అల్లూరి ఉద్యమానికి నూరేళ్లు

– కల్హణ

వలస పాలన లేదా సామ్రాజ్యవాదపు విషపుగోళ్లు ఒక వర్గం ఆత్మ విచ్ఛిత్తితోనే తృప్తిపడవు. అవి ధ్వంసం చేసేది- మొత్తం జాతి ఆత్మను. ఆ జాతి గతం మీద, ఆ గతంలోని వారి ఔన్నత్యం మీద, వారి సృజన పైన, మేధస్సు మీద కూడా ముసుగు కప్పుతుంది. వర్తమానతరాన్ని అంధకారంలో ఉంచుతుంది. వాళ్ల ఆధిపత్యం కోసం నీ మతం, నీ జీవన విధానం, నీ విద్యావిధానం, నీ చింతనాధోరణి, నీవు ఆరాధించే పురాణాలు, నిన్నటి దాకా నిన్ను నడిపించిన చరిత్ర… సర్వం అనాగరికమైనవని ముద్ర వేస్తుంది. వలస వాదం లక్ష్యం జాతిని బానిసత్వంలోకి నెట్టివేయడం. దీనిని భారతీయ కోణం నుంచి అర్థం చేసుకుని బ్రిటిష్‌ ‌పాలన మీద సాగించినదే మన స్వాతంత్య్ర పోరాటం. మైదానాలలో మధ్య తరగతి విద్యావంతులకు కొంచెం ఆలస్యంగానే ఈ వాస్తవం అనుభవానికి వచ్చింది. కానీ, అడవితల్లి ఒడిలో నిష్కల్మషంగా పెరిగిన గిరిజనం మాత్రం వలసవాదం మాయలో ఎప్పుడూ పడలేదు. 1768 నుంచి 1922 వరకు దాదాపు 155 ఏళ్లు సాగిన భారత గిరిజన పోరాటాలన్నీ ఇదే విషయాన్ని రుజువు చేస్తున్నాయి. ఆంగ్లేయుల అణచివేత మీద దాదాపు ఆఖరిది అనదగిన విశాఖ మన్య విప్లవంలో అలాంటి ఆత్మగౌరవ జాడ సుస్పష్టం. అడవికీ, అడవి బిడ్డకీ మధ్య గోడలై నిలిచిన చట్టాల మీద తిరుగుబాటు అది. బానిసత్వంలో కూరుకుపోతున్న గిరిపుత్రులు తమదైన స్వేచ్ఛను తిరిగి సాధించుకోవడం కోసం ఒక స్పృహతో రగిలించిన అలజడి అది. అల్లూరి శ్రీరామరాజు లేదా సీతారామరాజు నాయకత్వంలో సాగిన విశాఖ మన్య విప్లవంలోని ఈ కోణాలను ఆ మహోన్నత చారిత్రక ఘట్టం నూరేళ్ల సందర్భంగా ఇప్పుడు మననం చేసుకుందాం. భారత స్వరాజ్య సమర నాదం లోయలనూ, కోనలనూ కొండగాలిలా తాకిన వాస్తవాన్ని గమనిద్దాం.


విశాఖ మన్యానికీ లేదా రంప లోయకూ తిరుగుబాటు కొత్త కాదు. 18వ శతాబ్దం ఆఖరి రోజుల నుంచి అక్కడ అలజడులు కనిపిస్తాయి. శాంతభూపతి, ద్వారబంధాల చంద్రయ్య, రేకపల్లి అంబురెడ్డి, కారం తమ్మనదొర వంటి ఎందరో అక్కడ తిరుగుబాట్లు చేశారు. ఆ పోరాటాలన్నీ స్వయంపాలన ధ్యేయంగా సాగినవే. ఈ లక్షణాన్ని పరిపూర్ణంగా ప్రతిబింబించిదే 1922-24 నాటి మన్య విప్లవం. దీనికి ముందు జరిగిన మన్య విప్లవాలు సహా, దేశం నలుమూలలా జరిగిన గిరిజన పోరాటాలకి ఉన్న తేడా అవి స్థానిక సమస్యల మీద, గిరిజనుల హక్కుల కోసం జరిగినట్టు కనిపిస్తాయి. వాటి ధ్యేయం స్వయం పాలన. పోలీసు రాజ్యం మీద ఆగ్రహం. ఆ ఉద్యమాలలో నాయకులు, వారి వెంట నడిచిన వారు అంతా గిరిజనులు. కానీ మన్య విప్లవంలో నాయకుడు మైదాన ప్రాంతం నుంచి వచ్చిన అల్లూరి శ్రీరామరాజు. ఆయనను విశాఖ మన్య ప్రజలు అనుసరించారు.

అంకురార్పణ

శ్రీరామరాజు (జూలై 4, 1897-మే 7, 1924) కుటుంబంతో కలసి కొద్దికాలం తునిలో ఉన్నారు. ఇంగ్లిష్‌ ‌చదువులు చదివి ఉద్యోగం సంపాదించమని పోరుతున్న తల్లితో కొలువులో చేరతానని చెప్పి కొంత డబ్బు తీసుకుని 1915లో తల్లి నుంచి దూరంగా వెళ్లిపోయాడు శ్రీరామరాజు. ఉత్తర భారతమంతా తిరిగి, హరిద్వార్‌ను దర్శించుకున్నాడు. ఈ యాత్రే రామరాజును ఉద్యమకారునిగా మలిచిందని చెప్పడానికి అవకాశం ఉంది. మొదటి ప్రపంచ యుద్ధాన్ని ఆసరా చేసుకుని దేశమంతటా ఏకకాలంలో తిరుగుబాటు లేవదీయాలన్న యోచనలో గదర్‌ ‌పార్టీ సన్నాహాలు చేసిన కాలమది. దీనినే హిందూ-జర్మన్‌ ‌కుట్ర అంటారు. రామరాజు యుద్ధపు రోజులలో యుద్ధం నేర్చుకున్నాడని ‘మెయిల్‌’ ‌పత్రిక రాసిందని ‘శ్రీ అల్లూరి సీతారామ రాజు ప్రశంస’ పుస్తకంలో (రామరాజు జీవితం మీద వచ్చిన తొలి రచన, 1925) భమిటిపాటి సత్య నారాయణ రాశారు. ఆ వార్తను ఎవరు నమ్మినా నమ్మకున్నా యుద్ధం చెయ్యాలంటే ఆంధ్రులకు పెద్ద తర్ఫీదు అవసరం లేదని అంటారు రచయిత. అలాగే రామరాజుకు జాతీయ కాంగ్రెస్‌ అతిరథ మహారథుల దర్శన భాగ్యం కలగచేసినది కూడా ఈ యాత్రేనని పిస్తుంది. కృష్ణదేవిపేటలో ఉండగా రామరాజు వద్ద కావ్యాలు, హిందీ నేర్చుకున్న చిటికెల దాలినాయుడు ఆయన మీద రాసిన ఒక పుస్తకంలో, ఆ యాత్రలోనే రామరాజు కలకత్తా వెళ్లి సురేంద్రనాథ్‌ ‌బెనర్జీని కలుసుకున్నట్టు చెప్పారు. ఆ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ కూడా ఆ అముద్రిత రచనలో ఇచ్చారు. ఈ యాత్ర నుంచి ఆయన విశాఖ మన్యం చేరుకున్నారు.

కృష్ణదేవిపేటకు రామరాజు

అల్లూరి ఉద్యమ జీవితానికి ఊయల వంటిది కృష్ణదేవిపేట. ఇది విశాఖ మన్యానికి గుమ్మం వంటి గ్రామం. జూలై 24, 1917న శ్రీరామరాజు దేశ పర్యటనలో భాగంగానే ఆ ఊరు చేరుకున్నాడు. ఆ ఊరు ఆయనను ఒక యతిలా చూసింది. ఊరి పెద్ద చిటికెల భాస్కరనాయుడు ఆశ్రయం ఇచ్చాడు. రామరాజు కోరిక మేరకు గ్రామస్థులు నీలకంఠేశ్వర స్వామి ఆలయానికి దగ్గరగా చిక్కాలగడ్డ అనే చోట ఒక పూరిపాక నిర్మించి ఇచ్చారు. అక్కడికి రామరాజు తల్లి సూర్యనారాయణమ్మ, తమ్ముడు సత్యనారాయణ రాజు కూడా వచ్చారు. ఆ ప్రాంతానికే భక్తితో శ్రీరామ విజయనగరం అన్న పేరు పెట్టారు. ఆ గ్రామంలోను, పక్కనే ఉన్న కొంగసింగి వంటి గ్రామాలలోను రామరాజు మండల దీక్షలు నిర్వహించారు. అంతా ఆధ్యాత్మిక జీవితమే. అలాంటి సమయంలో ఆధ్యాత్మిక చింతనతోపాటు ఆయుధం స్వీకరించ వలసి వచ్చింది. ఉద్యమం ప్రారంభించడానికి రెండు మూడు ప్రధాన కారణాలు కనిపిస్తాయి.

సహాయ నిరాకరణోద్యమం నిలిపివేత

తాను తిలక్‌ ‌మహరాజ్‌ను అభిమానిస్తానని ఒక సందర్భంలో రామరాజు చెప్పినట్టు చిటికెల దాలినాయుడు రాసిన పుస్తకంలో కనిపిస్తుంది. 1920లో గాంధీజీ సహాయ నిరాకరణోద్యమానికి పిలుపునిచ్చారు. తన ఉద్యమాన్ని విజయవంతం చేస్తే ‘ఒక్క ఏడాదిలోనే స్వాతంత్య్రం’ అన్న లక్ష్యాన్ని కూడా ఆయన చూపించారు. దేశంలో ఉవ్వెత్తున స్వరాజ్య కాంక్ష వెల్లువెత్తింది. నర్సీపట్నం ప్రాంత జాతీయ కాంగ్రెస్‌ ‌కార్యకర్తలు కృష్ణదేవిపేట వంటి చోట్ల కూడా సహాయ నిరాకరణోద్యమ ఉద్దేశాలను ప్రచారం చేశారు. 1921లో రామరాజు కాలినడకన నాసికా త్రయంబకం వెళ్లారు. అక్కడ సావర్కర్‌ ‌సోదరుల అభినవ్‌ ‌భారత్‌ ‌విప్లవ సంస్థ ప్రభావం ఉంది. నాసిక్‌ ‌నుంచి తిరిగి కృష్ణదేవిపేట రాగానే అధికారులు ఆయనపై దృష్టి పెట్టారు. నిజానికి అప్పటికే రామరాజు మన్యవాసులతో సాహచర్యం నెరపుతూ కొన్ని సంస్కరణలు తెచ్చాడు. అందులో మద్యపాన నిషేధం ఒకటి. పంచాయతీలు ఏర్పాటు చేయడం, కోర్టులను బహిష్కరించాలని చెప్పడం కూడా చేశారాయన. ఇవన్నీ సహాయ నిరాకరణ ఉద్యమంలో అంశాలే. దీనితో రామరాజును నాన్‌ ‌కో ఆపరేటర్‌గా అనుమానించడం మరింత ఎక్కువయింది. అప్పుడే, 1922 జనవరిలో రామరాజును ఇంకా బలంగా అనుమానించడానికి అవకాశం ఉన్న మరొక ఘటన జరిగింది.

