– పొత్తూరి విజయలక్ష్మి

విమానాశ్రయం ముందు ఆగింది టాక్సీ. ఇంకా పూర్తిగా ఆగకుండానే డోర్‌ ‌తీసుకుని దిగబోయింది కౌసల్య.

పక్కనే కూర్చుని వున్న శ్రీను గభాల్న తల్లి చేయి పట్టుకుని ఆపే శాడు. ‘ఉండమ్మా. పూర్తిగా ఆగాక దిగుదాం. ఏమిటా కంగారు?’ అన్నాడు.

‘ఈలోగా కారు వెళ్లిపోతే నానా ఖంగాళీ అవుతుంది.’ అంది. ‘అలా వెళ్లడు. మనం దిగి సామాను దింపుకున్నాక వెళ్తాడు.’ అన్నాడు. ‘ఇంకా నయం. మీ చిన్నప్పుడు ఓ మారు ఏమైందో తెలుసా నీకు?’ చెప్పటం మొదలు పెట్టింది.

కారు ఆగింది. కూడా వచ్చిన సూర్య దిగి సామాను దించాడు. ‘అమ్మ జాగ్రత. నేను వెళ్లి వీల్‌ ‌చైర్‌ ‌తీసుకు వస్తాను’ అని వెళ్లాడు శ్రీను.

కారు తియ్యమని విజిల్‌ ‌వేస్తూ చేతులతో సైగ చేస్తున్నాడు అక్కడ వున్న పోలీసు.

అది చూసి అతన్ని రమ్మని సైగ చేసింది కౌసల్య. వచ్చాడు అతగాడు.

‘చూడు అబ్బాయ్‌. ‌సైగ చేస్తూ మళ్లీ చెవులు చిల్లులు పడే లాగా విజిల్‌ ఎం‌దుకయ్యా? ఏదో ఒకటి చెయ్యి. చాలు’ అంది. ‘హమ్‌ ‌కో తెలుగు నహీ ఆతా మాజీ’ అన్నాడు.

‘చచ్చాం. ఇదో తిప్పలు. నాకు హిందీ కొంచెం ఆతా. తుమ్‌ ఒకేసారి రెండు పనులూ చెయ్యటం వద్దు హై. చేతులు పడిపోతాయి హై. కావలిస్తే కాసేపు విజిల్‌ ‌వెయ్‌’.

‘‌కాసేపు సైగ చెయ్‌ ‌హై’ అని యాక్షన్‌ ‌చేసి చూపించింది. ఆ ప్రాణికి ఇంకా అర్థం కాలేదు. వెర్రి మొహం వేసుకుని నిలబడ్డాడు. అతనికి ఏదో చెప్పి పంపించాడు సూర్య.

‘అబ్బాయి ఏడి సూర్యా? కొంపతీసి దిగకుండా ఆ కారులో వెళ్లిపోయాడా. చిన్నప్పుడు కూడా ఇంతే. బస్సులో నిద్రపోయి దిగాల్సిన స్టాపు దాటి ఎక్కడికో వెళ్లి పోయేవాడు. ఒకసారి ఇలాగే’…

అని చెప్తూ వుండగా శ్రీను వచ్చాడు. వెంట వీల్‌ ‌చైర్‌తో మనుషులు.అందులో ఆవిడని కూచో బెట్టారు. ‘అసలే నాలుగు రోజుల నుండీ కాళ్లు నొప్పులు అని అఘోరిస్తున్నావు. నువ్వు కూడా ఓ చక్రాల కుర్చీ తెప్పించుకునీ కూచో నాన్నా!’ అంది కొడుకుతో.

‘వద్దులే అమ్మా’ అన్నాడు శ్రీను. ‘ఫర్వాలేదు. మొహమాట పడకు. ఇంకో కుర్చీ తెస్తారు అడిగితే. ఇదుగో అమ్మాయ్‌. ‌నీ పేరేవిటో! వెళ్లి ఇంకో కుర్చీ పట్రా. మా అబ్బాయికి’.

