– డా।। దేమె రాజారెడ్డి, న్యూరో సర్జన్‌, అపోలో

కాకతీయుల చరిత్ర అంటే తెలంగాణ ప్రాంతంలో ఆఖరి హిందూ పాలకుల చరిత్ర. అయినా అది స్వర్ణయుగమే. కాకతీయులు రాష్ట్ర కూటులకు భృత్యులుగా ఉండేవారు. అక్కడే వారి చరిత్రకు అంకురార్పణ జరిగింది. తరువాత చాళుక్యుల దగ్గర కూడా వారు పనిచేశారు. ఆపై స్వతంత్రం ప్రకటించుకున్నారు. క్రీస్తుశకం 956 దగ్గర వారి వంశ పాలన ఆరంభమైందనవచ్చు. అక్కడ నుంచి రెండు వందల సంవత్సరాలు కాకతీయ రాజ్యం వర్ధిల్లింది. క్రీస్తుశకం 1323లో పతనమైంది. కాకతీయులు చాళుక్య పాలకులకు ఒదిగి ఒదిగి ఉంటూ స్వతంత్రులు కాలేదు. ఆ వంశ పాలకుడు రెండో ప్రోలరాజు కాలం నుంచి వారి ఆధిపత్యం బలహీనపడింది. అయినా ఆయన విజయాలు చరిత్ర ప్రసిద్ధమైనవే. ఉదాహరణకి రెండో ప్రోలరాజు కందూరు చోడ వంశానికి చెందిన గోకమ చోడుడుని ఓడించాడు. హనుమకొండ మీద దాడి చేసినప్పుడు పారమార కుటుంబీకుడు, కొల్లిపాక పాలకుడు జగద్దేవ్‌ను కూడా ఓడించాడు. రెండో ప్రోలరాజు తరువాత రుద్రుడు పాలకుడయ్యాడు. ఆయనతో పాటు, ఆ తరువాత వచ్చిన వారు కూడా రాజ్య విస్తరణకు పాటుపడ్డారు. కాగా, కాకతీయ పాలకు లంతా కూడా యుద్ధవీరులే. ఇందుకు సంబంధించి పలు వాజ్మయ ఆధారాలు లభ్యమవుతున్నాయి. కొన్ని ఉదాహరణలు చూద్దాం.

–   యాదవులు లేదా సేయూనాల రాజధానిని ముట్టడించినప్పుడు మహాదేవుడు మరణించాడు.

–   అంబదేవునితో జరిగిన యుద్ధంలో రుద్రమదేవి మరణించి ఉండవచ్చు.

–  ప్రతాపరుద్రుడు మహమ్మదీయుల బందీగా ఉన్నప్పుడు నర్మద దాటుతూ అందులో మునిగి మరణించి ఉండవచ్చునని చరిత్ర వల్ల తెలుస్తున్నది. ఇతడిని తుగ్లక్‌ ‌వంశీయులు ఓడించి ఢిల్లీ తీసుకుని వెళుతుండగా ఈ సంఘటన జరిగింది.

–    కోట పాలకుని చేతిలో రెండో ప్రోలరాజు మరణించాడు.

–    మూడో గుండరాజు తూర్పు చాళుక్యుల యువ రాజు ఇరిమర్తగండ చేతిలో మరణించాడు.

–    విరియాల ఎర్ర దగ్గర జరిగిన యుద్ధంలో నాలుగో గుండరాజు మరణించాడు.

ఇవన్నీ వీరోచిత గాథలే

తెలుగు మాట్లాడేవారంతా ఒక ఛత్రం కింద వచ్చిన కాలం కాకతీయుల పాలనలో కనిపిస్తుంది. అదే ఆఖరి హిందూ రాజ్యం కూడా. ఇదే 1323లో పతనమైంది. కాకతి రాజ్య అస్తమయంలో ఐదు ప్రధాన పాత్రలు కనిపిస్తాయి. వారు ఎవరో చూద్దాం.

ఖిల్జీ వంశీకుడు రెండో అల్లావుద్దీన్‌ ‌మహమ్మద్‌ (1296), ‌ఘియాజుద్దీన్‌ ‌తుగ్లక్‌ (1320-1325), ‌మహమ్మద్‌ ‌బిన్‌ ‌తుగ్లక్‌ (1325-1351), ‌యాదవ వంశీకుడు రామచంద్ర, కాకతీయ వంశీకులలో చివరివాడు ప్రతాప రుద్ర (1289-1323).

