– జమలాపురపు విఠల్‌రావు
సమస్యలను పరిష్కరించే దేశంగా భారత్‌ను ప్రపంచ దేశాలు పరిగణిస్తున్నాయన్న సత్యం జూన్ 26-27 తేదీల్లో జరిగిన జి-7 దేశాల సదస్సు మరోసారి రుజువు చేసింది. ఇందుకు జి-7 దేశాల నేతలు నరేంద్రమోదీతో వ్యవహరించిన తీరే నిదర్శనం. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ జి-7 దేశాల సదస్సు జరిగిన జర్మనీలోని స్ల్కాస్ ఎల్‌మావులో స్వయంగా ప్రధాని నరేంద్రమోదీ వద్దకు వచ్చి పలకరించడం, ప్రపంచ మీడియాను ఆకర్షించింది.
జి-7లో భారత్ సభ్యురాలు కాదు. కానీ సదస్సులో పాల్గొనేందుకు జర్మన్ ఛాన్స్‌లర్ ఒలాఫ్ స్కాల్జ్ ఆహ్వానించిన ఐదు భాగస్వామ్య దేశాల్లో మనదేశం కూడా ఒకటి. అర్జెంటైనా, ఇండోనేసియా, సెనెగల్, దక్షిణాఫ్రికాను కూడా ఆహ్వానించారు. నిజానికి రష్యా-ఉక్రెయిన్ సంఘర్షణ నేపథ్యంలో మొదటి నుంచి తటస్థ వైఖరి అనుసరిస్తున్న భారత్‌ను ఈ సదస్సుకు ఆహ్వానించబోరని వెల్లువెత్తిన ఊహా గానాలకు జర్మనీ పలికిన ఆహ్వానం అడ్డుకట్టవేసింది. దీంతో మూడోసారి నరేంద్రమోదీ జి-7 దేశాల సదస్సులో పాల్గొన్నారు. అంతేకాదు, రష్యా వ్యవహారంలో భారత్‌పై, జి-7 దేశాలు గట్టి ఒత్తిడి తీసుకువస్తాయన్న అంచనాలు కూడా తల్లకిందు లయ్యాయి. భారత్ తన ఇంధన అవసరాలను తీర్చు కోవడానికి ఏది సముచితమో దాన్నే అనుసరిస్తుందని ప్రధాని నరేంద్రమోదీ కుండబద్దలు కొట్టారు. రష్యా-ఉక్రెయిన్‌లు తక్షణం తమ సంఘర్షణలను నిలిపేసి, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించు కోవాలని ఈ సదస్సులో మోదీ స్పష్టం చేయడంతో, పాశ్చాత్య దేశాలకు ఈ సమస్యపై భారత్ వైఖరి ఏంటో మరింత స్పష్టంగా అర్థమైంది. ప్రస్తుతం కొనసాగుతున్న యుద్ధంవల్ల చాలా నిరుపేద దేశాలు ఎదుర్కొంటున్న ఆహార సంక్షోభాన్ని ఎలా పరిష్క రించాలనే అంశంపై ప్రధాని ప్రపంచ దేశాల నాయకులతో చర్చించారు. నిజానికి గత ఫిబ్రవరి 24న రష్యా-ఉక్రెయిన్ సంఘర్షణ ప్రారంభమైన దగ్గరి నుంచి భారత్ సమస్య పరిష్కారానికి చర్చలు, దౌత్య మార్గాలే శరణ్యమని స్పష్టంచేస్తూ వస్తున్నది. ఈసారి భారత్ పర్యావరణం, ఇంధనం, ఆరోగ్యం, ఆహారభద్రత, లైంగిక సమానత్వానికి సంబంధించిన సదస్సులో పాల్గొన్నది.
వెనక్కి తగ్గిన అమెరికా
సదస్సు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, రష్యా నుంచి చమురు దిగుమతుల అంశాన్ని ప్రధాని మోదీతో నేరుగా ప్రస్తావించకపోవడానికి కారణం మనదేశంపై ఈ విషయంలో ఒత్తిడి తీసుకురాలేని పరిస్థితి నెలకొనడమే. సీనియర్ అధికారుల స్థాయిలో ఈ విషయంలో రెండు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయని యూఎస్ భద్రతా సలహాదారు జాక్ సులైవాన్ తెలిపినప్పటికీ, రష్యా ఇస్తున్న తక్కువ ధరకు ముడిచమురు మరే దేశమూ సరఫరా చేయదన్నది సుస్పష్టం. అటువంటప్పుడు ప్రపంచ మార్కెట్‌లో తక్కువ ధరకు ఇచ్చే సదుపాయాన్ని వదులుకొని ఎక్కువ ధరకు కొనుగోలు చేయమని కోరే స్థితిలో యూఎస్ లేదు. మిగిలిన దేశాలపై మాదిరిగా ఆంక్షలు విధిస్తామని బెదిరిస్తే నష్టపోయేది ఆ దేశమే. ఆర్థికనీతి రాజ్యమేలుతున్న నేటి తరుణంలో భారత్ వంటి అతిపెద్ద మార్కెట్‌ను వదులుకుంటే నిండా మునిగేది తామేనన్న సంగతి యూఎస్ విధాన రూపకర్తలకు తెలియనిది కాదు. చైనా ప్రాబల్యానికి అడ్డుకట్ట వేయడానికి అమెరికాకు భారత్ చాలా అవసరం. అన్ని అంతర్జాతీయ గ్రూపుల్లో ఉంటూ, కేవలం చైనా, పాకిస్తాన్‌లతో తప్ప ఎవరితో శత్రుత్వ వైఖరిలేని భారత్‌ను ప్రపంచ దేశాలు, ముఖ్యంగా అఫ్ఘానిస్తాన్ వంటి దేశాలు కూడా అత్యంత విశ్వసనీయ దేశంగా పరిగణిస్తు న్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఇటీవలి కాలంలో రష్యా నుంచి ఇబ్బడిముబ్బడిగా చమురు దిగుమతులను పెంచినప్పటికీ భారత్‌పై ఆంక్షలు విధించడానికి యూఎస్ ముందుకు రాలేదు.
యూరప్ దేశాలకు హితవు
సమస్య రష్యా-ఉక్రెయిన్‌లది అయినప్పుడు, అమెరికా సహా యూరప్ దేశాలు కలుగజేసు కోవడంలో అర్థం లేదని భారత్ మొదట్నుంచీ స్పష్టం చేస్తున్నది. రష్యాపై ఏకపక్షంగా ఆంక్షలు విధించడాన్ని వ్యతిరేకించింది. రష్యాతో శత్రువైఖరి మీకే నష్టమని యూరప్ దేశాలకు హితవు చెప్పింది. జాతీయ అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆయా దేశాలకు సూచించింది. అయినా అమెరికా ప్రభావంలో ఉన్న ఈ దేశాలు రష్యాపై ఆంక్షలు విధించి ప్రస్తుతం ఇంధన కొరతతో సతమతమవుతున్నాయి. ఈ వాస్తవాలు తెలిసే ఉక్రెయిన్ సంక్షోభంలో యూఎస్ నేతృత్వంలోని యూరప్ దేశాల వైఖరిని మొదట్నుంచీ భారత్ వ్యతిరేకిస్తూ వస్తోంది. రష్యా నుంచి దిగుమతి అవుతున్న ముడిచమురును శుద్ధిచేసి యూరప్ దేశాలకు మనదేశం ప్రస్తుతం ఎగుమతి చేస్తోంది. వివిధ అంతర్జాతీయ వేదికలపై భారత్ వైఖరిని ఎంతగా విమర్శిస్తున్నా యూరప్ దేశాలకు, భారత్ ఈ విధంగా సహాయపడుతోంది. దేశీయ అవసరాలకే ప్రాధాన్యమిస్తూ భారత్ అనుసరిస్తున్న వైఖరి పాశ్చాత్య మీడియాకు రుచించడంలేదు. మరికొద్ది గంటల్లో నరేంద్రమోదీ జర్మనీ చేరుకుంటారనగా, బ్రిటన్‌కు చెందిన గార్డియన్ పత్రిక ‘రష్యా చమురు యూరప్ దేశాలకు చేరడానికి ఇండియా తెరవెనుక పాత్ర పోషిస్తోంది’ అంటూ ఒక కథనాన్ని ప్రచురించింది. ఇక్కడ, రష్యా చమురు యూరప్ దేశాలకు చేరుతున్నదన్న దుగ్ధ తప్ప, ఆ దేశాలు ఇంధన సంక్షోభంలో చిక్కుకోకుండా భారత్ కాపాడుతున్న దన్న కోణం ఆ కథనంలో లేదు. కేవలం రష్యా వ్యతిరేకత తప్ప, ఆ దేశంపై ఆంక్షలు విధించి తమ దేశాలు నిండా మునుగుతున్నాయన్న సంగతిని గుర్తించకపోవడం ఏకపక్ష దురహంకార వైఖరికి నిదర్శనం.
అబుదాబికి…
జర్మనీలో వివిధ దేశాధినేతలతో అనేక అంశాలపై చర్చలు జరిపిన ప్రధాని నరేంద్ర మోదీ.. తిరుగు ప్రయాణంలో, జూన్ 28న అబుదాబిలో స్వల్పకాల పర్యటన జరిపారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) మాజీ అధ్యక్షుడు, అబుదాబి రాజు షేక్ ఖలీఫా బిన్ జయాద్ అల్ నహ్యాన్ గత నెలలో దివంగతుడు కావడంతో, ప్రస్తుత అధ్యక్షుడిని పరామర్శించేందుకు ప్రత్యేకంగా కొద్దిసేపు ప్రధాని అక్కడ దిగారు. ప్రస్తుతం యూఏఈ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన షేక్ మహ్మమద్ బిన్ జయాద్ అల్ నహ్యాన్ ప్రొటొకాల్‌ను పక్కనబెట్టి మరీ ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించడానికి విమానాశ్రయా నికి రావడం విశేషం. దివంగత మాజీ అధ్యక్షునికి సంతాపం ప్రకటించడంతో పాటు, నూతన అధ్యక్షునికి ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. షేక్ మహ్మమద్ బిన్ జయాద్ అల్ నహ్యాన్ యూఏఈ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ప్రధాని నరేంద్రమోదీ ఆయనతో జరిపిన తొలి సమావేశం ఇది. ‘నా సోదరుడు షేక్ మహ్మమద్ బిన్ జయాద్ అల్ నహ్యాన్ నా కోసం ప్రత్యేకంగా విమానాశ్రయానికి రావడం నన్ను కదిలించివేసింది. ఆయనకు కృతజ్ఞతలు’ అని ప్రధాని ట్వీట్ చేశారు. మనదేశ ప్రధానికి ఇంతటి గౌరవం దక్కుతున్నా మనదేశంలోని కొందరు రంధ్రాన్వేషకులకు ఎంతమాత్రం పట్టదు. దేశహితం పట్టని కుహనా సెక్యులరిస్టులకు పెరుగుతున్న దేశ ప్రతిష్ట కనిపించదు, విదేశాల్లో వ్యక్తమయ్యే ప్రశంసలు వినిపించవు.
జి-7 ఉమ్మడి ప్రకటన
అందరూ ఊహించినట్టుగానే జి-7 దేశాల ఉమ్మడి ప్రకటన చైనా పారదర్శరహిత వాణిజ్య విధానాలను విమర్శించింది. చైనాలో మానవహక్కుల ఉల్లంఘనపై విచారం వ్యక్తంచేసింది. బ్రిటన్-చైనాల ఉమ్మడి ప్రకటనను గౌరవించాలని కోరింది. చైనా అనుసరిస్తున్న మార్కెట్ విధ్వంసక వాణిజ్య విధానాలపై పరస్పరం మరింత అవగాహనను పెంపొందించుకుంటామని జి-7 దేశాలు పేర్కొన్నాయి. ఒకరిపైనే ఎక్కువగా ఆధారపడటాన్ని తగ్గించుకునే దిశగా కృషిచేస్తామని పేర్కొన్నాయి. ప్రపంచ ఆర్థికవ్యవస్థలో పారదర్శక పోటీని ప్రోత్స హిస్తామని, ఈమేరకు అంతర్జాతీయ నిబంధనలను మరింత పటిష్టం చేస్తామని స్పష్టంచేసాయి. మయన్మార్‌లో సైనిక తిరుగుబాటును ఖండించడమే కాకుండా, అక్కడ మానవహక్కుల ఉల్లంఘనపై ఆందోళన వ్యక్తంచేశాయి. సైనిక ప్రభుత్వం తక్షణమే దేశంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని కోరాయి. మయన్మార్ విషయంలో ఆసియన్ దేశాలు ఏకాభిప్రాయంతో రూపొందించిన ఐదు సూత్రాల అమలుకు పూర్తిస్థాయిలో మద్దతిస్తామని ప్రకటన పేర్కొంది. రష్యాపై మరిన్ని కఠినచర్యలు తీసుకోవాలని జి-7 సదస్సు నిర్ణయించిన నేపథ్యంలో యూకే, యూఎస్, కెనడా, జపాన్ దేశాలు రష్యా నుంచి బంగారం దిగుమతులను నిషేధించాలని నిర్ణయించాయి. రష్యా నుంచి అత్యధికంగా ఎగుమతి అయ్యే ఉత్పత్తుల్లో బంగారం కూడా ఒకటి. 2021లో 12.6 బిలియన్ పౌండ్ల బంగారం రష్యా నుంచి ఎగుమతి అయింది. ముఖ్యంగా పశ్చిమదేశాల ఆంక్షల భయంతో నిరంకుశ పాలకుల ఆధీనంలోని దేశాలు బంగారాన్ని విపరీతంగా దిగుమతి చేసుకుంటుండటంతో, ధరలు బాగా పెరిగాయి. ప్రపంచ బంగారం వాణిజ్య హబ్‌గా లండన్ కొనసాగుతోంది. ఇప్పుడు రష్యా నుంచి బంగారం దిగుమతుల నిషేధం, ఆ దేశంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని అంచనా.
అగ్రస్థాయిన భారత్
‘నా దేశహితం నాకు ముఖ్యం’ అనే విధానం విస్పష్టమైన రీతిలో ప్రకటిత మవుతున్నది నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రమే. స్వాతంత్య్రం వచ్చిన దగ్గరినుంచి ప్రభుత్వాలు ఇంటా, బయటా అనుసరించిన ‘బుజ్జగింపు’ విధానాలు దేశానికి చెరుపు చేశాయి. ఉగ్రవాదులు నరమేధం సృష్టిస్తుంటే, వారు ‘దారితప్పినవారు’ అంటూ సర్దిచెప్పుకున్న ఘనమైన నేతలు మనదేశాన్ని ఏలారు. దేశంలోని మెజారిటీ వర్గాన్ని ప్రతి విషయంలో నిర్లక్ష్యంచేసి, మైనారిటీ వర్గాలను బుజ్జగించే ప్రభుత్వాల వైఖరి సమాజంలో అసంతృప్తికి దోహదం చేసింది. అంతర్జాతీయ వేదికలపై వివిధ దేశాలు మనల్ని బెదిరించినా, నోరుమెదపని వైనం! అటువంటి దశనుంచి ప్రపంచ దేశాలను నిగ్గదీసే స్థాయికి ప్రస్తుతం దేశం చేరుకుంది. అగ్రరాజ్యాలుగా విర్రవీగుతున్న అమెరికా వంటి దేశాలు తోకముడవక తప్పడం లేదు. మాట్లాడితే కశ్మీర్‌పై ఒంటికాలి మీద లేచే పాకిస్తాన్, ఇప్పుడు తానే మూడు ముక్కలయ్యే దుస్థితికి దిగజారింది. ఇవన్నీ మనదేశంలో మేధావులుగా చెప్పుకునే కుహనా సెక్యులరిస్టులకు పట్టవు. ఎంతసేపూ బురదచల్లుడు కార్యక్రమం తప్ప!