మన్యం పెద్దల రాక

మొదటి ప్రపంచ యుద్ధం తరువాత వచ్చిన కరవు నివారణ కోసం ప్రభుత్వం ఉపాధి కల్పన పనులు ఆరంభించింది. ఆ మిషతోనే బ్రిటిష్‌ ‌ప్రభుత్వం మన్యంలో రోడ్ల నిర్మాణం మొదలు పెట్టింది. గూడెం డిప్యూటీ తహసీల్దార్‌ అల్ఫ్ ‌బాస్టియన్‌ ‌బినామీ పేర్లతో కాంట్రాక్టు తీసుకుని, మన్యంలో మునసబులు, ముఠాదారులను బెదిరించి గిరిజనులను పనికి రప్పించి కూలి ఇవ్వక వేధించేవాడు. భారతదేశ చరిత్రలో ఆ రోడ్ల నిర్మాణం అమానుష ఘట్టం. ఆ చరిత్ర ఎంత విషాదమో నాటి మన్యం డాక్టర్‌ ‌తేతలి సత్యనారాయణమూర్తి తన డైరీలో రాసుకున్నారని యర్రమిల్లి నరసింహారావు తన పుస్తకంలో గుర్తు చేశారు. బాస్టియన్‌కు రోడ్డు ఓవర్సియర్‌ ‌సంతానం పిళ్లై తోడయ్యాడు. నిజానికి అడవిబిడ్డలకు అడవిలో ప్రవేశం నిషేధించిన చట్టాలతో కూలీలుగా మారిపోయారు. ఇలాంటి సమయంలో పెద్దవలస మాజీ ముఠాదారు కంకిపాటి బాలయ్యపడాలు (ఎండు పడాలు), బట్టిపనుకుల మునసబు గాం గంతన్న దొర, అతని సోదరుడు గాం మల్లు దొర, కొండసంతలలో కూలి చేసుకుని బతుకుతున్న గోకిరి ఎర్రేసు, బొంకుల మోదిగాడు, సంకోజు ముక్కడు, కర్రి కణ్ణిగాడు వంటివారు 1922 జనవరిలో రామరాజు దగ్గరకు వచ్చి గోడు వినిపించుకున్నారు. దానితో శ్రీరామరాజు బాస్టియన్‌ ‌మీద పై అధికారులకు ఫిర్యాదు రాశారు. ఫలితం- రామరాజు మన్యంలో సహాయ నిరాకరణ ఆరంభించాడంటూ ఆ జనవరి 29న ఏజెన్సీ కమిషనర్‌ ‌స్వెయిన్‌ ‌విచారణ జరిపాడు. ఫిబ్రవరి 1-5 మధ్య పరిణామాలు వేగంగా జరిగిపోయాయి. ఆ ఒకటో తేదీన సహాయ నిరాకరణను తీవ్రం చేస్తున్నట్టు గాంధీజీ ప్రకటించారు. దేశం నిండా తొలిసారి గొప్ప ఉద్యమ స్పృహ నెలకొంది. మూడో తేదీన ఇక్కడ రామరాజును పొలిటికల్‌ ‌సస్పెక్ట్‌గా భావించి నర్సీపట్నం జైలులో ఉంచారు. ఆ ఫిబ్రవరి 5న చౌరీచౌరా ఉదంతంతో గాంధీజీ తాను ఇచ్చిన సహాయ నిరాకరణ పిలుపును ఉపసంహరించు కున్నారు. తాను చెప్పిన పంథాలో ఉద్యమిస్తే సంవత్సరంలోనే స్వాతంత్య్రం తథ్యమన్న గాంధీజీ మాట దీనితో భగ్నమైంది. గాంధీజీ ఆకస్మిక, ఏకపక్ష నిర్ణయం ఎంతో ఆవేశంతో, ఆశతో ఉన్న దేశ యువతను ఇతర పంథాలవైపు అడుగులు వేయించింది. అలాంటి వారిలో రామరాజు కూడా ఒకరు. నర్సీపట్నంలో పదహారు రోజులు ఉంచిన తరువాత పోలవరం డిప్యూటీ తహసీల్దార్‌ ‌ఫజులుల్లా ఖాన్‌ (‌రాజు పినతండ్రి రామచంద్రరాజు స్నేహితుడు) రామరాజుకు పైడిపుట్ట వద్ద యాభయ్‌ ఎకరాల పొలం ఇచ్చి, దుచ్చెర్తి ముఠాదారు చెక్కా లింగన్న దొర అజమాయిషీలో ఉంచారు. అక్కడ నుంచే నేపాల్‌ ‌యాత్ర కోసం అనుమతి తీసుకుని మన్యంలో ఉద్యమ నిర్మాణం చేపట్టాడాయన.

మన్యవాసులలో అప్పటికే రాజు పట్ల ఆరాధనా భావం ఉంది. వారి ఆగ్రహాన్ని, ఉద్యమ దృష్టిని విస్తృతం చేసి, ఏకం చేసి ఉద్యమించాలని ఆయన భావించారు. గెరిల్లా యుద్ధ రీతిని ఎంచుకున్నారు. ఈ వ్యూహాలను ఆయన ఉత్తర భారతయాత్రలో ఉండగా నేర్చుకుని ఉండాలని నాటి పోలీసు యంత్రాంగం అనుమానించడం విశేషం. మన్య ప్రజల సంప్రదాయిక ఆయుధాలు, ఆధునిక ఆయుధాలతో ఉద్యమం జరగాలన్నదే రామరాజు వ్యూహం. మన్య విప్లవ ధ్యేయం, ఈ విప్లవానికీ మైదాన ప్రాంతంలోని జాతీయ కాంగ్రెస్‌ ఉద్యమానికీ మధ్య ఉండవలసిన బంధం వంటి అంశాలలో రామరాజుకు స్పష్టత ఉంది.

చింతపల్లి దాడి

గెరిల్లా పోరుకు మొదట ఆయుధాలు కావాలి. ఇందుకోసం మన్యంలోని పోలీస్‌ ‌స్టేషన్లను ఆయన ఎంచుకున్నారు. వలస పాలకుల తుపాకులను గుంజుకుని వాళ్ల మీదే ఎక్కుపెట్టడం రామరాజు వ్యూహం. ఉద్యమ ప్రారంభ సూచకంగా ఆగస్ట్ 19, 1922‌న రామరాజు శబరి కొండ మీద రాజరాజేశ్వరి అమ్మవారికి రుద్రాభిషేకం చేశారు. ఎండు పడాలు, గంతన్న, రామరాజు-మల్లు నాయకత్వాలలో మూడు దళాలు ఏర్పాటు చేశారు. ఆ ఆగస్ట్ 22 ‌పట్టపగలు మొదట చింతపల్లి పోలీస్‌ ‌స్టేషన్‌ ‌మీద దాడి చేశారు- దాదాపు మూడు వందల మంది. దారిలో కనిపించిన చింతపల్లి ఎస్‌ఐ ఈరెన అప్పలస్వామినాయుడుకి సంగతి చెప్పి మరీ దాడి చేశారు. 11 తుపాకులు దొరికాయి. ఈ ఆయుధాలు తీసుకు వెళుతున్నానని ఒక లేఖ రాసి మరీ వెళ్లారు రామరాజు. నిజానికి చింతపల్లి స్టేషన్‌ ‌మీద దాడితోనే రామరాజు ఉద్యమ తత్త్వం తెలుస్తుంది. ఉద్యమకారుల చేత ‘వందేమాతరం-మనదే రాజ్యం’ అంటూ, ‘గాంధీజీకి జై’ అంటూ రామరాజు నినాదాలు చేయించారు. ఇంతకీ రామరాజు చింతపల్లి స్టేషన్‌నే తొలిదాడికి ఎందుకు ఎంచుకున్నట్టు? బాస్టియన్‌ ‌మన్యవాసులను చీల్చిచెండాడి డౌనూరు- లంబసింగి- చింతపల్లి రోడ్డునే నిర్మించాడు. దోపిడీకి చింతపల్లి పోలీస్‌ ‌స్టేషన్‌ ఎం‌పిక దానికి సమాధానం కావచ్చు. తూర్పు కనుమలలో ఆ ఘట్టం కొత్త ఉషోదయమే.

కృష్ణదేవిపేట, రాజవొమ్మంగి స్టేషన్ల మీద..

ఆగస్ట్ 23‌న కృష్ణదేవిపేట పోలీస్‌ ‌స్టేషన్‌ ‌మీద దాడి జరిగింది. అంటే రామరాజు మొదట ఆశ్రయం పొందిన చోటు. కొన్ని నాటకీయ సన్నివేశాల తరువాత ఊరివారు రామరాజును స్వాగతించారు. పోలీసు సిబ్బంది పారిపోయింది. 7 తుపాకులు దొరికాయి. ఆగస్ట్ 24‌న రాజవొమ్మంగి స్టేషన్‌ (‌తూర్పు గోదావరి)ను ఎంచుకుని దాడి చేశారు. 8 తుపాకులు దొరికాయి. లాగరాయి ఫితూరీని సమర్ధించిన నేరానికి అరెస్టయిన మొట్టడం వీరయ్య దొర అప్పుడు ఆ స్టేషన్‌లోనే ఉన్నారు (ఈయన తండ్రి సొబిలను దొర. 1879 నాటి ఫితూరీలో ఉన్నాడు). వీరయ్యదొరను విడిపించడం కూడా ఈ దాడి ఆశయాలలో ఒకటి. ఈ మూడు దాడులలో వందలాది తూటాలు, బాయ్‌నెట్లు, యూనిఫారాలు కూడా కొండదళం స్వాధీనం చేసుకుంది. ‘ఆంధ్రపత్రిక’, ‘కృష్ణాపత్రిక’, రాజమండ్రి నుంచి వెలువడే ‘కాంగ్రెస్‌’ (‌మద్దూరి అన్నపూర్ణయ్య సంపాదకుడు) ఆ వార్తలను ప్రచురించాయి. నిజానికి పోలీసుల బూట్ల చప్పుడుకే హడలిపోయే మన్యవాసులు వరసగా రెండు పోలీసు స్టేషన్ల మీద దాడి చేయడంతోనే మద్రాస్‌ ‌ప్రెసెడెన్సీ ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎ ‌గ్రాహమ్‌కు టెలిగ్రామ్‌లు వెళ్లాయి. నిజమే, 26 తుపాకులు, కొంత మందుగుండు కొండదళం చేతికి చిక్కాయి. దానితో ఎంత ప్రమాదం! కొన్ని రోజులలోనే నర్సీపట్నం కేంద్రంగా మన్యాన్ని ఖాకీవనంగా మార్చారు. చుట్టుపక్కల జిల్లాల పోలీసు బలగాలన్నీ చేరుకున్నాయి. ఈ మూడు దాడులతోనే రామరాజు పేరు మొదటిసారి తెలుగు నేలంతా వినిపించింది.

స్టేషన్ల లూటీ సంగతిని ఏజెన్సీ జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌ ‌సాండర్స్‌కూ, కలెక్టర్‌కు స్థానిక పోలీసులు తెలియచేశారు. ఆ ఇద్దరు ఆగమేఘాల మీద నర్సీపట్నం చేరుకున్నారు. క్షణాలలో చింతపల్లి, అడ్డతీగల, కోటనందూరు, మల్కనగిరి వంటి ప్రాంతాలకు పోలీసు బలగాలు చేరిపోయాయి. నర్సీపట్నం, ఏలేశ్వరం, అడ్డతీగల పోలీసు శిబిరాలయ్యాయి. స్కాట్‌ ‌కవర్ట్, ‌నెవెల్లి హైటర్‌, ‌ట్రేమన్‌హేర్‌, ‌చాడ్‌విక్‌, ‌హ్యూమ్‌, ‌షర్బీస్‌, ‌డాసన్‌ ‌వంటి యూరోపియన్‌ అధికారులంతా మన్యంలో వాలిపోయారు. ఆ వాతావరణంలోనే జైపూర్‌ ‌మహారాజు ఐదు ఏనుగుల మీద పోలీసుల కోసం పంపిన సామగ్రిని సెప్టెంబర్‌ 3‌న ఒంజేరి ఘాట్‌లో రాజుదళం వశం చేసుకుంది.

దామనపల్లి దాడి

మూడు పోలీస్‌ ‌స్టేషన్ల మీద, ఒంజేరి ఘాట్‌ ‌మీద దక్కిన విజయాల కంటే దామనపల్లి అనే కొండమార్గంలో సెప్టెంబర్‌ 24,1922‌న దక్కిన విజయం చరిత్రాత్మకమైనది. దామనపల్లికి రాజు దళం వస్తున్నదన్న సమాచారం తెలిసి స్కాట్‌ ‌కవర్ట్, ‌నెవెల్లి హైటర్‌ అనే ఒరిస్సా పోలీసు అధికారుల నాయకత్వంలో రెండు పటాలాలు వెళ్లాయి. ఇందులో హైటర్‌ ‌మొదటి ప్రపంచయుద్ధంలో పాల్గొన్నాడు. ఆ ఇద్దరినీ కూడా కొండదళం మట్టుపెట్టింది. అక్టోబర్‌ 15‌న అడ్డతీగల మీద రాజు దాడి చేశారు. కానీ ఆయుధాలు దొరకలేదు. అక్టోబర్‌ 19‌న చోడవరం స్టేషన్‌లోను ఇదే అనుభవం. అప్పటికే స్టేషన్లలోని ఆయుధాలను ట్రెజరీలకి తరలించడం మొదలయిపోయింది. ఈ విజయాలు రామరాజుకు ఎలా సాధ్యమైనాయో ఆంగ్లేయులకు తెలుసు.

‘గూడెం కొండలలో నివసించే కృష్ణా జిల్లా వాసి (అప్పటికి పశ్చిమ గోదావరి జిల్లా యేర్పడలేదు) గడచిన రెండు సంవత్సరములు ‘పవిత్రత అనే వాయువుల్ని సృష్టించి’ అకస్మాత్తుగా అసంతృప్తిపరుల బృందమును లేవదీసి మూడు స్టేషనులను ఎదుర్కొనెను. 26 తుపాకులను, ఎంతో మందు గుండు సామగ్రిని దోచుకొనెను. తననే రాజుగా ప్రకటించుకొని, ప్రభుత్వముపై యుద్ధమును ప్రకటించెను. ఒకప్పుడు ఇతని అనుచరులు 200 మంది వరకు గలరు. వీరివద్ద విల్లమ్ములు, తుపాకులు గలవు. వీరి అపూర్వ సంఘటనా సామర్ధ్యము, పర్వతమయమై ఏటవాలు కొండలతో కూడిన దుర్భేద్య అరణ్య ప్రాంత పరిచయము స్థానిక పోలీసు శాఖను నిశ్చేష్టులను జేసినవి’ (ప్రొఫెసర్‌ ‌రూష్‌‌బ్రూక్‌ ‌విలియమ్స్ ‘ఇం‌డియా’ గ్రంథం 1922-23 నుంచి. దీనిని ‘శ్రీ అల్లూరి సీతారామ రాజు చరిత్ర’లో యర్రమిల్లి నరసింహారావు ఉదహరించారు, పే 38). రామరాజు ఉద్యమం, కారణాలు, పరిణామాల గురించి బాస్టియన్‌, ఏజే హెపెల్‌ (ఏజెన్సీ కమిషనర్‌),‌టీజీ రూధర్‌ఫర్డ్ ‌రాసిన నివేదికలు చాలా విషయాలు చెబుతున్నాయి. ‘తానే గూడెంకు రాజు కావలెనని రాజు తలచియుండ వలెను’ అని హెపెల్‌ ‌నిందమోపాడు. అయితే ‘శ్రీరామరాజు పలుకుబడి, వశీకరణ శక్తి యీ విప్లవమునకు ముఖ్యకారణములని గ్రహింపవచ్చును. ఈతని బోధనలు, నాయకత్వము లేకపోయిన ఎడల కేవలము ప్రజలను ఆకర్షించు కారణములు మాత్రమే ఇంతటి గందరగోళమునకు కారణములు కాజాలవు’ (యర్రమిల్లి నరసింహారావు పే. 37) అని కూడా వ్యాఖ్యానించాడు. స్థానిక సాధారణ పోలీసులతో ఫలితం రావడం లేదని రూఢి చేసుకున్న తరువాత సెప్టెంబర్‌ 23, 1922‌న సాండర్స్ ‌మలబార్‌ ‌పోలీసు దళాలను రప్పించాడు. ఇవి కొండలలో పోరాడ గలవు. మోప్లా అల్లర్లను అణచిన ఘనత వీటికి ఉంది. కానీ రామవరం అనే చోట మన్యం దళంతో తలపడినప్పుడు మలబార్‌ ‌దళం వీగిపోయింది. ఆ ఓటమి ఎంత ఘోరమో సాండర్స్ ‌వ్యాఖ్య చెబుతుంది. ‘నేను లజ్జాకరముగా ఇంటి ముఖము పట్టితిని’ అని అతడు రాసుకున్నాడు.

వెనకడుగు

మలబారు దళాలు వచ్చిన తరువాత డిసెంబర్‌ 6, 1922‌న పెద్దగడ్డపాలెం, లింగాపురం అనేచోట్ల రాజుదళం వారితో తలపడవలసి వచ్చింది. దళాల దగ్గర లూయీ ఫిరంగులు ఉన్నాయి. ఒక భీకర పోరాటమే జరిగింది. రెండుచోట్ల కలిపి ఎనిమిది మంది రాజు అనుచరులు వీరమరణం చెందారు. ఈ మృతదేహాలను మన్యంలో ఊరేగించి, భయానికి బీజం వేశారు. డిసెంబర్‌ 23‌న ఉద్యమకారులను పట్టిస్తే నగదు బహుమానాలు ఇస్తామంటూ ప్రకటన వచ్చింది. నాలుగు మాసాలు మన్యం దళం విరామం ఇచ్చింది. కానీ ఈ విరామాన్ని విరమణగా ఆంగ్లేయులు భావించారు.

అన్నవరంలో అల్లూరి

ఏప్రిల్‌ 17, 1923‌న రామరాజు దళం ఆకస్మాత్తుగా అన్నవరం పోలీస్‌ ‌స్టేషన్‌లో ప్రత్యక్షమై మొత్తం యంత్రాంగాన్ని కలవర పరిచింది. పైగా ప్రజలు ఆయనకు పూజలు చేశారు. ఆ సందర్భం లోనే చెరుకూరి నరసింహమూర్తికి రామరాజు ఇంటర్వ్యూ ఇచ్చారు. అదే ఏప్రిల్‌ 24‌న ఆంధ్రపత్రికలో వెలువడింది. అన్నవరం సంఘటన తరువాత మన్యవాసుల ఉద్యమంలోకి వేగిరాజు సత్యనారాయణరాజు(అగ్గిరాజు) వచ్చారు. ఆ ఏడాది సెప్టెంబర్‌ 17 ‌రాత్రి మల్లుదొర దొరికి పోవడం ఉద్యమానికి కీడు చేసింది. ఆ సంవత్సరం డిసెంబర్‌లో కాకినాడలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్‌ ‌సమావేశాలకు రామరాజు మారువేషంలో హాజరయ్యారు.

కాలం గడుస్తున్న కొద్దీ అణచివేత తీవ్రమైంది. అప్పటికే మన్యంలో ఉన్న బలగాలకు 1924 జనవరికి అస్సాం రైఫిల్స్ ‌తోడుగా వచ్చింది. వీరికి కూడా మొదటి ప్రపంచ యుద్ధంలో అనుభవం ఉంది. అప్పటికి మన్యం మీద ప్రయోగించిన బలగాల సంఖ్య దాదాపు వేయి. రాజుదళం సంఖ్య వంద. అస్సాం రైఫిల్స్ అధిపతే మేజర్‌ ‌గుడాల్‌. ఆ ‌సంవత్సరం ఏప్రిల్‌లో గుంటూరు జిల్లా కలెక్టర్‌గా ఉన్న థామస్‌ ‌జార్జ్ ‌రూథర్‌ఫర్డ్‌ను విశాఖ మన్యంలో పోలీసు చర్యకు స్పెషల్‌ ‌కమిషనర్‌గా నియమించారు. ఏప్రిల్‌ ‌నుంచి జూన్‌ 24 ‌వరకే అతడి అధికారం. అంతలోనే ఉద్యమం అణగిపోవాలి. మరికొంత అస్సాం రైఫిల్స్ ‌బలగం వచ్చింది. మన్యం పోలీసు హింసతో, అత్యాచారాలతో తల్లడిల్లిపోయింది. ఆ సమయంలోనే మే ఆరంభంలో రేవుల కంతారం అనేచోట రాజు దళం సమావేశమైంది. బ్రిటిష్‌ ‌పంచన చేరినా భారతీయులను చంపరాదన్న నియమంతో నష్టం జరుగుతున్నదని ఒక వర్గం విన్నవించింది. అదే అంశం మీద చీలిక వచ్చింది. ఆ సమావేశం జరుగుతూ ఉండగానే పోలీసులు దాడి చేశారు. రామరాజు ఒక్కడు రాత్రివేళ మంప చేరుకుని, ఒక చేనులోని మంచె మీద పరున్నాడు. తెల్లవారితే మే 7వ తేదీ. రాజు వేకువనే మంచె దిగి అక్కడి కుంటలో స్నానం చేస్తుండగా ఈస్ట్‌కోస్ట్ ‌దళానికి చెందిన కంచుమేనన్‌, ఇం‌టెలిజెన్స్ ‌పెట్రోలింగ్‌ ‌సబిన్స్‌పెక్టర్‌ ఆళ్వార్‌నాయుడు బలగంతో చుట్టుముట్టి అరెస్టు చేశారు.

అంతిమయాత్ర

అరెస్టు చేసిన రాజును ఒక నులక మంచానికి కట్టి, యథాప్రకారం గిరిజనుల చేతనే మోయిస్తూ కృష్ణదేవిపేటకు పయనమయ్యారు. రామరాజును ఎక్కడైతే జనం ఒక దైవంగా ఆరాధంచారో అక్కడికి ఆయనను ఒక బందీగా దర్శింప చేయదలిచారన్న మాట. ఆ దారిలోనే ఉంది కొయ్యూరు. అక్కడే ఉన్న అస్సాం రైఫిల్స్ అధిపతి మేజర్‌ ‌గుడాల్‌ ‌రాజును కట్టిన మంచాన్ని బలవంతంగా దింపించాడు. మాట్లాడతానని గుడారంలోకి తీసుకువెళ్లాడు. అక్కడే ఇద్దరికీ వాగ్యుద్ధం జరిగింది. ఆగ్రహించిన గుడాల్‌ ఒక చెట్టుకు కట్టి కాల్చి చంపాడు. సజీవంగా రాజును అప్పగించాలంటూ కృష్ణదేవిపేట వచ్చి కూర్చున్న రూథర్‌ఫర్డ్ ఈ ‌సంగతి తెలిసి గూడాల్‌ ‌మీద ఆగ్రహం వ్యక్తం చేశాడు. చివరికి రాజు ఎక్కడైతే ఉద్యమ కారునిగా రూపొందాడో ఆ కృష్ణదేవిపేటలోనే తాండవ ఒడ్డున అంత్యక్రియలు జరిపారు.

