ప్రపంచంలో ఉగ్రవాద బాధిత దేశాల్లో భారత్‌ ‌కూడా ఒకటి. పాకిస్తాన్‌ ‌ప్రేరేపిత సీమాంతర ఉగ్రవాదంతో పాటు అనేక తీవ్రవాద సంస్థలు భారత్‌లో నిరంతరం అలజడిని సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నాయి. అవి ఏ మతానికి చెందినవో ప్రపంచానికీ తెలుసు. కానీ విచిత్రం ఏమంటే భారత్‌లో మతస్వేచ్ఛకు భంగం కలుగుతోందని, మైనారిటీలపై హింస, వివక్ష, దాడులు పెరిగిపోయాయని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి సహా, కొన్ని అంతర్జాతీయ సంస్థలు గగ్గోలు పెట్టేస్తున్నాయి. ఇస్లామిక్‌ ‌ఫోబియా పెరిగిపోతోందంటూ చేస్తున్న ఈ ప్రచారాన్ని ఇటీవల ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి టీఎస్‌ ‌తిరుమూర్తి (ఈయన స్థానంలో జూన్‌ 21‌న రుచిరా కంబోజ్‌ ‌నియమితు లయ్యారు) ఎండగట్టారు. ఇలాంటి ద్వంద్వ ప్రమాణాలు తగవని, హిందూ, బౌద్ధ, సిక్కు మతస్థులపై దాడుల గురించి ఎందుకు మాట్లాడరని ఆయన సూటిగా ప్రశ్నించారు.

ఈ ఏడాది మార్చి నెలలో ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీ ఒక విచిత్రమైన నిర్ణయం తీసు కుంది. ప్రతి ఏడాది మార్చి 15వ తేదీని ‘యాంటీ-ఇస్లామోఫోబియా డే’గా పాటించాలని ప్రకటించింది. ప్రతి ఏటా ఆ తేదీని ‘ఇంటర్నేషనల్‌ ‌డే టు కంబాట్‌ ఇస్లామోఫోబియా’గా జరుపుకోవాలని ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఇస్లామిక్‌ ‌కంట్రీస్‌ (ఓఐసీ) తరఫున పాకిస్తాన్‌ ‌రాయబారి మునీర్‌ అ‌క్రమ్‌ ‌చేసిన ప్రతిపాదనకు ఓఐసీ 57 సభ్య దేశాలతో పాటు చైనా, రష్యా వంటి మరో 8 దేశాలు మద్దతు ఇవ్వడంతో ఈ తీర్మానానికి ఆమోదం లభించింది.

‘ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలపై వివక్ష చూపడం, విద్వేషపూరిత ప్రసంగాలు చేయడం వంటి రూపాల్లో ఇస్లామోఫోబియా కనిపిస్తోంది. హింస, వివక్ష, విద్వేష పూరిత ప్రవర్తన అంటే ముస్లింల మానవ హక్కులను తీవ్రంగా ఉల్లంఘించడమే. ఇది ముస్లిం దేశాల్లో అశాంతిని సృష్టిస్తుంది’ అని పాకిస్తాన్‌ ‌ప్రతినిధి వాదన. ఈ తీర్మానాన్ని భారత్‌ ‌తప్పు పట్టింది. ఇది ఒక మతానికి సంబంధించిన వాదననే వినిపి స్తోందని, ఇతర మతాలపై జరుగుతున్న అకృత్యాల సంగతేమిటని ప్రశ్నించింది.

‘హిందువులు, బౌద్ధులు, సిక్కు మతస్థులపై జరిగే హింస, వివక్ష, విద్వేషాన్ని ఈ తీర్మానం విస్మరిస్తుంది’ అని టీఎస్‌ ‌తిరుమూర్తి అన్నారు. ఒక మతానికి సంబంధించిన విషయంలోనే ఏకపక్షంగా తీర్మానం చేసి మిగతా అన్ని మతాలు ఎదుర్కొంటోన్న విద్వేషం, హింసల తీవ్రతను అణచివేసే అవకాశం ఇస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హిందువులు, బౌద్ధులు, సిక్కులపై విద్వేష ఘటనలను తిరుమూర్తి ప్రస్తావించారు. ప్రపంచ వ్యాప్తంగా 120 కోట్లమందికి పైగా హిందూమతాన్ని అనుసరి స్తున్నారు. బౌద్ధాన్ని పాటించేవారు 53.5 కోట్ల మంది ఉంటారు. 3 కోట్ల కంటే ఎక్కువ మంది సిక్కులు ఉన్నారు. ఒక మతానికే పరిమితం కాకుండా అన్ని మతాల పట్ల చెలరేగుతున్న విద్వేషాన్ని అర్థం చేసుకోవాలని, మతపరమైన అంశాలకు అతీతంగా ఐక్యరాజ్య సమితి నిలబడాలని తిరుమూర్తి అన్నారు.

ఇక కొద్ది రోజుల క్రితమే మన దేశంలో జరిగిన కొన్ని ఘటనల విషయానికి వద్దాం..

కుట్రపూరిత ప్రచారం

భారత్‌లో ముస్లిం జనాభా 14 శాతం వరకూ ఉంటుంది. ఇండోనేషియా తర్వాత ఎక్కువ ముస్లింలు మన దేశంలోనే ఉంటారు. పాకిస్తాన్‌ ‌కన్నా భారత్‌ ‌లోనే వీరి సంఖ్య ఎక్కువ. వీరు హిందువులు, ఇతర మతస్థులతో సమానంగా అన్ని రకాల హక్కులు, సామాజిక భద్రతను పొందుతున్నారు. మైనారిటీల హోదాలో కొన్ని అదనపు సౌకర్యాలు కూడా లభిస్తున్నాయి. అయినప్పటికీ దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముస్లింలపై వివక్ష, హింస, మతపరమైన విద్వేషం వేగంగా పెరిగాయని కొన్ని వర్గాలు పనిగట్టుకొని ప్రచారం చేస్తున్నాయి. ఈ ఏకపక్ష ప్రచారంతో భారత్‌లో ముస్లింలపై విద్వేషం పెరిగిందని ఐక్యరాజ్య సమితి, యూరోపి యన్‌ ‌యూనియన్‌, అమెరికాతో పాటు అరబ్‌ ‌దేశాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి.

ఇటీవలి కాలంలో మన దేశంలో పనిగట్టుకొని మరీ సృష్టించిన వివాదాలు, విధ్వంసాల్ని గమ నిద్దాం.. బీజేపీ అధికార ప్రతినిధి నుపూర్‌ ‌శర్మ ఒక చర్చలో మహ్మద్‌ ‌ప్రవక్త మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ గగ్గోలు రేపి దీన్ని అంతర్జాతీయ అంశంగా మార్చేశారు. భారత్‌తో సన్నిహితంగా ఉండే దేశాలు కూడా ఈ విషయంలో ఆందోళన వ్యక్తంచేసినా, విదేశాంగశాఖ ప్రకటన తర్వాత సంతృప్తి చెందాయి. కొన్ని గల్ఫ్ ‌దేశాలు తీవ్రంగా స్పందించాయి. పాకిస్తాన్‌, ‌బంగ్లాదేశ్‌ ‌తదితర దేశాల్లో హిందువులపై, ఆలయాలపై దాడులు జరిగాయి. కొన్ని దేశాలు భారతదేశ ఉత్పత్తులను బహిష్క రించాలని పిలుపునిచ్చాయి. కానీ నుపూర్‌ ‌శర్మ ఏ సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారు? చర్చలో అవతలి వ్యక్తి హిందూమతాన్ని అవహేళన చేస్తూ ఏ విధంగా మాట్లాడారు? అనే విషయంలో మాత్రం అందరూ మౌనం పాటిస్తున్నారు.

అంతకు ముందు హిజాబ్‌ ‌విషయాన్ని భూతద్దంలో చూపించారు. కర్ణాటకతో పాటు పలు రాష్ట్రాల్లో హిజాబ్‌ ‌ధరించడం తమ హక్కు అంటూ ఆందోళనలు, గొడవలు రేపారు. న్యాయస్థానాలు స్పష్టమైన తీర్పులను ఇవ్వడంతో వారికి భంగపాటు తప్పలేదు. శ్రీరామనవమి, హనుమాన్‌ ‌జయంతి శోభాయాత్రలపై రాళ్ల దాడులు కొత్తేమీ కాదు. ఈ అంశాలపై బీజేపీయేతర పార్టీలు, హిందూ వ్యతిరేక వర్గాలు, మీడియా అంతగా స్పందించవు. ఒక వర్గంపై దాడి అని మాత్రమే అంటాయి. కానీ ఎక్కడో ఏదో చిన్న ఘటన జరిగినా ముస్లింలపై దాడులు అంటూ పెద్దగా చూపించి గగ్గోలు పెట్టడం సర్వసాధా రణమైపోయింది. వీటిని అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం చేసి భారత్‌లో మైనారిటీలపై వివక్ష, దాడులు, హింస అంటూ ప్రచారం చేస్తున్నారు.

అయోధ్య తీర్పు తర్వాత భంగపడిన వర్గాలు దేశంలో అశాంతిని రేపడానికి ఎదురు చూస్తున్నాయి. జమ్ముకశ్మీర్‌లో 370 అధికరణం రద్దు వారికి మింగుడు పడలేదు. ఈ అంశాన్ని అంతర్జాతీయ వివాదంగా మార్చాలని చూసినా ఫలించలేదు. కశ్మీరీ పండిట్‌ల మీద జరిగిన అరాచకాలపై వచ్చిన ‘కశ్మీరీ ఫైల్స్’ ‌చిత్రం కూడా వీరికి మింగుడు పడలేదు. దీంతో ఏ చిన్న ఘటన జరిగినా దాన్ని వివాదాస్పదం చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాశీలోని జ్ఞాన్‌వాపి మసీదులో శివలింగం బయటపడడంతో వారు ఆత్మరక్షణలో పడ్డారు. అది లింగం కాదు ఫౌంటేన్‌ అని సమర్థించుకునే ఎత్తుగడ పెద్దగా ఫలించలేదు. మధుర విషయంలో కూడా భంగపాటు తప్పదని గ్రహించి మరింతగా రెచ్చిపోతున్నారు. హిజాబ్‌ అం‌శంపై తీర్పు ఇచ్చిన న్యాయమూర్తులను బెదిరించడం.. నుపూర్‌ ‌శర్మను చంపేస్తామని, అత్యా చారం చేస్తామనే హెచ్చరికలు కూడా ఎవరికీ పట్టవు.

హిందువులపై హింస కనిపించదా?

ప్రపంచంలో ఉగ్రవాద బాధిత దేశాల్లో భారత్‌ ‌మొదటి స్థానంలో ఉందంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. మెజారిటీ మతం అయినా హిందువులే ప్రధానంగా బాధితులు అవుతున్నారు. దేశ విభజనకు ముందూ, ఆ తర్వాత కూడా ఇదే పరిస్థితిని చూడ వచ్చు. మతం ఆధారంగా ఏర్పడిన పాకిస్తాన్‌ ‌నిరం తరం భారత్‌ ‌మీద విషం కక్కుతూనే ఉంది. దేశ విభజన సమయంలో లక్షలాది మంది హిందువులు, సిక్కుల మానప్రాణాలు, ఆస్తులు దోచుకున్నా పాకిస్తాన్‌ ‌దాహం తీరలేదు. భారతదేశంలో నిరంతరం ఉగ్రవాద కార్యకలాపాలను కొనసాగిస్తోంది. పాకిస్తాన్‌ అధికారిక ఇంటెలిజెన్స్ ‌సంస్థ ఐఎస్‌ఐ ‌శిక్షణ ఇచ్చే తీవ్రవాద సంస్థలు మన దేశంలోకి చొరబడి ఎన్నో దాడులు చేశాయి. హిందువులతో పాటు ఇతర మతస్థులు కూడా ఈ ఘటనల్లో ప్రాణాలు కోల్పో యారు. పాకిస్తాన్‌ ‌తన భూభాగంలో అనేక ఉగ్రవాద సంస్థలకు శిక్షణ ఇస్తోంది. తీవ్ర వాదులను పెంచి పోషిస్తోంది.

కశ్మీర్‌ అం‌శాన్ని నిరంతరం ప్రపంచ వేదికలపై ప్రస్తావిస్తూ భారత్‌ను దోషిగా చూపే ప్రయత్నం చేస్తోంది పాకిస్తాన్‌. ‌భారత్‌ ‌కూడా అంతే దీటుగా ఈ ప్రచారాన్ని ఎప్పటికప్పుడు తిప్పికొడుతోంది. భారత్‌లో ఏ చిన్న ఘటన జరిగినా ముస్లింలపై దాడులు జరుగుతున్నాయని ప్రచారం చేయడం ఆ దేశానికి కొత్తేమీ కాదు. పొరుగు దేశంలో ముస్లింలపై వివక్ష చూపిస్తున్నారని ఆరోపిస్తున్న పాకిస్తాన్‌, ‌తమ దేశంలో హిందువులు, ఇతర మైనారిటీ మతాలపై అవలంబిస్తున్న అణచివేతపై మాత్రం నోరు మెదపదు. పాకిస్తాన్‌లో హిందువులపై ప్రతి నిత్యం ఏదో రూపంలో దాడులు, హత్యలు, అత్యాచారాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆలయాల విధ్వంసం అయితే లెక్కేలేదు. భారత్‌లో బాబ్రీ కట్టడాన్ని పడగొట్టారని గగ్గోలు పెట్టిన పాకిస్తాన్‌లో వేల సంఖ్యలో హిందూ దేవాలయాలను ధ్వంసంచేసిన వార్తలు మాత్రం ఎవరికీ కనిపించవు. మీడియాలో వస్తున్న వార్తలు మాత్రమే అంతర్జాతీయ సమాజం దృష్టికి వస్తున్నాయి. చాలావరకూ అజ్ఞాతంలోనే ఉండిపోతున్నాయి. దేశవిభజన సమయంలో పాకిస్తాన్‌లో 10 శాతం వరకూ హిందువులు ఉంటే ఇప్పుడు 1.18 శాతానికి తగ్గిపోయారు. అక్కడ జరుగుతున్న మతపరమైన హింసకు ఇంతకన్నా పెద్ద ఉదాహరణ ఏముంటుంది. పాకిస్తాన్‌ ‌నుంచి విడిపోయి ప్రత్యేక దేశంగా ఏర్పడిన బంగ్లాదేశ్‌లో కూడా హిందువులపై, ఆలయాలపై దాడులు, అకృత్యాలు సర్వసాధారణమైపోయాయి.

ద్వంద్వ ప్రమాణాలు ఎందుకు?

మరోసారి ఐక్యరాజ్యసమితి, తిరుమూర్తి విషయాలకు వద్దాం..

మతపరమైన హింస విషయంలో కేవలం ఒకటో రెండో మతాలను మాత్రమే బాధితులుగా చూపించే ద్వంద్వ ప్రమాణాలు ఎందుకు? నాన్‌ అ‌బ్రహమిక్‌ ‌మతాలకు కూడా దీన్ని సమానంగా ఎందుకు వర్తింపజేయరు? ఇటీవల ఐక్యరాజ్య సమితిలో ద్వేష పూరిత ప్రసంగాలను ఎదుర్కోవడంపై అంతర్జాతీయ దినోత్సవ తొలి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆఫీస్‌ ఆన్‌ ‌జెనోసైడ్‌ ‌ప్రివెన్షన్‌ అం‌డ్‌ ‌రెస్పాన్సిబిలిటీ టు ప్రొటెక్ట్ ‌నిర్వహించిన గ్లోబల్‌ ‌ఫోరమ్‌ ‌చర్చలో భారత ప్రతినిధి టీఎస్‌ ‌తిరుమూర్తి వేసిన ప్రశ్నలు ఇవి. ఉగ్రవాదానికి, సీమాంతర ఉగ్రవాదానికి భారత దేశం అతిపెద్ద బాధితురాలిగా ఉందని ఈ సంద ర్భంగా తిరుమూర్తి గుర్తుచేశారు. మతపరమైన ద్వేషా లను ఎదుర్కొనే విషయంలో ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తే అంతర్జాతీయ సమాజం ఆశించిన లక్ష్యాలను సాధించలేదని స్పష్టంచేశారు. ఈ విషయాన్ని ఒకటో రెండో ఎంచుకున్న మతాలకే పరిమితం చేసే ‘సెలెక్టివ్‌ ఎక్సర్‌సైజ్‌’ ఎం‌దుకని ప్రశ్నించారు.

శతాబ్దాలుగా బహుళ భారత్‌ ‌సంస్కృతులకు నిలయంగా కొనసాగుతోంది. ఇతర దేశాల్లో అణచి వేతకు గురైన యూదులు, జొరాస్ట్రియన్లు, టిబెటన్లకు ఆశ్రయం కల్పించడం ద్వారా బహుళత్వం, ప్రజా స్వామిక సూత్రాలను పాటిస్తూ అందరికీ సురక్షిత స్వర్గధామంగా పేరు తెచ్చుకుంది. రాడికల్‌ ఉ‌గ్ర వాదాన్ని ఎదుర్కోవడంలో ప్రముఖ పాత్రను పోషి స్తోంది’ అని తన ప్రసంగంలో గుర్తుచేశారు తిరు మూర్తి. దేవాలయాలు, మఠాలు, గురుద్వారాలు, ఇతర మతాల ప్రార్థనా స్థలాలపై విద్వేష పూరిత దాడులు ‘మతపరమైన ఫోబియా’ పేరుతో ప్రచారం చేసేవారికి కనిపించవా? అని ప్రశ్నించారు. అఫ్ఘాని స్తాన్‌ ‌రాజధాని కాబూల్‌లోని గురుద్వార్‌పై జరిగిన దాడికి కొద్ది గంటల ముందు ఈ చర్చ జరగడం గమనించాలి. అబ్రహమిక్‌ ‌మతాలపైనే కాకుండా హిందూ, బౌద్ధం సహా ఇతర అన్ని మతాలకు వ్యతిరేకంగా ద్వేషం, హింసను ఎదుర్కోవడానికి అంతర్జాతీయ సమాజం సంఘటిత ప్రయత్నాలు చేయాలని భారతదేశం పిలుపునిచ్చింది.

ఇవే అంశాలను తిరుమూర్తి మార్చి 15న ఐక్య రాజ్య సమితిలో ‘యాంటీ-ఇస్లామోఫోబియా డే’ చర్చ సందర్భంగా ప్రస్తావించడం ఇక్కడ గమనించాలి.

– క్రాంతి, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE