జూలై 10 తొలి ఏకాదశి

ఏకాదశి అంటే పదకొండు. అయిదు జ్ఞానేంద్రియాలు, అయిదు కర్మేంద్రియాలు, మనస్సును మనిషి తన అధీనంలోకి తీసుకువచ్చి భగవదర్పితం చేయాలని, దీనివల్ల మనిషి జాగృతవంతుడౌతాడని చెబుతారు. దీనివల్ల ఇంద్రియ నిగ్రహం అలవడడంతో పాటు బద్దకం లాంటివి దూరమై, ఆరోగ్యం సమకూరుతుందని శాస్త్రకారులు చెబుతారు. ఏకాదశి నిరాహారం. పక్షం రోజులకు ఒకసారి నిరాహారంగా ఉండడం ఆరోగ్య ప్రదమని పెద్దలు, అనుభవజ్ఞుల వాక్కు. ఏకాదశి వ్రతం ఆచరించిన వారికి నదీ, సముద్రస్నానమంతటి పవిత్రత, పుణ్యం లభిస్తాయని, సకల శుభాలతో పాటు అంతిమంగా మోక్షం సిద్ధిస్తుందని విశ్వాసం.

ఆషాఢ శుద్ధ ఏకాదశినే తొలి ఏకాదశి..శయన ఏకాదశి, ప్రథమ ఏకాదశి అని అంటారు. ఏడాదిలో వచ్చే 24 ఏకాదశుల్లో ఆషాఢ శుద్ధ ఏకాదశిని ‘తొలి ఏకాదశి’ గా పిలుస్తారు. దీనికే ‘శయనైకాదశి’, ‘హరి వాసరం’, ‘పేలాల పండుగ’ అనే పేర్లు ఉన్నాయి. ఈరోజు నుంచి కార్తిక శుద్ధ ఏకాదశి వరకు శ్రీ మహవిష్ణువు పాల కడలిపై శయ నిస్తాడు. అందుకే దీనిని ‘శయన ఏకాదశి’ అంటారు. ఈ తిథినాడు యోగనిద్రకు ఉపక్రమించే విష్ణువు నాలుగు నెలల తర్వాత కార్తిక శుద్ధ ఏకాదశి (ప్రబోధ ఏకాదశి) నాడు మేల్కొవడమే ‘ఉత్థాన ఏకాదశి’. రాత్రి సమయాలు, ప్రజలలో నిద్రా సమయం పెరుగు తాయి అన్నదానికి ఈ యోగనిద్రను సూచికగా చెబుతారు. విష్ణుదేవుడు యోగనిద్రకు ఉపక్రమించే ముందు లోకపాలన మహాకర్తవ్యాన్ని నారాయణి అయిన తన సోదరి పార్వతికి అప్పగిస్తాడని చెబుతారు.

శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి వెళతాడని పెద్దలు చెప్పగానే భగవానుడు నిజంగానే నిద్రిస్తాడా? అనే సందేహం కలగక మానదు. పుక్కిటి పురాణంగా కొట్టిపారేయచ్చు. ఇక్కడ ‘నిద్ర’ అంటే మానవుల అనుభవంలోని మామూలు నిద్ర కాదు… ‘సృష్టి నిర్మాణంలో మహోన్నత పక్రియ యోగనిద్ర. శ్రీమన్నారాయణుడు అనంతమైన ఈ సృష్టిని యోగమాయతో చేస్తాడు. ‘యోగ’ అంటే కూర్చడం. ప్రకృతితో జీవాత్మను, జీవాత్మకు శరీరాన్ని, దానికి అవయవాలను కూర్చడాన్ని యోగా అంటారు. ‘మాయ’ అంటే లోకంలో ప్రచారంలో ఉన్న మాయామర్మం కాదు. సృష్టి, స్థితి, లయాలనే అద్భుతశక్తికే మాయలని పేరు. మహదాశ్చర్యాన్ని కలిగించేదే మాయ. అందుకు జీవరాశి సృష్టి విధానమే ఉదాహరణ. అనంతకోటి జీవరాశులలో ఏ జీవరాశి, ఏ జీవుడు ఏ సమయంలో ఎంత మేరకు పాపపుణ్యాలు చేశాడో, వాటికి తగిన రీతిలో ఏ శరీరం రావాలో, ఎంత పరిమాణంలో, ఎప్పుడు రావాలో, ..ఇలా ప్రతి ఒక్క జీవరాశిని కూర్చడం అసాధారణ పక్రియ, అత్యాశ్చర్యం. 84 కోట్ల జీవరాశులలో ప్రతి జీవరాశి కర్మ, దాని ఫ•లితం, దానికి కావలసిన అనుభవం, దానిని అనుభవించే శరీరం, దాని పరిమాణం, అది ఉండే ప్రదేశం, ఆ ప్రదేశంలో ఏ భాగం… అనే సృష్టంతా ‘యోగ మాయ’తో జరిగేదే. తన సహకారంతో సృష్టి జరుగుతోంది కనుక భగవానుడు శ్రీ మహాలక్ష్మిని, శంఖచక్రాది ఆయుధాలు, దివ్యాభరణాల మాదిరిగానే తననూ ధరించాలని కోరిందట యోగనిద్ర. కరుణించిన కమలనాథుడు తన కన్నులను నాలుగు మాసాల పాటు ఆవాసంగా చేశాడట. పరమాత్మ అలా మొదటి ఏకాదశినాడు వరం అనుగ్రహించాడు కనుక ‘తొలి ఏకాదశి’గా ప్రసిద్ధమైందని డాక్టర్‌ ‌కందాడై రామానుజార్య వంటి ప్రముఖ ప్రవచనకర్తలు విశ్లేషించారు.

తొలి ఏకాదశి నుంచి దక్షిణాయనం ప్రారంభ మవుతుంది. ఇప్పటివరకు ఉత్తర దిక్కుగా ప్రయాణించిన సూర్యుడు, ఈ రోజు నుంచి దక్షిణ దిక్కుకు వాలుతాడు. అంటే ఈ రోజు మొదలుగా దక్షిణ దిక్కుగా ప్రయాణిస్తాడు. పూర్వకాలంలో ఈరోజునే సంవత్సరారంభంగా పరిగణించేవారట. ఉత్తరాయణం కంటే దక్షిణాయనంలో పండుగలు… పర్వదినాలు ఎక్కువగా వస్తాయి. వాతావరణంలో మార్పులు అధికంగా సంభవిస్తాయి కాబట్టి.. ఈ కాలంలో ఆరోగ్య పరిరక్షణ నియమాలు పాటించా లని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

పురాణగాథ ప్రకారం…

తాళజంఘుడు అనే రాక్షసుడి కుమారుడు మురాసురుడితో యుద్ధం చేసిన శ్రీ మహావిష్ణువు అలసిపోయి శయనిస్తాడు. దేవదేవుడు యోగనిద్రలో ఉండడం అదునుగా భావించిన దానవులు దేవతలపై విజృంభించారు. భీతిల్లి వైకుంఠధామానికి సురలు పరుగులు తీయడంతో భగవానుడి శరీరం నుంచి ఉద్భవించిన ‘సత్త్వశక్తి’ దానవుల దాష్టీకాన్ని కట్టడి చేసింది. యోగనిద్ర నుంచి మేల్కొన్న పరంధాముడు ఆ శక్తికి ‘ఏకాదశి’ అని పేరుపెట్టాడు. ఆమె సమయస్ఫూర్తికి, సకాలంలో సహకరించి నందుకు సంతసించిన శ్రీమహావిష్ణువు ఆ కన్యను వరం కోరుకోమనగా.. తాను విష్ణుప్రియగా లోకంలో పూజలు అందుకోవాలని కోరుకుందట. అప్పటి నుంచి ఆమె ‘ఏకాదశి’ తిథిగా వ్యవహారంలోకి వచ్చింది. అనాదిగా సాధువులు, భక్తజనులు ‘ఏకాదశి’ వ్రతం ఆచరించి శ్రీ విష్ణుసాయుజ్యం పొందినట్లు పురాణాలు చెబుతున్నాయి. అంబరీషుడు, మాంధాత, తదితర పురాణ పురుషులు ఏకాదశి వ్రతాన్ని ఆచరించారు. సూర్యవంశ చక్రవర్తి, సత్యసంధుడు మాంధాత, తన రాజ్యంలో అనావృష్టి నెలకొన్నప్పుడు అంగిరసుడి సూచనపై ‘శయనైక ఏకాదశి’ వ్రతాన్ని భక్తితో చేశాడని, ఫలితంగా వర్షాలు కురిసి పరిస్థితి చక్కబడిందని పురాణాలు చెపుతున్నాయి. సతీ సక్కుబాయి ఈ శయన ఏకాదశి నాడే మోక్ష ప్రాప్తి పొందారట.

‘మోక్ష వ్రతం’

దశమితో కూడి ఉన్న ఏకాదశి వ్రతానికి, ఉపవాసానికి పనికిరాదని, ద్వాదశితో కలసి ఉన్న ఏకాదశి భగవంతుడి సాన్నిధ్యాన్ని కలిగి ఉంటుంది కనుక ఆనాడే ఏకాదశి వ్రతాన్ని నిష్కామబుద్ధితో (నిష్కామ వ్రతం) ఆచరించాలని శాస్త్రం. ఇతర వ్రతాలను కోర్కెలు సిద్ధించేందుకు (కామ్యార్థం) చేస్తే దీని పరమార్థం మాత్రం మోక్షమే. అందుకే దీనిని ‘మోక్షవ్రతం’ అంటారు.

తొలిఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి, రాత్రి జాగరణ చేస్తారు. ఆ సమయంలో భాగవత పఠనం లేదా విష్ణు సహస్రనామ పారాయణం చేస్తారు. మరునాడు (ద్వాదశి) ఉదయం విష్ణుమూర్తిని అర్చించి ఆహారం తీసుకుంటారు. మానవజాతిని ఉద్ధరించటానికి సాక్షాత్తు శ్రీహరే ఈ ఏకాదశిని ఏర్పాటు చేశాడనీ, ఈ వ్రతాన్ని నియమ నిష్ఠలతో ఆచరించిన వారు అన్ని సమస్యల నుంచి విముక్తి పొందడమే కాదు, మరణానంతరం వైకుంఠానికి చేరుకుంటారని పద్మ పురాణం పేర్కొంది.

చాతుర్మాస్యదీక్ష

శ్రీహరి యోగనిద్రలో ఉండే ఈ నాలుగు నెలల కాలాన్నీ పవిత్రంగా పరిగణించి చాతుర్మాస్యదీక్ష పాటిస్తారు. పూర్వకాలంలో అన్ని వర్గాల ప్రజలు ఈ దీక్ష ను చేపట్టేవారట. ఇప్పటికీ కొందరు పాటిస్తున్నా, మఠాధిపతులూ, సన్యాసం తీసుకున్న వారు విధిగా ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ దీక్షాపరులు నాలుగు నెలలపాటు ఆహార నియమాలు కఠిన నిష్ఠతో పాటిస్తారు. ప్రయాణాలు చేయరు. అరిషడ్వర్గాలను దరిచేరనివ్వరాదు. ‘కాలమాన పరిస్థితులను బట్టి అందరు ఈ దీక్షను చేయలేక పోవచ్చు. కాని దానాది ధర్మకార్యాలను నిర్వ హించడం, దీక్షాపరులు, యతీశ్వరుల, సత్పురుషలతో సాంగత్యంతో అంతకు సమానమైన ఫలాన్ని పొందవచ్చు’ అని చెబుతారు.

తొలి ఏకాదశి తరువాత తిథి ద్వాదశి లేదా ఆషాఢ పౌర్ణమి నాడు ఈ దీక్షను చేపడతారు. ‘తేనాషాఢ శుక్లైకాదశ్యాం, పౌర్ణమాస్యాంవో ఆరంభః ప్రతివర్షంచ యః కుర్యాదేవం వై సంస్మరన్‌ ‌హరిమ్‌’ (‌స్మృతికౌస్తుభం)… ఆషాఢ శుద్ధ ద్వాదశి చాతుర్యాస వ్రత ఆరంభ దినం. కారణాంతరాల వల్ల కుదరకపోతే పూర్ణిమ నాడు మొదలు పెట్టవచ్చు (ప్రస్తుతం అత్యధికులు గురుపూర్ణిమ నాడే ప్రారంభిస్తున్నారు). దీక్ష ప్రారంభం ఎప్పుడైనా కార్తిక శుద్ధ ద్వాదశి నాడే ముగుస్తుంది. చాతుర్మాస దీక్షతోపాటు గోపద్మ వ్రతాన్ని కూడా ఆచరిస్తారు. దీన్ని తొలి ఏకాదశి మొదలు కార్తీక శుక్ల ద్వాదశి వరకు అంటే క్షీరాబ్ధి ద్వాదశి వరకు ఆచరించాలని పురాణాలు చెబుతు న్నాయి. బౌద్ధులు, జైనులు కూడా చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరిస్తారని తెలుస్తోంది. బౌద్ధులు ‘వ్రాసో మాస’ పేరుతో దీనిని పాటిస్తారు. బౌద్ధ భిక్షువులకు దుస్తులు, పాదుకలు, గొడుగులను బహుమానంగా ఇస్తారు. బుద్ధుడు దివ్యలోకంలోని మాతృమూర్తి వద్ద ఉండి, చివరి పూర్ణిమ నాడు ఇహలోకానికి దిగి వస్తారని విశ్వసిస్తారు.

రైతులకూ పండుగ

ఏరువాకలానే ఇది రైతుల పండుగ. అతివృష్టి, అనావృష్టి లాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించ కూడదని, ఎలాంటి ఆటంకాలు లేకుండా సేద్యం సాగుతూ, పైరుకు చీడపీడలు సోకకూడదని కోరుతూ తొలి ఏకాదశిని జరుపుకుంటారు. మొక్కజొన్న, జొన్న పేలాలను పొడి చేసి బెల్లం కలిపి దేవుడికి నైవేద్యంగా సమర్పించి, ప్రసాదంగా తీసుకుంటారు. రైతులు పూజ చేసి పొలం పనులకు వెళతారు. ఆ రోజున కొద్దిసేపైన తప్పని సరిగా పొలంపని చేయాలన్నది ఒక నమ్మకం. కొత్త కూలీలను మాట్లాడ్డం లాంటి పనులు చేస్తారు. కొత్త ఒప్పందాలు ఈ రోజు కుదుర్చుకుంటే మంచిదని నమ్మి అలా చేస్తారు

పేలాల పిండి

పేలాల పిండి పితృదేవతలకు ఎంతో ఇష్టమని చెబుతారు. పూర్వీకులను స్మరించుకుంటూ వారికి నివేదించి, వారి పేరుతో ప్రసాదంగా తీసుకుంటారు. ప్రతి ఆధ్యాత్మిక అంశం వెనుక శాస్త్రీయ కోణం దాగి ఉంటుంది.పేలాల పిండి భుజించడమూ అలాంటిదే. గ్రీష్మ రుతువు ముగిసిన తర్వాత వర్ష రుతువు ప్రారంభమయ్యే కాలం. ఆరోగ్యపరంగానూ, ఉష్ణోగ్రతలను బట్టి శరీరం మార్పులకు లోనవు తుంది. ఈ సమయంలో శరీరానికి పేలాల పిండి వేడిని కలిగిస్తుంది. ‘స్వామి కార్యం… స్వకార్యం’ అన్నట్లు ఈ తిథినాడు దేవాలయాల్లోనూ, ఇళ్ల వద్దా పేలాల పిండిని ప్రసాదంగా పంచుతారు.

– డా।। ఆరవల్లి జగన్నాథస్వామి, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE