15న దుర్గాబాయి దేశ్‌ముఖ్ జయంతి
దుర్గ, దుర్గం…. ఈ రెండు పదాలూ దృఢత్వాన్నీ ప్రతిఫలిస్తాయి. దుర్గాబాయికి ఏ ముహూర్తాన ఆ పేరు పెట్టారో కానీ, ఆమెది ఉక్కు సంకల్ప శక్తే! దుర్గాబాయి దేశ్‌ముఖ్ అంటే మరింత గంభీరత ధ్వనిస్తుంది. తనదైన శైలిలో, తనకి మాత్రమే ప్రత్యేకమైన కంచుకోట వంటి తీరుతో ఒక చరిత్రనే సృజించిన వీరనారి. భారత స్వాతంత్య్ర సమరయోధురాలిగా, మహిళాసభ వ్యవస్థాపకు రాలిగా అందరికీ తెలిసిన వారు. వనితా సాధికారతకు ఎంతగా పరితపించారో, స్త్రీ విద్యావ్యాప్తికి ఎన్ని విధాలుగా పరిశ్రమించారో ఇప్పటి తరం వారంతా తెలుసుకుని తీరాలి. 1909 జూలై 15న రాజమహేంద్రవరం ప్రాంతంలో ఉదయించిన సమాజసేవాతత్పర. అస్తమించే వరకు ప్రతీ గంటనీ తన ఆశయ సాఫల్యానికే వెచ్చించిన స్ఫూర్తిమంత. ఏడు పదులకు పైగా జీవితకాలంలో విభిన్న రంగాలకు సేవా సహకారాలందించారు. మధ్య తరగతి కుటుంబికురాలు కావడంతో సామాన్యుల, అందునా వనితల జీవన కోణాలన్నీ తెలుసు. వారికి న్యాయం జరిగేందుకు ఎలా పోరాడాలో కూడా అనుభవ పూర్వకంగా గ్రహించిన క్రియాశీలి. ప్రత్యేకించి కుటుంబ సమస్యల పరిష్కారానికి న్యాయస్థానాలు అత్యవసరమని ప్రతిపాదించారు. రాజ్యాంగ నిర్మాణసభ ప్రతినిధి బృందంలో ఒకరిగా ఆ ప్రతిపాదనను పెద్దల ముందుంచి వారి సమ్మతికి కృషిచేశారు. ప్రభుత్వం అనుసరించాల్సిన ప్రణాళికా విధాన రూపకల్పనతో పాటు, సాంఘిక సంక్షేమ సాధనాంశాలనూ ఆచరణకి తేగలిగారు. దేశంలో ఏర్పాటైన జాతీయ స్థాయి అతివల విద్యామండలికి ప్రథమ అధ్యక్షురాలుగానూ రికార్డు సృష్టించారు. అంతటి ఘనచరితురాలిని సమున్నత పౌర పురస్కారం ‘పద్మవిభూషణ్’ వరించడంలో ఆశ్చర్యం ఏముంది? అలాగే శాస్త్రీయతా పరివ్యాప్తికి సంబంధించి, ఐక్యరాజ్యసమితి విద్యావైజ్ఞానిక సాంస్కృతిక వ్యవస్థ నుంచి అత్యుత్తమ పురస్కారాన్ని స్వీకరించడం ఆ ఆదర్శచరిత కీర్తి మకుటాన కలికితురాయి. ‘మాట్లాడే శిలలు’ పేరిట అనుభవాల మాలికలో రత్నాల వంటి భావాలనెన్నో పంచుకున్నారు. ‘వ్యక్తులే దేశచరిత్రను తిరగరాస్తారు’ అని ఆమె అన్న మాటలు సంపూర్తిగా ఆమెకే వర్తించితీరతాయి. ‘దుర్గాబాయి దేశ్‌ముఖ్’ కదా…. అందుకు!
ఎవరైనా ముందుగా తెలుసుకోవాల్సింది కాలం విలువని! ఆ తర్వాతే మిగతావన్నీ. సమయం ఎంతెంత అమూల్యమో అర్థమైతే, సంకల్పమూ అంతగా బలపడుతుంది. అంతటితో ఆగకూడదది. ఒక ప్రణాళికంటూ ఉండాలి. దాన్ని అమలు చేయగలిగిన సామర్థ్యమూ జత కావాలి. వ్యూహంతో, ఉమ్మడిబలంతో ముందుకెళ్తే ఎవ్వరూ ఆపలేరు. దారిలో ప్రలోభాలూ, ప్రభావాలూ చాలా ఉంటాయి. వాటిని అధిగమించి సాగితేనే వ్యక్తి, శక్తి అవుతారన్నది దుర్గాబాయి ప్రగాఢ నమ్మిక. రచనలు చేయడమే కాదు, వాటి కీలకాంశాలను ఆచరణకు పెట్టడంలోనూ ఏనాడూ వెనుకాడలేదు. భాషా పాండి త్యాన్ని బాల్యంలోనే సొంతం చేసుకున్నారన్నా, కార్యశూరతలో భాగంగా హిందీ విద్యాలయాన్ని ఆనాడే ప్రారంభించారన్నా అదే ఆమె ఘనత, ప్రత్యేకత. తాను చదువుకోవడమేగాక, ఆ విష యాలను వయసులో తనకన్నా పెద్దవారికీ బోధించారు. రాజనీతి శాస్త్రాన్ని, న్యాయవాద ప్రధాన విషయాలను ఏకకాలంలో అధ్యయనం చేశారు. ఉన్నత విద్యాభ్యాసం ముగించి, అటు తర్వాత మద్రాసు ఉన్నత న్యాయస్థానంలో ప్రాక్టీసు చేపట్టారు. ఆంగ్లేయ విద్యావిధానాన్ని తీవ్రంగా నిరసిస్తూ వచ్చారు. సరిగ్గా ఆ రోజుల్లోనే, తెలుగునాట అడుగుపెట్టారు మొట్టమొదటగా బాపూజీ. ఆయన మాటలు తన మనసును తట్టిలేపడంతో, దేశభక్తి సంబంధ భావోద్విగ్నతకు లోనయ్యారామె. అప్పుడామెకు పట్టుమని పదిహేను ఏళ్లయినా లేవు! జాతీయోద్యమానికి ఊతంగా విరాళాల సమీకరణకు ముందుకు సాగారు. అప్పుడే ఓ రోజున, తన చేతులకున్న బంగారు గాజుల్ని ఉన్న ఫళంగా తీసి ఇచ్చేశారు. అనంతర కాలంలో గాంధీజీ ఎప్పుడు తెలుగునేలమీద అడుగిడినా, ఏ ఊరి సభలో ఉపన్యసించినా, హిందీ నుంచి తెలుగులోకి అనువదించి చెప్పింది దుర్గాబాయే! ఆ ప్రసంగాలతో పాటే, పలు జాతీయోద్యమ పక్రియలకు హాజరై కారాగారవాసము చేయాల్సి వచ్చింది. న్యాయస్థానానికి నల్లకోటుతో వెళ్ళి వస్తూ, లాయరుగా తన పటిమ పాటవాలను అందరికీ చాటి చెప్పారు. ఎప్పుడు పోరాటమే, ఎన్నిసార్లైనా పాల్గొనడమే, విసుగూ విరామమన్న ప్రసక్తే లేదు. అదీ ఆమె విలక్షణత.
వనితా చైతన్య స్రవంతి
సంఘాల్ని స్థాపించడం, సంస్థలుగా అభివృద్ధి చేయడం, కార్యక్రమాల్ని అనతి కాలంలోనే విస్తృతపరచడం దుర్గాబాయి దేశ్‌ముఖ్‌కి అలవాటు. తన భావాల ప్రాచుర్యానికి మహిళా పత్రికలు నెలకొల్పారు.పిల్లలంటే వల్లమాలిన ఇష్టం. పెద్దలతో, పిన్నలతో సంభాషణల్లో ఎంతో ఆర్ద్రత ఉండేది. విద్యార్థినుల వసతికి అనువుగా నిర్మాణాలు చేపట్టి పూర్తిచేసి తోడూనీడా అయ్యారు. ఆడపిల్లలు చదువుకునేందుకు విద్యాలయాలని, వారి వైద్యసౌకర్యాల కోసం ఆస్పత్రులని, పలు వృత్తుల్లో స్థిరపడదలచినవారి గురించి కేంద్రాలనీ ఆరంభించారు. ఇలా నిర్మాణం, నిర్వహణ, పర్యవేక్షణలన్న త్రిసూత్ర కార్యక్రమంతో ఆమె మార్గదర్శినిగా నిలిచారందరికీ. కాలక్రమంలో సాంఘిక సంక్షేమ మండలి వ్యవస్థాపక అధ్యక్షురాలిగానూ బాధ్యతలు వహించారు. అన్నింటి కంటే మించి, వయోజన విద్యారంగానికి ఎంత సేవ చేయాలో అంతా చేశారామె. ఇన్ని విధాలుగా అండదండలందించిన వనితారత్నం కాబట్టే, ఆమెను ఎందరో మాతృసమానురాలిగా కీర్తించారు. విధాన నిర్ణయ సంఘ సభ్యురాలిగా ఉన్నప్పుడు చింతామణి దేశ్‌ముఖ్‌తో కలిగిన పరిచయం క్రమేపీ స్నేహం, ప్రేమ, సాన్నిహిత్యంగా మారి పరిణయానికి దారితీసింది. ఆయన ఎవరో తెలుసా? అప్పటి ఆర్థికశాఖ మంత్రి. ఇద్దరూ ఒకేసారి, ఒకే సంవత్సరంలో పద్మవిభూషణు లయ్యారు. సేవావిస్తృతి ఏ మేరకు అన్నది కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థల్లో ఉత్తమమైన దానికి ఏటా ఇచ్చే పురస్కారంతో ప్రస్ఫుటమవుతుంది.
