వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మూడేళ్లుగా పాల్పడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలు, తప్పులపై భారతీయ జనతా పార్టీ ప్రజా చైతన్య యాత్రలు ప్రారంభించింది. రాజధాని నిర్మాణాన్ని తక్షణం చేపట్టాలనే డిమాండ్‌తో రాజధాని గ్రామాల్లో చేపట్టిన ‘మనం- మన అమరావతి’ యాత్ర ఒకటైతే, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా, ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్న డిమాండ్‌తో చేపట్టిన ‘యువ సంఘర్షణ యాత్ర’ రెండవది. అధికారం కోసం వైకాపా ఎన్నికల ముందు లెక్కలేనన్ని హామీలు ఇచ్చింది. పాదయాత్రలో ప్రజలను ప్రత్యక్షంగా కలిసిన ఆ పార్టీ నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వారి సమస్యలు పరిష్కరిస్తానని హామీలిచ్చారు.
ఉద్యోగ సంఘాల నుంచి నిరుద్యోగుల వరకు, పట్టణ జనాభా నుంచి గ్రామీణుల వరకు హామీల పరంపర కొనసాగింది. 16 ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తానని స్పష్టమైన హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత అన్ని వాగ్దానాలను విస్మరించ డమే కాక వాజ్‌పేయ్ ప్రధానిగా ఉన్న కాలంలో ఏర్పాటైన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో తన మనుషులను నియమించుకునేందుకు ఉన్న వారిని తొలగించారు. అమరావతే ఏపీ•కి రాజధానిగా పేర్కొని, దాని నిర్మాణానికి 33 వేల ఎకరాలు సరిపో వని కూడా చెప్పారు. తాము అధికారంలోకి వస్తే అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేస్తామని, పథకాలకు ఇచ్చే మొత్తాన్ని రెట్టింపు చేస్తామని మాట ఇచ్చారు. ఇవేమీ ఇవ్వలేదు సరికదా ఉన్నవాటినే అమలు చేయలేదు. పెరిగిన ధరలను అదుపు చేయలేక పోయారు. అన్నిరకాలుగా పన్నుల వేసి ప్రజలపై ఆర్ధిక భారాలు మోపారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిల్ ధరలు రెండుసార్లు తగ్గించినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తగ్గించలేదు. బస్సు ఛార్జీలు, కరెంటు ఛార్జీలు పెంచింది. మద్యాన్ని నిషేధిస్తామని చెప్పిన హామీని గాలికొదిలేసి, నాసిరకం మద్యం ధరలను రెండింతలు పెంచి తానే విక్రయాలు చేపట్టింది.
ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం, ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న ప్రభుత్వాన్ని ప్రజల ముందు దోషిగా నిలబెట్టి, వారిలోని ఆగ్రహాన్ని ఆయుధంగా చేసుకుని, వారి సమస్యలు పరిష్కరిం చేలా ప్రభుత్వంపై ఒత్తిడి చేసేందుకు బీజేపీ ఈ యాత్రలు చేపట్టింది.
‘మనం-మన అమరావతి’ కార్యక్రమాన్ని బీజేపీ చేపడితే, యువ సంఘర్షణ యాత్రను భారతీయ యువమోర్చా (బీజేవైఎం) నిర్వహిస్తోంది. రాజధాని గ్రామాల్లో బీజేపీ మనం-మన అమరావతి పేరుతో సంకల్ప యాత్రను చేపట్టింది. 7 రోజులు జరగనున్న యాత్రను జూలై 29న రాజధాని గ్రామం ఉండ వల్లిలో పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు పాటిబండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ప్రారంభించారు. గుంటూరు పార్లమెంటు నియోజకవర్గానికి చెందిన పార్టీ నాయకులు, కేంద్ర కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్ వల్లూరి జయప్రకాష్ నారాయణ ఈ సంకల్పయాత్రకు కన్వీనర్‌గా ఉన్నారు. రాజధాని ప్రాంతంలో విశేషంగా బంధువులు, స్నేహితులు కలిగివున్న ఆయన ఈ యాత్రను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. అమరావతి 29 గ్రామాల్లో యాత్ర సాగింది. ఈ యాత్రలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, రైతు జేఏసీ నాయకులు, అమరావతి రైతులు పాల్గొనగా స్ధానిక ప్రజలు, రైతుల నుంచి విశేషంగా స్పందన లభి స్తోంది. మాజీ మంత్రి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు కన్నా లక్ష్మీనారాయణ, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ వాకాడ నారాయణరెడ్డి ఇప్పటికే పాల్గొన్నారు. కన్నా లక్ష్మీనారాయణ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో, అమరావతిని మాత్రమే ఆంధప్రదేశ్ రాజధానిగా పేర్కొంటూ మొట్టమొదటి సారి తీర్మానం చేసిన విషయం అందరికీ తెలిసిందే.
