‘మన ఆలోచన న్యాయబద్ధమైనదనీ, ఆ ఆలోచనదే విజయమనీ మన కార్యకర్తల ఆత్మవిశ్వాసం నిరంతరం ప్రకటిస్తూనే ఉంటుంది. ఆ ఆత్మ విశ్వాసమే ఇవాళ ఇంత చక్కని ఈ కార్యాలయం రూపంలో మన ముందు ఆకాశమంత సాక్ష్యంలా నిలబడి ఉంది…’ అన్నారు పరమ పూజనీయ సర్ సంఘచాలక్ మోహన్‌జీ భాగవత్. భాగ్యనగర్‌లో నూతనంగా నిర్మించిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) కార్యాలయం ‘స్పూర్తి ఛాత్రశక్తి భవన్’ ప్రారంభోత్సవం జూన్ 16న ఘనంగా జరిగింది. ఘనంగా అనే కంటే ఆత్మీయంగా జరిగిందని చెప్పాలి. ఒక స్ఫూర్తిమంత మైన వాతావరణంలో సాగిందని అనుకున్నా బాగుంటుంది. ఆ కార్యక్రమానికి వారే ముఖ్య అతిథి. ఒకప్పుడు ఏబీవీపీలో పని చేసిన నాకు ఆ కార్యక్ర మానికి ఆహ్వానం అందడం ఎంతో ఆనందాన్ని చ్చింది. నా జీవితానికి ఏబీవీపీ ఒక దిశను ఇచ్చింది. నా దృష్టిని మార్చింది. నాలాంటి ఎందరో ఆ రోజు అక్కడ కలుసుకున్నాం. ఆ సంస్థతో పనిచేసినందుకు ఇప్పటికీ నాకు గర్వంగానే అనిపిస్తుంది. ఆ ఉత్సవం మధురానుభూతి మిగిల్చింది. సర్ సంఘచాలక్‌ను స్వయంగా చూసే అవకాశం, అద్భుతమైన వారి సందేశం నేరుగా వినే సదవకాశం కలిగింది. ఎందరో పాత మిత్రులను, సంస్థ కోసం ఇప్పటికీ అహరహం శ్రమిస్తున్న కార్యకర్తలను కలుసుకునే అవకాశం వచ్చింది. అందుకే ఈ కార్యక్రమం నాకిచ్చిన మధు రానుభూతిని అక్షరబద్ధం చేయాలని అనిపించింది.
‘దీనికి స్ఫూర్తి భవనం అనే పేరు సరైనదే. తెలంగాణ ప్రాంత ఏబీవీపీకి ఘన చరిత్ర ఉన్నది. ఇదంతా గమనిస్తే మనసంతా స్ఫూర్తితో నిండి పోతుంద’ని సర్ సంఘచాలక్ చెప్పడంతోనే గతంలో సంస్థ సాధించిన ఎన్నో ఘట్టాలు గుర్తుకు వచ్చాయి. మోహన్‌జీ తెలంగాణ ప్రాంత ఏబీవీపీ మీద ప్రశంసల వర్షం కురిపిస్తుంటే, అవన్నీ నాకేనని పించింది. ‘ఒకవైపు విరోధులను ఎదుర్కొని నిలబడటం. మరోవైపు ఆ విరోధులు కలిగించిన నష్టాన్ని నివారించడం. ఈ రెండూ తెలంగాణ ఏబీవీపీకే చెల్లింది’ అని వారు చెబుతుంటే నా తనువు పులకింది. వీటి ప్రతిరూపమే నేటి కార్యాలయ మని చెప్పారాయన. బలిదానమిచ్చిన కార్యకర్తల తపఃఫలమే ఈ కార్యాలయం అని ఆయన అన్నారు. అవును, నూతన భవనంలో ఏర్పాటుచేసిన అమర వీరుల చిత్రపటాలు చూస్తే ఎవరికైనా కన్నీళ్లు ఆగవు.
ఈ సందర్భంగా ఆచార్య ఎస్.వి.శేషగిరిరావు రచించిన ‘సంక్షిప్త భారతదేశ చరిత్ర-సంస్కృతి’ పుస్తకాన్ని మోహన్‌జీ భాగవత్ ఆవిష్కరించారు. ఇది ఈ ఉత్సవానికే ప్రత్యేక ఆకర్షణ. అదొక బృహద్గ్రంథం. ఎందరో ఏబీవీపీ కార్యకర్తలకు స్ఫూర్తిగా ఉండే ఆచార్య శేషగిరిరావు నిరంతరం దేశం కోసం ఆలోచిస్తారని తెలుసు. కానీ ఈ వయసులోను ఓపికగా పుస్తకాలు రాస్తూ, తన అపార జ్ఞానాన్ని నలుగురికి పంచే యత్నం చేయడం నిజంగా అద్భుతమే. కాశీ ఆధునికీకరణ పనిలో నరేంద్ర మోదీ శ్రమజీవులను స్వయంగా సత్కరించిన సంగతి పేపర్లలో చూశాం. ఈ కార్యాలయ నిర్మాణంలో పాలుపంచుకున్న మేస్త్రీని, వాచ్‌మన్ దంపతులను మోహన్‌జీ స్వహస్తాలతో సన్మానించడం అందరిని ఆనందింప చేసింది.
