‘1988లో ‘సటానిక్ వర్సెస్’ను నిషేధించిన అతి పెద్ద ప్రజాస్వామ్యం మనది ఒక్కటే. అది కూడా ఆ పుస్తకం చదవకుండానే ఆ పని చేశాం. ముప్పయ్ నాలుగేళ్ల తరువాత ఇప్పుడు కూడా ఆ దాడి (రచయిత స్మలాన్ రష్దీ మీద)ని అధికారికంగా ఖండించని ప్రజాస్వామ్యం కూడా మనదొక్కటే!’ ప్రఖ్యాత టీవీ తెర వ్యాఖ్యాత కరణ్ థాపర్ ఈ మధ్య వెళ్లబోసుకున్న ఆక్రోశమిది. ‘సటానిక్ వర్సెస్’ నవలాకర్త సల్మాన్ రష్దీ మీద ప్రాణాంతక దాడి జరిగితే భారత రాజకీయ పార్టీలు, వాటి నాయకులు, చివరికి ప్రభుత్వం కూడా నిమ్మకు నీరెత్తినట్టు ఉండిపోవడం ఎందుకో తనకు ఏమీ అర్ధం కాలేదంటూ తన ఆవేదననే ప్రశ్నలో మిళితం చేశారు థాపర్. ఆయన ప్రశ్న సంగతి ఎలా ఉన్నా, థాపర్, బర్ఖాదత్, రాజ్‌దీప్ సర్దేశాయ్, ప్రణయ్‌రాయ్ వంటి వారికి కూడా ఇందులోని మతలబు అర్ధం కాకుండా ఉందా అన్నది అంత కంటే పెద్ద ప్రశ్న.
రష్దీ బొంబాయిలోనే పుట్టారు. ప్రస్తుతం రష్దీ పౌరసత్వం మారి ఉండొచ్చు. అయినా ఆయన తను పుట్టిన దేశంతో, ఇక్కడి వాతావరణంతో మమేకమవుతూనే ఉన్నారు. 2000 సంవత్సరంలో బీబీసీ వారి హార్డ్‌టాక్ కార్యక్రమంలో మాట్లాడినప్పుడు కూడా రష్దీ ఈ విషయం చెప్పారు. మనం పుట్టి పెరిగిన దేశం ఏదైనా అదే ఎప్పటికి సొంతిల్లులా ఉంటుంది అన్నారట రష్దీ. ఈ విషయాలు కూడా థాపర్ రాశారు. మరొక చక్కని సంగతిని కూడా రష్దీ ఆ ఇంటర్వ్యూలో చెప్పారట. వివాదాలు రేపడానికి సదా సిద్ధంగా ఉంటారు కాబట్టి ఈ ప్రశ్న వేసి ఉంటారు థాపర్. ‘సల్మాన్ రష్దీ భారతీయుడా?, ఆంగ్లేయుడా? లేదా పాకిస్తానీయా? అని నేను అడగవలసి వస్తే అందుకు మీ సమాధానం ఎలా ఉంటుంది?’ ఇదీ ప్రశ్న. అందుకు రష్దీ, ‘అబ్బ! పాకిస్తానీని అయితే మాత్రం కాదు’ అన్నారట. నిజానికి ఈ సమాధానం నుంచి థాపర్ సహా భారతీయ టీవీ వ్యాఖ్యాతలు చాలామంది ఎంతో నేర్చుకోవచ్చు. అసలు పాకిస్తాన్ ఏర్పాటు అన్న ఆలోచనే హాస్యాస్పదమని రష్దీ అభిప్రాయం. మరి, ఇలాంటి రచయిత మీద దాడి జరిగితే, ఆ భీతావహ ఘటన మీద ఏ ప్రముఖ రాజకీయ నేత ఎందుకు నోరు విప్పలేదన్నదే థాపర్ బాధ. జరిగిందాని మీద ఆగ్రహం వ్యక్తం చేయడానికి వారికి ఉన్న అభ్యంతరం ఏమిటి? అని కూడా ప్రశ్నించారు. ఆఖరికి రష్దీ కోలుకోవాలని ఆశిస్తూ మర్యాదపూర్వకంగా అయినా ఒక మాట చెప్పడానికి నోరు రాదేం అని కూడా ఆక్రోశించారు. అలా అని అసలు ఎవరూ మాట్లాడ లేదని ఆయన ఉద్దేశం కాదు. సీతారాం ఏచూరి వంటివారు దాడిని ఖండించారని థాపర్ చెప్పారు. ఇక నోరు విప్పని వారి జాబితాని ఆయన చదివారు. అది కొల్లేరు చాంతాడంత ఉంది. ప్రధాని మోదీ, ఆయన మంత్రివర్గ సభ్యులు, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్, ఎంకే స్టాలిన్, నితీశ్‌కుమార్, కోన్రాడ్ సంగ్మా, ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా… అరె ఎవరూ నోరు విప్పలేదు అంటున్నారు థాపర్. ఇంత రాజకీయ మందలో రష్దీ మీద దాడి సంగతి తెలిశాక స్పందించా లని ఒక్కరికీ అనిపించకపోవడానికి కారణం ఏమిటి? రాజకీయాలా; ముస్లిం ఓటర్ల మనోభావాలు గాయ పడతాయనా? లేకపోతే ఇరాన్ ప్రభుత్వం నోళ్లు కట్టేసిందా?
