– గోపరాజు విశ్వేశ్వర ప్రసాద్
ఈ ఏడాది ప్రారంభంలో పంజాబ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించింది. ఒకచోట అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీ మరో రాష్ట్రంలో విజయం సాధించడం ఆషామాషీ విషయం కాదు. దేశ చరిత్రలో ఇలా జరగడం ఇదే ప్రథమం. ఆప్ ఘన విజయంతో ఆ పార్టీకి చెందిన సంగ్రూర్ లోక్‌సభ సభ్యుడు భగవంత్ సింగ్ మాన్ ముఖ్యమంత్రిగా అధికార పగ్గాలు చేపట్టారు. ఆయన పాలనపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. పంజాబ్ ప్రగతి పథంలో ప్రయాణిస్తుందని ఆశించారు. అభివృద్ధి, సంక్షేమం జోడు గుర్రాల్లాగా పరుగులు పెడతాయని భావించారు. శాంతిభద్రతల పరిస్థితి మెరుగుపడుతుందని అనుకున్నారు. కానీ ఈ ఆశలు వమ్ము కావడానికి, కలలు కల్లలవడానికి ఎంతో కాలం పట్టలేదు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి మెరుగుపడకపోగా మరింత క్షీణించింది. అన్నింటికన్నా ప్రమాదకరమైన ‘వేర్పాటువాదం’ మళ్లీ పడగ విప్పుతోంది. ఈ ఘటనలు మేధావులు, జాతీయవాదులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. 1980ల నాటి పరిస్థితి మళ్లీ తలెత్తుతుందా? అన్న అనుమానాలు వేధిస్తున్నాయి. ఆప్ సర్కారు ఉదాసీనత పంజాబ్‌ను మళ్లీ ప్రమాదంలోకి నెడుతుందా? అనే భయాందోళనలు వ్యాపిస్తున్నాయి.
ఆప్ అధికారం చేపట్టిన తొలి రోజుల్లోనే అవాంఛనీయ ఘటనలకు బీజం పడింది. ఏప్రిల్‌లో పటియాలాలో ఒక హిందూ దేవాలయంపై ఖలిస్థానీ వాదులు దాడులకు పాల్పడ్డారు. కొందరు హిందువులపై దాడి చేశారు. మే నెలలో ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ భవనం గోడలపై ఖలిస్థానీ పతాకాలు ఉంచారు. ఇటీవల పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా పట్టపగలు హత్యకు గురయ్యారు. రాష్ట్రంలో క్షీణిస్తున్న శాంతిభద్రతల పరిస్థితికి, వేర్పాటువాదుల ఆగడాలకు ఈ ఘటనలు నిలువెత్తు నిదర్శనం. ఈ ఘటనలపై సర్కారు కేవలం ఖండనలకే పరిమితమైంది తప్ప నిర్దిష్ట చర్యలు చేపట్టిన దాఖలాలు ఎక్కడా లేవు. అన్నింటికన్నా ప్రమాదకరమైనది ‘వేర్పాటువాద’ శక్తులు మళ్లీ తెరపైకి రావడం. 2019లో ఆప్ పార్టీ తరఫున సంగ్రూర్ లోక్‌సభ నియోజక వర్గం నుంచి ఎన్నికైన భగవంత్‌సింగ్ మాన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్ట డంతో ఆ స్థానానికి ఇటీవల ఉప ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, అకాలీదళ్, అధికార పార్టీ ఆప్, భారతీయ జనతా పార్టీలను పక్కకు నెట్టి శిరోమణి అకాలీదళ్ (మాన్) పార్టీ విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి సిమ్రన్ జిత్ సింగ్ మాన్ ఆరు వేలకు పైగా ఓట్ల తేడాతో గెలుపొందడం అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. మాన్ సాధారణ రాజకీయ నాయ కుడు అయితే అంతగా ఆందోళన చెందవలసిన అవసరం ఏమీ ఉండదు. ఎన్నికలన్న తరువాత ఒక పార్టీ ఒకసారి ఓడడం, మరోసారి విజయం సాధించడం మాములే. ఇందులో పెద్దగా చర్చించుకోవలసింది ఏమీ ఉండదు. పార్టీలు కూడా ఆందోళన చెందాల్సినది ఏమీ లేదు. కానీ ఇక్కడ గెలిచింది కరడుగట్టిన ఒక వేర్పాటువాది. ప్రత్యేక పంజాబ్ పేరిట ‘ఖలిస్థాన్’ వాదాన్ని భుజాన వేసుకున్న వ్యక్తి. దశాబ్దాల తరబడి ప్రత్యేకవాదాన్ని జపిస్తున్న నాయకుడు. అందువల్ల మాన్ గెలుపును అన్ని పార్టీలు తీవ్రంగా తీసు కోవాల్సిన అవసరం ఉంది.