గర్షాప్‌ ‌మాలిక్‌, ‌రామచంద్ర యాదవ్‌ ‌దేవగిరి మీద దాడి చేశారు (1295). పెద్దగా ప్రతిఘటన ఎదురుకాలేదు. గర్షాప్‌ ‌మాలిక్‌ అపార ధనరాశులతో ఢిల్లీ తిరిగి వెళ్లాడు. అందులో ఆరున్నర టన్నుల బంగారం ఉంది. ఈ గర్షాప్‌ ‌మాలిక్‌ 1296‌లో ఖిల్జీ రాజ్య పాలకుడయ్యాడు. అంటే ఇతడు ఓరుగల్లు వచ్చిన నాటికి పాలకుడు కాదు. ఒక్క సంవత్సరం తరువాత పాలకుడు ఎలా అయ్యాడంటే, అప్పటికి పాలకునిగా ఉన్న జలాలుద్దీన్‌ ‌ఖిల్జీని హత్య చేశాడు. పేరు మార్చుకుని పాలకుడయ్యాడు. అతడే అల్లావుద్దీన్‌ ‌ఖిల్జీ. నిజానికి ఓరుగల్లు సిరిసంపదలు సుల్తాన్ల కన్నుకుట్టేలా చేశాయి. రామచంద్రయాదవ్‌ ‌రాజ్యం ఈ విషయంలో కాకతీయులకు సాటి వచ్చేది కాదు. అందుకే సుల్తాన్లు ఓరుగల్లు మీద దాడికి దిగారు. ఇంత ఘర్షణ ఉన్న ఈ కాలం నాణేలు ఎలా ఉన్నాయి ఒకసారి పరిశీలిద్దాం.

రెండో అల్లావుద్దీన్‌ ‌మహమ్మద్‌ ‌ఖిల్జీ నాణెం

ఈ నాణెం బరువు 10.87 గ్రాములు. వ్యాసార్ధం 2.6 సెంటీమీటర్ల. బొమ్మ వైపున -సుల్తానుల్‌ ఆజమ్‌ అల్లావుద్దీనాయవాద్దీన్‌ అబుల్‌ ‌ముజఫర్‌ ‌మహమ్మద్‌ ‌షా సుల్తాన్‌ అన్న అక్షరాలు చెక్కారు. బొరుసు వైపు- సింకదరుతాని యమీనుల్‌ ‌ఖిలాఫత్‌ ‌నాసిర్‌ ‌యు అమీరిల్‌ ‌ముమినీన్‌ అని రాసి ఉంది. వీటిని బట్టి ఒక విషయం చరిత్రకారులకు తెలిసింది. అలావుద్దీన్‌ ‌తనను తాను రెండో అలెగ్జాండర్‌గా శ్లాఘించు కున్నాడు. చిత్రంగా ఇతడు ఖలీఫా అనుమతి లేకుండానే నాణేలు విడుదల చేశాడు. తాను పాలకుడిని కాబట్టి ఈ భూమ్మీద అల్లాకు తానే ప్రతినిధినని ఇతడు భావించాడు.

అల్లావుద్దీన్‌ ‌సైన్యం 1303లో తెలంగాణ మీద దాడికి వచ్చింది. కానీ ఆ సమయంలో ప్రతాప రుద్రుని చేతిలోనే ఖిల్జీ సైన్యం ఓటమి చవిచూసింది. బెంగాల్‌ ‌మీదుగా వచ్చి ఖిల్జీ సైన్యం ఉప్పరపల్లి దగ్గర యుద్ధం చేసింది. 1310లో మరొకసారి ఖిల్జీ సైన్యం తెలంగాణ మీదకు దాడికి వచ్చింది. అది కూడా దేవగిరి మీదుగా తరలింది. గట్టి యుద్ధమే జరిగినా చివరికి ప్రతాపరుద్రుడు శాంతి ఒప్పందం చేసుకున్నాడు. 1323లో ఘియాజుద్దీన్‌ ‌తుగ్లక్‌ ‌తెలంగాణ మీద దండెత్తాడు. అయితే ఈ దాడి అతడి కుమారుడు ఉలూగ్‌ ‌ఖాన్‌ ‌నాయకత్వంలో జరిగింది. ఉలూగ్‌ఖాన్‌ ‌తీవ్రంగా ప్రయత్నించినా, ఆరు నెలలు పాటు పడినా ఓరుగల్లును స్వాధీనం చేసుకోలేక పోయాడు. తరువాత మరొక ఐదుమాసాల పాటు యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో కాకతీయ సేన ఓడిపోయింది. నిజానికి రెండో దాడి ప్రతాపరుద్రుడు ఊహించినది కాదు. కానీ ఆయన అంచనా తప్పని రుజువైంది. ప్రతాపరుద్రుని బందీగా ఢిల్లీ తీసుకు వెళుతుంటే దారిలో నర్మదలో దూకి మరణించాడు.

ఘియాజుద్దీన్‌ ‌తుగ్లక్‌ ‌షా నాణెం

దీని బరువు 11.03 గ్రాములు. వ్యాసార్థం 2.5 సెంటీమీటర్లు. బొమ్మ వైపు రాత: సుల్తానుల్‌ ‌ఘాజీ ఘియాజుద్దీనయావద్దిన్‌ అబుల్‌ ‌ముజఫర్‌. ‌బొరుసు వైపు : తుగ్లక్‌ ‌షా సుల్తాన్‌ ‌నాసిరి అమీరిల్‌ ‌మొమునీన్‌. ‌తెలంగాణ మీద తుగ్లక్‌ల ఆధిపత్యం ఎంతవరకు కొనసాగిందో చెప్పడం కష్టం. అయితే అది 1336 కల్లా ముగిసిన మాట నిజం. ఇంకా చెప్పాలంటే అంతకంటే ముందే ముగిసిందని కూడా చెప్పవచ్చు.

మూడో మహమ్మద్‌ ‌బిన్‌ ‌తుగ్లక్‌ ‌నాణెం

బరువు 10.96 గ్రాములు. వ్యాసార్ధం 2.5 సెంటీమీటర్లు

బొమ్మ వైపు రాత: సుల్తాన్‌ ఉజ్‌ ‌సయీద్‌షా అనరాలాలాహు బుర్హాను

బొరుసు వైపు: అబుల్‌ ‌ముజఫర్‌ ‌తుగ్లక్‌ ‌షా అనరాలాలాహు బుర్హాను

ఈ నాణేన్ని తన తండ్రి స్మారక చిహ్నంగా విడుదల చేశాడు. నిజంగా మహమ్మద్‌ ‌బిన్‌ ‌తుగ్లక్‌ ‌తత్వం చూస్తే వింత అనిపిస్తుంది. ఇతడు తన తండ్రిని హత్య చేయడానికి పథకం వేశాడు. ఆ తరువాత సింహాసనాన్ని ఆక్రమించాడు. అప్పుడు తండ్రిని అమరునిగా కీర్తిస్తూ నాణేలు ముద్రించాడు.

రామచంద్ర యాదవ్‌ ‌నాణెం

బరువు 3.70 గ్రాములు, వ్యాసార్థం 1.6 సెంటీమీటర్లు

బొమ్మ వైపు: నాణెం మధ్యలో ఎనిమిది రేకల కమలాన్ని చిత్రించారు. ఒక చోట శంఖాన్ని ముద్రించారు. మరొకచోట రాజచిహ్నం -శ్రీరామ్‌ ‌ముద్రించారు. బొరుసు వైపు ఖాళీగా వదిలిపెట్టారు.

ప్రతాపరుద్రుడి నాణెం

బరువు 3.8 గ్రాములు, వ్యాసార్థం 1.7 సెంటీమీటర్లు

బొమ్మ వైపు: ఎడమ వైపు చూస్తున్న అడవి పంది బొమ్మ ఉంది. శ్రీ అని రెండుచోట్ల ముద్రించారు. దాయగజ అన్న అక్షరాలు రాయించారు. ఒక సున్న ఆకృతి, కమలాల ఆకృతులు కూడా ఉన్నాయి. బొరుసు వైపు ఖాళీగా వదిలారు.

గజకేసరి అనేది కాకతీయులు స్వీకరించిన బిరుదు. అంటే ఏనుగుల పాలిట సింహం అని అర్ధం. దీని పరమార్ధం కాకతీయులు శత్రువులుగా భావిస్తున్న యాదవులను, పాండ్యులను ఏనుగులుగాను, వారి పాలిట కాకతీయులు సింహాలుగానే భావించుకున్నారు. స్థానిక కాయస్థ వంశీకులను కూడా కాకతీయులు శత్రువులుగానే పరిగణించారు. కాకతీయులు వారి పేర్లతో ఏనాడూ నాణేలను విడుదల చేయలేదు. అలాగే వారి బిరుదులు కూడా నాణేల మీద కానరావు. రాణి రుద్రమ మనుమడు ప్రతాపరుద్రుడు. ఆయనకు రుద్రమ దాయగజకేసరి అన్న బిరుదు ఇచ్చారు. మహమ్మద్‌ ‌తుగ్లక్‌ ఓరుగల్లు పేరును సుల్తాన్‌పూర్‌ అని మార్చాడు. ఆ పేరు గల టంకసాల నుంచే నాణేలు విడుదల చేశాడు. ఈ నాణేలు మెదక్‌ ‌ప్రాంతంలో దొరికాయి. ఇతడు రాగి నాణేలు కూడా విడుదల చేశాడు. ఈ నాణేలను బట్టి ఇక్కడ ఢిల్లీ నుంచి వచ్చిన ముస్లింల పాలన చిరకాలం కొనసాగలేదని తెలుస్తుంది. హమ్రుజ్‌ ‌కౌస్‌ ‌కూడా మరొక నాణెం గురించి వివరించారు.

తుగ్లక్‌ ‌రాగి నాణెం

బొమ్మ వైపు: అదిల్‌ ‌మహమ్మద్‌ ‌షా,

బొరుసు వైపు: బెహజరత్‌ ‌సుల్తాన్‌పూర్‌ అన్న అక్షరాలు ఉన్నాయి.

మహమ్మద్‌ ‌బిన్‌ ‌తుగ్లక్‌ ‌విడుదల రాగి నాణెం కూడా లభ్యమైంది. ఈ విధంగా తుగ్లక్‌ల కారణంగా ప్రజారంజక పాలన అందించిన కాకతీయ సామ్రాజ్యం

కూలిపోయింది. అదే ఇక్కడి ఆఖరి హిందూ రాజ్యం.

About Author

By editor

Twitter
YOUTUBE