ఆవేదన ఇలా తారస్థాయికి చేరితే తప్ప రష్దీ హత్యాయత్నం పట్ల దేశంలో మౌనం ఎందుకో థాపర్ బుర్రకి తట్టలేదు. ముస్లిం ఓటర్ల మనోభావాలు గాయపడతాయానా? అన్నారాయన. ఇందులో చాలామంది రాజకీయ నేతలకు సంబంధించి థాపర్ తీర్పు నిజమే. రష్దీపై హత్యాయత్నం విషయంలో మోదీ, బీజేపీల నుంచి థాపర్ సానుభూతి వెల్లడి కాలేదని ఆక్రోశించడం ఏ మేరకు సబబు? మొదట బీజేపీ, సంఘపరివార్‌లు గత కొంతకాలంగా వేస్తున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పడానికి ఎవరైనా ముందుకు వచ్చారా? ఎంపిక చేసుకున్న ఖండనలు, ఎవరి ప్రాణమైనా ఒక్కటే అన్న మానవీయ విలువను బట్టి కాకుండా, పరిస్థితిని బట్టి, వర్గాన్ని బట్టి, వచ్చే ఓట్ల రాశిని బట్టి ఆచితూచి కార్చే కన్నీళ్లూ, సానుభూతి కురిపించడం నేడు రష్దీ విషయంలోనూ జరిగాయని థాపర్‌కి తెలియనిది కాదు. ముస్లింల మీద హిందువులు దాడులు జరిపితే, లేదా జరిపినట్టు వార్తలు వస్తేనే ఈ దేశంలో నాయకులు, మేధావులు, స్వయంప్రకటిత ఉదారవాదులు నోరు విప్పుతారు. ఎస్సీల విషయమూ అంతే. బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఎస్సీల మీద దాడి జరిగితే అది అల్లరి చేయదగినది. అదే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో జరిగితే మౌనాన్ని ఆశ్రయిస్తున్నారు. ఇందుకు తాజా ఉదాహరణ రాజస్తాన్. అలాగే, ముస్లింలు హిందువులను సామూహికంగా ఊచకోత కోసినా అది పట్టించుకో దగినది కాదన్నట్టే నోరు విప్పరు. నుపూర్ శర్మ వ్యాఖ్యలను అసెంబ్లీలో తీర్మానాలు చేసి మరీ ఖండిస్తారు. కానీ ఆమె గొంతు కోయాలని ఒక మతం పేరు మీదనే ప్రకటనలు ఇచ్చినా నోరు విప్పరు.
రష్దీ మీద హత్యాయత్నం మరొక వాస్తవం బయటపెట్టింది. ముస్లింల దృష్టిలో దైవదూషణ చేసినవాడి మీద మరో ముస్లిం మతస్తుడే దాడి చేసినా కూడా మన సెక్యులరిస్టు నేతలు పెదవి విప్పరు. అమితవ్ ఘోష్, అరుంధతీ రాయ్ వంటి వారు ఏదో మొక్కుబడిగా ఖండించినా అందులో ఇస్లామ్ మతోన్మాదాన్ని ఖండించిన దాఖలాలు ఉండవు. ఇమ్రాన్‌ఖాన్ బాటలో, దాడి హేయమే కానీ, దాడి చేసినవాడి బాధను అర్ధం చేసుకోవాలని అన్నారు ఈ పాక్ మాజీ అధ్యక్షుడు. భారతీయ సెక్యులరిజం లోని విశిష్టత ఇది. అంటే హిందువులపై ముస్లింలు దాడి చేసినా, ముస్లింలకు ఇష్టుడు కాని ముస్లిం మీద ముస్లింలు దాడి చేసినా కూడా ఉదారవాదులకి మాటలు కరవవుతాయి. మొత్తంగా చూస్తే, అసహనం వాళ్ల హక్కు అన్నట్టు, దాడి చేసే హక్కు ముస్లిం మతోన్మాదులకు వీళ్లంతా టోకున అప్పగిం చేశారు. మూడున్నర దశాబ్దాల క్రితం ఇరాన్ ఖోమైని జారీ చేసిన మరణ శాసనాన్ని, అప్పటికి ఇంకా పుట్టని ఒక ముస్లిం మతోన్మాది అమలు చేయడం ఇందులో కొసమెరుపు. అమెరికాలో తలదాచుకుంటున్న రష్దీని 15 కత్తిపోట్లతో అతడు చావుబతుకుల మధ్యకు నెట్టాడు.
వివాదాస్పద రచయిత రష్దీ ఈ మూడున్నర దశాబ్దాలుగా చావు భయంతోనే గడిపారంటే తొందర పాటు కాదు. దానికి పరాకాష్ట- ఆగస్ట్ 13న పశ్చిమ న్యూయార్క్‌లో చౌటౌకా అనే చోట ఒక సాహిత్య కార్యక్రమానికి హాజరైనప్పుడు 24 ఏళ్ల హాది మతార్ 15 సెకన్లలో 10 నుంచి 15 సార్లు కత్తితో పొడిచి, చంపడానికి ప్రయత్నించడం. ఇతడు లెబనాన్ మూలాలు ఉన్నవాడు. న్యూజెర్సీలో ఉండే ఈ నిందితుడు పోలీసులకు పట్టుబడిన వెంటనే అన్న మాట, ‘రష్దీ ఇంకా బతికి ఉండడం వింతే’ అని. అయితుల్లా ఖొమైని ఆత్మ సంతోషించే స్థాయిలో తాను ప్రయత్నం చేయలేదన్న బాధేదో ఇతడికి మిగిలిపోయినట్టే ఉంది. మెడ మీద, కడుపు మీద ఎక్కడ వీలైతే అక్కడ ఆ నిండు సభలోనే ఆయన మీద పడి పొడిచాడు. తనకు దాడితో సంబంధం లేదని ఇరాన్ ప్రకటించుకోవడం ఇంకో విశేషం. నిజానికి 1998లో ఇరాన్ కూడా ఈ ఫత్వా నుంచి దూరంగా జరిగింది. అయినా రష్దీకి చావు బెడద దూరం కాలేదు. ఎందుకంటే ఇరాన్ నాయకుడు అయితుల్లా అలీ ఖొమైనీ తమ మత విశ్వాసాలు, వాటి అమలు పట్ల విశ్వాసాన్ని పునరుద్ఘాటించారు. ‘రష్దీ మీద జారీ చేసిన ఫత్వాకు కాలదోషం పట్టలేద’ని 2017లో తన వెబ్‌సైట్‌లో అలీ ఖొమైనీ తేల్చి చెప్పారు. ఇంతా చేసి, ప్రవక్తను ఏ మాత్రం కించపరిచినా వారి ప్రాణాలు తీయవలసిందే అన్నది కల్పిత సూత్రమేనని అమెరికాకు చెందిన ముస్లిం పండితుడు మూసా రిచర్డ్‌సన్ అంటున్నారు. అలాగే జహాక్ తన్వీర్ కూడా ఈ సూత్రాన్ని ప్రవక్తకు అన్యాయంగా వర్తింప చేస్తున్నారని అన్నారు. ఈ పేరుతో, దైవదూషణ ముద్రతో మతాన్ని దుర్విని యోగం చేస్తున్నారని ఆ ఇద్దరు ఆరోపిస్తున్నారు.