పంజాబ్‌ను దశాబ్దాలుగా ఖలిస్థాన్ వాదం పట్టి పీడిస్తున్న సంగతి తెలిసిందే. 80ల్లో ఖలిస్థాన్ వాదంతో రాష్ట్రం అట్టుడుకి పోయింది. హత్యలు, విధ్వంసాలు, మారణహోమాలతో రాష్ట్రం అగ్ని గుండంగా మారింది. ఆఖరుకు స్వర్ణ దేవాలయంపై సైనికచర్య చేపట్టే పరిస్థితి ఏర్పడింది. అనంతరం కొద్ది నెలలకే నాటి ప్రధాని ఇందిరాగాంధీ హత్యకు గురయ్యారు. ఈ పరిస్థితికి అప్పట్లో రాష్ట్రంలోని ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, అకాలీదళ్ కారణమని చెప్పక తప్పదు. అకాలీదళ్‌కు వ్యతిరేకంగా సంత్ జర్నయిల్ సింగ్ భింద్రన్ వాలాను కాంగ్రెస్ పావుగా వాడుకుంది. చివరకు అతను ఏకు మేకై కూర్చోవ డంతో కాంగ్రెస్‌కు తలబొప్పి కట్టింది. 1990వ దశకంలో పరిస్థితి కుదుటపడింది. అప్పుడు కను మరుగైన వేర్పాటువాదం ఇప్పుడు ఆప్ పాలనలో మళ్లీ వెలుగులోకి వస్తోంది. ఈ పార్టీకి చెందిన పలువురు నాయకులు ఖలిస్థానీ సానుభూతిపరులన్న ఆరోపణలు ఉన్నాయి. వీటిని తేలిగ్గా తోసిపుచ్చలేమని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. సంగ్రూర్ నుంచి 2014, 2019 ల్లో గెలిచిన ఆప్ పార్టీ ఈసారి గుర్మయిల్ సింగ్‌ను, అకాలీదళ్ కమల్ దీప్ కౌర్, కాంగ్రెస్ దల్వీర్ సింగ్ గోల్డీ, భారతీయ జనతా పార్టీ కేవాల్ ధిల్లాన్‌లను బరిలోకి దించాయి. వీరందరినీ దాటుకుని మాన్ విజేతగా నిలబడటం సాధారణమైన విషయం కాదు.
ఎవరీ మాన్?
సిమ్రన్ జిత్ సింగ్ మాన్ కరడుగట్టిన ఖలిస్థాన్ వాది. దశాబ్దాల తరబడి ఈ దిశగా పోరాటం చేస్తున్నారు. ఉన్నత విద్యావంతుడు. ఐపీఎస్ అధికారిగా పనిచేసి రాజీనామా చేశారు. గత ఏడాది వరకు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా పని చేసిన కెప్టెన్ అమరీందర్ సింగ్ ఆయనకు తోడల్లుడు. మాన్‌ది రాజకీయ కుటుంబం. ఆయన తండ్రి లెఫ్టినెంట్ కర్నల్ జోగిందర్ మాన్ గతంలో పంజాబ్ స్పీకరుగా పనిచేశారు. 1945లో జన్మించిన మాన్ 1966లో ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. మంచి పోలీసు అధికారిగా పేరు తెచ్చుకున్నారు. 1984లో స్వర్ణ దేవాలయంపై సైనికచర్యకు నిరసనగా ఐపీఎస్‌కు రాజీనామా చేశారు. అప్పటి నుంచి ఖలిస్థాన్ వాదానికి బహిరంగంగా మద్దతు పలుకుతున్నారు.
