– జయంత్ సహస్రబుద్ధే, చీఫ్ ఎడిటోరియల్ అడ్వయిజర్, సైన్స్ ఇండియా –
స్వరాజ్యాన్ని సాధించే క్రమంలో యావజ్జాతికి ప్రేరణ కలిగించడంలో తోడ్పాటునందించిన భారతీయ శాస్త్రవేత్తల పోరాటం, సాహసోపేతమైన వారి శాస్త్రీయ కార్యక్రమాల పట్ల దేశాన్ని జాగృతం చేయవలసిన సమయం ఆసన్నమైంది.
‘సైన్స్‌తో పాటు భారతీయులు మిగిలిన అన్ని రంగాల్లోనూ ఎవరికీ తీసిపోరని పశ్చిమ దేశాలకు చాటి చెప్పే ఒక జాతి స్వీయ వ్యక్తీకరణ అవసరం’ అని ప్రసిద్ధ ఖగోళ-భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ పురస్కార గ్రహీత డాక్టర్ ఎస్.చంద్రశేఖర్ అన్నారు. ‘20వ శతాబ్దపు తొలి మూడు దశకాల్లో భారత్‌లో అంతర్జాతీయంగా పేరొందిన ఆధునిక శాస్త్రవేత్తల ఉధృతి ఎందుకని ఉన్నట్టుండి పెరిగింది?’’ అన్న ప్రశ్నకు డాక్టర్ చంద్రశేఖర్ ఇచ్చిన సమాధానమది. ఈ సమాధానం ఒకవైపు భారతీయుల పట్ల పశ్చిమ దేశాల (ఆంగ్లేయులు) వివక్షాపూరిత వైఖరి, ఆధిపత్య ధోరణులను ప్రతిబింబిస్తుంది. మరోవైపు భారతీయులను అణచివేస్తున్న వలస పాలకుల శక్తిని నిర్భయంగా సవాల్ చేస్తూ, స్వరాజ్య సాధనలో యోధులైన అంతర్జాతీయ స్థాయి శాస్త్రవేత్తల దేశభక్తి స్ఫూర్తిని కూడా డాక్టర్ చంద్రశేఖర్ సమాధానం కచ్చితంగా ఎత్తిచూపింది.
ఈ వాస్తవికత మధ్య ఒక సమాజంగా మనం శాస్త్రవేత్తలను స్వరాజ్య సమరంలో పాల్గొన్న యోధులుగా, సంఘీభావం కలవారిగా గుర్తించక పోవడం విస్తుపోయే విషయం కాదా? వాస్తవానికి, భారత్‌లో బ్రిటిష్ పాలకుల దోపిడీ విధానాన్ని ధృవీకరించడంతో పాటుగా, శాస్త్ర సాంకేతిక రంగాలలో భారతీయులపై వలసపాలకులు చేపట్టిన అణచివేత, వివక్షాపూరిత చర్యలు గతం నిండా ఉన్నాయి. మరీ ముఖ్యంగా అలాంటి చర్యలను మన శాస్త్రవేత్తలు ఏ విధంగా సవాల్ చేసిందీ, ఒక తెలివైన పద్ధతిలో ప్రతిదాడి ఎలా రూపుదిద్దుకున్నదీ అనే వాటికి సంబంధించిన స్ఫూర్తిదాయకమైన వివరాలు కూడా చరిత్రలో కనిపిస్తాయి. దీనికి తోడు సైన్స్‌ను ఒక పటిష్టమైన ఉపకరణంగా ఎలా వాడుకున్నదీ అనే వాటికి సంబంధించిన సమగ్ర సమాచారం చరిత్ర పుటలను తిరిగేసినప్పుడు లభిస్తున్నది. సైన్స్ రంగంలో చేపట్టిన పోరాటం, స్వరాజ్య సాధన కోసం తోటి భారతీయుల హృదయాల్లో ప్రేరణ కలిగించిన సాహసోపేతమైన వారి శాస్త్ర కార్యకలాపాల తాలూకు అనిర్వచనీయమైన గాథలను చెప్పడం ద్వారా ప్రజలను జాగృతపరచడానికి ప్రస్తుతం సమయం ఆసన్నమైంది.