భర్త పేరులోని ‘ద్వారకానాథ్’ను ఎంతగానో ఇష్టపడేవారామె. ఆయనదీ అసాధారణ ప్రతిభ. రిజర్వు బ్యాంకు గవర్నరుగా వ్యవహరించిన అనుభవశీలి. అదీ మొట్టమొదటగా. అంతేగాక, కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయ సంబంధంగా గౌరవ ఫెలోషిప్ సాధించిన ప్రతిభానిధి. ప్రభుత్వ సేవపరంగా రామన్ మెగసెసే అవార్డును సంయుక్తంగా పొందారు. ఈ దంపతుల కృషి విస్తారమై వెలుగు పూలు పూచింది. వ్యాసంగంలో భాగంగా అనేకానేక రచనలు చేశారు దుర్గాబాయి దేశ్‌ముఖ్. అవన్నీ భారతి, గృహలక్ష్మి వంటి ప్రసిద్ధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. మరో ముఖ్య విషయం..ఆమె అనువాద ప్రముఖురాలు. ప్రేమచంద్ కథలెన్నిం టినో చక్కని తెలుగులోకి అనువదించారు. ఏది రాసినా, ఏం మాట్లాడినా చైతన్య స్రవంతిని తలపించేవారు, వ్యక్తి వ్యవస్థగా మారితే ఎంతటి అభ్యున్నతి చోటు చేసుకుంటుందో చెప్పడానికి ఆమే ఒక ఉదాహరణ.
ఎనలేని సేవానిరతి
స్త్రీలకు న్యాయపరమైన హక్కులు పెరగాలన్నదే దుర్గాబాయి ప్రధాన నినాదం, ప్రథమ విధానం. చదువు ఉంటేనే వికాసం, దానితోనే ఎవరి సమస్యలను వారే పరిష్కరించుకోవచ్చని అంటుండేవారు. ఇంటి వాతావరణం, కొన్ని అనుభవాలు, కొందరి పరిచయాలు, విభిన్న జ్ఞాపకాలు ఆమెకు జీవిత పాఠాలు నేర్పాయి. పరిస్థితులు ఎటువంటి రూపు సంతరించుకున్నా చలించని స్వభావం. నిత్యమూ అనేకానేక పనులతో తలమునకలయ్యే ఆ విదుషీమణి ఏ మాత్రం తీరిక లభించినా పాటలు పాడేవారు, వీణ వాయించేవారు, ఇంటిని అందంగా అలంకరించేవారు. జానపద కళారూపాలను తొలి నుంచీ అభిమానించిన రసపిపాసి. నిర్మాణాత్మక యోచనలకు తోడు సృజనాత్మక ఆచరణలకూ పెద్దపీట వేశారు దుర్గాబాయమ్మ. సొంతగా బోధన ఆరంభించినప్పుడు తనకు కేవలం పన్నెండేళ్ళు. రాజకీయ రంగ ప్రవేశం చేసినప్పుడు పదిహేనేళ్ళు. కారాగారవాసం చేయాల్సి వచ్చినప్పుడు పాతికేళ్ళు. మహిళా న్యాయవాదిగా రంగంలోకి దిగినప్పుడు ముప్ఫయ్ ఏళ్ళు.
జాతీయ స్థాయి నేతలందరితో అరమరికలు లేని చర్చలు జరపడంలో దుర్గాబాయమ్మ దిట్ట. ఒకసారి ఆమె సర్దార్ వల్లభ భాయ్ పటేల్‌తో ప్రత్యేకించి మాట్లాడే సందర్భం వచ్చింది. అది ఏమిటీ అంటే… సుప్రీంకోర్టు భవన ప్రాంగణంలో న్యాయశాస్త్ర గ్రంథాలయానికి నిధుల కేటాయింపు! అప్పటికే ఆయన కొంత ఇచ్చారు. ఇంకా అవసరమవుతాయని తెలిసినా, సంబంధితులు లెవ్వరూ మాట్లాడలేక పోయారు. ‘మీరే చెప్పండమ్మా’ అని దుర్గాబాయ మ్మను ఆశ్రయించారు వారంతా. అదే మాట అంటే పటేల్ ఆమె పట్ల ఎంతలా ప్రతిస్పందించారో తెలుసుకోవాలని ఉందా మీకు? ‘అన్నీ నాకు తెలుసమ్మా! మీ గురించి ఎన్నడూ ఏ ఒక్కటీ అడగరు. ఇతరుల మేలు కోసమే అడుగుతారు. నాకు మాత్రం తెలియదూ?’అంటూనే మరిన్ని నిధులందించారు ఆయన. ఆమె నిరంతర నిస్వార్థ సేవానిరతికి నిదర్శనమే కదా ఇది!
తరగని చెదరని నిబద్ధత
ఉద్యమాలకు నేతృత్వం వహించడం ఆమెకు పరిపాటి. వ్యవస్థాగతంగా సేవాసహకారాలు అందించడమూ రివాజు. తన నివాస గృహాన్నే మహిళా సభ కార్యక్రమాలకు నిలయంగా మలుచుకున్నారు. ‘జీవన సత్యాలను మనం నమ్మాలి. జీవన ధర్మాలను పదిలంగా చూసుకోవాలి. ఆ కోవలోనే నీతినిజాయతీలకు శాశ్వత పట్టం కట్టాలి. ఇవన్నీ వేరే వారి మెప్పు కోసం కాదు. ఎవరికి వారుగా రూపొందించి అమలు చేసుకునే ఉత్తమ విధానాలే జాతి భవితను నిర్ణయిస్తాయి. మనం చిత్తశుద్ధిగా ఉంటే, జీవితమూ ఫలవంతంగా మారుతుంది. అదే మనకు కావాల్సిన అన్నింటినీ ఇస్తుంది. మనలో ఉండాల్సింది నిబద్ధత ఒక్కటే’ అనే వారు. ఇంతకు మించిన పరిణతి ఇంకేముంటుంది? ఆ వనితా నేతను తలచుకున్నప్పుడు, ముందుగా మనలో ఒకానొక సగర్వత అవతరిస్తుంది. నాటికీ నేటికీ ప్రజలందరి స్మృతిపథంలో నిలిచి ఉన్న మహోన్నత మూర్తిమత్వం కానవస్తుంది. ‘చింతామణ-నేను’ పేరుతో రాసుకున్న జీవితచరిత్రలో ఆమె అంత రంగం ఇంకెంతగానో తేటతెల్లమవుతుంది. వారిది సేవానుబంధం. తమ గురించి ఏ రోజూ ఆలోచించ లేదు, వారి అన్ని ఆలోచనలూ, ఆచరణలూ సామాన్యుల వైపే. ఆమె చివర్లో తన ఇంటిని సైతం ప్రభుత్వానికి ఇచ్చేశారు. ఎప్పటి మాదిరే అతి సాధారణ జీవితం గడిపారు. అసాధారణ తరుణీమణిగా ప్రజలందరి హృదయాల్లో సుస్థిర స్థానం పొందారు. హైదరాబాద్‌లోని ఆమె పేరున్న కాలనీ, రాజమహేంద్రవరంలోని విగ్రహం, ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ నెలకొన్న వివిధ సంస్థలు, దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా నిర్మాణ నిర్వహ ణలు దుర్గాబాయి దేశ్‌ముఖ్ ఘనకీర్తిని వేనోళ్ల చాటుతున్నాయి. అంతటి మహోన్నతత్వానికి సంవత్స రాలూ, తేదీలతో పనేమిటి? ఆ సేవాబంధానికి, ప్రాతఃస్మరణీయకు నిత్యనిరంతర నీరాజనాలు సమర్పిస్తూనే ఉంటుంది జాతి. ఆగే గడియారం కానే కాదు అది.. కాలంతోపాటు తానూ సాగేది!
– జంధ్యాల శరత్‌బాబు, సీనియర్ జర్నలిస్ట్