నాటి ప్రధాని ఇందిరాగాంధీ హత్యకు కుట్ర పన్నారన్న కేసులో అయిదేళ్లు జైలుశిక్ష అనుభవించారు. ప్రకాశ్ సింగ్ బాదల్ నాయ కత్వంలోని అకాలీదళ్ ఖలిస్థాన్ పట్ల మెతకవైఖరి అవలంబిస్తుందన్న ఉద్దేశంతో సొంతంగా అకాలీదళ్ (మాన్) పార్టీని ప్రారంభించారు. 1989 పార్లమెంటు ఎన్నికల్లో ఆయన పార్టీ ఆరు ఎంపీ సీట్లను గెలుచుకుని బలమైన ఉనికిని చాటుకుంది. రాష్ట్రంలోని మొత్తం 13 సీట్లకు ఆరు గెలవడం సంచలనమే. నాటి ఎన్నికల్లో మాన్ తరన్ తరన్ నియోజకవర్గం నుంచి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. తర్వాత రోజుల్లో పార్టీ ప్రతిష్ట క్రమంగా మసకబారడం మొదలైంది. 1999 పార్లమెంటు ఎన్నికల్లో ఆయనొక్కరే గెలుపొందారు. అంతకు ముందు (1997) శాసనసభ ఎన్నికల్లోనూ ఆయనొక్కరే విజేతగా నిలిచారు. ఆ తరువాత నుంచీ ఆయన రాజకీయంగా దాదాపు తెరమరుగయ్యారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్నా ప్రజాదరణ కొరవడింది. 2019 పార్లమెంటు ఎన్నికల్లో సంగ్రూర్ నుంచి పోటీ చేసిన మాన్ 48 వేల 365 ఓట్లే సాధించారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పార్టీ ఏకంగా 81 సీట్లలో పోటీ చేసినప్పటికీ ఫలితం శూన్యం. 79 చోట్ల పార్టీ డిపాజిట్లు కోల్పోయింది. ఇప్పుడు పార్లమెంటు ఉప ఎన్నికలో విజయం సాధించడంతో మాన్ పేరు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. దీంతో మళ్లీ ఖలిస్థాన్ వాదం తెరపైకి వచ్చింది.
మాన్ గెలుపును రాజకీయ పార్టీలు పెద్దగా తీవ్రంగా తీసుకున్నట్లు కనపడటం లేదు. అతని వల్ల మున్ముందు కలగపోయే ముప్పు గురించి అంచనా వేసినట్లు లేదు. ఆయనది సాధారణ గెలుపుగా భావించి సరిపెట్టుకున్నట్లు కనపడుతుంది. కానీ ఇది తీవ్రంగా తీసుకోవలసిన విషయం. దేశ భద్రత, సార్వభౌమాధికారం, జాతీయ సమగ్రత, సమైక్యత లకు సంబంధించిన విషయం. దీన్ని మొగ్గలోనే తుంచేయకపోతే పంజాబ్ మరోసారి అగ్నిగుండంగా మారే ప్రమాదం ఉంది. అమాయక ప్రజలు సమిధ లయ్యే అవకాశం ఉంది. కానీ పంజాబ్ ప్రభుత్వం దీనిని తీవ్రంగా తీసుకోకుండా, చూసీ చూడనట్లు వ్యవహరిస్తోంది. కొందరు అకాలీలు, ఆప్ పార్టీ నాయకులు ఖలిస్థాన్ పట్ల ఉదారంగా వ్యవహ రిస్తున్నారన్న ఆరోపణలను తోసిపుచ్చలేం. కేంద్రం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు నిరసనగా 2020లో జరిగిన రైతు నిరసనలకు ఖలిస్థానీవాదులు లోపాయకారిగా మద్దతు అందించా రన్న ఆరోపణలు అప్పట్లో వచ్చాయి. పంజాబ్ పొరుగునే ఉన్న పాకిస్థాన్ రాష్ట్రంలో చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది.
పంజాబ్ సరిహద్దుకు అతి సమీపంలోనే రెండు దేశాలను విడదీసే నియం త్రణ రేఖ (ఎల్ ఓ సీ – లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్) విస్తరించి ఉంది. 2018లో నాటి పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ నాయకుడు నవజ్యోతి సింగ్ సిద్ధూ హాజరయ్యారు. ఆ కార్యక్రమంలో పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ బజ్వాతో రాసుకు పూసుకు తిరిగారు. క్రికెటర్లుగా తాను, ఇమ్రాన్ మంచి స్నేహితులమని ఆయన ఆహ్వానాన్ని కాదనలేక ఇస్లామాబాద్ వెళ్లానని అప్పట్లో సిద్ధూ వివరణ ఇచ్చారు. వ్యక్తి కన్నా దేశం గొప్పదన్న విషయాన్ని ఆయన మరిచిపోయారు. ఆయన పార్టీ అయిన కాంగ్రెస్ కూడా దీనిని ఖండించ లేకపోయింది. దీనిని బట్టి హస్తం పార్టీ విధానం, వైఖరిని అర్థం చేసుకోవచ్చు. అకాలీదళ్, ఆప్ కూడా ఆ తానులో ముక్కలేనని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
పంజాబ్‌లో గత పదేళ్లుగా మాదకద్రవ్యాల వినియోగం జోరుగా సాగుతోంది. రాష్టంలో నిరుద్యోగిత రేటు (9.2శాతం) జాతీయ సగటు (7.83 శాతం) కన్నా ఎక్కువగా ఉంది. ప్రజల ఆలోచనల నుంచి తొలగిపోయిందనుకున్న ప్రత్యేక వాదం ఇప్పుడు చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఈ మేరకు పంజాబీ గాయకులు వివిధ సందర్బాల్లో వివిధ వేదికలపై ఆలపిస్తున్న గీతాలకు ఆదరణ లభిస్తోంది. అదే సమయంలో ప్రత్యేకవాదానికి మద్దతు తెలుపుతున్న వివిధ వర్గాల మధ్య కూడా విభేదాలు తీవ్రమవుతున్నాయి. తుపాకీ సంస్కృతి కూడా విస్తరిస్తోంది.
ఈ క్రమంలోనే గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్యకు గుర య్యారు. మూసేవాలా ఆఖరి పాటలో ఖలిస్థాన్ వేర్పాటు, పంజాబ్ – హర్యానా మధ్య వివాదాస్పదంగా ఉన్న సట్లెజ్ – యమున అనుసంధాన కాలువ, ప్రత్యేక ఖలిస్థాన్ జెండా ప్రదర్శన తదితర అంశాలు ఉన్నాయి. ఈ పాటలకు ఆదరణ లభించడంతో కేంద్ర ప్రభుత్వం యూట్యూబ్ ల్లో బ్లాక్ చేయించింది. మాన్ విజయం అనంతరం సిక్కు రాజకీయాలను శాసించే శిరోమణి గురుద్వార ప్రబంధక్ కమిటీ ప్రధాన కార్యదర్శి కర్నైల్ సింగ్ పంజోలీ ఒక వివాదాస్పద ప్రకటన చేశారు. ఇది సిక్కు భావజాలానికి, పంత్ (గురువుల) సిద్ధాంతాలకు దక్కిన విజయం అని సామాజిక మాధ్యమాల్లో ఆయన పోస్టు చేశారు. ఈ రాతలు ప్రత్యేక వాదానికి ఊతమిచ్చేవని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వమే ఎక్కువ చొరవ తీసుకోవలసి ఉంది. కేంద్రం ముందుకు వస్తే శాంతిభద్రతలు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో అంశమని, రాష్ట్ర వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటుందన్న అపవాదును ఎదుర్కోవలసి ఉంటుంది. అందులో ఇప్పుడు కేంద్రం, రాష్ట్రంలో వేర్వేరు పార్టీలు అధికారంలో ఉన్నాయన్న విషయాన్ని విస్మరించ రాదు. యువతకు ఉపాధి కల్పన, మాదక ద్రవ్యాల కట్టడి, సాయుధ ముఠాల కార్యకలాపాల అణచివేత, ప్రత్యేకవాదానికి మద్దతు ఇస్తున్న శక్తులపై ఉక్కుపాదం మోపడం వంటి కఠిన చర్యలను చేపటడం రాష్ట్ర ప్రభుత్వ కర్తవ్యం.
ఈ విషయంలో మీనమేషాలు లెక్కించినా, ఉదాసీనంగా వ్యవహరించినా, రాజకీయ కోణంలో ఆలోచించినా పాకిస్థాన్ సరిహద్దులోని ఈ సున్నిత రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉంది. సమస్య తీవ్రతను గుర్తించడం ఆప్ అధినాయ కత్వం, పంజాబ్ ప్రభుత్వ తక్షణ కర్తవ్యం.
ఈ దిశగా ఎంత త్వరగా అడుగులు వేస్తే పంజాబ్‌కు, దేశానికి అంత మంచిది.
వ్యాసకర్త : సీనియర్ జర్నలిస్ట్