ఆత్మకూరు (నెల్లూరు జిల్లా) ఉపఎన్నికలో వైకాపాకు వచ్చిన ఓట్లు ఆ పార్టీ పట్ల ప్రజలకు ఏర్పడిన నిరాసక్తతను తెలియచేస్తున్నాయి. లక్ష మెజార్టీ సాధిస్తామని చెప్పిన ఆ పార్టీ నాయకులు 82 వేలతో సరిపెట్టుకున్నారు. ‘మందీ మార్బలం’తో ప్రచారం చేసి లక్ష్యం చేరేందుకు ప్రయత్నించారు. ఓటుకు రూ.500 నుంచి రూ.2000 వరకు డబ్బు పంపిణీ చేసినట్లు విపక్షాలు ఆరోపించాయి. సిట్టింగ్‌ ఎమ్మెల్యే మరణిస్తే సానుభూతి ఓట్లతో గట్టేక్కే అవకాశం ఉన్నా తమ పట్ల ప్రజలు వ్యతిరేకంగా లేరని చెప్పుకోవడానికి వైకాపా లక్ష ఓట్ల మెజారిటీ ఎత్తువేసింది. అయినా వారు భావించింది జరగలేదు. వ్యతిరేక ఓటు వేస్తే కక్షసాధింపు చర్యలకు దిగడం, పథకాలు నిలిపివేస్తామని బెదిరించడం వంటి చర్యలు ప్రజలపై ప్రభావం చూపడమే ఈ ఫలితానికి కారణం.

ఆత్మకూరు ఉపఎన్నిక ఫలితం వైసీపీకి ఆనందం కంటే నైరాశ్యం మిగిల్చినట్లు భావించ వచ్చు. ఇదిలా ఉంటే ‘ప్రజా సమస్యలు పరిష్కరిస్తే నవీన్‌ ‌పట్నాయక్‌ (ఒడిశా ముఖ్యమంత్రి)లా 25 ఏళ్లు అధికారం లభిస్తుంద’ని మేకపాటి రాజమోహనరెడ్డి పేర్కొనడం ఆ పార్టీ ఎదుర్కొంటున్న ప్రజా వ్యతిరేకతను స్పష్టం చేస్తోంది. వాస్తవానికి ఈ మాటల్లో భరోసా కంటే ఆందోళనే ఎక్కువగా కనిపిస్తోంది. ప్రజా సమస్యలు పరిష్కరించకుంటే.. 25 ఏళ్ల పాలన దేవుడెరుగు, 2024 ఎన్నికల్లో ఘోర• పరాజయం పొందటం మాత్రం ఖాయమనేది ఆయన సందేశంగా పేర్కొనవచ్చు.

ఓటర్ల అనాసక్తి

మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి మృతితో ఆత్మకూరులో ఉపఎన్నిక అనివార్యమైంది. ఆ కుటుంబానికే చెందిన మేకపాటి విక్రమ్‌రెడ్డికి టిక్కెట్‌ ఇచ్చారు. కుటుంబ, వారసత్వ రాజకీయాలు చేసే తెదేపా ఈ ఉపఎన్నికలో తాము పోటీ చేయబోమని పేర్కొంది. జనసేన కూడా పోటీ చేయలేదు. కాని కుటుంబం వేరు. రాజకీయాలు వేరు. కుటుంబ, వారసత్వ రాజకీయాలకు భాజపా వ్యతిరేకం. అందువల్ల భాజపా ఈ ఎన్నికల్లో పోటీ చేయడంతో ఎన్నిక అనివార్యం అయింది. నియోజకవర్గంలో మొత్తం 2,13,338 ఓట్లు ఉండగా, 1,37,038 ఓట్లు పోలయ్యాయి. అందులో వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డికి 1,02,074 ఓట్లు పోలయ్యాయి. బీజేపీ అభ్యర్థి భరత్‌కుమార్‌కు 19,332 ఓట్లు పోలయ్యాయి. విక్రమ్‌రెడ్డికి 82,888 వేల ఓట్ల మెజార్టీ లభించింది. మొత్తం 2,13,338 ఓట్లలో వైకాపాకు లభించిన ఓట్లు 1,02,074 తీసేస్తే, విపక్షాల ఓట్లు ఓటింగ్‌కు రాని వారితో కలిపి సగం కంటే ఎక్కువే ఉన్నాయి. ఇవన్నీ వ్యతిరేక ఓట్లుగానే పరిగణించవచ్చు. గత ఎన్నికల్లో 80శాతం ఓట్లు పోలయితే ఈసారి 18 శాతం తక్కువ పోలింగ్‌ ‌జరిగింది. ఇది ప్రభుత్వం పట్ల ప్రజల్లో కనబడుతున్న వ్యతిరేకతగానే భావించాలి.

ప్రజల్లో వ్యతిరేకత లేదని చెప్పుకోవడానికి..

వైకాపా అత్మకూరు ఉపఎన్నికలో గెలుపుకోసం మాత్రమే ప్రయత్నించ లేదు. అందరూ అనుకుం టున్న ట్లుగా మూడేళ్లుగా ప్రభుత్వంపై ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత లేదని నిరూపించుకునేందుకు ఈ ఎన్నికను వాడుకుంది. అందుకే విపక్షాలు దీనిని సీరియస్‌గా తీసుకోకున్నా అధికార పార్టీ మాత్రం లక్ష ఓట్ల మెజార్టీ సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నాయకులు ఆత్మకూరులోనే మకాం వేసి ప్రచారం చేశారు. నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాల్లో మండలానికి ఓ మంత్రి, ఎమ్మెల్యేను ఇన్‌ఛార్జ్‌లుగా నియమించారు. ఇంత చేసినా పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం, మంత్రుల రోడ్‌ ‌షోలు వెలవెలబోవడం, ప్రజా వ్యతిరేకత వ్యక్తం కావడంతో తాయిలాలకు తెరలేపారు. ఓటరుకు రూ.500 చొప్పున నియోజకవర్గంలోని 80 శాతం మందికి పంపిణీ చేసినట్లు సమాచారం. ఇందుకు బాధ్యులుగా వాలంటీర్లు, పొదుపు వీఏవోలను నియమించు కున్నారు. ఇందుకుగాను వీరికీ రూ.5 వేలు చొప్పున ముట్టజెప్పారు. ధాన్యం అమ్మిన రైతులకు బకాయిలను వెంటనే చెల్లిం చేశారు. జిల్లా వ్యాప్తంగా ఎంతోమంది రైతులకు బకాయిలు ఉండగా కేవలం ఆత్మకూరు నియోజకవర్గంలోనే ఇవ్వడంపై అంతటా వ్యతిరేకత వ్యక్తమైంది. కాంట్రాక్టర్ల నుంచి వ్యతిరేకత రాకుండా వారికి బిల్లులు మంజూరు చేశారు. విపక్షాల కార్యకర్తల ఇళ్లకు వెళ్లి ఈసారి వైకాపాకు ఓటేయాలని, వచ్చే ఎన్నికలో మీ పార్టీలకు ఓటేసుకోవాలని కూడా అభ్యర్థించారు. ఇంత చేసినా పోలింగ్‌ ‌శాతం మాత్రం ఆశించిన స్థాయిలో పెరగలేదు. ఈ ప్రభావం మెజారిటీపై పడింది.

పార్టీలో అంతర్మథనం

ఈ ఫలితాలకు ముందు నుంచే.. ఆరు నెలలుగా పార్టీలో పాలన పట్ల అంతర్మథనం ప్రారంభమైంది. అధినేత తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలు, విచ్చలవిడిగా జరుగుతున్న అవినీతిని అరికట్టక పోవడం, సంక్షేమ పథకాల పేరుతో జరుగుతున్న నగదు పంపిణీ, ప్రశ్నించిన వారిపై పోలీసులతో దాడులు చేయించడం, నాయకుల రౌడీయిజం వంటివి పార్టీలోని సీనియర్‌ ‌నేతలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. సీనియర్‌ ‌నాయకులతో కాకుండా, కొద్దిమందితో మాత్రమే ముఖ్యమంత్రి సన్నిహితంగా ఉంటున్నారని, వారి చెప్పుడు మాటలు వింటూండ టంతో సహజంగానే అసంతృప్తి మొదలైంది. ఈ మూడేళ్లలో ప్రభుత్వం ఏం చేసిందనేది ఆలోచిస్తే ఏమీ కనిపించదు. అప్పులు తెచ్చి సంక్షేమం పేరుతో డబ్బులు పంచడం తప్ప, ఒక్క అభివృద్ధి పనిని ప్రారంభించలేదు. ప్రజల సమస్యలు పట్టించుకోలేదు. విపక్షాలపై కక్ష సాధింపునకే సమయం కేటాయించారు.

నిజానికి సంక్షేమ పథకాలు సరిగా అమలు చేస్తే ప్రభుత్వం పట్ల సానుకూలత పెరుగుతుంది. ముఖ్యంగా ఇళ్ల స్థలాలు ఇస్తే ప్రభుత్వం పట్ల లబ్ధిదారులు అపేక్ష కనబరుస్తారు. కాని రాష్ట్రంలో జరుగుతున్నది వేరు. ఇక్కడ సంక్షేమం అనేది ఓట్ల కొనుగోలుకు ఉపయోగించుకుంటున్న కిటుకు. నవరత్నాల పేరుతో డబ్బు పంచడం, తిరిగి పన్నుల రూపంలో భారీ వడ్డనలు విధించి ఇచ్చిన దానికి రెట్టింపు వసూలు చేయడం జరుగుతోంది. ఆస్తిపన్ను, నీటిపన్ను, మరుగుదొడ్డి పన్ను, చెత్త పన్ను, రోడ్డు పన్ను, కరెంటు ఛార్జీలు పెంచేశారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌, ‌డీజిల్‌పై పన్నులు తగ్గించినా రాష్ట్ర ప్రభుత్వం తగ్గించలేదు. బ్రాండెడ్‌ ‌మద్యం ఆపేసి నాసిరకం మద్యాన్ని రెండు రెట్లు అధిక ధరలకు అమ్ముతున్నట్లు ఆరోపణలున్నాయి. ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచారు. ప్రధానంగా సిటీ బస్సు టిక్కెట్‌లపై విధించిన సర్వీసు ఛార్జీపై పట్టణ ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రూ.5 టిక్కెట్‌కు రూ.10 సర్వీసు ఛార్జీ కలిపి రూ.15 వసూలు చేస్తున్నారు. ఊరికి పది కిలోమీటర్ల దూరంలో ఇళ్ల స్థలం ఇచ్చి అక్కడ ఇళ్లు నిర్మించుకోవాల్సిందేనని పార్టీ నేతలు బెదిరిస్తున్నారు. రైతులను ఈ ప్రభుత్వం అన్ని విధాలుగా వంచించింది. నిరుద్యోగులకు మొండిచేయి చూపించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు ఇచ్చే కేంద్ర ప్రభుత్వ పథకాలు నిలిపివేశారు. ఇక నవరత్నాల పేరుతో చేస్తున్న ఖర్చులో అసలైన లబ్ధిదారులకు చేరేది 60 శాతం మాత్రమే. మిగతా 40 శాతం అక్రమంగా లబ్ధి పొందుతున్న వారే. తెల్లరేషన్‌ ‌కార్డులు రాష్ట్రంలో 1.48 కోట్లు ఉన్నాయి. అన్ని పథకాలకు కలిపి తెల్లరేషన్‌ ‌కార్డు లబ్ధిదారులు అయిదు కోట్లకు పైగానే ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించడం విశేషం. ఐటీ రిటర్నస్ ‌దాఖలు చేయని వారికీ రేషన్‌ ‌కార్డులిచ్చారు. ఇలాంటి వారందరూ నవరత్నాలతో లబ్ధి పొందుతున్నారు. ప్రభుత్వ లెక్కలకు అందకుండా ఆదాయం ఆర్జించేవారంతా పథకాల్లో లబ్ధిదారులు కావడంతో విలువైన ప్రజాధనం వృథా అవుతోంది.

ఈ భారం ఎలా భరించాలి?

ఈ మూడేళ్లలో ఇప్పటికి 1.50 లక్షల కోట్లు సంక్షేమ పథకాల కోసం నగదుగా పంపిణీ చేసినట్లు స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించారు. రెండేళ్లలో మరో లక్ష కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఇదంతా కేవలం ఓట్ల కొనుగోలు కోసమే జరుగుతున్న తంతుగా అందరికీ తెలిసిన విషయమే అయినా 2024లో పార్టీ తిరిగి గెలిచినా అప్పులపాలైన రాష్ట్రాన్ని ఎలా ఒడ్డున పడేయగలం అని సొంత పార్టీలోని సీనియర్లే అందోళన చెందుతున్నారు. ప్రజల్ని ఒకసారి నగదు పంపిణీకి అలవాటు చేసినందున ఈ పథకాలు కొనసాగించాల్సిందే. పథకాలను ఆపితే ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవు తుంది.

అంతెందుకు 2024 ఎన్నికల్లో భాజపా మినహా మిగతా పార్టీలు నవరత్నాల పథకాలను కొనసాగించం అని చెప్పగలవా? వాటిని వేరే పేరుతో కొనసాగిస్తామని తమ ఎజెండాలో పేర్కొంటాయి. ఆదాయానికి మించి అప్పులు తెచ్చి పంచేస్తూ, వాటి వడ్డీలను చెల్లించడానికి ప్రజలపై పన్నుల భారాలు మోపి వారితో ఛీ కొట్టించుకుంటామేమో అని సీనియర్‌ ‌నేతలు ఆందోళన చెందుతున్నారు. ఏళ్ల తరబడి ఇచ్చింది ఆనందంగా తీసుకునే లబ్ధిదారులు ఒక్క నెల చెల్లింపులు ఆలస్యమైతే భరించలేరు. ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తూ రోడ్డెక్కుతారు. ఇందుకు ఈ మూడేళ్లలో జరిగిన సంఘటనలను ఉదాహరణగా పేర్కొంటూ చర్చించుకుంటున్నారు.

– తురగా నాగభూషణం, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE