీయూ-ఆర్జేడీ ప్రభుత్వం బల నిరూపణ చేసుకోవాల్సి ఉంది. ఈ కూటమికి ప్రస్తుతం 164 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. 243 సభ్యుల అసెంబ్లీలో 122 మంది మద్దతు ఉంటే సరిపోతుంది. ఆగస్ట్ 25‌న విశ్వాస పరీక్ష ఎదుర్కోనున్నారు నితీశ్‌. ‌దీర్ఘకాలంగా అధికారం చలాయిస్తున్నా బిహార్‌ను అభివృద్ధి పథాన నడప టంలో విఫలమైన నితీశ్‌ ‌ప్రధాని పదవిపై ఆశలు పెట్టుకోవడమే విస్మయకరం. 2020 ఎన్నికల్లో సొంత పార్టీకి కేవలం 43 సీట్లే వచ్చినా తన వైఫల్యాలను, ముంచుకొచ్చిన ప్రమాదాన్ని గ్రహించడం లేదు. నితీశ్‌ ‌కప్పగంతులు జేడీయూ భవిష్యత్తును మరింత ప్రమాదంలోకి నెట్టాయి.

– క్రాంతి,  సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE