– బండి జగన్మోహన్‌

‌మయన్మార్‌ ‌చక్రబంధంలో చిక్కుకుంది. ఒకవైపు మిలిటరీ శాసనం… దానివల్ల దేశ పురోభివృద్ధి కుంటుబడటం, ఇంకోవైపు దేశ ఆర్థిక వ్యవస్థ చైనా చేతుల్లోకి వెళ్లిపోవటం… మరోవైపు క్రైస్తవుల కుట్రలు.. దానికి అమెరికా తెరవెనక రాజకీయాలు. ఇవన్నీ దేశాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. దారీతెన్ను తెలియక దిక్కుతోచ కుండా ఉంది.

దాదాపు మనతో పాటే స్వాతంత్య్రాన్ని పొంది గడచిన 75 సంవత్సరాలలో ప్రజా స్వామ్యం-సైనిక పాలన వ్యవస్థల మధ్య డోలాయ మానం చెందుతూ, ఎటు పోవాలో, ఏది సరైన దారో తెలియక అగ్రరాజ్యాల చేతుల్లో పావుగా మారి దిక్కుతోచని స్థితిలో నేటి మయన్మార్‌ ‌దేశం మనకు కన్పిస్తుంది. ఈ పరిస్థితిని గమనిస్తే నాకు ఒక సంఘటన గుర్తుకు వస్తోంది. ఒక వ్యక్తి పులి బారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో పక్కనే ఉన్న చెరువులోకి దూకాడు. దురదృష్టవశాత్తు, అది ఊబి కావడంతో అక్కడ చిక్కుకుపోయాడు. గ్రహచారం చాలదన్నట్లు ఆ నీటిలో మొసలి ఉంది. మంచి ఆకలితో ఉన్నట్లుంది. పులి కూడా ఒడ్డునే కూర్చుని ఉండిపోయింది. ఆ మనిషి ఎటువంటి స్థితిలో ఉన్నాడో అదే స్థితి నేటి మయన్మార్‌ ‌ప్రజలు ఎదుర్కొం టున్నారు. ఇటువంటి ఒకానొక విచిత్ర స్థితికి కారణమేమిటో తెలుసుకుంటే ఒక దేశం మనుగడ సాగించడానికి ఏది అవసరమో తెలుస్తుంది.

మయన్మార్‌ ‌ప్రస్తుత స్థితికి కారణం తెలుసుకో వాలంటే 1947 నాటి మయన్మార్‌ను అర్థం చేసుకో వాలి. బ్రిటీష్‌వారి నుండి స్వాతంత్య్రం పొందే సమయంలో ‘బోజో ఆంగ్‌ ‌సాన్‌’, ‌వివిధ తెగల నాయకుల మధ్య జరిగిన ఒప్పందాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. తదుపరి జరిగిన నాటకీయ పరిణామాలతో ‘ఊనూ’ (UNu) దేశ అధ్యక్షుడ వటం, వివిధ తెగల మధ్య సమన్వయం సాధించక మిలటరీ జనరల్‌ ‘‌నేవిన్‌’ ‌చేతుల్లో దేశ అంతర్గత వ్యవహారాలను పెట్టడం-నేవిన్‌ ‌దేశాన్ని సైనిక పాలనలోకి తీసుకెళ్ళటం ఒకవైపైతే, ఇదే అదనుగా సైనికపాలనపై ఉన్న వ్యతిరేకతను తమకు అనుకూ లంగా మలచుకుని, మీకు మేమున్నామనే భరోసా పేరుతో సానుభూతి చూపుతూ, గడచిన 50 ఏళ్లలో సరిహద్దు రాష్ట్రాలలో క్రైస్తవ దేశాల యోజనలో భాగంగా జరిగిన మతమార్పిడులను అర్థం చేసుకోవాలి.

వివరాలలోకి వెళ్తే-

మయన్మార్‌కు స్వాతంత్య్రం దాదాపు మనతోపాటే అంటే జనవరి 4, 1948లో వచ్చింది. బ్రిటీష్‌వాళ్లు మయన్మార్‌ను వదలి వెళ్లిపోయే నాటికే అక్కడి స్వాతంత్య్ర ఉద్యమకారుడు, సాయుధ పోరాట యోధుడు బోజో అంగ్‌సాన్‌ ‌స్థానిక తెగల నాయకులను ఏకం చేసి విస్తృత మయన్మార్‌ ఏర్పరచడానికి వారితో ఒక ఒప్పందాన్ని చేసుకున్నాడు. అదే ‘పిన్‌లాన్‌’ (‌Pinlanag) ఒప్పందంగా ప్రసిద్ధి చెందింది. మయన్మార్‌లో ముఖ్యంగా 8 భాషలు మాట్లాడే ప్రజలుంటారు. అవి బర్మీస్‌, ‌షాన్‌, ‌కచిన్‌, ‌ఖయా, కరేన్‌, ‌చిన్‌, ‌మోన్‌, ‌రఖైన్‌ ‌భాషలు. వీరి మధ్య బోజో ఆంగ్‌సాన్‌ ‌నాయకత్వంలో బర్మా స్వాతంత్య్రం పొందుతున్న సమయంలో దేశం అఖండంగా ఉండాలని కాంక్షిస్తూ, భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పరచి వాటికి స్వయం ప్రతిపత్తి (అటానమస్‌) ‌కల్పిస్తూ దేశంలో ఫెడరల్‌ ‌వ్యవస్థను ఏర్పరచి పాలించాలని ఒప్పందం కుదిరింది. దురదృష్టం కొద్దీ ఈ ఒప్పందం జరిగిన కొద్ది కాలంలోనే అనుమానాస్పద స్థితిలో జరిగిన దాడిలో బోజో ఆంగ్‌సాన్‌ ‌చనిపోవటంతో ‘ఊనూ’ (UNu) ప్రధాని పదవి చేపట్టారు. అంతకు ముందు ఏర్పరచుకున్న ‘పిన్‌లాన్‌’ ఒప్పందాన్ని ‘ఊనూ’ పక్కకు పెట్టి పరిపాలన చేస్తుండటంతో ఇతర భాషా ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది. తాము బర్మా నుండి వీడిపోతామని, ప్రత్యేక దేశంగా ఉంటూ స్వయం పాలన చేసుకుంటామనే ఉద్యమాలు పెరిగాయి. సాయుధ తీవ్రవాదం ప్రారంభమయ్యింది. దేశంలో ఏర్పడ్డ ఈ పరిస్థితులను ఉక్కుపాదంతో అణచివేయా లని భావించిన ప్రధాని ‘ఊనూ’ ఈ వ్యవహారాన్ని చక్కదిద్దాలంటూ అప్పటి మిలిటరీ జనరల్‌ ‘‌నేవిన్‌’ (‌Ne win)ను కోరాడు. దేశ సరిహద్దు రక్షణే తన పరిధికి వస్తుందని చెప్పిన ‘నేవిన్‌’‌కు ప్రత్యేక అధికారాలు ఇచ్చాడు. దేశ అంతర్గత వ్యవహారాల అధికారం ‘నేవిన్‌’ ‌చేతికి అందడంతో, పెరుగుతున్న సాయుధ పోరాటాలను ఉక్కుపాదంతో అణచివేశాడు. ప్రత్యేక అధికారాలు పొందిన నేవిన్‌ను అధికార దాహం కమ్మేసింది. 1962 సంవత్సరంలో జరిగిన సాధారణ ఎన్నికలలో మెజారిటీతో గెలిచి ప్రధాని అయిన ‘ఊనూ’ను బంధించి ప్రభుత్వాన్ని అధీనం లోకి తీసుకున్నాడు. దేశంలోని ప్రజాస్వామ్యవాదుల్ని తొక్కివేసాడు. సుప్రీంకోర్టు జస్టిస్‌, ‌రాజ్యాంగ నిర్మాత అయిన ‘ఊ ఛాన్‌ ‌ఠూన్‌’‌ను కూడా జైలులోకి తోసేశాడు.

‘నేవిన్‌’‌కు చైనా పూర్తి అండదండలు ఉన్నాయి. 1960వ దశకంలో చైనా తన చుట్టుప్రక్కల ఉన్న దేశాలలో పాగా వేస్తూ భారత్‌నూ పంచశీల పేరుతో మోసం చేసింది. టిబెట్‌ని ఆక్రమించింది. నేపాల్‌లో కూడా గ్రామస్థాయికి కమ్యూనిజం విస్తరించింది. అదే సందర్భంలో ప్రజాస్వామ్యాన్ని తుంగలోకి తొక్కి, కమ్యూనిజానికి దగ్గరగా ఉండగలిగే సైనిక పాలనను ప్రోత్సహించి తన వ్యాపారానికి, ఆలోచనలకు అనుకూలంగా నడుచుకొనే విధంగా మయన్మార్‌ను తయారు చేసుకోవటంలో చైనా విజయం సాధించింది. అందులో భాగమే ‘నేవిన్‌’ ‌సైనికపాలన.