దాదాపు రెండేళ్ల ఉద్యమంతో, ఆంగ్లేయుల వేధింపులతో మన్యవాసులు మారిపోయారు. మే 6, 1924న అగ్గిరాజు దొరికిపోయాడు. మే 26న ఎండు పడాలును స్థానికులే హత్య చేశారు. జూన్‌ 7‌న గాం గంతన్నను పోలీసులు కాల్చి చంపారు. ఈ మధ్యలో ఎందరో ఉద్యమకారులను గ్రామస్థులు, బంధువులు పోలీసులకు అప్పగించారు. మల్లుదొరకి, బోనంగి పండు పడాలుకి మొదట ఉరిశిక్ష పడింది. తరువాత ద్వీపాంతర శిక్షగా మారింది.

ప్రత్యేక కోర్టు

నిజానికి ఉద్యమకారుల ‘యుద్ధ నేరాలు’ విచారించడానికి 1922లోనే విశాఖపట్నంలో స్పెషల్‌ ‌ట్రిబ్యునల్‌ ఏర్పాటయింది. ఎల్‌హెచ్‌ అరంట్‌ అడిషనల్‌ ‌సెషన్స్ ‌జడ్జి. 270 మంది వరకు ఉద్యమకారులను ట్రిబ్యునల్‌ ‌విచారించి రకరకాల శిక్షలు విధించింది. 12 మందిని అండమాన్‌ ‌కాలాపానికి పంపారు. ఏ విధంగా చూసినా రామరాజు ఉద్యమంతో మద్రాస్‌ ‌ప్రెసిడెన్సీ పాలనా కేంద్రం సెయింట్‌ ‌జార్జి కోట భయపడిందన్న మాట నిజం. ఈ ఉద్యమం అణచివేయడానికి 25 లక్షలు అని కొందరు, 40 లక్షల రూపాయలు వెచ్చించవలసి వచ్చిందని కొందరు రాశారు. నాటి మద్రాస్‌ ‌కౌన్సిల్‌లో జరిగిన చర్చ, ఎంఎల్‌సీ చింతలపాటి వెంకట నరసింహ రాజు, కట్టమంచి రామలింగారెడ్డి వంటి వారి వాదనలు వింటే రామరాజు ఔన్నత్యం, మన్య ఉద్యమ వేడి సులభంగానే అర్ధమవుతాయి.

రామరాజు మీద అనేక అపోహలు ఉన్నాయి. చరిత్రను పునర్లిఖించుకోవడం ప్రతి తరం చేయవలసి ఉంటుంది. ఆ క్రమంలో అయినా ఆ దోషాలను పరిహరించాలి. ఆయన సీతారామరాజు కాదు. శ్రీరామరాజు ఆయన పేరు. జాతక చక్రంలో, ఆయన చేసిన సంతకం చేసినా శ్రీరామరాజు అనే ఉంది. ఆయన జీవితంలో సీత అనే స్త్రీ ఎవరూ లేరు. ఇప్పటికీ ఆయనను సీతారామరాజు అని పిలవడం చరిత్ర పట్ల, స్వచ్ఛమైన చరిత్ర పట్ల మనకున్న అశ్రద్ధను వెల్లడిస్తాయి. ఇప్పటికీ కొందరు ‘రవి అస్తమించని’ అంటూ బ్రిటిష్‌ ‌సామ్రాజ్యం మకుటాన్ని కాపాడే యత్నం చేయడమూ చరిత్రకు విరుద్ధమే. మొదటి ప్రపంచ యుద్ధంతోనే ఆ కిరీటం నేల కొరిగింది. దానిని నిలిపే ప్రయత్నం అనవసరం. అచారిత్రకం కూడా. రామరాజు ఉద్యమంలో భారతీయులకు గురి పెట్టలేదు. అందువల్ల బాస్టియన్‌ ‌వంటి కిరాతకులు కూడా తప్పించుకోగలిగారు. ఉద్యమాన్ని ఒక పవిత్ర యజ్ఞంగా ఆయన భావించారు. రాజు ఉద్యమంతో మన్యంలో అటవీ చట్టాల విషయంలో కొంత మార్పు వచ్చింది. ఆ త్యాగం వృథా కాలేదు.

మొదటి ప్రపంచ యుద్ధ విజయంతో విర్రవీగుతున్న బ్రిటిష్‌ ‌ప్రభుత్వం రామరాజు నాయకత్వంలో సాగిన ఉద్యమాన్ని అత్యంత కఠినంగా అణచి వేసింది. కానీ రామరాజు అమరుడిగా నిలిచిపోయాడు. ఆయన ఖద్దరు ధరించాడు. ప్రధాన స్రవంతి పోరాటాలతో తన పోరాటాన్ని అను సంధానం చేస్తాడేమోనని పోలీసులు భయపడ్డారు. కొమురం భీం వంటివారికి స్ఫూర్తిగా నిలిచాడు. రామరాజు భారత స్వాతంత్య్ర పోరాట చరిత్రలో అమేయమైన స్థానం సాధించుకున్నాడు. అట్టడుగున ఉన్నవారిలో కూడా జాతీయతా భావాన్ని నింపి దేశం కోసం పోరాడేటట్టు చేసిన రామరాజు, ఆయన ఉద్యమం భావితరాల వారికి కొండగుర్తులు.


ఆధ్యాత్మిక తత్వంలో మిళితమైన దేశభక్తి

గాంధీజీ కార్యక్రమమంతటిలోను మద్యపాన నిషేధం, కోర్టుల బహిష్కారము- ఈ రెండూ ఆయనకు నచ్చినాయి. ఆయన గోదావరి, విశాఖపట్టణము ఏజెన్సీ ప్రాంతాలలో తీవ్రమయిన ప్రచారం ప్రారంభించినాడు. ఆయన పవిత్రత, భక్తి మొదలైన వాటి వలన జనులను ఎక్కువగా ఆకర్షించగలిగాడు. ఆ ఏజెన్సీ ప్రజలకు ఆయన మాటే శాసనమయింది…. ఆయన శంఖారావం ఆలకించని వారు ఏజెన్సీలో ఒక్కరు కూడా లేరు… రాజు నిత్య ఖద్దరుధారి అని తెలియ వచ్చింది. ఆయన సైనికులకు కూడా ఖాదీ సైనిక దుస్తులను మాత్రమే సప్లయి చేసినట్టు కూడా ఫితూరీ విచారణలో బయలుపడిన సంగతులను బట్టి తెలిసింది. రామరాజు నివాస స్థానము శ్రీరామ దేవాలయము. ఆయన ప్రతిదినం ఆధ్యాత్మిక ప్రసంగాలు చేసేవారు. కాని ఆ ఆధ్యాత్మిక తత్వంలో దేశభక్తి కూడా పాలలో పంచదార వలె మిళితమై ఉండేది.

ఆయన కార్యరంగం గూడెం తాలూకాలోని ఏజెన్సీ ప్రాంతము. అక్కడ ఇతర ప్రదేశాలలోని మామూలు చట్టం వర్తించదు. అక్కడ ఒక తహశీలుదారు ఉన్నాడు. అతడు రోడ్డు కాంట్రాక్టరు కూడాను. క్రూరత్వంలో ఒక్క డయ్యరు తప్ప ఆయనను మించినవాడు మరొక్కడు లేడని ప్రతీతి. ఏజెన్సీ ప్రాంతమంతా అసంతృప్తితో అట్టుడికినట్టు ఉడుకుతున్నది. ఏజెన్సీలోని ఈ స్థానిక బాధలను స్వాతంత్య్ర పోరాటం కోసం రామరాజు సంపూర్ణంగా వినియోగించుకున్నాడు.

రాజు ఆదర్శం స్వరాజ్యమనడానికి మరొక నిదర్శనము కూడా ఉన్నది. పోలీసు సబ్‌ఇన్‌స్పెక్టర్‌ శ్రీ ‌సి. శ్రీనివాసరావు కోర్టులో సాక్ష్యమిస్తూ రాజు ఆదర్శం స్వరాజ్యమని చెప్పినాడు. ఆయనకు తోడునీడలుగా ఉండిన ధీరులు గాం సోదరులకు ఆయన స్వరాజ్య సందేశం అందజేసినాడనీ, మరికొంతమంది కూడా కోర్టులో సాక్ష్యమిచ్చినారు. వీటన్నిటికీ మకుటాయమానంగా రాజు స్వంతంగా చెప్పిన మాటలు వలననే మనమాయన ఆదర్శాన్ని గ్రహించవచ్చు. తూర్పు గోదావరి జిల్లాలో అన్నవరమనే గ్రామం ఉన్నది. శ్రీరామరాజు ఆ అన్నవరం పోలీసు స్టేషన్‌లోకి పోయేటప్పటికి పోలీసువారు ప్రాణాలు గుప్పెటలో పెట్టుకొని పరారయినారు. ఆ సమయంలో ఒకాయన ఒక నాన్‌ ‌కో ఆపరేటర్‌ను కలుసుకోవడం తటస్థించింది. ఆయనకు రాజు తన కార్యక్రమంతా వివరించి చెప్పినాడు.

కాని ప్రభుత్వం వారు మాత్రం రాజు గూడెంలో ఒక చిన్న ‘కెయిజర్‌’ ‌వలె అధికారం చలాయించవలెనను కొంటున్నాడని దురుద్దేశాలు ఆపాదించడానికి సందేహించలేదు. ఆ ఉత్తమ దేశభక్తుని గురించి ఇటువంటి అపనిందలు ప్రజల అసహ్యానికి గురి అయినాయి.

మొత్తం మీద ఉభయులు ఆరు పర్యాయాలు శత్రువులుగా తారసిల్లినారు. మొదటి ఐదు పర్యాయాలు రాజుకే సంపూర్ణ విజయం కలిగింది. బ్రిటిష్‌ ‌ప్రభుత్వం వారు మలబారు నుంచి పోలీసు వారిని, అస్సాం నుంచి సైనిక దళాలను రప్పించినారు. సంకుల సమరం జరిగింది. పెద్దవలస అనే గ్రామం దగ్గర స్కాట్‌ ‌కవర్ట్, ‌హైటర్‌ అనే ఇద్దరు యూరోపియన్‌ ఉద్యోగస్తులను రాజు సైనికులు కాల్చి చంపివేసినారు. ఇంకా అనేకమందిని గాయపరిచినారు. రాజు అనేక పోలీసు స్టేషన్‌లను స్వాధీన పరుచుకుని తుపాకులను, మందుగుండు సామానులను వశపరుచుకున్నాడు. ఒక పర్యాయం రాజు ఆయన సైనికులు నిద్రిస్తుండగా పోలీసువారు ఆకస్మికంగా వారిని ముట్టడించినారు. రాజు వీరోచితంగా పోరాడి ఎట్లాగో తప్పుకోగలిగినాడు. తుదకు ఆకస్మిక పోరాటంలో రాజు సైనికులు అతి సాహసంగా పోరాడి అపజయం పొందటం తటస్థించింది. అదే రాజు సాగించిన స్వాతంత్య్ర పోరాటానికి తుది ఘట్టము.అనేక రకాల వదంతులు పుట్టినాయి. దాదాపు రెండు సంవత్సరాలు (1922 ఆగస్టు నుంచి 1924 మే వరకు) సాగిన స్వాతంత్య్ర మహా సంగ్రామం అంతటితో ముగిసింది. ప్రభుత్వం వారికి ఈ పోరాటం వల్ల 15 లక్షలు ఖర్చయింది.

(మద్దూరి అన్నపూర్ణయ్య రాసిన నివేదిక ఆధారంగా ‘యంగ్‌ ఇం‌డియా’ పత్రికలో 18-7-1929న ప్రచురితమైన వ్యాసంలోని భాగాలు. వీటిని మాదల వీరభద్రరావు రాసిన ‘అల్లూరి సీతారామరాజు పుస్తకం నుంచి స్వీకరించాం.) 

 

About Author

By editor

Twitter
YOUTUBE