అమరావతి నిర్మాణానికి ప్రభుత్వంపై ఒత్తిడి
అమరావతి రాజధానిపై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న నిర్ల్యక్షాన్ని ఎత్తిచూపి దాని నిర్మాణం ప్రారంభించడమే ‘మనం- మన అమరావతి’ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం. 2019 నుంచి రాజధాని అమరావతి నిర్మాణం ఒక్క అడుగు కూడా ముందుకు కదలలేదు. ఒక్క ఇటుకను వేయలేదు. ఎలా ఉన్నదానిని అలా వదిలేశారు. ఇప్పటి వైకాపా ప్రభుత్వం, గత తెలుగు దేశం పార్టీ ప్రభుత్వం అమరావతి పట్ల అనుసరించిన విధానాలే ఈ పరిస్థితికి కారణం. రాజధాని నిర్మాణంపై తెదేపా ప్రభుత్వం సాగతీత ధోరణి అనుసరించింది. అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేసి ప్రకటించాక శంకుస్థాపన కార్యక్రమానికి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించారు. శంకుస్థాపనకు విచ్చేసిన మోదీ అమరావతిని ఢిల్లీని మించిన ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చి, తాము తెచ్చిన యమునానది పవిత్ర జలాలను, పార్లమెంటు లోని మట్టిని చంద్రబాబుకు అందచేశారు. అమరావతి కోసం ఇచ్చిన వేల కోట్ల నిధుల సంగతి వదిలేసి కేవలం మట్టి, నీరు మాత్రమే ఇచ్చారని తెదేపా నాయకులు విమర్శించారు. ఇక అమరావతి నిర్మాణానికి రూ.7,500 కోట్లు ఖర్చుచేసినట్లు చంద్రబాబునాయుడు చెప్పినా అందులో ఎంత ఖర్చు చేశారనేది ప్రశ్నార్ధకమే. రాజధాని నిర్మాణాన్ని పూర్తిచేసి రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్లు వారికి ఇచ్చివేస్తే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు.
ఉద్దేశ్యపూర్వకంగా నిలిపివేత
2019లో అధికారంలోకి వచ్చిన వైకాపా అమరావతి నిర్మాణాన్ని కొనసాగించలేదు. అమరావతి ఒక్కటే రాజధానిగా ఉంటే మిగతా ప్రాంతాల అభివృద్ధి జరగదని, ఒక్క అమరావతే అభివృద్ధికి కేంద్రంగా మారుతుందని పేర్కొంది. అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధాను లను తెరమీదకు తెచ్చింది. అమరావతి రాజధానిని నిర్మించే సంస్థ సీ•ఆర్‌డీఏను రద్దు చేసి మూడు రాజధానులను నిర్మించాలనే ప్రతిపాదనను చట్టరూపంలో తెచ్చేందుకు అసెంబ్లీలో తీర్మానం చేసి అమోదించింది. శాసనమండలి ఈ ప్రతిపాదనలను ఆమోదించక సెలెక్ట్ కమిటీకి పంపింది. ప్రభుత్వం ఏకపక్షంగా శాసనమండలిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ రాజధాని రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. న్యాయస్థానం తీర్పు ప్రతికూలంగా వచ్చే అవకాశం ఉండటంతో ప్రభుత్వం సీఆర్‌డీఏ తిరిగి అమలౌతున్నట్లు ప్రకటిం చింది. అలాగే తను ప్రతిపాదించి ఆమోదించిన మూడు రాజధానుల ఏర్పాటు చట్టాన్ని కూడా రద్దుచేసేలా అసెంబ్లీలో తీర్మానించింది. అందరూ ఊహించినట్లుగానే అమరావతినే రాజధానిగా కొనసాగించాలని రాష్ట్ర హైకోర్టు తీర్పు చెప్పింది. అమరావతిలో అభివృద్ది కార్యక్రమాలు వెంటనే ప్రారంభించాలని, నిర్ణయించిన కాలపరిమితి ప్రకారం అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల వివరాలను తమకు ఎప్పటికప్పుడు తెలియచేయాలని, రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్లు వారికి అందచేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అయినా హైకోర్టు ఆదేశాలను సైతం ప్రభుత్వం ఉల్లంఘించినట్లు రైతులు, ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. హైకోర్టు ఆదేశాల ప్రకారం వెంటనే రాజధాని నిర్మాణాన్ని చేపట్టాలని, రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్లను వారికి ఇవ్వాలనే డిమాండ్‌తో బీజేపీ ఈ ‘యాత్ర’లకు శ్రీకారం చుట్టింది.
రైతులకు మొదటి నుంచి మద్దతు
రాజధాని రైతులకు బీజేపీ మొదటి నుంచి మద్దతు తెలుపుతోంది. అమరావతి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఎంతో ఉదారంగా రూ.2,500 కోట్ల నిధులిచ్చింది. హడ్కో నుంచి రూ.4 వేల కోట్లు రుణం ఇప్పించింది. అమరావతిని స్మార్ట్ సిటీల జాబితాలోకి తెచ్చి మరో రూ.2 వేల కోట్లు కేటాయించింది. ఇవి కాక రాజధానిలో కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏర్పాటు చేసేందుకు అనుమతులు ఇచ్చింది. రూ.1,800 కోట్లతో ఎయిమ్స్, వెయ్యి కోట్లతో వ్యవసాయ విశ్వవిద్యాలయం, రూ.500 కోట్లతో డిజాస్టర్ మేనేజ్‌మెంట్ రీజినల్ కార్యాలయం, విజయవాడలో 3 ఫ్లైఓవర్లు, ఒక బైపాస్‌రోడ్డు, మరో బైపాస్‌కు అనుమతి, అమరావతి నుంచి కర్నూలుకు 4 వరుసల రహదారి, అనంతపురం నుంచి అమరా వతికి 6 వరుసల రహదారి, అమరావతిలో జాతీయ రహదారిని అనుసంధానిస్తూ అంతర్గత రహదారుల నిర్మాణం వంటి వాటికి అనుమతిని ఇవ్వగా, ఇందులో చాలా వరకు నిర్మాణంలో ఉన్నాయి.
ఇక ఆమరావతి మాత్రమే రాజధానిగా కొనసాగాలని బీజేపీ మొదటి నుంచీ తన గళాన్ని వినిపిస్తూనే ఉంది. ఉద్యమం చేస్తున్న రైతుల శిబిరాలను సందర్శించి వారికి సంఘీభావం తెలిపింది. రైతుల ఉద్యమాన్ని అణచివేసేందుకు రైతులపై ప్రభుత్వం చేపట్టిన పోలీసు దాడులను బీజేపీ ఖండించింది. రైతులపై వేసిన అక్రమ కేసులపైనా ప్రభుత్వాన్ని విమర్శించింది. రైతులు చేపట్టిన తిరుపతి రథయాత్రకు ప్రభుత్వ సహాయ నిరాకరణ, ఆంక్షలను విమర్శించడమే కాక యాత్ర పూర్తయ్యేలా రైతులకు సహాయ, సహకారాలు అందించింది.
ప్రజల దృష్టిలో దోషిగా నిలబెట్టే ప్రయత్నం
ప్రజావ్యతిరేక విధానాలు, ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంపై ప్రజల దృష్టిలో ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టేందుకు భారతీయ యువ మోర్చా యువ సంఘర్షణ యాత్రను ప్రారంభించింది. ఈ సంఘర్షణ యాత్ర ఆగస్ట్ 2 నుంచి 21 వరకు రాష్ట్రం లోని 4 జోన్‌లలో బైక్ ర్యాలీలుగా జరుగుతుంది. జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య జయంతిని పురస్కరించుకుని ఆగస్టు 2న తిరుపతిలో యువమోర్చా జాతీయ అధ్యక్షులు, లోక్‌సభ సభ్యులు శ్రీతేజస్వి సూర్య యాత్రను ప్రారంభించారు. తిరుపతి నుంచి రెండు యాత్రలు ప్రారంభమౌతాయి. ఒకటి కర్నూలుకు, మరోటి విజయవాడ వరకు సాగుతాయి. 8న మచిలీపట్నంలో ప్రారంభమయ్యే యాత్ర రాజమండ్రిలో ముగుస్తుంది. 4న శ్రీకాకుళంలో ప్రారంభమై విశాఖపట్టణంలో ముగుస్తుంది. రాయలసీమలో 1900 కిలోమీటర్లు, కోస్తాంధ్రలో 1700, గోదావరి జిల్లాల్లో 1400, ఉత్తరాంధ్రలో 1400 కి.మీ., సుమారు 7,500 కి.మీ.మేర ఈ యాత్ర సాగుతుంది. చివరగా విజయవాడలో ఈ నెలలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తారు.
నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం, విద్యుత్, టీచర్ పోస్టుల భర్తీ, పోలీసు రిక్రూట్‌మెంట్ సహా యువతకు ఉద్యోగావకాశాల కల్పనకు జగన్మోహన రెడ్డి ఇచ్చిన అనేక హామీలను ఈ యాత్రల సందర్భంగా ప్రస్తావించి ప్రజల ముందు దోషిగా నిలబెడతారు. ‘మోదీ సాయాలు, జగన్ మోసాలు’పై ప్రజలకు వివరిస్తారు. అన్ని ప్రాంతాల్లో జగన్ ప్రభుత్వం వైఫల్యాలను ప్రజలకు వివరిస్తున్నారు. ప్రజలను ఉద్యమంలో భాగస్వాములను చేస్తూ, వారి సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వంపై బీజేపీ ఒత్తిడి తెస్తోంది. నిలిపివేసిన పనులు పూర్తి చేయించడం, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా యువమోర్చా పనితీరు సాగుతోంది. కుటుంబ రాజకీయాలకు స్వస్తి పలికేలా ప్రజలు ఆలోచించాలని, అభివృద్ధి చేసే బీజేపీని ఆదరించాలని ఈ యాత్రలో కోరుతున్నారు.
– తురగా నాగభూషణం, సీనియర్ జర్నలిస్ట్