1962లో ప్రారంభమైన సైనిక పాలన ప్రభావం ప్రజలకు మొదట్లో అర్థం కాలేదు. 1964 వచ్చేసరికి వ్యాపారాన్ని, సంపదను ప్రభుత్వం జాతీయీకరణ చేసింది. వ్యాపారాలు అన్ని ప్రభుత్వ పరమయ్యాయి. అప్పటివరకు ఉండే ప్రయివేటు పాఠశాలలను కూడా ప్రభుత్వం హస్తగతం చేసుకుంది. వంద, యాభై రూపాయల నోట్లను రద్దుచేయగా అవన్నీ కాగితాలకుప్పలై ప్రజలు దివాలా తీశారు. ఇందులో నష్టపోయింది భారతీయులే ఎక్కువ. కారణమే మంటే.. రంగూన్‌, ‌మాండలేలాంటి నగరాలలో వ్యాపారం అధికంగా భారతీయుల చేతుల్లోనే ఉండేది. పొట్ట అరచేత పట్టుకుని కట్టుబట్టలతో, ఇళ్లూ వాకిళ్లు వదిలి భారతీయులు తిరిగి తమ స్వదేశానికి పయన మయ్యారు. అధికారిక లెక్కల ప్రకారం అలా భారత్‌కు చేరిన సంఖ్య మూడు లక్షలకు పైనే. అనేకులు నెలల తరబడి కాలినడకన మణిపూర్‌ ‌గుండా భారత్‌కు చేరారు. ఈ సంఖ్య లక్షలలో ఉంటుంది. భారత్‌కు చేరగా మిగిలినవారు అక్కడే, ప్రముఖంగా గ్రామాలలో ఉండిపోయారు. ఇలా సైనిక పాలనలో ఉంటూ ఆ దేశం మిగతా ప్రపంచ దేశాల ఆంక్షలకు గురై, ప్రపంచానికి ఆర్థిక వికాసానికి దూరంగా విసిరేసిన దేశంగా ఉండిపోయింది.

ఇంకోవైపు దేశంలో ఏర్పడిన ఈ పరిస్థితులను చైనా తనకు అనుగుణంగా ఉపయోగించుకుంది. మిలిటరీ అధికారులను చేరదీసింది. తన వామపక్ష ఆలోచనలను చొప్పించింది. మయన్మార్‌ను ఒక కమ్యూనిస్టు దేశంగా కాకపోయినా, అందులోని సిద్ధాంతాలను తమకు అనుకూలంగా మలచుకుని పాలన చేయసాగాడు ‘నేవిన్‌’. ‌పాఠ్యాంశాలలో మయన్మార్‌ ‌ప్రాచీన చరిత్రను, భారత్‌తో ఉండే సాంస్కృతిక సంబంధాలు, స్వాతంత్య్ర పోరాట సమయంలోని ఘట్టాలు, తిలక్‌ ఉన్న జైలు ఆనవాళ్లు, సుభాష్‌ ‌చంద్రబోస్‌కు సంబంధించిన అంశాలు కూడా లేకుండా చేశారు. చివరకు బుద్ధుడు ఎక్కడ జన్మించాడో, ఎక్కడ తన జీవితాన్ని గడిపాడో కూడా తెలియకుండా చేశారు. విద్యావైద్యరంగాలు వెనకబడ్డాయి. పారిశ్రామికరంగమూ అభివృద్ధికి నోచుకోలేదు. నదులలో పుష్కలంగా నీరున్నా సరియైన ఆనకట్టలు, నీటిపారుదల వ్యవస్థ లేక వ్యవసాయరంగం అభివృద్ధి చెందలేదు. దేశంలో ఎంతో ఖనిజ సంపద ఉన్నా సరిగ్గా ఉపయోగించు కునే పారిశ్రామికరంగము అభివృద్ధి చెందక పోవటంతో దేశం పేదరికాన్ని అనుభవిస్తూ ప్రతి వస్తువుకు ఇతర దేశాలపైన ఆధారపడాల్సి వచ్చింది. సరిగ్గా ఈ పరిస్థితులనే చైనా కోరుకుంది. సహజ వనరులు లభించే చోట తమకు అనుకూలమైన తీవ్రవాదాన్ని పెంచి పోషించింది. వారి ద్వారా తమ మైనింగ్‌కు ఎటువంటి ఆటంకాలు కలుగకుండా చూసుకుంది. ఇలా చైనా ముడిసరుకు తీసుకువెళ్తూ, తమ దేశంలో తయారైన వస్తువులను అధిక ధరలకు మయన్మార్‌కు ఎగుమతి చేసేది.

మరోవైపు మయన్మార్‌ ఆర్థిక వెనుకబాటుతనాన్ని, ప్రజల పేదరికాన్ని ఆసరా చేసుకుని క్రైస్తవ సంస్థలు చాపకింద నీరులా నెమ్మదిగా మత మార్పిడి కార్యకలాపాలకు ఊతమిచ్చాయి. మిలిటరీ పాలనపై ప్రజలకున్న వ్యతిరేకత క్రైస్తవసంస్థలు పాగా వేయడానికి బాగా ఉపయోగపడింది. 1960 తరువాత క్రైస్తవ మతమార్పిడుల సంఖ్య బాగా పెరగటమే దీనికి ఉదాహరణ.

 ‘చిన్‌’ అనే రాష్ట్రంలో 1966 జనాభా లెక్కల ప్రకారం 35 శాతం ఉన్న క్రైస్తవుల సంఖ్య 2010 వచ్చేసరికి 90 శాతానికి చేరింది. మరో రాష్ట్రం ‘కచిన్‌’ ‌లో 1966 నాటి 10 శాతం క్రైస్తవులు 2010 నాటికి 60-65 శాతానికి చేరడం భారీ మతమార్పిడికి నిదర్శనం. 1990 దశకం నుండి మయన్మార్‌లో INGo’s పనిచేయటం మొదలు పెట్టాయి. 1991లో World Vision అన్న సంస్థ, 1995లో ‘సేవ్‌ ‌ద చిల్డ్రన్‌’, 1997‌లో ‘పాక్ట్’ అన్న క్రైస్తవ సంస్థలు ప్రవేశించి తమ కార్యకలాపాలను ప్రారంభించాయి. ఆ సంస్థలు కార్యకలాపాలు ప్రారంభించిన చోట్ల క్రైస్తవం బాగా పెరగటం గమనార్హం. క్రైస్తవం పెరిగిన చోట్ల మొదట్లో భాషాపరమైన ఉద్యమాలు ప్రారంభమై, నెమ్మదిగా అందులోంచి ‘మాది ప్రత్యేక దేశం.మేము మయన్మార్‌ ‌ప్రజలం కాము’ అంటూ పనిచేసే తీవ్రవాద సంస్థలు పుట్టాయి. వీటికి క్రైస్తవ చర్చి అండదండలు ఉండేవి. ఈ తీవ్ర వాద సంస్థలకు కావలసిన మందు గుండు, తుపాకులు అమెరికా, ఇంగ్లండు దేశాల నుండి సరఫరా అయ్యేవి. ఈ దేశాలకు చెందిన వారు తీవ్రవాద శిక్షణ కేంద్రాలకు తరచూ వచ్చి శిక్షణ ఇచ్చేవారు. ‘చిన్‌’ ‌రాష్ట్రాన్ని అమెరికా ప్రత్యేకంగా దత్తత తీసుకుని అక్కడి వారికి అమెరికా రాకపోకలను సులువు చేసింది. వేలాదిగా గ్రీన్‌కార్డులను ఇచ్చి ఆకర్షించింది.

 ‘చిన్‌’ ‌రాష్ట్రం భారతదేశపు ‘మిజో’ రాష్ట్రానికి ఆనుకుని ఉన్న సరిహద్దు రాష్ట్రం కావటం గమనార్హం. కచిన్‌, ‌స్సగాయిన్‌ ‌రాష్ట్రంలోని ఉత్తర ప్రాంతంలో క్రైస్తవ మతమార్పిడులు విపరీతంగా జరిగినవి. ఇవన్నీ భారత ఈశాన్య సరిహద్దు ప్రాంతాలు కావటం గమనార్హం. భారత దేశంలోని ‘మిజోరమ్‌’, ‌మణిపూర్‌, ‌నాగాలాండ్‌, ‌మయన్మార్‌లోని చిన్‌, ‌కచిన్‌, ‌స్సగాయిన్‌ ‌ప్రాంతాలను కలిపి ఒక క్రైస్తవ దేశంగా చేయాలనేది అమెరికా దీర్ఘకాలిక వ్యూహం. తద్వారా పెద్ద దేశాలైన చైనా భారత్‌లను నియంత్రించవచ్చన్నది దాని వ్యూహం కాబోలు.

2010 వరకు మయన్మార్‌ ‌సరిహద్దు రాష్ట్రాల వరకు పరిమితమైన క్రైస్తవ కార్యకలాపాలు 2010 తరువాత దేశంలోనే అత్యంత ఎక్కువ సంఖ్య కలిగిన ‘బర్మీస్‌’ ‌భాష ప్రజల మధ్యకు విస్తరించటం ప్రారంభ మయ్యింది. ముఖ్యంగా గ్రామాలలో రైతులకు శిక్షణ పేరుతో, మైక్రోఫైనాన్స్ ‌పేరుతో బర్మీస్‌ ‌ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ ‘బర్మీస్‌’ ‌భాష మాట్లాడేవారు దేశ జనాభాలో 60% ఉంటారు. వీరు పూర్తిగా బౌద్ధులు. వీరిలోకి ప్రవేశించడానికి అనేక ‘ఎన్‌.‌జి.ఓ.’లను ప్రారంభించారు క్రైస్తవులు. ముఖ్యంగా మహిళలు, యువత, రైతులను కేంద్రంగా పెట్టుకుని కార్యకలాపాలు చేయసాగారు. 2015 సంవత్సరం తరువాత క్రైస్తవుల దూకుడు ఇంకాస్తా పెరిగింది. ‘ఆంగ్‌సాన్‌ ‌సూచీ’ వ్యక్తిగతంగా బౌద్ధాన్ని అవలంబిస్తున్నా, ఆమె భర్త క్రైస్తవుడవటం, పిల్లలు కూడా క్రైస్తవంతోనే ఉండటంతో క్రైస్తవుల పట్ల ఆమెకు సకార్మతక ధోరణే ఉండేది. ఈ కారణంగా రాజకీయంగా క్రైస్తవులు పావులు కదపటం ప్రారంభించారు. ఆ దేశంలో 80 శాతం ప్రజలు బౌద్ధులు కావడం వల్ల అక్కడ ప్రభుత్వ పరంగా బౌద్ధ సన్యాసులకు ధార్మిక అధికారాలుంటాయి. ‘సూచీ’ అధికారంలోకి రాగానే క్రైస్తవులు పావులు కదిపి ఇటువంటి అధికారాన్ని పొందారు. 2016లో ‘హెన్రీ వాన్‌ ‌థియో’ (Henny van Thio) అనే క్రైస్తవ ఫాదర్‌ ‌దేశ మత సంబంధాల రెండవ ఉపాధ్యక్షుడుగా నియమితులు కావడం అప్పట్లో బౌద్ధ భిక్షువులకు ఆగ్రహం తెప్పించింది. అమెరికన్‌ ఎం‌బసి కూడా పాత చర్చిల పునరుద్ధరణకు విరివిగా డబ్బులు ఇచ్చింది. ఇలా అత్యధికులైన బర్మీస్‌ ‌ప్రజల్లోకి క్రైస్తవం వెళ్లే ప్రయత్నం చేసింది.

సంఘమే శరణ్యమా?

ఆశ్చర్యమేమిటంటే ఒకప్పుడు భారత్‌లో భాగంగా ఉండి బ్రిటిష్‌ ‌కాలంలో భారత్‌ ‌నుండి విడిపోయి నూతన దేశాలుగా ఏర్పడ్డ అన్ని దేశాలలో ఇంచు మించు ఒకే పరిస్థితి కనబడుతోంది. ఒక దేశ ప్రజలు తమ సాంస్కృతిక, జీవన మూల్యాలను పక్కనపెట్టి, విదేశీ ఆలోచనలతో ముందుకు సాగాలని ప్రయత్నిస్తే  ఆ దేశం ఎప్పటికి పురోగమించదు. అందుకే  విదేశీ క్రైస్తవ అజెండాలను అర్థం చేసుకుంటూ, తమ సాంస్కృతిక, జీవన మూల్యాలను కాపాడుకుంటూ దేశ అభివృద్ధికి మయన్మార్‌ ‌ప్రజలు సంఘటితం కావాలి. అందుకు రాష్ట్రీయ స్వయంసేవక సంఘము లాంటి సంస్థ ఆ దేశానికి అవసరం. అప్పుడే ఆ దేశం ప్రస్తుత అన్ని సమస్యల నుంచి బయటపడి ప్రపంచంలో ఒక శక్తిగా ఎదగ గలుగుతుంది.

(అయిపోయింది)

వ్యాసకర్త : ఆర్‌ఎస్‌ఎస్‌ ‌ప్రచారక్‌, ‌విశ్వవిభాగ్‌

About Author

By editor

Twitter
YOUTUBE