చరిత్రాత్మక ఆగస్ట్ 15, 1947న మంగళకర మైన ‘స్వరాజ్య’ ఉదయం మిరుమిట్లుగొలిపే సూర్య కాంతితో మన మాతృభూమి క్షితిజానికి చేరుకుంది. ఈ మహత్వపూర్ణమైన రోజున దౌర్జన్యమైన వలస పాలన కబంధ హస్తాల నుంచి భరతమాత విముక్తి పొందింది. పరాధీనత తాలూకు కాళరాత్రి గతంలోకి జారుకోవడంతో శతాబ్దాల బానిసత్వానికి తెరపడింది. అది గర్వంతో ఆనందోత్సాహాలు కలగలసిన ఒక సాటిలేని సమయం. ప్రస్తుతం, స్వతంత్రానికి 74 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత విముక్తికి 75వ వార్షికోత్సవంగా 2021 సంవత్సరం ఆగస్టు 15వ తేదీన ఆరంభమైన స్వాతంత్ర అమృత మహోత్సవాలను జరుపుకోవడానికి మనమంతా సిద్ధమైనాం.
భారతీయ దివ్యజ్ఞాన సంపన్నుల దృక్కోణం
సుదీర్ఘ కాలపు నిరీక్షణతో కూడిన తరతరాల స్వప్న కాంక్ష అయిన స్వతంత్రం గొప్ప పోరాటం నుంచి పుట్టుకొచ్చింది. ఈ పోరాటం మన చరిత్ర పుటల్లో నిలిచిపోయిన తలవంచని స్త్రీ, పురుషుల అనితరసాధ్యమైన ధైర్యం, అసమానమైన త్యాగం, అసాధారణమైన శౌర్యానికి నిదర్శనం. వారికి మనం ఎంతగానో రుణపడి ఉన్నాం. ఆ క్రమంలో, 75వ సంవత్సరపు స్వతంత్ర వేడుకల ముఖ్యోద్దేశాల్లో ఒకటిగా మనం వారందరిని స్మరించుకొని, స్వరాజ్య సమరయోధులకు వినయపూర్వకమైన నివాళులను అర్పిద్దాం.
స్థిరచిత్తులైన ఈ స్వరాజ్య సమర కథానాయకులు యోధులు మాత్రమే కాదు దివ్యజ్ఞాన సంపన్నులైన జీవులు(ఆత్మలు). పరమపావనమైన తమ నేలకు సంబంధించిన సందేశాన్ని వారు చేపట్టారు. విద్వేషపూరితమైన దాడిని చవిచూసిన ప్రపంచపు ఉత్తమమైన, పురాతనమైన జీవన సంస్కృతి, నాగరి కతకు చెందిన గౌరవాన్ని శిఖరాగ్రాన నిలిపారు. అంతేకాకుండా, దుందుడుకు దాడిని సవాల్ చేస్తూ దీటుగా ఎదుర్కొంటూనే, మునుపెన్నడూ లేని విధంగా అత్యంత స్పష్టంగా, గొప్పగా, శక్తిమంతమైన మాతృభూమి విఖ్యాత చిత్రాన్ని వారు ఊహించారు. స్వరాజ్య పోరాట సమయంలో లోతైన చింతన, తీవ్రమైన ఆలోచనల మథనం నుంచి ఈ దృష్టి వికసించింది. సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తున్న స్వరాజ్య సమరాన్ని మరోసారి దర్శించి, మరోసారి అధ్యయనం చేయడానికి, సునిశితమైన ఆ దృష్టిలోని విస్తారమైన అర్థాన్ని అవగతం చేసుకునే సరైన అవకాశాన్ని స్వాతంత్య్ర అమృత మహోత్సవాలు మనకు అందించాయి. చరిత్రాత్మక పోరాటం గురించి మనకు ఉన్న అవగాహనను ప్రక్షాళన చేసుకొని దానికి కొత్తదనాన్ని చేకూర్చడం అత్యవసర మైనది. ఈ కసరత్తు వర్తమానం దృష్ట్యా మాత్రమే అత్యంత ముఖ్యమైనది కాదు. మన దేశ భవిష్యత్తు దృష్ట్యా కూడా అత్యంత ముఖ్యమైనది.
ప్రపంచ నాగరికత తొలినాళ్ల నుంచి తనదైన దివ్యమైన జ్ఞాననిధి, తిరుగులేని సంపద కారణంగా మన దేశం ఒక దేదీప్యమానమైన వాగ్దత్తపు భూమిగా, ఒక ఘన భాగ్యసీమగా అత్యంత మాన్యతను కలిగి ఉండేది. ప్రపంచవ్యాప్తంగా నిజమైన జ్ఞాన అన్వేష కులు సత్య శోధనలో భాగంగా భారత్‌ను సందర్శి స్తుండేవారు.
అయితే, ప్రపంచమంతటా అత్యాశ, అధికార దాహంతో ఉన్నవారు నిత్యం ఈ నేలను పాలించాలనే క్రూరమైన ఆకాంక్షను కలిగి ఉండేవారు. అలాంటి దుష్ట శక్తులు అదేపనిగా ఈ నేలపై దాడి చేస్తుండేవి. అధికారాన్ని హస్తగతం చేసుకోవడం ద్వారా ఈ శక్తులు యావత్ దేశాన్ని పరాధీన స్థితిలోకి నెట్టివేశాయి.
బ్రిటిష్ విస్తరణలో నవ్యత
చరిత్ర గమనంలో దండయాత్రలను ప్రేరే పించడం వెనుక ప్రధానంగా మూడు ఉద్దేశాలు ఉన్నాయని గుర్తించారు. అవి పాలించాలనే ఒక రాక్షస కాంక్ష, నిర్బంధంతో స్వీయ మతం, సంస్కృతిని వ్యాపింపజేయాలనే పాశవిక ఉన్మాదం, దారుణమైన దోపిడీతో సంపద ఆర్జన. భారత్‌పై దండయాత్రలకు తెగబడినవారిలో చివరగా వచ్చిన బ్రిటిష్‌వారికి కూడా అదే తరహా లక్ష్యాలు ఉండేవి. అయితే, గత దురాక్రమణదారులతో పోల్చినప్పుడు ఈ లక్ష్యాలను సాకారం చేసుకోవడంలో బ్రిటిష్ వారి వద్ద విశిష్టమైన సంప్రదాయేతర పథకాలు, పద్ధతులు, ఉపకరణాలు ఉండేవి. ఇంగ్లండ్‌లో కొత్తగా పుట్టుకొచ్చిన ‘సైన్స్’ కారణంగా ఆ విశిష్టత, సంప్రదాయేతర ఉపకరణాలు లేదా పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. ‘సైన్స్’తో చేసిన కసరత్తు కారణంగా మొదటగా ఈస్ట్ ఇండియా కంపెనీ, తదనంతరం బ్రిటిష్ రాజ్యాధిపత్యం, శ్వేతజాతి పాలన సుస్థిరతను సాధించాయి. పరిమాణం, పరిణామాల విషయానికి వస్తే గతకాలపు దండయాత్రల హద్దులను అధిగమిస్తూ అత్యంత వినాశకరమైనదిగా బ్రిటిష్ దురాక్రమణ మారడానికి ప్రధాన కారణం ‘సైన్స్’.
1757వ సంవత్సరం ప్లాసీ వద్ద బెంగాల్ నవాబ్‌పై విజయం సాధించడంతో భారత్‌లో బ్రిటిష్ పాలన మొదలైంది. అంటే ప్లాసీ యుద్ధం, 1760లో ఇంగ్లండ్‌లో తొలి పారిశ్రామిక విప్లవం ఆరంభం దాదాపు ఒకే సమయంలో సంభవించాయి. బెంగాల్‌లో కొత్తగా పొందిన రాజ్యాధికారంతో విస్తారమైన ధనరాశులను ఈస్ట్ ఇండియా కంపెనీ మూటకట్టుకుంది. నిస్సందేహంగా ఆ నగదు పారిశ్రామిక విప్లవం పరిఢవిల్లడానికి కావలసిన ఒక కీలక మూలధనంగా ఉపయోగపడింది. పరిశ్ర మలు వృద్ధి చెందడంలో మరో అత్యవసరమైన అంశంగా సహజ వనరులు ఉపకరించాయి. మరింత సమయాన్ని కోల్పోకుండా ఒక శాస్త్రీయ విధానంలో భారతీయ భూభాగంలో సుసంపన్నమైన సహజవనరులను వెలికి తీసి, వాటి రేఖా చిత్ర రూపకల్పన కోసం 1767లో సర్వే ఆఫ్ ఇండియాను కంపెనీ నెలకొల్పింది. ఆ విధంగా భారతదేశపు సహజ సంపదను కొల్లగొట్టడానికి తొలిసారిగా సైన్స్ అక్కరకు వచ్చింది. నేటి లెక్కల ప్రకారం బ్రిటన్ తన 190 సంవత్సరాల పాలనలో భారత్ నుంచి దాదాపు 45 ట్రిలియన్ డాలర్ల విలువైన సంపదను అపహరించింది.
భారతీయ అస్తిత్వం తుడిచివేతే లక్ష్యం
కానీ, బ్రిటిష్ సామ్రాజ్యం ఏకైక లక్ష్యం సంపదను స్వాధీనం చేసుకోవడం మాత్రమే కాదు. బ్రిటిష్ సామ్రాజ్యపు ఇతర ‘అధికోన్నత’ లక్ష్యాన్ని ఆక్స్‌ఫర్డ్ హిస్టరీ స్పష్టంగా వివరించింది. దాని ఐదవ సంపుటి పీఠికలో ప్రధాన సంపాదకుడు విలియమ్ రోజర్ లూయిస్ ఇలా రాశారు.. ‘‘మెకాలేను అహంకారిగా ముద్ర వేశారు. కానీ ప్రపంచంలో ఇంగ్లండ్‌కు సంబంధించిన సాంస్కృతిక ప్రాబల్యం మీద ప్రాతినిధ్య అభిప్రాయాలు భారత్‌లో, ఇతర ప్రాంతాల్లో ఉదారమైన ప్రభావాన్ని చూపుతాయని అతడు విశ్వసిస్తున్నాడు. 1835లో భారత్ విద్యా విధానంపై రాసిన వివాదాస్పదమైన క్లుప్తమైన వివరణ బ్రిటిష్ వాస్తవిక రాజకీయ, భావవాదాన్ని (ఐడియలిజమ్) సమ్మతింపజేస్తుంది. బ్రిటిష్ పాలన పట్ల తదనంతర వ్యాఖ్యానాలపై అది ఒక చెరగని ముద్ర వేస్తుంది. మనకు ఉన్న పరిమితమైన వనరులతో అంత మంది ప్రజలకు అవగాహన కలిగించడం మన వరకు అసాధ్యం. ప్రస్తుతానికి మనకు, మనం పాలించే లక్షలాది ప్రజలకు మధ్య అర్థవివరణ చెప్పే వ్యక్తులతో కూడిన ఒక వర్గాన్ని తయారు చేయడం మనకు ఉత్తమం. ఆ తరగతికి చెందినవారు జన్మతః భారతీయులై ఉండాలి కానీ అభిరుచి, అభిప్రాయాలు, నైతిక విలువలు, మేధస్సులో ఆంగ్లేయులై ఉండాలి ’’. ఆ ‘అధికోన్నత మైన’ లక్ష్యం భారతీయ అస్తిత్వాన్ని తుడిచివేయడం బ్రిటిష్ భావాలు, భావజాలలతో దానిని భర్తీ చేయడం అనేది సుస్పష్టం. ఇది జాతి అస్తిత్వం, ‘స్వ’ మీద దాడి తప్ప మరొకటి కాదు. ఈ ‘అధికోన్నతమైన’ లక్ష్య సాధనకు అత్యంత ప్రభావితమైన ఉపకరణంగా ‘సైన్స్’ ఉన్నది.
హేతువు ప్రాతిపదికగా సైన్స్, టెక్నాలజీ అభివృద్ధిలో అసాధారణమైన విజయం సాధించిన కారణంగా సాంస్కృతిక, నాగరిక•, మేధోపరమైన, జాతిపరమైన ‘ఆధిక్యత’ తమదిగా బ్రిటిష్ పాలకులు చెప్పుకుంటారు. తమ చేతుల్లో ఓడిపోయిన వారిపై ‘నిమ్నత’ అనే చీటిని ఒకరు తగిలించినప్పుడు ‘ఆధిక్యత’ అని చెప్పుకోవడం ప్రశ్నకు తావులేనిది అవుతుంది. భారతీయులను అవివేకులు, అనాగరికులు, భయంకరమైన మూఢ విశ్వాసాల మడుగులో పూర్తిగా మునిగిపోయినవారిగా పేర్కొంటూ వలస వచ్చినవారు భారతీయులను అప్రతిష్ట పాల్జేయడం ఆరంభించారు. ‘సైన్స్’ ప్రాతిపదికగా వలస వచ్చినవారు ఆడిన కపట నాటకాన్ని ప్రఖ్యాత పండితుడు ఆశిష్ నంది ఎండ గట్టారు. ‘వలసవచ్చినవారి సాహసాలకు సంబంధిం చిన ప్రసిద్ధ వృత్తాంతాలు, లేదా శాస్త్రబద్ధంగా ఆలోచించే మెదడు కలిగిన అన్వేషకులు అధునాతన సైన్స్ ఆధారంగా చేసిన ఆవిష్కరణలతో, కొత్త తరహా చేతబడులతో ఆసియా, ఆఫ్రికా ప్రజలను కొన్నిసార్లు భయపెడతారు లేదా ఆకట్టుకుంటారనే సంగతి పాఠకులకు గుర్తు ఉండి ఉండవచ్చు. వలసవాదం తాలూకు నాగరికతా క్రతువు పాశ్చాత్య సైన్స్, అనాగరిక మూఢ విశ్వాసాల మధ్య సంఘర్షణతో కూడిన జానపద సాహిత్యంతో వర్థిల్లింది. కానీ అలాంటి ప్రతి సందర్భంలోనూ, వలసపాలకుల రాజ్యానికి సైన్స్ అక్కరకు వచ్చేది. సైన్స్‌కు రాజ్యం అక్కరకు వచ్చేది కాదు’ అని ఆయన రాశారు. అది ‘సైన్స్’ను ఉపయోగించుకోవడం ద్వారా భారత దేశానికి చెందిన ‘స్వ’ పై గెలుపొందడం కోసం బ్రిటిష్ పాలకులు చేసిన తీవ్రమైన ప్రయత్నం. అది ఒక ప్రాణాంతకమైన దాడి. భారతీయులు తీవ్రంగా వణికిపోయారు. అది ఒక అస్తిత్వ సంక్షోభం. అయితే వాస్తవానికి ఈ అనూహ్యమైన సవాల్‌ను ఎదుర్కోవడానికి అందరూ సంసిద్ధులైనారు.
మేధోపరమైన బ్రిటిష్ ఆధిపత్యానికి సవాల్
మేధోపరమైన బ్రిటిష్ ఆధిపత్యాన్ని సవాల్ చేస్తూ సైన్స్ సమాజం శంఖారావం పూరించింది. ఒక విజయవంతమైన మెడికల్ ప్రాక్టిషనర్, ఘనమైన పాండితీ ప్రకర్షతో కూడిన సైన్స్ ఔత్సాహికులు డాక్టర్ మహేంద్రలాల్ సర్కార్ పాశ్చాత్య సైన్స్ మద్దతు దారుల ఆధిపత్య వైఖరి నుంచి చేదు అనుభవాన్ని చవిచూశారు. దారుణమైన అన్యాయానికి ఎదురు నిలిచారు. ఒక స్వదేశీ సైంటిఫిక్ ఇనిస్టిట్యూట్‌ను నెలకొల్పుతానని డాక్టర్ మహేంద్రలాల్ సర్కార్ ప్రతినబూనారు. వదాన్యులైన తోటి భారతీయుల సాయంతో ‘కేవలం దేశీ, స్వచ్ఛమైన జాతీయత’ను రంగరించుకున్న ఇండియన్ అసోసియేషన్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ సైన్స్ (IACS)ను 1876లో నెలకొల్పారు. జాతి పునర్ నిర్మాణానికి, దేశీయంగా అభివృద్ధి చెందిన సైన్స్ ద్వారా దివ్యమైన భారత్‌ను స్మరించుకోవడానికి ‘సైన్స్’ ఒక ఉపకరణం అనే ఒక దృఢ నిశ్చయాన్ని ఆయన కలిగి ఉండేవారు. స్వదేశీ స్ఫూర్తితో ఒక సైన్స్ ఉద్యమానికి అది నాంది పలికింది. మేధో సామర్థ్యాన్ని సంతరించుకున్న యువతీయువకులను కదలించింది. ఈ ఇనిస్టిట్యూట్ ద్వారా తరతరాల యువ భారతీయ శాస్త్రవేత్తలు పుట్టుకొచ్చారు. ప్రపంచ స్థాయి శాస్త్రీయ ఆవిష్కరణ లతో ఆధునిక సైన్స్ చరిత్రలో చెరుగని ముద్రలు వేశారు. బ్రిటిష్ శాస్త్ర గుత్తాధిపత్యంతో విజయ వంతంగా పోటీపడ్డారు. IACS నుంచి ఆవిర్భ వించిన దేశభక్తి కలిగిన శాస్త్రవేత్తల్లో ధృవతార డాక్టర్ సీవీ రామన్. ఆధునిక సైన్సు పురోగతిలో ప్రభావ శీలమైన తోడ్పాటును అందించినందుకుగాను 1930లో నోబెల్ పురస్కారాన్ని గెలుచుకున్న తొలి శ్వేతేతర శాస్త్రవేత్త డాక్టర్ సీవీ రామన్.
ఆధునిక శకంలో తొలి భారతీయ శాస్త్రవేత్తగా పేరొందిన ఆచార్య జగదీశ్ చంద్రబోస్ ప్రపంచానికీ, ప్రత్యేకించి పశ్చిమ దేశాలకూ భారతీయ మేధోపర మైన సామర్థ్యాలను ప్రదర్శించారు. దేశభక్తునిగా ఆయన తొలి ‘సత్యాగ్రహం’ చేశారు. భౌతికశాస్త్రంలో అత్యున్నతమైన ప్రతిభతో విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న అనంతరం 1884 సంవత్సరంలో ఇంగ్లండ్ నుంచి భారత్‌కు తిరిగి వచ్చిన తర్వాత ఆ అంశంలో విద్యా బోధన చేయాలని ఆకాంక్షించారు. ఇక్కడి బ్రిటిష్ పాలనలో పెచ్చరిల్లిన అన్యాయం, జాతి వివక్షను ఆయన ప్రతిఘటించారు. ఆచరణలో ఎడ్యుకేషన్, సర్వీసు రెండు వేర్వేరు జాతి సమూ హాలుగా విడిపోయింది. వాటిలో బ్రిటిష్‌వారికి ఇంపీరియల్ సర్వీసు కాగా భారతీయులకు ప్రొవిన్షియల్ సర్వీసు ఉండేది. ఇరు వర్గాలు ఒకే రకమైన విధులు, బాధ్యతలు ఉండేవి. కానీ వేతనం చాలా తక్కువగా ఉండేది (ఒక భారతీయ ప్రొఫెసర్ పొందే ఆదాయం ఒక ఐరోపా ప్రొఫెసర్ అందుకునే ఆదాయంలో మూడింట రెండు వంతులు). ఇంపీరియల్ సర్వీస్ ద్వారా ఒక అఫిషియేటింగ్ ప్రొఫెసర్‌గా ప్రెసిడెన్సీ కాలేజీలో జేసీ బోస్ నియమితు లైనప్పటికీ (ఆయన ప్రతిభకు మెచ్చిన గవర్నర్ జనరల్ లార్డ్ రిప్పన్ పలుకుబడి కారణంగా), సైన్స్‌కు చెందిన కచ్చితమైన విధానాల్లో భారతీయులకు సహజసిద్ధమైన సామర్థ్యం ఉండదు అనే ప్రాతిపదికపై ఈ నియామకాన్ని కాలేజీ ప్రిన్సిపాల్ ఆక్షేపించారు.
విధుల్లో చేరిన తర్వాత, తన నియామకం కేవలం అఫిషియేటింగ్ కావడంతో మూడింట రెండు వంతులు వేతనం సగానికి తగ్గిపోయిందని బోస్ తెలుసుకున్నారు. వేరే మాటల్లో చెప్పాలంటే, సాధారణ వేతనంలో మూడో వంతును మాత్రమే పొందగలరు. ఈ అణచివేతకు తలొగ్గడానికి నిరాకరిస్తూ బోస్ సత్యాగ్రహాన్ని చేపట్టారు. ‘మొదటి నుంచి కూడా ఆయన తన విధుల పట్ల అత్యంత స్పష్టతను కలిగి ఉన్నారు. నిర్దేశించిన దాని కన్నా కూడా ఎక్కువ చేస్తూ వచ్చారు. అదే సమయంలో భారతీయ ప్రొఫెసర్ల స్థాయిని పెంచడం కోసం తన వృత్తి గమనమంతటా పూర్తి శక్తియుక్తులను వినియోగించడానికి ఆయన సంకల్పించారు. మునుపెన్నడూ లేని పట్టుదలను అవలంబించారు. తనకు ప్రతి నెలా వేతన రూపంలో వచ్చే చెక్కును ఒక్కనాటికీ తాకరాదని నిశ్చయించుకున్నారు. ఇదే వైఖరిని మూడు సంవత్సరాలపాటు కొనసాగించారు’’ అని ఆయన జీవిత చరిత్ర రచయిత గెడ్డెస్ తెలిపారు. ఈ దృఢచిత్తంతో కూడుకున్న అహింసాయుతమైన ప్రతిబంధకానికి బ్రిటిష్ అధికారులు తలొగ్గారు. ఈ వ్యత్యాసాన్ని రద్దు చేయించారు.
అంతేకాకుండా, బ్రిటిష్ విధా నాలు ప్రతికూలమైనప్పటికీ ఆయన శాస్త్రీయ పరిశోధన చేపట్టారు. ప్రతికూలతలు ఒక్కనాటికీ ఆయన శాస్త్రీయ ఉత్పాదకతను నిలువరించ లేదు. సరి కదా అందుకు బదులుగా ఆయన ప్రతిభను, దృఢ సంకల్పాన్ని రెచ్చగొట్టాయి. 1895లో ఆయన ఒక ప్రతిష్ఠాకరమైన ఆవిష్కారం చేశారు. ఆధునిక సైన్స్ చరిత్రలో తంత్రీ రహిత ప్రసారానికి ఆద్యులుగా నిలిచారు. బోస్ సాధించిన విజయానికి ఆధునిక సైన్సుకు ఆద్యుడు లార్డ్ కెల్విన్ ఆనందంతో పొంగిపోయారు.