కానీ వాస్తవంగా జరుగుతున్నదేమిటి? సటానిక్ వర్సెస్ రచయిత రష్దీ తన రచన కారణంగా ఇప్పుడు చావు బతుకులతో పోరాడుతూ ఉండి ఉండవచ్చు. కానీ ఈ పుస్తకం వెలువడిన తరువాత, అంటే ఈ 33 ఏళ్లలో దానితో సంబంధం ఉన్న 60 మందిని ఇస్లామిస్టులు దారుణంగా చంపారు. కొందరు అనువాదకులు, ప్రచురణకర్తలు కూడా ఇందులో ఉన్నారు. ఈ రక్తపాతం మీద ఏ దేశ మేధావులు కొవ్వొత్తులతో ఊరేగారు? ఏ మేధావి న్యూయార్క్ టైమ్స్‌కో, గార్డియన్‌కో ఖండిస్తూ ఎవరు వ్యాసాలు వ్రాశారు.
రష్దీ తన రచనలకు ఇతివృత్తాలుగా సున్నితమైన మత అంశాలను, సమస్యాత్మకమైన రాజకీయ అంశాలను మాత్రమే ఎంచుకుంటూ ఉంటారు. సహజంగానే ఇది ఆయనను అనేక వివాదాలలోకి నెట్టింది. వీటికి పరాకాష్ట ఆయన నాలుగో నవల ‘సటానిక్ వర్సెస్’. ఇది 1988లో వెలువడింది. ఇందులో ఇస్లాంనే ఆయన లక్ష్యం చేసుకున్నారని అనడం తొందరపాటు. హిందూ ధర్మం గురించి, మన పురాణ పాత్రల గురించి కూడా రష్దీ తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు రాశారు. కానీ హిందువులు ఈ ధోరణిని ప్రజాస్వామ్యబద్ధంగా ఎండగట్టారే తప్ప, చంపుతాం, పొడుస్తాం అనలేదు. కానీ హిందువులలో అసహనం పెరిగిందంటూ అపనిందలు మాత్రం మిగిలాయి. గడచిన మూడున్నర దశాబ్దాలుగా రష్దీ చావు పడగ నీడన జీవించారంటే కారణం ఈ నవలే. తమ మనోభావాలను కించపరిచేటట్టుగా ఈ నవల రాశారని కొందరు ముస్లింలు ధ్వజమెత్తారు. 1989లో ఇరాన్ నాయకుడు అయితుల్లా ఖొమైనా ఈ నవల ఇస్లాంకు అవమానకరమనీ, ప్రవక్తను దూషించిందనీ చెబుతూ రష్దీ దైవదూషణకు పాల్పడిన వ్యక్తిగా ముద్ర వేశాడు. అంటే రష్దీని చంపమని ఆదేశించాడు. దీనితో ఒక దశాబ్దం రష్దీ ఇంగ్లండ్ రక్షణలో జీవితం గడిపారు.
ఇంతకీ రష్దీ మీద హత్యాయత్నం చేసిన హాదీ మీద పత్రికలు మరీ ఎక్కువగా రాస్తున్నాయని, ఇవి అతడి మీద జరగవలసిన నిష్పాక్షిక విచారణను ప్రభావితం చేస్తాయని అతడి న్యాయవాది ఆక్రోశించాడు. ఇటీవలి ప్రపంచంలో ఇదొక వింత ధోరణి. నేరగాడిని నేరగాడని అనకూడదు. నిందితుడు ఈ పని చేశాడని రాయకూడదు. ఈ వితండవాదం భారత్‌లో కూడా బాగానే బలపడు తోంది. ఇంతకీ ఈ హాదీ అన్నవాడి వ్యక్తిత్వం చూస్తే ముస్లిం యువతలో మతావేశం ఏ విధంగా పెరుగుతున్నదో అర్ధమవుతుంది. మతావేశం ఒక సహజ గుణం అన్నట్టు వారు ప్రవర్తించడమే వింత. ఇతడు ఖొమైనీ ఫత్వా ఇచ్చిన తొమ్మిదేళ్లకు అమెరికాలో పుట్టాడు. అతివాద ఇస్లాం కార్య కలాపాలకు కేంద్రమైన మధ్య ఆసియాకు సుదూరంగా ఉన్నాడు. ఎంతో ఉదారవాదం నిండి ఉండే కాలిఫోర్నియా వంటిచోట పెరిగాడు. కానీ ఇరాన్ కేంద్రంగా నడిచే తీవ్రవాద సంస్థ రివల్యూషనరీ గార్డస్‌ను కీర్తిస్తూ ఇతడు సామాజిక మాధ్యమాలలో పోస్టులు పెట్టేవాడని తేలింది. పాలస్తీనా పట్ల ఇజ్రాయెల్ అనుసరిస్తున్న వైఖరిని తీవ్ర పదజాలంతో విమర్శిస్తూ ఉంటాడు. అయినా తను పుట్టి ఈ భూమ్మీద పడడానికి తొమ్మిదేళ్ల ముందు వెలువడిన రష్దీ వ్యతిరేక ఫత్వాను అమలు చేయడం తన బాధ్యత అనుకున్నాడు. మతాన్ని గౌరవించడ మంటే ఇదే అనుకునే మనస్తత్వాన్ని ఈ ప్రపంచం ఎందుకు భరించాలని ప్రశ్నించాడు రష్దీ ఆప్తమిత్రుడు, పాశ్చాత్య రచయిత క్రిష్టోఫర్ హిచెన్స్. ఈ ప్రశ్న ఎప్పుడో పదునెక్కి ఉండవలసింది. ఒక వెబ్‌సైట్ ఇచ్చిన వివరాల ప్రకారం 54 దేశాలలో ఇస్లాం మతోన్మాదులు 2021లో చేసిన హత్యాయత్నాలు 2,272. ఇందులో 11,208 మంది చనిపోయారు. 9,591 మంది గాయపడ్డారు. ఇస్లామిస్టులలో మతరక్షణ గురించి ఇలాంటి ధోరణి గురించి ఇప్పుడు చాలా ప్రశ్నలు వస్తున్నాయి. ఖురాన్‌ను అపవిత్రం చేశాడని అమెరికా పీస్ యూనివర్సిటి విద్యార్థిని ప్రభుత్వం అరెస్టు చేయడం గురించీ, ఆ ఖురాన్‌లోనే ఉన్న విషయాలను చెప్పినా, నుపూర్ శర్మకు నోటి దురుసు అని సుప్రీంకోర్టు తప్పుపట్టడం గురించి కూడా చర్చ జరుగుతున్నది. అసలు జిహాదీల చర్యలను కూడా మరుగుపరుస్తూ బతకవలసిన అవసరం పాశ్చాత్య దేశాలకు ఏమొచ్చిందన్న మరొక మంచి ప్రశ్న కూడా వినిపిస్తున్నది.
మరొక ఏ మతాన్ని విమర్శించినా ప్రాణం లేదా కాలూ చేయీ తీసేసే అమానవీయత కానరాదు. మత భావన అత్యధికులైన మానవులకు సహజాతం. కానీ మతాలు కాలం మారుతున్న క్రమంలో కొన్ని సంస్కరణలను ఆశ్రయించాయి. క్రైస్తవంలో కూడా అమానవీయమనిపించే కొన్ని తీవ్ర సమస్యలు ఉండేవి. కానీ జ్ఞాన విస్ఫోటనం, గెలిలియో, ఆయన ఆవిష్కరణలు, చార్లెస్ డార్విన్ మానవ పరిణామ సిద్ధాంతం ఆ మతాన్ని సంస్కరణ బాటలోకి నడిపి సరళం చేశాయి. హిందూధర్మం కూడా అంతే. మహావీరుడు, బుద్ధుడు, నానక్, రామమోహన్‌రాయ్, దయానందుడు, వివేకానందుడు వంటివారు సంస్కరించారు. ఇలాంటి ప్రయత్నం ఇస్లాంలో జరగలేదన్నదే ప్రధాన విమర్శ.
మళ్లీ థాపర్ ఆక్రోశం దగ్గరకి వెళదాం. 1990 నుంచి చూస్తే ముస్లిమేతరులపైన ముస్లిం మతోన్మాదులు దాడి చేసినప్పుడు బీజేపీయేతర నేతలు ఎవరైనా నోరు విప్పారా? విదేశాలలో జరిగిన ఘటనలకూ ఇది వర్తిస్తుంది. అఫ్ఘానిస్తాన్‌లో బాలికలను, యువతులను తాలిబన్ లైంగిక అవసరాలకు అప్పగించాలని ఆదేశాలు వచ్చినప్పుడు మనదేశంలో స్త్రీవాదులంతా ఏమయ్యారు? కేరళలో ఒక క్రైస్తవుడైన అధ్యాపకుడి కాళ్లూ చేతులూ నరికితే ఏ ఉదారవాది వ్యాసాలు రాశాడు? ఏ టీవీ చర్చలో నిరసన తెలియచేస్తూ మాట్లాడారు? హిందువుల ఆక్రోశం ఎలాగూ ఈ ఉదారవాదులకి పట్టదు. పోనీ కేరళలో కమ్యూనిస్టు ప్రభుత్వం అండ చూసుకుని రెచ్చిపోతున్న ముస్లిం మత ఛాందసవాదుల అకృత్యాల మీద కేథలిక్ చర్చ్ ప్రకటనలు ఇచ్చినా ఈ వర్గం మీడియా స్పందించిందా? కేరళలో కమ్యూనిస్టులు, ముస్లిం మతోన్మాదులు ఏకమై ఎంతమంది బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలను చంపినా ఎందుకు నోరెత్తలేదు? బొంబాయి దాడులు జరిగిన తరువాత కూడా నాటి యూపీఏ ప్రభుత్వం కచ్చితంగా వాటిని ఖండించిందా? ఆ దాడుల వెనుక, హింస వెనుక ఉన్న మతకోణాన్ని నిర్మొహమాటంగా వెల్లడించిందా?
‘లజ్జ’ నవ రాసిన తస్లిమా నస్రీన్ అనే బంగ్లా రచయిత్రికి కలకత్తాలో ఎదురైన అనుభవం ఏమిటి? కమ్యూనిస్టులే కాదు, వాళ్ల తరువాత వచ్చిన మమతా బెనర్జీ కూడా ప్రాణాలరచేత పట్టుకుని వచ్చిన ఆమెకు నిలువ నీడ లేకుండా చేశారు. హైదరాబాద్ నగరంలో తస్లిమా మీద ఎంఐఎం ఎమ్మెల్యే చేసిన పాశవిక దాడిలో ఎవరికి పడ్డాయి శిక్షలు? రష్దీ మీద దాడి తరువాత ఆమె ఒక సంచలన వ్యాఖ్య చేశారు. అసలు ఇస్లాంను, అందులోని విశ్వాసాలను ఎందుకు ప్రత్యేకంగా చూడాలి? అన్నదే ఆ ప్రశ్న.
అంటే మిగిలిన వ్యవస్థలను, మతాలను విమర్శించే హక్కు ఉన్నట్టే ఆ మతం మీద కూడా స్వేచ్ఛగా అభిప్రాయాలు వెల్లడించాలన్నదే ఆమె అభిమతం. ఈ దేశపు ఉదారవాదులంతా బుజ్జగింపు రాజకీయాల రోగంతో బాధపడుతున్నవారే. మేధావులంతా అలాంటి వాళ్ల దగ్గర కుక్క బిస్కెట్లకు ఆశపడే వారే. రష్దీ తరువాత నీ వంతు అంటూ హ్యారీ పాటర్ రచయిత్రి జేకే రౌలింగ్స్‌కు బెదిరింపులు వచ్చాయి.ఆమె చేసిన నేరం ఏమిటో అర్ధం కాదు. ఒక్క ఖురాన్ తప్ప మిగిలిన గ్రంథాలకు ఈ భూమ్మీద చోటు లేదని ఈ ఛాందసవాదులు తీర్మానించారా? కాబట్టి చిత్తశుద్ధి ఉంటే రౌలింగ్స్, తస్లిమాల మీద మతోన్మాద దాడులు జరగడానికి ముందే ఉదారవాదులు ముస్లిం ఛాందసవాదం మీద యుద్ధం ప్రకటించాలి. ఎదురు తిరగాలి.
రష్దీ ఘటనలో ఫత్వా విడుదల చేసినప్పుడు గట్టిగా మాట్లాడనివారంతా ఉన్మాదులు దాడి చేశాక ఆక్రోశించడం ఏమిటి?ఈ ధోరణి ఆ ఇద్దరు రచయిత్రులు విషయంలో అయినా అవలంబించకుండా, వాళ్లు చావు బతుకుల మధ్యకు వెళ్లాక అప్పుడు తాపీగా ఆక్రోశించవచ్చులెమ్మని అనుకోవద్దు. అది వృధా.
– జాగృతి డెస్క్