ఈ ఉత్సవానికి హాజరైన వారి పేర్లు వినడమే కానీ, వారందరినీ ప్రత్యక్షంగా చూసే అవకాశం ఇప్పుడే కలిగింది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన కొందరు, తెలంగాణకు చెందిన ఎందరో ఇక్కడ కనిపించారు. ఎంత పెద్ద కుటుంబం మనది! అతిథులుగా ఏబీవీపీ అఖిల భారత సంఘటనా కార్యదర్శి ఆశిష్ చౌహన్, ఏబీవీపీ అఖిల భారత ప్రధాన కార్యదర్శి నిధి త్రిపాఠి, ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ క్షేత్రాల పెద్దలు పాల్గొన్నారు. ప్రపంచం లోనే అత్యధిక విద్యార్థులను సభ్యులుగా కలిగి ఉన్న సంస్థగా విద్యార్థి పరిషత్ అవతరించిందని ఆశిష్ చౌహన్ చెబుతుంటే చాలా ఆనందం కలిగింది. కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్ అఖిల భారత ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్, అఖిల భారత కార్యకారిణి సదస్యులు వి.భాగయ్యజీని చూసే అవకాశం కలిగింది. నిబద్ధతకు నిలువెత్తు రూపంలో ఉన్న హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఉత్సాహంతో ఉన్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా తీరిక చేసుకుని విద్యార్థి విభాగం కార్యక్రమానికి వచ్చారు. శాసనసభకు వెలుగునిస్తున్న ఎమ్మెల్యేలు రఘునందన్ రావు, ఈటల రాజేందర్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షుడు శంకర్, కార్యదర్శి ప్రవీణ్‌రెడ్డి, ఏబీవీపీ నేషనల్ జాయింట్ ఆర్గనైజింగ్ సెక్రటరీలు ప్రఫుల్ల ఆకాంత్, బాలకృష్ణ; ఏబీవీపీ తెలంగాణ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కరుణాకర్, తెలంగాణ స్టేట్ జాయింట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ లవన్‌కుమార్, ఏబీఆర్‌ఎస్‌ఎం జాయింట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ గుంత లక్ష్మణ్, విద్యార్థి సేవాసమితి అధ్యక్షుడు మనోహర్‌రావు, కార్యదర్శి రాజమహేందర్, రఘునందన్ – విద్యాభారతి, ఆర్‌ఎస్‌ఎస్ తెలంగాణ ప్రాంత ప్రచారక్ లింగం శ్రీధర్, దక్షిణ మధ్య క్షేత్ర ప్రచారక్ సుధీర్, క్షేత్ర సేవాప్రముఖ్ ఎక్కా చంద్రశేఖర్, బీఎంఎస్ అఖిల భారత సంఘటనా మ్రతి సురేంద్రన్, వనవాసీ కల్యాణ ఆశ్రమ అఖిల భారత ప్రశిక్షణ టోలీ సభ్యులు కె.రామచంద్రయ్య, ఆచార్య ఎస్.వి. శేషగిరిరావు, ఇఫ్లూ వీసీ సురేశ్‌కుమార్, సెంట్రల్ యూనివర్సిటీ (కర్ణాటక) వీసీ బట్టు సత్యనారాయణ, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కేరళ వీసీ హెచ్. వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌కు చాలా అనుబంధ సంస్థలు, సేవా సంస్థలు ఉన్నట్టు తెలుసు. కానీ వాటిలో చాలా సంస్థల ప్రముఖులు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి ఉత్సాహంగా పాల్గొనడం అపురూపమనిపించింది.
సభా ప్రాంగణమంతా తెలుగు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చిన ఏబీవీపీ ప్రస్తుత, పూర్వ కార్యకర్తలతో నిండిపోయింది. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులూ హాజరయ్యారు. నిజం చెప్పాలంటే పుష్కలంగా మట్టి వాసన వేసిన కార్యక్రమమది.
– హరీష్, ఏబీవీపీ పూర్వ కార్యకర్త