భారతదేశ ప్రాచీన వైజ్ఞానిక సంప్రదాయపు ఆధునిక పునరుజ్జీవనానికి అవసరమైన ఇన్‌స్టిట్యూట్ ఫర్ సైన్స్‌ని స్థాపించాలని ఆయన కలలు కన్నారు. శాస్త్రీయ పరిశోధనలతో జ్ఞానాన్ని ఉత్పత్తి చేయడం ద్వారా తన మాతృభూమికి పూర్వ వైభవం తీసుకు రావడం ఆయన దృక్పథం. ఆధునిక సైన్స్ రంగంపై బలమైన ముద్రవేసిన మొదటి శ్వేతజాతీయేతర శాస్త్ర వేత్త బోస్ జాతీయవాద స్ఫూర్తితో పురోగమించారు.
మరో పేరొందిన శాస్త్రవేత్త, బోస్‌కు సన్నిహిత మిత్రులు, తన దేశానికి ప్రపంచ మేధో నేతగా కోల్పోయిన హోదాను తిరిగి కట్టబెట్టడానికి సైన్స్ జాతీయవాద సాధనలో మనసు పెట్టినవారు ఆచార్య ప్రఫుల్ల చంద్ర రే. భారతీయుల్లో కొడిగట్టిపోతున్న స్ఫూర్తిని వెలిగించడానికి ‘హిస్టరీ ఆఫ్ హిందూ కెమిస్ట్రీ’ (History of Hindu Chemistry) అనే పుస్తకాన్ని ఆయన రచించారు. భారత్‌లో తొలినాళ్ల నుంచి రసాయనిక శాస్త్రంలో మరపురాని అభివృద్ధి ఉంది. ఆధునిక కెమిస్ట్రీ అభివృద్ధిలో అది ఎలా తోడ్పా టును అందించినది ఈ పుస్తకం ప్రస్తావించింది. అదే రకమైన ధోరణిలో, స్వయంసమృద్ధి సాధన దిశగా దేశ ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని పాదుగొల్ప డానికి, తొలి సైన్స్ ఆధారిత స్వదేశీ పరిశ్రమ ది బెంగాల్ కెమికల్ అండ్ ఫార్మాస్యూటికల్ వర్కస్ (the Bengal Chemical and Pharmaceutical Works)ను 1901లో స్థాపించడంలో ఆయన విజయం సాధించారు. ‘‘దేశ మేధోపరమైన (శాస్త్రీయ), పారిశ్రామిక వనరుల సంపూర్ణ అభివృద్ధి లేకుండా రాజకీయ పునరుజ్జీవనము సాధ్యం కాదు’’ అని ఒకానొక సందర్భంలో ఆయన అన్నారు. దీనికి తోడు, పేలుడు పదార్థాలను తయారు చేయడంలో విప్లవకారులకు సహాయపడ్డారు. దాంతో, బ్రిటిష్ ప్రభుత్వం ఆయన పేరును సాక్షాత్తూ ‘శాస్త్రవేత్త ముసు గులో ఉన్న ఒక విప్లవకారుడు’ అని నమోదు చేసింది.
డాక్టర్ మహేంద్రలాల్ సర్కార్, జె.సి.బోస్, పి.సి.రేతో పాటుగా భారతీయ సైన్సుకు చెందిన నక్షత్ర మండలంలో ధృవతారల్లాంటి అనేక మంది శాస్త్రవేత్తలు స్వరాజ్య సాధన కోసం సైన్స్ రంగంలో ఒక ఉధృతమైన, సృజనాత్మకమైన పోరాటానికి నాంది పలికారు. అద్భుతమైన వారి సేవలను అంచనా వేయడం అత్యంత కష్టమైన పని. అపరిమితమైన వారి సేవలు స్వతంత్ర భారత్‌లో వారిని అన్నివిధాలు గానూ మహత్తరమైన యుగ నిర్మాతలుగా స్మరించు కుంటారు. సైన్స్ అభివృద్ధి, పురోగతి దిశగా వారు వేసిన పునాదిని జాతి పునరుత్థానం, పునర్ నిర్మాణానికి వినియోగించుకోవాలి.
అను: మహేష్ ధూళిపాళ్ల