జి-7 నేపథ్యం
మొట్టమొదటి ప్రపంచ ఆర్థిక సదస్సును 1975లో అప్పటి ఫ్రాన్స్ అధ్యక్షుడు వాలెరీ గిస్కార్డ్ డి ఎస్టైంగ్, ఫెడరల్ చాన్స్‌లర్ హెల్మట్ స్కిమ్‌డట్‌లు దీన్ని ప్రారంభించారు. జర్మనీ, ఫ్రాన్స్, గ్రేట్ బ్రిటన్, ఇటలీ, జపాన్, యూఎస్ దేశాల అధినేతలు, గ్రూప్6- ఫ్రాన్స్‌లోని రామ్‌బౌలెట్ కాస్టిల్‌లో సమావేశమయ్యారు.
1970ల్లో నెలకొన్న ఆర్థిక సమస్యలపై వీరు చర్చించారు. ప్రపంచంలో ఆర్థికమాంద్యం నెలకొన్న తరుణంలో ఒక అంతర్జాతీయ విధానం అవసరమని ఈ సందర్భంగా ఒక అంగీకారానికి వచ్చారు. 1976లో ప్యూరిటో రికోలో జరిగిన సమావేశంలో కెనడాను ఈ గ్రూపులో సభ్యురాలిగా చేర్చుకోవడంతో ఇది జి-7గా రూపాంతరం చెందింది. 1981లో జరిగిన ఒట్టావా సదస్సు సందర్భంగా యూరోపియన్ యూనియన్‌ను ఈ గ్రూపులో భాగస్వామిని చేశారు. మొదట ఆర్థిక అంశాలకు ప్రాధాన్యమిస్తూ ఏర్పడిన జి-7 క్రమంగా 1980 నాటికి విదేశీ వ్యవహారాలు, భద్రతా సమస్యలపై కూడా చర్చించడం, నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభించింది. 1998లో రష్యా ఈ గ్రూపులో సభ్యురాలైంది. ఆవిధంగా ఇది గ్రూప్-8గా విస్తరించింది. అయితే ఉక్రెయిన్ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసిందన్న కారణంతో 2014లో రష్యాను బహిష్కరించడంతో ప్రస్తుతం జి-7గా కొనసాగు తోంది. ప్రస్తుతం జి-7 దేశాలకు జర్మనీ అధ్యక్షత వహిస్తోంది. ఈదేశం అధ్యక్షత వహించడం ఇది ఐదోసారి.
2023లో జపాన్ అధ్యక్ష స్థానాన్ని స్వీకరిస్తుంది. ఈ గ్రూప్-7 దేశాలు ప్రపంచంలో పదిశాతం జనాభాను కలిగి ఉండగా, ప్రపంచ జీడీపీలో 31% ఈ దేశాలదే. ఈ దేశాలు ప్రపంచ వాణిజ్యంలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. ముఖ్యంగా యూఎస్, జర్మనీలు ప్రధాన ఎగుమతి దేశాలు. 2021లో ఈ రెండు దేశాలు ప్రపంచ వ్యాప్తంగా ఎగుమతులు చేసిన మొత్తం ఒక ట్రిలియన్ డాలర్లు.