 ఆవిడ చెప్పేది ఎవరూ వినిపించుకో లేదు. ఎవరి పని వాళ్లు చేసుకుపోయారు. ‘అయ్యో చెప్పేది వినరేం?’ అని మొత్తుకొంటూనే వుంది. గేటు దాకా వెళ్లారు. అక్కడ ఆగిపోయాడు సూర్య.

‘ఇక వుంటాను అమ్మా! జాగ్రత్తగా వెళ్లి రండి’ అన్నాడు ఆవిడ చెయ్యి పట్టుకుని.

‘నేను జాగ్రత్తగానే ఉంటాను లే! నువ్వు జాగ్రత్త. అయ్యగారిని కనిపెట్టి వుండు. ఇద్దరూ కలిసి ఆ టీవీ ముందు కూచుని క్రికెట్‌ ‌చూస్తూ ఒళ్లు మర్చిపోకుండా వేళ్టికి తినండి’ అంది.

తలాడించాడు సూర్య. శ్రీను, కౌసల్య లోపలికి వెళ్లారు. సామాను మిషన్‌ ‌లోపలికి వెళ్తే ‘శ్రీనూ నువ్వు సామాను మీద ఓ కన్నేసి వుంచు. ఇటువంటి చోట్ల దొంగ వెధవలు కనిపెట్టుకుని ఉంటారు. మనం కాస్త అజాగ్రత్తగా ఉంటే కొట్టేస్తారు సామాన్లు. నీకు గుర్తుందో లేదో! నీ చిన్నప్పుడు స్టేషన్‌లో రైలు ఆగగానే మీ నాన్నగారు సామాను దగ్గరే నిలబడి వుండేవారు. మళ్లీ బండి కదిలాకే స్థిమితంగా కూచోటం.’ అన్నది పెద్దగా. కంగారుగా చూశాడు శ్రీను. ఎవరూ ఏమీ పట్టించుకోలేదు. సెక్యూరిటీ చెక్‌ ‌కోసం లోపలికి తీసుకు వెళ్లారు. ఆ అమ్మాయిని పలకరించి కుశల ప్రశ్నలు వేసింది. ‘ నీకు వివాహం అయిందా?’ అని అడిగింది. అక్కడి నుంచి లోపలికి వెళ్లి వెయిటింగ్‌ ‌హల్‌లో కూచో బెట్టాడు. ఎదురు వరస కుర్చీలో వున్న మనిషిని చూసి ఆవిడ మొహంలో సంతోషం. ‘అరే మీరూ ఈ విమానం లోనే వెళ్తున్నారా? మీరు ఒక్కరేనా? సుమతి గారు రావటం లేదా?’ అని అడిగింది. ఆయన కంగారు పడిపోయాడు. ‘ఎవరమ్మా?’ అన్నాడు శ్రీను. ‘మీ నాన్న గారి కొలీగ్‌. ‌భాస్కర్‌ ‌గారు’ అంది. ఆయన వాలకం చూసి ‘సారీ! అమ్మ మిమ్మల్ని చూసి ఇంకెవరో అనుకున్నారు’ అని చెప్పాడు వినయంగా. ఆయన తల పంకించి మెల్లిగా లేచి వెళ్లి వేరే చోట కూచున్నాడు.

‘అదేవిట్రా పలకరిస్తే సమాధానం చెప్పకుండా అలా వెళ్లిపోయాడు. అప్పట్లో గ్యాస్‌కి కొరతగా వుండేది. బుక్‌ ‌చేస్తే పది రోజులకి గానీ వచ్చేది కాదు. ఎన్నోసార్లు మన సిలిండర్‌ ‌పట్టుకు వెళ్లేవాడు. మన స్కూటర్‌ అడిగి తీసుకుని ఝామ్మని సినిమాకి పోయేవాడు. ఇప్పుడు పలకరిస్తే మొహం తిప్పుకుని పోతాడేం.’ అంది.

‘ఆయన భాస్కర్‌ ‌కాదు వేరే ఎవరో’ అన్నాడు శ్రీను. ‘అలాగా. అచ్చు అలాగే ఉంటే ఆయనే అనుకున్నా. మనిషిని పోలిన మనిషి. ఎంత చిత్రమో’ అనేసి పక్కన వున్న మనిషిని పలకరించింది.

‘నీ పేరేమిటి అమ్మాయీ!’ ‘రిత్విక’ ‘బావుంది. మీది ఈ వూరేనా?’ ‘‘అవునండీ.’ ‘ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావూ?’

‘ఢిల్లీ.’ ‘అక్కడ ఏం పనీ?’ ‘జాబ్‌ ‌చేస్తున్నాను’. ‘పెళ్లయిందా?’ ‘లేదు’ ‘వయసు ఎంత?’ ‘ట్వంటీ ఫైవ్‌’.

‘‌నీకు తోడబుట్టిన వాళ్లు ఉన్నారా?’ ‘ఒక అన్నయ్య’. ‘అతనికి పెళ్లి అయిందా?’ ‘అయింది.’ ‘పిల్లలా?’ ‘లేరు.’ ‘మీ వదినకి తోడబుట్టిన వాళ్లు ఉన్నారా?’ ఇక భరించలేక లేచాడు శ్రీను.

 ‘అమ్మా పద! అట్లా వెళ్లి కాఫీ తాగి వద్దాం’ అని వీల్‌ ‌చెయిర్‌ ‌తోసుకుంటూ దూరంగా తీసుకు వెళ్లాడు. కాఫీ ఇప్పించాడు. షాపులు చూపిస్తూ తిప్పాడు.

టాయిలెట్‌ ‌కనిపించింది. ‘వెళ్తావా అమ్మా’ అడిగాడు.

‘వెళ్తాను.’ అంది. అక్కడ వున్న లేడీ వర్కర్‌ ‌సాయంతో లోపలికి పంపించాడు.

 ‘చూడమ్మాయీ. టాయిలెట్‌ ‌గోడ మీద ఆడ బొమ్మ, మగ బొమ్మ గభాల్న చూస్తే ఒకేలా కనిపిస్తాయి. ఆడ బొమ్మకి ఆ గౌను ఎందుకు చెప్పు. చక్కగా చీరె కడితే ఆడా మగ తేడా తెలుస్తుంది కదా!’ అని సలహా ఇచ్చింది.

ఆ అమ్మాయి నవ్వేసింది. ‘నిజమే అమ్మగారూ!’ అంది. ‘ఈ మాట మీ పెద్ద వాళ్ల చెవిన వెయ్యి. వాళ్లు మార్పు చేస్తారు.’ అని చెప్పింది. తల్లి బయటికి వచ్చాక మళ్లీ అటూ ఇటూ తిప్పాడు.

ఒకచోట కూచో పెడితే పక్కన వున్న వాళ్లను పీక్కు తినేస్తుంది. ఫ్లైట్‌ ‌టైమ్‌ అయింది. బోర్డింగ్‌కి రమ్మని అనౌన్స్మెంట్‌ ‌వినగానే వీల్‌చైర్‌ ‌వాళ్లు వచ్చి ఆవిడని విమానం ఎక్కించారు. సీట్‌ ‌లో కూచోబెట్టారు. సీట్‌బెల్ట్ ‌కట్టి ‘అలసటగా వుందా అమ్మా?’ అని అడిగాడు.

 ‘పువ్వులా తీసుకు వచ్చావు. అలసట ఏం లేదు.’ అంది. అటుగా వెళ్తున్న ఎయిర్‌ ‌హోస్టెస్‌ని పిలిచి నీకు జీతం ఎంత వస్తుంది?’ అని అడుగుతుంటే వారించాడు.

‘అలా అడక్కూడదమ్మా. వాళ్లు ఏమైనా అనుకుంటారు’ అన్నాడు. ‘నేనేం తప్పు మాట అన్నానురా! అడక్క పోతే ఎలా తెలుస్తుంది? వివరాలు తెలుసుకుని పెట్టుకుంటే రేపు ఎక్కడైనామంచి సంబంధం కనబడితే వివరాలు చెప్పచ్చు’ అంది. నిట్టూర్చి వూరుకున్నాడు. విమానం కదిలి గాల్లోకి లేచింది. మేఘాలను దాటుకుని ఎత్తుకు వెళ్లిపోయింది.

ఎంత బావుందో అని సంబర పడిపోయింది కౌసల్య. కాసేపు చూసి నిద్ర వస్తోంది. కాసేపు పడుకుంటాను అంది. బ్లాంకెట్‌ ‌తీసి కప్పాడు.

కొడుకు చెయ్యి పట్టుకుని ‘నన్ను చంటి పిల్లలాగా చూసుకుంటున్నావు. నాన్న గారికి టికెట్టు దొరక్కుండా పోయింది. ఆయన కూడా వచ్చి వుంటే ఎంత సంబర పడేవారో. త్వరలోనే టికెట్టు కొని ఆయన్ని కూడా తీసికెళ్లి పోదాం మనతో’ అంది.

గుండె జారిపోయింది శ్రీనుకి. ఆరు నెలల క్రితం వరకు ఒక రకంగా జరిగిన జీవితం ఒక్కసారి కుదిపి వేసినట్లు అయింది.

శ్రీను వయసు నలభై రెండేళ్లు. అదేం కర్మమో అన్నీ వున్నా జీవితం సాఫీగా సాగలేదు.

మొదటి నుండి అడుగడుగునా ఏవో అడ్డంకులు. తండ్రి కేశవరావు మంచి ఉద్యోగంలో వున్నాడు. తల్లిదండ్రులకు ఒక్కడే.

 ఇంజనీరింగ్‌ ‌ఫైనలియర్‌ ‌పరీక్షల సమయంలో బాగా జ్వరం వచ్చి ఒక ఏడు వెనక పడ్డాడు.

ఉద్యోగంలో బాస్‌కి ఇతని మీద అయిష్టం. పడలేక ఉద్యోగం వదిలేశాడు. ఒక అమ్మాయిని ప్రేమిస్తే పెళ్లిదాకా వచ్చాక ఆ అమ్మాయి వద్దు పొమ్మంది.

 అటువంటి దెబ్బలు చాలా తగిలాక ఒక మిత్రుని సాయంతో సింగపూర్‌ ‌వెళ్లి అక్కడ ముందు ఉద్యోగం తర్వాత బిజినెస్‌. ‌జీవితంలో నిలదొక్కుకున్నాడు. కానీ జరిగిన అనుభవాల వల్ల మనిషి రాటు తేలిపోయాడు. ఏ విధమైన సెంటిమెంట్స్ ‌లేవు.

మొక్కుబడి వ్యవహారం. ఎప్పుడో ఒకసారి తల్లిదండ్రులతో ఫోన్లో సంభాషణ. అది కూడా నాలుగు ముక్కలు. పెళ్లి చేసుకోమని శతవిధాల చెప్పారు తల్లిదండ్రులు. అలాటి బాదరబందీలు వద్దు అనుకుని పెళ్లి చేసుకోలేదు. పద్మ అనే తమిళ అమ్మాయితో సహా జీవనం. ‘పెళ్లి చేసుకుందాం’ అని తను ఎన్నో సార్లు అడిగింది. ‘వద్దు’ అన్నాడు.

ఆరు నెలల కిందట తండ్రి ఫోన్‌ ‌చేసి అర్జంటుగా రమ్మన్నాడు. ఫోన్లో చెప్పండి అని తప్పించుకోవాలని చూసినా కుదరలేదు.

తప్పనిసరి పరిస్థితుల్లో బయలుదేరి ఇండియా వచ్చాడు. వచ్చాక తెలిసింది. తండ్రికి క్యాన్సర్‌. ‘‌చూడు కన్నా! డెభై ఏళ్లు నాకు. ఈ వయసులో వచ్చిన ఈ వ్యాధి తగ్గదని నాకు తెలుసు. ఏదో కంటితుడుపుగా మందులు వాడటం. నా గురించి ఏ దిగులు లేదు. నా బాధల్లా మీ అమ్మ గురించి.

నువ్వు జీవితంలో సరిగ్గా స్థిరపడలేదని దిగులుపడి మీ అమ్మ ఆరోగ్యం పాడై పోయింది. శారీరకంగా బాగానే ఉంది కానీ మానసికంగా కుంగిపోయింది. మతిమరుపు. చాదస్తం. ఏదో మాట్లాడుతూ ఉంటుంది. నాకు క్యాన్సర్‌ అని తెలిసిన తరువాత షాక్‌కి గురయింది. ఏదీ గుర్తు వుండదు.

 నేను పోయినా పెన్షన్‌ ‌వస్తుంది. ఉండటానికి ఇల్లు ఉంది. కానీ ఒంటరిగా ఉండలేదు. తనని ఎక్కడ ఉంచాలి? ఈ పరిస్థితుల్లో నాలుగు చోట్ల తిరిగి ఏదైనా ఓల్డ్ ఏజ్‌ ‌హోమ్‌ ‌చూసే శక్తి నాకు లేదు. అందుకే ఈ బాధ్యత నీకు అప్పగిస్తున్నాను.

మీ అమ్మకు ఏదైనా ఏర్పాటు చెయ్యి. ఇల్లు అమ్ముతావో అద్దెకు ఇచ్చుకుంటావో నీ ఇష్టం. ఆ పని అయ్యాక నేను పోయేదాకా నువ్వు వుండక్కర్లేదు. నా బాడీ మెడికల్‌ ‌కాలేజీ కి డొనేట్‌ ‌చేశాను’ అని చెప్పాడు. శ్రీను మనసులో ఏదో కదలిక. ఏదో మార్పు.

ఫ్రెండ్‌కి ఫోన్‌ ‌చేసి ఇదీ విషయం. నేను కొన్నాళ్లు ఇక్కడ వుంటాను అని చెప్పాడు. తండ్రిని దగ్గర వుండి చూసుకున్నాడు. రోజు రోజుకూ కుంగి పోతున్న తండ్రినీ, చుట్టుపక్కల ఏం జరుగుతోందో పట్టించుకోకుండా ఏమిటో మాట్లాడుతూ పిచ్చిదానిలాగా ఉన్న తల్లిని చూసి అతని మనసు ద్రవించి పోయింది.

నా జీవితంలో జరిగిన చేదు అనుభవాల ఏ పాపం ఎరుగని అమ్మా నాన్నలను బలిచేశాను. క్షమించరాని నేరం అని పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు.

 తండ్రిని ఎంతో ప్రేమతో చూసుకున్నాడు. కొడుకు చేతుల్లో తృప్తిగా కన్ను మూశాడు కేశవరావు. కౌసల్య మనసుకి ఎక్కలేదు ఆ విషయం. బాడీని తీసుకు వెళ్తుంటే ‘ఎక్కడికి రా నాన్నగారిని తీసుకు వెళ్తున్నారు?’ అని అడిగింది. ఆయన ఇంకా ఉన్నాడనే భ్రమ. ‘నిజం గ్రహిస్తే తట్టుకోలేదు ఆవిడ. అలాగే ఉండనివ్వండి. చూద్దాం కొన్నాళ్లు’ అన్నాడు డాక్టర్‌. ఇక్కడి పనులు చక్కబెట్టుకుని తల్లిని తీసుకుని సింగపూర్‌ ‌ప్రయాణమయ్యాడు. మెసేజ్‌ ‌మోగడంతో ఈ లోకంలోకి వచ్చాడు. పద్మ. ‘ఎలా ఉంది జర్నీ. అమ్మ ఎలా ఉన్నారు?’

 ‘ఫైన్‌’ అని రిప్లై ఇచ్చి. ‘పద్మా! నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వీలైనంత త్వరగా మనం పెళ్లి చేసుకుందాం. నాకు ఏ బంధాలు వద్దు.

ఒంటరిగా సుఖంగా ఉంటాను అని నన్ను నేను మోసం చేసుకుంటూ ఇంతకాలం బతికాను.

ఇక నా వల్ల కాదు. నాకు అందరూ కావాలి. అమ్మ నా దగ్గర వుండాలి. భార్య, పిల్లలు కావాలి’ టైప్‌ ‌చేస్తుంటే కళ్లు చెమర్చాయి.

‘నాన్నగారు కూడా వస్తే బావుంటుంది’ కలవరిస్తోంది కౌసల్య. ఆమె చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకున్నాడు.

‘వస్తారమ్మా! తప్పక వస్తారు. వేరే రూపంలో అనుకున్నాడు మనసులో.

వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది

About Author

By editor

Twitter
YOUTUBE